Nov2009
ఉద్యమాలు వున్నా లేకున్నా కవిత్వం వుంటుంది శ్రీ శ్రీ వుంటాడు
కవులలో… తెలుగు కవులలో కూడా… వుద్యమాల కోపు కాచిన కవులున్నారు, వుద్యమాలకు దూరంగా వున్న వాళ్లున్నారు. ఉద్యమాలకు కవిత్వానికి సంబంధం ఉండకూడదనే వాళ్లూ వున్నారు. ఈ విధంగా వుద్యమానుకూలురు, తటస్థులు, వ్యతిరేకులు అని కవులను వర్గీకరించడం… ఆ దృక్ఫధం లోంచి కవిత్వాన్ని చూడడం బాగానే జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది. ఈ రకం వర్గీకరణ (టాక్సొనామికల్) దృక్పథం వల్ల జరిగిన మేలు కన్న కీడే అధికం.
ఉద్యమ అనుకూలురు, తటస్థులు, వ్యతిరేకులు… ఇలా అన్ని వర్గాలకు చెందిన కవులలో గొప్ప వాళ్లున్నారు. వీరందరిలో పదునైన కవిత్వం చదివి వుత్తేజం పొందిన పాఠకులలో నేనొకడిని. ఈ కవుల మధ్య పేచీలను చూసి అప్పుడప్పుడు నేనూ ఆనందించచకపోలేదు. ఆ పేచీలకు ‘నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చి’న సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా, కవిత్వం చదివి ఆనందించడానికి కవుల ప్రాపంచిక దృక్పథాలు నాకెప్పుడూ అడ్డు రాలేదు. యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో… ‘నక్సల్బరి నిప్పురవ్వ దావానలమవుతుంద’ని నమ్ముతున్న రోజుల్లో ఇస్మాయిల్ ‘చెట్టు నా ఆదర్శం’ మొదటి ప్రచురణ ముఖ్మల్ అట్టలను అమిత ప్రేమతో ముఖానికి రాసుకోడం, చూడు చూడు పద్యాలెంత బాగున్నాయో అని మితృలకు చెప్పి చెప్పి మురిసి పోవడం ఏమాత్రం ఎబ్బెట్టుగా అనిపించలేదు.
ఏదో వుంది. వుద్యమ వుద్వేగాలకు మించినది, వాటితో ప్రమేయం లేనిది ఏదో వుంది… కవిత్వంలో… మంచి కవిత్వంలో.
చదువుకుంటున్న రోజుల్లోనిదే మరో సంగతి గుర్తొస్తోంది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక పండితుడు మాకు ఆధునిక తెలుగు సాహిత్యం బోధించేవారు. అప్పటికాయన ఆరెస్సెస్ లో ఒక రాష్ట్ర స్థాయి ప్రముఖుడు. క్లాసులో శ్రీశ్రీ గురించి ఉపన్యాసం మొదలెడుతూ ఆయన ఒక మాట అన్నారు. ‘హి (శ్రీశ్రీ) కంపెల్స్ అట్టెన్షన్’. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నుంచి విన్న ఈ మాట విశ్వనాథ సత్యనారాయణ గారిదని ఆ తరువాత ఎవరో చెప్పారు. శ్రీశ్రీ ప్రాతినిధ్యం వహించే భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే విద్యాధికుల అభిప్రాయం ఇది. శాస్త్రి గారు సరే, విశ్వనాథ గురించి చెప్పేదేముంది?! ఇంతకూ శ్రీశ్రీ కవిత్వంలో పాఠకుల ‘అట్టెన్షన్’ని, అదీ, ఆయనతో సైద్ధాంతికంగా విభేదించే వాళ్ల ‘అట్టెన్షన్’ ని కూడా ‘కంపెల్’ చేసింది ఏమిటి? అది ఏమయినా కావచ్చు గాని, వుద్యమం లేదా వాదం అయి వుంటానికి వీల్లేదు కదా?!
ఆధునిక లిఖిత తెలుగు సాహిత్యంలో ప్రజా వుద్యమానికి మరో పేరు శ్రీశ్రీ. ఆయన ‘కమ్యూనిస్టు’ కాబట్టి… ఆ కారణంతో ఆయనను ప్రేమించిన వాళ్లు బోల్డంత మంది వున్నారు. ఆ కారణంతోనే ఆయనను వ్యతిరేకించిన వాళ్లు. వీళ్లు కూడా చాల మందే వున్నారు. శ్రీశ్రీ కవిత్వాన్ని గొప్ప కవిత్వంగా చూడడానికి ఈ అంశం అడ్డు పడింది. ఇటీవలి కాలంలో ఈ ‘అడ్డు’ మరింత దళసరిగా తయారయ్యిందని నా అనుమానం. శ్రీశ్రీ నుంచి నేర్చుకోవలసింది ఇంకా చాలా వుంది. శ్రీశ్రీ కవిత్వం నుంచి, కవిగా శ్రీశ్రీ వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవలసింది ఇంకా చాలా వుంది. అందుకోసమైనా ఈ అర్థరహితమైన అడ్డుగోడను తొలగించాల్సిన అవసరం వుంది. శ్రీశ్రీ కోసం మాత్రమే కాదు. సాహిత్య సృజనలో తమ దారి తాము వెదుక్కుంటున్న కవుల కోసం, తెలుగు సాహిత్యం పురోగమనం కోసం కూడా ఈ అడ్డు గోడను తొలగించాల్సి వుంది.
శ్రీశ్రీకి చాల గుర్తింపు దొరికిందని అంటూ వుంటారు. ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని, ఆయన నుంచి పొందాల్సినంత మేలు మనం పొందలేదని నేను అనుకుంటున్నాను. ఉద్యమాలు, కమ్యూనిజం ఆయనకు చాల ఇష్టమైన విషయాలు మాత్రమే. అవే ఆయన కవిత్వం కాదు. ఇది స్పష్టమైతే, ఇప్పటి తరం (కూడా) శ్రీశ్రీని గొప్పగా ప్రేమిస్తుందని నా ఆశ. ‘ఆఁ… శ్రీశ్రీయా… ఐ యామ్ ఫినిష్డ్ విత్ హిమ్’ అనడం ప్యాషనబుల్ గా వుండదని నా ఆశ.
ప్రజా వుద్యమాన్ని సమర్థించడం ఒక కవిగా, మనిషిగా తన కర్తవ్యమని శ్రీశ్రీ భావించాడు. కాని, ఉద్యమమే… వుద్యమం మాత్రమే… కవిత్వం అని ఆయన అనుకోలేదు.
త్రిదివ ధామ ప్రధిత గాయక
మధుర రుతముల నడుమనించుక
మామకీనాలస రవము నిల్పగదే
అని చిన్న వయసులో వెలువరించిన ‘ఫ్రభవ’ గీతాలలోనే శ్రీశ్రీ సొంత గొంతు మోసులెత్తింది. ఉద్యమాల పట్ల ఆకర్షితుడైన తరువాత కూడా ఆయన వాటి నుంచి ఒక రకం ‘దూరా’న్ని పాటించాడు.
‘మహా ప్రస్థానం’ గీతంలో ‘పోదాం పోదాం పైపైకి’ అంటో గుంపులో తానూ ఒకడుగా కలిసిపోయి పాడినట్లనిపిస్తుంది. అదొక కవాతు గీతం (మార్చింగ్ సాంగ్). తాను పాడుతుంటే ఇతర్లు వినడానికి రాసినది కాదు. కవాతు తొక్కే వాళ్లు దాన్ని తమదయిన పాటగా పాడుకుంటూ సాగిపోవడానికి రాసినది. అలాగే, కమ్యానిస్టు పార్టీ ఇచ్చిన నినాదాల్ని ప్రచారంలో పెట్టడానికి రాసిన గీతాలు కూడా వున్నాయి (ఉదాహరణకి: డాక్టర్, యాక్టర్ ఏం కావాలన్నా ముందుగా కమ్యానిస్టు కావాలనే గీతం, విశాలాంధ్రలో ప్రజా రాజ్యం కోసం వుద్యమించాలనే గేయం…) ఇలాంటి గీతాల్ని వేళ్ల మీద లెక్కించ వచ్చు. ఆ నాలుగైదింటిని చూపి శ్రీశ్రీని అంచనా కట్టలేం.
తాను ఏ ప్రజల పక్షం నిలవాలనుకున్నాడో వాళ్లూ, తాను వేర్వేరు. తాను వాళ్ల కవి. తాను వాళ్ల బోధకుడు కాదు. వాళ్లకు అనుచరుడు గాని నాయకుడు గాని కాదు. శ్రీశ్రీ ఈ స్పృహను ఎప్పుడూ కోల్పోలేదు. ఉదాహరణకి ‘జగన్నాథ రథ చక్రాలు’ అనేది ‘పతితులు, భ్రష్టులు, బాధా సర్ప దష్టులు’ అయిన ప్రొలిటేరియట్ ను సంబోధిస్తూ రాసిన పద్యం. ఆ ‘పతితులు, భ్రష్టులు, బాధా సర్ప దష్టుల’ గుంపులో తాను లేడు. ఆ గుంపుతో వున్నాడు గాని, గుంపులో లేడు. వాళ్లు కనలి కనలి ఏడ్వడం మాని పోరాడినప్పుడే, తమదైన రాజ్యం తాము ఏలినప్పుడే…
స్వాతంత్ర్యం
సమభావన
సౌభ్రాత్రం
సౌహార్దం
పునాదులై ఇళ్లు లేచి
జనావళికి శుభం పూచి __
శాంతి, శాంతి, శాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది.
అని శ్రీశ్రీ అవగాహన. ఈ అవగాహన ఇంకా చాల పద్యాల్లో కనిపిస్తుంది. ఇదొక ‘డిస్కవరీ’ తరహా అవగాహన. ఒక ముఖ్య విషయం కొత్తగా తెలిసివచ్చినప్పుడు కలిగే సంభ్రమాశ్చర్యాలతో కూడిన అవగాహన. ‘సంభ్రమాశ్చర్యాల’ వల్లనే ఇది కవిత్వమయింది. తాను ‘డిస్కవర్’ చేసిందాన్ని అ పనికి నిజమైన కర్తలెవరో వాళ్లను సంబోధిస్తూ చెప్పాడు. పతితులు, భ్రష్టులు, అథోజగత్సహోదరులను… ‘పోరాడితే పోవడానికి సంకెళ్లు తప్ప మరేమీ లేని’ ‘ప్రొలిటేరియట్’ను… సంబోధిస్తూ రాశాడు. గీతంలో తాను సంబోధించిన శ్రామిక వర్గంలో తాను సభ్యుడు కాదు. తాను శ్రామిక వర్గంతో చేతులు కలుపుతున్న కవి మాత్రమే. అందుకే ఈ గీతం
ఈ లోకం మీదేనండి
మీ రాజ్యం మీరేలండి’
అని ముగుస్తుంది. ఈ లోకం మనదేనోయ్, మన రాజ్యం మనమేలాలోయ్… అని కాదు.
‘గనిలో, వనిలో, కార్ఖనాల్లో’ చెమట చిందించే వాళ్లే… అసమాన అవకాశాల సమాజంలో అత్యంత బాధితులయిన శ్రామికులే… ప్రపంచాన్ని మారుస్తారు. సమాజం మారడం అందరి కన్న వారికే ఎక్కువ అవసరం. సామాజిక పరిణామంలో ‘శ్రమ శక్తి’ స్థానాన్ని కవిత్వం అక్రమించలేదు. ఆ సంగతి శ్రీశ్రీకి తెలుసు. ఆ అవగాహనమేరకు, ఉద్యమంతో ‘దూరా’న్ని శ్రీశ్రీ కవిత పాటించింది.
ఈ ‘దూరం’ శ్రీశ్రీ అవగాహనలోనే కాదు, ఆయన కవితా వ్యక్తీకరణ పద్ధతుల్లోనూ వుంది. ఆయన కవిత్వం చాల భాగం ఎవరికి అందాలో వారికి అందింది గాని, అది వాళ్లు సొంతం చేసుకుని పాడుకునే పాటగా మారలేదు.
ఒకట్రెండు గీతాలు మాత్రమే అ వ్యక్తీకరణ పద్ధతులను కాదని, జనం తమ కోసం తాము పాడుకునే గీతాలయ్యాయి. దానికి గొప్ప వుదాహరణ ‘మహా ప్రస్థానం’ గీతం. నాకు బాగా గుర్తుంది. మా వూళ్లో మేము కొందరు యువకులం విప్లవ భావజాలంతో ప్రభావితులమై ‘రైతుకూలి సంఘం’ అని చిన్న సంఘం పెట్టుకుని పని చేసేవాళ్లం. ఊళ్లల్లో మా అభిప్రాయాల ప్రచారం కోసం వీధి మీటింగులు పెట్టి, మాకు వచ్చిన పాటలు పాడి, జనంతో మాట్లాడే వాళ్లం. మా గుంపులో నేను, మరొకరు తప్ప మిగిలిన యువకులందరూ చదువు వచ్చీరాని వాళ్లే. మా ప్రచారంలో సహజంగానే గద్దర్ పాటలు ఎక్కువగా పాడే వాళ్లం. సంఘం సమావేశంలో నేనొకసారి శ్రీశ్రీ మహా ప్రస్థానం గీతాన్ని ఆవేశంగా చదివి వినిపించాను. తిరుపాలు అనే యువకుడు నా దగ్గర్నుంచి పుస్తకం తీసుకుని కొన్ని పదాల్ని కాస్త అటుఇటుగా పలుకుతూనే ఆవేశం, వేగం ఏమాత్రం చెడకుండా…
మరో పపంచం
మరో పపంచం
మరో పపంచం పిలిచింది
అని ప కి ర వత్తు ఇవ్వకుండానే ఎంత గొప్పగా చదివాడంటే, ఇక మా వీధి మీటింగుల్లో తిరుపాలు ‘మహా ప్రస్థానం’ పఠనం ప్రత్యేక అకర్షణగా వుండేది. సభల్లో జనాన్ని బాగా ఆకట్టుకునేది కూడా. ఆ కవితను మా సమావేశాల ప్రారంభ గీతంగా చాల రోజులు పాడుకున్నాం. ఈ లక్షణం కొన్ని గీతాలకే పరిమితం.
‘మరో ప్రస్థానం’ నాటికి శ్రీశ్రీ కవిత్వంలో సంస్కృత పదాలు బాగా తగ్గి పోయాయి. సరళమైన వ్యావహారిక తెలుగులో ‘జట్కావాలా’ వంటి గీతాలు కూడా రాశారాయన. అయినా, కవిత్వాన్ని వుద్యమం నుంచి వేరుగా, ‘దూరం’గా వుంచే వైఖరి పెద్దగా మారలేదు. తాను శ్రామిక ప్రజల కవి మాత్రమే, శ్రామికుడు కాదు, విప్లవ కవి మాత్రమే, విప్లవకారుడు కాదు అనే స్పృహ శ్రీశ్రీకి ఎప్పుడూ వుంది.
ఆ స్పృహ పూర్తిగా సరైనది. తాను కానిది అయినట్లు మాట్లాడడం వల్ల, నిర్ణయీకరణ (డెసిషన్ మేకింగ్) స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం వల్ల… కవి అబద్ధాలు చెప్పే అవకాశం వుంది. తాను కానిది అయినట్లు నటించే రాజకీయ క్రమంలో కవి ఆత్మవంచనకు గురై, కవిగా అంతరించే ప్రమాదం కూడా వుంది. అలాంటి ప్రమాదం శ్రీశ్రీకి లేదు, శ్రీశ్రీ కవితకు లేదు.
శ్రీశ్రీ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో ముందస్తుగా పేర్కొనాల్సింది ‘నక్సల్బరి తరం’ అనే ఒక కవి సమూహాన్ని. తాము శ్రీశ్రీతో నడుస్తున్నామని, శ్రీశ్రీ తమతో నడుస్తున్నాడని ఈ తరం భావించింది. అందుకు గర్వించింది. శ్రీశ్రీ కన్న మరొక అడుగు ‘ముందుకు’ వేయజూసింది. ఇక్కడ ‘ముందడుగు’ అనేది పోరాట ప్రజలతో సామీప్యానికి సంబంధించిన అంశం మాత్రమే. నక్సల్బరి తరం కవులు తమను తాము శ్రీశ్రీ వలె విప్లవ కవులుగా భావించుకున్నారు. అంతేగాకుండా, తమను తాము విప్లవకారులుగా కూడా వూహించుకున్నారు. దాని వల్ల మేలు కన్న కీడు ఎక్కువగా జరిగిందని నా అభిప్రాయం.
1990 దశకం ప్రారంభానికి నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాల వడీ వేగం బాగా తగ్గిపోయాయి. అప్పటివరకు ఆ బాటలో నడిచిన కవులు చాల మంది ఒక్కసారిగా మూగవోయారు. కొందరు వుద్యమం పట్ల విమర్శనాత్మక దృక్పథంతో రాశారు. మరి కొందరు ఆ తరువాత పెల్లుబికిన దళిత, స్త్రీవాద వుద్యమాలలో నెలవులు వెదుక్కున్నారు. దళిత, స్త్రీవాద వుద్యమాలు కూడా__ అంతిమ విశ్లేషణలో__ వర్గపోరాటంలో భాగమే కనుక విప్లవోద్యమం కొనసాగిందని కొందరు అంటారు. ఈ అభిప్రాయంతో పేచీ ఏమీ లేదు గాని, ‘విరసం’కు లేదా నక్సల్బరి తరానికి వూపునిచ్చిన ప్రత్యేక వుద్యమం (కమ్యూనిస్టు వుద్యమం) వేగం మందగించిందనడంలో సందేహం లేదు. ఈ పరిణామం పర్యవసానంగా చాల మంది మంచి కవులు ఒక్కసారిగా మూగవోయారు. ఎన్.కే., నమ్ము, అజ్ఞాత సూరీడు, లోచన్, సాగర్… ఇంకా చాల మంది కవులు, వాగ్గేయకారులు అస్త్ర సన్యాసం చేశారు. అలా ఎందుకు జరిగిందనేది ఆలోచించదగిన విషయమే అనుకుంటాను. శ్రీశ్రీ గురించి నేను మాట్లాడుతున్న అంశానికీ ‘నక్సల్బరి తరం’లో కనబడే పరిణామానికీ సంబంధం వుంది.
నక్సల్బరితరం కవులలో… వ్యక్తులుగా వుద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములయినవాళ్లున్నారు, అలా కాని వాళ్లూ వున్నారు. కాని, అందరూ తమను తాము వుద్యమంలో భాగస్వాములుగానే వూహించుకున్నారు. ఉద్యమంతోనే తాము, వుద్యమం లేకుండా తాము లేము… అన్నంతగా మమేకమయ్యారు. ఉద్యమంలోని ‘కైనెటిక్’ శక్తి అయిపోవడంతో వారు ఆగిపోయారు. కవులుగా తాము చెప్పడానికి ఇంకేమీ లేనట్లు, ఇంధనం అయిపోయిన యంత్రం ఆగిపోయినట్లు ఆగి పోయారు.
అసలు విషయమేమిటంటే, వుద్యమం ఒక జీవిత విశేషమే గాని, అదే జీవితం కాదు. జీవితం వుద్యమాల కన్న గొప్పది, పెద్దది, లోతైనది. అలలు చాల బాగుంటాయి. ఎగిరెగిరి పడతాయి. కాని, అలలే సముద్రం కాదు. అలల కన్న సముద్రం గొప్పది, పెద్దది, లోతైనది. అలలు వువ్వెత్తున లేస్తాయి. అతి వేగంగా వురుకుతాయి. తమ లోని ‘కైనెటిక్’ శక్తి అయిపోగానే పడిపోతాయి, అదృశ్యమవుతా యి. ఏ వుద్యమమైనా ఉద్యమ-కారణాల వుద్విగ్నత తగ్గాక అదృశ్యం అవుతుంది, సమాజంలో కలిసిపోతుంది. అలల గురించి మాత్రమే పాడుతామనే కవులు అలలు అగిపోవడంతో తామూ ఆగిపోవడం సహజమే. నక్సల్బరి తరం కవులలో చాల మంది మూగవోడానికి ఇదే ముఖ్య కారణం.
ఇదిగో ఇక్కడే శ్రీశ్రీ నుంచి నేర్చుకోవాలి. ఉద్యమాలు గొప్పవే. న్యాయమైన కారణాలతో ముందుకొచ్చే ప్రజా వుద్యమాల్ని ప్రేమించడం కవులకైనా ఎవరికైనా గొప్ప విషయమే. అది మనుషులుగా వారి లోని మంచి తనాననికి, మనిషి తనానికి సంకేతం. తమ పని తాము సరిగ్గా చేయాలంటే మాత్రం వాటి నుంచి తగిన ‘దూరా’న్ని పాటించక తప్పదు. ఉద్యమేతర జీవితంలోంచి కూడా కవితావేశం పిండుకోవాలి. ఉద్యమేతర జీవితం లోంచి కూడా కవిత్వం వస్తోంది. ఉద్యమేతర కవులలో పలువురు గొప్ప కవులున్నారు. దైనందిన జీవితాన్ని వెలిగిస్తున్నారు. ఉద్యమ కవి, విప్లవ కవి, కమ్యూనిస్టు అనిపించుకున్న శ్రీశ్రీలో ఈ వుద్యమేతర జీవితాంశం వుంది. ఊరికే వుండడం కాదు, చాల గొప్పగా, బలంగా వుంది.
ఉద్యమాలు మందగించడం శ్రీశ్రీ కాలంలో (నక్సల్బరికి ముందు) కూడా జరిగింది. అయినా కవిగా ఆయన ఆగిపోలేదు. చుట్టూరా జీవితం లోంచి కవిత్వమయ్యాడు. సాధారణ రాజకీయాలు, ఇతర జీవిత విశేషాలతో ‘కందాలొక వంద’ నుంచి ‘లాంకోటూ పాంకోళ్ల’ సర్రియలిజం వరకు ప్రయోగాలు చేశాడు. ‘న..న..న..నత్తి మాటలు కూడా/ మ..మ..మ…మన వ్రాతల్లో ఉండొచ్చు’ అని ప్రకటించేశాడు. ఈ స్ఫూర్తిని మాత్రం నక్సల్బరి తరం తీసుకోలేకపోయింది. శ్రీశ్రీలో వుండిన గొప్ప కవితా శక్తి వీరిలో లేకపోవడమే దీనికి కారణమనే వివరణ సంతృప్తికరం కాదు. ఉద్యమంతో కవిత్వానికి వుండాల్సిన ‘దూరం’ వీరిలో లేకపోవడమే… పెనం మీద నీటి బొట్టులా ఆవిరయి గాలిలో కలిసిపోవడానికి కారణం అనుకుంటున్నాను.
సందేశాత్మక (డైడాక్టిక్) కవిత్వం గురించి ‘బోధించి బాధించే’ కవిత్వమని వ్యంగ్యంగా అంటూ వుంటారు. శ్రీశ్రీని అలాంటి సందేశాత్మక కవుల వరుసలో చేర్చే వైఖరి ఒకటుంది. ఇది సరైన వైఖరి కాదని నా అభిప్రాయం. ‘బాధ కవిత్వానికి పర్యాయ పదమ’ని చెప్పుకున్న మనస్వి శ్రీశ్రీ. ప్రజల దుఃఖాన్ని చూసి ‘ఆగ్రహం’తో విరుచుకుపడ్డాడు. ప్రజల బాధా కారణాలు అవగతమైనప్పుడు ‘సంభ్రమాశ్చర్యం’తో మాట్లాడాడు. బాధా కారణాలపై తిరుగబడిన ప్రజల తెగువను చూసిన ‘వుత్తేజం’తో పాడాడు. అంతేగాని, ఇదీ ‘ఉద్యమ పంథా’ అని పథ నిర్దేశం చేయడం గాని, నేను నడుస్తుంటే నా వెనుక లక్షలాది మంది జనం నడుస్తారని ప్రగల్భించడం గాని శ్రీశ్రీ కవిత్వంలో కనిపించదు.
అచ్చంగా ఉద్యమ ప్రమేయం లేని, ఉద్యమ స్పర్శ లేని ఆయన గీతాలెన్నో చిరస్మరణీయాలుగా వుండిపోయాయి.
గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను
అంటూ మొదలై
విశ్వమంతా నిండి, వెలిబూది వోలె
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను
అని ముగుస్తుంది ‘మహా ప్రస్థానం’లో నాల్గవ పద్యం ‘ఒక రాత్రి’.
‘ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన/ ఒంటరి ఒంటె లాగుంది జాబిల్లి’ అంటూ ఈ పద్యంలో శ్రీశ్రీ కల్పించిన దృశ్యం, చదివిన వెంటనే విహ్వల పరిచి, ఆ తరువాత బతుకంతా వెంటాడుతుంది. మనిషి నిస్సహాయతను… బహుశా, ఒక మనిషిగా తన నిస్సహాయతను, ఆ నిస్సహాయత కలిగించే విహ్వలత్వాన్ని ఇంత గొప్పగా చెప్పిన సందర్భం మరెక్కడయినా వుందా? ఇందులో ఉద్యమం, విప్లవం, కమ్యూనిజం ఏమీ లేవు. ఉన్నది మనిషి మాత్రమే, అదీ ఒంటరి మనిషి. సంభ్రమపడుతూ, దిక్కు తోచక, నిశ్చేష్టుడై నిలిచిన మనిషి.
ఆ తరువాత, దాదాపు వెంటనే వచ్చే పద్యం ‘ఆకాశ దీపం’. ఒక శవం వున్న గది, గదిలో వున్న శవం… దాని ఆకార వర్ణన ఏమీ లేకుండానే… మన మనో నేత్రాల ముందుకు వస్తుంది. ఇందులోనూ ఎలాంటి సందేశం లేదు.
ఆకాశ తార ఆహ్వాన గానం చేసింది
దీపం ఆరిపోయింది
తారగా మారిపోయింది
తల-దీపం తారగా మారిందనే అద్బుతోహ నుంచి అమరత్వం వంటి అర్థాలు ఎవరూ తీయరనుకుంటాను.
‘మహా ప్రస్థానం’లోనూ, ఆ తరువాత ‘ఖడ్గసృష్టి’ తదితర కావ్యాలలోనూ… ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఉద్యమ సందేశం, ఉద్యమ స్పర్శ లేని గీతాలెన్నో వున్నాయి. ‘అభిసారికి కడసారి’, ‘నగరంలో వృషభం’ వంటివెన్నో.
జీవితాన్ని.. దైనందిన జీవితాన్ని అమితంగా ప్రేమించిన కవి శ్రీశ్రీ. జీవితంలో వున్నవన్నీ… అవి వుద్యమాలు కావచ్చు, జననం కావచ్చు, మరణం కావచ్చు, నగరంలో శవమైన బాటసారి కావచ్చు, ముసలి బిచ్చగత్తె, చిన్న పిల్లలు, అర్థాంతరంగా చనిపోయిన మితృలు…. ఏమైనా కావచ్చు… అన్నిటిలో మునిగి తేలి తనకు తాను కవిత్వమైన తపస్వి శ్రీశ్రీ. నాకు చాల ఇష్టమైన ఒక పద్యాన్ని వుటంకించనివ్వండి. ఎప్పడయినా మితృలో, బంధువులో… నిన్న పొగిడిన వాళ్లే ఈ రోజు తెగిడినప్పుడు…
నిప్పలు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు…
నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…
అనే మాటలు మనసులో చటుక్కున మెరుస్తాయి. ఈ మాటలు గుర్తుకొచ్చే సందర్భాలు మనకు రోజూ ఎదురవుతాయి. రోజుకు ఒకసారి శ్రీశ్రీ మాటలు మనసులో తిరుగుతాయి.
దైనందిన జీవిత ‘సత్యాల్ని’ అలవోకగా చెప్పే పద్యాల్ని జనం తరచు తలచుకుంటారు. కబుర్లలో తమ మాటలకు వత్తాసుగా వాటిని వుటంకిస్తారు. సందర్భం వచ్చినప్పుడు తమకు తాము ఓదార్పు పొందడానికి వాటిని గుర్తు చేసుకుంటారు. అలా రకరకాల సందర్భాలలో గుర్తుకు వచ్చి మనిషికి వత్తాసుగా నిలిచే పద్యాలు శ్రీశ్రీ కవిత్వంలో కోకొల్లలు. అందువల్ల, వేమనను ఏ అర్థంలో ప్రజల కవి అంటామో అదే అర్థంలో శ్రీశ్రీని కూడా ప్రజా కవి అనవచ్చు. కాని, అలా అనడం లేదు. అలా అనకపోవడానికి నేను రెండు కారణాల్ని వూహిస్తున్నాను.
ఒకటి__ శ్రీశ్రీ ఆధునిక మధ్య తరగతి జీవితం లోంచి కవిత్వమయ్యాడు. ఆధునిక జీవన సరళికి అనుగుణంగానే ఆయన వ్యక్తీకరణలో ‘అనిర్దిష్టత’ ఎక్కువ. చదువుకున్న వాళ్లకు, ఆధునిక జీవితం తెచ్చిపెట్టిన ప్రత్యేక సమస్యలతో జీవించే వాళ్లకు ఆయన మాటలు బాగా అందుతాయి. చదువుకోని వాళ్లకు, గ్రామసీమలలో ఇంకా ‘ప్రీ క్యాపిటలిస్టు’ దశలో జీవిస్తున్న వాళ్లకు ఆయన మాటలు అంత బాగా అందవు. జనం వేమనను ‘గౌరవించడం’ కన్న ఎక్కువగా ‘ప్రేమిస్తారు’. వేమనను జనం తమ పక్కింటి మనిషిలా చూస్తారు. జనం శ్రీశ్రీని ‘ప్రేమించడం’ కన్న ఎక్కువగా ‘గౌరవిస్తారు’. శ్రీశ్రీని పక్కింటి మనిషి అనుకోరు. ‘సార్’ అనుకుంటారు. దానిక్కారణం శ్రీశ్రీ ఆధునిక (నగర) జీవన సమస్యల్లోంచి, ఆదునిక విజ్ఞానం లోంచి మాట్లాడడమే అనుకుంటాను. భాష ఒక కారణమే గాని అది అంత పెద్ద కారణం కాదు. శ్రీశ్రీ చాల సరళమైన తెలుగులో రాసిన గీతాలు బోలెడన్ని వున్నాయి.
అంత కన్న ముఖ్యమైనది రెండో కారణం. దాని గురించే ఇంతకు ముందు నేను ‘వర్గీకరణ’ (టాక్సొనామికల్) పద్ధతి అని పేర్కొన్నాను. శ్రీశ్రీని కమ్యూనిస్టు, ఉద్యమ కవి అవి ‘వర్గీకరించి’ ఒక ‘గడి’లో కూర్చోబెట్టడం జరిగింది. శ్రీశ్రీ గురించి మాట్లాడే వాళ్లలో అత్యధికులు ఆయన పోరాట గీతాల్ని, రాజకీయ గీతాల్ని ప్రస్తావించినంతగా ఆయన కవిత్వంలోని దైనందిన జీవితాంశాల్ని ప్రస్తావించరు. ‘అగ్గిపుల్లా, కుక్కపిల్లా’ కాదేదీ కవితకనర్హం అనే శ్రీశ్రీ మాటల్ని ప్యారడీ చేసి వ్యంగ్య సందర్భాలకు వుపయోగించుకోడమే గాని, ఆ మాటలను శ్రీశ్రీ కవిత్వ విస్తృతికి, దైనందిన జీవితం పట్ల ఆయనకున్న గౌరవానికి సూచనగా భావించిన వాళ్లు తక్కువే. ‘ఓహ్, ఆయనా, ఆయన కమ్యూనిస్టు, మార్క్సిస్టు మనకెందుకులే’ అని శ్రీశ్రీని దూరం వుంచజూస్తారు. అందువల్లనే అద్యతన తరాల కవులు__ యువతీ యువకులు శ్రీశ్రీ నుంచి పొందాల్సినంత మేలు పొందలేక పోతున్నారని నా ఆబిప్రాయం.
కవులు ఎలాంటి ‘వాదా’లకు లోను కాకూడదనే ‘వాదం’ ఒకటుంది. ఈ అభిప్రాయం ఒక రకంగా సరైనదే. కవి వాక్కు కవిత్వమయిందా లేదా, అది జీవితమా కాదా, జీవితానుకూలమా కాదా అని చర్చించడం మానేసి, అది ఫలానా వాదానికి అనుగుణంగా వుందా లేదా అని చర్చించే చౌకబారు పద్ధతి శాన్నాళ్లు రాజ్యం చేసింది. ఆ వైఖరి చివరికి; కవి ఏ పార్టీకి అనుగుణంగా వున్నాడో వెదికే దాక వెర్రితలలు వేసింది. ఈ నేపధ్యంలో ‘నీ ఇష్టం ఏ వాదాన్నయినా అనుసరించు, నాక్కొంచెం కవిత్వం ఇవ్వు, వాదాన్ని కాదు’ అని కవిని అడగాల్సిన పరిస్థతి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఈ ధోరణికి ఒక నిరసన రూపంగా ‘కవులు ఏ వాదానికి లోను కాకూడదనే వాదా’న్ని అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు ఈ ‘వాద-వ్యతిరేక-వాదం’ మేలు చేసింది కూడా.
అయితే, ఇది మరో కొసకు వెళ్లింది. ఒక కవి ఒక వుద్యమాన్ని సమర్థించడం, ఒక ‘వాదా’న్ని ఇష్టపడడం దానికదే ఒక ‘అనర్హత’ అయిపోయింది. దానికదే ఒక లోపం అయిపోయింది. తనకు ఏ వాదం లేదనడం దానికది కవితా గుణమయిపోయింది. కవుల పట్ల ఈ రకం దృష్టి ఇప్పటికీ వుందని నేననుకుంటున్నాను. దీన్ని వదులుకోడం అత్యవసరం. ఉద్యమాలు మాత్రమే జీవితం కాదు. అదే సమయంలో… ఉద్యమాలు కూడా జీవితమే. కవులు ఉద్యమ నేపధ్యం లోంచి రాస్తే అందులో కవిత్వం/జీవితం వున్నదా లేదా అని చూడాలి గాని… ఉద్యమాల్ని ప్రేమించే వాడు రాసింది అని ముద్ర వేసి తోసేయగూడదు.
శ్రీశ్రీ మార్క్సిజం అభిమాని అనే మాట నిజమే. కాని, ఆయన ‘వాదం’ తూనిక రాళ్లతో’ బతుకును తూచలేదు. తెలుగు సాహిత్యంలో చిరకాల స్తబ్ధత తరువాత ఒక ప్రభంజనంలా దిగంబర కవిత దూసుకు వచ్చినప్పుడు ‘అధికారిక’ మార్క్సిజం దాన్ని వ్యతిరేకించింది. రారా వంటి విమర్శకులు పట్టుదలగా దాడి చేశారు. కాని, దిగంబరులను హృదయపూర్వకంగా ఆహ్వానించడంలో శ్రీశ్రీకి ఏ మార్క్సిజం అడ్డు రాలేదు.
శ్రీశ్రీ నిజంగానే ‘మహాకవి’. కవిగా మహా శక్తిమంతుడు, తపస్వి. ఉచ్యమ కవి అని ఆయనను పక్కన పెట్టే వైఖరిని ఆయన కవితా శక్తి అధిగమిస్తుంది. భవిష్యత్తులో మరి చాల సార్లు తెలుగు వాళ్లు శ్రీశ్రీ కవితా శక్తిని తాజాగా కనుక్కుంటారు. ఇప్పటికి చూడని కోణాలెన్నిటినో దర్శిస్తారు. అందులో సందేహం లేదు. కేవలం శ్రీశ్రీ కోసం కాకుండా తెలుగు సాహిత్యం కోసమే మన దృష్టి మారాలి. అందుకు శ్రీశ్రీ జయంతి వంటి సందర్భాలు ఉపయోగపడాలని నా ఆకాంక్ష.
(ఈ వ్యాసం సెప్టెంబరు 2009లో జరిగిన డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సాహితీ సదస్సులో చదవబడింది.)
November 20th, 2009 at 11:00 am
శ్రీశ్రీ ని ఈ కోణంలో ఆవిష్కరించిన వ్యాసాన్ని నేనింతవరకూ చదవలేదు.
మంచి వ్యాసం. చాలాలోతైన అధ్యయనం.
ధన్యవాదములు
బొల్లోజు బాబా
November 22nd, 2009 at 11:26 am
బాబా గారు, థాంక్యూ.
November 28th, 2009 at 6:51 am
హెచ్చార్కె గారు మీ కవితలు కధలు నాకు చాలా ఇష్టం కానీ ఇటీవల రచనల్లో వుద్యమేతర జీవితాల్లోని లోతు గురించి కూడా బలంగా చెపుతున్నారు.మీ అనుభవాలు మమ్మల్ని తప్పనిసరిగా ఆలోచింపజేస్తాయి కానీ….
November 30th, 2009 at 2:17 am
మల్లీశ్వరి గారూ, చాల చాల థాంక్స్, కాని,
కానీ…. తరువాత ఏమిటో తెలుసుకోవాలని వుంది.
చర్చ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం. మొహమాటం వల్లనైనా దాన్ని వదులుకోడం నష్టకరం. ఒక మాట తప్పు పోయినా ఫరవా లేదు. తరువాత సరిదిద్దుకోవచ్చు. ముందుగా మాట్లాడాలి. అదీ తెరిచిన మనస్సులతో మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక వాక్యం రాసి ఫుల్‍స్టాప్ పెడుతున్నామంటే, ఆ తరువాత చాలా వాక్యాలకు పొత్తిలి గుడ్డలు పరుస్తున్నామని అర్థం. ఏ వాక్యం అంతిమం కానప్పుడు ఫుల్‍స్టాప్‍తో కాకుండా చుక్కలతో ముగించడం ఎందుకు?
నా వ్యాసంలో, నాలో చాల చాల లోపాలుంటాయి. మన లోపాలు మనకు అర్థమైతే దిద్దుకుందాం. అర్థం కాకపోతే అడుగుదాం. ప్రశ్నిద్దాం. ఎవరైనా పెత్తనం చేస్తే పేచీ పడదాం.
November 30th, 2009 at 9:18 pm
హెచ్చార్కే గారు చెప్పిన విషయాలు ఒక్కశ్రీశ్రీ కవిత్వానికే కాదు సత్యజిత్ రే చిత్రాలకూ,రోరిక్,వాన్గో లు గీసినబొమ్మలకూ సైగల్ గొంతులో సుళ్ళుతిరిగే విషాదానికీ కూడా వర్తిస్తాయి.ప్రతిభావంతుడైనకళాకారుడు ఒక వంతెన లాటివాడు.ఆతడిపైనుండి నడిచిపోయి భావజాలరంగంలోపోగుపడిన నిధుల ని ప్రజలు మోసుకొని తెచ్చుకుంటారు.
December 2nd, 2009 at 3:06 am
శ్రీశ్రీని గొప్ప విప్లవ కవి అన్నవారూ, శ్రీశ్రీని నిర్లక్ష్యం చేయొచ్చు అనుకున్నవారూ ఒకే దారానికి రెండు చివర్లా వుండేవారు. కానీ, ఈ మధ్య విన్న అనేకానేక శ్రీశ్రీ శతజయంతి ఉపన్యాసాలలో ఇదే ధోరణి. కవులకూ పాఠకులకూ పనికిరాని అనేక సంగతులు శ్రీశ్రీ చుట్టూ చుట్టబెట్టి ఉతికి ఆరేస్తున్న ఈరోజుల్లో హెచ్చార్కె దారానికి మధ్యలో నిలబడి, ‘ఒరే బాబూ శ్రీశ్రీ కవిత్వాన్ని జీవితాన్ని ప్రేమించినంత ప్రేమగా చదవండర్రా, మీకు బోలెడు విశేషాలు తెలుస్తాయి’, అని చెప్పడం నిజంగా సాహసమే. ఈ వ్యాసాన్ని ఇంత ఆలస్యంగా చదివినందుకు బాధపడుతున్నా.
December 4th, 2009 at 5:38 am
మీ వ్యాసం చాలా ఆలోచింపజేసేలా వుంది.ప్రస్తుతసాహిత్యవతావరణంలో్ ఇంత లోతుగా అధ్యయనం చేయాల్సిన పద్ధతిలో మరోమారు శ్రీ శ్రీ సాహిత్యాన్ని ని చదివించేలా చేసారు.
December 4th, 2009 at 6:27 am
శ్రి శ్రీ గురించిన వ్యాసం చదివాక ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు సమాజహితం కోరే ఒక సంస్కర్త అనిపిస్తుంది . ఉద్యమకారుడని, విప్లవకారుడని ఎందుకు ఈ బిరుదులు? బీదలు, పతితలు, ఆధునిక సమాజంలో పనికిరానివారుగా పరిగణించబడిన వారంతా ఆయన కవితా వస్తువులే . ఈ సమాజంలో అసమానత పోనంతవరకు శ్రి శ్రీ బతికే ఉంటారు. మంచి వ్యాసంతో అందరి భుజాలు చరిచిన హెచార్కెగారికి అభినందనలు.
December 4th, 2009 at 1:20 pm
హెచ్చార్కే గారు
ఒక కానీ, కాసిన్ని చుక్కలూ మేం కోల్పోతున్న విశ్వాసాల్నీ,మాలో పెరుగుతున్న అసందిగ్ధాల్నీప్రకటించగలవనుకోడం అత్యాసే.నేను మీ వ్యాసంలో లోపాల గురించి కాదు మాట్లాడింది.ఏ ఆశలూ లేకుండా పోయిన స్తితిలో మనిషి మరింతగా తనలోకి తాను వెల్లిపోడాన్ని మీరెట్లా భరించగలుగుతున్నారు అని మీ పట్ల ప్రేమతో ప్రశ్నిస్తున్నా
December 5th, 2009 at 12:49 pm
మంచి వ్యాసం. ఇప్పుడు కవితలూ కథలూ రాస్తున్న వారు చదవాల్సిన వ్యాసం. బోధించి బాధించటం మానేసి జీవితాన్ని ప్రతిబింబించగలిగితే ఈనాటి రచయితలు శ్రీశ్రీకి తగిన వారసులవుతారు.
December 6th, 2009 at 2:25 am
దుప్పల రవి కుమార్, శీలా సుభద్రా దేవి, అత్తలూరి విజయలక్ష్మి, ఆరి సీతారామయ్య… అందరికీ కృతజ్ఙతలు. మల్లేశ్వరి గారూ! మీ రెండో వ్యాఖ్య… చదివినప్పటి నుంచి పదే పదే జ్ఙాపకం వస్తోంది. ఒక ఆరోగ్యకరమైన ‘బాధ’ను రగిలిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇలా అనుకుంటున్నాను. సందిగ్ధాలు ఎప్పుడూ వుంటాయి. అసందిగ్ధ సత్యం అనేది ఏదీ లేదు. ప్రతి దాన్ని నిత్యం ‘ఫాల్సిఫికేషన్’ ప్రక్రియకు గురి చేసి నిగ్గు తేల్చుకుంటూ ముందుకు సాగాల్సిందే. వేరే దారి లేదు. సందేహించడానికి సిగ్గుపడినా, బద్ధకించినా; ‘నిశ్చల నిశ్చితాలు’ మనల్ని తినేస్తాయి. ఎన్ని మార్పులు గత ముప్పయ్/నలభయ్యేళ్లలో! ఎంత నేర్చుకున్నాం మనందరం? నాకైతే చాల ఆశ వుంది. మనలో చాల మందిమి కల గంటున్న నిర్నిబంధ స్వేచ్ఛ (లేదా కమ్యూనిజం) సాధ్యమే. ఇటీవలి పరిణామాలు దాన్ని మరింత ఎక్కువగా బలపరిచాయని అనుకుంటాను.
January 6th, 2010 at 5:01 pm
[...] ఉద్యమాలు వున్నా లేకున్నా కవిత్వం వుం… : హెచ్చార్కె [...]