Nov2009
మాదిగ భగత్సింగ్
పోగుల కుప్పల్లో జరిగిన మోసం
ఎన్ని పావురాల్ని నేలరాల్చిందో……..
జాంబవంతుడు
గాంధీభవన్లో తగలబడ్డాక
చెన్నని కండ్లు సల్లబడ్డయ్
డప్పు కన్నపేగు కాలినంక
గుండెసప్పుడు ఆగిపోయింది
పాలక జూదంలో
మళ్ళీ పాండవులే వంచించబడ్డారు
అభిమన్యుడొకడు
నగరం నడిబొడ్డున
మాదిగ భగత్ సింగ్
తెగిన చెప్పుల కోసం
పగిలిన డప్పుల కోసం
అతడు పడ్డ ఆరాటం
ఆగని దరువై మోగుతున్నది
కొడుకులేని ఆ యిల్లు
తునకల్లేని దండమైంది
జాతికోసం అతడు నడిపిన పోరు
ఆ తల్లికి
ఒడవని కన్నీళ్ళను
బహుమానంగా ఇచ్చింది
బిక్కు బిక్కున చూస్తున్న
సెల్లెండ్ల ఎదురుచూపులో
‘అన్న ‘జాడ అదృశ్యమైంది
ఏ రాత్రో కొడుకు
సందమామై కనిపిస్తాడనుకున్న
తండ్రి ఆశ
నిండు అమాసై ఎదురొచ్చింది
ఆ కొడుకు ఏడికి పోయిండు?
గాయిదోళ్ళు ఏండ్ల గోసదీర్చి
పోరాటడప్పై
ఊరూర ఉద్యమ పాటయ్యిండు
చెప్పులు కుట్టే చేతుల జూసి
రగిలే మంటయ్యిండు
ప్రశ్నించే చిర్రా సిటికెనలయ్యిండు
దగాపడ్డ నెత్తురంతా
అతనికోసం
పదునెక్కుతుంది
ఇక చరిత్రంతా…
కోసిన కత్తులదో
కుట్ర చేసిన చేతులదో కాదు
చరిత్రంతా తలతెగిపడ్డ దేహాలదే
‘మాదిగ భగత్సింగ్’ పాదాల వద్ద
చావు మోకాళ్ళమీద వంగింది
అస్తమయం కాసేపేనని
ఇప్పటి చీకటితో
రేపటి సూర్యోదయం ప్రకటిస్తుంది
November 20th, 2009 at 5:30 am
ఇక చరిత్రంతా…
కోసిన కత్తులదో
కుట్ర చేసిన చేతులదో కాదు
చరిత్రంతా తలతెగిపడ్డ దేహాలదే
నిజమే కదా? ఊరిచివరి దీపపు స్థంభానికి వేలాడిన శిరస్సు ఎప్పటికీ చెరిగిపోని సాక్ష్యం..
November 22nd, 2009 at 1:44 am
గాంధీభవన్ మీద మాదిగలు దాడిచేసి తాము చావడమే కాకుండా ఒక రాజుని కూడా చంపేశారు. దాని సంగతి మాట్లాడరేం, మాదిగ మహాకవులు ?
November 24th, 2009 at 5:09 am
“ఏ రాత్రో కొడుకు
సందమామై కనిపిస్తాడనుకున్న
తండ్రి ఆశ
నిండు అమాసై ఎదురొచ్చింది ”
ఆది జాంబవుణ్ణీ,చెన్నడిని ,పోగుల వాటాల్లో తేల్చుకోవాల్సిన సహజ న్యాయాన్నిస్వఛ్ఛంగా
కవిత్వీకరించినందుకు పసునూరికి అభినందనలు.
నిండు పున్నమిలా వెలగాల్సిన కొడుకులు అమాస చంద్రుళ్ళై పోడానికి కారణమవుతున్న
రాజకీయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి.
ఊరూరా సిర్రా చిటికన పుల్లయి ఉద్యమమయిన “మాదిగ భగత్ సింగులు” పార్లమెంటరీ అసెంబ్లీ
జాతర్లకి పరిమితమై పోకుండా ఏం చెయ్యాలో కూడా ఆలోచిద్దాం.
ఎ.కె.ప్రభాకర్ .
January 6th, 2010 at 4:59 pm
[...] మాదిగ భగత్సింగ్ : పసునూరి రవీందర్ [...]
January 28th, 2010 at 4:42 am
చాలా బాగుంది.
08680-275125 నల్గొండ.