Oct2009
మా నాన్న కుటుంబజీవితం
Kodavatiganti Kutumba Rao
మొదట్లో మా ఇంటిపేరు శ్రీధర. మా తాత రామచంద్రయ్యగారిని కొడవటిగంటి కోటావధానులు అనే ఆయన దత్తత తీసుకున్నాడట. (ఈయన దుగ్గిరాలకు చెందిన, వేదాలూ వగైరాలు చదువుకున్న పండితుడట) అందుచేత మా ఇంటిపేరు మారింది. మా నాయనమ్మ (సుందరమ్మ) పిల్లలమర్రివారి ఆడబడుచు. ఈవిడకి మొత్తం 9 మంది పిల్లలు పుట్టినప్పటికీ నలుగురే మిగిలారు. పెద్దకొడుకు వెంకటసుబ్బయ్య మానాన్నకన్నా 16 ఏళ్ళు పెద్దవాడు. ఆ తరవాత అయిదుగురు పుట్టి చనిపోవడంతో కుటుంబశాంతి తంతు జరిపి మానాన్నకు పేరు పెట్టారట. ఆయన తరవాత 1912లో మా అత్తయ్య అన్నపూర్ణా, చివరికి మా బాబాయీ జన్మించారు. 25 ఎకరాల మాగాణితో అప్పట్లో వారిది సంపన్న కుటుంబమే.
వెంకటసుబ్బయ్యగారికి 1915లో నేతి శ్రీరాములు అనే ఆయన పెద్దకుమార్తెతో వివాహ మయింది. మా బాబాయికి ఎనిమిదినెలల వయసున్నప్పుడు రామచంద్రయ్యగారు తెనాలిలో చనిపోయాడు. పెళ్ళి జరిగి నిద్రలు చెయ్యటానికి నండూరు వెళ్ళిన సుబ్బయ్యగారికి తన తండ్రి మరణవార్త తెలియలేదట. అనేక సమీపగ్రామాల్లో ఓవర్సీరుగా పనిచేసిన సుబ్బయ్యగారు తరుచుగా పనిలో మునిగితేలటంతో తన తల్లితో ఎక్కువకాలం గడపలేకపోయారట.
మా నాన్న పదకొండో ఏట సుందరమ్మగారు చనిపోయింది. ఆ విధంగా చిన్నవయసులోనే ముగ్గురు పిల్లలూ తల్లిదండ్రులను కోల్పోయిన వారయారట. సుబ్బయ్యగారు సమీపప్రాంతాల్లోనే ఉద్యోగం చేస్తూఉన్నప్పటికీ, ఆయన భార్యది విపరీతమైన స్వార్థబుద్ధి కావటంవల్ల ఆ తరవాత అనాథలుగా మిగిలిపోయిన తమ్ముళ్ళ, చెల్లెలి బాధ్యత తీసుకోవటానికి ఆయనకు అడ్డుపడిందట. సుబ్బయ్యగారు క్రమంగా విరక్తికి లోనై, 1921లో భార్యనూ, సత్యవతి అనే తన కుమార్తెనూ వదిలిపెట్టి అకస్మాత్తుగా అంతర్ధానమైపోయారట. అదొక బాధ్యతారహితమైన, క్షమించరాని నేరమనే చెప్పాలి. అయినప్పటికీ కుటుంబరావుగారిమీద రచయితగా, మేధావిగా పేరుపొందిన సుబ్బయ్యగారి ప్రభావం పరోక్షంగా చాలా ఉండేదట. ఆ సంగతిని కొన్ని వ్యాసాల్లో ఆయన స్వయంగా ప్రస్తావించారు.
ఈ పరిస్థితుల్లో మానాన్ననూ, ఇద్దరు చిన్నపిల్లలనూ వారి పెత్తల్లీ, ఆవిడ భర్త కుప్పా వెంకట సుబ్బయ్యగారూ చేరదీసి పెంచవలసి వచ్చింది. అది సనాతనభావాలు కలిగిన కుటుంబవాతావరణం. తల్లిదండ్రులు లేక, ఉన్న పెద్దన్నయ్య దేశాలు పట్టిపోవడంతో మా నాన్నకూ, ఆయన చెల్లెలికీ, తమ్ముడికీ పెదతల్లి పెద్దదిక్కుగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్నకు ‘మానసిక గవాక్షాలు’ తెరుచుకోవడానికి దోహదపడినది చదువే.
మా నాన్నకు చిన్నప్పటినుంచీ ఆస్తిపాస్తుల గురించిన తాపత్రయం తక్కువ. సంగీతమూ, సాహిత్యమూ, నాటకాలూ, ఫోటోగ్రఫీ వగైరాలమీద మక్కువ ఎక్కువ. చదువుకూడా ఆసక్తికరమే. వీటన్నిటివల్లా, పెద్దవాళ్ళకు వ్యవహారదక్షత కొరవడినందువల్లా త్వరలోనే ఆస్తంతా హరించుకు పోయింది. మా నాన్నకు ఏ మాత్రమూ ఇష్టంలేకపోయినప్పటికీ తన చెల్లెలిని చదువూసంధ్యలు లేని రెండోపెళ్ళివాడికిచ్చి చేస్తూంటే సహించవలసివచ్చింది. 1925లో మా నాన్నకు మెట్టా పద్మావతి అనే అమ్మాయితో పెళ్ళయింది. గుంటూరు, విజయనగరం కాలేజీలలో చదివాక మా నాన్న ఎం.ఎస్సీ. చదవడానికి బెనారెస్ వెళ్ళినప్పటికీ డిప్రెషన్ వల్ల డబ్బులేక చదువు మానేసి తిరిగిరావలసివచ్చింది. 1939లో ప్లూరిసీ కారణంగా భార్య మరణించింది.
మా నాన్న కథలు మొదటగా అచ్చయినది 1932లో మద్రాసునుంచి ఆండ్ర శేషగిరిరావు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్రభూమి మాసపత్రికలో. తన పన్నెండో ఏటినుంచీ మా నాన్నకు కథలు రాయాలనే కోరిక ఉండేదట. పత్రికల్లో కనబడే ప్రతి వార్తాశీర్షికనూ ఆధారం చేసుకుని ఒక కథ రాసి చించిపారేసేవారట. ఈ అభ్యాసం తన శైలిని మెరుగుపరుచుకోవటానికి పనికొచ్చింది. మొదట్లో ఆయన రాసిన కథలన్నీ తనచుట్టూ ఉన్న సాంఘికవాతావరణాన్ని విమర్శించేందుకు రాసినవే. చదువు నేర్పిన విషయాలూ, మంచి పుస్తకాలనుంచి నేర్చుకోదగిన విషయాలూ అన్నీ తనకు కనబడుతున్న సమాజంలోని అవలక్షణాలకు వ్యతిరేకంగానే ఉండేవి కనక ఛాందసత్వాన్నీ, సనాతనభావాలనీ ఈసడించుకోవడం సహజంగా అబ్బింది. తన పదహారో ఏటనే తమ ఇంట తద్దినాలు పెట్టే పురోహితుడు పొద్దున్నే రహస్యంగా హోటలుకెళ్ళి టిఫిన్ తింటున్నాదని చూసిన తరవాత మా నాన్న తద్దినాలు పెట్టడం, జంధ్యం వేసుకోవడం వగైరాలన్నీ మానేశారు. ఆయనకు బాల్యవివాహాలూ, వాటివల్ల కలిగే అనర్థాలూ అన్నీ మొదట్లో కేవలం అర్థంలేనివిగా, తర్కవిరుద్ధంగా అనిపించాయి.
ఇతర వ్యక్తిగత కష్టాలతోబాటు మా నాన్నను 1940 తరవాత నిరుద్యోగం కూడా బాధించింది. సమాజాన్నీ, అంతర్జాతీయ పరిస్థితినీ అర్థంచేసుకుంటూ, మార్క్సిజంపట్ల అవగాహన పెంచుకుంటూ ఆయన రచనలు కొనసాగించారు. తన కథల్లో ఆయన ఎటువంటి నినాదాలనూ ప్రవేశపెట్టలేదు. మధ్యతరగతి జీవితాలని తనకు తెలిసినంతమేరకు వాస్తవికంగా వర్ణించి, విశ్లేషించారు. తన రాజకీయ వైఖరినీ, విమర్శనూ ఎక్కువగా వ్యాసాలద్వారానే ప్రకటిస్తూవచ్చారు. ఇతర ఉద్యోగాలు కొన్ని చేసి ఆ తరవాత జర్నలిస్టుగా స్థిరపడ్డారు.
ఆయన ప్రవేశపెట్టిన మార్పులన్నీ వ్యాపారయుతంగా విజయం సాధించిన పత్రికలన్నీ నేటికీ అనుసరిస్తూనే ఉన్నాయి. డబ్బులేక బాధపడుతున్న రోజుల్లో శ్రీశ్రీ, మా నాన్న మొదలైనవారంతా పత్రికలకి రాసి నాలుగురాళ్ళు తెచ్చుకుంటూ గడిపిన రోజులుండేవి. రాత్రిళ్ళు భోజనానికి బదులు టిఫిన్ తిని మద్రాసు బీచ్లో నిద్రపోయిన సందర్భాలుండేవి. తనమీద పంచరత్నాలు రాసినవారికి వెంటనే పారితోషికం ఇప్పించి, మా నాన్నవంటివారు అచ్చయిన తన రచనలకి డబ్బివ్వమని గుర్తు చేస్తే విసుక్కున్న ‘విశ్వదాత’లుండేవారట.
మా నాన్నకు చివరిదాకా మానవజాతి సామాజికపరిణామం గురించిన ఆసక్తి ఉండేది. వాటి వివరాలను చదివి తెలుసుకుంటూ చాలా వ్యాసాలు రాశారు. తన చిన్నతనంనుంచీ సాహిత్య ఉద్యమాలను పరిశీలించడంతో వాటి గురించిన అవగాహన ఆయనకు స్పష్టంగా ఉండేది. అలాగే సాంస్కృతిక రంగంలో సంగీతం, నాటకాలూ, సినిమారంగం అన్నీ ఎలా మొదలై ఎటువంటి పరిణామాలకు లోనయాయో ఆయనకు బాగా తెలుసు. అవన్నీ సమాజంవల్ల ఎలా ప్రభావితం అయాయో, సమాజాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఆయన చాలా సందర్భాల్లో వివరించగలిగారు.
తెలుగు వచనరచనలో ఆయన విజయవంతంగా చేపట్టినన్ని ప్రక్రియలు ఇతర రచయితలు అరుదుగా చేశారనిపిస్తుంది. కినిమా మాసపత్రికలో ట్రిక్ ఫోటోగ్రఫీ గురించి రాసినా, చందమామ కోసమని కథాసరిత్సాగరంనుంచి గాథలను తిరగరాసినా ఆయన సామర్థ్యం ఒకలాగే ఉండేది. 1945లో మా అమ్మను వివాహం చేసుకున్న తరవాత ఆయన కుటుంబజీవితం సాఫీగా గడిచిపోయింది. భౌతికపరిస్థితులు కుదుటపడడంతో ఆయన తన మేధోజీవితాన్ని సవ్యంగా కొనసాగించుకోగలిగారు.
ఏ తరంలోనైనా మా నాన్నకు సాహిత్యాభిమానులంతా ఎక్కువగా యువతీయువకులే. ఈ విషయం ఆయనకు సంతృప్తినిచ్చేది. వ్యక్తిగతంగా ఆయనెప్పుడూ “మా రోజుల్లో…” అనే ధోరణి కనబరచలేదు. ఎటొచ్చీ తన చిన్నతనంలో పాతికేళ్ళు వచ్చేసరికే వ్యక్తులకు పెద్దరికం వచ్చేసేదనీ, సమాజంలో బాధ్యతతో మెలగవలసివచ్చేదనీ అనేవారు. ఇది ఆయన రచనల్లోకూడా కనిపిస్తుంది. ఆయన కథల్లోని యువతీయువకులు ఎంతో పరిపక్వంగా మాట్లాడడం, ప్రవర్తించడం అసహజంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిపెరిగేవారికి పాతికేళ్ళకు చదువుకూడా పూర్తవదు. నడివయసు వచ్చినవారికికూడా సమాజం గురించి సరైన అవగాహన కనిపించదు. ఇది అప్పటికీ, ఇప్పటికీ ముఖ్యమైన తేడా అనుకుంటాను.
ప్రతివారికీ అందుబాటులో ఉండే మంచి సంస్కారాన్ని చాలామంది అందుకునే ప్రయత్నం చెయ్యరు సరికదా గుర్తించనుకూడా గుర్తించరు. సరైన అవగాహన లేకుండా పెరిగిన వ్యక్తులు తమ పిల్లలకు మంచి విషయాలు నేర్పడంలో విఫలం అవుతారు కనకనే సమాజంలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరొకవంక సమాజాన్ని భ్రష్టుపట్టింఛే శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. జీవితంపట్ల సరైన దృక్పథం ఏర్పడడం చాలా ముఖ్యం. ఇది మానాన్ననుంచి ప్రతివారూ నేర్చుకోదగిన లక్షణం.
6 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు
October 12th, 2009 at 7:12 am
sir your article has helped us know many things about that great author. i am an ardent fan of sri koku. the point that people were expected to behave as matured on attaining age of around 25 has to be looked at from the fact of longevity and the economic self sufficiency of families. i do not think that was a deficiency in the literature of sri koku. even today a girl of around 6-7 years helps the mother in the kitchen, fetches water and also runs errands in the weaker sections while her contemporary wets bed in upper middle class. this, i feel, demonstrates well that the class then considered “middle class” was in fact akin to labor class. surely the laborers had nothing eat and cover themselves. however your observation provoked thinking and needs a lot of learning.
sorry if i have over stepped
chitra ramarao (veluhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=2DYOkz29O8ijLJrQ_xNor_JnWjxhB1Fg8sQdtcuffoY=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@gmail.com)
October 12th, 2009 at 12:54 pm
పంతొమ్మిదో శతాబ్దంవాడైన లార్డ్ మెకాలే తన రచనల్లో As every schoolboy knows అని పెద్దపెద్ద విషయాలు రాసేవాడనీ, నిజజీవితంలో అటువంటి schoolboy ఎవడూ ఉండడనీ విమర్శకులు అనేవారు. కొన్ని సందర్భాల్లో మా నాన్న కథల్లోని పాత్రలు అలాగే అనిపిస్తాయి. ఈ రోజుల్లో ‘పెద్దరికం’ ఆలస్యంగా అలవడుతోందని అనిపిస్తోంది. ప్రపంచజ్ఞానం పొందడం అరుదైన అవకాశంగానూ, పుస్తకాలూ, చదువుద్వారా తెలిసేదే ఎక్కువగానూ కనిపిస్తోంది.
October 21st, 2009 at 11:42 pm
the article is very informative n we have learnt many a thing about koku’s life..koku is really a legend in literature who wrote about down to earth people. hats off to the author n the pranahita for such informative articles n hope many such in the future.
October 24th, 2009 at 2:55 am
కుటుంబరావుగారి రచనలు ఇరవయ్యేళ్ళుగా చదువుతున్నా. జీవితానుభవం పెరుగుతున్నకొద్దీ ఆయన రచనల్లో కొత్త కోణాలు కనిపిస్తాయి. ఆయన రచనల్లో అత్యధిక శాతం అనేక సార్లు చదవడం వల్ల ఆయన వ్యక్తిత్వం పరిచితమయినట్టే కనిపిస్తుంది నాకు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన సన్నిహితులు రాస్తే చదవడం నాకు చాలా ఇష్టమే గాని ఆయన రచనలనుంచి ఆయన వ్యక్తిత్వాన్నిపట్టుకునే విమర్శనా సాధనాలు ఎవరికయినా తెలిస్తే కొంచెం చెబుతారా?
October 25th, 2009 at 10:44 am
పూర్ణ గారు:
రచనల ద్వరా ఒక రచయిత వ్యక్తిత్వాన్ని పట్టుకునే సాధనాలు ఎవరికి వారే తయారుచేసుకోవాలని నాకనిపిస్తుంది. ఉదాహరణకి, కొకు రచనల్లోని మూఢనమ్మకాలపై నిరసన వంటివే కాక, సమాజంలోని కొన్ని శక్తుల ప్రభావం వ్యక్తులపై ఎన్ని రకాలుగా ఉంటుందో తెలిపే ఈ రచనలలో రచయిత నిశితపరిశీలన స్పష్టంగా తెలుస్తుంది. అభ్యుదయ ధృక్పధం గల కొకు రచనల్లో నీతిబోధలు ఉండవు. ఒక విషయంపై పాఠకులను ఆలోచింప చేయగలగటం ఈ రచనల్లోని ఒక ముఖ్య అంశం. కొకు రచనలు చదవటంలో రచయిత వ్యక్తిత్వంలో నాకు కనపడిన అంశాలలొ పైన ఉదాహరించిన విషయాలు కొన్ని. ఇవన్నీ ‘చందమామ ‘ వంటి పిల్లల మాస పత్రికకి వెన్నెముకగా నిలిచిన కొకు రచనల్లో అతి స్పష్టంగా కనపడుతుంటాయి.
విష్ణుభొట్ల లక్ష్మన్న
October 25th, 2009 at 11:13 am
ఉత్తమశ్రేణి రచయితలందరూ తమ వ్యక్తిత్వాన్ని ఏదో విధంగా బైటపెడుతూనే ఉంటారు. శ్రీశ్రీ గురించిగాని, రావిశాస్త్రి గురించిగాని తెలుసుకోవడానికి వారి రచనలే చాలు. ఎటొచ్చీ శ్రీశ్రీ కేరమ్స్ గొప్పగా ఆడేవాడనీ, క్రాస్వర్డ్ పజిల్స్ ఆసక్తితో నింపేవాడనీ ఆయన్ని ఎరిగినవారే చెప్పగలుగుతారు. మా మేనమామ కొమ్మూరి సాంబశివరావు తాను ఒక డిటెక్టివ్ పాత్రను సృష్టించబోతున్నానని చెప్పినప్పుడు అతనికి యుగంధర్ అనే పేరును సూచించినది మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. ఇలాంటి చిన్న విషయాలు కొంతవరకూ ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే ఆరుద్ర తన కవితల గురించి చెప్పినదానికన్నా తాను రాసిన కొన్ని డిటెక్టివ్ రచనల గురించి ఎక్కువగా చెప్పేవారు.