భూమి పుత్రుడు

సింగరేణి మేనేజ్ మెంట్ గోదావరిఖని ఓసిపి రెండు విస్తరణలో భాగంగా అక్కెపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జూన్ 28 నిర్వహించిన సభను ప్రజలు వ్యతిరేకించారు.

ప్రజాభిప్రాయసేకరణ సభ సందర్భంగా మేనేజుమెంటు భారి ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. అయినా ప్రజాప్రతిఘటనను పోలీసులు అడ్డుకోలేక పోయారు. పోలీసు అదిరింపులు బెదిరింపులు పనిచేయలేదు. ఉదయం పదిగంటలకు సమావేశం జరుగుతుందని ముందే ప్రకటించటం జరిగింది. ఇటువంటి అల్లర్లు జరుగుతుందని ముందే ఊహించటం వల్ల మేనేజిమెంటు ముందే పోలీసు బలగాలని మొహరించింది అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రజల ఆగ్రహం ముందు పోలీసుల నిరుత్తులైపోయారు. లాఠీ చార్జి చేసినా ఫలితం లేకుండాపోయింది. దాంతో మరింత రెచ్చిపోయిన జనం టెంట్లను కూల్చివేశారు. కుర్చీలను ఎత్తిపడవేశారు. సమావేశ నిర్వహణకు వచ్చిన సబ్ కలెక్టర్ , స్థానిక ఆర్డివో, సింగరేణి అధికారులు ప్రజల ఆగ్రహం చూసి చేష్టలుడిగిపోయి బిత్తర పోవాల్సివచ్చింది.

ఈ వార్తలు స్థానిక పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. అది చూసి మోహన రావు సారు చాలా చలించిపోయారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా బొగ్గు గనుల కింద గోదావరి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ” ఈ విధ్వంసం ఆపకుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మనుషులు పశు పక్షాదులు చెట్టుచేమ ఏది మనగోడు సాగించని ఎడారిగా మారిపోతుంది”. అని చాలాసార్లు చాలా సందర్భాలలో తన ఆవేదన వ్యక్త పరుస్తూనే ఉన్నారు .

“మనం ఏదో ఒకటి చేయాలి” అన్నాడు ఆ వార్తలు చూసి మోహన్ రావు.

“ఏం చేద్దాం.. ఏం చేయగలం ” అన్నాను.

“ఏమైనా చెయ్యగలం ” అన్నాడు దృఢంగా… అతని కండ్లలో ఏదో విశ్వాసం తొణికసలాడింది.

దాదాపు అరవైఏండ్ల వయస్సు. చాయ శరీరం.. దానికితోడు అనారోగ్య సమస్యలు. కానీ నిర్వాసితులకు సంబంధించి ఏదైనా సమావేశమో సభో ఉన్నదంటే సంకకి ఒక సంచి వేసుకుని ఎంత దూరమైనా బయలుదేరుతాడు.

“ఎందుకు చెయ్యలేము చేతులు ముడుచుకుని కూచుంటే ఏదీ జరగదు.వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందనే సామెత. మనం చేస్తున్నది న్యాయమైన పోరాటమైతే అది చిన్నగా పిల్ల కాలువలా మొదలై మహాప్రవాహం అవుతుంది ” అన్నాడు అతను మరోసారి.

నిజమే కాని … దేశ పారిశ్రామికాభివృద్ధికి బొగ్గు తవ్వకాలు జరపాలావద్దా” జనం ఇట్లా నూతనంగా ప్రారంభమయ్యే గనులు రావద్దు అంటే ఆందోళనలు చేస్తే బొగ్గు ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది. దేశం అభివృద్ధి ఏం జరుగుతుంది” అన్నాను.

నా మాటలకు ఆయన గుండ్రటి ముఖం విప్పారంగా గలగలమంటూ పెద్దగా నవ్విండు.

సింగరేణి మేనేజిమెంటు మొదలుకొని సోకాల్డు అభివృద్ధి కాముకులంత చదువుతున్న పాతపాటే ఇది.” అసలు అభివృద్ధి అంటే ఏమిటి? అన్నాడు నామొఖంలోకి సూటిగా చూస్తూ.

నేను కాస్త తడబడ్డాను, మళ్ళీ అంతలోకి తేరుకుని అభివృద్ధి అంటే నా వాదనను వినిపించాను” దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఉత్పత్తి పెరగాలి.దేశంలో జరిగే విద్యుత్ ఉత్పత్తిలో అరువై శాతం బొగ్గు ఆధారిత ధర్మల్ విద్యుత్ ద్వారానే జరుగుతుంది. దేశంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. వాటిని వెలికి తీయటం ద్వారా మనం అనుకున్న విద్యుత్ లక్ష్యాలను చేరుకోవచ్చు. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది”అన్నాను.

ఆయన నా మాటలను అపహాస్యం చేస్తూ .నా మాటలకు కొనసాగింపుగా తానే మాట్లాడ సాగిండు.

“మన్ మోహన్ సింగ్ గారు చెప్పినట్టు దేశం రెండు అంకెల అభివృద్ధి రేటు సాధించాలి. భారతదేశంలో ప్రపంచంలోనే సూపర్ పవర్ దేశంగా ఎదగటానికి ఇంకా ఎంతో కాలం పట్టదు. ప్రస్తుతం దేశంలోలక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వచ్చే ఇరవై ఏండ్లలో దీన్ని మూడు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పెంచాలి.అంటే ఇప్పుడు దేశవ్యాపితంగా జరుగుతున్నా నాలుగు వందలయాభై మి.ట బొగ్గు ఉత్పత్తినివచ్చే ఇరవై ఏండ్లలో పంతొమ్మిది వందల మి.ట పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన శంకర్ కమిటీ తేల్చి చెప్పింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తుంది.” అంటూ మెరిసే కళ్ళతో నాకళ్ళలోకి చూస్తూ మళ్ళీ మొదలుపెట్టిండు.

“రాజుగారు తలిచిందే సేవకుడు సెలవిచ్చారు. అసలు రాజుగారి ప్రాణం అమ్మగారి చేతిలో లేదు. ఏడు సముద్రాల ఆవల చిలుకలో వుంది. ఆ చిలుక ఎట్లా పలికితే ఈ రాజుగారు అట్లా ఆడుతాడు.సరే అది వేరే సంగతి..” అంటూ అని దీర్ఘంగా నిట్టూర్చిండు.

