Oct2009
తెలంగాణ ప్రచురణలు “ముంగిలి” ఆవిష్కరణ
డా.సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సంకలనం చేసిన తెలంగాణ ప్రాచీన సాహిత్యం “ముంగిలి” ని ప్రముఖ సంస్కృత పందితుడు డా. ఆచార్య రవ్వా శ్రీహరి గారు ఆగష్టు 2 వతేదీన ఇఫ్లూ (సీఫెల్) లో ఆవిష్కరించారు.
ప్రముఖ తెలంగాణ సాహితీవేత్తలతో నిండిన ఈ సమావేశానికి అధ్యక్షులు డా. జయధీర్ తిరుమల రావు వ్యవహరించారు. పుస్తక ఆవిష్కర్త రవ్వా శ్రీహరి గారు మాట్లాడుతూ ‘ అసలు తెలుగు ఎక్కడైనా ఉన్నదంటే అది తెలంగాణలోనే , చాలా పలుకుబడులు సామెతలతో కూడుకున్నటువంటీ, వైవిధ్యభరితమైన తెలుగు ఈ ప్రాంతంలో మాత్రమే ఉన్నది. ఇప్పటి తెలంగాణ గ్రామాల్లో కమ్మని పలుకుబడులతో భాష కలుషితం కాకుండా ఉన్నది.పట్టణాలలో ప్రజలు నిరలంకారంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణాలో కావ్య విశేషాలు కలిగి శాసనాలు ఎక్కువున్నాయి. ఇటువంటి తెలంగాణ సాహిత్య చరిత్ర రాసిన సుంకిరెడ్డి గారికి అభినందనలు అంటూ ముగించారు
ముంగిలిని పరిచయంచేస్తూ ” పాలెం సంస్కృత కాలేజ్ పూర్వ ప్రిన్స్ పాల్ శ్రీ రంగాచార్యులు మాట్లాడుతూ పరిశోధన ఒక కృషికి మార్గదర్శకత్వం వహిస్తుంది.గొప్ప పండితులుగా పేరుపొందిన ఆంధ్రప్రాంత కవులైన తిరుపతి వేంకట కవుల్ని ఓడించిన చరిత్ర తెలంగాణ కవులది. తెలంగాణ శాసనాల్లో చిత్రకవిత్వం ఉన్నది. నిరోష్ఠ సాహిత్యంలో నిరోష్ఠ రామాయణం రాసింది ఈ ప్రాంతం కవులే . మొట్టమొదటి బుర్రకథ కూడా ఈ ప్రాంతం నుండే వచ్చినదని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇంత గొప్ప పనిచేసిన ముంగిలి రచయితకు అభినందనలు తెలుపూతూ ముగించారు.
ప్రముఖ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి సంపాదకులు డా. కె.శ్రీనివాస్ ముంగిలిని గురించి మాట్లాడుతూ ‘ చరిత్ర వర్తమాన అవసరాల కోసం రాయబడుతుంది. తెలంగాణ కవిత్వంలో ధిక్కార కవిత్వం ఎక్కువగా రావడానికి కారణాలు పరిశీలించాలి. దీనికి సంబంధించిన సాహిత్య చరిత్రతో పాటు, రాజకీయ చరిత్ర ను పరిశోధన చేయాలంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సమావేశంలో ఇంకా సంగిశెట్టి శ్రీనివాస , సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు ప్రసంగించారు.
అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు