Nov2009
ఉద్యమమే జీవితమై…బాలగోపాల్ కు నివాళి

కే.బాలగోపాల్
బాలగోపాల్
ప్రజలకు సమస్యలున్నంత కాలం విశ్రమించకూడదని బాలగోపాల్ విశ్వసించాడు. విశ్వాసానికి, ఆచరణకు మధ్య అభేదం పాటించిన పిడికెడు మందిలో బాలగోపాల్ ను అగ్రగణ్యుడిగా నిలుస్తాడు. అవకాశవాదాన్ని దరి చేరనీయలేదు. చెప్పిందొకటి చేసింది మరోటి లేదు. అందుకే బాలగోపాల్ ఆకస్మిక మరణం ఇంతగా తెలుగు సమాజాన్ని కలచివేసింది. బాలగోపాల్ వంటి ఉద్యమకారుడు, మేధావి తెలుగు సమాజానికి ప్రస్తుతం ఎంతైనా అవసరం ఉంది. అవకాశవాదం వ్యవస్థీకృతమైన నేటి పరిస్థితుల్లో బాలగోపాల్ మరణం ప్రజలకు, తెలుగు సమాజానికి తీరని లోటు.
వ్యక్తిగతమూ, సామాజికమూ ఆయనకు వేరు కాలేదు. అంతరంగం వేరు, బాహ్య ప్రపంచం ఆయనకు వేరుగా లేవు. వ్యవస్థీకృత హింసకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం అనితర సాధ్యమైంది. వ్యక్తిగతమూ సామాజికమూ రెండు ఒక్కటే అయిన మానవుడు ఆయన. సామూహిక శ్రేణులపై జరుగుతున్న అణచివేతలపై ఆయన నిరంతరం పోరాటం సాగిస్తూ వచ్చారు. గణిత శాస్త్రంలో అపార మేధావి అయిన బాలగోపాల్ సామాజిక అంతర్వుల లెక్కలు తీయడానికి కాలికి బలపం కట్టుకుని తిరిగారు. రచనలూ చేశారు. ఎప్పటికప్పుడు తన ఆలోచనలను సమాజానికి తెలిపే ప్రయత్నం చేశారు. అనేక రచనలు చేశారు. చిన్న పెద్ద తేడా లేదు. చిన్న పత్రికలకు కూడా ఆయన పుంఖానుపుంఖంగా వ్యాసాలు రాశారు.
ప్రజా ఉద్యమాల హింస వ్యవస్థీకృతం కావడం ఆయనకు ఇష్టం లేదు. ఆయుధం అలీనం కాదనే విషయంతో విభేదించాల్సిన అవసరం లేదు కానీ దాన్ని ఏ సందర్భంలో వాడాలనే విషయం పట్ల సరైన అవగాహన ఉండాలనేది ఆయన అభిమతమై ఉంటుంది. దాన్ని ప్రజా ఉద్యమాలు సరిగా అర్థం చేసుకున్నట్లు లేదని ఆయన బాధ పడి ఉంటారు. త్యాగాలు విలువైనవి. అనవసర, అనుచిత త్యాగాలు చేయకూడదనేది, బయటి ప్రపంచంలోని వారి ప్రాణాల కన్నా ప్రజల కోసం పోరాటం చేస్తున్న యోధుల ప్రాణాలు విలువైనవని నమ్ముతూనే అన్ని ప్రాణాలూ విలువైనవనే విషయాన్ని తెలియజేయడానికి ఆయన ప్రయత్నించారు. అందుకే పౌర హక్కల సంఘం నుంచి మానవ హక్కుల వేదికకు ఆయన ప్రయాణం సాగింది.
ఆచరణను, విశ్వాసాన్ని ఆయన అనుభవాల ప్రాతిపదిక మీద విశ్లేషించుకున్నారు. నడుస్తున్న దారి సరైందా కాదా అని ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకున్నారు. ఈ విశ్లేషణ, ఆత్మపరిశీలన ప్రజల కోసం పనిచేస్తున్న వ్యవస్థలకు తప్పనిసరిగా ఉండాలని కూడా ఆయన భావించి ఉంటారు. అందుకే ఆయన విప్లవోద్యమంపై విమర్సలు పెట్టారు. కిరాతక హత్యలను ఆయన వ్యతిరేకించారు. అనివార్యమైతే తప్ప హింస సాగకూడదు. ఇది ఛత్తీస్ ఘడ్ లో పనిచేసిన శంకర్ గుహ నియోగి స్పష్టంగానే చెప్పారు. రాజకీయ ఉద్యమం కూడా ప్రజా ఉద్యమాలకు అవసరమని భావించారు. ప్రజా ఉద్యమాలకు, చట్టపరిధిలో చేసే ఆందోళనలకు వెసులుబాటు ఉన్నంత కాలం వాడుకోవడం ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ఏనాడూ కాలేకపోయింది. అందుకే విప్లవోద్యమాలకు రాజకీయ ఎజెండా ఉండాలని బాలగోపాల్ ఆశించారు.
అవసరమైన వేళ పౌర హక్కుల ఉద్యమ నాయకత్వాన్ని చేపట్టి రాజ్య హింసకు వ్యతిరేకంగా అలుపెరుగని ఉద్యమం చేశారు. పౌర హక్కుల ఉద్యమాన్ని నగరాలకు మాత్రమే పరిమితం చేయకుండా పల్లె పల్లెకూ విస్తరించారు. పౌర హక్కుల పట్ల ఆయన అందించిన చైతన్యం ప్రజా ఉద్యమాలకు చేవను అందించింది. దాడులకు, అరెస్టులకు కూడా ఆయన లొంగిపోలేదు. జీవితంలో ఏనాడు లొంగి పోలేదు. మానవ హక్కుల ఉద్యమం చేపట్టిన తర్వాత కూడా అంతే కార్యశీలతతో వ్యవహరించారు. ఆయనపై రాజ్యహింసతో పాటు వ్యవస్థీకృత వేధింపులు కూడా పెరిగాయి. అయినా ఆయన వెనకంజ వేయలేదు.
బాలగోపాల్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. అది బహుశా పూడ్చలేనిది కూడా. అంత నిక్కచ్చి, నికార్సైన ఉద్యమకారుడు, మేధావి మళ్లీ మనకోసం వస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అయితే ఆయన అందించిన వెలుగు మాత్రం ప్రసరిస్తూనే ఉంటుంది.
December 31st, 2009 at 5:07 am
వ్యాసం బాగుంది మధుర శ్రీ
January 6th, 2010 at 9:19 pm
[...] ఉద్యమమే జీవితమై…బాలగోపాల్ కు నివాళి : కె. నిశాంత్ [...]
January 10th, 2010 at 3:26 am
బాల్ గొపాల్ గారి గురించి రాసిన వారికి ధన్యవాదాలు
March 23rd, 2010 at 11:25 pm
బాలగోపాల్ సార్ లేని లోటు తెలంగాణ ఉద్యమం లో కనిపిస్తున్నది. దశను గుర్తించి దిశ ను చూపే వాడు. ఆలోచనాపరులు తమ అంచనాలను సార్ ను ఆదారంగా చేసుకొని సరిచేసుకొనే వారు. ఇప్పుడు చాలా మంది మెదడులకు విశ్వసనీయతతో కూడిన నిర్దారణలు అందడం కరువు అయింది. అటువంటి సార్ రావాలని కొరుకుదాం… లేక పోతే చాలా మందిలో… ఆలోచనలు పురోగామిగా సాగలేవు.