Jan2010
చెకుముకీ!
జీవితాన్ని
ఆచరణాత్మక చరణం చేస్తూ
ఒక ప్రశ్నగా
ఒక ప్రమాణంగా
ఒక ప్రయాణంగా
బతికిన వాడా
నీపాద ముద్రల్ని
దారులన్నీ బీజాలుగా చల్లుకుంటాయి.
నిలదీసే సాహసాన్ని
నిగ్గదీసే నైజాన్ని
రాజీ పడని తత్వాన్ని
అడుగడుక్కీరంగరించి పోసినందుకు
ఈనేల నీకు రుణపడి ఉంది.
మనిషి కోల్పోతున్నదేంటో
మట్టిపోగొట్టుకుంటున్నదేంటో
నెత్తుటిని మరిగిస్తున్నదేంటో
తెలుసుకునే అన్వేషణలో
నిజాల నిప్పుల్ని భుజాన వేసుకొచ్చే
చెకుముకీ!
నీ చూపునుంచే
ఉద్యమాలు ఊపిరి నింపుకున్నాయి
పరిష్కారాల ప్రాణం పోసుకున్నాయి.
హక్కుల కంఠ నాళాల్ని
వ్యవస్థల అదృశ్య హస్తాలు
నొక్కినప్పుడల్లా
గొంతుకనిచ్చి విచ్చి మ్రోగిన
స్వర భాస్వరానివి నువ్వు
చీకటి కోణాల్ని
బహిరంగ పరచే భాస్కరునివి నువ్వు
మూగవేదనలకు అద్దం పడుతూ
ఒక కరపత్రంగా
నువ్వు అవతారమెత్తినప్పుడల్లా
తడిమిన కళ్ళన్నీ
ఆలోచనల కొలుములైన దాఖలా
పడికట్టు సిద్ధాంతాల లోపాలనించి
సాఫల్య కోణాలు సూత్రీకరించిన
వాస్తవ దృక్పధం నీది
లోభాలకు ప్రలోభాలకూ లొంగని
బెదిరింపులకూ దాడులకూ వెరవని
నీ నడక, నీ లక్ష్యం
దారి తప్పుతున్న వాళ్ళకి
ఓ పునర్మూల్యాంకన సూత్రం
అడుగులకి అంతర్నేత్రం
దేహానికి మోహాలకీ అతీతంగా
వజ్ర సంకల్పమై తెగబడిన వాడి చేతిలో
మరోసారి మరణం ఓడిపోవడం
ఓ చారిత్రక వాస్తవమైంది……………………….
January 27th, 2010 at 5:14 am
Tytle superb.
mee padajalam superb.
mee gurinchi chala sarlu vinnanu.
ee roju chusthunnanu.
08680-275125 nalgonda.