Nov2009
చెప్పు చెప్పేది
వేల యోజనాల దూరం ప్రయాణించాక
అందిన ఉత్తరాల కవరుకి
అంటించిన జిగురు ఇంకా పచ్చిగానే వున్నట్టు…
సలపరించే గాయాలు పోస్ట్ చేసిన వాడికి
తిరుగుటపాలో చెప్పు దెబ్బ రావడం
చెప్పక చెప్పేది ఏమిటంటే…
అది ఆగ్రహోదగ్ద హృదయ వేదననే కదా!
అది కడుపు మండిన క్రోధ రూపమనే కదా!
సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజాప్రతిఘటననే కదా!
చేపలు ఎండబెట్టేటప్పుడు
కాకులు వాలకుండా
చనిపోయిన కాకి ఈకని కని పెట్టినట్టు…
పాపాలు పండనివాడు
మనజోలికి మళ్ళీ రాకుండా
నీకాళ్ళ జోడుని విసిరికొట్టావా?
అల్ జయిదీ….!
ఎంతప్రేమగా కొనుకున్నాం చెప్పు…
యుద్ధానికికెళ్ళేటప్పుడు
సైనికులు ఆయుధాలు తొడుక్కునట్టు…
బ్రతుకు యుద్ధానికి బైటకి వెళ్ళినప్పుడల్లా
మనం తొడుక్కున్నదీ చెప్పే కదా!
తల్లిచేసిన తప్పుకి
అన్న అడవుల పాలైనప్పుడు
తమ్ముడు మోసింది అతని చెప్పే కదా!
వాడు చేసిన తప్పుకి
అన్న అడవుల పాలైనప్పుడు
తమ్ముడు మోసింది అతని చెప్పే కదా!
ఏది ఏమైనా
చెప్పు చెప్పేది కూడా వుందని
నిర్భయంగా చెప్పిన కలం వీరుడా !
డొక్కచీల్చి డోలువాయించినంత
ఢమరుక శబ్దం
నీ చెప్పు దెబ్బలో ప్రతిధ్వనించింనందుకు
నిఖిలలోకం నీకు కృతజ్ఞతలు చెప్పాలి
చెప్పు తినెడి కుక్కని
చెరకు గెడతో గద్దించలేదు కదా!
మళ్ళీ చెప్పుతోనే దానిని కొడితే
దానినది పురస్కారంగా గ్రహించే ప్రమాదం లేకపోలేదు!
అయినా సరే….
తిరస్కారాన్ని సూచించేది ఇప్పుడు
చెప్పే అవ్వటం చెప్పదగిన పరిణామమే కదా !
ఆవేశంలో చేతికందింది అదే అయినప్పుడు
సరైన ప్రాసలోనే కొట్టావు కదా!
పాదాలు ముఖం వైపు వున్నవాడు
ఒకవైపే నడుస్తాడు..
కాని .. పాదాలు వీపు వైపు తిరిగివున్న వీడు
ఎటేపైనా వస్తాడు…
మారణాయుధాల తనిఖీ వంకతో వచ్చి
మన తలకాయనే తన్నుకు పోయిన వాడ్ని
తాకి నేల రాలాక
నీ చెప్పు చెప్పిన వాడి మలిన కథ
చరిత్ర చర్విత చరణం చేస్తుంది
మత్య్సయంత్రాన్ని విల్లుతో కొట్టిన
వీరుడ్ని వరించిన పురాణ ‘కన్య’ కన్నా
బుష్ యంత్రాన్ని చెప్పుతో కొట్టిన
నిన్ను వరిస్తున్న ‘చారిత్రక కన్య’ని
నేనెక్కువ అభిమానిస్తున్నాను.
నాసోదరిగా గర్విస్తున్నాను.
November 18th, 2009 at 9:21 am
చాలా బాగుంది. అల్ జయిదీ ధీరోదాత్తతను ఎత్తిపట్టింది. సామాన్య జనానికి ఆ చర్య ఒక కొత్త ఆయుధాన్నిచ్చింది.
January 6th, 2010 at 9:18 pm
[...] చెప్పు చెప్పేది : ఆంజనేయకుమార్ [...]
March 2nd, 2010 at 12:15 pm
ప్రపంచం మొత్తం పై పెత్తనం చేయాలనుకునే వాడి పైకి ప్రతీ ఒక్కడి ఆయుధం