“అయ్యా అంత ఉత్పత్తి తయారవాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మరెట్లా అందుకనే సేవకుడు ఏమన్నాడంటే ఆ కష్టం మనకెందుకు ప్రైవేటు వాళ్ళకు అప్పజెపుదాం. ఆ భాదేదో వాళ్ళే పడతారు. మన ఉత్పత్తి లక్ష్యాలు నెరవేరుతాయి. దేశాన్ని అభివృద్ధి పధంలో తీసుకుపోవాలన్న మీ స్వప్నం నెరవేరుతుంది. కాకుంటే బొగ్గు గనుల ప్రైవేటీకరణకు ఆడ్డంకిగా ఉన్న చట్టాలను సవరించాలి .ప్రైవేటీకరణ సులభతరం చెయ్యాలి.పర్యావరణ తదితర అడ్డంకులు ఏమిలేకుండా చూడాలి . అంటూసేవకుడు చాలానే చెప్పాడు. ఇంకేమి రాజుకు సేవకుని మాటలు చాలా నచ్చాయి. పాపం రాజుగారు ఇప్పటికి చాలా చేశాడు. అసలు బొగ్గు ఉత్పత్తిలో ప్రభుత్వం ఎందుకు అనవసరంగా పైసలు దండుగ కార్మికులు సమ్మెలు మన చేతికి మైల అంటకుండా బొగ్గు ఉత్పత్తులు సాగించటానికి దేశ విదేశాల నుంచి పెద్దపెట్టున పారిశ్రామిక వేత్తలే క్యూ కడుతుంటే ఇంతవరదాక అంటే ఏవో అడ్డంకులు ఉండే లోపాయికారిగా ఎంత చేసినా ఏం లాభం ప్రభుత్వ బొగ్గు సంస్థలను అమ్ముకోలేక పోయాం. ఇప్పుడు రాజుగారికి ఏ అడ్డంకులు లేవు వీలైనంత తొందర దేశంలోని బొగ్గు సంపద అమ్మేసుకొని సొమ్ము చేసుకోవటమే అట్లా సంపాదించిన సొమ్ముతో మరో ఐదేండ్లో పవరును పొడగించుకోగల్గుతామా లేదా అన్నదే రాజుగారి అసలు సమస్య” అన్నాడు.

నాకు ఆయన మాటలు అర్థం కాలేదు నా చిన్న మొఖం చూసి మరోసారి అతని లావాటి శరీరం అదరంగ గలగల నవ్విండు. అంతలోకి మళ్ళీ గంభీరమయిపోయి.

“అసలు అభివృద్ధి అంటే ఏమిటి?” అంటూ గంభీరంగా ప్రశ్నించి అందుకు తానే సమాధానం చెప్పసాగిండు.

“అభివృద్ధి అంటేకాకులను కొట్టి గద్దలను మేపటం అభివృద్ధికాదు” అన్నాడు ధృడంగా అభివృద్ధి ఫలితాలు ప్రజలకు ఏమేరకు చెందుతున్నాయి అనే ప్రాతిపదికనే అభివృద్ధిని అంచనా వేయాలి . అశేష జనాలను ఆకలి చావులకు గురిచేస్తూ కొద్దిమంది బడా పెట్టుబడి దారులను మేపుతాను అనడం ఎట్లా అభివృద్ధి అవుతుంది.వేలకోట్ల ఆస్తి ఉన్నవాడు లక్షలకోట్లకు ఎదిగిండు రెండుపూటలా తిండితినే సామాన్యునికి ఇవాళ ఒక్క పూట కూడా తిండి దొరకని పరిస్థితి వచ్చింది. ఇదెట్లా అభివృద్ధి అవుతుంది.” అన్నాడు ఆవేశంగా.

బొగ్గు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సింగరేణినే ఉదాహరణ చేసి చెపుతా…” అంటూ మొదలు పెట్టిండు.

సరిగ్గా ఇరవై సంవత్సరాల కింద సింగరేణిలో లక్షాపదహారువేలమంది పై చిలుక కార్మికులు పనులు చేసేవాళ్ళు అప్పుడు వార్షిక ఉత్పత్తి పంతొమ్మిది మిలియన్ టన్నులు మాత్రమే . కాని ఇప్పుడు సంవత్సరానికి యాభై మిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. కాని కార్మికుల సంఖ్య ఢెబ్బయి వేలకు పడిపోయింది. ఉత్పత్తిలో కార్మికుల పాత్ర తగ్గిపోయింది. ప్రైవేటీకరణ , ఔట్ సోర్సింగ్ వల్ల ఉత్పత్తిలో ముప్పాతిక భాగం ప్రైవేటు కాంట్రాక్టర్లే నిర్వహిస్తున్నారు. ఇవ్వాళ కార్మికులు సమ్మెచేస్తే బావులు బంద్ అయ్యె పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు సమ్మె చేస్తే బావులు బంద్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.బొగ్గు ఉత్పత్తిలో ప్రవేటు భారీ యంత్రాలు వచ్చిన తరువాత పర్మినెంటు కార్మికులకు పనులు లేకుండా పొయింది. ఫలితంగా రిటైర్మెంటెక్కువైనాయి.. గత ఇరవై సంవత్సరాలలో ఈ విధంగా నలభై రెండువేలమంది కార్మికులను తొలగించారు. ఉత్పత్తిలో ప్రవేటు కాంట్రాక్టర్లు రావటం వారితో పాటే కాంట్రాక్టు కూలీలు వచ్చి చేరారు. ఇట్లా పనిచేసి కాంట్రాక్టు కూలీలకు కనీస వేతనాలు లేవు, కనీస పనిగంటలు లేవు. మానవ కనీస అవసరాలు లేకుండా ఆధునిక బానిసల్లా పనులు చేస్తున్నారు. మరోవైపు ఏ ఏటి ఆ ఏడు ఉత్పత్తిలో లక్షలు పెంచుకుంటూ పోవటం , పెంచిన ఉత్పత్తిని లక్షలకు అనుగుణంగా మరిన్ని ప్రాంతాల్లో మరిన్ని కొత్త బావులు రావటం ఆ మేరకు వందలాది గ్రామాల ప్రజలు నిర్వాసితులు కావటం పెరిగిపోయింది” అన్నాడు.

నేను మౌనంగా ఆయన మాటలను ఆలకించసాగాను. ఆయన కూర్చున్న కుర్చిలో బావావేశం కమ్ముకోగా అటు ఇటు కదిలిండు.నా వైపొకసారి దృష్టిసారించి అటు తరువాత కిటికీ గుండా ఏటో సుదూరంగా దృష్టిసారింఛి మాట్లాడసాగిండు.

‘నిర్వాసితులు కావటం అంటే ఈ ప్రాంతం ప్రజలకు లేకుండా పోవడం’…… అన్నాడు.

“ఒక్క మనిషి బతుకే కాదు ఈ ప్రాంతంలో పురుగుపుట్రా జంతువులు .. చెట్లు చేమ ఏదీ మనుగడ సాగించలేని మరుభూమిగా మార్చటం..” అన్నాడు.

అతని మొఖంలో విచారం కమ్ముకున్నది . ఆవేశంతో అతని పెదవులు అదిరాయి.

వీలైనంత తక్కువ సమయంలో ఈ ప్రాంతంనుండిబొగ్గు కాజేయాలని చూస్తున్నారు. అందుకే ఓపెన్ కాస్ట్ గనులు తెచ్చారు. అంటూ నా మొఖంలోకి సూటిగా చూసిండు.

“ఓపెన్ కాష్ట గనులంటే వెయ్యి ఆటంబాంబులతో సమానం తెలుసా” అంటూ క్షణమాగిండు.

“రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా , నాగసాకి మీద అమెరికా బాంబులు వేసింది. కాని ఈ రోజుకు మనం అక్కడికి పొయ్యి చూస్తే బాంబుపడ్డ ప్రాంతంలో సృతి చిహ్నంగా మిగిల్చిన బిల్డింగ్ తప్ప మిగితా ఎక్కడ కూడా బాంబు సృష్టించిన విధ్వంసం ఛాయలు కనిపించవు. కాని ఓపెన్ కాస్ట్ అట్లా కాదు. ఒక ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ గని తవ్వితే ఇక ఆ ప్రాంతం వేల సంవత్సరాల వరకు కూడా ఎందుకు పనికి రాకుందా పోతుంది.ఓపెన్ కాస్ట్ తవ్వకంలో జీవజాతి మనుగడకు అవసరమైన భూమి పొర తలక్రిందులు చేయబడుతుంది.సేలు బండంతో ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది.” అన్నాడు.

నేను మౌనంగా వింటూ ఉండి పోయాను.

ఆయన గొంతు హెచ్చించి ” ఇంత విధ్వంసం సృష్టించి వెలికి తీసిన సంపద వల్ల ఎవడు లాభ పడ్డాడు ఎవడు నష్టపోయిండు. వెలికి తీసిన సంపదలో స్థానికులకు చెందించి ఎంత ? నష్ట పోయింది ఎంత . నిజాం ఏలుబడిలో సింగరేణిలో దాదాపు అరవై సంవత్సరాలు కొనసాగింది. ఆయన అరవై సంవత్సరాలు సింగరేణిలో తవ్వితీసిన బొగ్గుకు సమానంగా ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఉత్పత్తి జరుగుతున్నది. అంటే నిజాం ఏలుబడిలో బొగ్గుతీయటం వల్ల 60 సంవత్సరాలు జరిగిన పర్యావరణ విద్వంసం ఒక్క సంవత్సరంలోనే జరిగిపోతుంది. ఇట్లా తవ్వితీసిన బొగ్గు విలువ ఎంతో తెలుసా సంవత్సరానికి పదివేల కోట్లు . ఆ లెక్కన ఇన్ని ఏండ్లుగా ఎన్నిలక్షల కోట్ల బొగ్గు సంపద వెలికితీసారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది. ఎవడు అభివృద్ధి చేందాడు ఎవదు నష్టపోయాడు…”

నాలో కుతుహలంరేగింది..” ఇన్ని లక్షల కోట్లు ఎక్కడికి పోయినవి అన్నాను:… ఆసక్తిగా.

“టాక్సులు రాయల్టిల పేరుమీద కేంద్ర రాష్ట్ర ఖజానాకు పోయింది. ఉమ్మడి రాష్ట్రం పేరు మీద అమ్ముకున్న బొగ్గు సంపదను ఆంధ్ర పాలకులు తెలంగాణా ఎండబెట్టి వాళ్ళ ప్రాంత అభివృద్ధి వెచ్చించారు. ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ ఓట్ సోర్సింగ్ పేర వేల కోట్లు కాంట్రాక్టర్ల జేబులోకి పోతున్నాయి. ఒక్క విషయం తెలుసా నీకు . సింగరేణిలో మొత్తం కార్మికులకు చెల్లించే జీతాలకు సమానంగా ఆరుగురు ఆంధ్ర రాయలసీమ బడా కంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు” ఆధునీకరణ పేరు మీద విదేశీ బహుళ జాతి సంస్థలు కాజేస్తున్నాయి” అన్నాడు.

ఇంతవరకు నేను ఈ కోణంలో ఆలోచించలేదు. అభివృద్ధి పేర జరుగుతున్న విద్వంసం చీకటి కోణాన్ని అతను తన వాగ్దాటితో వెలిగించి చూపాడు. నిజంగానే నాకు భయం వేసింది. తమ భూమిలో బొగ్గు సంపద ఉంటే ఆ సంపద వారికి చెందకుండా చేసి వాళ్ళ బతుకుల్ని నీళ్ళు లేనికాడ బొండిగ కోసినట్లుగా చేస్తున్న వ్యవస్థీకృతమైన దుర్మార్గం ,… ఎంత పకడ్బందీగా కొనసాగుతున్నది.”

“ఇంత జరుగుతుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవట్లేదు “. అన్నాను.

“ఎవరు ప్రజా ప్రతినిధులు ఎవరికన్నా తను పుట్టిపెరిగిన నేలమీద . ఆ నేలమీద బ్రతికె ప్రజల మీద రవ్వంత ప్రేమ ఉందా! విద్వంసకారులకు దోపిడీదొంగలకు పల్లకి మొయటం.. జీ హుజూరు గా బ్రతకటం పనిలో పనిగా నాలుగుడబ్బులు సంపాదించటం సిగ్గుశరం లేని బ్రతుకులు . వీళ్ళా ప్రజాప్రతినిధులు…..”

ఆయన మళ్ళీ మాట్లాడసాగిండు.

“నిన్న అక్కిరెడ్డి పల్లె ప్రజలు జరుగుతున్న విద్వంసం చూసి తమ జీవితాల్లో మట్టి పోసే ఈ ఓపెన్ కాస్ట్ లు వద్దని ఆందోళన చేస్తే .. మన అధికార పార్టీ నాయకులు ఏంచెప్పిండు. బొగ్గు తవ్వకాలు అభివృద్ధి అనివార్యమంటూ .. కాకుంటే నిర్వాసితులను న్యాయం జరిగేలా చూస్తారంటా”

“ఏం చూసిండు . గతపాతికేండ్లుగా ఓపెనకాష్టాల పేర విద్వంసకాండ జరుగుతుంటే ఏంచేసిండ్లు”

న్యాయమైన నష్ట పరిహారం కోసం .. పాతికేండ్లుగా కోర్టుల చుట్టూతిరుగుతుంటే వీరేమి గడ్డి పీకిండు.. వాళ్ళ ఓట్లు కావాలి తప్ప వాళ్ళ కష్టాలు పట్టవా! ఇవ్వాళ జనం తిరగబడితే నిర్వాసితులకు న్యాయం చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసగించటానికి సిద్ధపడుతున్నారు. కాని ఇవ్వాళ జనం వీళ్ళ మోసపు మాటలు వినే స్థితిలో లేరు. చావో రేవో తేల్చుకోవాలనుకుంటుండ్లు. ఓపెన్ కాస్ట్ ల పేర పాతికేండ్లుగా జరుగుతున్న విద్వంసం రగిలి రగిలి లావాల పెల్లుభికింది. దీన్ని ఆపటం ఎవరి తరం కాదు” . వాని కుట్రలు కుతంత్రాలు అణచివేతలు తాడో పేడో తెల్చుకోవటానికి సిద్ధ పడ్డ ప్రజల ముందు దూది పింజల్లా తేలిపోతాయి. ప్రజలే చరిత్ర నిర్మాతలు ఆ ప్రజలకు వ్యతిరేక కుట్రలు పన్నిన వాడెవడు చరిత్రలో మిగలలేదు మిగుల కూడదు” అన్నాడు. తన లావాటి చేతిని హెచ్చరిస్తున్నట్టుగా గాల్లో ఆడించిండు. భవిష్యత్ ను అవలోకన చేస్తున్నట్టుగ అతని కండ్లు మెరిసాయి.

ప్రజల పట్ల ఆయనకున్న నమ్మకం ఆశ్చర్యం కలిగించింది.. దాదాపు పది ఏండ్ల క్రితం అతను మొదటసారి కల్సినప్పుడు సంకసంచిలో నుండి ఓపెన్ కాస్ట్ లను వ్యతిరేకిస్తూ ముద్రించిన కొన్ని కరపత్రాలు ఇచ్చిండు.అతన్ని పరిచయం చేసిన మిత్రుడు . ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒకేఒక్కడు అంటూ పరిచయం చేసింది గుర్తుకొచ్చింది.

పదేండ్లుగా ఆయన చేస్తున్న పోరాటం ఆనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఈయనకు ఇదేదో పిచ్చి పట్టింది అంటూ వ్యంగమాడిన వాళ్ళుకూడా లేకపోలేదు. కాని ఆయన ఆరంభించిన ఒంటరి పోరాటం ఇవ్వాళ ప్రజాఉద్యమంగా మారింది. అతని దూరదృష్టికి, ప్రజల పట్ల ఆయనకున్న నమ్మకాన్ని రుజువుచేసింది.

ఆయన ఇంకా చాలా మాట్లాడే వాడే కాని ఏదో పని బడి పోవటానికి సిద్ధపడి “ఇదంతా కాదుకాని ఆదివారం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ వ్యతిరేకంగా పాదయాత్ర ఉంది మాతోరా.. చాల విషయాలు నీకే తెలుస్తాయి” అన్నాడు.

నాలో ఉత్సుకత కల్గి ..”సరే నేను వస్తా ” అన్నాను.

తాడిచెర్ల గ్రామం మండలకేంద్రం కూడా. మానేరు నది ఓడ్డున ఉంది తూర్పు వైపు బొగ్గులవాగు వచ్చి కలుస్తుంది. సారవంతమైన నల్లరేగడి నేలలు కరీంనగర్ జిల్లా మొత్తం లోనే అత్యధికంగా పంటలు పండే సారవంతమైన ప్రాంతం కనుచూపుమేర పచ్చని పంటపొలాలు వాగు ఓడ్డున తాటివనం అపైన అడవి ఆ ఆడవి అట్లా భూపాల్ పల్లె దాక విస్తరించివుంది.

కరీంనగర్ టౌన్ నుండి ఒక మిత్రుని కారులో చీకటితోనే బయలుదేరాం అక్కడికి చేరుకునే సరికి సూర్యుడు తాటి లోపలనుండి పైకి ఎక్కి వచ్చిండు కారులో నుంచి కాలుబయటపెడుతుంటే నా కంటే ముందే దిగిన మోహన్ రావు .

“ఇదిగో ఇటు చూశావా” అంటూ రోడ్డును చూయించిండు.

రోడ్డు మీద నాకేమి కన్పించలేదు.”ఏముంది ఇక్కడ” అన్నాను అర్థంకాక.

“ఏమీ కన్పించటం లేదా” అన్నాను మరోసారి బోళాగా చిన్న పిల్లాడిలా నవ్విండు.

“ఊహు ఊహు” అన్నాను తల అడ్డంగా తిప్పుతూ”

వేలెత్తి రోడ్డు కేసిచూపిస్తూ “ఈ రోడ్డుకు ఇరువైపుల పెండకళ్ళు కనిపిస్తున్నాయా” అంటూ అడిగిండు.

అప్పుడు గ్రహించాను. నిజమే రోడ్డుకు ఇరువైపులా పెండకల్ల వాటిని తొక్కుకుంటూ పశువులు నడవటం వల్ల రోడ్డుకు ఇరువైపులా చిందరచిందరగా ఉన్నాయి.

మోహన్ రావు సార్ వాటికేసి పరీక్షగా చూస్తూ “ఇట్లా తోవకు ఇరువైపుల పశువుల పేడ కన్పిస్తుందంటే ఈ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయన్న మాట” అన్నాడు నా వైపు చూస్తూ అదే చిర్నవ్వుతో..

నేను పుట్టిపెరిగింది పల్లెటూల్లోనే మాది పేదకుటుంబం చదువుకోను పట్నం వచ్చి. స్థిరపడిన తరువాత ఎవరిలొల్లి వారిదైంది. నా చిన్నప్పుడు ఇంట్లో పిడకలు చేసుకుని.. మేతకు పోయ్యే పశువుల వెంబడి, మేత మేసి తిరిగి వచ్చి పశువుల పేడ కోసం పోటి పడే వాళ్ళం ఏదైన బర్రెతోక లేబడ్తె చాలు ‘అది నాది నాది’ అంటూ పోటీలు పడే వాళ్ళం . చప్పున అదంతా గుర్తుకు వచ్చింది.

“అవును సార్ నిజమే” అన్నాను.

” ఒక గ్రామంలో పాడి సమృద్ధిగా వుందంటే ఆ గ్రామంలో పంటలు బాగా ఉన్నట్టే లెక్క . ఇప్పుడు అటు వంటి గ్రామం రాబోయే ఓపెన్ కాస్ట్ గని కింద మాయంకాబోతుంది. చివరికి ఇక్కడ , ఒకప్పుడు మనుష్యులు బతికినవారనే చారిత్రక ఆనవాళ్ళు కూడా దొరకకుండాపోతుంది.” అన్నాడు.

రోడ్డు దిగువన కారు పార్కింగ్ చేసి మాదగ్గరికి వచ్చిండు మిత్రుడు. ఆయన పేరు వెంకటయ్య .యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైరై విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. ఇంతవరదాక మన బ్రతుకేదో బతికినం కాని జీవితంలోని చివరి దశలోనైనా మనిషిగా సమాజానికి ఏమన్నా చేయ్యాలి అనేది ఆయన అభిప్రాయం.

