నరేన్ … నరేన్….

- మునికిష్ణ

అది 1990ల ప్రాంతం. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాలనుంచి పలమనేరు బంగారుపాళ్యం మండలాలలోకి ఏనుగులు చొచ్చుకొని వచ్చి అటవీ ప్రాంతపు పొలాలపై దాడులు చేయసాగింది.ఈ సమస్య పై అన్ని దిన పత్రికలు వార్తలు ప్రచురించాయి.ఏనుగుల సమస్యపై అప్పటికీ మా చిత్తూరు జిల్లా పౌరహక్కుల సంఘం యూనిట్ ఏనుగుల రాజ్యం అనే చిన్న పుస్తకాన్ని ప్రచురించి వుంది.

నేను, అప్పటి APCLC  కన్వీనర్ ప్రభాకర్, నరేన్ లు ఏనుగుల దాడిపై సర్వే చేసి రైతుల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి రిపోర్టులు తయారు చేయడానికి పలమనేరులో దిగి మండిపేట కోటూరూ వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మూడు రోజుల పాటు రెండు మండలాల్లో అటవీ ప్రాంత గ్రామాల్ని నడుచుకుంటూ సర్వే చేశాం.

నెత్తిన మిట మిట ఎండ. తమిళనాడు బోర్డరులోని మండిపేట కోటూరు దగ్గర గుట్టల్లో నడుస్తున్నాం. తెల్లటి ముతక ఖద్దరు పంచె జుబ్బా చంకలో సంచి, సంచి నిండా కాగితాలు. సాంపిల్ కి కూడా వెంట్రుకలు లేని బట్టతలపై టవలు కప్పుకొని నరేన్. ఎండ కాల్చేస్తావుంది. నరేన్ తుండుతో ముఖం తుడుచుకున్నాడు.

పిచ్చిగడ్డం గుంతకండ్లు బుడబుక్కల ప్యాంటుతో ప్రభాకర్ . పడతాలేస్తా నడస్తా నేను.

నేను తమాషాగా పంచె బట్టతల తోనే పుట్టినట్లు వుండావు. నిన్నుపోయి మేడం ఎట్లా ప్రేమించింది గురూ అన్నా.

ఆయన ఆవు కన్నుల్ని టకటకలాడిస్తూ గట్టిగా నవ్వుతూ నెత్తిమీద గంపని చూపించినట్లు చేతులతో చూపించి అంత వెంట్రుకలు వుండేది బ్రదర్ మనకు అన్నాడు నరేన్.

ఏదైనా సాక్ష్యం గానీ వుందా అన్నా నేను.

రాత్రి నిద్రపోయి తెల్లారి కండ్లు తెరిచేసరికి మాయం అయిపోయిందా. యీదరగాలికి ఎగిరిపోయిందా వానకి తడిసి వూడి పోయిందా అన్నాడు ప్రభాకర్.

యూనివర్సీటీ రోజుల్లో అని…. తన వెంట్రుకల గురించి ఏదో చెప్పబోయాడు నరేన్.

మేడం మోసపోయినారు సార్

బట్టతల పెద్దాయన పక్కన వయసు మనిషి ఎట్లా నడిచేది సార్ ! పాపం అన్నాను నేను.

ఢీల్లీ యునివర్సిటిలో అప్పట్లో మనం హీరో బ్రదర్ అన్నాడు నరేన్. గమ్మున బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేసుకోకుండా ఏంది సార్ ఈ పంచె గోచి అని ఎగతాళి చేశాం.

మండిపేట కోటూరు దాటి గుట్టల్లో నడుస్తున్నాం.

ఒక బక్క రైతు బాట మీద మోపుతో ఎదురుగా వస్తున్నాడు.  ఆయనను ఏనుగుల దాడి గురించి విచారించినాము. అతను తల మీద మోపును   కిందకు పడేసి మమ్మల్ని పరిశీలనగా చూస్తూ ….

మనది గవర్నమెంట్ పేపరాపిసా అన్నాడు.

మేం పౌరహక్కుల సంఘం అని చెప్పాం.

ఆ రైతు ఓ …. మీరు పౌరసరఫరాల డిపార్టుమెంటా !  అన్నాడు.

ఈ రైతుకి మనం ఎవరమో ఎక్స్ ప్లెయిన్ చేయలేమని అనుకొని ఆఁ  అఁ అన్నాను నేను. నరేన్ మాత్రం తాము పౌరహక్కుల సంఘంలో పనిచేస్తున్నామని ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులపై వివరాలు సేకరించి అఫిడివిట్లు తీసుకొని కోర్టులో కేసులు వేస్తామని న్యాయమైన నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని అందుకు రైతులు కూడా ముందుకు వచ్చి కట్టుగా సంఘంగా ఏర్పడి  పోరాటాలుచేయాలని దానికి తమ మద్దతు వుటుందని అతనికి చెప్పాడు. ఆ రైతుకి ఒక్కసారిగా ఉత్సాహం తగ్గిపోయింది. రైతులు …. పోరాటాలు….. మేం యాడజేసేది సార్. మాకు ,మా పనులే సరిపోతావుండాయి. అయినా మావాళ్ళు ఒక్కరు వస్తే ఇంకోరు రారు సార్. మీరే పెద్ద పెద్ద జీతాలు తీస్కోనే వాళ్ళు ఈ సమస్యకి ఏదో ఒకటి గట్టిగా ఏర్పాటు చేయాలి అని అన్నాడు. నరేన్ తాము జీతాలు తీసుకొని చేసే ఉద్యోగులం కాదని మేం స్వచ్చందంగా సమస్యలు ఎదుర్కొంటున్న భాదితులకి అండగా వుండటానికి వచ్చామని తాను వెంకట్రామాపురంలో రైతునని నన్ను చూపి ఇతను ట్రెజరీ డిపార్టుమెంటు ఉద్యోగి అని చెప్పి , ప్రభాకర్ ను చూపించి ఇతను మదనపల్లి స్పిన్నింగ్ మిల్లు కార్మికనాయకుడని చెప్పి మేం అంతా కూడా భాదితుల తరుపున అండగా ఉండటానికి వచ్చామని నిదానంగా వివరించాడు.అతనికి కొద్దిగా ఏదో అర్థం అయ్యింది.అతను మోపును అక్కడనే వదిలి మమ్మల్ని తీసుకొని చేలమీద ఫర్లాంగు దూరం గుట్టల్లోకి తీసుకొని పోయాడు.

చుట్టు కొండలు మధ్యలో ఒక రెండు వందల ఎకరాల చదరమైన భూమి మల్బరీ, వరి, చెరకు, సాగు చేస్తున్నారు. పచ్చగా వుంది. అతను తన చెరకు తోటను చూపించాడు. ఏనుగుల గుంపు ఒక పక్కంతా తొక్కేసి నాశనం చేసేసి వెళ్ళిపోయి వుంది.

మొన్న బుధవారం రాత్రి సార్ ఆ గుట్ట మీద నుంచి యానిగలు దిగడం చూసి నేను నాకొడుకు డప్పులు కొడుతూ టపాసులు కాల్చినాం. అయినా యానిగలు భయపడకుండా తోపు దగ్గరకు వస్తావుండటం తో పరిగెత్తేసినాం సార్ అని చెప్పుకొచ్చాడు. అతను వున్నట్లుండి మీరు అన్నలకి చెప్పి ఏదోఒక దారి చేయాలి సార్. ఈ యానిగల ప్రాబ్లం వొగిటే కాదు సార్ ఈ వార చాలామంది దొంగనాకొడుకులు వున్నారు వాళ్ళని దార్లొ పెట్టాల. రైతులంతా భాదలు పడతా వుండారు సార్ అన్నాడు.

అన్నల తరపున వచ్చిన వాళ్ళంగా అతను అనుకుంటున్నాడు. పేపర్ల జ్ఞానం కిందవరకూ దిగేసింది. నాకు ఏం మట్లాడాలో తెలియలేదు.

నరేన్ మాత్రం తాము నక్సలైట్లు కాదని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా రైతులే కలిసి పోరాటాలు చేయాలని సూచించాడు.

ఆ రైతు మొఖం చూస్తే అతను నమ్మినట్లు నాకనిపించలేదు. అన్నల్ని అన్నలు అంటే వొప్పుకుంటారా? అని అతను అనుకుంటున్నట్లు అనిపించింది.

ఆమాల్నే పలమనేరి MROఆఫీసు కాడికి పోయాం .RIవొచ్చి చూసి పోయినాడు. పేపరోల్లు ఫోటోలు తీసకపోయారు.ఫారెస్టువాళ్ళు వచ్చి చూసినారు. మీరు అడివి పక్కనోళ్లు చెరుకు పండిస్తే ఏనుగులు పడకుంటా వుంటాయా అని మమ్మల్నే దభాయించినారు.నేను కూడా ఫొటోలు తీయించినా. మా ఇంటికాడ వుంటాయి అని చెప్పుకొచ్చాడు.

పెద్ద బావి. చుట్టూ కొండలు. మెట్లుదిగి ముఖాలు కడుక్కొని కడుపునిండుగా నీళ్లు తాగి పైకొచ్చి వెనక్కు తిరిగినాము.

మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు. పోయిన వారం దిగవూరి మునెప్ప రెండకరాల చెరుకు పైరు నాశనం అయితే నలభైసార్లు తిప్పుకుని ఫారెస్టు వాళ్ళు నాలుగువందల చెక్కు చేతిలో పెట్టినారంట. మునెప్ప ఆ చెక్కు తీస్కోని బ్యాంకుకిపోతే ముందు నూరు రూపాయలు కట్టి అకౌంటు తెరువు దాని కోసరం ఆ కాయితం……. ఈ కాయితం……. తీస్కోని రాపో అని విసిగించేసినారంట.దాంతో మునెప్ప చెక్కుని ఫారెస్టు ఆఫీసు ముందు చించిపారేసి నేరుగా ఎలబారి వూరు చేరినాడంట. పేపర్లో కూడా ఈ విషయం వేసినారంట మీరు చూడలేదా అని అతను మమ్మల్ని అడిగాడు.

గెనాల మీద నడవలేక పడతాలేస్తా వుండాను. ఆపాటికే సగం ఫ్యాంటు బురదయ్యింది.

నలభైవేలు పైరు నాశనం అయితే నాలుగొందలా యిచ్చేది యిదేంన్యాయం సార్. దేముడుండాడా? పొగులు సేద్యం సాయింత్రాలు కరెంటు వుంటుందని నీళ్ళు కట్టడానికి బావుల దగ్గర పడిగాపులు, రాత్రిళ్లు యానిగల్ని తరమడానికి ఈపొలాల దగ్గిరే కావిలి. యిక్కడనే మాబతుకులు చెల్లిపోతావుండాయి.

ఏం కర్మాలు చేసినాం అని మాకు ఈ కర్మసార్. యిట్లా జరగతావుంటే ఈపక్క వూళ్లలో ఒక్కడు మిగలడు సార్. నేను కూడా ఈ సేద్యం ఎగ్గట్టేసి బెంగుళూరుకి పోదామని చూస్తావుండాను అంటూ చెప్పుకొచ్చాడు. పెద్దగా శ్వాస తీసుకొని రైతులకి ఏమైనా చేస్తే మీలాంటోల్లే ఏదైనా చేయాలి సార్ అన్నాడు.

నిశ్శబ్దంగా ఆయన మాటల్ని వింటూ ఆయన వెనకాల నడుస్తూ ఇరవై గడపల ఆవూర్లోకి చేరుకున్నాం.

అప్పటి పౌరహక్కుల సంఘం జిల్లాయూనిట్ లో నరేన్ తప్ప అందరం పిల్లగాళ్లం. మాలో ఎవ్వరికీ పౌరహక్కులన్నా, ప్రజాస్వామ్యం అన్నా, నమ్మకం గౌరవం,ప్రేమ ఏవీలేదు. అందరం పీపుల్స్ వార్ రాజకీయాలకు అభిమానులం. ఆపార్టికి ఉపయోగపడే ఏదైనా పనిలో వుండాలనే తాపత్రయం కొద్ది APCLCలో వుండేవాళ్లం. నరేన్ వొకడే గాంధేయవాది. పౌరహక్కుల సంఘం ప్రకటిత ఆశయాల్ని నమ్మే ధన్యజీవి.

యూనిట్ మీటింగుల్లో ఆయన మా దూకుడు మాటల్ని ప్రశ్నించగానే,లాంగ్ బెల్ కొట్టిన తరువాత స్కూలు పిల్లలు మాదిరిగా మూకుమ్మడిగా లేచి గోల చేసేవాళ్లం.

నీకేం స్వామి భూములు, బావులు వుండే భూస్వామివి. మీనాయన అసెంబ్లి సెక్రటరీ మీఅన్నదమ్ములు ఫుల్ సెటిల్. అట్లే మాట్లాడుతావు.ప్రజల కడగండ్ల నుంచి పుట్టే పోరాటాల్ని సమర్ధించడమే హక్కుల ఉద్యమం. భాద్యత అని గట్టి గట్టిగా ప్రజల భాదలు….ప్రజాపోరాటాలు అని పెద్ద పెద్ద మాటల్ని అలవోకగా ఆయన పైకి విసిరేవాళ్లం.

ఎల్లకాలం ప్రజల పక్షాన నిలబడాలంటే ఆవేశంతో,ఉడుకు రక్తంతో మాట్లాడటం కాదు. ప్రతీదాని సమగ్రంగా,సాకల్యంగా చుడాలి అని ఏదో చెప్పేవాడు. వొక్కమాటా వినేవాళ్లం కాదు.

ఆయన మామూలుగా ప్రతివొక్కరితో వీలయినంత వరకూ ప్రజాఉద్యమాల కోసం పనిచేయాలి అని అంటూ వుండేవాడు. అందువలన గట్టిగా నీదంతా వీలయినంత వరకూ చేసే పోరాటం…, నీదంతా భూస్వాముల లిబరల్ స్ట్రగుల్.. త్యాగాల ప్రజాపోరాటాల ఫంధా కాదు అని అనేవాళ్లం.

మా గోలకి నవ్వుతూ సమాధానాలు యిచ్చేవాడు నరేన్. మావరకు ప్రతీ సమస్యకి సాయుధపోరాటమే మార్గం.అరచేతుల్ని మొగ్గలాగ మడిచి నోట్లోకి గాలిని పీల్చి బూం….బూం అని గట్టిగా శబ్దం చేసే వాళ్లం. బూం….బూం అంటే ల్యాండ్ మైన్ పేల్చడం.

పీపుల్స్ వార్ ల్యాండ్ మైన్ పేల్చిన వార్తల్ని పేపర్లలో ఆసక్తి తో చదివే వాళ్లం.

“యిలా కాదు పెట్రోలు పోసిన ఇంజనుతో ఆలోచించాలి యిలా కాదు కోర్టు బల్ల విరిచి కవిత్వం రాయాలి”

సౌదా జైలు నుంచి ప్రేమలేఖ కవిత్వ పరవశంతో  వదిలే వాళ్ళం. రెడాక్సయిడ్ తో మెడికల్ కాలేజ్ గోడలపై వున్న ” మా మౌనం మౌనం కాదు గోడకి వేలాడే తుపాకి ” అనే నినాదాలు గుసగుసగా మా చెవులలో ఏదో చెప్పేది. చిత్తూరు జిల్లాలో ఐదు దళాలు పని చేస్తున్న సమయం అది. యూనివర్సిటీల నుంచి పీపుల్స్ వార్ కి  అంతో ఇంతో రిక్రూట్ మెంట్  - వున్న సమయం అది.

రాడికల్స్ తొందరలో దళాల నుంచి సైన్యంగా మారిపోయి దావానలం లాగ పెద్దదయిపోయి అసెంబ్లీని ముట్టడించి మంత్రుల్ని DGP  ని కాల్చిపారెసి ఎర్ర జెండాతో లాంగ్ మార్చ్ చేసేసి ఎర్రకోటపై ఎర్రనిజెండా ఎగిరే రోజు తొందర్లోనే వుందని నమ్మే వాళ్ళం.

కలల వ్యాపారులు రెండవరాకను తమ ఉనికి కోసం ప్రచారం చేస్తూనే వుంటారు. యువకులు పడుతూనే ఉంటారు. ఈ చాపల్యాలు ప్రస్తుతం మన ఆంధ్ర సరిహద్దుల కావల షికార్లు చేస్తున్నది.

నరేన్ వాదనలకి సమాధానం చెప్పలేనప్పుడు అసహనంతో, సుమంతోబెనర్జీ- గాంధీని విమర్శిస్తూ రాసిన చెత్త పుస్తకంలోని చిలకపలుకులతో గాంధీని వాడు వీడు అని మొదలు పెట్టి గాంధీ బ్రిటీష్ వారి ఏజెంటు, బిర్లాల తొత్తు అని చెడ తిడతా తిరిగే వాళ్ళం.

కాలం అన్నింటికి సమాధానం చెప్పింది. వామనుడు త్రివిక్రముడి రూపం చూపాడు. నరేన్ ఒక్కడే చివరి శ్వాసవరకు పోరాటాలు చేసుకుంటూ షో ఆఫ్ లు లేకుండా జీవితాంతం నాయకత్వపు కుర్చి ఎక్కకుండా కార్యకర్తగా బతికాడు.

వ్యాసాలు అర్జీలు రాసేవాడు వోపిగ్గా భాదితుల్ని కలుపుకొని ధర్నాలు పోరాటాలు నిర్వహించాడు. కలెక్టర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేవాడు. తన స్వంత బంధువులకి వ్యతిరేకంగా దళితుల పక్షాన నమ్మకంగా నిలబడి దళితుల DKT  భూముల్ని కమ్మవారి వద్దనుంచి విడిపించాడు.

పత్రికల భాషలో చెప్పాలంటే మడమతిప్పని మరో యోధుడు నరేన్ .

ఆ మహాతల్లి నరేన్ సహచరి ఉమాశంకరి ఇంగ్లీషులో అరిచి అరిచి తిట్టేది. వొళ్ళు చూసుకో … కనీసం టార్చిలైట్  కూడా లేకుండా కొమ్మిరెడ్డిగారి పల్లె నుంచి అపరాత్రులు చీకట్లో నడిచిరావద్దు అని, ఇంగ్లీషులో మొత్తుకున్నా తెలుగులో అరిచినా ఆయన నవ్వుతూ చెప్పిందే చెప్పొద్దు ఏదైనా కొత్త పాయింట్ చెప్పు అని తన దారిలో తానుండే వాడు. ఆమె చెప్పే వొక్కముక్కయినా వింటే కదా కొత్త పాయింట్లతో విమర్శించడానికి?

మద్రాసులో పుట్టి ఢిల్లీలో డాక్టరేట్ చదువుకున్న తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఉమాశంకరి గార్ని తీసుకొనివచ్చి వెంకట్రామాపురంలో పడేసి ఆమె చేత సంగటి, వూరిబిండి చేయించాడు. మెత్తగా కనిపించే మొండోడు నరేన్.

ఆ వూర్లో ఏనుగుల భాదితులందరి దగ్గర అఫిడివిట్లు తీసుకున్నాం. ఏనుగుల గుంపు గురించి వాటి తెలివి గురించి తలా ఒక కథ చెప్పడం మొదలు పెట్టినారు. అవన్ని జానపద కధలు లాగా వున్నాయి.

నరేన్ అన్ని విషయాలు శ్రద్ధగా తన డైరీలో నోట్ చేసుకున్నాడు. మమ్మల్ని తీసుకొని వెల్తున్న రైతు ఆ గుట్ట మీద రెండు కాపరాలు వుండాయి వాళ్ళు ఏనుగుల సందిట్లోనే బతకతా వుండారు. వాళ్ళని కూడా కలుద్దాం అని అన్నాడు. సరే అని అతని వెనక బయలుదేరాము.

సాయంత్రం కాబోతుంది. టీ నీళ్ళు నోట్లో పడకపోవడం వలన నాకు చిరాగ్గా వుంది. గుట్టపైకి ఎక్కేసరికి మొరగతా కుక్క, వెనక వొక ఆడామె కుక్కని అదిలిస్తా చంకన బిడ్డతో కొత్తవాళ్ళు అయిన మమ్మల్ని బిక్కుబిక్కుమని చూస్తావుంది. రెండే రెండు చుట్టు గుడిసెలు.

మాతో వచ్చిన రైతు ఏమ్మా చిన్నబ్బ ఎక్కడికి పోయినాడు… లేడా ? అని అడిగాడు.

ఆమె ఆఁ నువ్వానా… ఎవురో అనుకున్నా… పాళ్యానికి పోయినాడు యింకొంచెపత్లో వస్తాడు అని గబగబా లోపలికి పోయి గుండు చెంబుతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

మాతో వచ్చినాయన సార్ వాళ్ళు పౌరహక్కుల డిపార్టుమెంటు నుంచి వచ్చినారు. యానుగుల మీద చర్యలు తీసుకుంటారు. చిన్నబ్బ వస్తే నన్నొచ్చి కలవమను అన్నాడు. సరేమ్మా…. మీ ఇంటాయన వచ్చినప్పుడు ఆయన్ని మళ్ళీ కల్సి మాట్లాడుతా. ఏనుగుల వలన ఏమేం నష్టాలు మీకు జరిగిందో చెప్పండి నోట్ చేసుకుంటాం అని నరేన్ అనునయంగా విచారించి వివరాలు నోట్ చేసుకుంటున్నాడు.

గుట్ట మీద నాలుగైదు ఎకరాల చేను, రెండు గుడిసెలు చుట్టుపక్కల తమిళనాడులోకి విస్తరించిన ఏనుగులగుంపు మట్టి గుట్టల్ని మేఘాల్ని చూస్తూ యిక్కడ దళం పెడితే కెమోప్లేజ్ కి సూపర్ గా వుంటుంది అన్నాడు ప్రభాకర్. అటు తమిళనాడుని ఇటు ఆంధ్రాగవర్నమెంట్లను వుఛ్చపోయించచ్చు అన్నానేను.

అప్పటికే పొద్దుపోయింది. గుట్ట దిగి ఆ రైతు ఇంట్లో పొంత నీళ్ళతో బచ్చలిలో స్నానం చేసి భోజనం చేసినాము. ఆయన తల తప్ప మిగతా వళ్ళంతా కండలు తిరిగి నల్లగా మిల మిల మెరుస్తూ వుండింది.

ఉదయం బంగారుపాళ్యం మండలం బాగివొనిపెంట, ఒట్టందిడ్డి గ్రామాలను చూసుకొని తరువాత మరుసటి రోజు పలమనేరుకు మరో వైపు గ్రామంలో రైతు కరెంటు వైరు పొలానికి చుట్టడం వలన ఏనుగు చనిపోయింది. ఆ ఏనుగు మృతిపై ఫారెస్టు డిపార్టుమెంటు వాళ్ళు రైతుపై కేసు పెట్టి అరెష్టు చేసి వున్నారు. దీని విచారణ కోసం వెళ్దాం అని అనుకున్నాం. రైతు తన పంటను కాపాడుకోవడం కోసరం కరెంటు వైరు చుట్టడం మాకు ఏ మాత్రం తప్పని తోచలేదు. ఆయన మాత్రం రైతు చేసింది తప్పు LIVE AND LET LIVE బ్రదర్ అన్నాడు. మాకు కోపం వచ్చింది. మనం మానవ హక్కుల కోసం వున్నామా? ఏనుగుల తరపున వాదించడానికి వున్నామా? నువ్వు ఏనుగు ఛస్తే ఫీలవుతున్నావు రేపు దోమల్ని మస్కిటో కాయిల్ పెట్టి చంపొద్దు అని ఉద్యమాలు తీయగలవు అని ఎగతాళి చేసాం.

నరేన్ శాఖాహారి. దాని మీద కూడా జోక్ లు వేశాం. ఆయన చూడు బ్రదర్ నువ్వు కోడిని నీ చేత్తో చంపగలిగి కోసి వండుకోగలిగితే నువ్వు ఇంట్లో చేసిన కోడి పలావు తినడానికి అర్హుడవి అనేవాడు.

ఆ వాదన మైండ్ బ్లోయింగ్ గా వుండేది.

ఇంకోసారి విష్ణుప్రియ, తిరుపతి- కపిలతీర్థం ….. నీళ్ళంతా యింటిముందే పారి వృధాగా ఏట్లో కలిసిపోతోంది దానికి ఒక ప్రాజెక్టు కట్టొచ్చు కదా అని అనగానే వాన పడేది మనుషులు వాడుకోవడానికి మాత్రమే అనుకోవద్దు. వాన నీళ్ళు ఏట్లో కలవాలి ఏరు సముద్రంలో కలవాలి మన అవసరాల మేరకు ప్రాజెక్టులు కట్టుకోవాలి. ప్రకృతిలో చెయిన్ వుంటుంది దానిని డిస్టర్బ్ చేయకూడదు. మనిషి ప్రకృతిలో భాగం మనిషే ప్రకృతి కాదు అన్నాడు.

ఆయన చాలా  బ్యాడ్ ఉపన్యాసకుడు. ఆయన రాసిన వ్యాసాలలో గొప్ప అబ్సర్వేషన్స్ వున్నా ఎటువంటి షో ఆఫ్ వుండదు. ఎన్ కౌంటర్ల మీద లాకెప్ డెత్ ల మీద పర్యావరణ సమస్యల మీద అన్నిటి పైనా తన స్వంత ముద్రతో ఆలోచించే వాడు. మొదట పౌరహక్కుల ఉద్యమం ఆయనను – పరిహాసంగా తీసుకొని తరువాత అనుసరించి ఎదిగింది. ఇప్పుడు ఆయన భావాలన్నీ ఆమోదయోగ్యాలే.

పెనుమూరు మండలంలో RMS గుర్రప్పగారి అన్యాక్రాంతమైన భూముల్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళాం. భూముల్ని ఆక్రమించుకున్న రైతు కుటుంబానికి చెందిన ఆడవాళ్ళు గుట్టగా కంకరరాళ్ళు పోసుకొని చేలనుంచి రాళ్ళతో మా మీద దాడి చేసారు. మేం అంతా ఆ రాళ్ళ వర్షానికి భయపడి వెనక్కు పరిగెత్తాం. నరేన్ ఆ వర్షంలో వాళ్ళతో మాట్లాడటానికి అట్లే ముందుకుపోయాడు. అదృష్టవశాత్తు ఆయనకు ఏ రాయి తగలలేదు. ఆక్షణంలొ నాకు ఆయన భయాన్ని జయించలేదు ఆయనకు భయం అంటే ఏందో తెలీదు అని అనిపించింది.

సరళమైన మాట సరళమైన ఆలోచన వెనక ఆయన క్రూరమైన ప్రాక్టికల్ గా వుండేవాడు. ఆయన ఏ వ్యక్తి గురించి ఏం చెప్పినా ఎప్పుడూ గురి తప్పేది కాదు. ఒక్కోసారి మన మనసులలో ఏం జరుగుతుందో అట్లే వివరించి చెప్పేవాడు. తన గొప్ప స్కాలర్లినెస్ ను వెనక్కు పారేసి సింపుల్ మేన్ గా వుండటానికి జీవితాంతం కష్టపడ్డాడు. అవమానాలు పడకుండా అవమానించకుండా దర్జాగా బతికాడు.

మరుసటి రోజు ఉదయం బయలుదేరి గుడియాత్తం రోడ్ మీద వున్న ఫారెస్టు చెక్ పోస్టు దగ్గర టీ నీళ్ళు గొంతులో పోసుకున్నాం. ఎదురుగా నల్లగా బాగా వయసులో వున్న వొక అమ్మాయి తన కూతుర్ని నడిపించుకుంటూ కొడుకుని చంకలో వేసుకొని మీద బ్యాగుతో రోడ్డు మీద వస్తోంది.

ఆ అమ్మాయి ఒక రకమైన వయలెంటు నాటు సౌందర్యం కనిపించింది. ఎంత అందంగా వుంది గురు అన్నా.

ఆయన పకపక నవ్వ్వుతూ తన యూనివర్సిటీ రోజుల నాటి హిందీ పద్యం గుర్తుకు తెచ్చుకొని

గుల్ గయి గుల్షన్ గయి

గుల్కి పత్తే పత్తేబి నిఖల్ గయి

అరే చోడో వో బాల్ బచ్చొకి వాలి బాత్ అని రాగ యుక్తంగా పాడాడు.

గురు , బాసు, నరేన్, తాతా అని ఏ పేరు తో పిలిచినా పలికేవాడు. ఆయతో మాట్లాడకూడని విషయాలనేవి ఏవీ వుండేవి కావు. ప్రతి సంవత్సరం తన తోటలో పండిన మామిడి పండ్లను రాష్ట్రవ్యాపితంగా వున్న మిత్రులకు శ్రద్ధగా ప్యాక్ చేసి అందజేసేవాడు . ఏమిటి ఈ మామిడి పండ్ల దౌత్యం వెనక వున్న కుట్ర అని తమాషా చేసే వాళ్ళం.

వెంకట్రామాపురానికి వెళ్ళగానే ఉమాశంకరి మేడంగారు ఏదో వొక ఫలహారం పెట్టేవాళ్ళు అయినా ఈ లోపునే నాలుగుసార్లు ఆమెను హెచ్చరించేవాడు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులో వుండేటప్పుడు కూడా చూడటానికి వెళ్లిన వారికోసం కిరణ్ … కిరణ్… అని అల్లుడ్ని అరిచి అరిచి పిలిచి ఏదో ఒకటి తీసుకురా అని పురమాయించేవాడు. ఆ అతిధి మర్యాదలు చాదస్తం స్థాయిలో వుండేది.

మా ఉమకి రెండు సార్లు రక్తం యిచ్చాడు నాకు పూర్తిగా అండగా నిలబడ్డాడు. నాకనే కాదు ఎవ్వరికైనా ఏదైనా చేయడానికి తహ తహలాడిపోయేవాడు. ఆయన జీవితాంతం యిస్తూ ఉండటంలోనే మజాని ఎంజాయ్ చేసేవాడు.

బట్టందిడ్డి, రాగిమానిపెంట గ్రామాల్లో ఏనుగుల భాదిత రైతులని కలిసి అక్కదినుండీ పలమనేరుకు మరో వైపు గ్రామాల్ని సందర్శించి రిపోర్టులు తయారుచేసుకొని మూడవరోజు చిత్తూరు చేరుకున్నాం. జిల్లా కలెక్టరు, జిల్ల ఫారెస్టు అధికార్లను కలిసి పూర్తి రిపోర్టులను ఇచ్చి ఈ ఏనుగుల సమస్య నివారణకు అనేక సూచనలు ఇచ్చాము. తరువాత మొత్తం పాదయాత్ర రిపోర్టులపై విలేకర్ల సమావేశం నిర్వహించాము.

నరేన్ తో కలిసి లాకప్ డెత్, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సభలు, అంటరానితనానికి వ్యతిరేకంగా పాదయాత్రలు సారాయి వ్యతిరేక పోరాటాలలో, స్వదేశీ సభల్లో పాల్గోన్నా ఎప్పుడూ పూర్తి అనూహ్యమైన ఆశావాదంతో మానవుల మంచిపైన నమ్మకంతో వుండే వాడు. ఆయనకు దేనిపైనా కంప్లయింట్లు లేవు. ఖద్దరు పంచ బ్యాగు తువ్వాలు లో జిల్లా అంతటా తిరుగుతూ ప్రజా ఉద్యమాలకు అండగా వుండే నరేన్ ఇకలేరు. భోరుమని ఏడవకపోవడం వలన యింకా గుబులు గుబులుగానే వుంది.

2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సంస్మరణ

2 Responses to “నరేన్ … నరేన్….”

  1. 1
    A.K.Prabhakar Says:

    మునికృష్ణ్ గారు,
    నరేన్ మీద ఎలిజీ చాలా బావుంది. నరేన్ లోని సింప్లిసిటీనే రచనలోకి ఎక్కింది.
    నిశ్శబ్ద ల్యాండ్ మైన్ నరెన్ కి జోహార్లు.
    ఎ.కె.ప్రభాకర్

  2. 2
    A.K.Prabhakar Says:

    మునికృష్ణ్ గారు,
    నరేన్ మీద ఎలిజీ చాలా బావుంది. నరేన్ లోని సింప్లిసిటీనే రచనలోకి ఎక్కింది.
    నిశ్శబ్ద ల్యాండ్ మైన్ నరేన్ కి జోహార్లు.
    ఎ.కె.ప్రభాకర్

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో