Oct2009
కవిత్వ పరుసవేది బాణాల ‘పర్యాయపదం’
జీవితం సంక్షోభంలోకి నెట్టివేయబడటానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. ఇప్పుడు అనుభవిస్తున్నది పైకి సుఖంగానే కన్పిస్తుంది. ఏదో ఒక అశాంతి , అభద్రత నీడలాగా వెంటాడుతుంది. గతం కంటే భిన్నమైన జీవితం దుర్భరంగా తోస్తున్న సందర్భంలో మనిషి ఆలోచనలు బాల్యం వైపు, గత ఙ్ఞాపకాల వైపు మళ్ళడం, అస్థిత్వం కోసం ఆరాటపడటం , కలవరించడం, పలవరించడం అనివార్యమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా అతను కవి అయితే ఆవేదన కవిత్వంగా రూపదాల్చుతుంది.
గ్లోబలైజేషన్ విస్తరించి, మానవ, మూలాలను కబళించినప్పుడు, కన్పించిన శత్రువు పంజా విసురుతున్నప్పుడు, సందిగ్ధ పరిస్థితుల్లో బాణాల శ్రీనివాస్ ఎక్కుపెట్టిన కవిత్వమే ‘ పర్యాయపదం’ మనం కోల్పోతున్న జీవన మాధుర్యం, జరుగుతున్న విధ్వంసం, బాల్యం వూరు ఙ్ఞాపకాలు, పెనవేసుకున్న అనుబంధాలు, ఆప్యాయతలు, తెలంగాణా ప్రాంతీయ స్పృహ, ఒంటరితనం, అమ్మ ప్రేమ, వృత్తి పై మమకారం మొదలైన అంశాలు బాణాల కవిత్వం నిండా అల్లుకున్నాయి. వస్తువు, శిల్పం ఈయన కవిత్వంలో జోడుగుర్రాలు. ‘ఆకలికి అన్నం తినిపించే అమ్మ ఎంత రాసిన పూర్తి కాని కావ్యం / అమ్మంటే అనంతం’ అని అమ్మ ఙ్ఞాపకాల్లోకి వెళ్ళినా – చెదిరిపోని ‘పచ్చబొట్టు’ ఙ్ఞాపకాలను నెమరువేసుకున్నా – కుల వాయిద్యం ‘రుంజ’ నాదాల్లోంచి కన్నీళ్ళ బాధను ఆకలి మంటను పల్లెతల్లి దీనావస్థను, తెలంగాణా జీవితంలోని అమాయకత్వాన్ని ఆగ్రహాన్ని ‘పర్యాయపదం’ బలంగా వ్యక్తీకరించింది.
కోల్పోతున్న ఆనవాళ్ళు, గ్రామీణ సంస్కృతి నేపధ్యం, సైబరిజం ప్రభావాలు అడుగంటుతున్న ఆత్మీయతలు, మారుతున్న మానవ సంబంధాలు బాణాల వేదనకు గురిచేస్తాయి. పద్యం ఎత్తుగడ, నిర్వహణ ముగింపు విషయంలో బాణాల శ్రీనివాస్ గారిది చేయితిరిగిన నైపుణ్యం, అభివ్యక్తిలో కొత్తదనం. ఇమేజినరీ సృజన లో సవ్య సాచిత్వం, వస్తుసమన్వయ శిల్పం అనుభూతి ప్రాధాన్యం, వైవిధ్యం,సంక్షిప్తం, శబ్దభావుకత లక్షణాలుగా కవిత్వానికి పర్యాయపదంగా బాణాలను అంచనా వేయవచ్చు. మాసిపోని మచ్చలు / మనసు మీద పచ్చబొట్లు రాలిపడ్తున్న కనురెప్పల మీద/ జారిపడుతున్న చీకటి పర్వతాలు ‘ వంగిన ఆకు వెన్నుల్లోంచి/ జారిపడే మేఘం. నక్షత్రాల్ని మింగే నల్లని పొగపాములు ‘ వంటిభావ చిత్రాలు బాణాల భావనాపటిమను రూపుగడతాయి.
ప్రపంచీకరణ సామాజిక వాతావరణాన్ని విషాదంగా మార్చుతున్న సంధర్భంలో ప్రత్యామ్నాయాలు వెదుక్కోవలిసిన అవసరాన్ని ‘పర్యాయపదం’ గుర్తించమంటుంది.సాంద్రమైన పదబంధాలు, క్లిష్టమైన సమాసాలు ఆధునిక నిర్మాణ పద్ధతులతో సాగి ఆర్ద్రతానుభూతులను కలిగిస్తాయి.పాఠకుడిని కవిత్వ వాతావరణంలోకి లాక్కెళ్ళుతాయి . కాల్పనిక, ప్రకృతి ఆరాధన . ప్రేమ , ఒంటరి సంభాషణ బాణాల కవిత్వంలో ప్రత్యేకంగా కన్పిస్తాయి. తాను అధ్యయనం చేసిన ఆంగ్లకవుల భావచాయలు కంటెంట్ లో అక్కడక్కడ దర్శనం అవుతాయి. ‘ఓ ఉదయసుందరాన’ పొద్దుటి పూట ప్రాకృతిక దృశ్యాన్ని రూపుకట్టిన కవిత టైటిల్ పెట్టడంలో ప్రత్యేకత ఉంది. సాధారణంగా అయితే ‘ఓ సుందర ఉదయాన’ అనాలి. సుద్దాల అశోక్ ఒక బతుకు పాట లో ‘శ్రమ సుందరం కన్న మించింది లేదే’ అన్నప్పుడు, సినారే ఒక సమావేశంలో యీ పాట ‘దేశపతి శ్రీనివాస్ నోట విని’ మళ్ళీ పాడించుకొని ‘శ్రమ సుందరం ఏమిటయ్యా ముని సుందరం లాగా’ అన్న విషయం గుర్తుకు వచ్చింది. నవ్యత కోసం ఆధునిక కవిత్వంలో ఇటువంటి ప్రయోగాలు సర్వసాధారణమే. వోకల్ కార్డ్స్ , ఇన్ ఫినైట్, మోటామార్ఫసిస్, కార్బన్ మొనాక్సైడ్ వాంటి సైన్స్ పారిభాషిక పదాలు, బాణాలకు సైన్సు పట్ల అవగాహనను తెలియజేస్తాయి. అనుభవాల ఘర్షణ, అస్థిత్వవేదన బాణాల కవిత్వాన్ని సంపద్వంతంగా తీర్చిదిద్దాయి.
కులవృత్తుల మీద వచ్చిన కవిత్వాన్ని పరిశీలించినప్పుడు బాణాల శ్రీనివాస్ గారి పద్యం ‘కుంపటి’ ఉపరిస్థాయిలో ఉంటుంది. బతుకును తీర్చిదిద్దే ‘కుంపటి’ లో విశ్వదర్శనం చేయిస్తాడు బాణాల.
కంటికి దూరం కాలికి దగ్గర మావూరు
కుంపటి మా ఇంటి తోటలో పూసే సూర్యపుష్పం
అందులో మేము మెరుపుల్ని చూస్తాం
మేఘాల్ని చూస్తాం
ఉరుముల్ని వింటాం
రకరకాల రంగుల్ని చూస్తాం
ఈ సమస్త విశ్వం తిరిగేది
మా కంసాలోళ్ళ కుంపటి చుట్టే
అది నిరంతర మండే అగ్నిగోళంమా తురకగూడెమే కాదు
కట్ల డబ్బి తీస్కోని
రామాపురం/రత్నవరం/మునగాల/నడిగూడెం/కొక్కిరేని/ గణపవరం
తిమ్మరెడ్డి గూడెం/బరాఖత్ గూడెం/
కాలినడక తిరిగి పనిచేసిన రోజులు
గతం గూట్లోంచి తొంగి చూసే పురాఙ్ఞాపకాలు”
అస్థిత్వవేదన , భావోద్వగం, అధివాస్తవికత ముప్పురిగొన్న కమ్మెచ్చులోంచి సాగ దీసిన నిఖార్సైన బంగారు తీగ బాణాల శ్రీనివాస్ గారి “పర్యాయ పదం” కవిత్వం వూటబాయి కూడా!
అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు