Oct2009
గోడ
-జీన్ పాల్ సార్త్ర్ మూలం : లా మ్యూర్ ( ది వాల్)
అనువాదం: జె.బాల్ రెడ్డి.
వాళ్ళు నన్నో పెద్ద తెల్లటి గదిలోకి తోశారు. కాంతి సూటిగా కండ్లమీద పడుతోంది. కండ్లు మిటకరించి చూడాల్సి వస్తోంది. టేబుల్ వెనక నలుగురు మనుష్యుల్ని చూశాను. పౌరదుస్తుల్లో ఉన్నవారు ఏవో కాగితాల్ని పరిశీలిస్తున్నారు. వారి వెనక ఓ ఖైదీల గుంపుంది . వారిలో కొందరు నాకు తెలుసు. వారిని చేరడానికి మేము గదంతా దాటి అవతలి కొసకు చేరాలి. మిగతావారు విదేశీయులై ఉండాలి. నా ఎదురుగా ఉన్న ఇద్దరికి గిరజాల జుట్టు,గుండ్రటి తలకట్టుంది. నాకు చూడ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళనిపించింది. అందులో పొట్టివాడు ఆందోళనగా పంట్లాంను గోక్కుంటున్నాడు.
మూడు గంటలు గడిచింది. కండ్లు తిరుగుతున్నాయి. ఏమీ తోచడం లేదు. బుర్ర ఖాళీగా ఉంది. గది మాత్రం వెచ్చగా ఉంది. మనస్సుకు హాయి అనిపించింది. ఇంతదాక 24 గంటలుగా ఆగకుండా వణుకుతూనే ఉన్నాను. గార్డులు ఖైదీలను ఒకరి తర్వాత ఒకరిని టేబుల్ వరకు తీసుకొచ్చారు. అక్కడున్న నలుగురు వంతుకొకరన్నట్లు పేర్లు, వృత్తులేంటని అడిగారు. చాలా సార్లు వాళ్ళు అంతకన్నా ప్రశ్నించరు. వాళ్ళప్పుడు సాధారణంగా అడిగే ప్రశ్న ఒకటే “తిరుగుబాటుదార్ల విద్రోహ చర్యలతో మీకేమైన సంబంధం ఉందా? 9వ తేది ఉదయం మీరెక్కడున్నారు? ఆసమయంలో ఏం చేస్తున్నారు ? ” అంతే ఖైదీలు చెప్పె జవాబును కూడా పట్టించుకోరు. కనీసం కన్నెత్తి చూడడం కూడా లేదు. ఒక క్షణం మౌనంగా ఉండి ముందున్న కాగితాల కట్టమీద రాయడం మొదలుపెట్టారు. నీకు అంతర్జాతీయ బ్రిగేడ్తో సంబంధం ఉందినిజమేనా? – అనడిగారు టామ్ ను. టామ్ దానికి బదులిచ్చేవాడు కాదు కాని అతని కోటు జేబులు కొన్ని పత్రాలు దొరికాయి. జువాన్ ను ఏమి ఆడగలేదు. కాని పేరు చెప్పినాక ఏదో చాల సేపు రాసుకున్నారు.
” నా సోదరుడు జోస్ అనార్కిస్టు .” – జువాన్.
మీకు తెలుసు అతనిక్కడ లేడు. నాకే పార్టీతో సంబంధం లేదు. రాజకీయాలతో నాకేనాడు ఏలాంటి సంబంధంలేదు.”
- దానికి వాళ్ళ సమాధానం లేదు. జువాన్ చెప్తూ పోయాడు. ” నేను తప్పు చేయలేదు. ఎవ్వరికోసమో నేను బలి కాదల్చుకోలేదు”. అతని పెదాలు వణుకుతున్నాయి. గార్డులు అతన్ని గద్దించి దూరంగా తీసుకుపోయారు. తరువాత వంతు నాది.
” నీపేరు పాబ్లో ఎబ్బియెట్టా?”
అవును - ” రామెన్ గ్రీ ఎక్కడున్నాడు.? “
” నాకు తెలియదు “
“నువ్వతన్ని నీ ఇంట్లో 6వతేది నుంచి 19 తేది వరకు దాచి పెట్టావ్ ?”
“లేదు ” – వాళ్ళో నిమిషంపాటు రాసుకున్నారు. తర్వాత గార్డ్స్ నన్నక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళారు. వరండాలో టామ్, జువాన్లు ఇద్దరు గార్డుల మధ్యన ఎదురు చూస్తున్నారు. నడక మొదలయింది. టామ్ గార్డ్ నడిగాడు. ” అయితే” – “అయితేంటి” ? – గార్డ్ ఎదురు ప్రశ్న.
” అహా` …… ఇప్పుడు మమ్మల్ని విచారించారా ? మాకు శిక్ష విధించారా?”
“శిక్షే విధించారు ! ” చెప్పాడు గార్డు.
“ఇప్పుడు మమ్మల్ని ఏం చేయబోతున్నారూ?” -
“మీకు విధించిన శిక్షను మీ సెల్ లో చదువుతారు.” గార్డు పొడిపొడిగా సమాధానం చెప్పాడు.
మాఖైదు గది వాస్తవానికి ఒక ఆస్పత్రి నేల మాలిగ. నేలంతా చెమ్మగా ఉండడంతో రాత్రంతా గడ్డకట్టించే చలి. పగలు కూడా పరిస్థితి ఏమంతా మెరుగ్గా లేదు.గడిచిన ఐదు రోజులు ఒక మొనాస్టరీలో కాలం గడిచింది. మధ్య యుగాల నాటి ఆ ఆరామంలోకి వెళ్ళాలంటే రంధ్రం లాంటి దారి ఒకటే ఉంది. అందులో లెక్కకు మించిన ఖైదీలున్నారు.వాళ్ళు నన్నెక్కడ బంధించినా నాకో గది తప్పకుండా ఉండేది. చలితో ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు.
కాని ఒంటరి తనం రోజులు గడిచే కొద్ది చిరాకు పెరుగుతుంది. ఈ నేలమాలిగ ఖైదు కొట్లో నాకు సాహచర్యం దొరికింది. జువాన్ ఎప్పుడో గాని మాట్లాడడు. ఆతడు భయపడ్డాడు. మేమే ఏదైనా మాట్లాడాలనుకున్నా అతను చాలా చిన్న పిల్లవాడు. టామ్ మాత్రం మాటకారి . స్పానిష్ బాగా తెలుసు.
గదిలో ఒక బెంచి నాలుగు చాపలున్నాయి. వెనకకు తెచ్చిన తరువాత మేము కూర్చొని ఎదురు చూస్తున్నాం. అంతా నిశ్సబ్దం.చాల సేపటికి “మనల్ని ఇరికించారనిపిస్తోంది.” – టామ్
“నిజమే నాకు అంతేననిపిస్తుంది. ” ” ఆపిల్లోడిని ఏం చేయరనిపిస్తుంది నాకు” – చెప్పాను.
” వాళ్ళు అతని మీద మోపడానికి ఆరోపణలేమి లేవు. అతని సోదరుడు ప్రజా మిలిషియాలో సభ్యుడు . అంతే అంతకంటే ఆధారాలేమి లేవు.” – టామ్
జువాన్ వైపు చూశాను. ఏమీ విన్నట్లనిపించలేదు. టామ్ చెప్పుకుపోతున్నాడు.” వాళ్ళు సరగొసాలో ఏం చేశారో తెలుసా? మనుష్యుల్ని రోడ్డు మీద పండబెట్టి మీది నుంచి ట్రక్కుల్ని తోలారట. మొరాకో నుండి పారిపోయి వచ్చినవాడు చెప్పాడు మాకు. మందు గుండును పొదుపు చేయడానికి అలా చేశారట”.
“కాని అది పెట్రోల్ను పొదుపు చేయదు. ” – ఆగాను నేను. టామ్ కేసి బిత్తర పోయి చూశాను అతనది చెప్పాల్సింది కాదనిపించింది.
“అధికార్లు ఆ పక్కన రోడ్డు మీద నడుస్తున్నారు. అంతా పరిశీలిస్తున్నారు. చేతుల్ని ప్యాంటు జేబులో దోపుకొన్నారు. నోట్లో వెలుగుతున్న సిగరెట్లు … వాళ్ళు ఈ పిల్లల్ని హతం చేయబూనారా? నరకం కదా! పడుకున్న వారి మీద నుంచి ట్రక్కులు తోలి బాధతో అరుస్తున్నా వారిని అలా కొన్ని గంటల పాటు రోడ్డు మీదే వదిలేశారట. మొదటి సారి చూసినప్పుడు ఆ మొరాకైన్ బాధతో చలించి పోయి దాదాపు పిచ్చివాడయి పోయాడట. ఒక వేళ నిజంగానే వారికి మందు గుండు కొరత ఉంటే తప్ప వాళ్ళిక్కడ అది అమలుజరుపుతారనే నమ్మకం నాకులేదు?”
గదిలోకి గాలి రావడం కోసం పెట్టిన నాలుగు రంధ్రాల్లోంచి ఆ ఆస్పత్రి నేలమాలిగ లోకి వెలుతురు పడుతోంది. పై కప్పుకు ఎడమ మూలన మరో రంధ్రముంది. దాని గుండా ఆకాశాన్ని చూడొచ్చు. బొగ్గును నేల మాలిగలోకి పోయడానికి ఈ రంధ్రాన్ని ఉపయోగించే వారు. యుద్ధం మొదలయ్యాక రోగుల్నిఖాళీ చేశారు. బొగ్గు కుప్ప మాత్రం మిగిలింది.వాడడం లేదు. వాళ్ళు రంధ్రం మీద మూత పెట్టడం మర్చిపోయినట్టున్నారు. అందుకే వర్షం కురిసి తడిసి ముద్దవుతుంది.
టామ్ చలితో వణుకుతున్నాడు. “దేవుడా జీసస్ చలితో గడ్డకట్టిపోతున్నాను” – బాధతో నిట్టూర్చాడు ” అయ్యో అదిక్కడ పునరావృతమౌతుంది.
లేచి వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు. శరీర కదలికలకు చాతి మీది చొక్క పక్కకు తొలుగుతోంది. చాతి మీద గుబురుగా పెరిగిన వెంట్రుకల కింద తెల్లని చర్మంకనిపిస్తోంది. వెల్లకిల పడుకొని తుంటివరకు శరీరాన్ని పైకి లేపి సైక్లింగ్ ఎక్స్ ర్ సైజ్ చేస్తున్నాడు. బలమైన అతని పృష్ట భాగం వణుకుతోంది.
టామ్ గొంతు పీలగా ఉన్నా మనిషి మాత్రం బాగా లావుగా ఉంటాడు. ఈ కోమలమైన శరీరంలోకి ఎన్ని తూటాలు, ఎలా దూసుకుపోతాయో? ఒంట్లో పేరుకున్న వెన్న ముద్దల్లాంటి కొవ్వును చీలుస్తూ తుపాకి బయోనెట్ మొనలు ఏలా చిద్రం చేస్తాయోనని ఆలోచించాను.బహుశా టామ్ బక్క పల్చగా ఉంటే నాకు ఇలాంటి ఆలోచన వచ్చి ఉండేది కాదేమో. నాకు పెద్దగా చలి అనిపించలేదు. కాని నాకు చేతులు భూజాలున్నట్లే అనిపించడం లేదు. ఏదో పొగొట్టుకున్న భావన. హఠాత్తుగా గుర్తొచ్చింది. మాచలి దుస్తులు తీసుకుని వారి సైనికుల కిచ్చారు . ఒంటి మీది చొక్కాలతో వదిలారు. ఆస్పత్రి రోగులు నడి ఎండకాలంలో తొడుక్కునే క్యాన్వాస్ పంట్లామ్ లను తొడిగించారు. కాసేపటికి వ్యాయమం చేస్తున్న టామ్ లేచి నా పక్కన కూర్చుని భారంగా ఊపిరి తీసుకుంటున్నాడు.
“వెచ్చబడ్డావా” – అడిగాను
“దేవుడా ఊపిరాడడం లేదు” – టామ్
దాదాపు రాత్రి ఎనిమిది గంటలవుతుండగా ఒక మేజర్ ఇద్దరు సైనికులను వెంటేసుకొని వచ్చాడు. అతని చేతిలొ ఓ కాయితం ఉంది. అక్కడున్న కాపలదార్లకేసి చూసి “ఆ ముగ్గురి పేర్లేమిటి” – అడిగాడు.
“స్టైయిన్ బోక్ , ఇబ్బెయొటా, మిర్బల్ “- గార్డు సమాధానం.
మేజర్ కళ్ళజోడు తగిలించుకొని చేతిలోని లిస్టును పరిశీలనగా చూశాడు.” స్టెయిన్ బోక్ ….స్టెయిన్ బోక్ … స్టెయిన్ బోక్…. ఆఁ అవును నీకు మరణశిక్ష విధించారు. రేపుదయం నిన్ను తుపాకితో కాల్చి శిక్ష అమలు చేస్తారు.”మరో మారు జాబితా రాసుకున్న కాయితం చూస్తున్నాడు .”మిగతా ఇద్దరికి కూడా…..”
“అది అసాధ్యం “- జువాన్ ”నన్ను కాదు ” మేజర్ అతనివైపు ఆశ్చర్యంగా చూసి ” నీపేరేంటి ?” – ప్రశ్నించాడు.
“జువాన్ మిర్బల్” – జువాన్
“మంచిది . నీపేరిందులో ఉంది .” ” నీకు మరణ శిక్ష విధించడమయ్యింది”
“నేనేం నేరం చేయలేదు ” – జువాన్
మేజర్ భుజాలెగరేశాడు.ఇటు తిరిగి టామ్ ను నన్ను చూస్తూ ” నీవు బాస్క్యూవా?”
“బాస్క్యూవా ఎవ్వరూలేరు” – అతగాడు ఆశ్చర్యపోయాడు . ” వాళ్ళు నాకు ముగ్గురు బాస్క్యులున్నారని చెప్పారు . నేను వాళ్ళ వెంట తిరిగి నాటైం దండుగ చేయదల్చుకోలేదు. సరే మీకు సహజంగానే ప్రీస్ట్ అవసరం లేదు కదా ?”
మేం మాటా పలుకు లేకుండా మౌనం వహించాం . అతనే “త్వరలో ఒక బెల్జియన్ డాక్టర్ వస్తాడు. అతడు మీతో ఒక రాత్రి గడుపుతాడు “-అతను సైనిక వందనం చేసి వెళ్ళి పోయాడు.
“ఏం చెప్పాను నీకు.” – టామ్ ” మాకు అర్థమయింది.”
“సరే కాని ఇది ఆ అబ్బాయికి మాత్రం అన్యాయం “- నేనది నిరసనతో అన్నానే కాని నాకా అబ్బాయంటే అసలు ఇష్టం లేదు. అతని పల్చటి ముఖం భయంతో బిగుసుకు పోయింది. ముఖకవలికలన్ని మారిపోయాయి. మూడు రోజుల కింద వరకు అతను అందంగానే ఉండేవాడు. మరీ అనాకారేం కాదు. కాని ఇప్పుడు చూస్తే ముడతలు పడ్డ ముఖంతో ముసలి వాడయ్యాడు. ఒక వేళ వాళ్ళతన్ని వదిలేసినా తిరిగి మాములు యువకుడిలా మారడేమోననిపించింది. అతనికి ఈ పరిస్థితి రావడం దయనీయమే. కాని ఆ జాలి నన్ను జావగార్చేస్తుంది. చతికిలపడి గుండ్రని కళ్ళతో నేల చూపులు చూస్తున్నాడు. టామ్ సహృదయుడు. పిల్లాడి చేతిని చేతిలోకి తీసుకోవాలనుకున్నాడు. అబ్బాయి విసురుగా వైదొలిగి మొఖం అటుతిప్పుకున్నాడు. మెల్లగా చెప్పాను ” చూడు ఏలా కొయ్యబారి పోయాడో. అతన్ని ఒంటరిగానే ఉండని.”
టామ్ పశ్చాతాపంతో మిన్నకున్నాడు. ఉన్నంతలో అబ్బాయిని సౌకర్యంగా ఉండనివ్వాలని కోరుకున్నాడు. అతడితో అలా కాలం గడిపేస్తే తన గురించి తాను ఆలోచించకుండా ఉండొచ్చనుకున్నట్లుంది .కాని నాకిది ఆశ్చర్యం కలిగించింది. నేనెన్నడూ చావు గురించి ఆలోచించలేదు. ఏం లేదు. ఆ పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదు. కానిప్పుడది ఎదురుగా నిలబడింది. ఏం చేసేదిలేదు. దాని గురించి ఆలోచించక తప్పదు. టామ్ మాట్లాడటం మొదలు పెట్టాడు. ” అయితే నీవు పిల్లలను చంపేస్తున్నానని అనుకుంటున్నావు అంతేనా”- అడిగాడు నన్ను. నేను బదులివ్వలేదు. ఆగష్టు నెల మొదలుగా ఇప్పటివరకు ఆరుగురు పిల్లల చావులు చూశానని వివరించడం మొదలు పెట్టాడు. అతని వాస్తవ పరిస్థితి అర్థం కాలేదు. నాకైతే వాస్తవాన్ని అర్థం చేసుకునే ఉద్దేశ్యమే లేదని తోస్తోంది. నాకు నేను కూడా పూర్థిగా గ్రహించలేకున్నాను. ఒకవేళ చావు చాలా బాధిస్తుందంటే ఆశ్చర్యమేస్తోందెమో.తూటాలు మనస్సులో మెదిలాయి. అవి నా అవయవాన్ని కాలుస్తూ, చీల్చుకొని దూసుక పోతున్నట్టు ఊహ. అదంతా జరుగనున్న వాస్తవానికి పక్కనున్న పరిస్థితి. కాని నేను మౌనంగానే ఉన్నా. ఇదంతా అర్థం చేసుకోవడానికి మాకు రాత్రంతా మిగిలే ఉండే. కాసేపటికి టామ్ మాటలాపాడు. అతన్ని క్రీగంట చూశాను. అతనూ పాలిపోయున్నాడు. మనిషి చిక్కిశిధిలమయ్యాడు. నాకు నేనే అనుకున్న ” ఇప్పుడు ఇది మొదలయ్యింది. దాదాపు అంతా చీకటి కమ్మి ఉండే. మసక వెలుతురు వెంటిలేటర్ రంధ్రాల్లోంచి పడుతోంది. నేలమీద బొగ్గు కుప్ప మీద ఆకాశం నీడ పెద్ద మచ్చలాగా పడుతోంది. పై కప్పు రంధ్రాల్లోంచి ఆకాశం లో ఒక చుక్క కనబడింది.దట్టంగా చీకటి అలుముకున్న చలి రాత్రి. తలుపు తెరుచుకుంది. ఇద్దరు గార్డులు లోపటి కొచ్చారు. వెనుకే ఒక భారీ మనిషి ముతక యూనీఫారం తో అడుగు పెట్టాడు. మాకు సెల్యూట్ వినసొంపుగా ఒకింత ప్రత్యేకంగా ఉంది. “నీకిక్కడేం కావాలి” – అడిగాను నేను.
“మీకు సేవలందించడానికి వచ్చాను. మీ అంతిమ గడియలు సౌకర్యంగా గడవడానికి నాకు చేతనయ్యింది చేయగలగిందంతా చేస్తా.”
“ఎందుకొచ్చావిక్కడికి? అవతల ఇతరులు చాల మందున్నారు. ఆస్పత్రులు వారితో కిక్కిరిసి పోయిన్నాయి.
“నన్నిక్కడికి పంపించారు “- ఏటో చూస్తూ జవాబిచ్చాడు.
“హఁ మీకు సిగరెట్ కాల్చాలనిపిస్తుందా? ” అంటూనే తొందరగా ” నా దగ్గర సిగరెట్లు కాదు సిగార్స్ కూడా ఉన్నాయి. ” అతను మాకు ఇంగ్లీష్ సిగరెట్లు పురోలను ఇవ్వజూశాడు. మేము తిరస్కరించాం. తన కళ్ళలోకి సూటిగా చూశాను. అది అతన్ని చీకాకు పర్చినట్లుంది.
“నీవిక్కడికొచ్చింది మాకు కారుణ్యం చూపడానికా? నిన్ను గుర్తు పట్టాను. నన్ను అరెస్టు చేసిన రోజు నిన్ను నాజీలతో పెరట్లో చూశాను” – నేను అలా కొనసాగించే వాడినే ఆశ్చర్యంగా హఠాత్తుగా నాకేదో అయ్యింది. ఆ డాక్టర్ ఎదురుగా ఉండడం ఇష్టమనిపించింది కాదు. మాములుగా అయితే నేనెవ్వరి మీదకైనా వెళితే వదిలి పెట్టను. కాని అతడితో మాట్లాడాలనే కోరిక పూర్తిగా అడుగంటింది. ఒకసారి తల విదుల్చుకొని కండ్లు దూరంగా తిప్పుకున్నాను. కాసేపటికి తలెత్తాను.అతడు నన్నే ఆసక్తిగా గమనిస్తున్నాడు. గార్డులు చాప మీద కూర్చున్నారు.పెద్రో , బక్కపల్చటి మనిషి కాలి బొటన వేళ్ళు తాడించుకుంటున్నాడు. మరొకడు నిద్ర ఆపుకోవడానికి అప్పుడప్పుడు తల విసురుకుంటున్నాడు.
“మీకు దీపం కావాలా? ” పెద్రో హఠాత్తుగా అడిగాడు డాక్టర్ ను. అతడు ” అవునని” తలూపాడు . వాడు దుక్కలాగున్నడనిపించింది నాకు. కానయితే అంతచెడ్డోడేమి కాదనిపించింది.వాడి నీలి కండ్లలోకి చూస్తే ఊహాశక్తి లేకుండా పోవడమే వాడు చేసుకున్న పాపమనిపించింది.పేద్రో బయటికు వెల్లి నూనే దీపంతో తిరిగి వచ్చాడు. దాన్ని బెంచి మీద ఒక మూలన పెట్టి వెలిగించాడు. ఒకింత వెలుతురు గదిలో పరుచుకుంది. అది గుడ్డి వెలుతురైనా అసలు లేనిదానికంటే నయం కదా. అందునా క్రితం రాత్రి వాళ్ళు మమ్మల్ని చీకటి గదిలోనే ఉంచారు. దీపం వలన గదిపై కప్పు మీద వెలుతురు వలయాలనూ చూస్తూ ఉండిపోయాను. నాకు శోష వచ్చి సొమ్మసిల్లాను……..
తటాలున మెలకువ వచ్చింది. దీపకాంతుల వలయాలు కనుమరుగయ్యాయి. ఏదో అంతులేని బరువు కింద నలిగిపొతున్నట్లనిపించింది. అది చావుకు సంబంధించిన భయమో ….. ఆలోచనో కాదు. ఇదని స్పష్టంగా చెప్పలేని బాధ. చెంపలు వేడితో కాలిపోతున్నట్లయ్యాయి. తల పోటెత్తి పోయింది. వణికి పోయాను. నా ఇద్దరు మిత్రుల కోసం చూసాను.టామ్ ముఖాన్ని చేతుల్తో కప్పుకున్నాడు. అతని మెడ మీద పేరుకు పోయిన కొవ్వు మడత కనిపించింది.కుర్రాడు జువాన్ పరిస్థితి మరి అన్యాయం. నోరు తెరుచుకునే ఉంది.ముక్కుపుటాలు అదురుతున్నాయి. స్వాంతన పర్చడానికి డాక్టర్ అతని వద్దకెళ్ళి భుజం మీద చేయి వేశాడు. కాని అతడప్పటికే కళ్ళు తేలేశాడు. బెల్జియన్ మణికట్టు అలాగే పట్టుకుని గడియారం వంక చూస్తున్నాడు. ఒక నిమిషం తరువాత చేయిని అలాగే వదిలేశాడు. వెనకకు ఒరిగి గోడకు చేరబడ్డాడు. హఠాత్తుగా ఏదో ముఖ్యమైన విషయం నోటు చేయాల్సిన ఉన్నట్టు జేబులోంచి చిన్న పుస్తకం తీసి ఏదో రెండు మూడు లైన్లు కెలికాడు.
“లం…..కొడుకు” మనస్సులోనే కోపంతో అనుకున్నాను. “రానీ ….. నా నాడి చూడని, నా పిడికిలి బిగి చూపిస్తా మురికి ముఖం బద్దలయి పోవాలి.”
డాక్టర్ నాదగ్గరికి రాలేదు కాని గమనిస్తున్నాడనిపించింది. తల పైకెత్తి పట్టిపట్టనట్టు అతనివైపు చూశాను. నన్ను చూస్తూ “నీకిక్కడ చలి అనిపించడంలేదా ?” – అన్నాడు. అతనికి చలి రుచి తెలిసింది. ఒళ్ళు నీలంగా మారింది.
“నాకు చలి లేదు” – చెప్పాను. అతను కోరగా చూస్తూ చూపు తిప్పుకోవడం లేదు. చటుక్కున గుర్తొచ్చింది నేను నా మొఖాన్ని చేతుల్తో కప్పుకొని ఉన్నాను. శరీరం నిలువెల్లా తడిసి పోయింది. నట్టనడి చలికాలంలో తేమతో చెమ్మగిల్లిన నేల మాలిగలో చెమటలు కక్కుతున్నాను. చేతుల్ని జుట్టులోకి దూర్చాను. వెంట్రుకలు చెమటతో అట్టకట్టుకు పోయాయి. అదే సమయాన చొక్కాను చూసుకున్నాను. తడిసి ఒంటికంటుకు పోయింది. దాదాపు గంట సేపుగా చెమట కారుతూనే ఉన్నా నాకా ధ్యాసే లేదు. ఆ బెల్జియన్ పంది వెధవ మాత్రం ఏది వదిలి పెట్టలేదు. నా చెంపల మీదుగా చెమట బిందువులు జారి పడటాన్ని చూశాడు. ఇదంతా ఒళ్ళుతెలవని భయం ఆవరించి హడలి పోవడం వలన జరిగిందనుకున్నాడు. అంత చలిలో అలాగే బతికుండడం గొప్పనుకున్నట్లుంది. లేచి వెళ్ళి ఈడ్చి వాని మొఖం పగలగొట్టాలని ఉంది. తరువాత కొద్ది సేపట్లోనే ఒళ్ళు కదిపే శక్తి లేదని తెలిసిపోయింది. నా కోపం , సిగ్గు అన్ని ఆవిరిరయిపోయాయి. అలాగే బెంచ్ మీద చలనం లేకుండా చేరబడిపోయాను.
చెమటతో తడిసిన జుట్టు నుంచి బొట్టుబొట్టుగా మెడ మీదకు చెమట జారుతుంటే చికాకు పుడుతోంది.చేతి రుమాలుతో మెడమీద తుడుచుకొని సంతృప్తి పడ్డాను. రుమాలు పూర్తిగా తడిచి పోయింది. చెమట ఇంకా కారుతూనే వుంది. రుమాలుతో రుద్దు కోవడం ఆపేశాను. దాని వలన ఉపయోగం కనిపించలేదు. నాపిరుదుల నుండి కూడా చెమట ఊటలా కారడం మొదలయ్యింది. తడిచిన ప్యాంట్ బెంచ్ కు అతుక్కు పోయింది.
ఒక్కసారిగా ” నీవు డాక్టర్ వా ?” – జువాన్ అడిగాడు
” అవును ” బెల్జియన్ బదులిచ్చాడు.
“అది భాధ పెడ్తుందా ? ..బాధ చాల సేపుంటుందా ? “
” ఉహుఁ ……..ఎప్పుడు …….? …. ఆఁ అబ్బే లేదు “- బెల్జియన్ సౌహార్థంగా చెప్పాడు.” ఏం ఉండదు….. అది త్వరగా ముగిసి పోతుంది.” నగదు చెల్లించే కస్టమర్ కు నచ్చచెప్పే ధోరణిలో వ్యవహరించాడు డాక్టర్.
“కాని నేను ,……. నాకు వాళ్ళు చెప్పారు.ఒకోసారి రెండు సార్లు కాల్చాల్సి వస్తోందట.”
” ఆ కొన్ని సార్లు “- బెల్జియన్ బదులిచ్చాడు తలాడిస్తూ ” మొదటి తూటా కీలకమైన శరీరాంగాలను తగలనప్పుడు”
“అయితే వాళ్ళు రెండోసారి రైఫిళ్ళు లోడ్ చేయాలి. తిరిగి గురి పెట్టాలి.” అతను ఒకక్షణమాలోచించి భయంగా ” అది టైమ్ తీసికుంటుంది.” అతనికి బాధ గురుంచి విపరీతమైన భయం ఉంది. అది అతని వయస్సు ప్రభావంకూడా కావస్చ్చు.నేను దాని గురించి పెద్దగా అలోచించలేదు.నాకు చెమటలు పట్టించింది బాధకు సంబంధించిన భయం కాదు.లేచి బొగ్గు కుప్పవరకు నడిచాను.టామ్ ఎగిరి గెంతెసి నా వైపు ఒక సారి అసహ్యంతో కూడిన చూపొకటి విసిరాడు. అతని వైపు ఆశ్చర్యయంగా చూశాను. నాబూట్లు కిర్రుమంటున్నాయి. అతనిలాగే నాముఖం మీద భయం కనపడుతుందేమోనని ఆశ్చర్యపోయాను. అతను కూడా చెమటతో తడిచి ముద్దయ్యాడు. ఆకాశం అద్భుతంగా ఉంది. ఆ చీకటి మూలకు వెలుతురేం పడడం లేదు. పైనున్న రంధ్రం గుండా తలెత్తి చూడాల్సిందే.అయితే అదీ ఉన్నది ఉన్నట్లు ఉండదు. రాత్రిలోగా ఈ నేలమాలిగ ఖైదునుండి అందమైన ఆకాశం చూడాలి. ఇందులో , అది గంటకు ఒక రకం ఙ్ఞాపకాలు తన్నుకొచ్చాయి. ఉదయపు ఆకాశం ప్రకాశవంతమైన లేత నీలం రంగులో ఉంది. ఆ సమయాన నాకు అట్లాంటిక్ తీరంలోని బీచ్ లు గుర్తొచ్చాయి. మధ్యాహ్నం వేళ సూర్యుడిని చూశాను. సెవిల్లో బార్ గుర్తొచ్చింది నాకు. అక్కడ నేను మంజోనిల్లా తాగి ఆలివ్స్, అంకోలిస్ తినేవాడిని.మధ్యాహ్నం తరువాత నేను నీడలో ఉండిపోయాను. ఆ సమయాన కంత సగం నిండిన బుల్ మార్కులా కనిపించింది. ఒక వైపు పెద్దగా నీడ ఆవరించింది. రెండోవైపు సూర్యుడి కాంతి తగిలి ఆ వెలుగుకు మెరుస్తుంది. ప్రపంచమంతా ప్రతిఫలించే ఆకాశాన్ని చూడాలని ఉంది. అది నాలో ఏంతోసేపు ఏ స్పందనను రేపలేదు. అదినాకు చాలా ఇష్టమనిపించింది. వెనకకు వచ్చి టామ్ వద్ద కూర్చున్నాను. చాలా సేపు గడిచిపోయింది. టామ్ లో గొంతుతో మాట్లాడటం మొదలు పెట్టాడు. అతను మాట్లాడాల్సిందే.లేకుంటే తనకు తానుగా తన స్థితిని గ్రహించేటట్లు లేడు. అతను మాట్లాడుతున్నాడే గాని నా వైపు చూడడం లేదు. పాలిపోయి చెమటలుకక్కుతున్న నన్ను చూడడానికి అతనికి ఖచ్చితంగా భయంగొల్పి ఉండాలి. నిజానికి ఇద్దరం ఒకరికొకరం అద్దంలో ప్రతి బింబంలా ఉన్నాం. బెల్జియన్ వైపు చూశాడు.
“నీ కర్థమైందా?” – అడిగాడు ” నేనర్థం చేసుకోను “
నేను మెల్లగానే మాట్లాడటం మొదలుపెట్టాను. బెల్జియన్ కేసి చూశాను. ” ఎందుకు ? ఏంటీ సంగతి ?”
“మనకేదో అవనుంది. కాని విషయం అర్థం చేసుకోలేకపోతున్నా” టామ్ వద్ద ఏదో కొత్త వాసన వస్తుంది. నాముక్కులు ఆ వాసనకు మామూలు కంటే చురుకుగా స్పందించినట్లనిపించింది. నేను ఇకిలిస్తూ ” త్వరలో నీకే తెలుస్తుంది” ” వ్యవహారం అంతా స్పష్టంగా లేదు”- అన్నాడు మూర్ఖంగా.
నేనీ సమయంలో దైర్యంగా ఉండాలి నిజమే …. కాని మొదట నాకు విషయం తెలియాలి కదా… విను వాళ్ళొస్తున్నారు. మనల్ని పెరట్లోకి తీసుకుపోతారు. సరే… అదో మన ముందు వచ్చి నిలబడబోతున్నారు. ఎంతమంది?” “నాకు తెలియదు .ఏడుగురో ఎనిమిదో ఉండొచ్చు. అందులో ఒకడు కాషనిస్తాడు. ‘ఏయిమ్’ ! అంతే నాకు ఎనిమిది రైఫిళ్ళు గురి పెట్టి కనిపిస్తాయి. ఆ సమయంలో చేర్పుకు నిలబడిన గోడలోకి మాయమైతే మంచిగుండునని ఆలోచిస్తా. నాబలమంతా కూడా గట్టి వీపుతో బలంగా నొక్కుతా… ఏం లాభం గోడ చెక్కు చెదరదు. పీడకలలో లాగా. ఇంతే నేను ఊహించగలిగేది. బహుశా నీకే తెలియాలి నా ఊహ ఎంత నిజమో”
“సరే … సరే” – అని “నేను దాన్ని ఉహించగలను”
“నిజంగా అది నరక బాధే. తెలుసా? వాళ్ళు గురిపెట్టేది కండ్లు నోరు మీదకు. చిద్రమైన ముఖాలను ఎవ్వరూ గుర్తించలేరు కదా” – యాంత్రికంగా అన్నాను. ” ఆ గాయాలను నేను అనుభూతించగలను. ఒక గంట నుంచి నాతల, మెడ బాధతో కొంకర్లు పోతున్నాయి. అదినొప్పి కాదు. నిజంగా దుర్భరం. ఇదే రేపుదయం అనుభవించేది. ఇంతకంటే ఏముంటుంది?” – టామ్ అనేది నాకు స్పష్టంగానే అర్థమయ్యింది.కాని నాపరిస్థితి అలాగే ఉంది. దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. “తర్వాత”- అని “నీవు గోడను తన్నిపట్టి నెడతావు” తనకు తానే లోలోపల మాట్లాడుకుంటున్నాడు. బెల్జియన్ మీది నుంచి మాత్రం చూపు తిప్పలేదు. బెల్జియన్ మాత్రం వింటున్నట్లనిపించలేదు , వాడెందుకొచ్చింది నాకు తెలుసు. మా ఆలోచనల గురించి వాడికి ఆసక్తి ఏమీ లేదు. వాడు మా చావును చూడడానికి వచ్చాడు. బతికుండగానే భయంతో క్షణం క్షణం ఛస్తుంటే చూడాలను కుంటున్నాడు.
“నిజంగా అది పీడకలలా ఉంది. ” టామ్ చెప్పుకుపోతున్నాడు ” నీవేదో ఆలోచించాలనుకుంటున్నావ్. నీకెప్పుడూ ఏదైనా సరే అనే అభిప్రాయం ఉంది. అది నీకూ స్పష్టంగా అర్థమయ్యే లోపల చేయిజారి పోతుంది. రూపు మాసిపోతుంది. నాకు నేనుగా అనుకునేదైతే తరువాత ఏమీ ఉండదనే. కాని దానర్థం నాకు అంతు పట్టడం లేదు. కొన్ని మొత్తం మీద… అంతే అక్కడితో ఆలోచన వెలిసిపోతుంది. మళ్ళీ బాధ. వేదన గురించి ఆలోచిస్తాను. తూటాలు , పేలుళ్ళు. నేను భౌతిక వాదిని . నీవూ అంతేనని నానమ్మకం నాకేం వెర్రెత్తడం లేదు. కాని ఇందులేదో సంగతుంది. నేను నాదేహాన్ని చూస్తాను. అదంతా కష్టం కాదు. నా కాయాన్ని చూసే కళ్ళల్లో నేనుంటాను. నేను వారిలో ఒకడినవుతాను. నాకో ఆలోచన తట్టింది….. ఇక ముందు నేనేమి చూడను.చూడలేను. ఈ ప్రపంచం ఇతరులది. మనం పుట్టింది.ఇది ఆలోచించడానికి కాదు. పాబ్లో. నన్ను నమ్ము. ఇప్పటికే నేను ఒక రాత్రంతా దేనికోసమో ఎదురు చూస్తూ గడిపాను. కాని అది ఇది ఒకటి కాదు. ఇది మనల్ని వెనుక నుండి అల్లుకొని చుట్టుకు పోతుంది. మనకే దాన్ని సమర్థవతంగా ఎదుర్కోనే సంసిద్ధత లేదు.”
“నోర్ముయ్ “- అన్నానేను. “ప్రీస్టును పిలవమని కోరుకుంటున్నావా?” – అతను బదులు పలకలేదు. అప్పటికే అతను ఓ ప్రవక్తలా ప్రవర్తిస్తున్నాడు. జీవం లేని గొంతుతో మాట్లాడుతున్నాడు అది నాకిష్టం లేదు. అంతా గందరగోళం గాందోలి రాగం అన్నట్టుంది.అతను మాత్రం వాసన పసికట్టాడనిపించింది. ఎందుకో తెలియదు కానీ టామ్ మీద పెద్ద సానుభూతి లేదు. ఇద్దరం కలిసి చావబోతున్నాడు నాలో తప్పకుండా ఏమైనా ఉండాలి.మిగిలిన వారికి భిన్నంగా ఉండాలనే కోరిక కావచ్చు. ఉదాహరణకు రామోన్ గ్రీతో, టామ్ జువాన్లిద్దరి మధ్య నేను ఒంటరిననే భావించాను. అదే ఇష్టమనిపించింది. ఏమైనా రామోన్ తో నాకు సాన్నిహిత్యం ఎక్కువ. కాని నిజంగా మొండివాన్ని, అందుకే నేను మరింత దృఢంగా నిలవాలనుకుంటున్నాన్ను. ఏదో విధ్వంసాన్ని చూస్తున్నట్లు టామ్ మాటలు మింగుతున్నాడు. ఆలోచించడం మాని తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. ప్రొస్టేట్ గ్రంధి వ్యాధి బారిన పడ్డ దీర్ఘ రోగిలా మూత్రం వాసన చూశాడు. నేనతన్ని అంగీకరించడం సహజమే. అతను చెప్పిన ప్రతిది చెప్పలిందే. మాది సహజ మరణం కాదు. చావబోతున్న సమయంలొ నాకేదీ సహజంగా కన్పించడం లేదు. ఈ బొగ్గు కుప్ప , ఆ బెంచి, పెద్రో దరిద్రపు గొట్టు మొఖం. దేని గురించయినా టామ్ లాగే ఆలోచించడం నన్ను సంతోషపర్చలేదు. రాత్రంతా ప్రతి ఐదు నిమిషాలకు అన్ని విషయాల గురించి ఆలోచిస్తూనే ఉన్నామన్న సంగతి నాకు తెలుసు. పక్కవాటుగా అతనికేసి చూశాను. నా ఆత్మ గౌరవం గాయపడంది. గత 24 గంటలుగా అతని పక్కనే ఉన్నాను. అతను చెప్పేది విన్నాను. అతనితో మాట్లాడాను. మొదటిసారిగా అపరిచితుడిలాగా అనిపించాడు. మా ఇద్దరి మధ్య సమాజ అంగీకారమైంది ఏదీ లేదని తెలుసు. అయినా ఇప్పుడు కవల సోదరుల్లా అనిపిస్తున్నాం. మేం కల్సి చావబోతున్నాం అందుకే అలాగనిపిస్తుందనుకుంటా . నా వైపు చూడకుండానే టామ్ నా చేయి చేతిలోకి తీసుకున్నాడు.
” పాబ్లో నాకాశ్చర్యం … ఒక వేళ అంతా ఆఖరవుతుందన్నదే నిజమైతే నేను ఆశ్చర్యపోతున్నాను” నేను నాచేతిని దూరంగా లాక్కున్నాను. ” నీ కాళ్ళ మధ్య చూసుకో పంది “- అతని కాళ్ళ మధ్య నుంచి ధారకట్టి ప్యాంట్ కాళ్ళ నుంచి చుక్కచుక్కలుగా కారుతోంది.
“ఏంటిది “- భయంతో అడిగాడు.
“నీవు నీ ప్యాంటు తడుపుకున్నవ్ ” – చెప్పానతనికి
“అది నిజం కాదు – కోపంగా ” నేను ఉచ్చపోసుకోవడం లేదు.నాకేం అట్లా అనిపించడంలేదు.”
బెల్జియన్ మాదగ్గరకొచ్చాడు. ఉత్త సానుభూతి ఒలకబోస్తూ ” ఆరోగ్యం బాగాలేదా” – అన్నాడు.
టామ్ బదులు చెప్పలేదు బెల్జియన్ తొంగి చూసి ఏమనలేదు.
” నాకు ఇదేంటో తెలియదు” “నేనేమి భయపడలేదు. ఒట్టు నేనేమి భయపడలేదు ” – టామ్ కోపంగా
బెల్జియన్ బదులు పలకలేదు. టామ్ లేచి మూత్రం చేయడానికి ఓ మూలకు వెళ్ళాడు. గుండీలు పెట్టుకుంటూ తిరిగి వచ్చి ఒక్కమాటైనా లేకుండా మౌనంగా కూర్చున్నాడు. బెల్జియన్ నోట్సు తీసుకుంటున్నాడు. అక్కడున్న ముగ్గురం చూశాం. అతడు బతికేఉన్నాడు. మానవ మాత్రుడికుండే కదలికలున్నాయి. నేలమాలిగలో వణుకుతున్నాడంటే, అందులో ఉండే జీవి ఏదైనా వణకాల్సిందే. మంచి పోషణతో అదుపాఙ్ఞాలలో ఉన్న శరీరం. మిగతా మా ముగ్గురికి …. అంతే అలాగేం లేదు.నాకు తొడల మధ్య పెరగాలనే అన్పించింది. నా కాళ్ళ మధ్య సంచలనం కలగాలనే కోరుకున్నాను. కాని ధ్యైర్యం చేయలేకపోయాను. బెల్జియన్ వైపు చూశాను. బలిసిన కండలతో నిలబడి ఉన్నాడు. ఎవరు రేపటి గురించి ఆలోచించాలి. అక్కడున్న మేం ముగ్గురం జీవం లేని నీడలం . అతని వైపు చూశాం.దయ్యాల్లా అతని ప్రాణాలను తోడెశాం .చివరికి అతను కుర్రాడు జువాన్ దగ్గరకు వెళ్ళాడు. వృత్తి ధర్మమో లోలోపలున్న దాతృత్వం పొంగి దానికి లొంగాడో తెలియదు. ఒకవేళ దాతృత్వమే అయితే మొత్తం రాత్రంతా అలాగే ప్రవర్తించాలి.
జువాన్ తలను,మెడను నిమిరాడు.కుర్రాడు అతన్ని వారించలేదు.హఠాత్తుగా బెల్జియన్ చేయి లాగేసుకొని దాని వంక వింతగా చూస్తున్నాడు.జువాన్ తన రెండు చేతుల మధ్య బెల్జియన్ చేతిని పట్టుకున్నాడు. అందులో సంతోషం ఛాయలేం కనిపించలేదు.రెండు బూడిద రంగు పటుకార్లు బలిసిన ఎర్రటి చేతిని బిగించి పట్టుకున్నట్లుంది. ఏమో జరుగుతుందని అనుమానించాను. టామ్ కూడా అనుమానించేఉండాలి. కాని బెల్జియన్ గ్రహించలేదు. సౌహర్ధ్రంతో చిరునవ్వు నవ్వాడు. కొద్ది సేపటికి కుర్రాడు ఆ చేతిని నోటి దగ్గరికి లాక్కొని కొరకడానికి ప్రయత్నించాడు బెల్జియన్ ఒక్క ఉదుటున చేయి లాక్కొని వెనుకకు గెంతి గోడకానుకొని నిలబడ్డాడు. క్షణ కాలం హడలి పోయి చూశాడు. ఒక్క సారిగా అతనికి మేం అతని లాంటి మనుష్యులం కాదని అర్ధమయివుంటుంది. నేను నవ్వడం మొదలు పెట్టాను. గార్డులో ఒకడు నామీదకురికొచ్చాడు. రెండవ వాడు గట్టి నిద్రలో ఉన్నాడు. వాడి కండ్లు వివర్ణంగా ఉన్నాయి.
నేను చాలా ఉల్లాసపడ్డాను అదే క్షణంలో ఉద్రేక పడిపోయాను.పొద్దు పొడిచాక, చావు సమీపించాక ఏంజరుగుతుందోనని ఆలోచించాలనుకోలేదు.అది అర్ధంలేని విషయం. ఏవో నాలుగు మాటలు వింటాను లేదా ఆవరించే వెలితి. అయితే మరి కాసేపటికి ఇంకేమైనా ఉంటుందా అని ఆలోచించాను. రైఫిల్ బ్యారల్స్ నన్ను గురి చూస్తున్న దృశ్యం నా మనో నేత్రం మీద కదలాడింది. బహుశా ఇప్పటికొక ఇరవై సార్లు నన్ను చంపడానికి సిద్ధంచేసిన పరిస్థితులను చూశాను. ఒకోసారి అది ఒకందుకు మంచిదే అనుకున్నాను .ఒక గడియైనా నిద్రపోవాలి. వాళ్ళు నన్ను గోడకేసి లాక్కుపోతున్నారు. నేను గింజుకుంటున్నాను. నేను క్షమాబిక్ష కోరుతున్నాను. ఒక్క కుదుపుతో మెలుకువొచ్చింది. బెల్జియన్ కేసి చూశాను. బాగా భయపడి పోయాను. నిద్రలో ఏడ్చేసి ఉంటాను. వాడు మీసాలు దువ్వుకుంటున్నాడు. ఏది గమనించనట్లే ఉన్నాడు. నేను అదే కోరుకున్నానేమో. కొంత సేపు నిద్రపోవాలనిపించింది. 48గంటలు నిద్ర లేకుండా గడిచిపోయాయి. జీవితపు చివరి గడియలో ఉన్నా. అయితే ఈరెండు గంటల జీవిత కాలాన్ని వదులుకోవాలనిపించలేదు. వాళ్ళు ఎలాగూ పొద్దున్నే నన్ను లేపడానికి వస్తారు. వాళ్ళని అనుసరించాల్సిందే . కమ్ముకొస్తున్న నిద్రతో తెలివి తప్పిపోతుంది. బహుశ గొంతు పూడుకుపోయి బెకబెకలాడుతుందేమో ఒక ఆవలింతలాగా. అలాకావాలనుకోలేదు. ఒక జంతువులా చావకూడదు. అర్థం చేసుకోవాలనుకున్నాను. తరువాత పీడకలలొస్తాయేమోనని భయమేసింది.ఆలోచనలను అదుపు చేసుకోవడానికి లేచి నిలబడి నడిచాను. గడిచిన నాజీవితం గురించి ఆలోచించాను. పెల్ మెల్ ను గుర్తు చేసుకున్నాను. గుట్టలు గుట్టలుగా జ్ఞాపకాలు. అందులోమంచి చెడు రెండు ఉన్నాయి. లేదా నేనలా అనుకున్నాను. అందులో మనుషులు, సంఘటనలు ఉన్నాయి. ఫెరియా సమయంలో వలెన్సీయాలో అవస్థపడిన చిట్టి నొవిల్లెరో ముఖం గుర్తొచ్చింది. మా మామ ముఖం ,రామోన్ గ్రీ రూపం కండ్ల ముందు కదలాడాయి. జీవితం అంతా గుర్తు చేసుకున్నాను. 1926 లో పనిపాట ఏమీ దొరకక గడిపిన మూడు నెలలు. ఆకలి తో నకనకలాడి చచ్చి బతికిన పరిస్థితి. గ్రెనడా బెంచి మీద గడిపిన రాత్రి గుర్తొచ్చింది. మూడు రోజులు తిండి ముఖం చూడలేదు. చాల కోపంతో ఉన్నాను. నాకు చావాలనిపించలేదు. సుఖ సంతోషాల కోసం వెర్రెత్తి ఆడాళ్ల వెనుక పరుగులు పెట్టాను. స్వేచ్చ కోసం అంతే అర్రులు చాచాను. అందుకే స్వేచ్చాయుత స్పెయిన్ ను కోరుకున్నాను. పీ.ఈ. మార్వెల్ ను ఆరాధించాను. అరాజక ఉద్యమంలో చేరి పోయాను. బహిరంగ సభల్లో ఉపన్యసించాను. ప్రతీది పట్టుదలతో చేశాను. బహుశా అజరామరంగా మిగిలి పోవాలని కోరుకుని ఉంటాను. అప్పుడు నా జీవితమంతా నా కండ్లెదురుగా ఉన్నట్లే అనిపించింది. ఇదంతా ఒక పచ్చి అబద్ధం అనుకున్నాను. ఇక దానికి విలువ లేదు. ఎందుకంటే అది ముగిసి పోయింది. అమ్మాయిల్తో సరదాగా నవ్వడానికి ఎలా వెళ్ళగలిగానో గుర్తొస్తే ఆశ్చర్యమేస్తుంది.ఒక వేళ ఇలా చావాల్సి వస్తుందని అనుకుంటే నా చిటికెన వేలు మందం కూడా కదిలే వాన్ని కాదు. అంతా సంచిలో వేసి మూత కట్టినట్లు నా కండ్ల ముందే ముగిసి పోతుంది. అంతా అసంపూర్తిగానే ఉంది. ఒకింత సేపు దాన్ని అంచనా వేయ ప్రయత్నించాను. ఇది నిజంగా ఇది అందమైన జీవితం నాకు నేను చెప్పుకోవాలనుకున్నాను. దానికి నేను తీర్పరిని కాలేను. అది కేవలం ఒక అసంపూర్ణ రేఖా చిత్రం. కాలమంతా నిత్య వంచనతో గడిపేశాను. నేను అర్ధం చేసుకున్నది ఏమీ లేదు.అయితే వదిలి పోతున్నవి చాలానే ఉన్నాయి. మంజనిల్లా రుచి. కాడిజ్ దగ్గర వేసవి లో సముద్రం కయ్యల్లో స్నానాలు. అన్నింటిని చావు దిగదుడ్చేస్తుంది.
బెల్జియన్ కు హఠాత్తుగా ఆలోచనేదో మెరుపులా మెరిసినట్లుంది. “మిత్రులారా!”_ అని సంభోదించి “ఒక వేళ మిలటరి కార్యాలయం ఆమోదిస్తే…… మీరు మీ ప్రియతములకేదైనా సందేశం పంపదలిస్తే జ్ఙాపిక ఏదైనా ఇవ్వదలిస్తే…….. నేను బాధ్యత తీసుకుంటాను.”_అని చెప్పాడు.
“నాకెవ్వరు లేరు” టామ్ నసిగాడు. నేనేం మాట్లాడలేదు. టామ్ ఒకింత ఆగి నావైపు ఆసక్తిగా చూశాడు. నీవు కొంచాకు చెప్పాల్సింది ఏమీ లేదా ? _టామ్ . లేదు ఇలాంటి సుకుమారాలంటేనే నాకు కోపం. అయినా అది నాతప్పే . నిన్న రాత్రి కొంచా గురించి మాట్లాడాను. నేనే నిగ్రహించుకోవాల్సింది. ఆమెతో ఒక సంవత్సరం కలిసున్నాను.నిన్న రాత్రెందుకో ఆమె చేయందుకోవాలనిపించింది. అందుకేఆమె గురించి మాట్లాడాను. కోరిక నాకంటే బలమైంది. అయితే ఇప్పుడామెను చూడాలనే ఆశేం లేదు. ఆమెకు చెప్పాల్సింది కూడా లేదు. ఆమె చేయిని చేతిలోకి తీసుకోవాలని కూడాలేదు. నావంట్లో భయం నిండి పోయింది. అందుకే పాలిపోయి చెమటలు కక్కుతున్నాను. ఏమైనా ఆమె జ్ఙాపకం నాలో ఆ భయాన్ని నింపిందేమో . నా మృతదేహాన్ని చూస్తే కొంచా ఏడుస్తుందనుకుంటా. కొన్ని నెలల తరువాత ఆమెకు జీవితం రుచించక పోవచ్చు. నేనెటూ చనిపోనున్నాను. ఆమె కోమల శరీరం . అందమైన కళ్ళ గురించి ఆలోచించాను. ఆ కళ్లు నాకేసి చూస్తే చాలు నాలో ఏదో విద్యుత్ ప్రవహించినట్లయ్యేది. అయితే అదంతా ఇప్పుడిక అయిపోయినట్లేనని తెలుసు. ఒక వేళ ఆమె ఇప్పుడు చూస్తే ఆ చూపులు నావరకు చేరవు. కండ్లకు తగిలి ఆగిపోతాయి. నేనొంటరిని.
టామ్ ఒంటరి వాడే కాని నాలా కాదు. కాళ్ళు మెలేసుకొని అదోరకపు నవ్వుతో బెంచి వైపు తదేకంగా చూస్తున్నాడు.మనిషి వింతగా అన్పిస్తున్నాడు. చేయి తీసి ఏదైనా విరుగుతుందేమోనని భయపడుతున్నట్లు బెంచిని జాగ్రత్తగా తడుముతున్నాడు. తరువాత గబుక్కున చేయి తీసి భయంతో కంపించి పోతున్నాడు. నేనే టామ్ నైతే బెంచిని ముట్టుకొని ఆనందించను. అదో రకం తెలివి లేని పని. అయితే నాకు ఆ వస్తువులు విచిత్రంగానే కనిపించాయి. అవి వానలో బాగా తడిసి పోయాయి మామూలు కంటే పలుచగా కనిపిస్తున్నాయి. అది చాలు వాటికేసి చూడడానికి, దీపం, బొగ్గు దూళికుప్ప నేను ఏలాగు చావబోతున్నానే భావన కలిగిస్తున్నాయి. సహజంగానే చావును గురించి స్పష్టంగా ఆలోచించలేదు. అయితే అది అంతటా ఉన్నట్లే ఉంది. వస్తువుల మీద కూడా, చావనున్న మనిషి పక్కన కూర్చొని అవి మనుషుల్లా గుసగుస గా మాట్లాడలేవు. పడిపోయి పక్కకు జరిగి రహస్యంగా దూరం పోనూ లేవు. బెంచి ముట్టుకోవడం ద్వారా టామ్ ముట్టుకున్నది తన చావునే అనిపించింది. ఒక వేళ ఎవరైనా వచ్చి సడి చప్పుడు లేకుండా ఇంటికి వెళ్ళమని చెప్పినా, వాళ్ళు జీవితాంతం వదిలేస్తామన్నా అది నా బతుకును చన్నీట ముంచినట్లే. నిత్యత్వానికి సంబంధించిన ఊహను కోల్పోతే ఎదురు చూపులు కొన్ని గంటలైనా, కొన్ని సంవత్సరాలైనా ఒకటే . నేను అంటిపెట్టుకున్నది. కరిచి పట్టుకున్నది ఏమీ లేదు. అందుకే మౌనంగా ఉన్నాను. అది భయంకరమైన నిశ్శబ్దం. కారణం శరీరమే. ఈ కండ్లతో చూశాను. చెవులారా విన్నాను. కాని ఇదేది ఇక మీదుండదు. ఈ ఒళ్ళు చెమటలు కక్కుతోంది. దానికదే వణికి పోతోంది. ఇంకేమాత్రం దాన్ని గుర్తించలేను. ఒక వేళ ఈ దేహం ఇంకెవరిదో ఐతే ముట్టుకొని చూసేవాన్ని. ఏమయ్యిందో కనుక్కొనేవాన్ని. అయినా ఇంకా ఇదుందనే అనుకోవాలి. నిండా మునిగి పోతున్నట్లనిపిస్తోంది. ఒరిగిపోతున్నాను. ఒక వేళ మీరెవరైనా నా ముక్కు దగ్గర వేలుంచి శ్వాస చూసినా, నాగుండె కొట్టుకుంటుందనిపించినా అదేదీ నాకు హామీ ఇవ్వలేదు. నా శరీర స్పందనలన్నీ యాంత్రికమైనవే. చాలా సందర్భాలలో అది చలనం లేనిదే. అదో రకంగా కాయపు బరువు నేనొదిలిన దేహం పురుగు పుట్రకు వదిలేసినట్లుంది. మళ్ళీ నా దృష్టి ప్యాంటు మీదికి వెళ్లింది. అది తడిచినట్లనిపించింది. అది చెమటో మూత్రమో తెలియదు. ముందు జాగ్రత్తగా బొగ్గు కుప్ప మీద మూత్రం చేశాను.
బెల్జియన్ గడియారం తీసి చూశాడు. టైమ్ మూడున్నరవుతుంది._అన్నాడు.
లంజా కొడుకు వాడు ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్టున్నాడు. టామ్ ఒక్క ఎగురు ఎగిరాడు. కాలం కరిగిపోతుందని గమనించినట్లు లేదు. రూపు రేఖలు లేని చీకటి చుట్టుముట్టింది. అది ఎప్పుడు మొదలయ్యింది కూడా తెలియదు. చిట్టి జువాన్ ఏడుపెత్తుకున్నాడు. చేతులు జోడించి నాకు చావాలని లేదు. నాకు చావాలని లేదు. అంటూ ప్రార్ధించాడు. గాలిలో చేతులూపుతూ ఆ గదంతా పరుగులు పెట్టాడు. చివరికి చాప మీద కూలబడి పోయాడు. ఊరడించాలనేకోరిక లేశ మాత్రమైనా లేకున్నా టామ్ అతన్ని కలత నిండిన కళ్ళతో చూశాడు. ఊరడించడం వృదా ప్రయాసే . మాకంటే ఆపిల్లోడు ఆందోళన చెందాడు. ఆదుర్దాపడ్డాడు. కానది పెద్దగా కదిలించలేకపోయింది. కాయిల పడ్డ మనిషి తనని తాను కాపాడుకొవడానికి రోగాన్ని ప్రార్ధించినట్లుంది. అది నెమ్మదించక పోగా మరింత తిరగబెడుతోంది. అతని మీద అతనే జాలి పడుతున్న విషయం నాకు స్పష్టంగానే అర్ధమౌతుంది. చావు గురించి అతను ఒక క్షణమంటే క్షణం కూడా ఆలోచించడం లేదు. నన్ను నేను ఓదార్చుకోవాలనుకున్నాను. నామీద నాకు కలిగిన జాలితో ఓదార్చుకోవాలనుకున్నాను. కాని పూర్తి భిన్నంగా జరిగింది. పిల్లోడి వైపు ఓసారి చూశాను. వెక్కిళ్ళతో సన్నని భుజాలు ఎగిరి పడుతున్నాయి. అన్యాయమనిపించింది. నేను నా గురించైనా పాపమనుకోలేదు. ఏబాధ లేకుండా చావాలనుకున్నాను. టామ్ లేచి నిలబడి పోయాడు. పై కప్పు రంధ్రానికి కింద నిలబడి పగటి వెలుతురు కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఏచికాకు లేకుండా చనిపోవాలనుకున్నాను. అంతే , అదే ఆలోచన. కాని ఆ డాక్టర్ టైం చెప్పినప్పటి నుండి టైం గాలిలో ఎగిరి పోతున్నట్లూ, చుక్క చుక్క గా కారి పోతున్నట్లనిపించింది. ఇంకా చీకటిగా ఉండగానే టామ్ గొంతు వినిపించింది. “నీకు వాళ్ళ చప్పుడు వినిపించిందా ? _పెరట్లో మనుష్యులు నడుస్తున్న చప్పుడు .
“అవును”
” వాళ్ళు ఏం నరకం సృష్టించాలనుకుంటున్నారో నాకర్థం కావడంలేదు. చీకట్లో మనల్ని ఏలా కాలుస్తారు?” కాసేపటికి ఏ చప్పుడూ వినిపించలేదు మాకు. టామ్ తో చెప్పాను.” తెల్లారింది.” పెడ్రో లేచి ఆవలిస్తున్నాడు. దీపం ఊదడానికి వచ్చాడు. అతని మిత్రుడితో ” చలి చంపేస్తుంది.” అన్నాడు. నేలమాళిగలో చీకటి పల్చబడి మసకగా కనబడుతోంది. దూరంగా తుపాకి కాల్పులు వినిపించాయి.” మొదలయ్యింది” – టామ్ తో పెరటి వెనుకకు తీసుకెళ్ళి చేసేటట్టున్నారు ” టామ్ డాక్టర్ ను సిగరెట్ అడిగాడు .
నాకొద్దు. నాకు సిగరెట్లు , ఆల్కహాల్ ఏమి వద్దు.
అప్పటినుంచి వాళ్ళ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ” ఏం జరుగుతోందో నీకర్థమౌతుందా?” – టామ్ అన్నాడు. ఇంకేదో చెప్పాలనుకొని మౌనంగా ఉండి పోయాడు. గుమ్మం కేసి చూస్తూన్నాడు. తలుపు తెరుచుకుంది.లెఫ్టినెంట్ నలుగురు జవాన్లతో లోపలికి వచ్చాడు. టామ్ చేతిలోని సిగరెట్ పారేసాడు. ” “స్టెయిన్ బోక్” టామ్ బదులు పలుకలేదు. పెద్రో చూపించాడతన్ని . ” జువాన్ మిర్బల్”
” ఆచాప మీదున్నవాడు”
“లే” అన్నాడు లెఫ్టినెంట్. జువాన్ కదల్లేదు. ఇద్దరు జవాన్లు జబ్బల కింద చేతులేసి లేపి నిలబెట్టారు. కాని వాళ్ళు వదిలే సరికి తిరిగి కూలబడిపోయాడు. జవాన్లు చిరాకు పడ్డారు. ” జబ్బు పడ్డవాళ్ళలో ఇతను మొదటి వాడేం కాదు” – లెఫ్టినెంట్ మీరిద్దరు మోసుకు రండి అక్కడ వాళ్ళు చక్కగా చేసి నిలబెడతారు.” – టామ్ వైపు తిరిగి “పద పోదాం” – అన్నాడు. టామ్ ఇద్దరు జవాన్ల మధ్యకు వెళ్ళాడు. మిగతా ఇద్దరు జువాన్ రెక్కలు పట్టుకొని అనుసరించారు. అతడేం సొమ్మసిల్లి పోలేదు. కండ్లు విశాలంగా తెరుచుకొని ఉన్నాయి. కన్నీళ్ళు ధారగా చెంపల మీద. నేను బయటకు నడువాలనుకుంటున్నంతలో లెఫ్టినెంట్ ఆపాడు నన్ను.
“నీవు అబ్బియెట్టావా?” “అవును” ” నీవు ఇక్కడే ఉండు వీళ్ళు మళ్ళీ నీకోసం వస్తారు” – వాళ్ళు, వాళ్ళతో పాటు బెల్జియన్. ఇద్దరు జైలర్లు వెళ్ళిపోయారు. నేనొక్కడినే మిగిలాను.
నాకేం జరుగబోతుందో అర్థం కాలేదు. ఏదైనా, ఏదో రకంగా అది ప్రశాంతంగా ముగిసిపోతే చాలని కోరుకున్నాను. ఆగాగి కాల్పులు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి తూటా చప్పుడు నన్ను కుదిపేసింది. బాగా అరవాలనిపించింది. జుట్టు పీక్కొవాలనిపించింది. కాని పండ్లు గిట్టకర్చుకొని చేతుల్ని ప్యాంట్ జేబులో కుక్కుకున్నాను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నాను. ఓ గంట గడిచాక తీసుకుపోవడానికి వచ్చారు. మొదటి అంతస్థులోని ఓ చిన్న గదిలోకి తీసుకుపోయారు. గదంతా సిగరెట్ల కంపు.వేడి ఎగదన్నుతోంది.అక్కడ మరో ఇద్దరు అధికారులున్నారు. వాలు కుర్చీలో కూర్చొని సిగరెట్లు కాలుస్తున్నారు.
” నీవేనా ఎబ్బియొట్టా” ” అవును” “రామోన్ గ్రీ ఎక్కడ?” ” నాకు తెలవదు” – నన్ను లావుగా ఉన్న పొట్టివాడు ప్రశ్నిస్తున్నాడు.కళ్ళజోడు వెనుక కళ్ళు స్పష్టంగా కనబడటంలేదు. వాడే నన్ను ” ఇటురా” – పిలిచాడు. అతని దగ్గరికి వెళ్ళాను. లేచి నా చేతులు పట్టుకొని పాతాళంలోకి తొక్కెయ్యాలన్నంత కసిగా చూస్తున్నాడు. శక్తి కొద్ది నాతొడల మీద గిచ్చాడు. అదేం నన్ను బాధించలేదు. అదో సరదా. వాడు నాముఖం మీద గబ్బు నోటితో ఉఫ్ మని ఊదాలనుకున్నాడు. అలాగే కొంతసేపు నిలబడ్డాం. నాకైతే అదో నవ్వులాటనిపించింది. చావుకు సిద్ధమైనోడిని జడిపించాలంటే కష్టం. అందుకే ప్రయత్నం ఫలించలేదు. నన్ను కోపంతో విసురుగా వెనుకకు తోసి వాడు మళ్ళీ కూర్చుండి పోయాడు. “ఇది నా జీవిత సమస్య . బతకాలని ఉంటే అతడెక్కడున్నాడో మాకు చెప్పాలి”_అన్నాడు.
ఈ మనుష్యులు చావబోతూ కూడా అధికారానికి కీలు బొమ్మలయ్యారు. కాకుంటే నాకంటే కాస్త ఆలస్యంగా కావొచ్చు. ఎక్కువ రోజులైతే కాదు. ముడుతలు పడ్డ కాయితాల్లో పేర్లు వెతకడంలో మునిగి పోయారు. తరువాత మరో వ్యక్తి వెంటపడ్డారు. అతన్ని అణగదొక్కాలనో, లోబర్చుకోవాలనో ప్రయత్నం. స్పెయిన్ భవిష్యత్ మీద, వారి అధికారంమీద వారికి కొన్ని ఆశలున్నట్లున్నాయి. చేసేచిల్లర పనులతో నన్ను భయపెట్టాలనో, ఎగతాళి చేయాలనో వారి ప్రయత్నం. నేను వారు లాగ ఆలోచించలేను. వ్యవహరించలేను.వాళ్ళకు వెర్రి లేసినట్లనిపించింది. ఆ పొట్టోడు ఇంకా నన్నే చూస్తున్నాడు. నున్నగా గొరిగిన అశ్వికుల తలకట్టు. బూట్లు తుడుచుకుంటున్నాడు. వారి ఆచేష్టలన్ని క్రూర మృగాన్ని గుర్తుచేస్తున్నాయి.సరే నీకు అర్ధమైందా? నాకు గ్రీ ఎక్కడున్నాడో తెలియదు. “మాడ్రిడ్ లో ఉన్నాడనుకుంటా” అన్నాడు జవాబుగా . ఆపక్కనున్న ఆఫీసర్ వాడి పాలి పోయిన చేతిని బద్ధకంగా ఎత్తాడు. ఆబద్దకం కూడా ఆచి తూచినట్లుంది. వాళ్ళ చిన్నచిన్న ఎత్తులకు నేను తెలివి తప్పి పోతానేమోనని ప్రయత్నం. ఆ రకంగా వాళ్ళకు వాళ్ళే ఉల్లాస పడుతున్నారు. “నీకింకా ఓపావు గంట టైం ఉంది. దీన్ని గురించి ఆలోచించడానికి” మెల్లగాచెప్పాడు.”ఇతన్ని లాండ్రి గదికి తీసుకెళ్ళండి.15నిమిషాల తరువాత తీసుకరండి. అప్పటికీ చెప్పకపోతే అక్కడికక్కడే కాల్చేద్దాం.”
వాళ్ళకు తెలుసు వాళ్ళేం చేస్తున్నారో. ఒక రాత్రంతా ఎదురు చూశాను. టామ్ ను జువాన్ కాల్చేసేటప్పుడు ఈ నేలమాలిగలో ఒక గంటపాటు ఎదురు చూపుల్తో గడిపేటట్టు చేశారు. ఇప్పుడు నన్ను లాండ్రి లో అంతం చేయాలనుకుంటున్నారు. వాళ్లిది ముందు రాత్రే అనుకున్నట్టున్నారు. నిస్త్రాణ కు గురి చేస్తే దారికి వస్తానేమోనని వాళ్ళలో వాళ్ళనుకున్నట్లుంది. వాళ్ళు ఘోరంగా పొరబడ్డారు. బాగా నీరసంగా అనిపిస్తుంది. లాండ్రీలో ఒక స్టూల్ మీద కూర్చున్నాను. ఆలోచిస్తున్నాను. కాని వాళ్ళ దారిలో మాత్రంకాదు. వాస్తవానికి నాకు రామోన్ గ్రీ ఎక్కడున్నాడో తెలుసు . నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వాళ్ళ సవతి సోదరుల వద్ద తలదాచుకుంటున్నాడు. వాళ్ళు నేను తట్టుకొలేనంతగా హింసిస్తే తప్ప నేనావిషయం చెప్పదల్చుకోలేదు.[అయితే వాళ్ళాపని చేయాలని ఆలోచిస్తున్నట్లు లేదు.] తప్పకుండా ముందే అనుకున్నట్లు అమలు చేస్తారు. ఏమైనా ఆ విషయం చెప్పడం నాకిష్టం లేదు. కేవలం నాప్రవర్తనకు సంబంధించిన కారణాలు ఆలోచించాలనుకుంటున్నాను. చావనైనా చస్తాను కాని రామోన్ గ్రీ కి వీడ్కోలు పలకను. ఎందుకు? రామోన్ గ్రీ అంటే నాకింకేమాత్రం ఇష్టం లేదు. ఈ ఉదయానికి ముందే అతనితో నా స్నేహం ఆరిపోయింది. అదేసమయంలో కొంచా మీద ప్రేమ కూడాతీరి పోయింది. అదే సమయం లో నాకిప్పుడు బతకాలని ఆశకలిగింది. నిస్సందేహంగా అతన్ని గురించి గొప్పగా ఆలోచిస్తాను. నిజంగా శక్తిశాలి. దృఢమైన వాడు. అయితే అతని స్థానంలో చావడానికి సిద్దపడడానికి ఇది కారణం కాదు. అతని ప్రాణం నా కంటే విలువైందేమి కాదు. ఆ మాటకొస్తే ఏప్రాణానికి విలువ లేదు. వాళ్ళు ఎవరినైనా నాలుగు లాగి పెట్టి కొట్టి, గోడకు చేరబెట్టి చచ్చేదాకా కాలుస్తారు.
అది నేనైనా , గ్రీ అయినా మరొకరైనా పెద్దతేడాలేదు అయితే స్పెయిన్ విముక్తి కోసం నా కంటే అతని అవసరం ఎక్కువుంది కాని నాకిప్పుడు స్పెయిన్ , విముక్తి, అరాజకవాదం అన్ని ఏట్లో కలవననిపిస్తోంది. ఏది ముఖ్యం కాదు. కాని నేనందులోనే ఉన్నాను. రామోన్ గ్రీకి వీడ్కోలు పలికి నా ఒళ్ళు కాపాడు కోవడం ముఖ్యం. కాని నేనది చేయడానికి సిద్దపదలేదు. మెత్తానికిదంతా ఓ హాస్యంలా కనిపిస్తోంది. అంతా మూర్ఖత్వం . నేను తప్పకుండా నిక్కచ్చిగా నిలవాలనుకున్నాను. వింతైనా ఉల్లాసం ఆవరించింది నన్ను. జవాన్లు తిరిగి వచ్చి నన్ను ఆ ఇద్దరు అధికార్ల దగ్గరికి తీసుకొచ్చారు. ఓ ఎలుక నా కాళ్ళ సందులోంచి పరుగెత్తంగా నాకు నవ్వొచ్చింది. అటున్న అధికారి వైపు తిరిగి ” ఆ ఎలుకను చూశావా?” – అన్నా. వాడు బదులు పల్కలేదు. చాల నెమ్మదస్తుడిలా ఉన్నాడు. తనకు తానే సీరియస్ గా ఉన్నాడు. నాకు నవ్వాలనిపించింది. కాని నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేనేమోనని భయపడ్డాను. ఆ ఫాలంజిస్టా అధికారికి మీసాలున్నాయి. ” నీవు నీ మీసాలను కొరుక్కోవాల్సిందేరా మూర్ఖుడా” – అన్నాను అతని వైపు చూసి. ఆ వెంట్రుకలు వాడి మొఖాన్ని గెలిచాయని నవ్వులాటకనుకున్నాను. వాడు పెద్ద నేరమేమి మోపకుండానే నన్ను ఈడ్చి తన్నాడు . గమ్మునుండిపోయాను.
” సరే” ఆ లావు పాటి ఆఫీసర్ ” నీవు దాని గురించి ఆలోచించావా ?” – అన్నాడు . అదేదో అరుదైన జాతి పురుగులను చూస్తున్నట్లు నేను వారి వైపు ఆసక్తిగా చూసాను.”నాకు తెలుసు అతనెక్కడున్నాడో ” ” అతనో శ్మశానంలో దాక్కున్నాడు . ఒక గోరిలోనో లేదా బొందలు తవ్వే బేగరి గుడిసె లోనో ……” – అదంతా బూటకమే వాళ్ళు లేచి నిలబడి బెల్ట్లు బిగించి ఆర్డర్లిస్తూ హడావిడి పడాలని నాకోరిక.
వాళ్ళు ఒక్కసారి ఎగిరి గంతేసారు. ” పదండి … మాల్స్ కు వెళ్ళాలి. వెళ్ళి లెఫ్టినెంట్ లోపెజ్ వద్ద నుంచి 15 మందిని తీసుకురండి. ఎయ్ నీవు …..” ఆ లావాటోడు ” చెప్పింది నిజమైతే నిన్ను వదిలేస్తా మమ్మల్ని కోతులాడించి నట్టైతే మాత్రం నీవు చాలా అనుభవించాల్సోస్తుంది.” – అన్నాడు.
వాళ్ళు పెద్ద హడావిడి చేస్తూ బయల్దేరి పోయారు. నేను నిమ్మళంగా ఫాలంజిస్టా గార్డుల మధ్య ఉండిపోయాను. అక్కడ వాళ్ళు చేసే తమాషా గుర్తొచ్చి నవ్వుకున్నా. కసితో మ్రాన్పడిపోయా. స్మశానంలో వాళ్ళు ఒక దాని వెనుక ఒకటి గోరీలను పెకిలిస్తూ, వాటి మీద బండలను ఎత్తడం, పెద్ద గోరీల కమాను తలుపులను పగలగొట్టడం ఊహించుకుంటున్నాను. నిజంగా ఈ ఖైదీ మూర్ఖత్వంతో ఆడుకున్న మొనగాడు. బుర్ర మీసాల ఫాలంజిస్టా గాళ్ళను స్మశానంలో యూనీఫారాలతో ఉరికిస్తున్నాడు. నిజంగా అడ్డు ఆపు లేని ఆనందం అనుకున్నాను. ఒక అరగంట పోయాక లావాటి పొట్టోడు ఒక్కడే తిరిగొచ్చాడు. నన్ను చంపమని ఆదేశాలివ్వడానికి వచ్చాడనుకున్నా. మిగతా వాళ్ళు స్మశానంలొనే ఉన్నారనుకున్నా. ఆ అధికారి వైపు చూశాను. వాడి చూపు వెర్రి గొర్రెలా లేవు. ” ఇతన్ని పెద్ద పెరట్లోకి మిగతా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి” – అన్నాడు. ” సైనిక కార్యక్రమాల తరువాత ఇతన్ని ఏం చేయాలో కోర్టు ఆలోచిస్తుంది.”
” అయితే వాళ్ళు నన్ను …. నన్ను చంపాలనుకోవడంలేదా?”
“ఇప్పుడు కాదు. ఏమైనా తరువాత ఏమైతుందనేది నాకు సంబంధించిన వ్యవహారం కాదు”
ఇంకా నాకు అర్థం కాలేదు. అడిగాను “సరే గానీ … ఎందుకూ…? – వాడు బదులేమి చెప్పకుండా భుజాలెగరేసాడు. జవాన్లు నన్ను దూరంగా తీసుకుపోయారు. వెనక పెద్ద పెరట్లో దాదాపు వందమంది పైగా ఖైదీలున్నారు. స్త్రీలు, పిల్లలు, కొందరు ముసలి వాళ్ళు…. మధ్యలో ఉన్న లాన్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. శోషవచ్చి పడిపోయాను. మధ్యాహ్నానికి మమ్మల్ని భోజనశాలకు తీసుకపోయారు. ఇద్దరు ముగ్గురు పలకరించారు నన్ను. బహుశ వాళ్ళు నన్ను గుర్తుపడుతారనుకుంటా . నేనేమీ మాట్లాడలేదు. నేనెక్కడున్నది నాకే తెలియదు. సాయంత్రం మౌతుండగా దాదాపు మరో పదిమంది ఖైదీలను మా దగ్గర తోసారు. గార్షియాను గుర్తుపట్టాను. అలాగే బెకర్ ను కూడా.
“ఏం అదృష్టం నీది. నిన్నిలా చూస్తానను కోలేదు.” – అన్నాడతడు.
“వాళ్ళు నాకు మరణశిక్ష వేశారు. ” – చెప్పాన్నేను. ” కాని ఎందుకో మనస్సు మార్చుకున్నట్టుంది. ఎందుకో తెలవదు”- అన్నాను.
” వాళ్ళు నన్ను రెండు గంటలప్పుడు అరెస్టు చేశారు”- చెప్పాడు గార్షియా. ” ఎందుకు?” గార్షియాకు రాజకీయాలతో ఎలాంటిసంబంధం లేదు.
“నాకు తెలవదు” – చెప్పాడతడు. ” వాళ్ళందరినీ అరెస్టు చేస్తారు. వాళ్ళేందుకు చేస్తారో ఎవరికి తెలియదు”.
“రామోన్ గ్రీని కూడా పట్టుకున్నారు వాళ్ళు.”
నాకు వణుకుమొదలయ్యింది. “ఎప్పుడు?”
“ఈ రోజు పొద్దున. అతనే అంతా గందరగోళం చేసుకున్నడు. మంగళవారం నాడు వాళ్ళ బందువులింటి నుండి వచ్చేశాడు. ఇద్దరికి ఏదో వాదం జరిగిందట. ఆయన్ను దాయడానికి బోలెడంతమంది ఉన్నారు. కాని ఆయన ఏ విషయంలో ఎవరికీ ఋణపడి పోరాదనుకున్నాడు . అతనన్నాడు నేను అబుయెట్టా దగ్గర తలదాచుకోవాలనుకున్న , కాని అతన్ని అరెస్టుచేశారు. అందుకే స్మశానంలో తలదాచుకున్నానని చెప్పాడు.
“స్మశానంలోనా?”
“అవును ఎంత మూర్ఖుడు.అయితే వాళ్ళు ఈ ఉదయం అక్కడికి వెళ్ళారు. ఖచ్చితంగా అదే జరిగింది. వాళ్ళు ఆయన్ను బొందలు తొవ్వే బేగరి గుడిసెలో దొరికిచ్చుకున్నారు. గ్రీ వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. అంతే వాళ్ళు చుట్టి ముట్టి పట్టుకున్నారు.”
” స్మశానంలోనా?” భూమి అంతా గుండ్రంగా తిరుగుతున్నట్లనిపించింది. నేను నేల మీద కూలబడిపోతున్నట్లనిపించింది. ఎంత నవ్వానో అంత ఏడ్చాను.
3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు
October 16th, 2009 at 5:49 pm
మానవ విముక్తి కోసం సంతోషంగా ప్రాణాలిచ్చిన అమరులు తెలుగు దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ తప్పుడు కధ లో రచయిత informant అవ్వటంలో ఔన్నత్యం చూపిస్తున్నట్టుంది. స్పానిష్ అంతర్యుద్ధ సమయంలోనిది ఈ కధ. అల్జీరియా ప్రజల స్వాతంత్ర్య సిద్దికి సార్త్రే చేసిన సేవలు గొప్పవి. దాని మూలంగా ఈయనకి ఎంతో పరపతి ఉంది. (ప్రపంచ వ్యాప్తంగా.) ఈయన మధ్య తరగతి తిరోగమన దృష్టి కి ప్రాతినిధ్యం ఇవ్వటం తరచుగా చూస్తాం. లాంగ్ మార్చ్ సమయంలో ఎర్ర సేన చేసిన త్యాగాలు ఈ కధలో చూపించిన ప్రవర్తనకు విరుద్ధం. సుబ్బా. R
October 26th, 2009 at 12:14 pm
నిజానికి ఇందులో తప్పు ఏమిటో నా కనిపిస్త లేదు. అది యాధృచ్చికంగా జరిగిన సంఘటనే కదా? మధ్యతరగతి మన:స్తత్వాన్ని సరిగా అర్థం చేసుకున్న ఉద్యమాలు లేవు. మనమంతా ఆ కోవకు చెందిన వాళ్ళం కాదా? మన కాలికింద నేల కదలనంతవరకు త్యాగాల పట్ల ప్రేమఒలకబోస్తాం. కానీ అనుకోని సంఘటన ఎదురైన నాడు జావగారిపోతాం, ఇది ఎన్నో మార్లు ఋజువైనదే. దేనినైనా కీర్తించే విధానంలో కాకుండా ఇలా సత్యానికి దగ్గరగా చూపించడం వలన జాగరూకతను కలిగించడంగా ఎందుకు తీసుకోకూడదు. మనం ఊహాలోకాలనుండి బయటపడేందుకు దోహదపడ్డ కథగా తీసుకోవచ్చు.
November 1st, 2009 at 9:56 pm
యుధ్ధం్ లో చనిపోవదంకంటే తప్పుల కుప్పగా,ఆత్మహింసల ఘోర వని గా మారిన జీవితాన్ని భరించడం మరింత కష్టం.