“మనమే ముందు వచ్చినట్టున్నది ” మనవాళ్ళు ఎవరు రాలేదు . సరే పోయి అట్లా ఆ హోటల్లో కూచుందాం పదండి” అంటూ దారి తీసిండు.

“ఉదయం ఏడు గంటలకు ఇక్కడ ఉండాలన్నది అనుకున్నాం… హైదరాబాద్ నుండి రావాలి కదా ! కాస్త వెనక ముందు వస్తారు ..” అన్నాను.

“ఒకటి మాత్రం వాస్తవం .. ఓపెన్ కాస్ట్ వల్ల పర్యావరణ పరంగా ఏర్పడే దుష్పరిణామాల గురించి ఇంటర్ నెట్లో కొంత అధ్యయనం చేసాను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ అమెరికా , ఆసియా , యూరప్ తదితర దేశాల్లో ఓపెన కాస్ట్ వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ కోసం, భూమి ప్రేమికులు ధర్తీ బచావో వంటి ఉద్యమాలు లేవదీశారు. ఇంగ్లాండులోనైతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చి జనం గనుల మీద దాడి చేసి యంత్రాలను తగలబెట్టిన సంఘటనలున్నాయి. అన్నింటి కంటే విచిత్రమైన విషయం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకొనే అమెరికా బ్రిటన్ దేశాలు తమ దేశాల్లో ఓపెన్ కాస్ట్ గనులు బందుపెట్టుకొని వెనుక బడిన దేశాల్లో బొగ్గుతవ్వకాలు సాగిస్తున్నాయి.” అన్నాడు.

వెంకటయ్య సారు మాటలకు అడ్డుబోయి మోహనరావు “ఎందుకంటే ఓపెనకాస్ట్ గనుల వల్ల పర్యావరణ దుష్పరిణామం వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి , థర్డ్ వరల్డ్ కంట్రీలు ఎట్లా చేస్తే వారికేంది. అక్కడ సంపదకావాలి .. ఆ సంపద సృష్టించే లాభాలు కావాలి..” అన్నాడు.

“మరి ఎక్కడ బొగ్గు తవ్వకాలు జరుపకుంటే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది.” అన్నాను అతని మాటలకు అడ్డుబోయి.

నా మాటకు వెంకటయ్య సారు బదులిచ్చిండు. “గోరంత లాభానికి కొండంత నష్టం కల్గించవద్దన్నదే పర్యావరణ శాస్త్ర వేత్తల అభిప్రాయం. ఓపెన్ కాస్ట్ ల వల్ల జరిగే పర్యావరణ నష్టం ముందు మనం పొందే లాభం నామ మాత్రమే ఈ భూమ్మీద మన తాత్కాలిక లాభంకోసం భావితరాలకు బతకకుండా చేసే అధికారం మనకు లేదు .ఓపెన్ కాస్ట్ వల్ల ఆ ప్రమాదం ఉంది. అట్లా కాకుండా అండర్ గ్రౌండ్ గనులవల్ల అంతప్రమాదం లేదు. ఇంధన అవసరాలు తీరాలంటే పర్యావరణానికి భంగం కల్గించని ప్రత్యామ్నాయ వనరుల మీద దృష్టి పెట్టాలి.”

మేము ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చి చిన్న గుడిసె హోటల్లో బెంచీల మీద కూచున్నాం హోటల్ యజమాని నడీడు వయసులో ఉన్నాడు అతను వచ్చి “చాయ్ గావాలా సారు ” అంటూ అడిగిండు.

అతన్ని నిరాశపరచటం ఇష్టంలేక “మూడు చాయ్ లు ఇవ్వు” అన్నాను.

అతను మా కోసం ప్రత్యేకంగా చాయ్ పెట్టి తీసుకు వచ్చిండు.

మోహన్ రావు అతనితో మాట కలిపిండు.

మీ ఊళ్ళో బొగ్గు బాయిలు వస్తే ఎట్లా ఉంటుందంటావు ” అంటూ అడిగిండు.

హోటల్ యజమాని ఒకసారి మాకేసి నిర్లిప్తంగా చూసి నిట్టూర్చిండు…

“ఎట్లా ఉంటుంది సారు .. అంతో ఇంతో భూమి ఉన్న వాళ్ళకు అంతో ఇంతో నష్టపరిహారం ఇస్తారంట ఏ భూమి జాగలేక ఇదిగో ఇట్లా హోటల్ పెట్టుకొని బతుకుతున్న మాలాంటి వాళ్ళ బతుకు ఏం కావాలి ఊరు ఉంటనే బతుకు ఊరు లేకుంటే బతుకు ఎక్కడుంటుంది మల్లీ ఏ చెట్టో పుట్టో పట్టుకొని పోవాలి”

“మరి ఊర్లో ఏమంటుండ్లు …” అంటూ మళ్ళీ అడిగాడు మొహనరావు.

“తలొక్క మాట మాట్లాడుతుండ్లు కొద్ది మంది పెద్ద దొరలేమో కంపినోనికి భూములు అమ్ముకొని వచ్చిన పైసలు తీస్కొని పోదామనిచూస్తుండు. చాలామంది భూములు పోతే బతికేదెట్లా .. వాడిచ్చే నష్టపరిహారంతో ఎన్ని రోజులు బతుకుదాం అంటూ వ్యతిరేకిస్తాండ్లు .. మాఅటువాంటి వాళ్ళ పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది ” అన్నాడు.

వెంకటయ్య కల్పించుకొని ” ఇంతకు మీ ఊర్లో బొగ్గు బాయిలు కావాలంట్లుండ్లా వద్దంటుండ్లా ” అన్నాడు.

“వద్దనే వాళ్ళు ఎక్కువున్నారు సారు. ఎందుకంటే ఇంతవరకు బొగ్గుబాయిలు వచ్చిన ఏ ఊళ్ళు బాగుపడలేదు .అన్నింటికన్ని ఆగమైపోయినాయి. మొదట్లో భూమిపోయినోల్లకు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళంట. ఇప్పుడు ఉద్యోగాలు కూడా ఇవ్వరంట.ఉద్యోగాలు రాక భూములు పోయి ఎట్లాబతుకుతారు..అందుకే మీ బొగ్గుబాయిలు వద్దు మాకు ఆ బొందల గడ్డలు వద్దనే వాళ్ళు ఎక్కువైండ్లు.. మరి ఎట్లయితదో చూడాలి..” అన్నాడు మేం తాగిన చాయ్ గ్లాసులు తీసికెళ్తూ..

అతనింకా ఏదో చెప్పేవాడే కాని .అంతలోనే దూరం నుండి దుమ్ము లేపుకుంటూ వాహనాలు వచ్చినాయి.

హైదరాబాద్ నుండి రావల్సిన వాళ్ళు వచ్చారు. వారితో పాటు పిలవని పేరంటంలా పోలీసుల జీబు వచ్చింది.మానవ హక్కుల నాయకులు, న్యాయవాదులు జర్నలిస్టులు , యునివర్సిటీ ప్రొఫెసర్లు మొత్తం పదిపన్నెండు మంది ఉన్నారు.పరిచయాలు అయినవి. వాళ్ళు వచ్చింది కనిపెట్టి స్థానికులైన యువకులు కొందరు వచ్చారు . ఇవాల్టి ప్రోగ్రాంకు ఏర్పాట్లు చూస్తున్నది వాళ్ళే. వాళ్ళంతా గోపాల్ సారును చుట్టుముట్టిండ్లు.

గోపాల్ సారు మానవహక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఉద్యమకారుడు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి , తాడితులు , పీడితులైన జనసామాన్యం కోసం, వారి బతుకు కోసం, హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున వ్యక్తి అప్పటికే ఆయన చాలాసార్లు ఆ గ్రామానికి వచ్చి ఉండటం వల్ల ఆయన్తో వారికి చనువు ఏర్పడింది.

“ఏమైంది రాజీరు మేం రావటం కాస్త ఆలస్యమైందనుకుంటా ” అన్నాడు అందులో ఒక యువకుడిని ఉద్దేశించి.

ఆ యువకుడు కాస్త తడబడి “పెద్ద ఆలస్యం ఏమి కాలేదు సారు.పొద్దెక్కితే జనం ఎవరి పనుల్లోకి వాళ్ళు పోతారని తొందర ” అన్నాడు.

“అయితే ఇంకా ఆలశ్యం ఎందుకు పాదయాత్ర మొదలు పెడదాం : అన్నాడు గోపాల్.

స్థానిక యువకులతో కల్సి .. మావాళ్ళు తయారండ్లు .. మా వెంట తెచ్చిన బ్యానర్లు పట్టుకొని ముందు వరసలో తయారైండు మోహన రావు

మా పాదయాత్ర ఆరంభమైంది.

స్థానిక యువకులతోని కలిసి మొత్తం మేం పాతిక మందిమి కూడా లేం.

“ఊళ్ళను బొందల గడ్డలుగా మార్చి ఓపెన్ కాస్ట్ గనులు మాకొద్దు మాకొద్దు..”

“మా భూమి మాకు కావాలి”

“మా చేను చెల్క మాకు కావాలి”

“మా నీళ్ళు మాకు కావాలి..”

“మా గాలి మాకు కావాలి..”

వద్దు వద్దు .. ఓపెన్ కాస్ట్ గనలు మాకొద్దు…

హాండు మైకు పట్తుకొని గోపాల్ సార్ నినదిస్తుంటే మేము వంతపాడుతూ ముందుకు కదిలాం.

ఊళ్ళోకి వెళ్ళే మేయిన్ బజారు నుండి పాడుబడిన దొరగారి గడి ముందుగా కాపోల్లవాడ , మాలవాడ నుంది మా ఊరేగింపు ముందుకు సాగుతోంది.

కొంత మంది జనం నిలబడి చూస్తుండ్లు .. పిల్లలు యువకులు వచ్చి ఊరేగింపులో కలుస్తున్నారు. ఊరేగింపు ముందుకు పొయిన కొలది ఊరెగింపులో జనం పెరిగి పోసాగిండ్లు.ఊరేగింపు ముందుకు కదులుతోంది.

మా వెంట పోలీసు జీబు .. పోలీసులను చూసి జనం ఊరేగింపులోకి రావటానికి ఎనక ముందాడుతాండ్లు.

నాపక్కన నడుస్తున్న యువకునితో “పోలీసొళ్ళకు ఇక్కడేం పని ” అంటూ అడిగాను.

ఆ యువకుడు నిర్లిప్తంగా నవ్విండు. ” ఏం చెప్పాలి సార్ .. మొత్తం వ్యవహారం అంత వాళ్ళతోని నడుస్తాంది. మీటింగ్ ఉందని మేం ఇంటింటికి తిరిగి చెప్పినం .. కాని అంతకు ముందే పోలీసోళ్ళు మీటింగుకు ఎవరు పోవద్దని చాటింపు చేసిండ్లు .. అందుకే భయపడతండ్లు..” అన్నాడు.

“మీటింగ్ కు వస్తే ఏందట ” అన్నాను.

మీటింగుకు జనం వస్తే ఓపెన్ కాస్ట్ వ్యతిరేక పోరాటం బలపడుతది. అది ప్రభుత్వానికి ఇష్టం లేదు. తుపాకి మొన మీద నైనా ఇక్కడ బొగ్గు తవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకోసం చేయగలిగిందంతా చేస్తున్నది ..” అన్నాడతను నిరాశగా..

“అంటే..”

“ఏంలేదు సారు.. నిన్న మొన్నటి నుండి సార్లు వచ్చి ఓపెన్ కాస్ట్ వల్ల జరుగబోయే ప్రమాదం గురించి చెప్పు కొచ్చిండ్లు అంతకు ముందు ఓపెన్ కాస్ట్ గనులు వచ్చిన కాడ బతుకు ఎట్లా తెల్లారిందో అర్థం చేసుకొని .. జనం లొల్లికి దిగిండ్లు కాని అంతకు ముందయితే ఇదే పోలీసులు వాడవాడన మీటింగులు పెట్టి మా ఊళ్ళకు బొగ్గు గనులు కావాలి మా బతుకులు బాగు పడాలి ” అంటూ బలవంతంగా ఇదే జనంతో ఊరేగింపులు తీయించిండ్లు . ఇప్పుడు వాళ్ల ఎత్తులు సాగుకుండ అయినయ్.” అన్నాడు.

ఊరేగింపు మాదిగవాడకు వచ్చింది.

నినాదాలు హోరెత్తాయి…

ఇండ్ల ముందు గుడిసెల ముందు నిలుచున్న స్త్రీలలో కొందరు గోల గోలగా అరుస్తూ ” మళ్ళీ మీటింగులు పెట్టాడానికి వచ్చిండ్లా .. బొగ్గు బాయిల పేర మావూళ్ళను బొందలగడ్డలు చేసి మా బ్రతుకులు ఆగం చేస్తరా.. ఊరు లేకుంటే మా బతుకులు ఏం కావాలి” అంటా చాతి అంతా ఎండి పోయినపేడు స్త్రీ నోరంతా తెరుచుకొన్ని అరిచింది.”

ఊరేగింపులో నడుస్తున్న ప్రొఫెసర్ రావు సాబ్ క్షణమాగి “అమ్మా ఇదంతా మీ కోసమే .. మేం .. ఓపెన్ కాస్ట్ వ్యతిరేకులమే .. అమ్మ మీటింగ్ ఉన్నది రా.. అక్కడ నీకు అన్ని విషయాలు తెలుస్తాయి” అంటూ సర్దిచెప్పిండు.

ఆ స్త్రీ ఒక క్షణం తటాపటాయించి వచ్చి ఊరేగింపులో కల్సింది. ఆమెను చూసి మరి కొంత మంది స్త్రీలు వచ్చిండ్లు…

అట్లా ఊరేగింపు మాదిగోళ్ళ వాడను కలియతిరిగి చెరువు కట్ట కిందగా సాగి సర్కారు బడి ఆవరణలోకి వచ్చి చేరింది.

మీటింగ్ ఏర్పాట్లు చూస్తున్న వ్యక్తి మరి కాసేపట్లో మీటింగ్ ఆరంభమౌతుందని ప్రకటించిండు. ఇంతలోని కళాకారులు వచ్చి పాటలు పాడసాగిండ్లు .. రెండు మూడు వందల మంది జనం పోగైండ్లు.

అప్పటికి సమయం గడిచిపోతుంది. పొద్దెక్కితే జనం ఎవరి పనిలోకి వాళ్ళు పోతారనె తొందరలో నిర్వాహకులు తొందరపడ్తూ సమావేశం ఆరంభించారు.

సమావేశంలో చాలా మంది వక్తలు మాట్లాడారు. గోపాల్ సారు . భూ సేకరణలో పాటించాల్సిన చట్టాలను అతిక్రమించి ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నదో సోదాహరణంగా వివరించిండు. ముఖ్యంగా రిహాబిలిటేషన్ ఆండ్ రీసెటిల్ మెంట్ చట్టం ఆచరణలో అమలుజరగటం లేదంటూ ఆయన చాల సవివరంగా మాట్లాడిండు.

ఆయన తరువాత మోహనరావు మాట్లాడిండు . ఓపెన్ కాస్ట్ చేసే పర్యావరణ విద్వంసం గురించి. మానవ జీవితంలో అవి సృష్టించే కల్లోలం గురించి వివరించుండు.

ఇంకా చాలా మంది మాట్లాడారు. కాని నన్ను బాగా ఆ కట్టుకున్నది మాత్రం ఆ గ్రామానికి చెందిన మాదిగ బక్కులు

మొదట మీ ఊరోళ్ళు వచ్చి మీ సమస్యల మీద మాట్లాడాలి అని నిర్వాహకులు కోరినప్పుడు .. ఎవరు ముందుకు రాక వెనక ముందాడిండ్లు ..పదే పదే కోరిన తర్వాత ఒకరిద్దరు వచ్చి మాట్లాడిండ్లు కాని .. ఆ మాటలు అంతగా నన్ను ఆకట్టుకోలేదు. అటు తర్వాత మాట్లాడటానికి ఒక ముసలాయన కట్టె పట్టుకొని ఒణుక్కుంటూ వచ్చిండు. నెత్తికి సంప్రదాయకమైన తలపాగచుట్టుకున్నాడు. మొలమీద పంచె , భుజాన ఒక కండువా తప్ప .. పెయ్యికి అంగీ లేదు .. కట్టుకున్న బట్టలు కూడా ‘గావురు ‘ పట్టివున్నాయి. ముడతలు పడిన నల్లటి శరీరం కాయకష్టం చేసి అలిసిపోయినట్టున్నది. సరిగా కండ్లు కనిపించక అతను ఒణుక్కుంటూ మైకు ముందుకు వచ్చిండు. అతను మాట్లాడటానికి లేచి వచ్చినప్పుడు మేం అంతగా శ్రద్ధ పెట్టలేదు. కాని అతను మాట్లాడటం మొదలు పెట్టేసరికి .. మాకు తెలియకుండానే మేం అతని మాటల్లో లీనమైపోయాం… జనం ముందు మాట్లాడటానికి మొదట కొంత తడబడ్డట్టుగా కన్పించిండు.. కాని మాట్లాడటం మొదలు పెట్టిన తరువాత అదో ప్రవాహంలా సాగింది.

“అయ్యా నా పేరు మాదిగ బక్కులు.. నేను పుట్టిపెరిగింది గిదే ఊల్లో .. ” అంటూ మసగబారిన కండ్లతో అందర్ని పరీక్షగా చూసిండు.

“పెద్ద పెద్ద సార్లు మాకోసాం వస్తాండ్లు మాకు మద్ధతుగా వస్తాండ్లు అంటే చూసి పోదామని వచ్చిన కాని ఇంత మందిని చూసిన తరువాత . నాకడుపులో ‘దవ’ను బయట పెట్టాలన్పించింది..” అంటూ క్షణమాగిండు.

“నిజమే అయ్యా కంపేనోనికి మా భూముల్లో దాగి ఉన్న బొగ్గు కావాలి.. ఆ బొగ్గు తవ్వుకోను వాడు పెద్ద పెద్ద యంత్రాలను తెచ్చి .. భూమిని పల్గచీరి తలక్రిందుల చేసి .. మట్టి తీసి గుట్టల లెక్కన పక్కకు పోసి వానికి కావాల్సింది తీసుకుపోతానంటాడు అందుకు త్రుణమో పణమో నష్టపరిహారం ఇచ్చి ఊరోల్లందర్ని సాగనంపుతానంటాడు.. ఇందులో భూమి ఉన్నోనికి అంతో ఇంతో నష్టపరిహారం రావచ్చు.. ఆ నష్ట పరిహారం తో ఎన్నెండ్లు బతుకుతడు అన్నది అట్లా పక్కన పెడ్తాం .. ఇక భూమిలేని సబ్బన్న వర్ణాల సంగతి తెగినగాలిపటం అయితది ఊరి విడిసి దేశంపోతరు అందిన కూలిచేస్తారు..కూలిదొరకకుంటే ఆకలికి చస్తరు .. వాళ్ళ సంగతి వదిలేద్దాం .. కాని ఈ భూమి సంగతేం కావాలి ? .. అంటూ అతను తన గాజు కళ్ళతో అందర్ని పరిక్షగా చూసిండు.. నాలో ఆసక్తి పెరిగింది.

“అయ్యా నేను గుల్కోటి నారాములు సామితోని ఎనకట ఇదే భూమి కోసం నిజాం నవాబుతోటి కొట్లాడినా.. అప్పుడు నా తొడలో గుండు దిగింది.. ఆ కొట్లాటల సచ్చెటోడు సచ్చిండు .. ఏమైతేనేమి .. నిజాం పోయిండు.కాంగ్రేసోళ్ళు వచ్చిండ్లు. నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినోళ్ళకు పించన్లు ఇస్తమన్నరు. ఆ పింఛను కూడా నాకు రాలేదు అయినా నేనేమి రంది పడలేదు. నాకంటూ ఒక సెంటు భూమి లేదు. నా పోరగాండ్లకు సెంటు భూమి సంపాదించి ఇచ్చింది లేదు. అయినా మేం బతికినాం.ఎట్ల బతికినాం అంటే భూమి ఉంది కాబట్టి బతికినాం. భూమి వనల చెరల ఉంటింది.భూమి ఉంది కాబట్టి తల్లి ఒడిలో పిల్లల లెక్కన ఆ భూమి మీద కూలినాలి చేసి బతికినాం. నేను బతికినా నా పిల్లలు బతుకు తాండ్లు రేపు నా మనుమలు బతుకుతారు ..మరి అటువంటి “భూమిని చెరపట్టి తల్లక్రిందులు చేసి పనికి రాకుండా కంపినోడు బొగ్గు తవ్వుకోనిపోతానంటాండు.ఇన్ని వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని సాదు సంరక్షణ చేసిన భూమితల్లిని ఓపెన్ కాస్ట్ పేర ఇక మాకు కాకుండా చేసే అధికారం మీకెక్కడిది.. ” అంటూ ప్రశ్నించిండు…

“తన జీవిత అనుభవాలను కాచి వడబోసి ……………… ప్రశ్నిస్తున్నాడు. జీవితమంతా భూమి కోసమే తపించి పోరాడి భూమిని అంటి పెట్టుకొని బతికిన భూమి తల్లి పుత్రుడు ప్రశ్నిస్తున్నాడు.. మేమందరం నొరెళ్ళ బెట్టాం .. అతనింకా ఏదో చెబుతున్నాడు.

“ఇదిగో మేం నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినప్పుడు .. సర్కారు సైన్యాలు వచ్చి ఊచకోతకోస్తాంటే .. దిక్కు తోచని ఇదే తడిచెర్ల అడవుల్లో తలదాచుకున్నం.. రోజుల తరబడి తిండి లేదు.. ఎర్రటి ఎండలు ఇదే మానేరువాగులో చెలిమలు తవ్వుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నాం .. అటు వంటి నా మానేరు వాగును మీరు మీ స్వార్థం కోసం మాయం చేస్తామంటుండ్లు.. మానేరు వాగు వొడ్డున అడవిని .. అందులో నివసించే సకల జీవరాసులను చెట్టు పుట్టను పిల్లలను నాశనం చేస్తామంటాండ్లు ఇది మీకు న్యాయమైతదా!

అతని ముడతలు పడిన మొఖంలో విచారం కమ్ముకొన్నది. అతను తేరుకొని మళ్ళ మాట్లాడసాగిండు.

“ఈ భూమిని ఈ ప్రకృతిని ఈ చేట్లను ఈ చెలకలను ఈ వాగులను నాశనం చేసే అధికారం ఎవరికి లేదు..” అన్నాడతను వణికే గొంతుతో శాసిస్తున్నట్టుగా…………..

ఆ మాటలు మా మనసులు సూటిగా గుచ్చుకుంటున్నాయి. వెయ్యి మాటల్లో మేం చెప్పలేని విషయాన్ని ఆయన తన జీవిత సారాన్ని వడగొట్టి కొద్ది పొడి పొడి మాటల్లో మాముందు ఆవిష్కరించిండు…. అవును మనిషికి భూమికి ఎన్ని వేల ఏండ్ల అనుబంధం.. అభివృధ్ధి పేరు మీద ఆ అనుబంధాన్ని తుంచేయాలని చూస్తున్నారు స్వార్థపరులు.

అతనింకా మాట్లాడుతున్నాడు…

“భూమిని చెరపట్టినవాడు తల్లిని చెరపట్టినట్టే .. తల్లిని చెరబట్టిన వాడు ఈ భూమ్మీద బతకటానికి వీల్లేదు.. బతకనివ్వద్దు….” వడిలిపోయిన అతని శరీరంలొ ఎక్కడ బలముందో కాని అతని ఆవేశంతో ఊగిపోయిండు… ఆవేశం దుఃఖంగా మారింది.. అతను ఏడుస్తున్నాడు.. చిన్న పిల్లవాడిలా ఎక్కెక్కి పడ్డాడు.

నిర్వాహకులు వచ్చి అతన్ని శాంత పరుస్తూ పక్కకి తీస్కపోయిండు.

అందరి హృదయాలు భారమైనవి.

సమావేశం ముగిసి నేను ఇంటికి వచ్చినా ముసలి బక్కయ్య మాటలు నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి.

అక్కపల్లి రైతులు ఓపెన్ కాస్ట్ గనులకు ఎందుకంతగా తిరుగబడ్డారో నాకిప్పుడు అర్థమౌతుంది.

4 అభిప్రాయాలు »కథలు

4 అభిప్రాయాలు

  1. pentaiahveeragoni Nov 20, 2009 1

    చంద్ గారు కథ చాలా బ్ఆగా రాసారు.అక్క్ద్ జరిగిన సంఘతనను కల్లకు కత్తినత్లుగ చెప్పాదు.ఈ సంఘతన నిజంగ జరిగింది.దానికి చందు కథ రూపము లొ బగ వ్యక్తీకరించాదు. పెంటయ్య్ వీరగొని. వ

  2. Rakesh Nov 21, 2009 2

    చిన్న సవరణ:

    నిజాం సర్కారుతో, రజాకార్లతో కొట్లాడిన యోధునిపేరు “గుల్కోట్ శ్రీరాములు” గారు. ఊరు మంథని. ఆనాటి పోరాటాల్లో దళిత, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా, మంథనిలోని వేదబ్రాహ్మణకుటుంబాలనుంచి ఎందరు యువకులు తుపాకులు చేబూనారో చదువుతుంటే ఒళ్ళు గగుర్పాటుకలిగించే విషయాలెన్నో… వీలైనప్పుడు విపులంగా రాస్తాను.
    ఈ మధ్యనే ఒక మిత్రుడు ఆనాటి చాందా క్యాంపులో విప్లవకారులు దిగిన ఫోటో ఒకటి forward చేసారు. దాదాపు 18 మంది నూనూగు మీసాల యువకులు, (23 సార్లు ఎత్తిన గండ్రగొడ్డలి దించకుండ, క్షత్రియులను చంపిన) పరుశరాముడి ప్రతిరూపాల్లా!!
    మళ్ళొక్కసారి, తెలంగాణరాష్ట్రపునరుధ్ధరణకోసం, గుల్కోట్ శ్రీరాములవంటి మెరికల్లాంటి యువకుల అవసరంపడితే, వాళ్ళని ఆపడం ఎవరితరం?

  3. Rakesh Dec 4, 2009 3

    ఆనాటి సమరయోధుల ఫోటోని discover-telangana.org వారి ఫోటో సెక్షనులో పొందుపరుస్తాను.

  4. ప్రాణహిత » ప్రాణహిత నవంబర్ 2009 సంచికకు స్వాగతం Jan 6, 2010 4

    [...] భూమి పుత్రుడు : పి. చంద్ [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో