Nov2009
కల్లోల కాలంలో అల్లిన కావ్యం ‘మగ్గం బతుకు’
అప్పటిదాకా రాయలసీమకే పరిమితమనుకుంటున్న కరువు 2000 – 2003 సంవత్సరాలలో రాష్ట్రమంతా పాకింది. అభివృద్ధికి మారుపేరైన గోదావరి ప్రాంతంలో కూడా పైర్లు ఎండిన వాస్తవాన్ని గమనించాం. అప్పటిదాకా కరువు వస్తే జనం పొట్ట చేతబట్టుకొని వలసలు పోవడం, పశువులకు మేత లేకుంటే కబేళాలకు అమ్మేయడం చూశాం. కాని ఈ కాలంలో వచ్చిన మార్పు రైతులు, చేనేత వృత్తికారులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలి, అప్పులు కలిసి బతికున్న మనిషిని నిలువునా శవంగా మార్చడం ఏ జాతికైనా తలవంపులు తెచ్చేదే. ఈ ఆత్మహత్యల దుష్పరిణామం తెలుగు రాష్ట్రాన్ని అట్టుడికించింది. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలబడి ధైర్యమివ్వవలసిన పాలకులు ప్రపంచ బ్యాంకు మత్తులో జోగుతూ తినింది అరక్క చస్తున్నారని, ఎక్స్ గ్రేషియాల కోసం చస్తున్నారని అమానుషమైన వ్యాఖ్యలు చేశారు. అంత బాధ్యతారహితమైన వ్యాఖ్య ఇంకొకటి ఉండదు. ప్రజల ఆమోదం లేకుండా, భారతదేశాన్ని స్వర్గఖండంగా మార్చే మంత్రమంటూ ఎల్. పి. జి వ్యవస్థను పాలకులే దిగుమతి చేశారు. అది ప్రజల పట్ల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ఎవరి ఖర్మకు వాళ్ళను వదిలే దుర్మార్గమని త్వరలోనే ఆర్థమైపోయింది. దాని విష ఫలితాలను భరించలేకనే ఆకలి, అప్పుల చావులు వచ్చాయి. దీన్ని దాచి పెట్టి ప్రజల్ని చులకన చేసి మాట్లాడడం దేశ ద్రోహం కన్నా మించిననేరం.
ఈ కాలంలో రాష్ట్రం నలుమూలల నుండి రచయితలు కమ్ముకొని ప్రభుత్వం మీద సాహితీ యుద్ధం ప్రారంభించారు. ఈ వ్యవసాయం ప్రజలందరికీ సంబంధించింది గాబట్టి దానిమీద ఉద్యమ సదృశంగా సాహిత్యం వచ్చింది. చేనేత వృత్తికారుల మీద రచనలు పరిమితంగానైనా వచ్చాయి. చేనేత గురించి రాయాలంటే సానుభూతి మాత్రమేచాలదు. ఆ వృత్తితో అంతో ఇంతో పరిచయం ఉంటే తప్ప బలమైన సాహిత్యం రాదు.
రాధేయ ప్రగతిశీల కవిగా ప్రజాపక్షం వహించి మూడు దశాబ్దాలకు పైగా కవిత్వం రాస్తూ, ఉమ్మడిశెట్టి సాహిత్య పురస్కారంతో కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ తనదైన సాంస్కృతిక బాధ్యతను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయనది చేనేత కుటుంబం. ఆ వృత్తిలో ఆయన బతికారు. చేనేతతో తనకున్న అనుభవానికే పరిమితమై పోకుండా ఆ కాలంలో రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేశారు. ఎక్కువ మంది రచయితలు రైతుల ఆత్మహత్యలపై దృష్టి పెడితే ఆయన చేనేత కార్మికుల చావుల మీద దృష్టి నిలిపారు. శ్రామికుల పట్ల మమకారం, ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మక దృష్టి గల రాధేయ చేనేత వృత్తి జీవిత విషాదాలను చిత్రిస్తూ కల్లోల కాలంలో అల్లిన కావ్యం ‘మగ్గం బతుకు’. ఇది అచ్చమైన తెలుగు పేరు మాత్రమే కాదు, తెలుగు చేనేత శ్రామికుల జీవన పోరాటాన్ని అత్యంత వాస్తవికంగా, విమర్శనాత్మకంగా ఆవిష్కరించిన కావ్యం కూడా. ఈ కావ్యం
ఇది యధార్థ కథ…..
సగం దేహం గుంటలోనూ
సగం ప్రాణం కళ్ళలో నిలుపుకొని
ఆర్తిగా చేయి సాచే అన్నార్తుల కథ
అంటూ మొదలై
మా రక్తం చిందించైనా
మా వృత్తిని బతికించుకుంటాం
అంటూ ముగుస్తుంది.
ఈ మధ్యలో భారతీయ జీవితంలో చేనేతకున్న ప్రాముఖ్యాన్ని, భారతదేశ చరిత్రలో చేనేత నిర్వహించిన పాత్రను, దాని ప్రస్తుత సంక్షోభాన్ని, దానికి కారణాలను, చేనేత వృత్తిలోని శ్రమను, దానిలోని కళా విలువల్ని అనేక విధాలుగా రాధేయ ఆవిష్కరించాడు. ఒక వృత్తి జీవిత పరిణామాలను కావ్యంగా మలచ దలుచుకున్న కవికి దాని చరిత్ర, దాని అంతరంగం సమగ్రంగా తెలియాలి. రాధేయకు చేనేత వృత్తికి సంబంధించిన జానపద , పౌరాణిక , చారిత్రక, కళాత్మక పరిఙ్ఞానమంతా తెలుసు. చందమామలో కనిపించే మచ్చను దూదివడికే అవ్వగా భావించే జానపద భావనను ప్రస్తావించారు. మానవజాతి మానాన్ని కాపాడే వస్త్ర నిర్మాణం తెలుసు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో చీరలే ఆమె మానాన్ని సంరక్షించిన విషయాన్ని ప్రస్తావించాడు. స్వాతంత్ర్యోద్యమంలో చేనేత వృత్తి నిర్వహించిన పాత్రను గుర్తు చేశారు. మువ్వన్నెల జెండాలో చేనేత వారి శ్రమను స్మరించాడు. పెండ్లిళ్లలో పెద్ద పెద్ద వాళ్ళ గౌరవాన్ని పెంచే చేనేత ఔన్నత్యాన్ని ప్రస్తుతించాడు. అటువంటి వృత్తి సంక్షోభంలో కూరుకు పోవడం పట్ల కవి ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నిజానికి చేనేత సంక్షోభం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. వలస పాలనలోనే ఈ సంక్షోభం మొదలయ్యింది. పారిశ్రామిక విప్లవం ఫలితంగా మార్కెట్లను వెతుక్కుంటూ సామ్రాజ్య వాదులు భారత దేశంలో ప్రవేశించి మన చేతిమగ్గాలను మూలకు నెట్టి వాళ్ళ మరమగ్గాలను ప్రవేశ పెట్టారు. కుటుంబ జీవనాధారంగా, కుటుంబ పరిశ్రమగా ఉన్నది వ్యాపార పరిశ్రమగా మారింది. చేనేత సంక్షోభం మొదలయ్యింది. బ్రిటీష్ పాలకులతో తొలి దెబ్బ తిన్న చేనేత రంగం అప్పటి నుంచి నేటి దాకా అలాగే కునారిల్లుతున్నది. అందుకే స్వాతంత్ర్యోద్యమంలోని నిర్మాణ కార్యక్రమాలలో ఖద్దరునేత, ఖద్దరు ధారణ ప్రధానమైనది. ఖద్దరు నెయ్యడం, ఖద్దరు ధరించడం దేశభక్తికి సంకేతమైంది.
ఓ చిన్ని రాట్నమా ! వయ్యారి రాట్నమా!
…………..
బానిస భావన పడియున్నవారికి
స్వాతంత్ర్యమిడుదవు వడివడివడుకు
(కవికొండల, రాట్నం)
కనపర్తి వరలక్ష్మమ్మ (కుటీర లక్ష్మి) చంద్రకళ (ప్రేమ వేదిక మీద) తాడినాగమ్మ (కథ కాదు) వంటి కథలలో చేనేత రంగ వైశిష్ట్యాన్ని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చినాక చేనేత పరిస్థితిలో అంతగామార్పు లేదు. అందుకే 1952 లోనే అందె నారాయణ స్వామి కథ ‘శిల్పం’ లో శివయ్య “స్వతంత్రం మాకేమిచ్చింది!” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు ఇంకా ఎంతో విలువ ఉంది. ఈ పరిణామాలకు కారణం రాధేయ స్పష్టంగానే పేర్కొన్నారు.
ఈ మగ్గాల శాలలన్నీ మార్చురీ గదులుగా
రూపాంతరం చెందుతున్న /దీనాతిదీన దుఃఖం
ఈ విధ్వంసం విషాదానికి / పల్లవి ప్రపంచీకరణానిది
చరణం సామ్రాజ్యవాదానిది/పాపం పాలనాయంత్రాంగానిది
రాధేయ సాధారణంగా చిక్కనైన భావుకతతో కవిత్వం రాస్తాడు. అయితే చేనేత రంగ సంక్షోభం పట్ల సామాన్య పాఠకులకు కూడా ఆలోచనల్ని రేకెత్తించాలన్న సంకల్పంతో ఆయన శిల్ప ప్రాధాన్యాన్ని తగ్గించుకున్నారు.
మా బాధల గాధలన్నీ
అనుభూతుల వాక్చిత్రాలకు అందవు
శిల్పచమత్కారాలకు లొంగవు
వ్యవసాయరంగం లేకుండా చేనేత రంగం లేదని రాధేయకు తెలుసు. అందుకే రెండు మూడు పర్యాయాలు కావ్యంలో రైతును, చేనేత కార్మికుణ్ణి కలిపి స్మరించాడు.
కదురు కవ్వం ఆడితే /కరువే లేదంటారు
రైతన్ననేతన్న/ ఈ దేశానికి కవల పిల్లలంటారు
రైతన్న కాయకష్టంతో/నేతన్న శరీర కష్టంతో
చెమటతో ఒళ్ళంతా తడిసినా
ఏనాడు కడుపు నిండిందిలేదు
తృప్తిగా చేయి కడిగిందిలేదు
పత్తిని పండించిన వాడు పాడెమీద ఊరేగుతున్నాడు
పత్తిని వస్త్రంగా నేసిన వాడూ మగ్గం గిలకకు
ఉరేసుకుంటున్నాడు
ఈ సమష్టి దృష్టి రాధేయకున్న సంస్కార వైశాల్యానికి నిదర్శనం, సంప్రదాయ వృత్తులు బలంగా ఉన్న రోజుల్లో ఆయా వృతుల వాళ్ళు తమ పిల్లలకు పెళ్ళిళ్లు చేసేటప్పుడు తమకు రాబోయే అల్లుళ్ళు , కోడళ్ళు తమ వృత్తుల్లో నిపుణులేనా అని పరిశీలించే వాళ్ళు, ఇది మూడు దశాబ్దాల క్రితం దాకా అమలులో ఉండిన సత్యం. చేనేత కుటుంబాల్లో అబ్బాయికి మగ్గం నేర్వడమే అర్హతగా ఉండేదని రాధేయ గుర్తు చేస్తూ అలాంటి వృత్తికారులు ఆకలి చావుల పాల పడవలసిరావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వృత్తి కేవలం పురుషులకో స్త్రీలకో సంబంధించింది కాదు, అది ఇంట్లో వాళ్ళందరూ పాల్గోనే ఉమ్మడి వృత్తి. అలాంటి వృత్తి నశించిపోతుంటే భరించలేని రచయిత
దేశదేశాల మానాభిమానాలు కప్పుతున్నా
ఈ దేశం మాకేమిచ్చింది!
కడుపు నిండా ఆకలి
కళ్ళనిండా చీకటే కదా!
అని నిలదీస్తాడు.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మిగిల్చింది మనల్ని మన జీవితం నుంచి పరాయీకరించడమే. రాధేయ ఈ పరాయీకరణను బాగా ఎత్తి చూపాడు.
… రాజకీయం
స్వతంత్ర కార్మికుల్ని
షెడ్డు కూలీలుగా మార్చి
పుణ్యం కట్టుకుంది
దీని కంతటి ప్రధాన బాధ్యత రాజకీయానిదేనని రాధేయ అవగాహన. అందుకే రాజకీయ నాయకత్వంపైనే ఆయన ప్రశ్నలు సంధించారు.
మా నేతగాళ్ళ ఆకలిచావులకు
మా ఓటుతో గెలిచిన
ఈ నాయకులంతా బాధ్యులు కాదా
ఆకలి చావులలో అశువులు బాసిన కార్మికుల వివరాలు సేకరించి వాళ్ళందరికీ కావ్యంలో స్థానం కల్పించడం ఈ కావ్యంలోని విశేషం. ఆఖరికి రాధేయ కోరుకుంటున్నది ఏమిటి?
మా కష్టానికి తగిన
ప్రతిఫలం దక్కేలా
చట్టాల్ని సవరించండి
మర మగ్గాల్ని నియంత్రించి
మా రెక్కల కష్టాన్ని నిలపండి
ఇదీ ఆయన కోరుకుంటున్నది. ఇదినెరవేరలేకపోతే ఉద్యమించడానికి సంసిద్ధతను ప్రకటించాడు.
మమ్మల్ని హింసించి
మా వృత్తిని ధ్వంసంచెయ్యాలనుకుంటే
సహించే సౌజన్య మూర్తులం కాం….
వీరత్వం మా క్షేత్రంలోనే ఉంది.
ఈ కావ్యం ఒక సంప్రదాయ శ్రామిక వృత్తిని, సామ్రాజ్య వాదం, దానికి శిరసు వంచిన పాలకవర్గం ఎలా ఛిద్రం చేశాయో ఆవేదనాత్మకంగా ఆవిష్కరించింది. ఇది రావలిసిన సమయంలో వచ్చిన కావ్యం. తెలుగు శ్రామిక కవిత్వంలో విలువైన కావ్యం “మగ్గం బతుకు”. అందుకే ఈ కావ్యం విస్తృత పాఠకులకు దగ్గరయ్యింది.
మగ్గం మీదనే
మరణ శాసనాలు నేస్తున్న
నేతగాళ్ళ ఆకలిచావులు
కు అక్షర రూపం ఈ కావ్యం.
రాధేయ రచించిన ఈ కావ్యంలో ఆచార్య కొలకలూరి చెప్పిన నిబద్ధత, నిమగ్నత, నిబిడత అనే మూడు గుణాలు కనిపిస్తాయి. ఇది కేవలం ఒక వృత్తి చిత్రణ కావ్యం మాత్రమే కాదు. దీనిలో రాజకీయ పార్శ్యం కూడా బలంగా ఉంది. ఆర్థిక సాంఘిక దృష్టికోణాలెటూవున్నాయి. కల్లోల కాలంలో శ్రామిక కళాకారుల పక్షాన నిలిచిన రాధేయ అభినందనీయుడు.
3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు
December 30th, 2009 at 1:07 am
This poetry is very interested and also near to social
January 28th, 2010 at 4:46 am
చాలా బాగుంది.
08680-275125 నల్గొండ.
February 13th, 2010 at 5:12 am
రాచపాళం గారికి నమస్కారములు…మగ్గం బతుకులు కావ్యం మీద రాసిన మీరు రాసిన సమీక్ష చాలా బాగుంది. ముందుగా రాధేయ గారికి నా హృదయ పూర్వక వందనాలు..చేనేత వృత్తిలో పుట్టి గొ ప్ప సాహిత్య సృజన చేసిన రాధేయ గారికి ఉద్యమాభివందనాలు.ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తు అన్నీ ధ్వంసమై పోయాయి. కానీ అంతరించిపోతున్న కొ న్ని కులవృత్తుల మీదనే సాహిత్యం వచ్చింది. ఈక్రమంలో మీరు చేసిన మగ్గం బతుకు సృజనకు నా వందనాలు..ఈ కావ్యం కోసం చాలా పుస్తకాల షాపుల్లో కొ నాలని ప్రయత్నం చేశారు. కాని లభించలేదు. రాధేయగారు…లేదా రాచపాళెం ఐనా దయతో నాకు ఒక పుస్తంక పంపించగలరు. కోడం కుమార్, తెలుగు పరిశోధకులు…9848362803