Nov2009
దిగులు గీత
సూర్యుని తొలికిరణం
ముందుగా నిన్నే సోకిందా, అనామికా..
విడవలేక వెళ్తున్నట్టు
మలి సంధ్యలోని ఆఖరి కిరణమూ అంతే…
అల ఉవ్వెత్తున ఎగసి
నీపాదాల చెంతకురికి
నీకే పరిమితమైన స్వర కల్పనతో
ఆర్ద్ర సంగీతాన్నివినిపిద్దామనుకుంటుంది
ఉండుండి ఒక చేప పిల్ల
ప్రవాహం మీదుగా ఎగిరి
ఆకాశ విన్యాసం చేస్తూ
మౌనభంగం చేయాలనుకుంటుంది.
రాజీవ గాంధీ బీచ్ మధ్యగా వెలసిన
కంటికి సుతిమెత్తగా అగుపడే
ఏకశిలా విగ్రహం నీవు
రాత్రి కురిసిన బహిరంగ వానలో
గోదావరిలో జలకాలాడినట్టు
తడిసి ముద్దై మురిపిస్తుంటావు
గోదారి మీద అలిగినట్లు
తూర్పుకు అభిముఖంగా
చలన రహిత రాతి మనసుతో
తెలుగుదనాల వనంలో
మందలోంచి తప్పిన మేకలా
వలస వచ్చిన విదేశీ వనితగా
పీఠమెక్కి కూర్చున్నావు
వెన్నెల రంగరించిన లేపనం పూసుకుంటూ
సదా మత్తెక్కిన చూపులతో
మా ఊరి వలపుల చిరునామాగా
కనువిందు చేస్తావనుకున్నాను
సందర్శకుల చూపుల తూపులు
అంగాంగాల్నే స్పృశిస్తూన్నాయి
భారంగా కదులుతున్న దుఃఖ ఛాయల్ని
పట్టించుకునే వాడే లేడు
నీ వదనారవిందం లోని
మరోకోణాన్ని ముందుగా నేనే చూసాను
రాతి సొగసులోని
మూర్తీభవించిన దిగులు నీడలను
పసిగట్టింది నేనే
ఎంత దిగులు నింపుకుని చెక్కాడో
ప్రేమవైఫల్యాల శిల్పి
నాగుండెలోనూ
విషాద ఘంటికల్ని మోగిస్తున్నాడు
మొనాలిసా దోరనవ్వులొని
లేశ మాత్రపు సంతోషరేఖల్ని
ఇంకా కొలవనేలేదు
గేలమేసి ఆటాడిస్తున్న
ఈ అనామిక శిల్పం ముఖం మీద
గూడుకట్టిన దిగులు పొరను
లెక్కించడానికి ఎంతకాలం పడుతుంతో ?
(యానాం గోదావరి ఒడ్డున విదేశీ యువతి విగ్రహం చూసి…)
December 16th, 2009 at 1:58 pm
కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.
December 17th, 2009 at 6:19 am
మీరు బా రహంతుల్లా నా?
February 6th, 2010 at 2:11 pm
[...] దిగులు గీత : దాట్ల దేవదానం రాజు [...]