ప్రజల సాహిత్యానికి ప్రాణం ప్రజల భాష
(భాషపై కొ.కు)

సాహిత్య రూపాలుగాని, ప్రమాణాలు గాని, ఆశయాలు గాని కాలానుగుణంగా మారుతూ వచ్చినట్లే సాహిత్యానికి సంబంధించిన సమస్యలు కూడా మారుతూ వస్తాయి. ప్రజల భాష ప్రజల సాహిత్యం అనేది ఈ కాలపు సమస్య.
- కొడవటిగాంటి కుటుంబరావు, కళలు – శాస్త్రీయ విఙ్ఞానం

గురజాడ , గిడుగుల తర్వాత తెలుగునేల మీద భాష గురించి, అందునా సాహిత్య భాష గురించి ప్రజాస్వామికంగానూ, శాస్త్రీయంగానూ ఆలోచించిన అరుదైన రచయిత కొకు 1930 ల్లో కలం పట్టిన తొలినాళ్ళనుంచి 1980 వరకూ అనేక సందర్భాల్లో కొకు భాష గురించి రాసిన వ్యాసాలూ, వ్యక్తం చేసిన అభిప్రాయాలు గతితార్కికంగా భాషని అధ్యయనం చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. భాషకున్న అనే అవసరాలను ఆయన గుర్తించాడు. గ్రాంధిక- వ్యావహారిక వాదాల గురించి గానీ , మాండలికాలను గురించిగానీ ఆయన చేసిన విశ్లేషణలు కేవలం భాషా శాస్త్ర దృష్ట్యా చేసినవి కావు. భద్రిరాజు, బూరా, చేరా , సుబ్రహ్మణ్యం వంటి భాషాశాస్త్రఙ్ఞలు తెలుగులో బాష గురించి చేసిన పరిశోధనల్లో ఎక్కువభాగం , తులనాత్మకంగా చేసిన పరిశీలనే అనిపిస్తుంది. అందుకు భిన్నంగా కొకు భాషని ఒక సామాజికాంశంగా సమకాలీన సాహిత్యంతో అనుసంధానించి చూశాడు. ప్రాంతీయ వర్గ మాండాలికాలకు చెందిన అనేకాంశాలను సామాజిక భాషా శాస్త్రం వెలుగులో పరిశీలించడానికి కొకు భాషపై చేసిన రచనలు ఎంతగానో వుపయోగపడతాయి.

కొకు మొదట చదువుకొనే రోజుల్లో గ్రాంధిక భాషాభిమాని. ‘వాడుక భాషని చులకనగా చూసేవాడు’ కూడా. వాడుక భాషలో అందమైన రాతల్ని చూశాకా కొంతకాలం, వాడుక భాషకూ- గ్రాంధిక భాషకూ మధ్య ఊగిసలాటలో గడిపాడు . చివరికి గిడుగు వారి ప్రభావంతో వాడుక భాష వైపు మొగ్గాడు. కానీ గ్రాంధిక భాషా సంప్రదాయంలో సాహిత్యభాషకు ఒకేరీతిలో వ్యాకరణంను శాసనం నిర్మితమై వున్నట్లే, వాడుక భాషలో కూడా అందరికీ ఉపకరించే ఒక ప్రామాణిక భాష రూపొందాలనే అభిప్రాయం ఆయనకు బలంగా ఉండేది. ప్రామాణిక భాషలో సమరూపత సాధించే ప్రయత్నాలు వ్యవహారిక భాషోద్యమం మొదలైన దగ్గర్నుంచీ జరుగుతూనే వుండేవి.టేకుమళ్ళ కామేశ్వరరావు (వాడుక భాషా : రచనకు కొన్ని నియమాలు) , వడ్లమూడి గోపాలకృష్ణయ్య (వ్యవహారిక భాషా వ్యాకరణం) వంటివారు యిందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. మండపాక పార్వతీశ శాస్త్రి వాంటి వారు మరొక అడుగు ముందుకు వేసి వాడుక భాషాలో మాండలికం విరివిగా వ్యాప్తిస్తోందని దానికి అడ్డుకట్ట వేయాలని నిషేధాలు విధించే స్థాయికి కూడా వెళ్ళారు.

మొదట్లో కొకు కూడా యిటువంటి ఆలోచనలు చేశాడు.’ రాయగల ప్రముఖులు ప్రబుద్ధాంధ్రలో వ్యాసాలురాసి, భాషకు అవసరమైన కట్టుబాట్లనీ చేసి, ప్రతిగాలికీ ఎగిరిపోకుండా అవయవాలు స్వేచ్చగా కదిలించడానికి వీల్లేనట్లు ఉండకుండా తగిన ఏర్పాటు చేసి తెలుగుభాషను కూడా స్టాండర్డైజ్ చేసి పుణ్యం కట్టుకుంటే బావుంటుందని [ప్రబుద్ధాంధ్ర మాస, మార్చి 1934] అనుకున్నాడు.

కానీ యిది అంత శాస్త్రీయమైన ఆలోచన కాదని ఆ తర్వాతి కాలంలో ఆయన గ్రహించాడు భాషకు ప్రామాణికత అన్నది చాలా సాపేక్షమైన విషయం. గిడుగు ప్రతిపాదించిన శిష్టవ్యవహారికం కూడా కాలగమనంలో నిలవలేదు . అన్ని మాండలికాలు standard భాషలో అంతర్భూతాలై దాన్ని ‘వృద్ధి’ పొందించాలని గిడుగే చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. సంస్కృతి స్థిరబిందువు కానట్లే భాషా ప్రామాణికత కూడా కాదు. రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించుకున్న దేశాల్లో ప్రజావసరాలకు అనుగుణంగా కొత్త ప్రామాణిక భాషలు ఏర్పడ్డ దాఖలాలు ప్రపంచదేశభాషల చరిత్రలో అనేకం కనిపిస్తాయి. డచ్ సారస్వత భాష 13 నుంచి 17 వ శతాబ్దం వరకూ మూడుసార్లు మారింది ఈజిప్షియన్ సాహిత్య భాష వాడుక భాషనాధారం చేసుకుని నాలుగుసార్లు మారింది.వోలపన్ భాషని కేవలం 12 సం. వ్యవధిలో ఆరుసార్లు మార్చుకొన్నారు.

అన్ని ప్రాంతాల నుంచి వెలువడే వ్యవహారాల్ని కలగలిపు తెలుగువారికొక జాతీయ భాష ఏర్పాడాలని కొకు తర్వాతి కాలంలో భావించాడు. 1950 ల ప్రాంతంలో సైతం చలం. గోపీచంద్ , బుచ్చిబాబు వంటి వాళ్ళ చేతుల్లో సృజనాత్మక సాహిత్యం కొత్త ప్రామాణిక భాష రూపొంచినప్పటికీ – దానికి ‘జాతీయ భాష అనిపించుకోదగిన పరిణతిరాలేద’ని {తెలుగు స్వతంత్ర, వార 28-8-50} కొకు లాంటి వారు భావించారు. కన్యాశుల్కం రెండో కూర్పుకు ముందు మాటరాస్తూ వ్యవహారిక భాషోద్యమం ద్వారా కొత్త సాహిత్య భాష రూపొందించుకునే దిశగా జరుగుతోన్న ప్రయత్నాలు మందకొడిగా సాగుతున్నాయని గురజాడ కూడా ఫిర్యాదు చేశాడు. జాతి అంతటికీ ‘వైఙ్ఞానిక, రాజకీయవసరాలకు ఉపకరించే పరిభాష పూర్తిగా ఏర్పడలేదని ‘ పై సందర్భంలోనే కొకు పేర్కొన్నాడు. ఆ తర్వాత మరో పది సంవత్సరాలు గడిచినా – తెలుగు వ్యావహారికభాషకు ఇంకా పటుత్వం చేకూరలేదు-అదిచేకూరటానికి అవసరమైన కృషి ఇంకా ప్రారంభమైందని కూడా అనిపించడం లేదని [కృష్ణ పత్రిక 23-4-1960] ఆయన ఆవేదన చెందాడు.

తెలుగు దేశం అన్ని మూలల వారు గుర్తించి అర్థం చేసుకునే భాష ఏర్పడటానికీ రైళ్ళు తపాలా, అచ్చు యంత్రాలు , పత్రికలూ , బూర్జువా సాహిత్యమూ, సినిమాలూ తోడ్పడుతున్నవి [తెలుగు స్వతంత్ర 21-07-1950] అని కొకు చెప్పిన మాటల్లో పరిమితుల్ని సైతం అర్థం చేసుకోవచ్చు.

నిజానికి సాహిత్య వ్యవస్థని కూడా సామాజిక శక్తులు శాసిస్తాయి . ప్రామాణిక భాష సమాజంలోని వున్నత వర్గ విద్యావంతుల భాషే. అదే సాహిత్య భాష. అదే సమాచారమాధ్యమ భాషగా పత్రికల్లో, రేడియోల్లో, టీవీల్లో అధిపత్యాన్ని నెరపుతుంది. ఈ ప్రసారసాధనాలు ఎవరి చేతుల్లో ఉంటాయో వారే – వాళ్ళ అవసరాలమేరకు భాషని సైతం శాసిస్తారు. పత్రికలు తప్ప మిగతా ప్రసారసాధనాలు ఇటీవల వరకూ పాలకవర్గం చేతిల్లో ప్రచార సాధనాలు కూడ అవిద్యావంతులు , పామరులు , సామాజిక ఆర్థిక రంగాల్లోవెనకబడిన అధిక శాతం ప్రజల భాష వీటిలోకి ఎక్కలేదు. రాజకీయ, ఆర్థిక ,సాంస్కృతిక కేంద్రాలకు చెందిన ఆధిపత్య కులాల , వర్గాల ప్రాంతీయ భాషే చాలా ఏళ్ళుగా ప్రామాణిక భాషగా చెలామణి అయింది.ఈ కారణంగా “తెలుగుభాష” ఒక జాతి భాషగా ఉమ్మడి భాషగా రూపొందనందువల్ల చాలా నష్టపోయింది రెండున్నర జిల్లాల భాషని ప్ర్రామాణిక భాషగా తమమీద రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ప్రాంతీయ భాష చైతన్యం ఈ క్రమంలోనే పుట్టింది. ఉత్పత్తి క్రమంలో పాలుపంచుకునే శ్రమజీవులభాష అంటరానిదిగానే వుండిపోయింది. శ్రామిక సంస్కృతితో ముడిపడి వున్న అనేక పదబంధాలు, నానుడులు,జాతీయాలు, సామెతలు, వ్యక్తీకరణ రీతులు ప్రధానభాష అని ప్రామాణికమని చెప్పుకొనే -శిష్ట వ్యావహారికంలోకి ప్రవేశింపలేకపోయాయి .గ్రాంధికానికి వ్యతిరేకంగా వుద్యమ స్ఫూర్తిగా వచ్చిన వాడుక భాషకు కూడా ఆమేరకు పరిమితులేర్పడ్డాయి. యావజ్జాతి అవసరాలను తీర్చే భాష ఏర్పడలేదని కొకు వంటి భాషావేత్తలు వాపోవడం వెనక అంతరార్థం యిదే.

40ల్లో మాగోఖలే వంటివాళ్ళు సాహిత్యంలోకి కిందికులాల, వర్గాల భాషని ప్రవేశపెట్టినప్పుడు’ అలగా భాష’కి సాహిత్యగౌరవం యివ్వడానికి ఆధిపత్య భాషా మనువులు గగ్గోలు పెట్టినపుడు మాగోఖలే కి దన్నుగా నిల్చి మార్గదర్శకుడయింది కొకునే [మా గోఖలే - మూగజీవాలుకు రచయిత ముందుమాట - 1950] మనం ఎప్పుడో వెయ్యేళ్ళకి పూర్వం వెలువడ్డ నన్నయని నిఘంటువులు ముందేసుకుని అర్థం చేస్కోవడానికి ప్రయత్నిస్తాంగానీ సమకాలీన సమాజంలో మనతో జీవించే మనుషులు మాట్లాడే భాష పట్ల – దాన్ని తెలుసుకోవడం పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తాం అని కటువైన విమర్శే చేసాడు. గోఖలే వాడిన భాష గుంటూరు జిల్లా పాఠకులకే పట్టిచ్చిందంటే మన సాహిత్య భాష ఎంత అసంపూర్ణమైనదో అర్థం చేసుకోవచ్చునని ఆ సందర్భంలోనే చెప్పాడు.అందుకే మనకు అఖండ భాషే కాదు . అఖండ సాహిత్యం కూడాలేదు.

దానికి కారణం సాహిత్యభాష విశాల ప్రజానీకానికి సంబంధించిన సాంస్కృతిక భాషకు దూరమై వుండడమే . సాహిత్య జీవులు – సామాన్య ప్రజలు భిన్న భాషలు మాట్లాడుతున్నారా అన్నంతగా రెండు వర్గాల భాషల మధ్య అంతరం ఏర్పడటం వల్లనే భిన్న సాహిత్య సంప్రదాయాలు సైతం రూపొందుతాయి. వర్గ సమాజంలో – సంస్కృతిలో – సాహిత్యంలో – భాషలో ఈ వైరుధ్యం గమనించే వర్గ భాషా వాదం ముందుకొచ్చింది. దీన్ని స్టాలిన్ నిర్ద్వంద్వంగా ఖండించినప్పటికీ – వున్నతవర్గాల ప్రయోజనాల్లోంచి తయారయ్యే భాష ప్రజాసమూహాల దైనందిన వ్యవహారంలోని భాషా సంప్రదాయాలకు దూరంగా ఉండడమే కాదు, చాలా సందర్భాల్లో ప్రజల భాషపై ఆధిపత్యం నెరపాలని కూడా చూస్తుంది.

తెలుగు సాహిత్య చరిత్రలో గ్రాంధిక భాషావాదం అందుకు బలమైన వుదాహరణ. ‘గ్రాంధిక భాషాఘట్టం తెలుగు సాహిత్య చరిత్రలో అమితహేయమైన ఘట్టం… దీనిని చిన్నయ సూరి మాష్టారు పనిపెట్టుకొని సృష్టించి తమకుగల అవకాశాలను ప్రజల అమాయకత్వాన్ని పురస్కరించుకొని ప్రచారం చేశారు’. [కృష్ణ పత్రిక - 23-04-1960] అని నెపం కొకు చిన్నయసూరి మీద పెట్టినప్పటికీ – నిజానికి వున్నతవర్గం తమ అన్ని ఆధిపత్యాలనూ నిలుపుకోవడానికి భాషను కూడా సాధనంగా వాడుకొన్నదని గమనించాలి ఈ భాషాధిపత్యం కింద వెనకబడ్డ కులాల ప్రాంతాల ప్రజాసమూహాల జీవద్భాష నలిగిపోయింది. దానికి ప్రాణప్రతిష్ట చేయడానికే గిడుగు, గురజాడల వంటివారు ఉద్యమించారు. అయితే అప్పుటికే జరగవలిసిన నష్టం జరిగిపోయుంది . చదువుకున్న వాళ్ళకు కూడా కృతక గ్రాంధిక భాషే ప్రమాణమై కూర్చుని సజీవమైన వాడుక భాషా సంపద్రాయం తెలియకుండా పొయింది. ‘గ్రాంధికము వచ్చి సజీవమైన వ్యావహారిక భాషా సాంప్రదాయానికి గండికొట్టి ; తిరిగి వ్యావహారిక భాష పునరుజ్జీవనం పొందేనాటికి విద్యావంతులైన వారికిసైతం పుష్కలమైన పదజాలము, నుడికారము అందుబాటులోకి లేకుండా చేసిందని కొకు వాపోయాడు’. అనేక సంవత్సరాల పాటు చిన్నయసూరి గారి పుస్తకాల పాఠ్యపుస్తకాలుగా పెట్టినట్లు పండితులైన వ్యావహారిక భాషావాదుల రచనలు అనేక తరాల వారికి పాఠ్యగ్రంధాలుగా ఉంచినట్లయితే చిన్నయసూరి గారి తెలుగు భాషకు చేసిన ద్రోహం చక్కబడుతుందని [పైనే ] ఆయన సూచన కూడా చేశాడు.

కానీ జరిగిన నష్టం అంత తేలికగా తీరేదికాదు. వ్యావహారికభాషా వాదులు పనిగట్టుకొని గ్రాంధికం సంకెళ్ళను తెంచుకోగలిగారు కానీ ప్రజలభాషను పూర్తిగా ఒంటబట్టించుకోలేకపోయారు,.మౌఖిక సంప్రదాయంలోని భౌతిక భావజాలంలో సంబంధమున్న భాష యిప్పటికీ ప్రామాణికంగా భావిస్తోన్న భాషలో చోటు పొందలేకపోయింది. నిఘంటువుల కెక్కని, శిష్ట సాహిత్యంలోకి చేరని అసంఖ్యాకయైన పదజాలం నశించిపోయింది. ఒకప్పుడు పై వర్గాలవారు తమ ప్రత్యేకతనీ, ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి సంస్కృతాన్ని ఉపయోగించుకుంటే, ఆధునిక వ్యావహారికభాష ప్రమాణికమై కూర్చునే సమయానికి యింగ్లీషు ఆస్థానాన్ని ఆక్రమించుకొంది గిడుగు, గురజాడల ఆశించిన భాషా ప్రజాస్వామికీకరణ అసంపూర్ణంగానే నిలిచిపోయింది.ఆధునిక భాషలో సాహిత్యం రైతుల్ని తట్టిలేపుతుందన్న గురజాడ ఆశ మరికొన్ని దశాబ్దాల వరకు అత్యాశగానే మిగిలిపోయింది. ‘పల్లెటూళ్ళలో ఉండే జనం నిత్యజీవితంలో వాడే ప్రయోగాలు, పదజాలము తెలియని పేరుపడ్డ రచయితల చాలామంది ఉన్నాం’ అని తమతో సహభాషకు దూరమౌతోన్న రచయితల గురించి కొకు అవేదన వెలిబుచ్చారు [తెలుగు విద్యార్థి జూలై 1957] రచయుతలకు ప్రజలజీవితం మీదా వేషభాషలమీద ఆదరాభిమనాలుండాలని హెచ్చరించాడు [1959 -02-రేడియో ప్రసంగం] మధ్యతరగతి విద్యాప్రామాణిక భాష వొకటి ఆధిపత్యభాషగా స్థిరపడడం మొదలైంది. ఆ కాలపు అభ్యుదయ సాహిత్యకారులు రాజకీయ -ఆర్థిక – సామాజిక రంగాల మీద దృష్టిపెట్టినంతగా భాష మీద, దాని గతితార్కికత మీద పెట్టలేదు . ఆ కారణంగానే మాగోఖలే కథల్లో వాడిన’ అలగా’ భాషపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది పాత్రోచితభాషగా బడుగు వర్గాల భాష సాహిత్యంలో చోటుచేసుకోవచ్చుగానీ, కథకుడే అలగా వాళ్ళకు ప్రతినిధిగా వుండడమేమిటని కొత్త ప్రామాణిక భాషావాదుల కనుబొమ్మలు పైకి లేచాయి. కొకు వంటి అతికొద్దిమంది భాషని ప్రజాస్వామిక దృష్టితో చూడగల్గినవారు మాత్రమే ప్రామాణిక భాషకున్న పరిమితుల్ని అర్థంచేసుకోగలిగారు.

అయితే స్వాంతంత్ర్యం వచ్చాక చదువులు బడులు అన్ని వర్గాల వారికీ ఒకహక్కుగా అందుబాటులోకి వచ్చాక సైతం గ్రాంధీకం చానాళ్ళు రాజ్యమేలింది. తెలుగు మాట్లాడే హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణతో కలిపి విశాలాంధ్ర ఏర్పడ్డాక మరొక ఉపద్రవం మొదలైంది. విద్యాభ్యాసం చేసే కొత్త తరానికి, కింది వర్గాల ప్రజలకు తమ సంస్కృతిలో, దైనందిన జీవితంలో సంబంధంలేని భాషని విద్యాలయాల్లో నేర్చుకోవలిసిన ఆగత్యం ఏర్పడింది. తమదికాని భాషలో అభివ్యక్తి గందరగోళం తయారైంది. రాయలసీమ వాసులకు కూడా ఈ యిబ్బంది ఎదురైంది. పేరుకు మాతృభాషలో బోధన అనడమే గానీ దాదాపు పరాయిభాషనే నేర్చుకొంటున్న భావన కొత్త భాషాభ్యాసంలో కలిగింది.

‘అర్థశతాబ్దం క్రితం కన్నా ఈ నాడు వ్యావహారికం చాలా అభివృద్ధి చెందింది. దానికి కారణం ఆ భాషలో విరివిగా సాహిత్యం వెలువడడమే’ అని [పుస్తక ప్రపంచం 1971 మే-జూన్ ] కొకు భావించినప్పటికీ ప్రజలభాషకు సాహిత్యంలో విద్యాలయాల్లో పూర్తిగా చోటు లభించలేదు.కాళోజీ మాటల్లో చెప్పాలంటే – బడి పలుకులకు – పలుకుబడులకు మధ్య అంతరం చెరిగిపోలేదు . ఈ అంతరాన్ని కొకు యాభైల్లోనే గుర్తించాడు. భాషకు వర్గస్వభావం వుండదన్న స్టాలిన్ వాదంతో విభేదించాడు.’ ప్రతి వర్గానికీ ఒక్కొక్క భాష ఉన్నట్లయితే వర్గాలమధ్య సంపర్కం సాధ్యంకాదు’. అన్న స్టాలిన్ అభిప్రాయంతో స్థూలంగా ఏకీభవిస్తూనే పునాదికి అనుగుణంగా భాషలో కూడామారే అంశాలు ఉంటాయని కొకు పేర్కొన్నాడు.’ భాషలో జాతికిచెందిన లక్షణాలతో పాటు సాంఘీక వ్యవస్థకూ వర్గాలకూచెందిన లక్షణాలు కూడా ఉంటాయని వ్యాకరణమూ మూల పదాలు ఒకటిగా ఉన్నంత మాత్రాన వర్గభాష ఉండదని చెప్పలేమ’ని వాదించాడు. ‘కేవలం పాలకులు ఒక భాష వాడుతూ ఆ భాషనే ఉద్యోగుల చేత వాడుక చేయించుకోవచ్చు. మిగిలిన ప్రజలందరూ తమ తమ మాండలిక భాషలూ కులభాషలు వర్గభాషలు వాడవచ్చు. అసంఖ్యాకులైన రచయుతలు ఆ భాషలో గ్రంధాలు రచించారు. ప్రజలు మటుకు మాండలిక భాషలు, కుల భాషలు వాడారు’ అని కొకు తెలుగు సమాజంనుంచి వుదాహరణలు చూపాడు. అంతేకాదు వివిధ వృత్త్తుల వారు వాడే సాంకేతిక పదాలుగా కాక సాధారణ క్రియారూపాల్లో కూడా వర్గానికీ మధ్య తారతమ్యముంటుంది అని శాస్త్రీయంగా విశ్లేషించాడు.

వర్గభాష ప్రత్యేకంగా వుండదేమోగానీ వర్గమాండలికం తప్పనిసరిగా వుంటుందని స్థూలంగా నిర్థారించుకోవచ్చు. నిజానికి పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం కావటానికీ , మార్కేట్ విస్తరణకు ఒక ఉమ్మడి భాషని రూపొందించుకొనే బరువుకింద అణిగిపోతాయి. ఒక్కోసారి తమ ఉనికిని సైతం కోల్పోతాయి. సోషలిస్టు సమాజంలో భిన్నజాతుల భాషల్నిగుర్తిస్తూ, గౌరవిస్తూనే ప్రాంతీయ మాండలికాల్ని కలుపుకొని ఉమ్మడి జాతీయ భాషని రూపొందించుకోవాలనేది స్టాలిన్ ఆశయంగా కనిపిస్తుంది. పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి సోషలిస్టు వ్యవస్థలోకి మారినప్పుడు ప్రత్యేకంగా భాషలో కొత్తగా మార్పులు రావని కూడాస్టాలిన్ వాదన . అయితే సాంఘీక వ్యవస్థలో మార్పు జరిగి ఒక వ్యవస్థపోతున్నప్పుడు దాని స్థానే మరొక వ్యవస్థను ప్రయత్న పూర్వకంగా నిర్మించుకోవాలి భాషలో కలిగే తత్సంబంధమైన మార్పులు నూతన సాంఘీకావసరాలను బట్టి వాటంతటవే జరుగుతున్నాయి. సంఘంలోనూ, వర్గాలలోనూ కలిగే మార్పులకనుగుణమైన మార్పులు కూడా భాషను వెన్నంటి ఉండక తప్పదని కొకు సూత్రీకరించాడు. తర్వాతకాలంలో ఆఫ్రికన్ సాహిత్య భాష గురించి గుగీ చేసిన ప్రతిపాదనలు కొకు అభిప్రాయాలు దగ్గరగా వున్నాయి. భాష గురించి యింత ప్రగతిశీలంగా ఆలోచించబట్టే 70ల చివర్లో తెలంగాణ ప్రజల భాషలో అల్లం రాజయ్య వంటివాళ్ళు సృజనాత్మక రచనలు చేసినప్పుడు ఆ రచనలను మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాదు, వాటికి గొప్ప సైద్ధాంతిక బలాన్ని సైతం యివ్వగలిగాడు.

‘కనీసం సాహిత్యానికి సంబంధించిన వరకైనా ప్రజలందరూ ఏకం కావాలంటే అన్ని ప్రాంతాల ప్రజల భాష ఏకం కావాలి. కనీసం ప్రతి ప్రాంతీయ శబ్దజాలమూ, నుడికారము అన్ని ప్రాంతాల అందరికీ అర్థం కావాలి. అప్పుడే అభ్యుదయకర పురోగామి సాహిత్యం అన్ని ప్రాంతాల అందరినీ చైతన్యవంతులను చేస్తుందని’ [సృజన - ఆగష్టు -సెప్టెంబరు 1980] సాహిత్య భాషకు వొక సామాజిక తాత్విక భూమికను ఏర్పరచగలిగాడు. ‘మాండలికభాషమీద చర్చలు వాదోపవాదాలు విరివిగా సాగుతోన్నపుడు మాండలిక భాషలో సాహిత్యం రచించకూడదన్నది కృత్రిమమైన నియమం. ఒక భాష మాట్లాడే వారు అనేక ప్రాంతాలలో వున్నపుడు ఏ రచన అయినా ప్రాంతీయమైనదీ అవుతుంది. అలాంటప్పుడు మాండలికం కాని భాష అంటూ ఎక్కడ ఉంటుంది? అది సాధ్యంకాదు’ [ఆంధ్రజ్యోతి -04-05-1980] అని తెగేసి చెప్పాడు. అన్ని ప్రాంతాల వాడుకలో వున్న పదజాలానికి , నుడికారాలకు చోటు లభించినపుడే అఖండసాహిత్యం, అఖండ భాష రూపొందుతాయని , అవి అన్ని ప్రాంతాల వాళ్ళనూ సాంస్కృతికంగా ఏకంచేస్తాయని కూడా విశాల దృక్పధాన్ని ప్రకటించాడు. అన్ని ప్రాంతాలభాష ప్రామాణిక భాషలో కలిసి వుంటే తెలుగు పరిపుష్టమై వుండేదన్న – కొకు మాటలకు అంతకు ముందే ఆయన చెప్పినట్టు అన్నివర్గాల కులాల భాష అనికూడ జోడీంచుకోవాలి.

‘రావిశాస్త్రి గారి విశాఖ జిల్లా భాషా , కాళీ పట్నం రామారావుగారి శ్రీకాకుళం జిల్లా భాషా, చాలాకాలం క్రితమే సురవరం ప్రతాపరెడ్డిగారి భాషా , ఇటీవల అల్లం రాజయ్య తెలంగాణా అధోగతి వాళ్ళ భాషా మంచిరచనలద్వారా సంప్రదాయ సాహిత్యంలో ప్రవేశింపవలసివున్నాయి’ అన్న కొకు ఆలోచనల్లోని ప్రజాస్వామ్యదృక్పధం తర్వాతి కాలంలో బలపడింది . అన్ని ప్రాంతాల నుంచివర్గాలనుంచి ప్రజల భాషలో సాహిత్య సృజన జరిగింది. కొకు జీవించివుంటే తర్వాతి కాలంలో తెలంగాణ, రాయలసీమల నుంచి ప్రాంతీయ చైతన్యంతో వచ్చిన సాహిత్యాన్ని , నాగప్పగారి సుందరరాజు లాంటి వాళ్ళ దళితభాషనీ , తర్వాత కాలంలో వచ్చిన మైనార్టీ భాషా సాహిత్యాన్ని గుండెకు హత్తుకొని వుండేవారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

అయితే భాషను సామాజిక శాస్త్ర దృష్ట్యా విశ్లేషించడం కొకు తర్వాత అరకొర మాత్రమే అని చెప్పడం తప్పు కాదు. చుక్కారామయ్య విద్యారంగంలో ఇంటిభాష గురించి చేసిన ప్రతిపాదనలు , జయధీర తిరుమలరావు ఆధిపత్య సంస్కృతి కింద నలిగిపోయి – పరాయికరణకు గురైన దేశీ భాషల గురించి చేస్తోన్న సూత్రీకరణలు [నడుస్తున్న చరిత్రలో వ్యాసాలు] కొకు కృషికి కొనసాగింపే. ప్రపంచీకరణ నేపధ్యంలోస్థానీయ భాష సంస్కృతులు సామ్రాజ్యవాద సాంస్కృతిక ఆధిపత్యాల కింద నలిగిపోతున్న తరుణంలో భాష గురించి కొకు చేసిన ప్రతిపాదనల వెలుగులో ప్రగతిశీల శక్తులు బలపడాల్సి వుంది. అన్ని రకాల ఆధిపత్య ధోరణులతో పాటు భాషాధిపత్యాన్ని సైతం ఎదిరించి నిలవాలి.

భాషను ప్రజాస్వామ్యీకరించుకోవడం అంటే జాతిని ప్రజాస్వామ్యీకరించుకోవడమే.

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో