మన ‘ముంగిలి’లో మన సాహిత్యం

21వ శతాబ్దపు తొలి అడుగులో సాహిత్య చరిత్రలోనూ, సాహిత్య వాతావరణం లోనూ ఉధృతి ఏర్పడింది.సాహిత్య చరిత్రలో తొలిరచనల పునర్మూల్యాంకన , సాహిత్య వాతావరణంలో అస్తిత్వ ఉద్యమాలలో ప్రాంతీయత భావన చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంలో తెలంగాణా ప్రాంతం ముందున్నదని కూడా విమర్శకులు భావిస్తున్నారు. నిజానికి తెలంగాణా ప్రాంతం నుంచీ సృజనాత్మక సాహిత్యం వస్తున్నంతగా విమర్శ పరిశోధనలు రాలేదేమో? అన్న అనుమానం కూడా కొందరికి ఉంది. పరిశోధన , విమర్శల విషయంలో రాయలసీమ ప్రాంతం కొంచెం ముందున్నట్టు కనిపిస్తుంది. కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి కేంద్రాలుగా విమర్శలు పరిశోధనలు వెలువడుతున్నాయి. తెలంగాణా ప్రాంతం నుంచీ విమర్శ బాగానే వస్తున్నా పరిశోధనల విషయంలో విస్తృతంగా లేదనే చెప్పాలి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా వస్తున్న పరిశోధనల్లో మరీ ఈ కాలంలో వచ్చిన మార్పు ఏమిటంటే పరిశోధనలన్నీ విశ్లేషణ ప్రధానంగా మారి సేకరణ దృష్టి తగ్గింది. అందువల్ల తెలంగాణా సాహిత్య మూలాలు బయటపడవలసినంత బయట పడలేదు. ఈ క్రమంలొ గత దశాబ్ది కాలంగా తెలంగాణా సాహిత్య వికాస నిర్మాణానికి కృషి చేస్తున్న ” సుంకిరెడ్డి నారాయణరెడ్డి” ‘ముంగిలి’ పేరుతో తెలంగాణా ప్రాచీన సాహిత్యాన్ని మనముందుకు తెస్తున్నారు.

తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మించబడాలన్న ఆకాంక్ష ఇటీవలి కాలంలొ విస్తృతమౌతున్నది. ఈ క్రమంలో తెలంగాణా సాహిత్య చరిత్ర ఎట్లా రాయాలి? అన్న చర్చ కూడా కనిపిస్తున్నది. ‘తెలంగాణా’ అన్న భావనను నైజాంపాలనను దృష్టిలో పెట్టుకుని సుమారు 450 సంవత్సరాల చరిత్ర దీనిది అని కొందరు చెబుతున్నారు. అందువల్ల ఈ కాలంలో వచ్చిందే తెలంగాణా సాహిత్యం. తెలంగాణ అన్నది నైజాం అనే అర్థంలో గాక ఇప్పుడు తెలంగాణాగా భావిస్తున్న ప్రాంతంలోని ఒకప్పుడున్న సాహిత్యంకూడా ఇక్కడిదే అన్నది మరో భావన . ఏ ప్రాంతంలో పుట్టిన కవయినా తెలంగాణా ప్రాంతంలో జీవనం సాగించి ఉంటే అతడు ఎన్నుకున్న రచనల్లో ఇక్కడి జీవనం ప్రతిఫలిస్తే అదీ తెలంగాణా సాహిత్యమే. ఇలా తెలంగాణా సాహిత్య చరిత్ర నిర్మాణానికి పూనుకునే వారికి ఈరకమైన అభిప్రాయాలు, భావనలు వెన్నాడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడో వెలువడినదైనా తెలంగాణా సాహిత్యమే అన్న నిర్ణయానికి వచ్చి తెలంగాణా ప్రాచీన సాహిత్యాన్ని ‘ముంగిలి’ పేరుతో సంకలనాత్మక సాహిత్య చరిత్రను మనముందుకు తెచ్చారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి.

తెలాంగాణ సాహిత్య చరిత్రకు ఆధారాలను కూర్చడంలో సంకలన గ్రంథాలు చేసిన సేవ విశిష్టమైనది.కవుల కాల నిర్ణయాలలో,కావ్య కర్తృత్వ నిర్ణయాలలో రచనల పూర్వాపరాలను నిర్ణయించడంలో కవులు ఒకే విషయంపై రచనలు చేసినపుడు తులనాత్మక వివేచనకు సంకలన గ్రంథాలు ఉపయోగించాయి.ఉపయోగపడుతున్నాయి.ఈక్రమంలో తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యంలోని చర్చనీయాంశాలను పునర్మూల్యాంకనం చేసుకోవడానికీ “ముంగిలి”అన్న సంకలనాత్మక సాహిత్య గ్రంథం ఒక ప్రధాన ఆధారమని చెప్పవచ్చు.ఇలా భిన్నమైన విశిష్టతలు కలిగిన ఈ వైవిధ్య సంకలనాన్ని గురించి చెప్పడమంటే అది పరిశోధనాత్మక వ్యాసమవుతుంది.ఈ గ్రంథంలోని గుణాలు,ప్రతిపాదనకు వస్తున్న విషయాలు ఈవిధంగా ఉన్నాయి.

  1. తెలంగాణా సాహిత్య వికాసాన్ని అంచనా వేయడానికీ,11వ శతాబ్ధి నుండి 19వ శతాబ్ధివరకు ఈ ప్రాంతంలో వచ్చిన సాహిత్య వైవిధ్యాన్ని తెలుసుకోడానికి ఈ గ్రంథం ఉపయోగ పడుతుంది. 2.ఇప్పటి వరకు సాహిత్య చరిత్రలలో చాలా వరకు ప్రాక్ నన్నయ యుగం అన్న పేరుతో నన్నయకు ముందున్న వేయేళ్ళ సాహిత్యాన్ని స్థూలంగానే చెప్పారు.ఒక్క నిడదవోలు వెంకటరావు గారి సాహిత్య చరిత్రలోనే శాసన సాహిత్యాన్ని గురించి కొంత విస్తృతంగా కనిపిస్తుంది.ఈ సంకలన గ్రంథంలోశాతవాహనుల కాలంలో వచ్చిన సాహిత్యాన్ని ,శాసనాలను పేర్కొన్నారు.
  2. సుంకిరెడ్డినారాయణరెడ్డి శీర్షిక కింద “తెలంగాణా ప్రాచీన సాహిత్యం అనడంతో ఈ ప్రాంతంలో ఇంకో భాషలో వచ్చినది కూడా ఇందులో చేర్చే వీలు కలిగింది. ఇది తెలుగుకు సంబంధించింది కాదు కదా! అన్న ప్రశ్నకు జవాబునిచ్చింది. ఈప్ర్రాంతం నుండే వచ్చిన ప్రాకృత సంస్కృత వాఙ్మయమే తీసుకున్నారు ఉర్దూ, మరాఠీ, కన్నడ వంటి సాహిత్య విషయాలు కనిపించవు.
  3. తెలుగు సాహిత్య చరిత్రలలో సంస్కృతానికి సంబంధించిన రచనలు, పరిచయాలు ఉండవలసిన ఆవసరం లేదు, తెలుగు కవులు సంస్కృతంలో కూడా రచన చేస్తే వాటి ప్రస్తావన ఉండేది, నారాయణ రెడ్డి భవభూతి, అన్నంభట్టు, మల్లనాధసూరి, వీర రాఘవాచార్యుల వంటి వారిని ఈ వరసలో చెప్పడం వలన తెలంగాణా ప్రాంతంలోని సంస్కృత సాహిత్యాన్ని ప్రస్తావించినట్లైంది.
  4. కొన్ని అభిప్రాయ భేదాలూ, వాదనలున్నా తెలుగును ప్ర్రాచీన భాషగా గుర్తించదానికి ఈ గ్రంథంలో ఆధారాలు దొరుకుతాయి.
  5. తెలుగులొ వచ్చిన సాహిత్య చరిత్రలలో గానీ, సంకలన గ్రంథాలలో గానీ మార్గ,దేశీ సాహిత్యాల దృష్టే ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో అందుకు భిన్నంగా జానపద సాహిత్యాంశాలు, వీరగాథలు, కులపురాణాలు చేర్చడం ద్వారా అనాదరణకు గురైన సాహిత్యం వెలుగులోకి వచ్చింది, అదే సందర్భంలో చరిత్రలలో ఉండాల్సిన అంశాలను ప్రతిపాదించినట్లైంది.
  6. సుంకిరెడ్డి ఈగ్రంథం నిర్మించడంలో ఒకప్రయోగం చేసారు. ఒకవైపు సంకలన గ్రంథంగా, మరో వైపు కవుల చరిత్రగా దీనిని సిద్ధం చేశారు, సంకలన కావ్య నిర్మాణంలో ఇది ఒక వైవిధ్యం. ఆ దృష్టితో ఇది ప్రత్యేకమైనది, అయితే మరింత బిగిని సాధించి ఉండవచ్చనిపిస్తుంది.
  7. గోలకొండ కవుల సంచికలో కులాల వారీగా ఈ ప్రాంతంలోని కవులను పేర్కొన్నారు. ఈ సంకలనంలో ఆ ప్రయత్నంలో ఆప్రేరణ కనిపిస్తుంది.
  8. ప్రస్తావన పేరుతో వ్రాసిన వ్యాసంలో తెలంగాణా పదవ్యుత్పత్తి, సంకలన ఉద్దేశం,ఆదిమయుగంనుంచీ శాతవాహన యుగం వరకు ఆ తర్వాతి కాలాల వరకు చరిత్రలో తెలంగాణా ప్రాతినిధ్యాన్ని చర్చించడం సంకలనాత్మక సాహిత్య చరిత్రకు ఒక చారిత్రక ప్రాధాన్యాన్ని చర్చించడం సంకలనాత్మక సాహిత్యచరిత్రకు ఒక చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగించింది.
  9. భావి పరిశోధకులు శోధించి తేల్చవలసిన విషయాలను కూడా సుంకిరెడ్డి ఇందులో ప్రతిపాదించారు.ఉదా,,.మల్లిఖార్జున పండితారాధ్యుడు.ఇతని ప్రాంతం విషయంలో మరికొంత పరిశోధనజరిగి సత్యం నిర్ధారణమయితే తప్ప పండితారాధ్యుని తెలంగాణావాడిగా చెప్పలేము.[పు.69]అన్నారు.అనుబంధంలో వూర్తి వివరాలు లభించని కవులను పేర్కొన్నారు.ఇవి మరింత శోధించవలసిన విషయాలు. ఇవి భావి పరిశోధకులకు సూచనల వంటివని చెప్పవచ్చు.
  10. .పీఠికలో ముదిగంటి సుజాతారెడ్డి గారు తెలంగాణా ప్రాంతంలోని సాహిత్య వికాసాన్ని వైవిధ్యాన్ని అంచనా వేస్తూ సాహిత్య చరిత్రలో తొలివి గా భావిస్తున్న వాటిలో చాలా వరకు ఈ ప్రాంతం నుండి వెలువడినవేనన్న అభిప్రాయాన్ని చెప్పారు.

ఇలా వైవిధ్యంతో వెలువడిన సంకలనాత్మక సాహిత్య చరిత్రలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే అటు తెలంగాణా సాహిత్య ప్రత్యేకతను,సంకలనాత్మక సాహిత్య చరిత్ర నిర్మాణంలోని ప్రయోగంలోని ప్రయోగం విజయవంతమవుతుంది.

ఈ ముంగిలి భవభూతి, అన్నంభట్టు వంటి సంస్కృత కవులను చెబుతున్నపుడు వారి రచనల్లొని సంస్కృత శ్లోకాలను ఇచ్చారు. హాలుని గాధాసప్తశతి విషయంలో మాత్రం రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి అనువాదాన్నే ఇచ్చారు. ప్రాకృతమూలాన్నివ్వలేదు. ప్రాకృత మూలాన్ని, రాళ్ళపల్లి వారి అనువాదాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ప్రచురించింది.ఇక్కడ ప్రాకృత మూలమే తెలుగు లిపిలొ ఇచ్చి అర్ధం తెలిపి ఉంటే బాగుండేది.

ముంగిలి లో ఉదహరించిన పద్యాల విషయంలో కూడా ఒక శ్రద్ధ తీసుకొని ఉండవచ్చు. ఒక కావ్యంలోని ఒక ఘట్టం లోని కొన్ని పద్యాలనిచ్చారు. మరికొన్ని చోట్ల ఆశ్వాసానికి కొన్ని పద్యాలన్నట్లు ఇచ్చారు. సాహిత్యచరిత్ర దృక్పథంతో వెలువడుతున్న సంకలనం కావడం వలన ఒక కవిలోని ప్రాంత లక్షణాన్ని శైలినీ, సాహిత్యలోకమంతా భావిస్తున్న ఆ కవి విశిష్టతను పట్టి ఇచ్చే పద్యాలను కూర్చితే బాగుండేది. లక్షణ గ్రంధకర్తల విషయంలో కూడా ఏవో నాలుగు పద్యాలు గాక వారు ప్రతిపాదించిన ప్రధాన విషయాన్నుదహరిస్తే ఇక్కడి సాహిత్యం వైవిధ్యం తెలిసేది. కొందరు కవుల దగ్గర పరిచయం తప్ప మరేమీ లేదు. అముద్రితమైతే లభ్యమైన నాలుగు పద్యాలుదహరించవలసి ఉండింది. ఇవి భావి పరిశోధకులకు ఉపయోగిస్తుంది.

ఈ సంకలనంలో ఒక రచన ముద్రితమా? అముద్రితమా?అన్నది చాలాచోట్ల స్పష్టంగా లేదు. కొన్ని చోట్ల ముద్రితమైందని స్పష్టంగా ఇచ్చారు. అలాగే అముద్రితం కూడా ఇచ్చారు. కొన్ని చోట్ల ఈరెండూ ఇవ్వలేదు. అందువల్ల ఫలానా రచన ముద్రితమా? అముద్రితమా? అన్నది సందిగ్ధంగా ఉండి పోయింది.గోలకొండ కవుల సంచికలో పూర్వకవుల పరిచయంలో ఉన్నవాటిని ఉన్నదున్నట్లు గా స్వీకరించారు. వారు వ్రాసిన ఇతర రచనల విషయంజోలికి వెళ్ళలేదు.

ఈ క్రమంలో ఈ సంకలనాత్మక సాహిత్యచరిత్ర లోతైన అవగాహనను తెలంగాణాప్రాంతంలో కలిగిస్తున్నది. అదేనిధంగా ఇతర ప్రాంతాల సాహిత్య చరిత్రల నిర్మాణానికి భూమిక అవుతున్నది. ప్రేరణగా నిలుస్తున్నది. అయితే ఇందరి ప్ర;యత్నంతో వెలువడిన ఈ సకలన గ్రంథంలో కొన్ని చోట్ల పూర్వపరిశోధకుల అభిప్రాయాలతో ఏకీభవించడంతో పొరపాట్లు దొర్లాయి. వాటిని పునస్సమీక్షించికోవలసి ఉంది. ఉదా,,749 పుటలో అరిశాణపాలము వేంకటాధ్వరి అన్న కవిని గురించి ఇచ్చిన వివరణ తప్పుగా పడింది. ఈయన లక్ష్మీ సహస్రం వ్రాశాడు. లక్ష్మీ సహస్ర వ్యాఖ్య కాదు. గోలకొండ కవుల సంచికలో కూడా పొరపాటుగానే పడింది. ఈయన విశ్వగుణాదర్శచంపువు, ప్రద్యుమ్నానంద నాటకం, రాఘవ యాదవీ యమనే ద్వ్యర్థి కావ్యం,ఆచార్యపంచాశత్, వరదరాజస్తవమ్, వంటి స్తోత్ర కావ్యాలు, సుభాషిత కౌస్తుభం,విధిత్ర్య పరిత్రాణమ్,మీమాంసామకరందః వంటి సూక్తి, శాస్త్ర గ్రంథాలను రచించారు. ఈ కవి రచనలుగా విశ్వ గుణాదర్శ చంపువు, వరదాభ్యుదయం ఉన్నట్లు కపిలవాయి లింగమూర్తి పేర్కొన్నారనీ,భారతి ఏప్రిల్1971వ్యాసం వచ్చిందన్నారనీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు కానీ ఆవ్యాసం ఉపయోగించుకున్నట్లు కనపడదు.జానపద సాహిత్యాంశాలను తీసుకున్నా వైష్ణవగీతాలుగా ప్రసిద్ధమై తెలంగాణా ప్రాంతలో ప్రచారంలో ఉన్న, తెలంగాణావారు వ్రాసిన తిరునామాల ప్రస్తావనే కనిపించదు.

సంకలన కావ్యం సాహిత్యచరిత్రకు ప్రధాన ఆధారం. అందునా ఇది సాహిత్య చరిత్ర దృక్పథంతో వెలువడింది కావడంచేత ఇది ప్రామాణికంగా భావించే వీలుంటుంది. ఇందిలొని కవుల విషయంలో మరింత శోధించవలసిన, నిర్ధారించుకోవలసిన అంశాలున్నాయనేది సుంకిరెడ్డి నారాయణరెడ్డి కూడా ఆయాకవుల పరిచయాల సందర్భంలో ప్రస్తావించారు.వాటిని పునస్సమీక్షించుకుని తెలంగాణా ప్రాచీన కవులను బయటపెట్టిన సుంకిరెడ్డి తెలంగాణా సాహిత్య వికాసాన్ని సూచించే కవితా సంకలనాన్ని వెలువరిస్తారని ఆశించడంలో తప్పులేదు.ఎందుకంటే ఈ ప్రయత్నం ఈ సంకలనం ద్వారా కొంత సాధించారు కనుక ప్రాచీన తెలంగాణా సాహిత్యాన్ని మన ముంగిలి లో దింపినది ఈ ‘ముంగిలి’.

ముంగిలి : తెలంగాణా ప్రాచీన సాహిత్యం
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
ప్రతులకు : తెలంగాణా ప్రచురణలు
ఇందిరానివాస్
3/97 ఓల్డ్ ఆల్వాల్
సికిందరాబాద్-500010

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

3 అభిప్రాయాలు

  1. Dr.Darla Oct 19, 2009 1

    సమీక్ష బాగుంది. సమీక్షకుడు అభిప్రాయపడినట్లు ప్రాంతీయ సాహిత్యం తెలంగాణా ప్రాంతం నుండే వస్తున్నా విమర్శ మాత్రం ఇతర ప్రాంతాల నుండి వస్తున్నదన్నారు. అలా అయితే తెలంగాణా సాహిత్యాన్ని ఆ ప్రాంతీయ సాహిత్య విమర్శకులు ఎలా వ్యాఖ్యానిస్తున్నారో తెలిపితే బాగుండేది. ఏది ఏమైనా మంచి సమీక్ష! అభినందనలు!!

  2. srinivas Oct 23, 2009 2

    చక్కని సమీక్ష

  3. mallegoda Jan 22, 2010 3

    సమీక్ష బాగుంది మరాఠ ,ఉర్దూ,కన్నఢ్ సహిత్యాలు మచ్చుకు కొన్ని చెబితె బగుండీదీ.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో