Oct2009
ప్రజల పక్షాన ప్రతిఙ్ఞ
“Truely Marks was a magician, a hyponotiser, who has been casting his magic spell on human generations one after the other. One may praise Marxism,One may condemn it, but non can neglect it altogether”_ అన్నాడొక రచయిత. ఇంచు మించు ఇవేమాటలు మన శ్రీశ్రీ కి కూడా వర్తిస్తాయి. శ్రీశ్రీ వ్యక్తిగత విషయాలు కొన్నింటిని ప్రస్తావించి ఎవరైనా అభ్యంతరాలను చూపవచ్చుకాని ఈతని కవితాతత్వాన్ని,రీతిని గురించి అధ్యనం చేయకుండా ఎవరూ ఉండలేరు.
శ్రీశ్రీ అంటేనే జనకవి. అశేష జనావళికి విశేషమైన మేలొనరించే కాలం ఒనగూడాలని కాంక్షించిన కవి. నిఖిల లోకం సుఖించాలని కలగన్నకవి. ఆర్తుల,పేదవర్గాల వారల ఆకాంక్షలు ఫలించాలని పదే పదే ప్రకటించిన కవి. వారికని ఒక కొత్త సృజనాలోకాన్ని సకలవిధ బంధనాలను, ప్రతిబంధకాలను ఛేదించే, త్యజించే ప్రజాలోకాన్ని ప్రతిష్టించబూనిన కవి. సామాన్యునిచేతికందిన అప్రతిహతమైన కవి కుట్రలను విప్పి, కూటకాలను తిప్పికొట్టగా క్రూర వ్యాపార సంస్కృతిని కాదని, బలమైన విలువల కేంద్రాన్ని తెరిపించగా బూనిన అరుదైన తాళపు చెవి, సమతా కవి శ్రీశ్రీ.
ఈయుగాలు, ఆ యాగాలూ, ఈ కాలాలు, ఆ కూనిరాగాలు అని శ్రీశ్రీ కి పట్టింపులుండవు కనుకనే స్వచ్చమైన జీవితాలనిచ్చే స్వేచ్చను సమకూర్చగల సమాజాన్నే కోరాడు. తతోవ్యతిరేకమైన దాని మీద కసిగా నిప్పును రాజేశాడు. ఈ క్రమంలో , ప్రాంతాలూ, దేశాలు కడచి ఒక ఆరోగ్యకరమైన అంతర్జాతీయ క్షేత్రంలోకి అడుగిడుతూ, విసురుగా కవితగానం చేసేందుకు సిద్ధపడ్డాడు. పనికి మాలినవై పక్కగా కాలం చెల్లిపోయిన ముతక భావాలు , కృతకమైన రీతులకవకాశమిచ్చే పాతను నిరసించాడు. తూర్పారబట్టాడు.వ్యక్తీకరణకు సంబంధించిన కొత్త పరికరాలను సమకూర్చి, సర్వకాలాలలోనూ సమధికోత్సాహంతో ముందుండే విధంగా ప్రోత్సాహకరమైన భావాలనే ప్రోది చేసాడు. ఛందస్పర్స విషభుజాంగాలను తెగటార్చి విక్రమించాడు. పాతకవి సమయాలకు , పాతపైన కొన్ని ప్రతీకలకు తావిచ్చినప్పటికీ, వాటిని సరికొత్త సంబాంధాలకు, సందర్భాలకు అన్వయిస్తూ ముందుకుకురికాడు.
1930 ల తరువాత శ్రీశ్రీ ముద్రలేని సాహిత్య క్షేత్ర మీద అగుపించని స్థితి కలిగింది. అంతదాకా ” శబ్ద సౌందర్యంతో తృప్తి పడి, సంతోషించవలసిన ” స్థితి మాత్రమే వుండేది. ” అర్థం వెతకడం అవివేకం” అనిపించేది. అటువంటప్పుడూ “దిక్కుల్ని, దేవుల్ని అధికారుల్ని , వూగించి , ప్రశ్నించే పని చేసాడు. నెత్తురూ , కన్నీళ్ళూ తడిపి కొత్త Tonic తయారు చేసాడు శ్రీశ్రీ”. ఏదిరాసినా, మాట్లాడినా అది పునఃఉటంకించేమాటా, పద బంధం , పద్యం , పద్యపాదం అయికూర్చున్నది. పత్రికలు , మాద్యమాలు ఏవీ కూడా శ్రీశ్రీ పదాలను , పదబంధాలను కవితోక్తులను, శీర్షికలతో సహ రచనల్లో ఉపయోగించకుండా వుండలేకపోయారు. (పెట్టుబడికి. కట్టుకథలకి పుట్టిన విషపత్రిక వంటి విమర్శలతో సహ) . అందుకే ” అక్షర లక్షాధికారి, మాటలకోటీశ్వరుడు శ్రీశ్రీ ” అని ఆరుద్ర అనడం అత్యంత సహజమైన విషయం. అతనికి యోగ్యతా పత్రమిచ్చిన చలంగారే అభిప్రాయ పడ్డట్టు, అతనివి మాటలేకాదు ఈటెలూ , కత్తులూ, మంటలూ అయి ఎగిశాయి. ఇంకో కవి మాటల్లో చెప్పుకోవాలంటే–
“తెలుగువాడి పలుకు వాడి’
తెలిసిన వాడి నోడివి
తెలుగువాడి తీవ్రనాడి
తెలిసిన మొనగాడివి”
అని అంగీకరించాలి శ్రీశ్రీ గురించి.
శ్రీశ్రీది అనేకానేకులయిన కవులపెట్టు అధ్యయన సామర్థ్యం. ఆబగా చదివి నాడతడు, ప్రపంచ శ్రేష్టతరమైన సాహిత్యాన్ని ఔపోసన పట్టినాడు . కనుకనే అన్ని భిన్నమైన భాషల సంపర్కాన్నెరిగినాడు. ఎడ్గర్ని, ఎమిలినీ, స్విన్ బర్న్ నీ, మొపాసానీ, మయకోవిస్కీనీ, జేమ్స్ జాయిస్ నీ, సార్త్ నీ , ఫ్రాయిడ్ నీ కవులు రచయితనేమిటి – సాల్వడార్ ని పికాసో వంటి చిత్రకారుల ప్రయోగాలనూ డాడా, సర్రియలిజం వంటి వాటి నిజాలనూ , లోతులనూ నిగ్గుతేల్చుకొని చూశాడు.ఇష్టమైన వాటిని అనుకరించాడు కూడా. అంతేనిక్కచ్చిగా అవాంఛిత పోకడలను నిరసిస్తూ వచ్చాడు. సమత గెలుపు కోసం, కవిత విలువలకోసమేనన్నట్టుగా ఎన్నోదేశాల్ని తిరిగి వచ్చాడు.ప్రపంచదేశాల రచనల సారాన్ని గ్రహించాడు. యధేచ్చగా అనువాదాలు చేశాడు. లక్షోపలక్షల అనుభవాలను కలవరించి – పలవరించాడు. ఉన్మాదియై తిరుగాడాడు – ఒకామాటలో, అంతర్జాతీయ కవుల సరసన నిలిచి యుగాలదాకా సరిపడే ఙ్ఞానాన్ని అందిస్తూ , తనకూ కాలానికి మధ్య నొక అమోఘమైన సంభాషణను కొనసాగిస్తూ వచ్చాడు.
ఇక మనదేశం, మన ప్రాంతాల మాటకొస్తే. సమకాలీన స్థితిగతుల అంచనాకడుతూనే తెలుగు వాతావరణాన్ని ఆమూలాగ్రం ఆకళింపు జేసుకున్నాడు శ్రీ శ్రీ. లక్ష్యనిర్దేశం ఏదికాగలదో బేరీజు వేసుకుంటూ, ఆగక – తన కర్తవ్యపాలనకు పూనుకున్నాడు. ప్రారంభం దగ్గర ప్రాంరంభించడమే సబబనుకున్నాడు. నాటి తిక్కన , వేమనల తరవాత “అడుగుజాడ గురజాడ ఆదిభావికి బాట” అనితీర్మానించుకున్నాడు. ఉత్తిష్ట అనుకుంటూ యిక విక్రయించాడు. సాహిత్యపుటంచులను తాకాడు. కావ్యసుగతి పైకెత్తాడు.
అనేక ప్రక్రియలుగా శ్రీశ్రీ రచన సాగింది. ప్రారంభంతోనే అది ‘మహా ప్రస్థానం’ అయ్యింది. ఒక జయభేరి మోగింది. దేశ చరిత్రలను , వాటి అంతస్సారాలను బేరీజు వేసింది. మహా హంతకులైన ఒక్కొక్కరి జాడను వెదికింది. ” రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదని” తేల్చి చెబుతూ, ఆట్టి క్రూర అహంకారపు యుద్ధాల పర్యవసానాలనూ ఏకరువు పెట్టింది.” గతమంతా తడిచి రక్తమున, కాకుంటే కన్నీళ్ళలో ” అని నిరూపించింది. మానవుడే మన సందేశం కావాలని చాటుతూ , మానవమూర్తిమత్వాన్ని చిత్రిస్తూ , మనిషి ఉత్తాన పతనాలను పొడకట్టించింది. అన్నింటికన్నా మిక్కిలి – ప్రజలపక్షాన ప్రతిఙ్ఞ చేసింది.
చరిత్రలో, దేశ దేశాలలొ ఎంతో మంది కవులు. ఎన్నెన్నో గొప్పరచనలు చేసారు. మానవుని జయాలను , భయాలను – కీర్తించారు , కినిశారు. మనిషి అభ్యున్నతికి పాటు పడే రచనలు చేశారు. శ్రామికుల అంతిమ విజయానికని రాశారు, ఎలుగెత్తి చాటారు. పాబ్లో నెరుడా, దాస్తోవెస్కీ, వంటి మహామహులెందరో ! మనదేశంలో నజ్రుల్ ఇస్లాం, హరీన్ చట్టో , ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఆలీ సర్దార్ జాఫ్రీ, ఎందరెందరో_మఖ్ఖూంతో కలుపుకుని! కానీ, ఎవ్వరు కూడా, కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు.ప్రజల పక్షాన,కర్షకుల పక్షాన, శ్రామిక లోకం అందరి పక్షాన, ఆ విధంగా , అంత గొప్పగా అంతటి అనుభూతిమయంగా,ఆర్ద్రంగా,ఆవేశంగాప్రతిఙ్ఞ చేయలేదు. శ్రీశ్రీ ఒక్కడే ఆ పని చేయగలిగాడు. అదీ అతని సామర్ధ్యం. అతని సౌహర్థం . అదీ అతని అనుకంపన . అదీ అతని సానుతాపం. అందుకే అతడు ఒరవడి కాడు, ప్రధముడు.అంతదాకా ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగని ప్రతిఙ్ఞ అది. కర్షకులు , కార్మికుల కర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు లేడు పొమ్మంది. ప్రగతికాముకుల మనుకునే కవుల లోకం ముందు ఒక ప్రణాళికను సిధ్ధం చేసి పెట్టింది. “శ్రమైక జీవుల సౌందర్యానికి సమానమైనది లేదనే నూతన ఈస్తటిక్శ్ను బోధనాంశంగా చూసింది. ఆ తరువాత ” పతితులార, భ్రష్టులారా – బాధా సర్పదష్టులార – దగా పడ్డ తమ్ములార నేనున్నా నేనున్నా ” నంటూ , అంతకూ మునుపు ఏ కవీ – యోధుడు యివ్వజాలనంతటిని భరోసాన్నింది. భవిష్యత్తు మీద నమ్మకాన్ని ప్రోదిచేసింది. అనేక రకాల – కన్నగల్ల బాధలననుభవించే వారు, కొనప్రాణంతో కనలేవారు – ఆయా పరిస్థితులకు లొంగక . వెనుదీయక సమ్మెట కట్టే వాళ్ళ పరిస్థితులను ప్రస్తావిస్తూ, వాటి బహిష్కారానికని ప్రోత్సాహ పరిచింది. పరిష్కరించితీరాలన్న స్పృహరగిలించింది. చోటు చేసుకోగల కవిత్వమనేది ” కార్మికలోకపు కళ్యాణానికి , శ్రామిక లోకపు సౌభాగ్యానికి ” దారి చూపాలనే ఉపాయాన్ని కనిపెట్టి చెప్పింది. ఆయా కవుల రచనలు ఫలించడమంటే , అవి – కష్టజీవులకు , కర్మ వీరులకు నిత్య మంగళం నిర్దేశించాలని ,స్వస్తివాక్యములు సంధానించాలనీ వాచ్యంచేసింది. సహస్రవృత్తుల సమస్తం చిహ్నాలు కవి విరుతించే , నవీన రీతులకు – గీతాలకూ భాగ్యమై తీరాలన్న అమేయ ఆకాంక్షను అద్భుతంగానూ , అంతకన్నా మిక్కిలి గర్వకారణంగానూ చాటింది. ఆ విధంగా ‘ప్రతిఙ్ఞ’ ఒక అంతర్జాతీయ కవిత అవుతూ, కవుల ప్రపంచ పక్షాన అశేషమైన శ్రమ జీవులందరుకూ అత్యంత వినయపూర్వకంగా అభివాదం చేసింది.
శ్రీ శ్రీ మలికవితా సంపుటి ఖడ్గ సృష్టి ” దానిని నల్ల బజారులోకిదించి , దానితో కల్లకపటాలను వధించమన్నాడు. ఆకాశంలో కాళ్ళు తెగి ఒంటరిఒంటిలాగున్న జాబిల్లికి కర్తవ్యబోధచేశాడు. చందమామ తన చంద్రికలను నిష్పక్షపాతంగా, జైలులో మగ్గుతున్న వారితో సహ, అందరి మీదా సమానంగా ప్రసరింపజేయాలని మెత్తని మందలింపుతోనే అభ్యర్థించాడు.
కథలు ,అనువాదాలు , లెనిన్ కావ్యాలు, రెక్కవిప్పిన రెవల్యూషన్లు , రేడియో నాటీకలు , చైనాయానాలు, ఎన్నన్నోవ్యాసాలు , ప్రాసక్రీడలు, సిరిసిరిమువ్వలు, లిమరిక్కులు చోటుచేసుకున్నాయి – శ్రీశ్రీ చేతుల మీదుగా , ” మరోప్రస్థానం ” రూపు దాల్చింది. ” అనంత”మైన సర్వ – సమగ్ర సాహిత్యం, పట్టజాలనంతటి ఉద్వేగ భరితంగానూ, గుణాత్మకంగానూ పరివ్యాప్తమైంది. ” ప్రభంజనం వలె హోరెత్తండీ / భావవేగముగ ప్రసరించండీ/ వర్షాకాభ్రముల ప్రళయఘోషవలె/ఫెళఫెళ – ఫెళఫెళ విరుచుకుపడండి” అంటూ ప్రకటించే చేవగలవాడు . “ఎచటికి పోతావీరాత్రి ? ” అని ప్రశ్నించి , ఆగి ఆలోచించకనే ” అవతలిగట్టుకు” అంటూ గుండె నిబ్బరం తో సమాధానం చెప్పగలవాడువుంటే అతడు తప్పకుండా శ్రీ శ్రీ అంతటి మరొక శ్రీశ్రీ యే అయివుంటాడు. అలాగే -
కవీ! నీ గళ గళన్మంగళ / కళాకాహళ హళాహళిలో
కలిసిపోతిని! కరిగిపోతిని! కానరాకే కదిలిపోతిని
అంటూ చెప్పగలవాడు కేవలం ఒక శ్రీశ్రీ మాత్రమే అయివుంటాడు. అవును, ఎటూ కూడి ఎటు తీసి వేసినా అతడొక దుర్గం , అతడొకస్వర్గం , అతనితరసాధ్యం అతని మార్గం.
కాకవులు , కాపురుషులు మాత్రమే కవి శక్తిని విడిచి రంధ్రాన్వేషణ చేయబోతే, వారికి శ్రీశ్రీ యిచ్చే సరియైన జవాబు.
నిప్పులు చిమ్ముకుంటూ /నింగికినేనెగిరిపోతే/ నిభిడాశ్చర్యంలోవీరు
నెత్తురు కక్కుకుంటూ / నేలకేసి రాలిపోతే / నిర్ధాక్షిణ్యంగా వీరే !
అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు