Jan2010
జీవితాన్నే ఒక అభ్యుదయోద్యమంగా మలుచుకున్న కవి ‘ఎస్వీ’
”ప్రజల బాధ మన కవిత
ప్రజల భాష మన కవిత”
అని నమ్మడమే కాదు , అని అనడమే కాదు , అలా బతుకుతున్న అభ్యుదయకవి ‘ఎస్వీ సత్యనారయణ’. అభ్యుదయ సాహిత్య ప్రచారం, వ్యాఖ్యానాలే ఊపిరిగా బతుకుతున్న ‘ఎస్వీ’ మంచి అభ్యుదయ కవి కూడా. సమకాలీన సమాజస్థితి గతుల పట్ల ఆవేదన ఆగ్రహాల సమ్మేళనం ఆయన కవిత్వం. అభ్యుదయ సాహిత్యోద్యమంలో విభిన్న స్థాయిల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ‘ఎస్వీ’ ” జీవితం ఒక ఉద్యమం” అన్నకావ్యాన్ని ప్రచురించారు. ఆ కావ్యం నిండా ఆగ్రహం అక్షరాలై జలాజలారాలుతూ ఉంటుంది. అధిక్షేపం అభివ్యక్తి రూపమై అలరారుతూ ఉంటుంది.
” కవిత్వం జీవిత మంత విస్తృతం
జీవితం కవిత్వమంత సుందరం”
అన్న అవగాహనలో సత్యమూ ఉంది, సౌందర్యమూ ఉంది.ఈ కావ్యంలో వస్తువైవిధ్యానికి అభివ్యక్తి తీవ్రతతోడై పఠన గుణం అబ్బింది.
”కవీ ! జీవితం ఊహకాదు వాస్తవం
సాహిత్యం సమాజ చలనాలకు దర్పణం”
ఇదే అభ్యుదయ కవికి కలగవలసిన ఙ్ఞానం. ఈ కావ్యంలో ఇటీవలి రెండు దశాబ్దాల జాతీయ , రాష్ట్రీయ, అంతర్జాతీయ పరిణామాలే వస్తువు. తూర్పు యూరప్, జర్మనీ ,రష్యాల పరిణామాల తర్వాత భారతదేశంలో కలిగిన అనారోగ్యకర పరిణామాలన్నిటినీ ఈ కావ్యంలో విమర్శనాత్మకంగా కవిత్వీకరించారు ఎస్వీ.
అభ్యుదయ కవి భౌతికవాది కావాలి. ప్రకృతి పట్ల ప్రపంచంపట్ల , చరిత్ర పట్ల శాస్త్రీయ దృక్పధముండాలి అభ్యుదయ కవి కి మతం మత్తు మందు అనే అవగాహన ఉండాలి.
”కర్మ సిద్ధాంతాలు వల్లే వేసినంతకాలం
ఈ వ్యవస్థ ప్రశాంతంగా పయనించింది”
అన్న చారిత్రక అవగాహనతో ‘ఎస్వీ’ కున్న భౌతిక దృక్పధం వ్యక్తమవుతున్నది. హిందూ ముస్లిం ఉన్మాదాలు రెండింటినీ సమదృష్టితో తిరస్కరించిన ‘ఎస్వీ’ అచ్చమైన భౌతికవాది . ‘త్యాగశిఖరం’ లో జీహాద్ ను, ‘గుజరాత్ కీ రాత్’ లో హిందూ హింసను ఎండగట్టారు. మతం ఏ సమాజానికైనా కాలిని అడ్డతీగ అన్న అవగాహన ఉన్నప్పుడే ఎవరైనా ప్రగతి శీల కవి కాగలరు. పచ్చరిబ్బన్లు గాని, పసుపు రిబ్బన్లుగానీ ఏ నాడూ ప్రగతిశీల చిహ్నాలు కావు. ఆయన ఈ వాస్తవాన్ని గ్రహించిన కవి.
” గుజరాత్ మానవ హోమంలో
కాలిపోయిన మానవత”
అనగలిగిన కవే అభ్యుదయ కాముకుడు.
”బీభత్సం సృష్టించడమే
పవిత్ర యుద్ధమైతే
మేం ప్రతిఘటించడానికి సిద్ధంగానే ఉన్నాం”
అన్న ఆయన ప్రగతిశీల కవి. మతశక్తుల రాజకీయాలను కూడా అభ్యుదయ కవి నిజాయితీగా ధిక్కరిస్తాడు. ఒక పర్యాయం దేశాన్ని పాలించి రెండో పర్యాయం అధికారంలోకి రావడానికి అప్పటి పాలకులు ‘భారతి వెలిగిపోతుంది’ అన్న నినాదాన్ని తీసుకున్నప్పుడు ఎస్వీ ‘భారత్ వెలుగుతుంది ‘ అనే కవిత రాశారు.ప్రగతిశీల కవికి ‘యుద్ధం ‘అనే మాట నిరంతరం స్మరణలో ఉంటుంది. వర్గ దృక్పధం గల కవికి వర్గాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలుసు. అది అనివార్యమనీ తెలుసు.
” రెండు శత్రు శిబిరాలున్నంత కాలం
రెండు వైరి వర్గాలు వర్ధిల్లినంతకాలం
యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది”
అన్నది ప్రగతిశీల కవిగా, మార్క్సిస్టుగా చాటిన సత్యం. ఇదీ ఆయన నిబద్ధత.
శ్రమ జీవన సౌందర్యానికి సమానమైనదే లేనే లేదన్నది అభ్యుదయ కవి ఫిలాసఫీ. భారతదేశంలో శ్రామిక వర్గమైన కార్మికులు కర్షకుల పక్షం వహిస్తారు అభ్యుదయ కవి సామాజికంగా దళిత బహుజనులు స్త్రీల పక్షం వహిస్తాడు. భారతదేశం వ్యవసాయ దేశం. రైతు భారతదేశానికి వెన్నెముక అని పేరు. ప్రపంచీకరణ భారతదేశంలోని ప్రవేశించిన తర్వాత ఆ వెన్నెముక విరిగిపోయింది. వ్యవసాయం దండగ అని పాలకులు శ్రామిక ప్రజలను ఆత్మన్యూనతలోకి నెట్టివేశారు. మనుషులు బ్రతకడానికి కావలిసిన తిండి గింజల్ని పండించే రైతులు ఆత్మహత్యలకు పూనుకొనే పరిస్థితి కల్పించారు. అభ్యుదయ కవి ఈ సంక్లిష్ట పరిస్థితిలో రైతు పక్షమె వహిస్తాడు. అందుకే ‘ఎస్వీ’ నాగలి బతకాలి ‘ అన్నాడు. ” మట్టిని నమ్ముకున్న జీవితాలు మట్టి పాలవుతున్నాయి.”
పాలకులారా!
నినాదాల్లోంచి బయటిపడి
నిజాల్లోకి దిగండి
రాజకీయాలు పక్కనబెట్టి
రైతు రాజును బతికించండి”
అని వైతాళికుడై హెచ్చరించాడు. పెట్టుబడిదారీ సమాజం స్త్రీ పట్ల ఎలా వ్యవహారిస్తూందో ‘క్రిమినల్’ కవితలో వర్ణించాడు.
పాలకవర్గాలు తమ రాజకీయ ప్రయోజనాలకైనా సరే అప్పుడప్పుడూ పీడితులకు కొన్ని సౌకర్యాలు కల్పించక తప్పదు. ఆ సమయాల్లో అగ్రకులాలనుంచి ప్రతిఘటన రావడం ప్రతిభ చర్చినీయాంశం కావడం భారత దేశంలో చాలాసార్లు చూశాం. అభ్యుదయ కవి ఈ సమయాల్లో నిస్సందేహంగా పీడిత పక్షమేవహిస్తాడు.దోపిడీ వర్గ వారసులు చేసే ఆగడాలను కవిత్వాయుధంతో ఎదుర్కొంటాడు.
”శతాబ్దాలుగా ప్రతిఙ్ఞనీ ప్రతిభనీ నైపుణ్యాన్నీ నాణ్యతనీ
ఉక్కుపాదాలకింద నలిపిన డైనోసార్స్
ఇప్పుడు ప్రతిభను గురించి గగ్గోలు పెడుతున్నాడు.”
అని చురక వేశారు ‘ఎస్వీ’. భారతరాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ శతజయంతి సందర్భంగా ఆయన నివాస ప్రాంతంలో ఉంటున్న మరట్వాడా విశ్వవిద్యాలయానికి అయన పేరు పెట్టింది ప్రభుత్వం.వెంటనే అగ్రకులాల అరాచక శక్తులు విజృభించి విద్వంసం సృష్టించాయి. దేశంలో ఏనాయకునికి జరగనట్లుగా అంబేద్కర్ శతజయంతులు మూడేళ్ళు పాటు జరిగాయి.ఆయనకు భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం, ఆయన చేసిన కృషి పరంగా చూసినట్లయితే అది అంత గొప్ప పనేమికాదు. అయినా తిరోగమానవాదులు అరాచకాలు సృష్టించారు . ఎస్వీ దీనిని విమర్శిస్తూ ‘విధ్వంసం వెనక’ అనే కవిత రాశారు.
”నీకు విద్యే అక్కర్లేదని
మనుధర్మశాస్త్రాలను రూపొంచినవాడు.
విశ్వవిద్యాలయాకే
నీ పేరును ఎలా భరిస్తాడు ? ”
’నరమేధం’ అన్నది ‘ఎస్వీ’ దళితుల మీద రాసిన మరో మంచికవిత. ఎక్కడ ఏ ప్రళయం వచ్చినా , ఏ విధ్వంసం జరిగినా ఛిద్రమయ్యేది దళితుల జీవితాలేనన్న శాస్త్రీయ అవగాహనతో రాసిన కవిత ఇది. వర్గరాజకీయాలతో కూడా నలిగిపోతున్నది దళితులేనన్న సానుభూతితో రాసిన కవిత ఇది.
”నిర్భాగ్య సంస్కృతి వినిపిస్తున్న
మార్చురీ సంగీతానివి నువ్వు”
అన్న అభివ్యక్తి పాఠకులకు గగుర్పాటు కలిగిస్తుంది. “కాలంపై యుద్ధన్ని ప్రకటిస్తూ కళ్ళెర్రజెయ్ ” అన్న పిలుపు అర్థవంతమే కాదు, ఆలోచననాత్మకం కూడా.
పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీ ని ఎన్ని రకాలుగా అంగడి సరుకును చేస్తుందో ‘క్రిమినల్స్’ కవితలో వర్ణించాడు ఎస్వీ. ఒక లోఫర్ ఒక బ్రోకర్ ను చెప్పిన తర్వాత ఆ యిద్దరి సరసన క్షుద్ర రచయితను చేర్చాడు. ఈ ముగ్గురూ క్రిమినల్స్ అన్నాడు. పీడితులను గురించి రాసి సొమ్ము చేసుకునే క్షుద్ర రచయితను క్రిమినల్స్ లో చేర్చడం సబబే.
ప్రపంచీకరణను ప్రతిఘటించడంలో రాజకీయ పార్టీలకన్నా తెలుగు రచయితలే మొదటి నుంచీ ముందంజలో ఉన్నారు. బూర్జువా పార్టీలన్నీ ఈ విషయంలో పాలక పార్టీలతో జత కలిశాయి. వామ పక్షాలు మాత్రమే ప్రపంచీకరణ దుష్పలితాల పట్ల మొదటి నుంచి హెచ్చరిస్తున్నాయి. అయితే వామ పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రపంచీకరణ అమలు కాలేదు అన్న ప్రశ్న కూడా ఉంది.అదలా ఉంచితే రచయితలు, కళాకారులు, మేధావులు మాత్రం ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ‘ఎస్వీ’ ఈ విషయంలో తనగొంతును బలంగా వినిపించారు. ఫ్లైఓవర్ , స్వేచ్చ పరాధీన క్షీరసాగర మధనం , ఉద్యమగోళం, కొత్త అర్థాలు, ఇవాళిటి చిత్రం, కాలనిఘంటువు, ఇవాళటిగాలి, మనసులో గోడలు , దేవులాట , వంటి అనేక కవితలలో ‘ఎస్వీ’ ప్రపంచీకరణ కున్న అనేక ప్రజా వ్యతిరేక పార్శ్యాలను ఆవిష్కరించారు.
ప్రపంచీకరణ మన దేశంలోకి , మన రాష్ట్రంలోకి ప్రవేశించగానే మనకు అనుభవంలోకి వచ్చిన అంశాలు రైతు ఆత్మహత్యలు, రైతులకు సబ్సీడీలు తీసేయడం, విద్యుత్ చార్జీలను పెంచడం వంటిపరిణామాలు, విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల్ని బషీర్ బాగ్ లో ప్రభుత్వమే హత్య చేయడం, నగరాల అభివృద్ధి, రోడ్లు వెడల్పు చేసి,ఫ్లైఓవర్లు కట్టి – ఇదంతా అభివృద్ధి అని ప్రచారం చెయ్యడం వంటివే. వీటన్నీటి ఫలితం మన బతుకు పరాధీనమైంది అనే భావన కలగడం, మానవ సంబంధాలు సంపూర్ణంగా ఆర్థిక సంబంధాలుగా పరివర్తన చెందడం. ఈ పరిణామాలను ఎస్వీ బలమైన గొంతుతో నిబద్ధతతో ప్రతిఘటించారు.
1980లలో రష్యాలో గొర్బచెవ్ ప్రారంభించిన సంస్కరణలు అక్కడి ప్రభుత్వం కుప్పకూలడానికి అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఏర్పడడానికి దాడితీశాయి. 1990లో భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు తలవంచి ప్రారంభించిన సంస్కరణలు ఇక్కడి భారతీయుల జీవితాలనే కుప్పగూల్చాయి. సంస్కరణ, అభివృద్ధి అనేమాటలు వ్యతిరేకార్ధాలను సంతరించుకున్నాయి.ఓట్లు వేసి తమ బతుకులకు అండగా ఉంటాయని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యత నుంచి తప్పుకుని, ప్రజలజీవితాలను గాలికొదిలేసి కొందరు సంపన్నుల యోగక్షేమాలు చూడడమే అభివృద్ధిగా సంస్కరణగా పేరు పొందింది. అభివృద్ధి అంటే మానవాభివృద్ధి గా స్థిరపడిన ఆర్థాన్ని తలకిందులు చేసి రోడ్లు భవనాలుగా స్థిరపడింది. ఫ్లైఓవర్లు కట్టి సంపన్నుల వాహనాలకు సామాన్య ప్రజల బెడద లేకుండా చేయడమే అభివృధ్ధిగా రూడీకెక్కింది. మనుషులను , వాళ్ళ దైనందిన జీవితాలను విస్మరించి ఫ్లైఓవర్లు కట్టే పెట్టుబడిదారీ అభివృద్ధిని ‘ఎస్వీ’ నోరారా విమర్శించారు, కలమారా ప్రతిఘటించారు.
”ఎన్ని ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు కట్టామన్నది కానేకాదు క్రైటీరియా
ఎన్ని ఫ్లైఈవర్లు , స్టేడియంలూ నిర్మించామన్నదే నేటి జాతీయ సమస్య”
”రోడ్లు ఫ్లైఈవర్లూ , స్టేడియంలూ
అభివృద్ధికి ఆనవాళ్ళు”
”ప్రాజెక్టులు కట్టడంకంటే
ఫ్లైఓవర్లు ఎగరెయ్యడం ముఖ్యం”
“ఫ్లైఓవర్లు ఒక కట్టడం మాత్రమే కాదు
ప్రపంచబ్యాంకు ముద్దు బిడ్డ ”
ప్రపంచబ్యాంకును ప్రేమించి ప్రజల్ని ద్వేషించే పాలకులు తమను సింహాసనం మీద కూర్చోబెట్టిన ప్రజల మీదకే తుపాకులు ఎక్కుపెట్టడంలో అసహజత్వం ఏమీ లేదు. ప్రజలకన్నా ప్రపంచబ్యాంకుకే విధేయత ప్రకటించే పాలకులకు ప్రజలంటే చీమలు దోమలుగా కనిపించడమూ సహజమే . ప్రపంచబ్యాంకు ఆదేశాలననుసరించి రైతుల పట్ల బాధ్యత నుంచి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుచ్చక్తి చార్జీలను విపరీతంగా పెంచేసి, తిరగబడ్డ ప్రజల మీద ఎదురు దాడికిదిగి బషీర్ బాగ్ ను మరో జలియల్ వాలా బాగ్ ను చేసింది. జనాన్ని ప్రభుత్వ గుర్రాలతో తొక్కించడమే గాక ప్రజల మీద కార్గిల్ యుద్ధంలాంటి యుద్ధం ప్రకటించి ముగ్గురు యువకులను బలి తీసుకుంది. ప్రభుత్వం కొమ్ముకాసే వాళ్ళు తప్ప, తక్కిన అన్ని రకాల కళాకారులు , రచయితలు ఈ నిరంకుశ అప్రజాస్వామిక చర్యను ముక్త కంఠంతో వ్యతిరేకించారు, విమర్శించారు. అభ్యుదయ కవి ఎస్వీ ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ ” క్షీర సాగర మధనం “, ” ఉద్యమగోళం” అనే కవితలు రాసారు. ” రక్తరహితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధ్యం” అంటూ పాలకుల కంఠాన్నే అధిక్షేపాత్మకంగా పలికించారు. అంతే కాదు
” జలియన్ వాలాబాగ్ అప్పటి మాయని మచ్చ
బషీర్ బాగ్ నిన్నటి నెత్తుటి మరక ”
అని తీర్పు నిచ్చారు.ఈ తీర్పు కేవలం వామ పక్షేయుల తీర్పు మాత్రమే కాదు, సకలాంధ్ర ప్రజల తీర్పు. ఈ తీర్పు ఏం చెబుతుందంటే మారింది పాలకులేగాని పాలన కాదని చెబుతుంది. కవి విద్యుత్ ఉద్యమంలో మరణించిన బాల స్వామి, విష్ణువర్ధన్ , రామకృష్ణ లను భగత్ సింగ్ , రాజగురు , సుఖదేవ్ ల స్థాయికి తీసుకుపోవడం ఉచితమే. విద్యుత్ ఉద్యమాన్ని కరెంట్ చార్జీల పెరుగుదలకు మాత్రమే వ్యతిరేకమైందిగాగాక, ప్రపంచబ్యాంకును ధిక్కరించే చూపుడువేలుగా భావించడమూ ఉచితమే.
సార్వభౌమత్వ అని జబ్బలుచరుచుకోవడమే గాని, భారతదేశానికి అది ఉన్నదా అని కవి ప్రపంచీకరణ నేపధ్యంలో వేస్తున్న ప్రశ్న చాలా విలువైనది. భౌగోళికంగా సరిహద్దులు ఏర్పరచుకొని ఇరుగు పొరుగు దేశాల దాడులపై యుద్ధం చేసుకుంటూ ఉండటమే సార్వభౌమాధికారంగా చలామణి అవుతున్నది. ఆర్థిక స్వావలంబన దేశంలో సార్వభౌమత్వం ఉంటుందా? ఈ ప్రశ్ననే కవి సంధిస్తూ , 1968 నాటి చెరబండ రాజుగారి ‘వందేమాతరం’ కవితను తలపిస్తూ సరిగ్గ నలభై ఏళ్ళ తర్వాత “ఇప్పుడామె రోజూ పరాభవింపబడుతున్న పరితప్త హృదయ పరిహాసింపబడుతున్న పరాధీన అబల” అని ఆవేదనతో అన్నారు.
ప్రపంచీకరణ దేశంలోకి ప్రవేశించిన తర్వాత కంప్యూటర్ చదువే చదువై పోయింది. అమెరికాకు వెళ్ళడమే జీవితలక్ష్యంగా , డబ్బు సంపాదనే మోక్షమార్గంగా స్థిరపడిపోయింది. మానవీయాంశాలు సామాజిక శాస్త్రాలు చదవడం సేద్యంలాగే దండగ అని పాలకులే ప్రచారం చేసారు. ఇంత కన్నా బాధ్యతారహిత చర్య ఇంకొకటి ఉండదు. ప్రపంచీకరణ పుణ్యమాని మనుషులలో పెట్టుబడి బుద్ధులు పెరిగి దాని ఫలితాలు ఇండ్ల పడగ్గదిలోకి కూడా ప్రవేశించాయి. మనుషులు డాలర్లయ్యారు. అవి సంపాదించని వాళ్ళు బతకడం తెలియని దద్దమ్మలయ్యారు. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబాంధాలుగా మారిపోయాయి. ఈ పరిణామాన్ని మావవీయతకు పట్టం కట్టే అభ్యుదయ కవి భరించడం కష్టం. ‘ఎస్వీ’ ,……. ‘ ఇవాళటి చిత్రం’ , ‘దేవులాట’ వంటి కవితలలో ధనస్వామిక మానవసంబంధాలను దెప్పిపొడిచారు.
” ఇప్పుడు అన్ని సంబంధాలూ మార్కెట్ సరుకయ్యాక
……………………. ………………… ……………….. …………..
ఇంకిపోతున్న అశ్రుకణాలకు
వెలకట్టే వాడే మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ”
ఈ సందర్భంలోనే కవి మరో భయంకరమైన వాస్తవాన్ని కూడా ఎత్తి చూపాడు . ఏడెనిమిదేళ్ళ క్రితం జరిగిన జాతీయ క్రీడ తో మన రాష్ట్ర పాలకులు ఇతర రాష్ట్రాలలోంచి నిపుణులైన క్రీడాకారులను పిలిచుకొచ్చి తెలుగు క్రీడాకారులుగా ఆడించి తెలుగు గొప్పదనాన్ని చాటి కీర్తి తెచ్చుకొనే ప్రయత్నం చేశారు. బూటకపు ఆత్మగౌరవమంటే ఇదే. దీనిని కూడా ఎస్వీ తీవ్రంగా అధిక్షేపించారు.
ప్రపంచీకరణ పుట్టుకకు ముందు ఒక దశాబ్దం పాటు తూర్పు యూరప్, జర్మనీ, రష్యాలలో వచ్చిన పరిణామాల ఫలితంగా రెండూ జర్మనీల మధ్య నున్న బెర్లిన్ గోడ ధ్వంసమైంది. డెబ్బై ఏళ్ళు అమెరికా గుండెల్లో వణుకు పుట్టించిన రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం పతనమైంది. ఈ దుష్పరిణామాలపట్ల ఆవేదన చెందని అభ్యుదయకాముకుడుండడు. అభ్యుదయ సాహిత్యోద్యోమమే జీవితంగా గడిపే ‘ ఎస్వీ’ విషయం చెప్పక్కరలేదు. జర్మనీలోని బెర్లిన్ గోడ కూలిపోయి రెండు జర్మనీలు కలిసి పోయి పెట్టుబడి దారీ జర్మనీ గా రూపాంతరం చెందడం పట్ల
” ఒక మనిషిని వేరొకమనిషి
ఒక జాతిని వేరోక జాతి
ఒక వర్గాన్ని వేరోక వర్గం
దోచుకోవడానికి వీల్లేదన్న సాంఘీక ధర్మం
నిన్నటి రాలిన స్వప్నమై పోయింది”
అని అవేదన చెందాడు కవి . ప్రగతి శీలకవి ఎంత ఆవేదన చెందినా ఆశాజీవి గనక జర్మనీలో మళ్ళీ మార్పు వస్తుందని ఆశించడం సహజం
“అయినా దిగులు పడకు జర్మనీ !
నేటి నీ మౌనం రేపటి తుఫానుకు సంకేతం
……………. ……………… …………………… ………………..
రేపు నువ్వు కళ్ళు తెరుస్తావ్…..
ప్రజాయుద్ధం సృష్టిస్తావ్
ఐక్య జర్మనీ గుండెలమీద
అరుణపతాకం ఎగరేస్తావ్”.
అలాగే రష్యాలో కమ్యునిస్టు ప్రభుత్వం పడిపోవడాన్ని కూడా ఎస్వీ అనుకూల దృష్టి తోనే అర్థం చేసుకున్నారు.
”మాస్కో ముస్సాలియలో
ఒక మహానయకుని భౌతికకాయం
భద్రంగా ఉన్నాదాలేదా అన్నది కాదు ప్రశ్న………………
లెనిన్ ! మై డియర్ లెనిన్
వర్గాలున్నంతకాలం
నువ్వోక వర్గ పోరాటమై కొనసాగుతావ్….
ఆందోళనలున్నంతకాలం
నువ్వొక అరుణ తారవై మెరుస్తావ్.
కమ్యునిజానికి కాలం చెల్లిపోయింది ప్రపంచపెట్టుబడిదారీ దేశాలు భారతదేశంలోని వాళ్ళ వారసులు, భూస్వామ్య బ్రహ్మణీయశక్తులు దుర్భరమైన ప్రచారం చేస్తున్నా ఒక తెలుగు ప్రగతిశీలకవి ఇంతటి బలమైన విశ్వాసం కలిగుండడం, దాన్ని ప్రకటించడం చాదస్తంగానో, బలహీనుడి ప్రేలాపనగానో అనిపించవచ్చు. కాని రష్యాలో మార్పు వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని దేశాలలో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడడం , అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం చూస్తుంటే ఈ కవి ఆశవమ్ముకాదని అనిపిస్తుంది. నెపోలియన్ ను గురించి కూడా ‘ఎస్వీ’ ‘రెడ్ సెల్యూట్’ కవిత రాసారు.
”ఫ్యూడల్ అవశేషాలను బద్దలు కొడుతున్న
ప్రజల ఆగ్రహానివి నువ్వు” , అని కీర్తించాడు.
ప్రపంచదేశాలనన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకునే అమెరికా ప్రయత్నాలు ఒక వైపు సాగుతుండగా, వాటిని చావు దెబ్బ కొడుతూ సెప్టెంబర్ 11 న పెంటగాన్ నగరం మీద విమాన దాడి జరగడంతో ఆ దేశాధ్యక్షునికి దిమ్మదిరిగింది. అఙ్ఞాతంలోకి వెళ్ళి పోయి భయపడుతూ బయటికొచ్చిన సన్నివేశాన్ని అందరూ గమనించారు. పెట్టిబడిదారీ వ్యవస్థకు, సామ్రాజ్యవాద దురహంకారానికీ బద్ధ శత్రువైన ప్రగతిశీలకవి ఈ పరిణామం పట్ల సహజంగానే స్పందిస్తాడు.
”వేలువాడిదే కన్ను వాడిదే శిక్షణవాడిదే శిక్ష వాడికే
తెల్లబోయిన తెల్ల భవనం వాడి అసహాయత్వాన్ని తేట తెల్లం చేసింది.”
అని ఎస్వీ అధిక్షేపించారు. మానదాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో బిన్ లాడిన్ దాక్కున్నాడని అభిప్రాయంలో విమానదాడులతో ధ్వంస ప్రక్రియ కొనసాగిస్తూనే మరో వైపు ప్రజలకు రొట్టెలు జారవిడిచిన అమెరికా నీతిని కూడా ఎస్వీ వదిలి పెట్టలేదు.
”వాడు బాంబులతో పాటు
రొట్టెల్ని జారవిడుస్తూ
ఆఫ్ఘన్ ప్రజల ఆకలిని అవమానిస్తూన్నాడు”
ప్రగతిశీల కవికి ప్రపంచమంతా తనదే. అందుకే చలం అన్నది “ప్రపంచబాధంతా శ్రీశ్రీ బాధ” అని అభ్యుదయ కవి మానవత్వానికి ప్రతినిధి. మనిషికి ఆక్షరనిధి. ప్రజాపోరాటాలను ఆహ్వానిస్తాడు, కీర్తిస్తాడు. అంతేకాదు మరణించిన ఉద్యమకారులను స్మృతి గీతాలలో స్మరించిడం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఎస్వీ ఆరుట్ల కమలాదేవి (పోరాట పుష్పం) తమ్మారెడ్డి సత్యనారాయణ( ఙ్ఞాపకచిత్రం) లను స్మరించుకుంటూ కవితలు రాశారు. కమలాదేవిని తెలంగాణా సాయుధరైతాంగ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పంగా , తమ్మారెడ్డిని ఆదర్శాలపై ఆచరణ కట్టిన కోటగా కీర్తించారు. ఈ రెండు కవితలూ చదివితే నేటి ఉద్యమ కార్యకర్తలు ఎంతో నేర్చుకోగలరు.గద్దర్ మీద దాడి జరిగితే మానవత్వమున్న వాడెవ్వడూ సమర్ధించలేదు. అభ్యుదయ కవి ఎస్వీ మాత్రం ఎలా మౌనం వహిస్తాడు ! ‘ పాట అమరం’ కవితలో దాడిని విమర్శించారు. ప్రజాకళాకారుడైన గద్దర్ ను పాటగా సంభవిస్తూ ఆ పాట అడవి తల్లి గుండెల్లో జలపాతమై దూకుతున్నదని పల్లె బతుకుల్లో పోరు జండాలు నాటూతున్నదని కీర్తించాడు. తన స్నేహితుడు మరణించిన పుల్లారెడ్డి స్మృతిలో రాసిన కవిత (పుల్లన్న కోసం) అరసం ప్రధాన కార్యదర్శి పెనుగొండ లక్ష్మినారాయణకు యాభయ్యేళ్ళు నిండిన సందర్భంగా రాసిన అభినందన కవిత (అత్మీయగీతం) ఎస్వీ హృదయార్దతకు నిదర్శనాలు.
తెలంగాణా అన్నా, అందులో హైదరాబాదు పాతబస్తీ అన్నా ఎస్వీ కి ఎనలేని ప్రేమ, తులలేని అనురాగం. తెలంగాణా తాను పుట్టీ పెరిగిన ప్రాంతం. పాతబస్తీ తానుపొట్ట చేతబట్టుకొచ్చి బతికిన ప్రాంతం. వీటీని ప్రేమించనివాడు కవి కాలేడు.
” నాకు ఆట మాట పాట నేర్పిన అమ్మ తెలంగాణ
నాకు అంబలి తాపి బువ్వపెట్టిన అవ్వ తెలంగాణ”
అని అత్మీయంగా నిర్వచించి, ఆ తెలంగాణ రాజకీయ నాయకుల స్వార్థప్రయోజనాలకు బలైపోతూ ఉండడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ‘ఇంకానా’ కవితలో. జైలు నుంచి అనేక ఆశలతో విడుదలయ్యే రాజకీయ ఖైదీలకు సంఘీభావం ప్రకటించే అభ్యుదయ కవి ఎవరైనా గొప్ప మానవతావాదే. ‘ మమేకం’ కవితలో ఎస్వీ ప్రదర్శించింది అదే.
”మీరేకాదు మేమూఖైదీలమే
అందుకే మా సంఘీభావం”
” మీ పోరాటం
మా కళ్ళపొరల్ని కరిగించేసింది”
అన్న అభివ్యక్తి లోతుగా ఆలోచింపవలసినది.
ఎస్వీ చుట్టూ ఎంత ప్రపంచమున్నా, దాని పట్ల ఆయన కెంత బాధ్యత ఉన్నా, ఆయనదంటూ కుటుంబం ఉంది కట్టుకున్న భార్య , కన్న తల్లి దండ్రులు ఉన్నారు. ప్రపంచాన్నంతా ప్రేమించే కవి వాళ్ళను ప్రేమించడం సహజం. ఎస్వీలో ఈ ప్రేమ కవిత్వం ఒంటిగా ఉంది. ఆ ముగ్గురునీ కవిత్వపుటద్దంలో మనకు చూపించారు. ఇలాంటి సమయంలో సెంటిమెంట్ బలమైన కొరముట్టుగా ఉండడం సహజం. అందుకే విశేషణాల జల్లులు కుదిపిస్తాడు కవి.
”మా ప్రేమకు తలపువ్వు
మాకోపానికి చిరునవ్వు” అని అమ్మను నిర్వచించాడు.
” ఉపాధ్యాయుడు కాదగిన ప్రతిభాశాలి
సారాదుకాణంలో కూలీగానే అస్తమించాడు”
అని తన తండ్రిని గురించి రాసిన పంక్తులు పాఠకుల కళ్ళలో నీళ్ళు నింపుతాయి. తన భార్య భారతి ఆరోగ్య సమస్యను ప్రస్తావించి
”మా అనారోగ్యానికి ఔషధం”
అని అనడం ఆమె వ్యక్తిత్వాన్ని , ఆయన నిజాయితీనీ చాటుతున్నది.
ఎస్వీ ప్రధానంగా వస్తు ప్రాధాన్యకవి. అధిక్షేపమే ఆయన ప్రధాన అభివ్యక్తి వాహిక . కొన్ని విశేషణాలు నాజూకుగా వాడతారు.అలంకారాల బరువును వస్తువు పై రుద్దరు. వచనకవులలో ఎస్వీది కుందుర్తి మార్గమని చెప్పవచ్చు. అక్కడక్కడా వచనానికి ఇంకొంత శిల్పపుపూత ఉంటే బాగుండుననిపించే సందర్భాలున్నా అభ్యుదయ సాహిత్య విమర్శలో, ప్రచారంలో పాఠకులకు అత్యంత సన్నిహితంగా సంచరించే ఎస్వీ బహుశా సామాన్య సాహిత్య పాఠకులు కూడా తన కవిత్వాన్ని చదివి ఆలోచనలు చేయాలని ఉద్దేశించి ఉంటారు. ఈ కాలపు అభ్యుదయ కవి సమూహంలో ఎస్వీ అగ్రేసరుడు. విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా ఒంటి స్తంభపు మేడల్లో ఉండకుండా ప్రజాసమూహంలో కలిసిపోయె కవి ఎస్వీ.
” జీవితం ఊహకాదు వాస్తవం
సాహిత్యం సమాజ చలనాలకు దర్పణం “
2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
January 7th, 2010 at 8:06 am
ఏ సమాజానికైనా కాలిని అడ్డతీగ అన్న అవగాహన ఉన్నప్పుడే ఎవరైనా ప్రగతి శీల కవి కాగలరు. పచ్చరిబ్బన్లు గాని, పసుపు రిబ్బన్లుగానీ ఏ నాడూ ప్రగతిశీల చిహ్నాలు కావు.
“ఫ్లైఓవర్లు ఒక కట్టడం మాత్రమే కాదు ప్రపంచబ్యాంకు ముద్దు బిడ్డ ” పై రెండు vakyalu S.V garini lothuga chadivenduku Thodpaduthayi Rachapalyam sir ku dhanyavadamulu
Madhurasree Anantapur
January 25th, 2010 at 7:06 am
This exclusive article abut the progressive writer S.V. has been very inspirational. Having read his book : “Jeevitham oka udyamam” , I am pleased to get a deeper insight about the motives behind each poem of this book. I thank Sri Rachapalem garu for giving us a detailed description of Sri S.V. garu’s thoughts and opinions. Furthermore, I would like to read more about S.V.’s other books and compilations penned by Rachapalem garu.