మహిళా సాహిత్య విమర్శకులతో కుసుమకుమారి

మొదటి నుంచి తెలుగుసాహిత్య విమర్శకులలో మహిళల సంఖ్య పరిమితంగానే ఉంటున్నది. విశ్వవిద్యాలయాలలోగాని, బయటసాహితీ రంగంలోగాని ఇదే పరిస్థితి. అయినప్పటికీ, ఉన్నదేదో ఉన్నట్లు సాహిత్య విమర్శ రాస్తున్న మహిళలలో అనేకులు గట్టివారే వున్నారు. ఇప్పటిదాకా మనకు లభిస్తున్నా మహిళాసాహిత్య విమర్శకులను నాలుగుతరాలుగా పేర్కొనవచ్చు. ఉట్కూరు లక్ష్మీకాంతమ్మ, పి. యశోదా రెడ్డి, నాయని కృష్ణకుమారి వంటి అతి తక్కువ మంది తొలి తరం వాళ్ళు. లక్ష్మీకాంతమ్మ రచించిన “ఆంధ్ర కవయిత్రులు” తెలుగు రచయిత్రుల చరిత్ర రచనకు జరిగిన తొలి ప్రయత్నం. మంచి పరిశోధన విలువలు గల గ్రంధం. మొల్ల రామాయణానికి ఆమె రాసిన పీఠికలో స్త్రీ దృక్కోణం ఉట్టిపడుతుంది. “తెలుగులో హరివంశములు” అనే యశోదా రెడ్డి పరిశోధనా గ్రంధం ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో చేసే ప్రయత్నం జరిగింది. జానపద గేయగాధల మీద కృష్ణకుమారి పరిశోధన సంపూర్ణంగా ఆధునిక ప్రమాణాలతో జరిగింది. ఈ ముగ్గురు మంచి వక్తలు కావడం విశేషం. రంగనాయకమ్మ ,రావి భారతి, రావి ప్రేమలత, తమ్మారెడ్డి నిర్మల, కోలవెన్ను మలయవాసిని, బి. అరుణ కుమారి , సి,ఆనందరామం, పి.సంజీవమ్మ , టి.సుశీల వంటివాళ్ళు రెండవ తరం విమర్శకులు. వీళ్ళలో సంప్రదాయవాదులు, ఆధునికులు ఉన్నారు. వీళ్ళు జానపద, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను విశ్లేషించారు.తర్వాతి తరంలో సుమతీ నరేంద్ర , కాత్యాయనీ విద్మహే, పి.జ్యోతి, బి.రుక్మిణి, కె.కుసుమ కుమారి, యం. విజయలక్ష్మి, డి.కృష్ణ కుమారి, డి.విద్యేశ్వరి, ఓల్గా, జయప్రభ , నల్లూరి రుక్మిణి వంటి వాళ్ళు వస్తారు. ఈ తరం వాళ్ళ మీద ఎక్కువగా ఆధునిక భావజాలం ప్రభావంచూపింది.రెండో తరం లోని సంజీవమ్మలాంటి ఒకరిద్దరు మార్క్సిస్టు విమర్శకుల సంఖ్య మూడవతరంలో పెరిగింది. మొదట మార్క్సిస్టుగా ఉన్నవాళ్ళు తర్వాత స్త్రీ వాదులుగా మారిన వాళ్ళూ ఉన్నారు. ఆండమ్మ శరత్ జ్యోత్స్నా రాణి, కె.ఆశాజ్యోతి, కె.మధుజ్యోతి , రాజేశ్వరి, కె.శ్రీదేవి ,శిలాలోలిత, వాడ్రేవు వీర లక్ష్మి దేవి , ఎమ్ ఎమ్ వినోదిని , జూపాక సుభద్ర , గోగు శ్యామల వంటి వాళ్ళు నాలుగవతరం మహిళా సాహిత్య విమర్శకులు. ఈ తరం వాళ్ళు తెలుగు సాహిత్య విమర్శను బహుముఖాలుగా విస్తరింపజేస్తున్నారు.

ఆచార్య పి.కుసుమ కుమారి వీళ్ళలో మూడో తరానికి చెందిన సాహిత్య విమర్శకులు. 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు చదివి ఆ తర్వాత కేతు విశ్వనాధరెడ్డిగారి పర్యవేక్షణలో ” బ్రిటిష్ కాలం నాటి తెలుగు ముద్రిత పత్రాల్లో హిందుస్థానీ ప్రతిదేయాలు ” అనే అంశం మీద పరిశోధన చేశారు. అనంతపురం లోని శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో ఎనిమిదేళ్ళుగా అధ్యాపకులుగా పనిచేసి, ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు శాఖలో రీడర్ గా పాఠ్య ప్రణాళికా సంఘాద్యక్షులుగా శాఖాధ్యక్షులుగా, ఆచార్యులుగా ,కళాశాల ప్రిన్స్ పాల్ గా, తాత్కాలిక రిజిస్ట్రార్ గా పనిచేసారు. అంతేకాదు అనేక పాలనా పరమైన బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ గా ఉంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు హిందీ భాషలు తెలిసిన కుసుమ కుమారి మంచిసాహిత్య విమర్శకురాలు, వక్త , అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో సాహిత్య , సామాజికాంశాల మీద ప్రసంగించారు , భాష సాహిత్యం అనువాదం తులనాత్మక అధ్యయనం వంటి రంగాలలో బాగా కృషి చేసారు. తాను ఆదర్శ వివాహం చేసుకోవడమే గాక తన పిల్లలకు కూడా ఆదర్శ వివాహం చేసారు.

సాహిత్యాన్ని సామాజిక దృక్పధంతో అధ్యయనం చేయడం కుసుమకుమారికి విద్యార్థి దశలోనే అలవడింది. ఎం.ఏ చదువుతున్న రోజుల్లో సాహిత్య విమర్శాధ్యాపకుడు మద్దూరి సుబ్బారెడ్డి ఫైనల్ విద్యార్థులతో పాఠాలు చెప్పించేవారు. తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య జి.యన్. రెడ్ది ప్రతిశనివారం మధ్యాహ్నం సెమినార్ చేయించేవారు. ఈ రెండు కార్యక్రమాలు విద్యార్థులలో సాహిత్య పఠనం పట్ల, విమర్శపట్ల , ఉపన్యాసం పట్ల ఆసక్తిని కలిగించేవి. ఈ సందర్భాలలో కుసుమకుమారి చురుకుగా పాల్గొని సాహిత్య విమర్శలోకి ప్రవేశించారు . అప్పట్నుంచే ఆమెకు స్త్రీ స్పృహ వుండేది. సత్యభామ పాత్ర ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి ప్రతినిధిగా ఆమె ఆరోజుల్లోనే పేర్కొనేవారు. ఆ ప్రకారం క్రమక్రమంగా అభినివేశంగా మారి ఇరవయ్యవ శతాబ్దం ఎనభైలనాటికి ఆమె ప్రామాణికమైన విమర్శకులుగా స్థిరపడ్డారు. భాష, అనువాద, తులనాత్మక అధ్యయనం వంటి అంశాల మీద కృషి చేస్తున్న కుసుమకుమారి తెలుగు సాహిత్యంలోని స్త్రీ వాదం ప్రవేశించడంతో స్త్రీవాద విమర్శకులుగా రూపొందారు. స్త్రీవాద సాహిత్య విమర్శకు విరివిగా కృషి చేస్తున్నారు. స్త్రీవాదం ఆమెకు దిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు. అనేక సందర్భాలలో ప్రసంగించవలసిరావడం వల్ల , రాయవలసిరావడంవల్ల ఆమె అనేక వ్యాసాలు రాశారు. ఆ రకంగా స్త్రీవాద సాహిత్య విమర్శకు విస్తృతంగాదోహదం చేసారు. స్త్రీవాదానికి సంబంధించిన అనేక మౌలిక గ్రంధాలను అధ్యయనం చేసి ఒక తాత్విక నేపధ్యాన్ని ఏర్పరుచుకుని , అదివరకే తనకు పరిచయమున్న మార్క్సిజాన్ని స్త్రీవాదంతో సమన్వయం చేసుకుని సాహిత్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. వివరిస్తున్నారు. స్త్రీవాదం మనకు పరిచయం కాక మునుపే రంగనాయకమ్మ , మల్లాదిసుబ్బమ్మ వంటి వాళ్ళు సాహిత్యాన్ని స్త్రీ దృక్పధం నుండి విశ్లేషిస్తూ వచ్చారు. అప్పట్లో మార్క్సిజం ఆధారమైంది. తర్వాత స్త్రీ వాదం ప్రవేశించింది. 1980లలో స్త్రీవాదం ప్రవేశించినా, సాహిత్యవిమర్శలో అది బలంగా రూపొందడానికి కొంత సమయం పట్టింది. జయప్రభ , ఓల్గా వంటి వాళ్ళు దీనికి పునాది వేశారు. ఈ పునాదిని అందిపుచ్చుకొని విశ్వవిద్యాలయాల నుంచి అనేక మంది మహిళలు విమర్శకులుగా ఎదిగారు. వాళ్ళ్లో కుసుమకుమారి ఒకరు.

స్త్రీవాద దృక్పధంతో కుసుమ కుమారి చేసిన సాహిత్య విమర్శలో మూడు భాగాలున్నాయి. 1. స్త్రీవాదానికి సంబంధింఛిన సైద్ధాంతిక విఙ్ఞాన నేపధ్యం , 2. స్త్రీవాదానికి ముందట ప్రాచీన , ఆధునిక సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పధంతో పునర్మూల్యాంకనం చెయడం 3. స్త్రీవాద దృక్పధంతో స్త్రీవాద సాహిత్యాన్ని విశ్లేషించడం.

ఏభావజాలంతో సాహిత్యాన్ని విశ్లేషించేవాళ్ళకైనా ఆ భావజాలానికి సంబంధించిన తాత్వికనేపధ్యం, ఙ్ఞానం పుష్కలంగా ఉండాలి. అప్పుడే ఆ విమర్శకు సాధికారత సిద్ధిస్తుంది. లేకపోతే అవాకులు చవాకులు గానే మిగిలిపోతుంది. తెలుగులో ఈ భావజాలరాహిత్య రుగ్మత అధికమై తెలుగు సాహిత్య విమర్శ ఎదగలేదు అనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఏ మాత్రం ఆధునిక భావాలు లేనివాళ్ళు కూడా తాము ఆధునికులమని ఫోజు పెట్టి రాయడం వల్ల ఈ ప్రమాదం కలుగుతున్నది. అచార్య కుసుమ కుమారి మార్క్సియ స్త్రీ వాద సైద్ధాంతిక విఙ్ఞానం పుష్కలంగా ఉన్న సాహిత్య విమర్శకులు. స్త్రీవాదం అంటే ఏమిటి? స్త్రీవాదం పుట్టుక, లక్ష్యాలు ఎలా ?ఏవి? భారతీయ సమాజంలో స్త్రీవాదలోని వివిధ శాఖలేవి? మొదలైన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దీనికోసం అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ విద్వాంసులు, సిద్ధాంతకర్తలు రాసిన ప్రసిద్ధ అప్రసిద్ధ గ్రంధాలు చదివారు. అస్మిత, రీసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్ రూపొందించిన ఒప్పందాన్ని అధ్యయనం చేశారు. అమర్త్యసేన్, అనురాధా రాయ్ , క్రిస్ బీస్లే , కాథరిన్ బెస్లే మొదలైన వాళ్ళ రచనలు చదివారు. 1993-2003 సంవత్సరాల మధ్య ఆమె అధ్యయనాన్ని విస్తృత పరుచుకున్నారు. 1975 – 85 మహిళా దశాబ్ది చరిత్ర చదివారు.దానిని తెలుగు సమాజపు చారిత్రక నేపధ్యాన్ని సమన్వయించుకున్నారు. తెలంగాణ , శ్రీకాకుళ నగ్జల్బరీ ఉద్యమాల ద్వారా సంక్రమించిన మహిళా చైతన్యాన్ని గుర్తించారు.

  • సెక్స్, జండర్ వేరు వేరు
    సెక్స్ పుట్టుకతో వస్తుంది, జండర్ సాంఘికంగా సాంస్కృతికంగా ఏర్పడుతుంది.
  • జండర్ వివక్ష మీదనే స్త్రీ వాదం పోరాడుతుంది
    స్త్రీ వాద వ్యతిరేకత పురుషుల మీదకాదు, పురుషాధిపత్యం మీద
  • స్త్రీవాదం లైంగికత్వంలోని రాజకీయ స్వభావాన్ని నొక్కి చెబుతుంది. రాజకీయ వేత్తలు, తత్వవేత్తలు విస్మరించిన సంతానోత్పత్తి, లైంగికత్వం విషయాలను స్త్రీవాదం పట్టించుకుంది.
  • స్త్రీ వాదం 1975 లో మొదలైన పాశ్చాత్య దేశాలలో అంతకుముందే ఉంది.
  • స్త్రీ వాదం కుటుంబాన్ని ప్రైవేట్ యూనిట్ గా గాక , సాంఘిక యూనిట్ గా గుర్తిస్తుంది.
  • సమాజంలోనూ . కుటుంబంలోనూ . పనిలోనూ స్త్రీలు గురవుతున్న అణచివేత, దోపిడికి సంబంధించిన అవగాహన కలిగి ఉండి ఈ పరిస్థితిని మార్చడానికి స్త్ర్రీలు ,పురుషులు చేసే చైతన్య వంతమైన కార్యక్రమమే స్త్రీ వాదం.
  • స్త్రీవాదం స్త్రీల హక్కులు మానవ హక్కులుగా ప్రతిపాదిస్తుంది.
  • స్త్రీ పురుష సమానత్వ సాధనే స్త్రీవాద లక్ష్యం, ప్రయోజనం.

ఈ అవగాహన లోంచి, ఈ నేపధ్య విఙ్ఞానంతో కుసుమకుమారి స్త్రీవాదానికి ముందటి సాహిత్యాన్ని , స్త్రీవాద సాహిత్యాన్ని విశ్లేషించారు. 1993 లో “తెలుగు లో స్త్రీవాద సాహిత్యం” , 2003 లో భాషా సాహిత్య అధ్యయనం – జండర్ స్పృహ ” అనే పెద్ద ప్రసంగ పత్రాలతో పాటు మరో పదిదాకా స్త్రీ వాద దృక్పధంతో తెలుగు సాహిత్యం మీద రాశారు.

స్త్రీ వాద పూర్వసాహిత్యం : పునర్మూల్యాంకనం

ఆచార్య కుసుమ కుమారి సాహిత్య విమర్శలో స్త్రీవాద పూర్వసాహిత్య పునర్మూల్యాంకనం ప్రధానభాగం. తెలుగు సాహిత్య విమర్శ. సంఘం సంస్కరణోద్యమకాలం నుంచి సాహిత్య పునర్మూల్యాంకనం చేస్తున్నది . ఒక కొత్త భావజాలంగాని , సామాజిక ఉద్యమంగాని పుట్టుకొచ్చినప్పుడు ఆ భావజాల, ఉద్యమస్ఫూర్తితో కొత్త సాహిత్యం సృష్టించడం ఒక భాగమైతే, వాటి నేపధ్యంలో అప్పటిదాకా వచ్చిన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం మరో భాగంగా ఉంటున్నది. రంగనాయకమ్మ రామాయణ విష వృక్షం ” జయప్రభ భావ కవిత్వంలో స్త్రీ ” కాత్యాయనీ విద్మహే “సంప్రదాయ సాహిత్యం స్త్రీవాద దృక్పధం ” “ప్రాచీన సాహిత్యం – మరో చూపు ” వంటివి ఇలాంటి గ్రంధాలు.ఆచార్య కుసుమ కుమారి ఈ పునర్మూల్యాంకనాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. కుసుమ కుమారి పునర్మూల్యాంకనంలో రెండు భాగాలున్నాయి. 1. ప్రాచీన సాహిత్యం- స్త్రీ వాద పునర్మూల్యాంకనం 2. స్త్రీవాద పూర్వ ఆధునిక సాహిత్యం స్త్రీవాద పునర్మూల్యాంకనం.

ప్రాచీన సాహిత్యం-స్త్రీ వాద పునర్మూల్యాంకనం :

స్త్రీవాదం ఇటీవలిదైనా స్త్రీ చైతన్యంతో అంతకుముందే ఎంతో సాహిత్యం వచ్చిందంటూ కుసుమ కుమారి జానపదసాహిత్యం నుంచే ఉదాహరణలిచ్చారు. జానపదగేయాల్లో సహజమైన ప్రకృతిసిద్ధమైన రజస్వలకావడమే స్త్రీ శరీర ధర్మం చుట్టూ సమాజం ఎన్నోరకాల ‘మిత్’ లను అల్లిందంటూ ఒక గేయాన్ని ఉదాహరించారు. స్త్రీ రజస్వల దినానికి ముడిపెట్టి ఎన్ని నమ్మకాలను సమాజం వ్యాప్తిలోకి తెచ్చిందో ఆ గేయంలో గమనించవచ్చాన్నారు. ఆ గేయం ఇలా సాగుతుంది.

ఆదివారం నాడు అతిరోగి యౌను
సోమవారం నాడు సుదతి పతివ్రత…………

అప్పగింతల పాటల్లో కూతురైనా స్త్రీని తల్లి అయిన స్త్రీ సాంస్కృతికంగా , సాంఘికంగా నియంత్రించే పాత్ర స్పష్టమౌతుందన్నారు.

నీళ్ళ బావులకాడనిలచొద్దుతల్లీ
ఈదిలో కురులిడిసి కట్టొద్దు తల్లీ
పండ్లిరిచి పలుమార్లు నవ్వొద్దు తల్లీ
సరిసరి మగవారితో సరసామొద్దు

ప్రాచీన తెలుగు సాహిత్యంలో మౌలిక సాహిత్యం తక్కువ. సంస్కృతానువాద సాహిత్యం ఎక్కువ. సంస్కృత సాహిత్యాన్ని క్రీ.శ.11 వశతాబ్దం నుండి తెలుగు కవులు అనువాదం చేశారు. క్రీ.పూ 14 వ శతాబ్దం నాటి సాహిత్యాన్ని మన కవిత్రయం క్రీ.శ 11 – 14 శతాబ్దాల మధ్య వెయ్యేళ్ళ తర్వాత తెలుగు చేసారు. అనువాదం చేసే క్రమంలో తమ కాలపు సామాజిక పరిస్థితులకు అనుకూలంగా, తమ భావజాలానికి తగినట్లుగా అనేక మార్పులు చేర్పులు చేసారు. మన సంప్రదాయ పరిశోధకులు విమర్శకులు ఆ మార్పులు చేర్పుల ను ఔచిత్యం కోసం చేసినవిగా అభిప్రాయ పడ్డారు. అయితే ఏది ఎవరికి , ఎందుకు ఔచిత్యమో వాళ్ళ ఆలోచించలేదు. సామాజిక పరిణామ క్రమంలో మానవసంబంధాలలో వచ్చిన మార్పు ఆ మార్పులు చేర్పులకు కారణం.ఈ అంశాన్ని జండర్ దృక్పధంతో చర్చించాల్సిన అవసరాన్ని కుసుమ కుమారి గుర్తించారు. ” ఇది ఉచితం , ఇది అనుచితం అని ఎవరు నిర్ణయించారు ? స్త్రీకి ఉచితమైనది పురుషుడికెందుకు ఉచితం కాదు? ఈ ప్రమాణాలని నిర్ణయం ఎవరు చేశారు ? ఇదంతా జండర్ స్పృహలో భాగమే ” అన్న అవగాహనాత్మక ప్రశ్నలతో కుసుమకుమారి మహాభారతంలోని కుంతీదేవి సంతానాంశాన్ని (ఆదిపర్వం) ద్రౌపది భీమునితో సంభాషించే అంశాన్ని ( విరాటం) స్త్రీ దృష్టి కోణం నుంచి పరామర్శించారు. ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత పాండు రాజు ఇంకా కొడుకులు కావాలని కోరుకోగా కుంతి ఆయన కోరికను తిరస్కరించి, ఆపదలో కూడా నాలుగో కొడుకును కనడం యుక్తంకాదని, అయిదో కొడుకు పుట్టడం అనాచారమని, విద్వాంసులయ్యిండీ ఎలా తనను నిషేధ సంతానానికి ప్రోత్సహిస్తావని బుద్ధి చెప్పింది. నన్నయ్య ఈ ఘట్టాన్ని అనువదించకుండా వదిలేశాడు. దానిని ఔత్సాహం దృష్టితో చూడరాదని , కుంతిభార్య కాబట్టి ఆమె భర్తకు నీతులు చెప్పకూడదు. అది ఉచితం కాదు అన్న భావనతో నన్నయ్యగారు తెలుగు అనువాదంతో వదిలివేశారు. నన్నయ్యగారి స్థానంలో స్త్రీ రచయితగా వుంటే ఈ పరిస్థితి వుండేదా ?అన్న ప్రశ్ననూ, కొంత ఆలోచననూ జండర్ స్పృహ మనలో కలిగిస్తుంది.” అని వ్యాఖ్యానించి, తన వ్యాఖ్యను జేన్ ఆస్ట్న్ అనే ఆంగ్ల రచయిత్రి అభిప్రాయంతో సమర్థించుకున్నారు.” ఈ దృష్టితో మొత్తం అనువాదాలను ముఖ్యంగా భారత రామాయణాలను పునరధ్యయనం చెయ్యాల్సి ఉంది.” అని అభిప్రాయ పడ్డారు. దీనికి’ మెటా క్రిటిసిజం ‘ అని పేరు కూడా పెట్టారు. ( సాహిత్యం, జండర్ స్పృహ , పు 55-57) తరిగిండ వెంగమాంబ, ముద్దు పళణి వంటి కవయిత్రులకు సాహిత్య చరిత్రలో సరైన స్థానం లభించకపోవడాన్ని , 1910లో రాధికా సాంత్వనాన్ని సాహిత్య విమర్శకులు మంచి ప్రబంధం గా గుర్తించకపోవడాన్ని స్త్రీ దృక్పధంతో అర్థం చేసుకోవాలన్నారు.

“ప్రబంధాల్లో స్త్రీ పాత్రలు – చారిత్రక సామాజిక నేపధ్యం ” అనే వ్యాసం ప్రాచీన తెలుగు సాహిత్యం మీద స్త్రీవాద దృక్పధంతో కుసుమకుమారి రచించిన విలువైన వ్యాసం. ఒక తెలుగు సాహిత్యాన్ని బేరీజు వేసేటప్పుడు ఆ కాలపు పరిస్థితుల అవగాహన ఉండాలనే ఆధునిక విమర్శ సూత్రం ఆధారంగా ఈ వ్యాసం రాశారు. విజయనగర రాజుల కాలం నాటి సామాజిక పరిస్థితుల నే పధ్యంలోంచి ప్రబంధాలలోని స్త్రీ పాత్రలను అంచనా కట్టే ప్రయత్నం చేశారు. “కవి సృష్టించిన పాత్రను ఆనాటి సామాజిక నేపధ్యం నుంచి వేరు చేసి విశ్లేషించడంలో ఫలితం లేదు. ” అన్న అవగాహనతో ఈ ప్రయత్నం చేసారు. ప్రబంధకవులు స్త్రీలను శృంగార పాత్రలుగా మాత్రమే చిత్రించడానికి ప్రయత్నించినా, అందుకు అప్పటిరాజుల భోగలాలసత, కవుల ప్రభు భక్తి కారణాలైనా ఆధునిక దృక్పధంతో ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే నాటి స్త్రీల జీవిత సంఘర్షణ తేటతెల్లమవుతుందన్నారు. ప్రబంధపాత్రలలో కుసుమకుమారి సత్యభామ ను గురించి చర్చిస్తూ ” ఒక పురుషుడికి అనేక మంది భార్యలుండే సమాజంలో ఆ భార్యల మధ్య తన ఉనికినీ తన ప్రత్యేకతనూ నిలుపుకోవడానికి ఆత్మాభిమానంగల స్త్రీ చేసే నిత్య సంఘర్షణకు చెరిగిపోని ప్రతీకంగా తిమ్మన చిత్రించారన్నారు. ఆమె అంతరంగ అభివ్యక్తికి ప్రతినిధి అని పేర్కొన్నారు. గోదాదేవి అమాయకమైన తండ్రి చాటు పిల్ల , నిగమశర్మ అక్క పదహారణాల తెలుగు అడపడుచు .శుక్తిమతి, గిరికలు అచ్చమైన తెలుగువారి తల్లి కూతుళ్ళు అంటూ నిర్వచించారు. వరూధిని మాత్రం మన సమాజంలో అరుదుగా కనిపించే ధైర్యంగా స్త్రీల లైంగికభావ వ్యక్తీకరణకు ప్రతీక అన్నారు. అయితే కన్న తండ్రిని చంపమని కత్తి భర్త చేతి కందించిన ప్రభావతిని మాత్రం ఆమె సమర్థించలేదు. ప్రబంధ స్త్రీ పాత్రల పరిశీలనలో కుసుమ కుమారి కట్టమంచి, పుట్టపర్తి పద్ధతులకు భిన్నంగా రాళ్ళపల్లి మార్గంలో మరింత వాస్తవికంగా ఆలోచించారు.

స్త్రీవాద పూర్వ ఆధునిక తెలుగు సాహిత్యంలోని స్త్రీలను అధ్యయనంచేసి కుసుమకుమారి కొన్ని వ్యాసాలు రాశారు. ఈ అధ్యయనం నవలలకే పరిమితం చేసారు.( ఆధునిక తెలుగు సాహిత్యం, స్త్రీ పాత్ర చిత్రణ; తెలుగు నవల , కొన్ని మరపురాని పాత్రలు; చలం స్త్రీ పాత్రలు – స్త్రీ చైతన్య దృష్టి) చలం పాత్రలను నిలకడగా కుదురుగా పరిశీలించి , ఇతర రచయితల స్త్రీ పాత్ర లను తలస్పర్శగా పరామర్శించారు. చలంలో స్త్రీ వాద స్ఫూర్తి బలంగా ఉండడమే ఇందుక్కారణం. కుసుమ కుమారి చలం స్త్రీ పాత్రలమీద వచ్చిన విమర్శలలో దేనిని ఆమోదించకుండా చలం ను పూర్తిగా సమర్ధించారు, చలం స్త్రీల లైంగిక స్వేచ్ఛను మాత్రమే పట్టించుకున్నాడని ఆర్థిక స్వేచ్ఛను గురించి ఆలోచించలేదని వచ్చిన వాదాన్ని కూడా ఆమె పూర్వపక్షం చేశారు. పురుషుడైన చలం స్త్రీల కన్నా బలంగా స్త్రీ జీవితాలను ఆవిష్కరించడం పట్ల ఆశ్చర్య పడ్డారు. స్త్రీ పురుషుల మధ్య ఆధిపత్య సంబంధాలు అంతరించిపోనంతవరకు సామాజికంగా చలం రచనల అవసరముందని తేల్చి చెప్పారు. చలం స్త్రీ పాత్రలు “మూసపోసుకున్న స్త్రీ మూర్తులు కాదు, ఆలోచనలు రేకెత్తించే ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానం వెతుక్కునే క్రమంలో తమ ప్రస్థానం సాగించారు.” ” సమాజంలో స్త్రీల జీవితంలో మౌలిక మార్పులను వేగవంతం చెయ్యడంలో చలం పాత్రలు ఒక రకంగా కేటలిస్టు రోల్ పోషించాయనవచ్చు. అని సూత్రీకరించి రాజేశ్వరి , అరుణ, శశిరేఖ, లాలస మొదలైన పాత్రలను హేతుబద్ధంగా విశ్లేషించారు. ఈ రకం పరిశోధన, విమర్శలు ఇది వరకే బాగా జరిగాయి , వచ్చాయి. ఈ వరుసలో కుసుమకుమారి చేరడం ముదావహం. స్త్రీ వాదంతో పాటు అయితే దళిత బహుజన ప్రాంతీయ రైతాంగ అస్తిత్వ వాదాలు సాహిత్యంలో ప్రధాన భావధారలుగా ఉన్న నేపధ్యంలో చలం స్త్రీలు ఏ సామాజిక వర్గ ప్రతినిధులు, ఏ ప్రాంతప్రతినిధులు, సమాజం లోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారా? చలం స్త్రీలకు వ్యవసాయంతో సంబంధంగాని ,పరిచయంగాని ఉంది? రైతు, రైతు కూలి, వ్యవసాయ వృత్తులకు కుటుంబాలకు చెందిన వాళ్ళెవరైనా ఉన్నారా? చలం స్త్రీ ల ఆర్థిక స్వేచ్ఛను గురించి కూడా మాట్లాడారని కుసుమ కుమారి అన్నారు. మాట్లాడారుగాని, ఆ దృష్టితో స్త్రీ పాత్రలను చిత్రించారా?మొదలైన ప్రశ్నలకు ఇవాళ సమాధానాలు వెతకవల్సిఉంది చలం సాహిత్యంలో.

స్త్రీలకు భావస్వాతంత్ర్యంతోపాటు ఆర్థిక స్వాతంత్ర్యం కూడా తప్పని సరిగా ఉండాలని తొలిరచయిత్రిగా రంగనాయకమ్మను నిర్వచించారు కుసుమకుమారి. ఒకతరం స్త్రీల ఆలోచనారీతిని రంగనాయకమ్మ ఆవిష్కరించారన్నారు. జానకి విముక్తి నవల వివాహానికి కొత్త నిర్వచన మిచ్చిందని, జానకి గొప్ప బుద్ధి జీవి అని అభిప్రాయపడ్డారు. కోడూరి కౌసల్యాదేవి స్త్రీ పాత్రలు సంప్రదాయ చట్రంలో ఇమిడి పోయేవని, యద్ధనపూడి సులోచనరాణి స్త్రీ పాత్రలు స్త్రీ పురుష సంబంధాలలో సౌకుమార్యానికీ ప్రేమభావనకు ప్రతీకలని, మాలతీ చందూర్ స్త్రీ పాత్రలు నిజాయితీ , మానవత్వం సహనాది లక్షణాలకు ప్రతినిధులని – ఇలా నిర్వచిస్తూ వెళ్ళారు. రావిశాస్త్రి రాజమ్మ ( రాజు – మనిషి) సంపన్న వర్గాల పంచనచేరి వారి ఆర్థిక రాజకీయ వ్యాపార వ్యవహారాలకు రక్షణ కవచంలా పని చేసే సత్తా ఉన్న అట్టడుగు వర్గ స్త్రీల ప్రతినిధి అన్నారు. భావి విమర్శకులు ఈ సూత్రీకరణల ననుసరించి ఆయా రచయితల స్త్రీ పాత్రలను లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఈ వరుసలలో కుసుమకుమారి ఆచంట శారదాదేవి కథలలో స్త్రీలను వివేచించారు. శారదాదేవి తనకు తారసిల్లిన అనుభవాలలోంచి పెండ్లి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు స్త్రీకి లేకపోవడం, ఆ విషయంలో( స్త్రీ పడే సంఘర్షణను పాఠకులతో పంచుకున్నారని ) శారదాదేవి స్త్రీలు పెళ్ళిచుట్టూ కల్పించబడిన భ్రమలను గురించి స్వతంత్రంగా ఆలోచించడం ప్రశ్నించడం కనిపిస్తుందని అభిప్రాయ పడ్డారు. కుసుమకుమారి శారదా దేవి కథల్లో అతి ముఖ్యమైన అంశాన్ని గుర్తించారు. ఆమె కథల్లో అమ్మ పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది, తండ్రి పాత్రకాదు అన్నది ఆ అంశం.ఆచార్య కుసుమకుమారి ఇంకొక మంచి పరిశీలన చేశారు. అది “అభ్యుదయ విప్లవోద్యమాల్లో కవయిత్రులు ” నిర్వహించిన పాత్ర. సమాజ చరిత్ర లాగే సాహిత్య చరిత్ర కూడా పురుష ప్రాధాన్యంగా ఉండడం వల్ల సామాజికోద్యమాలలో స్త్రీలపాత్రను రుజువు చేయడం ఎంత కష్టమో ఈ వ్యాసం చదివి అర్థమవుతుంది.అభ్యుదయ విప్లవ సాహిత్యోద్యమాల రాజకీయ తాత్విక నేపధ్యం చెప్పి ఆ ఉద్యమాలకు కవయిత్రులు చేసిన దోహదాన్ని వివరంగా చర్చించారు. అభ్యుదయ , విప్లవకవిత్వ సంకలనాలను , సంపుటాలను కుప్పబోసి వాటిలోంచి కవయిత్రుల రచనల్ని గుర్తించి విశ్లేషించారు. వట్టికొండ విశాలాక్షి, కొండపల్లి కోటీశ్వరమ్మ ల నుండి, విమల, ఎస్ .జయ లదాకా అనేకులను స్థూలంగా పరిచయం చేసి “అభ్యుదయ విప్లవోద్యమాలలో కవయిత్రుల సంఖ్య తక్కువే అయినా సామాజిక ప్రగతిని వారు చేసిన దోహదం తక్కువ కాదు గణనీయమే” నని అభిప్రాయ పడ్డారు. ఇది మంచి ప్రయత్నం. సంఘసంస్కరణ, జాతీయోద్యమాలలో రచయిత్రుల పాత్రను కూడా ఈ పద్ధతి లో పరిశీలించవలిసిఉంది. అదే విధంగా ఒకే ఉద్యమంలో అది ఏ ఉద్యమమైనాగాని . కవులు కవయిత్రులు కలిసి కవిత్వం రాస్తున్నపుడు, వాళ్ళ అభివ్యక్తి లో ఏదైనా తేడా కనిపిస్తుందా అని పరిశీలించడం సాహిత్య విమర్శకు ఉపయోగకరం.

స్త్రీవాదం ప్రవేశించినాక వచ్చిన స్త్రీవాద సాహిత్యం మీద కుసుమకుమారి చేసిన పరిశీలనను మూడు భాగాలుగా విభజించవచ్చు..1.స్త్రీవాద కవిత్వం 2.స్త్రీవాద కల్పనా సాహిత్యం 3. మహిళా పత్రికలు, స్త్రీవాద కవిత్వం 1981లో రేవతీ దేవి’ శిలాలోలిత’ ద్వారా, కల్పనా సాహిత్యం ఓల్గా కథానికలు, నవలలు ద్వారా, సాహిత్య విమర్శ జయప్రభ ‘భావకవిత్వంలో స్త్రీ’ ద్వారా ప్రారంభమయ్యాయని కుసుమ కుమారి చారిత్రకంగా గుర్తించారు.

స్త్రీవాద సాహిత్యానికి వాకిలి తెరిచింది కవిత్వమే. “కవిత్వం స్త్రీలకు సమాజాన్ని ప్రపంచాన్ని చూసే ఒక గవాక్షమయింది.” అన్నారు కుసుమ కుమారి. కవిత్వం స్త్రీలు తమను తాము ఆవిష్కరించుకోవడానికి గల సకల అవకాశాలను ఉపయోగించుకున్నారన్న అవగాహనతో కుసుమకుమారి అనేక మంది స్త్రీవాద కవయిత్రులను పాఠకులకు పరిచయం చేశారు. “స్త్రీ పురుషులిద్దరినే సమానత్వాన్ని కాంక్షించడం, వారి మధ్య వున్న అసమ సంబంధాలు తొలగి పోవాలని ప్రబోధించడమే స్త్రీవాద కవిత్వ ముఖ్య ప్రయోజనం ” అని నిర్ధారించారు. జయప్రభ , వాణీరంగారవు, ఓల్గా, ఈశ్వరి , కె.వరలక్ష్మి, మందరపు హైమావతి, కొండేపూడి నిర్మల, విమల , సావిత్రి మొదలైన కవిత్వాన్ని పరిచయంచేసారు. సావిత్రి’ బందిపోట్లు’ కవితతో సంచలనాత్మకమైన చర్చను లేవదీశారని ఆమె తొలితెలుగు స్త్రీవిముక్తివాద కవయిత్రి అని అరణ్యకృష్ణ అనడం సరైనదేనని అభిప్రాయ పడ్డారు.విమల’ వంటిల్లు’ లో స్త్రీ స్త్రీగా పుట్టలేదు, తయారు చెయ్యబడుతున్నది అనే స్త్రీ భావజాలానికి అద్భుత కవితా రూపమన్నారు. ” స్త్రీ వాద కవిత్వం లో స్త్రీవాదం” అనే వ్యాసంలో జండర్, లైంగికత్వం , కుటుంబం, ఇంటిచాకిరి , సంతానోత్పత్తి మాతృత్వం, పితృస్వామ్యం, -పురుషాహంకార నిరసన, ఉద్యమ స్ఫూర్థి అనే శీర్షికలకింద స్త్రీవాద కవిత్వాన్ని విశ్లేషించి చేసిన వ్యాఖ్యానం ఆ కవిత్వం అవగాహనను సులభంతరం చేసింది. ఈ వ్యాసంలో కుసుమ కుమారి తనకున్న అపారమైన ప్రపంచ స్త్రీవాద కవిత్వపరిచయంతో మన కవయిత్రులను ప్రపంచ స్త్రీవాద కవయిత్రువైన సుజాతాభట్ (గుజరాతీ) అశ్వినీడోంగ్రీ (మరాఠీ) శోభా భగవత్ (మరాఠీ ) ఉమామహేశ్వరి (తమిళం) మమతాకాలియా ( హిందీ) ఎస్.ఉషా (కన్నడం) వంటి వాళ్ళతో పోల్చిచర్చించారు. దీనివల్ల మన కవయిత్రులు బయటి ప్రపంచంతో కలిసి నడుస్తున్నారని అర్థమవడమేగాక ప్రపంచమహిళల జీవితాలన్నీ ఒకే రకంగా ఉన్నాయనీ తెలిసివస్తుంది. సాహిత్య విమర్శ సమాజానికి చేయగలిగిన మేలును ఈ వ్యాసం చేస్తున్నది.

స్త్రీ వాద కథానిక తెలుగు కథాసాహిత్యాన్ని మలుపుతిప్పిందన్న కుసుమకుమరి అవగాహన సరైనదే. ఓల్గా రాజకీయ కథలు స్త్రీ పురుష సంబంధాలను పునర్నిర్వచించుకోవలసిన అవసరాన్ని విశ్లేషింగా చర్చకు పెట్టాయన్నారు. ఈ క్రమంలో ఎస్.జయ . కొండేపూడి నిర్మల. సి.సుజాత, కుప్పిలి పద్మ, సి.మృణాళిని, బమ్మిడి జగదీశ్వర రావు వంటి కథానికలను పరామర్శించుకుంటూ వెళ్ళారు. అణచివేత ప్రయత్నాలేవి ఆత్మీయ సంబంధాలుగా భ్రమపెడుతున్న విషయాన్నిబట్టలు కొట్టడం తనవిధిగా, ప్రేమపూరితంగా కనిపించే శత్రుస్పర్శలో లోపించిన మానవ సంబంధాల్ని ప్రశ్నించడం తనహక్కు అని కొండేపూడి నిర్మల భావించి కథలు రాశారని చెబుతూ ఆమే కథల్ని పరిచయం చేశారు. సి.సుజాత కథలు పెళ్ళి చూట్టూ తిరుగు స్త్రీ జీవితం అనేక ప్రశ్నల్ని సంబంధించే కథలు రాశారన్నారు. ‘ఒంటరిగా లేం మనం’ లోని కథలు చదివితే ఆ కథలలోని స్త్రీ పాత్రలు మనల్ని వెన్నాడుతారన్నారు. ఓల్గా, మల్లాదిసుబ్బమ్మ వంటి వాళ్ళ నవలల్ని కూడా కుసుమకుమారి పరామర్శించారు. ఓల్గా నవల’ గులాబీలు ‘ లోని పర్యావరణ చైతన్యాన్ని స్త్రీ దృక్కోణం నుంచి విశ్లేషించారు.మల్లాది సుబ్బమ్మ నవల’ వంశాంకురం’ ను పునరుత్పత్తి హక్కు దృష్టి తో వ్యాఖ్యానించారు.

ఆచార్య కుసుమకుమారి భాషా శాస్త్రంతో గట్టి పరిచయముంది. పరిశోధనానుభవముంది. స్త్రీ వాద దృక్పధముంది. స్త్రీవాద సాహిత్యం లోని భాష మీద ఇదివరకే మాట్లాడిన పరిశోధకుల, విమర్శకుల అభిప్రాయల పఠనానేపధ్యం ఉంది. దీంతో ఆమె స్త్రీవాద సాహిత్యంలో రచయిత్రులు వాడిన భాషను గురించి లోతుగా చర్చించారు. ఇప్పటిదాకా భాషా శాస్త్ర వేత్తలు భాషలో కులవర్గ మాండలికాలనే గుర్తించారని, ఇప్పుడు భాషను జండర్ దృష్టితో కూడా పరిశీలించాలని ప్రతిపాదించారు. వస్తువు రూపాన్ని నిర్దేశించినట్లే , భాషను కూడా నిర్దేశిస్తుంది కాబట్టే మహిళలు తమను అవమానించే భాషలోనే తమ ఆయుధంగా చేసుకున్నారని మరో ప్రతిపాదన చేసారు. ఫెమినిస్ట్ లాంగ్వేజ్ అనేదొకటున్నదన్నది కుసుమకుమారి అధ్యయన సారాంశం. దీనికి స్ఫూర్తి “ఇన్ దేర్ ఓన్ వాయిస్ ” అనే పేరుతో సంపాదకులు ఎరీన్ ఆర్. కె. జిడే, ఇంకా అనేకుల అభిప్రాయం.

కుసుమకుమారి స్త్రీ వాద ఉద్యమానికి పత్రికలు కొన్ని సంస్థలు చేసిన కృషిని కూడా గుర్తించారు. ముఖ్యంగా ‘ భూమిక ‘ పత్రిక పర్యావరణ పరిరక్షణ చైతన్యానికి చేసిన కృషిని విఫులంగా చర్చించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులుగా పనిచేసిన కుసుమకుమారి అనేక మహిళా సదస్సులు నిర్వహించారు, సదస్సుల్లోపాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విద్యారంగంలో మహిళల పాత్ర గురించి అధ్యయనం చేశారు. సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాధ్యయనం, సాహిత్యంలోంచి సాంఘిక రంగంలోకి ప్రయాణం – ఈ రెండూ నేటి అవసరాలు. ఈ అవసరాల సాధనలో ఆచార్య కుసుమ కుమారి భాగస్వామి అవుతున్నారు.

“స్త్రీ పురుషులందరూ సమాజంలో సమాన హక్కులను అనుభవించగలిగే మానసిక చైతన్యాన్ని, భావ పరిణతినీ కలిగించడమే స్త్రీ వాద రచనల ప్రయోజనం.

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

One Response to “మహిళా సాహిత్య విమర్శకులతో కుసుమకుమారి”

  1. 1
    ప్రాణహిత » ప్రాణహిత నవంబర్ 2009 సంచికకు స్వాగతం Says:

    [...] మహిళా సాహిత్య విమర్శకులతో కుసుమకుమా

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో