Oct2009
మంచిరాయి
వెన్నెల్లో వెదుకుతూ నడుస్తున్నాను. చుట్టూ కుప్పలుగా రాళ్ళు.వెలుతుర్లో తెల్లగా మెరుస్తూ కొన్ని, నల్లగా నిగనిగలాడుతూ కొన్ని, నన్ను మోహంగా చూస్తూ కొన్ని…. యోగి వేమనలా కొన్ని… రకరకాల రాళ్ళు దాటుకుంటూ వెతుక్కుంటూ ఓ అర్థరాత్రి వెన్నెల పరుచుకున్న తీరం మీద నగ్నంగా నడుస్తున్నాను. అదేపనిగా నడిచి విసుగు కూడా పుడుతుంది కాని ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం నదిలా పరవళ్ళు తొక్కుతుంది. ఇక్కడున్న అన్నింటికంటే ఇంకా ఏదో మంచి రాయి దొరుకుతుందనే ఆశ. ఎంత దూరం చూస్తే అంతదూరం రంగుల రాళ్ళు తళుక్కున మెరుస్తున్నాయి నన్ను కవ్విస్తూ. తీరా దగ్గరగా వెళ్ళి చూస్తే మునుపు చూసినలాంటివే. ఏవో చిన్న మార్పులు తప్ప ఏ తేడా లేనే లేదు. కొన్ని రాళ్ళు నగ్నత్వాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాయి.
ఒకరాయి ‘నేను మంచి రాయిని తెలుసా? నా మంచితనం గురించి కావాలంటే ఎంక్వైరీ చేసుకో’ అనుకుంటూ దొర్లుకుంటూ వెంటపడింది. సుతారంగా కాలుతో పక్కకు జరిపి చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్తున్న నాకు ఒకమ్మాయి ఎదురయ్యింది. నేను తనను గమనించినా తను నన్ను గమనించనంత నిమగ్నమై వెతుక్కుంటుంది. ఆమె కూడా నగ్నంగా ఉంది. వయసు ఇంచుమించు ఒకటే.
నేనే పలకరించాను ‘ ఏం వెతుకుతున్నారు?’ అని,
‘రాళ్ళు విపరీతంగా ఉన్న ప్రదేశానికొచ్చి ఇంకేం వెదుకుతాం … రాళ్ళే!’ అంది.
‘రాళ్ళే అయితే ఇన్నిన్ని కనిపిస్తున్నాయిగా…’ అని ఆగాను…
‘కావచ్చు, కాని నేను మంచిరాళ్ళ కోసం మాత్రమే వెతుకుతున్నాను ?’ అంది నిర్లింప్తంగా. నాకు ఎక్కడలేని ఆనందం వేసింది. ఇన్నాళ్ళకు నాకు ఒక తోడు దొరికినందుకు. ఎవరికి చెప్పినా పిచ్చిదానిలా చూశారు తప్ప ఎవరూ అవును మంచిరాళ్ళు కూడా ఉంటాయి అన్న సంగతే చెప్పలేదు. అందుకే ఎవరికీ తెలీకుండా రహస్యంగా అర్థరాత్రి వెతుకుతున్నాను. ఏకాంతంగా నా కోసం ఒక మంచిరాయిని వెదుక్కుంటున్న సమయం రాయి దొరికిందానికంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది .అంత కంటే సంతోషం ఇప్పుడు ఈమెని చూడగానే నాక్కలిగింది. ఆమెతో అదే అన్నాను.
ఆమె నాకేసి చిత్రంగా చూసి ‘ మన కంటే పెద్ద వాళ్ళు , మనకంటె చిన్నవాళ్ళు, మనతోటి వాళ్ళు అందరూ ఆనందంగానే ఉన్నారు, మనకు మాత్రమే ఎందుకు ఈ అన్వేషణ? అయినా ఫలితం ఉంటుందా? ఇన్నిన్ని రాళ్ళల్లో మంచిరాయిని ఎక్కడని వెతుక్కుంటాం? నేను గత దశాబ్దకాలంగా వెతుకుతూనే ఉన్నాను ?’ అంది దిగులుగా.
నేను ఆశ్చర్యపోయాను ‘గత దశాబ్ద కాలంగానా?’ అని మాత్రంఅనగలిగాను. అప్పుడా అమ్మాయి’ అవును, నేను మా అమ్మమ్మను అడిగాను ఈ ప్రశ్న . ఆమె పురాణాలు, ఇతిహాసాలు, పిట్టకథలు కట్టుకథలు అన్నింటినీ జల్లెడ పట్టింది నా ముందే , కాని ఆమెకి కాని నాక్కాని ఎక్కడా ఒక్క మంచిరాయి దొరకలేదు. పక్కనే మా అమ్మ కూడా ఉంది. ఆమె కూడా నన్ను చూసి వెక్కిరింతగా నవ్వి పెదవి విరిచింది. ‘ నీవన్నీ ఎవరికీ రాని గొంతెమ్మ సందేహాలు, మీ నాన్నకి చెప్పి నీకు తాయెత్తు కట్టిస్తానాగు….. అప్పుడవన్నీ సర్దుకుంటాయి ‘ అని తాయెత్తు కట్టించింది. ఆ తాయెత్తులో జవాబు దొరుకుతుందేమోనన్న కుతూహలం కొద్దీ విప్పి చూస్తే ‘ మూడొందలరవైరోజులూ మాట నిషేధం’ అని రాసుంది! కాని నా ప్రశ్నకు జవాబు లేదు. ఇంట్లో రాత్తెట్టాను కదిలించి చూశాను… కొంచెం ఎత్తుగా తొంగి చూస్తున్నట్టున్న రాళ్ళను గడ్డపలుగు వేసి కదిలించి చూశాను… మా ఇంట్లో పక్కింట్లో వీధిలో ఊర్లో ఎక్కడా దొరకలేదు. దాంతో నదీ తీరాన చాలా రాళ్ళుంటాయని చదివి దాని ప్రకారం వచ్చి వెతుకుతున్నాను. అయితే పగలు, పిలిచిన అందరి ముందు నేనుండాల్సిన అవసరం కారణాన రాత్రిళ్ళు వెతుకుతున్నాను.’ అని ఒక సుధీర్ఘ నిట్టూర్పు విడిచింది అమ్మాయి.
నాకెందుకో ఆ అమ్మాయి తన అన్వేషణ మానేస్తుందేమోననే దిగులు పట్టుకుంది. వయసులో ఒకటో రెండో సంవత్సరాలు నేను పెద్దదాన్నేమో కాని అన్వేషణలో తను నాకు మార్గదర్శి. తనతో కొంచెం ఉల్లాసకరమైన విషయాలు, రాళ్ళ మనస్తత్వాలు మాట్లాడితే కొంత తేరుకుంటుందని అనిపించింది.
‘ మనం ఎక్కడయినా కూర్చుని మాట్లాడుకుందాం…’ అని ఆమె నేను కలిసి నదీ తీరాన నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాము, రాయనేదే కనపడని చోటకి వెళ్ళి కూర్చున్నాం. వెనుక అడివి నిర్లక్ష్యంగా పెరిగిన చెట్లతో ఎవరికోసమో ఎదురు చూసి ఎవరూ రాక కరుడు కట్టిన నేత్రాలతో చూస్తున్నట్టనిపించింది. ముందువేపు చల్లగా ప్రవహిస్తున్న నది నీటిలో నల్లగా మా రూపాల ప్రతిరూపాలు. ఆవరించిన అడవిపూల వాసన. వెన్నెలను దయగా బిడ్డమీద చూపించే ప్రేమలా చల్లుతున్న చంద్ర. అద్భుతంగా అనిపించింది. క్షణకాలం ఎందుకు పనికి రాని వెతుకులాట అనిపించింది. కాని వెతుకులాట ఆపిన క్షణాలు ఎంత దుర్భర అనుభవమో తెలిశాక మళ్ళీ అన్వేషణ తప్పలేదు. అయినా ఎంతో కొంత సాహసం చేయని జీవితం ఎందుకనిపిస్తుంది. ఆ అమ్మాయి మౌనంగా నా వైపు చూస్తూ కూర్చుంది.
ఒక్క క్షణం నాకేం చెప్పాలో అర్థం కాలేదు – ‘ నేను అందరూ మంచిరాయి అని అనుకుంటున్న రాయితో ఉన్నాను పది సంవత్సరాలుగా. రోజులో ఒక్క సారన్నా నన్ను ప్రేమించక పోద్దా అని ఎదురు చూసే దాన్ని. కాని సహజ లక్షణాన్ని అది పోగొట్టుకోలేక పోయింది. తన జాతి వారిని మాత్రమే అది ఎక్కువ అభిమానించేది. నాకెన్నో సందేహాలు రేగేవి.ఎవర్నడుగుదామన్నా ఎవరూ సమయం కేటాయించేవారు కాదు. అసలు ఈ రాయితో నన్ను పంపేటప్పుడే చాలా రాళ్ళను చూసి వాటన్నింటికంటే మంచిరాయని ఎన్నుకుని ఇచ్చారు. మంచిరాయి ఎలా అయిందో నాకిప్పటికీ అర్థం కాదు . నాలుగు రాళ్ళు వెనకేస్తే చాలా? రాళ్ళన్నీ సున్నితమైన హృదయాల్ని పూడ్చేస్తున్నాయనే విషయం అర్థం కాని ఇవి మంచి రాళ్ళెలా అవుతాయి? ఈ రాయి నా సున్నితమైన మనస్సుని చాలా సార్లు పచ్చడి చేసింది. అది వేరే అమ్మాయిలతో తన ప్రవర్తన వల్ల కావచ్చు. నేను ఎవరితోనైనా మాట్లాడినా తప్పేననుకునే మనస్తత్వం కావచ్చు. .. నా రాయిని మంచిరాయిగా నేను అంగీకరించలేక పోయాను. ఇంతకంటే మంచిరాయిని వెతకాలని పట్టుదలగా ఉన్నాను. కాని మంచి రాయిగ కనిపించి దగ్గరగా వెళతానా.. అవీ అంతే… మంచి అన్నది బియ్యంలో రాయంతైనా కనిపించలేదు. ఏ రాయైయితే నేమి పళ్ళూడగొట్టకోటానికని చాలా సార్లు సరిచెప్పుకున్నా, పళ్ళన్నీరాలి అన్నం ముద్ద మింగాలంటే బాధగా ఉంది. సయించట్లే .మనిషి జన్మ ఎత్తాక మనస్పూర్తిగా బతకాలని ఒక్కసారన్న అనిపించాలి కదా. అసలర్థం లేని జీవితం ఎందుకు…. ఏదన్నా ఒక సాహసం చేయాలి అనిపించింది. దాంతో బాగా ఆలోచించా… అపుడు నాకు తోచిన మార్గం వెదకటం ఒక్కటేనని. అందుకే వెతుకుతున్నా… రెండు సంవత్సరాలుగా వెతకుతూ ఉన్నా. కాని కష్టంగా ఉంది.చాలా రాళ్ళతో నేను మాట్లాడా. ఒక రాయి శరీరం మాత్రమే ముఖ్యమంది. ప్రేమ అనేదే లేదు, అదంతా శరీరంలో కలిగిన ఒక భావన మాత్రమే అంది. పడుకోవడమే అంతిమ లక్ష్యం అని చెప్పింది. నాకా విషయం జీర్ణం కావటానికే చాలా రోజులు పట్టింది. అసలెక్కడా మంచి రాళ్ళనేవే ఉండవా అని సందేహం పుట్టింది. ఒకదాన్ని మించి ఒకటున్నాయి. ఇన్నిన్ని రాళ్ళల్లో అసలెప్పటికయినా మంచిరాయి దొరుకుతుందా… వెతకటం వృధానా.. అని నేనూ వెనుకాముందాడానా. వెతుక్కుంటూ పోతే దొరకనిదేది లేదు అని విన్నాక ఆశను చంపుకోలేక పోయాను. మళ్ళా వెదకటం మొదలెట్టాను… అది సరే, నేనంటే మొన్నమొన్నే కదా వెదుకుతా ఉన్నా…. మరి నువ్వు చాలాకాలంగా వెతుకుతున్నావే… మంచిరాయే దొరకలేదా? ‘ అంటూ ముగించాను.
‘ నేను మిమ్మల్ని స్నేహితురాలనుకోవచ్చా ? అలా అనే నేను మీతో అన్ని చెబుతున్నాను. లేకపోతే నేనేంటి! ఈ పిచ్చి రాళ్ళల్లో పడి తిరగడమేంటి? నేనో రాణిలా పెరిగిపెద్దయ్యాను. నాకు అంతా చాలా మంచి రాయని ….! ‘ చెప్పారు. కాని మొదటి రోజే తేలింది ఓటి రాయని…..! చెప్తున్నామెను ఆపి మరీ అడిగా – ‘ ఓటిరాయేంటి?! కుండలంటే తెలుస్తాయిగాని రాళ్ళు ఎట్లా తెలుస్తాయి?!’ అని చాలా అశ్చర్యంగా.
‘ నువ్వెప్పుడూ వినలేదా?! రాళ్ళ మధ్యలో కప్పలుంటాయని? నాకిచ్చిన రాయింలోంచి కూడా మొదటి రోజే రోడు మూడు కప్పలు బయటికి దూకాయి. దాంతో నాకిచ్చిన రాయి ఓటిదని నాకప్పుడర్థమై ఆ రోజు నుంచే వెతకాలనే నిర్ణయాని కొచ్చాను. కరిగే రాళ్ళు కూడా ఉంటాయని విన్నాను. కరిగి నీరయ్యే రాళ్ళు, మనలా ప్రేమించే రాళ్ళు కావాలనిపిస్తుంది. మనసా వాచా కర్మణా ఈ రాయే అన్నీ అనుకుని పారాణి రాసుకున్న నేనిలా మారడానికి కారణం అచ్చంగా నా రాయే !’ అంది బాధగా.
‘కాని మనం వెతుకుతున్న ఈ రాళ్ళలో మనకు మనక్కావలసిన రాయి దొరుకుతుందాంటావా’? మళ్ళీ వచ్చిన సందేహమే నన్ను పదేపదే పీడిస్తున్నందున బయటికే అన్నా.
‘ఒకవేళ దొరికినా, అన్నీ మనం అనుకునే లక్షణాలుంటాయని ఎలా నమ్ముదాం ? ఒక వేళ ఉన్నా అవి మారవని గ్యారంటీ ఏం లేదు కదా ? అసలు మనం ఇట్లా వెతుకుతున్నామంటే ఎంత చులకనగా చూస్తాయో ఎవరికి తెలుసు? అసలెందుకు వెతకాలి? సగం జీవితం చల్లారి పోయాక, ఈ వయసులో మనకు రాళ్ళున్నా, వెతుకుతున్నామంటే ఈ రాళ్ళకి అలుసు కదా? మనకి దొరికిన రాయితో మనం ఉండాలంటే ముందున్న రాళ్ళను వదిలించుకోవాలి, మరి దొరికిన రాయి మంచిదని ఎట్లా తెలుస్తుంది? అలాంటప్పుడు మొదటి రాళ్ళే నయం కదా… అలవాటు పడ్డాం కూడా కదా !…’
- ఈ అమ్మాయి నిజాలన్నింటినీ ఒక్కసారే ప్రశ్నలుగా వడగళ్ళుగా మార్చికురిపిస్తుంది. ఒక్క క్షణం ప్రపంచమంతా చీకటిగా అనిపించింది. ఆ ప్రశ్నలు సూటిగా వచ్చి గుచ్చుకుంటున్నాయి నాకు.
‘ వయసుతో సంబంధంమేంటి? మంచి జీవితాన్ని కాపలాదారులు ఎవరూ ఇవ్వనప్పుడు మనకై మనం వెతుక్కోకూడదు? మనకు కాపలాదారు లెందుకు’ మనం కూడా వాళ్ళలా మనుషులం కదా! అసలెందుకు వెతకాలి అన్న ప్రశ్న నిజమేనా? ఎందుకు వెతక్కూడదు అని కదా ప్రశ్నించుకోవాలి ? వెతుక్కోకపోతే జీవనానికి అర్థం ఏముంది? మనకంటే పెద్దవాళ్ళందరూ కొన్ని కొలమానాలిచ్చి ఇవన్నీ ఉంటే మంచి అని చెప్పబట్టి, వాళ్ళంతా ఆనందంగా ఉంటున్నారని మనల్ని నమ్మించబట్టి మనం మోసపోయాం. ఎంత మంచి రాయి అయినా ఏదో ఒక చేడు లేకుండా ఉండదు. అయితే వాళ్ళలో చెడు చెడుకాకుండా పోతుండా. మన ఆలోచన లేమో నిషేధాలవుతున్నాయి. వాళ్ళు అట్లా లొంగిపోయారు. కాని మనం లొంగాల్సిన అవసరం లేదు. వెతుకుతూనే ఉందాం, దొరికే వరకూ, మనకు కాకపోతే మన తరువాతి తరం తరువాత్తరం ఎవరైనా మంచిరాళ్ళను పొందగలరేమో! అప్పాటికి మంచిరాళ్ళకి మనమిచ్చే నిర్వచనం ఉండకపోవచ్చి. దాన్ని మనం స్వాగతించాలి. అప్పటి వరకూ ఈ అన్వేషణ ఆగదు. పద పోదాం. ‘. అంటూ ఆమెను లేవదీసాను…
నది నగ్నంగా ప్రవహిస్తుంది. రాళ్ళను ఒరుసుకుంటూ. రాళ్ళు మొట్టమొదట ఎట్లా ఉండేవో కాని నది ఒరవడికి రకరకాల ఆకారాలను సంతరించుకున్నాయి. వాటికి ఊపిరిపోస్తున్న నది ఇంకా వాటిని మార్చగలదు…. మా ప్రతిరూపాలు నదిలో ప్రవహిస్తున్నాయి. కాలం నదిలా కనిపిస్తుంది. మేం మంచిరాళ్ళ కోసం అన్వేషిస్తూనే ఉన్నాం….!
(ఒక వెన్నెల రాత్రి మంజీర తీరంలో స్నేహితురాలితో సంభాషణ ఈ కథ)