తెలంగాణా కథల్లో రైతు జీవితం

తెలంగాణా కథా రచయితల్ని ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ రకమైన విభజన వరంగల్ జిల్లా కథా రచయితలకు మినహాయింపేమీ కాదు. వరంగల్ జిల్లాలో పుట్టి అక్కడే పెరిగి, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కథా రచయితలు. ఉదాహరణకు అంపశయ్య నవీన్, కోవెల సుప్రసన్నాచార్యులు, బుర్ర రాములు, రామా చంద్రమౌళి మొదలైనవారు. ఇక రెండవ రకానికి వస్తే వరాంగల్ జిల్లాలో పుట్టి , కొంతకాలం అక్కడే ఉండి వివిధ కారణాలతో వేరే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డవారు. ఉదాహరణకు దాశరధి రంగాచార్యులు, దాశరధి కృష్ణమాచార్యులు, తుమ్మేటి రఘోత్తం రెడ్డి, పేర్వారం రాములు, జైపాల్ రెడ్డి, ప్రొ. ననుమాసస్వామి మొదలైన వారుగా కనబడుతారు. వేరే ప్రాంతంలో పుట్టి వరంగల్ జిల్లాలో స్థిర పడినవారు చెప్పుకోవచ్చు. ఇందులో ఎం.వి.తిరుపతయ్య, జయధీర్ తిరుమల రావు, టంకశాల అశోక్ మొదలైన వారుగా చెప్పుకోవచ్చు.

“ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమింక తీరునురోరన్నో చిన్నన్నా” అన్న సినీ గేయం మనమింకా మర్చిపోలేదు. ఆనాటి జనపదంలో బాగానానిన పాట ఇది. ఆశావహ దృక్పధంతో రైతన్నలు తమ జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి ప్రేరణగా నిలిచిందది. ఇప్పటి పరిస్థితులకు ఆ పాట పాడాల్సివస్తే అది కాస్త ” ఏరు గొడవ మనకోద్దో రన్నో ఓరన్న, నీ కష్టమింక తీరదులే రన్నో చిన్నన్న ” అని రూపంతరంగా పాడుకోవాల్సి ఉంటుంది.

మరో రెండు దశాబ్దాల తర్వాత కూడా పరిస్థితులు ఇలాగే ఉంటే రైతు జీవితంపై సభల నిర్వహించే అవకాశం మనకుండకపోవచ్చు. ఎందుకంటే ఆత్మహత్యల ద్వారా కొందరు, వ్యవసాయం గిట్టుబాటు కాక వలసపోయి మరికొందరు , ఉన్న భూములను అమ్ముకుని కూలీలుగా మారి ఇంకొందరు, ప్రత్యేక ఆర్థిక మండలుల (SEZ-Special Economic Zone) ద్వారా భూ నిర్వాసితులై మరికొందరు ఇలా …. రైతు అనేవాడు పొలంలో ఇక కనబడకపోవచ్చు. కథల్లో కూడా ఇదే పరిస్థితి.

ఆంద్రప్రదేశ్ లో కోస్తాంధ్రా తర్వాత సస్యశ్యామలమైన ప్రాంతంగా తెలంగాణానే చెప్పుకోవచ్చు. ఇటు ఆంధ్ర ప్రాంత వాతావరణ పరిస్థితులు, అటురాయలసీమ వాతావరణ పరిస్థితులు తెలంగాణలో కనబడతాయు. అందుకే ఇక్కడి వ్యవసాయం భిన్న రీతుల్లో కనబడుతుంది. ఇక్కడి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా వ్యవసాయ రంగాన్ని శాసించే విధంగా ఉన్నాయు.

తెలంగాణా ప్రాంతమనగానే మనకు మొదట పోరుభూమి, విప్లవోద్యమ నేపధ్యం అనే వినిపిస్తుంది. కాని అంతర్లీనంగా గమనిస్తే రైతుల , వ్యవసాయదారుల భాగస్వామ్యం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ నేపధ్యం తీసుకునే రచయితలు తమ రచనల్లో ప్రస్తావించారు. కాల, ప్రాంత, భౌగోళిక, స్థానిక భేదాలను అనుసరింఛి ఇవి మారుతూంటాయి.

భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు కూడా, తెలంగాణ రచనల్లో రైతాంగం, వ్యవసాయం గురించి ఎక్కువగా ప్రస్తావించినప్పటికీ కథల విషయానికి వస్తే వీటీని నేపధ్యంగా తీసుకుని రచించిన రచనలు తక్కువే. వ్యవసాయం అంతర్లీనంగా కనబడుతుందే కాని వ్యవసాయ ఆధారంగా వచ్చిన రచనలను వరంగల్ కథా సంకలనాల్లో పరిశీలిస్తే వేళ్ళ మీద లెక్కించవచ్చు.

తెలంగాణ కథల్లో భాష, యాస , మాండలికం, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రస్తావన లేకుండా తెలంగాణా కథలను వివరించడం అసాధ్యం అని చెప్పక తప్పదు. మాండలికాల సొగసులు కథకు అద్దబడి , ఆచార సాంప్రదాయాలను తనలో రంగరించుకుంటూ కథ మరింత బలంగా జన హృదయాల్లోకి చొచ్చుకొని పోయింది. మాండలిక పద ప్రయోగం కథలో అంతర్లీనంగా కనిపిస్తూందే తప్ప ఎక్కడా కూడా అతికించినట్లు కనిపించదు. అందుకే తెలంగాణ కథ సామాన్య జన హృదయాల సవ్వడి.

అయితే తెలంగాణ కథల్లో ప్రధానమైన సమస్యలుగా ఉన్నవాటిని గమనిస్తే అతివృష్టి, అనావృష్టి , క్రిమిసంహారిక నకిలీ మందులు , నకిలీ విత్తనాలు , దొర దౌష్టికాలు , సన్నకారు రైతుల వ్యధలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు , దళారీ వ్యవస్థ , ప్రత్యేక ఆర్థిక మండలులు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ ప్రణాళికలు, ప్రభుత్వ పధకాల అమలులో జాప్యం , ఒకవేళ అమలు పర్చినా అసలైన లబ్దిదారులకు అందకపోవడం, నిరక్షరాస్యత , వడ్డీ వ్యాపారుల నిలువు దోపిడీ , నేటి కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిఙ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం , పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం , తండ్రి నుండి కొడుకులకు వచ్చే వరకు భూ కమతాలు తగ్గడం . వలస పోవడం , నీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం , భూగర్భ వనరులు తగ్గిపోవడం…. వెరసి రైతుల ఆత్మహత్యలుగా కనబడతాయి.

తెలంగాణా రైతు పరిస్థితి అందునా వరంగల్ జిల్లాలోని రైతు పరిస్థితిని చెప్పిన ఒక జానపద గేయాన్ని చూస్తే ” ఏటికేతం బట్టి యెయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలొ మెతుకెరుగునన్నా, అంటూ ఒక రైతు తన పరిస్థితిని గూర్చి పాడుకోవడం ఆ కాలం నాటి పాటే అయినా అది ఈ నాటికి యధార్థ సత్యం. ఆక్రోశించిన ప్రతిరైతు ఒక కవే. ఒక గాయకుడే.

ఇక వరంగల్ జిల్లాలోని కథల్లోని రైతు జీవన చిత్రణను విశ్లేషించే ముందు ఒక్కసారి తెలుగు కథకాధ్యుడు గురజాడ అప్పారావు (దిద్దుబాటు) ని తెలంగాణా కథానికాద్యుడు మాడపాటి హనుమంతరావు (హృదయ శల్యం) ను స్మరించడం అప్రస్తుతం కాదని నా అభిప్రాయం. వంద సంవత్సరాల కథ పుడుతూనే యవ్వనంతో పుట్టిందని పాలగుమ్మి పద్మరాజు చెప్పగా, శత వత్సరాల తెలుగు కథానిక ఇప్పటికీ అదే స్పూర్తి, అదే ఉత్సాహం, అదే ఉద్యమం, అదే చలనం , అదే చైతన్యంతో పసిడి వన్నెల కాంతులను తన ముసిముసి నవ్వులతో మనకు ప్రసరింపజేస్తూనే ఉంది. వరంగల్ లో పుట్టిన కథ నిత్య నూతనం , నవ యవ్వనం , ఎందరికో ప్రేరణ . బాధితుల ఆర్తనాదాలు , దుర్మార్గుల దౌష్ట్యాలు, విప్లవ రక్తాక్షరాలు, తేట తెలుగు హృదయాల స్వచ్చతా పరిమళాలు, బోసినవ్వుల పాపాయిల నుండి, కరుడు గట్టిన నియంతల పాశవిక చర్యల వరకు, కులం కుళ్ళును, మతం మత్తును…. ఇలా ఒకటేమిటి సమస్తాంశాలను వరంగల్ జిల్లా కథ నింపుకుని రాబోయే కొత్త రచయితలకు ప్రేరణగా నిలుస్తూ ముందుకు సాగుతూనే ఉంది.

అయితే ఇక్కడ ఒక్కమాట . సాహిత్యం వల్ల సమాజం మారుతుంది. సమాజం వల్ల సాహిత్యం మారుతుంది. తెలంగాణ కథ పరిస్థితి కూడా అంతే.

తెలంగాణా కథ రచయితల్లో వరంగల్ వారికి ఒక విలక్షణమైన స్థానముంది . వీరు సాయుధ పోరాటాన్ని , తెలంగాణ సాధన ఉద్యమాన్ని , రైతాంగ జీవితాన్ని , తెలంగాణ ప్రాంతంలోని భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోని సమస్యలని స్పృశిస్తూ కథా రచనను కొనసాగించారు. ఈ కోవలో రచయితలు కోకొల్లలు. అందులో ప్రధానమైనవారు – సదానంద్ శారద, అడ్లూరి అయోధ్యరామ కవి, కాళోజీ , కోవెల సుప్రసన్నాచార్యులు , కోవెల సంపత్ కుమారాచార్యులు , జయధీర తిరుమల రావు, దేవులపల్లి రామానుజారావు, అంపశయ్య నవీన్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కర్ర ఎల్లారెడ్డి, పులుగు శ్రీనివాస్, ననుమాస స్వామి, చంద్ర, అన్వర్, దేవరాజు మహరాజు, వానమామలై వరదాచార్యులు, వరిగొండ కాంతారావు. ఆవాల దామోదర్ రెడ్డి, పేర్వారం జగన్నాధం, పేర్వారం రాములు, రామా చంద్రమౌళి, పొట్లపల్లి రామారావు, పింగళి రంగారావు, పి.వి.నరసింహారావు, నెల్లుట్ల వెంకటేశ్వర రాదు, నెల్లుట్ల రమాదేవి, నందగిరి ఇందిరాదేవి, అనిశెట్టి రజిత, ఎ,వి, అనీల్ కుమార్ , ఎం.వి. తిరుపతయ్య, ఎం.సుబ్బారావు, యెడమి శ్రీనివాస్ రెడ్డి, ఏరుకొండ జయశంకర్, ఒద్దెరాజు రాఘవరావు, ఒద్దెరాజు సీతారామ చందర్ రావు, వీరాచారి, తక్కెళ్ళ బాల రాజు, కందాళ సుదర్శన్, కందుకూరి లింగరాజు, కె.రమ్మోహన్ రాజు, కె.పద్మలత, కె.సూర్యముఖి, కె.సురేందర్, గుండేబోయిన శ్రీనివాస్, జితేందర్ రావు, టంకశాల అశోక్, నాయని సుజనాదేవి, పులిపాక కనకదుర్గ, పెండ్యాల చిన రాఘవరావు, పెండ్యాల శేషగిరిరావు, బి, పద్మజ, మద్దెర్ల రమేష్, మహేశ్వరం రత్నాకర్ రావు, మెండు ఉమా మాహేశ్వర్ రావు, మెట్టు మురళీధర రావు, వంగా నర్సయ్య, వడ్డేబోయిన శ్రీనివాస్ , ఎస్. శ్రీదేవి, శ్రీరంగస్వామి, సయ్యద్ ఖుర్షీద్, సముద్రాల లక్ష్మి నర్సయ్య, సి. జయపాల్ రెడ్డి , దాస్యం లక్ష్మయ్య, విజయార్కె వంటివారు ప్రముఖంగా కనిపిస్తారు.

అయితే తెలంగాణాలోని వరంగల్ జిల్లా కథ రచయితల్లో వ్యవసాయ నేపధ్యాన్ని, రైతాంగ సమస్యలను ఇతి వృత్తాలుగా చేసుకుని కథా రచనలు సాగించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వారిలో ప్రధానమైన ప్రముఖుల్లో కొంతమందిని చూద్దాం.

మొదటగా తుమ్మేటి రఘోత్తమ రెడ్డి స్వయానా రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి. ఇప్పటికీ వారి జీవితం రైతులతో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. అందుకే వారి కలం నుండీ జాలువారే ప్రతి సిరా చుక్క రైతు జీవిత నేపధ్యమే . వారి కథల్లో ఒక ఆణి ముత్యం “నా పాత స్నేహితుడు” ఈ కథ 1985 లో రచింపబడగా ప్రచురణ మాత్రం 1990 వ సంవత్సరంలో సృజన మాస పత్రికలో అచ్చు అయింది.

“నా పాత స్నేహితుడు” కథ దాదాపుగా గత నీడల అనుభవాలతో సాగుతుంది. నేను, నిరాంజన్ ప్రధాన పాత్రదారులు . ఈ కథలో అటు వ్యవసాయదారుల వెతలను , ఇటు గని కార్మికుల కథలను సమాంతరంగా చిత్రీకరించారు. ఇద్దరు మిత్రుల రైల్వేస్టేషన్ లో కనబడి వేరు వేరు పెట్టెల్లో ఎక్కిన తర్వాత ఒక మిత్రుడు వారిద్దరి అనుభూతులను గుర్తి చేసుకోవడంతో కథా ప్రారంభం అవుతుంది. నేను, నిరంజన్ ఇద్దరు బాల్య స్నేహితులు. చిన్నతనంలో కలిసి మెలిసి ఉంటారు. ఎండు పుల్లలేరడం, కంకులు కాల్చడాం, వరినారు బండ్లలోంచి జారిపోయిన నారు పిడచల్ని తెచ్చి నాటు పెట్టడం, వాన నీటికి అడ్డు కట్టా వేయడం, చిన్న చిన కాల్వలను తీయడం, పైరులను కౌగిలించుకోవడం లాంటి చేష్టలతో బాల్యం గడిచిపోతుంది. ఊళ్ళో చదువు అయిపోగానే పొరుగూరికి చదువు కోసం వెళ్తారు . అక్కడ వారికి చదువు అంతు చిక్కదు. అలాగే వారి తల్లిదంద్రులకు వ్యవసాయం పట్టు చిక్కదు. అందుకే వారు పిల్లల్ని చదువుకొమ్మని ఒత్తిడి తెస్తారు. కాని వ్యవసాయం ఆటపాటల్లాగా అనిపించడం వల్ల చదువులో తప్పి స్నేహితులిద్దరూ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారు. నాకు ఒక పాలేరు , నిరంజన్ వాళ్ళకి నలుగురు పాలేర్లు ఉండేవారు. అప్పటికే వ్యవసాయం పతిస్థితి ఆరుకోసి మూడు అతుకులుగా ఉంది. అంతకు ముందున్న జొన్న, మొక్క జొన్న , పెసర్ల స్థానం లో మిర్చి వచ్చింది. దానికోసం వర్షాలు తక్కువ కాబట్టి కొత్తగా బావులు తొవ్వటం , కరెంటు మోటార్లు , వాటి కోసం లంచాలు, ఎరువులు కొనడానికి పెట్టిబడి , బ్యాంకుల చుట్టూ తిరగడం, లంచాలు పోను వచ్చిన వరకు మిర్చిపై పెట్టడం , బ్యాంకుల చుట్టూ తిరగలేక వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పుచేయడం , వడ్డీ, అసలు కలిసి తడిసి మోపడై అప్పుల్లో మునగడం ఇదీ ఆ గ్రామ రైతు పరిస్థితి.

మొదట్లో విత్తనాలు వేసిన రైతులకు పంట ముందు గానే చేతికి రావడం వల్ల వారు మార్కెట్లో మంచి ధరకమ్మి లాభపడేవారు. తర్వాత పంట తీసిన రైతులు మార్కెట్టుకు వెళ్ళగానే ధరలు పడిపోయేవి. చాలా మంది రైతుల పరిస్థితి “కర్ర మీద గింజ వస్తేనే కంచం లేచేది” అన్నట్లుగా ఉండేది కాబట్టి అడ్డగోలు ధరలకు పంటలను అమ్ముకోవాల్సి వచ్చేది. అందుకే ధరలున్నప్పుడు పంటలుండవు, పంటలున్నప్పుడు ధరలుండవు.

రైతులంతా మిర్చి వేసి నస్టపోతుంటే కొందరు తెలివిగా పోగాకు వేసేవారు. ఆ లాభం చూసి మరుసటేడు మిగిలిన రైతులంతా పొగాకు వేసి అమ్మబోతే మార్కెట్టులో వాటి మీద పేడ నీళ్ళు చల్లి ఇది పనికి రాదు అని నిర్ధాక్షిణ్యంగా చెప్పేవారు పొగాకు వ్యాపారులు. వీటికి తోడు వర్షాలు అధికంగా కురిస్తే ఒక బాధ , కురువనేడుమరోబాధ.

నేను ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళీళ్ళు చేయవల్సిరావడంతో అప్పులు చేయాల్సి వస్తుంది. ఇల్లంతా ఊడ్చి ఊడ్చి పెట్టాల్సి వస్తుంది. ఈ కష్టాల్లోంచి వ్యవసాయాన్ని గట్టెక్కించడమా? లేదా వ్యవసాయాన్ని వదిలి వేయడమా? అనే మీమాంస మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనె నేను వాళ్ళ చిన్నమ్మ , చిన్నాన్న ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో నేనుని బాయి పనికి తీసుకపోతామని చెపుతారు. అలా వ్యవసాయాన్ని వదిలిపెట్టి నేను బొగ్గుబాయి పనికి పోతాడు. మిగతా కథలో నిరంజన్ తన పాలేర్లను హింసిస్తూ వారితో గొడ్డు చాకిరీ చేయించుకుంటూ జీవనం సాగిస్తాడు. అది మన అంశానికి ప్రస్తుతం అప్రస్తుతం.

ఇక్కడ కథకుడు నేను అనే పాత్రతో వ్యవసాయదారుల కష్టాలను, వర్షం అధికంగా పడటం వల్ల అసలు పడక పోవడం వల్ల , ఒకే రకమైన పంటలు వేయడం వల్ల , లౌక్యం తెలియక వేరు వేరు పంటలు వేయడం వల్ల వ్యవసాయంలో నష్టాలకు గురై వేరే ఊరికి వలసపోవడాన్ని విమర్శనాత్మకంగా , విశ్లేషనాత్మకంగా తనదైన రీతిలో చూపించారు.

వార్త ఆదివారం , 19 ఫిబ్రవరి , 2006 వ సంవత్సరంలో ప్రచురితమైన కథ సమీకరణాలు. రచయిత అంపశయ్య నవీన్ కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతగా వీరు సుపరిచితులు. ఎక్కువగా పరిచయం అవసరం లేని కథా రచయిత వీరు. సమాజంలో ఆర్థిక శాస్త్రాన్ని సాక్షాత్కరించుకున్నారు కనుకనే వీరి రచనల్లో ఆ ఛాయలు కనబడతాయి. ఈ క్రమంలోనే వీరి కథల కు సమీకరణాలు అని పేరు పెట్టడం ఒక నిదర్శనం.

సమీకరణాలు పాత్రోచిత మాండలికంలో తయారైంది. కథా రచయిత నిరక్షరాస్యత , అక్షరాస్యత రైతులను ఏ విధంగా ప్రభావితంచేస్తుందో విభిన్న కోణంలోంచి సుస్పష్టం చేసారు.

ఈశ్వరయ్య , సోమయ్యలు అన్నదమ్ములు . వీరి చుట్టూ కథ తిరుగుతూంటుంది. యాదగిరి , గ్రామ సర్పంచిలు ప్రధాన పాత్రలను, కథను మలుపు తిప్పే పాత్రలుగా కనిపిస్తారు . ఒకే ఇంట్లో పుట్టిన ఈశ్వరయ్య చదువు పట్ల ఆసక్తి కలిగి ప్రయోజకుడవుతాడు. ఆ క్రమంలోనే అతడు ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడుగా నియమింపబడతాడు. కాగా సోమయ్య చదువాల్సిన సమయంలో చదువును నిర్లక్ష్యం చేసి బాధ్యతారహితుడవుతాడు. తండ్రి ఇద్దరికీ సమానంగా పొలాన్ని పంచినా తమ్ముడు ( సోమయ్య) రైతుగా మిగిలిపోతాడు. కాని అన్న ( ఈశ్వరయ్య) రైతు, ప్రధానోపాధ్యాయుడుగా సమర్థవంతంగా దిపాత్రాభినయం చేస్తూ క్రమంగా ఆర్థికంగా ఎదుగుతాడు. తమ్ముడు వ్యవసాయంలో మెళకువలు తెలుసుకోలేక, లౌక్యంగా జీవించటం చేతాకాక, తాగుడుకు బానిసై అవసరాలకు అప్పులు చేస్తూ కాలం వెళ్ళదీస్తూంటాడు. అయితే అతనికి అప్పు ఇచ్చిన షావుకారు రంగయ్య ఒత్తిడి తేవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తమ్ముడు అన్న దగ్గరికి అప్పుకోసం వస్తాడు. అన్న ససేమరి అంటాడు. తర్వాత తమ్ముడు ఊరి పెద్ద యాదగిరితో మధ్యవర్తిత్వం నెరపి అన్న ఇంటి ముందున్న తన ఖాళీ జాగాను కుదవబెట్టి డబ్బు తీసుకుంటాదు. అప్పులుపోగా మిగిలిన డబ్బుతో పంటవేశ్తాడు. అనుభవలేమి, కొత్తవ్యవసాయ పద్ధతులు ఉపయోగించకపోవడం, వేసిన పంటనే మళ్ళీ మళ్ళీ వేయడం వంటి లౌక్యంలేని పనులతో పాటుగా, పొలానికి నీరు సరిగ్గా, సకాలంలో అందకపోవడం వల్ల ఏయేటికాయేడు నష్టాల ఊబిలో కూరుకుపోతాడు. అన్న మాత్రం సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రయోగిస్తూ నష్టం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకుంటూ మంచి పంట రాబడి తీస్తాడు.

వీరిద్దరి మధ్య సయోధ్య , సఖ్యతలకు అవకాశం లేకుండా పోతుంది. ఆర్థిక కారణాలు ప్రధాన అంతరంగా మారుతాయి. మధ్యవర్తి చెప్పుడు మాటల వల్ల తమ్ముడు విపరీత చర్యలకు పాల్పడుతాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు కూడా సంసిద్దుడవుతాడు. అందుకు ఫలితాంగా ఎక్స్ గ్రేషియా ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పిన యాదగిరి మాటలను నమ్ముతాడు. యాదగిరి మాటాలను విన్న సోమయ్యకు ధైర్యం చాలదు. ఒకవైపు లక్షరూపాయలు, మరోవైపు మరణం సంఘర్షిస్తుందతని హృదయం.

వ్యవసాయంలొ తన సర్వస్వాన్ని కోల్పోవడం వల్ల భవిష్యత్తు అంధకారమవుతుంది. ఈ కారణాలు అతన్ని మానసికంగా కృంగదీసి ఆత్మహత్య (ఉత్పత్తి) కు పురికొల్పుతాయి. తినే అన్నంలో కొద్ది మోతాదులో పురుగుల మందు కలుపుకుని తిన్న అతడు అస్వస్థుడై సకాలంలో వైద్యం అందక, యాదగిరి తప్ప మిగతావారు సరిగ్గా స్పందించక మరణిస్తాడు.

ఈ కథలో అంపశయ్య నవీన్ అక్షరాస్యత, కొత్త వ్యవసాయపు పద్ధతులు, మెళకువలు లౌక్యంవంటివి రైతులకు ఉండవల్సిన ఆవశ్యకతను రెండు విభిన్న పాత్రల ద్వారా హృదయానికి హత్తుకునే విధంగా సమీకరిస్తారు. అదే ఈ సమీకరణాలు.

ఆదివారం ఆంధ్రజ్యోతి 22 డిసెంబర్ ,2002 వ సంవత్సరంలో బుర్ర రాములు గారి కథ “గీ బతుకెందుకు” ప్రచురింపబడింది. కథకుడు మానవ హక్కుల కార్యకర్త. వృత్తి రీత్యా కాకతీయ యూనివర్సిటీ లోని ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యుడు. ” గీ బతుకెందుకు” లో మాండలిక బాష ఉపయోగించబడింది. కథా రచయిత కథలో రైతుల సమస్యను, కుహనా ఉద్యమకారులను తనదైన శైలిలో విశ్లేషించారు. ఇందులో మీనయ్య దేవయ్యలు ప్రధాన పాత్రలుగా కనబడగా మీనయ్య రైతుగా . దేవయ్య అలియాస్ క్రాంతి అలియాస్ క్రాంతిదేవ్ నకిలీ ఉద్యమ కారుడుగా కనిపిస్తాడు. మనం ఇప్పుడు రైతు సమస్యల్ని ప్రస్తావనలోకి తీసుకుంటే కథానాయకుడు మీనయ్య మొదట కూలీగా పనిచేస్తూ సూరత్ లో డబ్బు సంపాదిస్తూంటాడు. అక్కడ దుకాణాలు మూతపడటంతో నేరుగా సొంత గ్రామానికి వచ్చి రైతుగా మారతాడు.

తనకున్న పొలంలో నీళ్ళులేక బావి ఎండిపోవడం వల్ల మొదటిసారిగా బోరువేస్తాడు. అయితే దరిద్రం అతన్ని శనిలా పట్టుకుందేమో మన్ను తప్ప జలంరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో తన పొలంలోనే మరో చోట రెండవసారి బోరు వేస్తాడు. గంగవ్వ తల్లి కరుణా కటాక్షం కాస్త ప్రసరించిందేమో కొద్దిగా నీరు కనబడుతుంది. అయితే ఆ నీళ్ళు పొలానికి తడారడానికి కూడా చాలవు. తన దగ్గరున్న డబ్బుకు అప్పు తెచ్చిన డబ్బును కలిపి అంతా పంట మీద పెడతాడు. అప్పు అలాగే నిలిస్తింది. కాని పంట చేతికి రాదు. ఆశ చావక మరోసారి పంటేసినా మీనయ్యకు అదే పరిస్థితి పునరావృత్తమవుతుంది. ఏ యేటికాయేటికి ఇక కష్టాలు తీరుతాయోమో అనుకుంటున్న రైతుకు అప్పులకు వడ్డీలు పెరగడం , పంట సరిగ్గా చేతికందక పోవడం కృంగదీస్తుంది. దిక్కుతోచని పరిస్థితిలో తనమీద తనకే కోపం భార్యాపిల్లల పట్ల జాలి , వారికి అన్యాయం చేస్తున్నానన్న బాధతో అనునిత్యం మానసిక సంఘర్షణ కు లోనవుతాడు.ఈ క్రమంలో తనచుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు , అతని అమాయకత్వం , బేలత్వం ఎత్తి చూపుతాయి. ఇవన్నీ తట్టుకోలేక భార్యాబిడ్డల పట్ల సరిగ్గా ఉండలేక ఆత్మహత్య శరణ్యమనుకుంటాడు. బావి దగ్గరికి వెళ్ళి కరెంటు వైరుని పట్టుకుని చనిపోవాలనుకుంటాడు. కాని ఇక్కడా అతని కంటే ముందే అతని దురదృష్టముందేమో ఆ సమయంలో అక్కడ కరెంటు ఉండదు. దగ్గర్లో ఉన్న తుమ్మ మొద్దుకు వైరు బిగించి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఆఖరి నిమిషంలో తాను చస్తే తన కుటుంబ మేమవుతుందనే భయం, బాధా కలుగుతాయి. బతుకుదామనే ఆశలో ఉండగా ఉరి బిగుసుకుంటుంది.

ఇలా రచయిత రైతు వేదనాభరిత జీవితాన్ని, చిక్కి శల్యమైన వారి బ్రతుకులను, చితికిపోయిన వారి ఆర్థిక పరిస్థితులను హృదయ విదారకంగా చూపించారు. ఇలా బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా అని రైతు అనుకున్నదే “గీ బతుకెందుకు”

“పగలు, రేయి శ్రమపడుతున్నా” అనేకథ ప్రజాసాహితి మాస పత్రిక జూన్, జూలై 1984 వ సం.లో ప్రచురించబడింది. దీని కథకుడు తుమ్మేటి రఘోత్తమ రెడ్డి. ఈ కథలో కథకుడు వ్యవసాయం నుండి రైతులు ఎందుకు, ఎలా వలస పోతున్నారో విశ్లేషించడం చూస్తాం. సన్నకారు , భూస్వామి రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని తమ జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేసుకున్నారో కథలో కనబడుతుంది.

ఈ కథలో ఓదెమ్మ , ఓదెమ్మ కొడుకు మల్లెశు, ఓదెమ్మ సోదరుడు సాయిలు, రాంరెడ్డి పటేలు , రాంరెడ్డి తల్లి, భార్య , కొడుకు పాత్రలు కనబడతాయి.

కథ ఓదెమ్మ ఇంట్లో ప్రారంభమై రాంరెడ్డి ఇంటిలో ముగుస్తుంది. ఓదెమ్మ సోదరుడు సాయిలు. 20 సంవత్సరాల క్రితం వ్యవసాయం అచ్చిరాక బొగ్గు గనుల్లో పనిచేయడానికి వెళతాడు. 20 సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చినప్పుడు తన చెల్లెలు కొడుకు మల్లేశును రాంరెడ్డి పటేల్ దగ్గర పనికి కుదుర్చాలనుకుంటాడు. 20 ఏళ్ళలో మోట బావుల స్థానంలోకరెంటు మోటార్లు , ఊర్లో దార్లు మరింత బాగా కనబడుతాయి. అక్కడక్కడ వీధి దీపాలు కూడా కనబడుతాయి. ఊళ్ళో గుడిసెలు మాత్రం అప్పటికంటే అధ్వాన్నంగా ఉంటాయి. ఒక్క ఆసామి కూడా నాలుగు బెంగుళూరు పెంకలేసి ఇల్లు కట్టినట్లు కనబడదు. రాంరెడ్డి పటేల్ ఇల్లు కూడా అట్లాగే కనబడుతుంది.

రాంరెడ్డి పటేల్ అప్పటికీ ఇప్పటికీ పోల్చుకోలేని మనిషిలా నల్లగా చిక్కిపోయినట్లు కనబడతాడు. ఇంకాస్త సాయిలు వేషం మంచిగా ఉంటుంది. రాంరెడ్డి తల్లి (ముసలామె) చేవిటితనంతో ఇంటి ముందు కూర్చుని తనకు తోచిన పని చేస్తూంటుంది. సాయిలు క్షేమ సమాచారాలు మాట్లాడాక తన మేనల్లుడు (మల్లేశం) విషయం ప్రస్తావిస్తాడు. దానికి రాంరెడ్డికి ముఖంలో రంగులు మారతాయి. రాంరెడ్డి తన బాధ చెపుతూ “అప్పుడు మోటలుండె, ఇప్పుడు కరెంటు మోటార్లు వచ్చినాయి. ఇగ ఇన్నొద్దులు కాలం కాకపాయె. అడ్డు అదుపులేకుండా కూళ్ళు పెరిగె , జీతాలు పెరిగె , వేలకు వేలు పెట్టి మందు సామాన్లు సల్లుడు, మందెయ్యకపోతే మన్నేగతాయె. ఇగ ఎగసాయెం చేసేదెట్లాగ. అమ్మబోతే అడవాయె. కొనబోతె కొరవాయె.” అంటూ బాధపడతాడు . ఇంకా యవసాయం చేసి సంపాదించిన డబ్బంటూ ఏమీలేదు. వేలకు వేలు అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలతో పంట దిగుబడి పోలిస్తే ప్రతీ యేటా కొంత అప్పు మిగిలే ఉంటుంది. 20 ఏళ్ళ సందీ యవసాయమన్న మాటే గాని గుడిసిల్లు గూనపెంకులిల్లి కాకపోయింది. పండిన పంట మార్కెట్ కు పోతే అడ్డికి పావుసేరు మిగిలె. అందుకే పాలేర్ల జీతాలను ఇచ్చే శక్తి కూడా దినదినానికి తగ్గిపోతుంది”అదే విషయాన్ని సాయిలుతో నర్మగర్భంగా చెపుతాడు. చివరగా రాంరెడ్డి కొడుకు వ్యవసాయం మీద ఆశ వదులుకుని బొగ్గు గనుల్లోకి పనికి పోవడానికి సిద్ధపడ్తారు. పరువు ప్రతిష్టలంటూ బ్రతికిన పటేల్ కుటుంబం కూడా వ్యవసాయం కలిసిరాక బొగ్గు గనుల పనుల్లోకి వెళతారు. రాంరెడ్డి దాంపతులు తన కొడుకును పంపిస్తూ కళ్ళనిండా నీరు తీసుకోవడంతో కథ ముగుస్తుంది.

సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సాయిలు కుటుంబం (చిన్నరైతు) పరిస్థితి, 20 సంవత్సరాల తర్వాత రాంరెడ్డి పటేల్ కుటుంబం (పెద్దరైతు) పరిస్థితి ఒకేలా కనబడ్తుంది. కథకుడు వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ఎలాంటి వారైనా కష్టాలతో, నష్టాల్లోనే తమ జీవితాన్ని గడుపుతున్నారని, చివరకు వ్యవసాయాన్ని వదలేసి , వలసపోతున్నారని తెలంగాణా రైతు వ్యధా భరిత జీవితాన్ని తనదైన ఒక ప్రత్యేక శైలిలో పాఠకుల ముందుంచుతాడు.

రామా చంద్రమౌళి వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఇతనిచే రచించబడిన “భూమి దుఃఖం” ఆదివారం వార్త 11 మార్చి , 2007 వ సంవత్సరంలొ ప్రచురితమైంది. మారుతున్న వ్యాపార సంస్కృతిలో భాగంగా వ్యవసాయ భూములలో వచ్చిన అనూహ్యమైన మార్పుల వల్ల , గ్రామాలు నగరీకరణ చెందడం వల్ల వారి పచ్చని జీవితాలకు చిచ్చు పెడుతున్న వైనాన్ని భూమి దుఃఖం ఆవిష్కరించింది. ఇందులో కథకుడు సమకాలీన సమస్యను సమర్ధవంతంగా చిత్రించారు.

