Nov2009
నేను వివస్త్ర భూమిని
నేను పోలేపల్లిని
నాయింటినుండి గెంటివేయబడి
నన్ను
రారమ్మని ప్రియంగా పిలుస్తున్న
స్మశానం వైపు
వేగంగా పరిగెడుతున్న కుంటివాన్ని
నేను వివస్త్ర భూమిని
నడి బజారులో పరిగెత్తుతున్న
నగ్నదేహాన్ని
నేను
‘అరబిందో’కి బలిచ్చిన మేకపిల్లను
కటికవాని దుకాణంలో
కొక్కానికి వేలాడుతున్న మాంసపు ముద్దను
నేనుపిల్లలులేని తల్లిని
ఒళ్ళంతా పగుళ్ళతో
పగుళ్ళనిండా కళ్ళతో
కళ్ళనిండా నీళ్ళతో
దీనంగా…
దిక్కులు చూస్తున్న అభాగ్యురాలిని
నేను ఎడారి లాంటి చిత్రపటాన్ని
గుండెలవిసేలా రోదిస్తున్న
తడారిన గొంతును
నేను… నానేలలో .. నా మట్టి వాసనల్లో
పరాయివాన్నై
కాందిశీకుడిగి మిగిలిన నిర్భాగ్యున్ని
నేను
అమావాస్య రాతిరిలో
వికటాట్టహాసం చేస్తున్న
స్మశానపు పాదాలవద్ద
మౌనంగా రోదిస్తున్న నయనాన్ని
వందల వందల సెజ్జులు
బొందలు దొవ్వి
పారలతో సిద్ధంగా ఉన్నాయి
నను పూడ్చడానికి
పొలిమేరపై రాబందులు
వేచిచూస్తున్నాయి
నాగుండెకాయ విందుకోసాం
అయినా…………..
ఈ సెజ్ మంటల్లో
నేను అంతమైపోను
వీచే ధిక్కార స్వరాల
గాలులతో కలిసి
భాస్వరమై భగ్గున మండుతా
స్మశానంలోనే మళ్ళీ జన్మిస్తా……
ప్రాణహిత » ప్రాణహిత నవంబర్ 2009 సంచికకు స్వాగతం Jan 6, 2010 1
[...] నేను వివస్త్ర భూమిని : డి.ఉదయ భాను [...]