Oct2009
నల్లదొరతనాన్ని ప్రతిఘటించిన కుసుమ ధర్మన్న
‘తెలుగులో కవితావిప్లవాల స్వరూపం’ లో డా.వెల్చేరు నారయణరావు గారు గురజాడ మీద రాసిన అధ్యాయానికి ‘అసంపూర్ణ విప్లవం’ అని పేరు పెట్టారు. తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే అసంపూర్ణ విప్లవం పాల్కురికి సోమనాధునితోనే మొదలయినట్లు అర్థమవుతుంది. అది ఆయనతో మొదలై, అన్నమయ్య మీదుగా ప్రయాణించి, వేమన, వీరబ్రహ్మంలతో బలోపేతమై కందుకూరి, గురజాడలతో ఆధునిక రూపం తీసుకుని, కుసుమ ధర్మన్న, గుర్రం జాషువాల ద్వారా స్వానుభవం సారంగా రూపొంది ఇవాళ అస్తిత్వ ఉద్యమమై సంపూర్ణ విప్లవం కావడానికి ప్రయత్నిస్తున్నది. ఈ మధ్యలో అనేక మంది రచయితలు ఈ ఉద్యమానికి ప్రతినిధులై నిలుస్తున్నారు. ఫ్యుడల్ చట్రంలో భావవాదులుగానే ఉంటూ శైవ, వైష్ణవ విభేదాలతో పాల్కురికి, అన్నమయ్యలు భారతీయ సామాజిక వ్యవస్థలో కదలిక తీసుకురావడానికి ప్రయత్నించారు. వీళ్ళ ప్రయత్నాలకు శ్రామిక, లౌకిక పార్శ్వాలను మేళవించి విస్తృతపరిచారు. ప్రబోధమూ, ప్రతిఘటనా మేళవించిన వీళ్ళ ప్రయత్నాలు భారతీయ సమాజంలోని కులవ్యవస్థను, ఆర్థికకేంద్రీకరణను, లౌకిక తాత్విక దృక్పథంతో విమర్శకుపెట్టారు. వలసపాలనలో మొదలైన సంఘసంస్కరణోద్యమానికి పూర్వరంగం తయారయ్యింది.
సంఘసంస్కరణోద్యమ రచయితలుగా కందుకూరి, గురజాడలు అనేక మూఢనమ్మకాలను, మూఢాచారాలను హాస్యం సాధనంగా అధిక్షేపించారు . అందులో గురజాడ అస్పృశ్యతను హేతుబద్ధంగా విమర్శించారు.ముత్యాలసరములు, లవణరాజుకల – కవితలలో ఆయన దళిత సమస్యను విమర్శనాత్మకంగా ఆవిష్కరించారు. మంగిపూడి వెంకటశర్మ ‘నిరుద్ధ భారతంలో’ భారతీయ సంస్కృతీనిర్మాణంలో యుగయుగాలుగా దళితులు నిర్వహించిన ఉదాత్తమైన పాత్రను వర్ణనాత్మకంగా విశ్లేషించారు. ఈ యిద్దరికన్నా ముందే 1909 లో అఙ్ఞాతకవి ‘మాలవాండ్ర పాట’ రచించారు. ఈ నేపథ్యంలో 1920 ప్రాంతాలలో కుసుమ ధర్మన్న , 1932 ప్రాంతాలలో గుర్రం జాషువా దళిత జీవన విషాదాలను మానవీయ రాజకీయ దృక్పథాలతో చిత్రించి తెలుగు కవిత్వాన్ని సుసంపన్నంచేశారు. కుసుమ ధర్మన్న ప్రవేశంతో దళిత కవిత్వం స్వానుభవ ప్రశ్నగా మారింది. అప్పటి నుంచే దళిత జీవితం మిగతా సాహిత్యా ప్రక్రియలకు కూడా వస్తువైంది.
‘ మాకొద్దీ తెల్లదొరతనం ‘ అని గరిమెళ్ళ ముందు పాడారో, ‘మాకొద్దీ నల్లదొరతనం ‘అని కుసుమ ధర్మన్న ముందుపాడారో గాని మొత్తం మీద వేమన, వీర బ్రహ్మంలలాగే ఈ యిద్దరూ కొంచెం ముందు వెనకలుగా దొరల పెత్తనాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. గరిమెళ్ళ భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిర్వీర్యం చేస్తున్న పరాయిపాలనకు వ్యతిరేకంగా గళంవిప్పగా, కుసుమ ధర్మన్న పరాయి పాలకుల నుంచి స్వతంత్రం కోరే భారతీయులు తమలో తాము పరస్పరం స్వతంత్రం ఇచ్చుకోవలసిన అవసరాన్ని గళమెత్తిచాటారు. ఇరవయవ శతాబ్ధి ప్రారంభంలో భారతదేశానికి ముందు స్వతంత్రం రావాల్నా, సంఘసంస్కరణ కావాల్నా ? అనే చర్చ జరిగింది. దానిని ప్రతిబింబిస్తూ ” గృహోద్ధరణమా? దేశోద్ధరణమా? ” అనే కథానిక వచ్చింది. గరిమెళ్ళ స్వతంత్రం వైపు మొగ్గగా, ధర్మన్న సంస్కరణ వైపు మొగ్గారు. ఇద్దరిలోను ఈ రెండు ఆపేక్షలూ అంతర్గతంగా ఉన్నాయన్నది వాస్తవం. ప్రాధాన్యంలోనే విభేదించారు.
దళిత దృష్టికోణం నుంచి కుసుమ ధర్మన్న బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రం కోరే ముందు భారతీయ సమాజంలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రాన్ని సాధించాలని ప్రతిపాదిస్తూ ‘ మాకొద్దీ నల్లదొరతనం ‘ అనే పాట రాశారు. ఇదీ ఈ పాటకున్న రాజకీయ స్వభావం.
“గాంధిమహాత్ముడు – కరుణాతొ మమ్ముల
గాపాడమని చెప్పుతారు……….
గాంధిబోధా మరువలేదంటారు
మా మాలమాదిగలంటే మండిపడిపోతారు”
“స్వారాజ్యమంటారు – సభలెన్నోజేసేరు….
మా మాలల సంగతియేమి మరో మీద చెప్పారు.”
“స్వారాజ్యమనుచు సర్కారుతో పోరాడి
స్వాతంత్రీయ మడుగుతారు…..
మాకు స్వాతంత్రీయమివ్వబోరు……
మాకు హక్కు లేదంటే స్వారాజ్యమెక్కడదక్కు “?
ఇదీ కుసుమ ధర్మన్న రాజకీయవాదం ఈ వాదం వెనక వేల సంవత్సరాలుగా మనువాద కులవ్యవస్థలో అగ్రకులాల ఉక్కు పాదాల కింద నలిగిపోయిన దళితుల జీవన వేదన ఉంది. భారతీయ సమాజ నిర్మాణంలోని అప్రజాస్వామికతను ఊపిరిసలపని ప్రశ్నల తిరుగుబాటుతత్వముంది. ” లేదురా ఇటువంటి భూదేవి యెందు ” అని తెలుగు వాళ్ళు జాతీయెద్యమ కాలంలో పాడుకుంటున్న సమయంలో ఆపాటి రెండవ పార్శ్వాన్ని ప్రశ్నిస్తూ కుసుమధర్మాన్న పాట వచ్చింది. మనువాదం మీద ముసుగులేకుండా ప్రశ్ననుసంధించే ఈ పాటలో ధర్మన్న ఉపాధ్యాయునిలాగా విషయాన్ని విప్పిచెప్పుతూ ,తర్కసహంగా తన వాదాన్ని నిర్మించారు. శరీర శ్రమతో బతికే దళితులకు ఆత్మగౌరవంతో బతికే హక్కును నిరాకరించే అమానుష సాంఘిక వ్యవస్థ మీద తిరుగుబాటు బావుటా ధర్మన్న పాట.
బ్రహ్మణః క్షత్రియో వైశ్యస్త్రయోవర్ణాద్విజాతయః
చతుర్ధ ఏకజాతిస్తు శూద్రో నాస్తితుపంచమః
పంచముల (దళితుల ) ఉనికినే తిరస్కరించే ఈ మనువాదం మీద కుసుమధర్మన్న ఆవేశానికి లోనుకాకుండా
“వినదగునెవ్వరు చెప్పిన ”
అనే సుమతి శతక పద్యం ఆధారంగా – ప్రమాణంగా తన పాటను రచించారు.
పల్లవి : మాకొద్దీ నల్లదొరతనము – దేవ
మాకొద్దీనల్ల దొరతనము
అను పల్లవి: మాకు పదిమందితో పాటు
పరువు గలుగకయున్న ” మా కొద్దీ ”
భారతీయ సమాజంలో అందరిలాగా పరువుగా బతికే జీవితాన్ని కోరుకుంటూ , దానిని ఇవ్వనిరాకరిస్తున్న నల్లదొరతనాన్ని ఆయన ధిక్కరించారు .
పాట మొదటి చరణంలోనే ధర్మన్న చతుర్వర్ణాల వాళ్ళెవ్వరూ వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించకుండా, వాటి నుంచి దూరమైపోయి,దళితుల్ని మాత్రం వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించడంవల్ల ఊరికి దూరం పెట్టారనే వాదనను ఎదిరించారు . ఇక అక్కడి నుంచి అనేక సాంఘీకార్ధిక రాజకీయసాంస్కృతిక వైఙ్ఞానిక మానవీయాంశలను ప్రస్తావించారు. చివరిలో తమ కోసం కృషి చేస్తున్న సంస్కర్తలను స్మరించారు. భారతదేశ చరిత్రలో దళితుల పాత్రను వర్ణించారు. చివరికి తాను కోరుకుంటున్న సమాజం ఎలాంటిదో చెప్పారు. చక్కని ప్రణాళికతో 56 చరణాలలో 80 ఏళ్ళ క్రితం ధర్మన్న రాసిన ఈ పాటకు మన సమాజంలో ఇంకా ప్రాసంగికత ఉంది. దళితుల జీవిత రూపంలో మార్పులు వస్తున్నా, సారంలో ఇంకా మార్పు రావలిసి ఉంది గనక దీనిని గురించి చర్చించుకోవాలి.
దళితుల శ్రమ లేకుండా ఆర్థిక ప్రగతినిసాధించలేని భారతీయ సమాజంలో వాళ్ళ శ్రమను దోచుకొని వాళ్ళను మనుషులుగా గుర్తించని దుర్మార్గాన్ని ధర్మన్న చాలా పాటలలో ఎత్తిచూపారు.
‘ పన్నెండు మాసాలు పాలేరు తనమున్న
పస్తు బడుచు బ్రతకాలండి…….
కనికారములేక కడుపు మాడ్చారండి”
“పాడిపంటలు మేము కూడబెట్టితేను
కూర్చుని తింటారువారు……
కూడు గుడ్డ కొంపలేకుండా కూల్చేరు”
అగ్రకులాల అవసరాలు దళితుల ద్వారాతీర్చుకుంటూ, అప్పుడు అస్పృశ్యత పాటించకుండా, అవసరం తీరగానే దానిని అమలు చేసే ద్వంద్వనీతిని కూడా ధర్మన్న ఎత్తి చూపారు.
“పొలంపనులూ చేసే తరుణాలలో
మమ్ములేలిన తప్పులేదంట…..
ఇంట్లో ధాన్యాలు పొయ్యొచ్చునంట
మాతో యేమి పనిలేనప్పుడు
యెడగాలుండాలంట”
దళితులు నడిచేనేలకు , దళితుల శరీరానికి అంటును పాటించే అగ్రకులాలు, వాళ్ళ శ్రమ , దాని ఉత్పత్తుల దగ్గర పాటించవు. ఈ స్వార్థాన్ని కూడా ధర్మన్న మూడు నాలుగు చరణాలలో ఆక్షేపించారు.
“మేము నిలిచిన చోట వారునిలవబోరు
భూమిని అంటేనంటారు…….
కాయగూరలు మేము కానుకలిస్తేను
కమ్మగా పుచ్చుకుంటారు….
పాలుపితికిస్తే పుచ్చుకుంటారు – దేవ
ముందుమాట మరచి మాలమాలంటారు
దళితుల శ్రమదోచుకుంటూ , వాళ్ళను మనుషులుగా గౌరవించని అమానవీయాంశాలను ఇట్లా ఎత్తిచూపారు ధర్మన్న .ఆయనది బలమైన దళిత స్వరం.
గుర్రం జాషువా చిన్నప్పుడు నాటకం చూడడానికి పోతే చూడనివ్వని అగ్రకుల దుర్మార్గం రికార్డయ్యే ఉంది. దళితులకు కూడా సాంస్కృతిక అవసరాలుంటాయనే ఙ్ఞానంలేని మనువాదులు వాళ్ళను నాటకాలకు కూడా రానీయని చరిత్రను ధర్మన్న ఎత్తి చూపించి వాళ్ళ నిరంకుశత్వాన్ని తూర్పార బట్టారు.
“” నలుగురితో పాటు నాటకములు మేము
చూడగబోతే రానీరు……..
వారిశాసనాలన్నీయూ – నాశనమైపోనూ
విద్య మనిషికి ఙ్ఞాన సంపాదనకు సాధనం , దానిని అత్యధిక సంఖ్యాకులైన శ్రామిక కులాలకు నిషేధించింది మనువాదం. పోనీ వాళ్ళైనా చదువువల్ల లభించవలసిన సంస్కారాన్నైనా సంపాదించారా అంటే అదీ లేదు. చదువున్నా సంస్కారంలేని వాళ్ళగానే మిగిలిపోయారు ఈ కఠోర వాస్తవాన్ని ధర్మన్న నిస్సంకోచంగా ఎత్తిచూపారు.
“అచ్చరాలు నేర్వ ముచ్చటున్నగాని
చదువుబడిలో జేరనీరు….
వేదాలంట మేము వినరాదంటబాబు”
“శాస్త్రాలు వేదాలు చదివీనట్టి
గొప్పశాస్త్రులమని చెప్పుతారు…….
సర్వజనులన్నదమ్ములంటారు
మమ్ముమాలమాలనుమాట- మామూలుదప్పారు”
శ్రామిక కులాలలోనే కటికవాళ్ళతో, ఎరుకలతో , యానాదులతో , చెంచు, లంబాడీలతో , చాకలి, మంగళ్ళతో సన్నిహితంగా ఉండే అగ్రకులాల వాళ్ళు, దళితులపట్ల నిర్లక్ష్యంగా ఉండటాన్ని ధర్మన్న “కటికవారికంటే కడు నీచులైతిమా! ” .” మాలమాదిగలంటే మండిపడిపోతారు” అని ప్రశ్నించి, అధిక్షేపించారు. అంతే కాదు , పరాయిపాలనకులైన తెల్లదొరలను రానిస్తారుగానీ, ” మా మాలలొస్తానంటే మండిపడి పోతారు ” అని సానులను, తెల్లవాళ్ళను దేవాలయాలలోకి రానిస్తూ, హిందువులైన దళితులను రానివ్వకపోవడంలోని న్యాయాన్ని ఆయన నిలదీశారు.
హిందూమతంలో అణచివేయబడ్డవారిని క్రైస్తవులుగా మార్పించి, వాళ్ళకు విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు కల్పించి సామాజిక గౌరవం కల్పించే ప్రక్రియ బ్రిటిష్ పాలన రావడంతోనే మొదలయ్యింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఆరు దశాబ్ధాలైనా క్రైస్తవీకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఈ విషయంలో దౌర్జన్యాలు, హత్యలు కూడా జరుగుతున్నాయి. హిందువులు మతం మారవలసిన అవసరం లేని పరిస్థితులు కల్పించకుండా, అగ్రకుల అహంకారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే, మతమార్పిడులను వ్యతిరేకించడంవల్ల ఉపయోగం లేదు.అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదూ ఈ తత్వాన్ని ధర్మన్న ఆనాడే ప్రశ్నించారు.
“అమెరికా దొరలు మమ్మాదరించుటజూచి
వారిలోజేరొద్దంటారు
ఒరులు దయతో జూచితె యోర్వలేరు
ఒంటినిండా గుడ్డెందుకంటారు”
ఇలా ఇరవయ్యె శతాబ్దం ప్రారంభం నాటి భారతీయ సమాజ సంక్షోభాన్ని అనేక కోణాల నుంచి విశ్లేషించి విమర్శించిన కుసుమ ధర్మన్న భారత దేశ చరిత్రలో దళితుల పాత్రను శ్లాఘించారు.
” మా వంశమున బుట్టి మహిమగాంచినయట్టి
మానవులను గానరేల”
అంటూ వ్యాస,వాల్మీకులను, శుక,పరాశరులను, కుయవుడు,కన్నమనీడు ,తిరుప్పాణాళ్వారు, ఆరంజ్యోతి, శబరి, మాతంగి, సత్యవతి, కాళిదాసు వంటి పురాణ,చారిత్రక వ్యక్తులను స్మరించుకొని భారతీయ సంస్కృతి చరిత్ర నిర్మాణం నేపథ్యాన్ని వర్ణించారు. వీళ్ళందర్నీ పేర్కొని ” లోకమెందుజూచిన సందు లేక యుంటిమి దేవ ” అని సంబరపడ్డారు. ఈ సమయంలోనే ధర్మన్న ఆర్యసిద్ధాంత చర్య చేసి, మూల వాసుల సిద్ధాంతం తీసుకొచ్చి తమ దేశంలోనె తాము పరాయీకరింపబడ్డ వాస్తవాన్ని ప్రకటించారు.
సీతకొరకై రామభూపాలుడు
దిక్కుగానక తిరిగీననాడు
అతని దిక్కైనిలిచిన వారెవ్వరు
సీతజాడతెచ్చిన వాడెవ్వడు
రావణుని జంపమూలమెవ్వరు
రాము దుఃఖముబాపినదీ మావారు
దీనులకెల్ల దిక్కు మావారు
మాయాధులైవచ్చి
మమ్మణగద్రొక్కితిరి నేటికిమీరు”
ఆ తర్వాత ధర్మన్న దళితోద్ధరణకోసం ఆధునిక కాలంలో కృషి చేసిన వాళ్ళందరినీ స్మరించారు. రావిచెట్టు రంగారావు, హీరాబాయమ్మ, చిలకమర్తి, కందుకూరి, మంగిపూడి, మునగాలరాజు, భాగ్యరెడ్డి వర్మ , మాడపాటి హనుమంతరావు ,పిఠాపురం రాజు మొదలైన వాళ్ళు స్మరణీయులలో ఉన్నారు.
చివరికి ఆయన కోరుకున్నదేమిటంటే హిందూసమాజంలో దళితులకు స్వతంత్రం వచ్చేదాకా అప్పటి ప్రభుత్వమే కొనసాగాలని . ప్రభుత్వం దళితులకు భూములు ఇస్తున్నది, చదువు చెప్పిస్తున్నది. స్వేచ్చ ఇస్తున్నది. దళితులు బాగోగులు చూస్తున్నది. వాళ్ళను గౌరవిస్తున్నది అని సంతృప్తిని వ్యక్తం చేసారు. భారతీయ సమాజం స్వతంత్రంగల ఆధునిక సమాజమైనప్పుడు పరాయిపాలన నుండి విముక్తి కోరవచ్చని ఆయన అభిప్రాయం. ఆంగ్లేయులను ఏ కారణం చేతనైనా పొగిడిన వాళ్ళు దేశభక్తులు కాదనేటట్టయితే, కుసుమ ధర్మన్న దేశభక్తుడు కాకుండా పోవాలి. కాని ఆయన గొప్ప దేశభక్త కవి. ఆయన కోరుకున్న స్వతంత్ర భారతదేశం ఇప్పడిప్పుడే రూపొందుతున్నది. ఆయనకు జోహార్లు.
.
ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు
October 15th, 2009 at 7:55 am
నేను గరిమెళ్ళ సాహిత్యం మీద ఎమ్ ఫిల్ చేశాను. నా పరిశీలనలో “నాకొద్దీ తెల్లదొరతనము” అనే పాట కాలరీత్యా చాలాముందు వ్రాయబడింది. అది విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చాక దానికి పేరడీగా “మాకొద్దీ నల్లదొరతనము” వ్రాయబడింది.