మట్టి బంధం అనే కథ సంకలనం 2006 వ సంవత్సరంలో ముద్రించబడింది. రచయిత అనిశెట్టి రజిత. వాస్తవిక దృష్టికి , ఊహాశక్తికి, తెలంగాణా ప్రాంతోచిత భాష పట్టుకు, సామాజిక స్పృహకు గీటురాయి ఈ మట్టి బంధం కథా సంకలనం . ఇందులో మట్టి బంధం ఒక కథ . ఇందులో కరువు, ఆకలి , నిరుపాధి వల్ల ఊరి బంధాలను తెంపుకుని వలస బాటలు పట్టి దారిద్ర్యపు ఉచ్చులో ఉసూరుమంటున్న లక్షలాది మంది మట్టి మనుషుల (రైతుల) జీవితాలను హృద్యంగా వర్ణించింది రచయిత్రి.

ప్రొఫెసర్ ననుమాస స్వామి వృత్తి రీత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కథా రచయిత. వీరి కలం పేరు “నమామి” . వీరి కలం నుండి జాలువారిన కథా సంకలనం గంటీలు. వీరి గంటీలు బంగారపువి మాత్రమే కాదు. వాటికి ప్రాణం ఉంది. పరిమళం ఉంది. అవి వాళ్ళ అమ్మవి. వాళ్ళ నాయన చేయించినవి. ఆయన వెళ్ళిపోయాక అమ్మ గంటీలను ఙ్ఞాపకంగా భద్రపర్చుకుంది. అవి దొంగలపాలు అయ్యాయి. అంతే ఆమె ప్రాణం విడిచింది. ఆ వేదనలోంచి రూపోందిన అక్షర రూపమే గంటీలు.

గంటీలు కథా సంకలనంలో “వెలుగు చూస్తున్న వేర్లు” ఒక కథ. ఇందులో కథకుడు వీరమల్లు గౌడ్ అనే రైతు పాత్రను చైతన్య పూరితంగా, ఆదర్శవంతంగా సమాజానికి ప్రేరణ కలిగించే వ్యక్తిగా సృష్టించాడు . గౌడ్ ఎం.ఎ చేసి వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఒకసారి సబ్ కలెక్టర్ వారి గ్రామానికి వచ్చినపుడు అతని వల్ల ప్రేరణ పొంది ఐ.ఎ,యస్ ఆఫీసర్ గా ఉన్నత శిఖారాలను అధిరోహిస్తాడు.

రైతుల పట్ల ఆశావహ దృక్పధాన్ని కలిగించే రచనగా దీన్ని పేర్కొనవచ్చు. ఇలాంటి దృక్పధమే తుమ్మేటి రఘోత్తమ రెడ్డి “ఒక్కటైతే” అనే కథలో కూడా కనిపిస్తుంది. ఈ కథలో కూడా కథానాయకుడు బండెడు వడ్లు పండించి మార్కెట్టుకు తీసుకొస్తాడు. అక్కడ అతని వడ్లు అడ్డికి పావుశేరుగా అమ్మాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో అక్కడి కూలీలు తమ సమస్యల పట్ల ఏకీకృతమై, సంఘటితమవుతున్న తీరును చూసి మేము కూడా అలా అవ్వాలనుకుంటూ వెళ్ళడంతో కథ ముగుస్తుంది.

స్పృశించిన వరంగల్ జిల్లా కథ రచయితల, వారి ఇతి వృత్తాల అంతసూత్రం ఒక్కటే. ఏ కథా రచయిత, ఏ విధమైన రైతు సమస్య తీసుకున్నా వారి మనోభావం ఒక్కటే.

అదే

తెలంగాణా ఇంటి పేరు పోరాటం.
తెలంగాణా మాట తీరు ధిక్కారం.
తెలంగాణా వంటి సౌరు ఆత్మీయం.
తెలంగాణా కంటి చూపు ఆప్యాయం.
తెలంగాణా బిడ్డ చాలు వీరంగం.

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 Responses to “తెలంగాణా కథల్లో రైతు జీవితం”

  1. 1
    హెచ్చార్కె Says:

    ఈ వ్యాసానికి ‘తెలంగాణా కథల్లో రైతు జీవితం’ అని పేరు పెట్టడం ఎందుకు? ఎంచక్కా, వరంగల్ రచయితలు అని పేరు పెట్టొచ్చు కదా? వ్యాసం పేరే కాదు, నాకు తెలిసినంత వరకు, వ్యాసంలో మీరు చర్చించిన వారంతా వరంగల్ రచయితలే.

  2. 2
    ప్రాణహిత » ప్రాణహిత నవంబర్ 2009 సంచికకు స్వాగతం Says:

    [...] తెలంగాణా కథల్లో రైతు జీవితం : డా.వేలూరి శ్రీదేవి [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో