Oct2009
వారధి – రచయితల సహకార వేదిక
ఆధునిక వస్తువినిమయ ప్రపంచం విసిరిన సవాళ్ళు ఎదుర్కోవడానికి మనిషి విశ్వప్రయత్నం చెయ్యాలి. తనను తాను తెలుసుకోగలిగినప్పుడే మనిషి మనిషిగా మిగులుతాడు. అలా తెలుసుకోవడానికి అవకాశాన్ని కల్పించేదే సాహిత్యం. అలాంటి సాహిత్యం లో రచయితలు కొత్త కోణంలో చూడడం, కొత్తకొత్తగా ఆలోచించడం, కొత్తగా రాయడం, నూతన తరహాలో కార్యక్రమాలు నిర్వహించడం , కొత్త పాఠకుల దగ్గరకు పోవడం, కొత్త వస్తువులను ఆవిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది రచయితల సహకారంతో ఏర్పడిందే వారధి రచయితల సహకార వేదిక.
సమాజం ఎంతగా ఆధునీకరించబడినా , శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంత ముందడుగు వేస్తున్నా, ఆ మేధా సంపత్తి సజావుగా మనిషికి ఉపయోగపడాలంటే మనిషి ఙ్ఞాన సంపన్నుడు అయి ఉండాలి. అలాంటి ఙ్ఞానం మనిషికి అందాలంటే పుస్తకమే ఏకైక మార్గం . అలాంటి పుస్తకాన్ని నేరుగా తక్కువ ధరకే పాఠకులకు చేర్చడానికి వారధి రచయితల వేదిక సహకరిస్తుంది.
మనిషి జీవిస్తున్న జీవితానికీ , ఆలోచనలకూ ఎంత పొంతన లేదో రచయిత వ్యాఖ్యానిస్తూ ఉంటే దానిని ఆసరాగా చేసుకుని సమాజం ముందుకు నడవాలనుకుంటుంది. అలాంటి రచయితలు కార్యోన్ముఖంగా ముందడుగు వెయ్యడానికి ఆవిర్భవించిందే వారధి సహకార వేదిక.
విద్యార్థుల , తల్లిదండ్రుల కెరియర్ స్వార్ధాన్ని సొమ్ముచేసుకుంటున్న పుస్తకాల మార్కెట్ సాహిత్యానికి దూరంగా మొహం చాటేసింది. ఏ ప్రక్రియనైనా అందిపుచ్చుకోవాల్సిన యువత వెర్రి వ్యామోహాల వెంబడి పరుగులు తీస్తోంది. జీవన పధానికి అవసరమైన సరంజామాను పోగుచేసుకోవాల్సిన దశలో ఉండే విద్యార్థిలోకానికి ఆ అవకాశం లేకుండా చేస్తుంది ఇప్పటి విద్యావ్యవస్థ. మొత్తం మ్మీద అందరికీ సృజనశీలతకు అవకాశాలు లేకుండా ఎన్నో అవరోధాలు మన ముందు పెను సవాళ్ళుగా నిలిచాయి. ఈ సవాళ్ళకు సమాధానం ఒక్క పుస్తకమే. మనిషికి ఙ్ఞానాన్ని అందింఛి సమస్యల వలయంలో నుండి బయట పడవేసి పరిష్కారాల్ని చూపించే సాధనమే సాహిత్యం. మనిషిని నవ్వించి, కవ్వించి , ఏడ్పించి కన్నీళ్ళు పెట్టించి, జీవితానికి అవసరమైన సరంజామాను జీవించడానికి అవసరమైన ముడిసరుకును సమకూర్చేది సాహిత్యమే . ఇలాంటి సాహిత్యం కోసం, దాని విస్తరణ కోసం ఆవిర్భవించిందే వారధి రచయితల సహకార వేదిక.
ప్రజల కోసం సృష్టించబడే సాహిత్యం ప్రజల వద్దకే వెళ్ళాలి. పాఠకుడి దగ్గరకే వెళ్ళాలి. అవసరమైతే ఇంటింటీకీ వెళ్ళీ మరీ పాఠకుల్ని కదిలించాలి. అందరూ ఇష్టపడే కథా సాహిత్యం పట్ల మొత్తం మీద ఒక బహిరంగ చర్చ జరిగినప్పుడే అందరికీ కథల పట్ల సాహిత్యం పట్ల సమాజం పట్ల అవగాహన ఆసక్తి కలుగుతాయి.
రచయితల సహకారవేదిక మొదటగా 24 మంది కథకులతో నవతరం తెలుగు కథ, కథా సంకలం వెలువరించింది. ఈ సంకలనం నేరుగా పాఠకులకు చేరాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రచయితల సమావేశాలు, నవతరం తెలుగు కథ పరిచయ సభలు నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా మే 24 వ తేదీ హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డన్స్ లో మొదటి సమావేశం జరిగింది. ఒక ప్రజా సమూహం మధ్యలో అనేక మంది సాహిత్య ప్రముఖుల మధ్య కొత్త సాహిత్య వాతావరణములో నవతరం తెలుగు కథ మొదటగా ఆవిష్కరించబడింది.
ఈ సమావేశానికి వరవరరావు , కె.శివారెడ్డి, గుడిపాటి ,వాసిరెడ్డి నవీన్ , రమణ జీవి, కె.పి.అశోక్ కుమార్ . ముకుంద రామారావు, ఎన్.వేణు గోపాల్ , పెన్నా శివ రామకృష్ణ, వేముగంటి మురళీ కృష్ణ, ఇంద్రవల్లి రమేష్, డా” కె.సుభాషిణి, కె.వి. కూర్మనాధ్ , ఒమ్మి రమేష్ బాబు, సుంకోజీ దేవేంద్రాచారి, పి.చిన్నయ్య, మంచికంటి, జి.వి.ఉమామహేశ్వర్, అక్కిరాజు భట్టిప్రోలు, జి. వెంకటకృష్ణ, స్కైబాబా, షాజహానా, బాల్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రచయితలు వారధి సరికొత్త సంప్రదాయానికి తెర తీసిందని పంపిణీ వ్యవస్థ సరిగ్గా లేని ఈ రోజుల్లో సాహిత్యం నేరుగా పాఠకునికి చేరడానికి వీలుగా ఈ సహకార వేదిక పని చెయ్యాలని అభిలషించారు. ఏ ప్రాంతం సాహిత్యం ఆ ప్రాంతానికే పరిమితమైపోతుందనీ , ఏ కొద్ది రచనలు మాత్రమే ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయి. తప్ప రచనలన్నీ పాఠకులకు చేరడమొ వల్ల కూడా కథ మీద సరియైన చర్చ జరగడంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రచయితలతో సాహిత్య ఐక్య వేదికలు ఏర్పాటు చెయ్యవలసిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న కొంతమంది పాఠకులు కూడా చర్చలో పాల్గొన్నారు. రచయితల్లో వాసి కంటే రాశి అధికమౌతుందనీ,అందుకే రచనలు అంతగా ప్రాచుర్యము పొందడము లేదనీ, రచయితలు మాట్లాడేది వేరు, చేసేది వేరు. చూసేది వేరుగా ఉంటుంది. సాహిత్య జీవితమూ, మామూలు జీవితమూ వేరు వేరుగా ఉంటున్నాయనీ, ఒకేమనిషిలో ఇన్ని వైరుధ్యాలున్నప్పుడు సాహిత్యానికి సార్వజనీయత ఎలావస్తుంది. అంటూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
జూన్ పదవ తేదీన విశాఖపట్నంలో నవతరం తెలుగు కథ రెండవ సమావేశంలో జరిగింది.పెదవాల్తేరులోని MVP కాలనీ, జస్వర్ స్కూల్ లో ఉత్తరాంధ్రా రచయితలు కారా మాస్టారు, అట్టాడ అప్పల్నాయుడు చింతా అప్పల్నాయుడు, జి.ఎస్.చలం, గంటేడు గౌరునాయుడు, వర్మ సమావేశమయ్యారు.
వర్మగారి అధ్యక్షతన కథా చర్చ జరిగింది. కారా మాష్టారు మాట్లాడుతూ రచయితల సహకారవేదిక ఒక మంచి సంప్రదాయ పద్ధతనీ, ఇలాంటి ప్రయత్నం మేమూ ఒకసారి చేసి విజయవంతమయ్యామనీ తెలిపారు. కొన్నికొన్ని ప్రభావాలతో రాసే రచయితలు సాహిత్య ప్రక్రియల్లో జాగ్రత్త వహించాలనీ లేదంటే వస్తువు మాత్రమే ఒక ముది పదార్ధంగా వ్యక్తమౌతుందనీ, దానికి రూపసారములను జోడించనట్లయితే అది పాఠకుడిలో ఎలాంటి మార్పునూ కలుగజేయలేదనీ, అలాంటి సాహిత్యం నిష్పలమౌతుందనీ వస్తు రూపాల సమన్వయము గురించి మాట్లాడారు.
కథను మాండలిక భాషలో రాసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరముందనీ, ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు ఈ సాహిత్యాన్ని చదవకపోగా, చదివేవాళ్ళకు భాష అడ్డంకిగా మారడం, కథ ప్రాచుర్యానికి నోచుకోకపోవడం జరుగుతుందనీ అందుకే పాత్రల స్వభావాన్ని బట్టి పాత్రలు ఆయా ప్రాంతాల భాష మాట్లాడినా రచయిత కథా కథనం మాత్రం పాఠకులు చదివే భాషలో రాయాల్సిన అవసరాన్ని గుర్తించాలని పలువురు రచయితలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కథారచయితలు కొన్ని చట్రాలలో ఇమిడిపోవడము వల్ల కథకులు కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తున్నదనీ, ఏ సృజనాత్మక ప్రక్రియకైనా కళాత్మకత అవసరమనీ, కథకులు కేవలం కథలు రాయడానికి, కథలే చదువకుండా సాహిత్య ప్రక్రియలన్నింటినీ అవగాహన చేసుకోవడంతో పాటు అనుభూతి చెందగలిగితే కళాత్మకత దృష్టిని పెంపొందించుకున్నప్పుడే ఏ ప్రక్రియ అయినా ప్రతిభావంతంగా తయారవుతుందనీ, కథ పరిణతి, వర్తమాన స్థితి గురించి చర్చించారు. ఇవాల్టి పాఠకులని దృష్టిలో ఉంచుకుని చేసే కార్యమాలలో భాగంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు సాహిత్య పరిచయం చెయ్యడం కోసం వారి వద్దకు పోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలని ఈ సమావేశంలో అందరూ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర రచయితలు ఇంతకు ముందులాగా కథా సంకలనాలు తెచ్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని నిర్ణయం తీసుకున్నారు.
ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మురళీ నగర్ వైశాభీ స్పోర్ట్స్ పార్క్ లో వాకర్స్ క్లబ్ వనితా వాకర్స్ ఆధ్వర్యంలో నవతరం తెలుగు కథ పరిచయ సభ జరిగింది. ఒక వైపు స్విమ్మింగ్ ఫూల్ లో కేరింతలు కొట్టే పసిపిల్లలు , మరో వైపు ట్రాక్ పై శరవేగంగా తిరిగే వయోవృద్ధులు, అప్పుడే వర్షం కురిసి వెలిసిన ఆరు బయలు, వేదిక ముందు యువకులు, వృద్ధులు, విద్యార్థులు నిజంగా రచయితలు మాట్లాడవలిసిన వర్గాలు సాహిత్యం నిజంగా సమాజంలోకి ప్రజల వద్దకు అనే రచయితల కలేమో ఇది అన్నట్టున్న వాతావరణం.
ఈ సభకు K.N. మల్లీశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సభ కూడా మామూలు రొడ్డ కొట్టుడు సభకు భిన్నంగానే జరిగింది. సాహిత్యం పాఠకుల్లోకి పోకుండా ఎంతకాలమని మనమే ఆవిష్కరణలు పెట్టుకొని పొగుడుకుంటూ , సన్మానాలు , సత్కారాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తాం సభలో రకరకాల కథలు చెప్పారు రచయితలు. ఎన్నెన్నో పాటలు పాడారు గాయకులు. కథలు చదివారు కథకులు. కారా మాష్టారు కొత్త పాఠకులందరూ చదవాల్సిన కథల గురించి చెప్పారు. ఇప్పుడు సమాజం కల్లోలాన్ని గురించీ చెప్పారు. మనుషులు ఎంతగా నరకాన్ని అనుభవిస్తున్నదీ చెప్పారు. ఆధునిక జీవితం విసిరిన సవాళ్ళను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా సాహిత్యం చదవాల్సిన అవసరముందనీ అందుకే ఎంతెంతో దూరం నుండి రచయితలు మీ వద్దకు రావడం జరిగిందనీ, సాహిత్యాన్ని మీ అందరికీ అందుబాటలోనికి తీసుకురావడానికే వారధి సహకార వేదిక మీ ముందుకు వచ్చిందనీ మంచికంటి వివరించారు.
సభలో ఉన్న కొంతమంది ముందుతరం పాఠకులు కూడా సాహిత్యాన్ని గురించీ , వాళ్ళు పాఠకులుగా ఉన్న రోజుల గురించీ తలపోసుకున్నారు. చాలా మందికొత్త పాఠకులు కూడా చాలా ఆసక్తిగా పలురకాల పుస్తకాలు కొనడంతో పాటుగా ఉత్సాహంగా సాహిత్య సభలో భాగస్వాములయ్యారు.ఇలాంటి సభలు మళ్ళీ మళ్ళీ జరుపుతామనీ, త్వరలో తాము ఏర్పాటు చెయ్యబోయే గ్రంధాలయానికి రచయితల వద్ద నుండి పుస్తకాలు కొనుగోలు చెస్తామని కూడా హామీ ఇచ్చారు.
నవతరం తెలుగుకథ పరిచయాలలో భాగంగా జూలై 26 వతేది ఒంగోలు లో దక్షిణాంధ్ర రచయితల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డా. కె. సుభాషిణి, నల్లూరి రుక్మిణి, దగ్గుమాటి పద్మాకర్ , లెనిన్ ధనిశెట్టి, గుడిపాటి , డా.ధేనువుకొండ శ్రీ రామ మూర్తి, మొలకల పల్లి కోటేశ్వరరావు, బి. హనుమారెడ్డి, శ్రీరామ కవచం సాగర్, పి.రాజ్య లక్ష్మి, ఇంకా ప్రకాశం జిల్లా రచయితలు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంచికంటి కథలు “మారాజులు” కథా సంకలనాన్ని గుడిపాటిగారు ఆవిష్కరించారు. దక్షిణాంధ్రలో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండే కథ వెలువడుతుందనీ కృష్ణా, గుంటూరూ జిల్లాల నుండీ కొత్త కథకులు ముందుకు రావడము లేదనీ పలువురు అభిప్రాయపడ్డారు.
రచయితలు కథలు రాసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడము లేదనీ, కథాకథనాల విషయంలో కేవలం పైపైన మాత్రమే రాయడం జరుగుతుందనీ, కథను మళ్ళీ మళ్ళీ తిరిగిరాయడమువల్ల మంచికథలు, గొప్ప కథలు వస్తాయని గుడిపాటి గారు రచయితలకు సూచనలిచ్చారు.
రచయితలకు కళాత్మక దృష్టి ఉండడం, సమాజాన్ని పరిశీలించే కోణం, సామాజిక స్పృహ, మానవీయ దృక్పధం, ప్రాపంచిక సాహిత్య ఙ్ఞానం నిరంతర అధ్యయనం అవసరమనీ కథల విషయంలో కూడా ఈ విషయాలన్నీ వర్తిస్తాయనీ కథకులు తెలుసుకోవాల్సిన విషాయాలనీ రచయితలు చర్చలోపలువురు అభిప్రాయ పడ్డారు. ప్రకాశం జిల్లా నుండి ఇప్పుడు ఎంతో మంది రచయితలు కథలు రాస్తూన్నారనీ , ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంకా జీవన సంక్షోభాన్ని చిత్రించే కథలు రావాలనీ , ఆ దిశగా రచయితలు ఆలోచించాలనీ , కేవలం మూలాల్లోనుంచి రాయడం అవసరమైనా అక్కడే రచయితలు కూరుకు పోవడం వల్ల రచయితలు కేవలం ఒక్కచోటే ఆగిపోవడం జరుగుతుందనీ, ఇది కథకుల తిరోగమనానికి దారి తీస్తుందని సదస్సు తీర్మానించింది. వారధి రచయితల సహకారవేదిక పాఠకులలు రచయితలకు మధ్య వారధిగా పని చేస్తుందనీ , వివిధ ప్రాంతాలలో కథారచయితలు కలిపి భిన్న అభిప్రాయాలు పంచుకునేందుకు నూతన తరం సాహిత్యంలోకి ప్రవేశించడానికి పాఠకులను పెంచుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుందనీ మంచికంటి తెలియజేస్తూ ఈ సదస్సు ను ముగించారు.
ఆ రోజు సాయంత్రం రంగరాయుడు చెరువు వద్ద పార్కులో సాయంత్రం 6 గంటలకు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవతరం తెలుగుకథ పరిచయ సభ జరిగింది. నడుస్తున్నవాళ్ళు, చుట్టుపక్కల నిలబడ్డవాళ్ళు, చెరువు వొడ్డున కూర్చున్న వాళ్ళు , దూరంగా కూర్చొని ఆలకించేవాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి శ్రోతలే. ఆహ్లాదకరమైన ఆరుబయట వాతావరణంలో సాహిత్య సభ జరగడం ఒంగోలు మొట్టమొదటి సాహిత్య విశేషం. సాహిత్యం ఏ కొద్దిమంది మేధావులకు సంబంధించిన విషయం కాదనీ, అందరికీ సంబంధించిన విషయమనీ తెలియజెబుతూ సభ ప్రారంభమైంది.
ఈ నాటి విద్యావిధానం మనిషిని మనిషి నుండి విడదీసేందుకు ఉపయోగపడుతుందనీ, కెరియర్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న ఈ విద్య విద్యార్థుల్ని సంక్షోభంలోనికి నెట్టివేస్తూ , మానవ సంబంధాలను తుంచివేస్తూ , అత్మహత్యలకు పొరాడేటట్లు చేస్తున్నాయనీ ఈ విషయాన్ని పిల్లలు , పెద్దలూ తెలుసుకోవాలంటే సాహిత్య అధ్యయనం తప్పనిసరనీ డా.కె.సుభాషిణి సభికులకు తెలియజేశారు. ఒంగోలు నేపధ్యంలో రంగారాయుడు చెరువు నేపధ్యంలో వచ్చిన కథల్ని ఈ సందర్భంగా డా. ధేనువుకొండ శ్రీరామూర్తి గుర్తు చేసుకున్నారు.
ఈ సభలోనే అంధ విద్యార్థులు పాడిన పాటలు కూడా శ్రోతలకు గుర్తిండి పోవడమే గాకుండా, వాళ్ళ పట్ల సమాజం మానవతా దృక్పధంతో స్పందించాల్సిన అవసరాన్ని నూతన పాఠకులు చాలా మంది ప్రస్తావించారు. ఈ పరిచయ సభలో ఎంతోమండి తల్లిదండ్రులు పిల్లల పుస్తకాల మీద ప్రేమ చూయించడం రాబోయో మార్పుకు సూచనగా అర్థం చేసుకోవచ్చు.
నవతరం తెలుగు కథ పరిచయాల సందర్భంగా ఆగస్టు నెలలో కర్నూలు లో జి.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పలు సమావేశాలు ఏర్పాటూ చెయ్యడం జరుగుతుంది. తదుపరి అనంతపురం, కర్నూలు, తిరుపతి,నల్గొండ, కాకినాడల్లో ఇలాంటి సభలు జరిపే ప్రయత్నాలను వారధి రచయితలు చేస్తున్నారు. వారధి రచయితల సహకారవేదిక తదుపరి కార్యక్రమాలుగా పాఠశాలకు కళాశాలాలకు పోవడం, విద్యార్థులను సాహిత్య ప్రక్రియలోనికి ప్రవేశించే దిశగా సెప్టెంబర్ మొదటి వారం నుండిస్ ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఒంగోలు విశాఖ , కర్నూలు , తిరుపతిలో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అభిప్రాయాలు లేవు »సాహితీ సదస్సులు – రిపోర్టులు