Jan2010
కథా, కథనం-రెండూ ‘మనిషి’ సంఘర్షణలే! – వారధి ప్రచురణ ‘నవతరం తెలుగు కథ’
వారధి రచయితల సహకర వేదిక ప్రచురణ ‘నవతరం తెలుగు కథ ‘ సంకలనం.’రచనకు మూలాధారమైన అధ్యయనం వైపుగా దృష్టి సారించడం రచయితల తక్షణ కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఎంతైనా వుంది’.తక్కువ ఖర్చుతో పుస్తకాన్ని పాఠకులకు అందజేయాలి. మానవ సంబంధాలను నిలిపే రచనలను విద్యార్థులకు పరిచయం చెయ్యడం ‘వారధి తదుపరి లక్ష్యం ‘ అనే సదాశయాలతో రచయితలే ముద్రణ వ్యయంభరించి, వారే నేరుగా పంపిణీ బాధ్యత స్వీకరించి ఈ సంకలనం తెచ్చారు. 287 పేజీల పుస్తకం, 24 కథలు – 60 రూపాయలకు అందిస్తున్నారు.’పది సంవత్సరాల ఇవతల కథని భుజానికెత్తుకున్న’ రచయితల కథలు ఇవి. ‘కథలన్నీ దాదాపుగా కథకులకు నచ్చిన కథలే . ఎంపికకు ప్రాతిపదిక అదే ‘ అని చెప్పారు మంచికంటి. అదే సమయంలో వినయ పూర్వకంగా సాహిత్య సంప్రదాయ విఙ్ఞతతో ‘ప్రతి కథకుడికీ తన కథల పట్ల ప్రేమ ఉంటుంది’ అని చెప్పారు.
* * * * * * * *
ఇది’ మంచి ‘కథల సంపుటి !
మంచికథకి – నూరేళ్ళ అధ్యయన అభ్యాస ఫలితంగా – కొన్ని ప్రమాణాల పూసలహారం తయారంది. అయితే, ఆ ప్రమాణాలు ఎవరికి వారు ఏర్పరుచుకున్నవి. విమర్శకులూ, సమీక్షకులూ, ‘సోకాల్డ్’ సీరియస్ రచయితలూ ,పాఠకులూ అందరూ కూడా ఎవరి ప్రమాణాలు వారివిగా నిర్ణయించుకుని, ఆ ప్రమాణాల ఆధారాంగా -ఫలానా కథ – ‘బాగుంది ‘ అనో ‘మంచికథ’ అనోలేక గొప్ప కథ అనో అనుకుంటున్నారు, చెప్తున్నారు. సాహిత్యంలో అందునా లక్షణ గ్రంధాలూ, శాస్త్రాలూ లేని ఆధినిక సాహిత్యంలోని అన్ని ప్రకియలకీ ఈ పరిస్థితి వుంది. కథనానికి మినహాయింపు కాదు. నిజానికి ఇవాళ మనం కథలంటున్నవన్నీ ప్రక్రియాపరంగా కథానికలు కదా! అందువలన ఈ’ మంచికథ’ విశేషం కేవలం స్థూలాంగీకార పరిధిలోనిది. భావ సారూప్యత పరిధిలోనిది.
పాఠకుడిగా, నాకున్న సర్వస్వం నా హృదయం ఒక్కటే. అది ఎన్నెన్ని కథల్ని మంచిగాఎన్నగలదో – అవన్నీ మంచికథలే!!
* * * * * * * *
కథ చదివిన తర్వాత పాఠకుడి గుండెతడిని అతని కనుకొలకుల్లోకి దించగలిగేది మంచికథ అయితే – ఇవిగో ఈ సంకలనంలో -’అమ్మ పాలకమ్మదనం’(స.వెంరమేష్), ‘ఛోటి బహెన్’ (స్కైబాబా) ‘,గ్రహణం ‘ (ఒమ్మి) , ‘సిల్ సిలా’ (షాజహానా), ఉన్నాయి.నీళ్ళు దొరక్క దప్పికతో చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న పన్నెండేళ్ళ పిల్లవాడీకి ఒక యువతి తను చనుబాలతో ప్రాణం నిలిపింది – మొదటికథలో ! బుర్ఖా వెయ్యనంటే వెయ్యనన్న చెల్లెలు పన్నెండేళ్ళు ఆ మాట మీదే నిలబడి తీరా పెళ్ళయిన తొలిరోజుల్లోనే నిండుగా బుర్ఖావేసుకుని అన్నతో పుట్టింటికి బయల్దేరితే కళ్ళపొంట ఆ రూపం బొటబొటరాలక ఏమవుతుంది. మారని ఛాందసుల అభిమతం – రెండవకథ !లేమిలోనే, అసలు మనసు విలవిలల్లోనే, బంధుత్వాల తాడు ఎంతగట్టిగా వుంటుందో చూడాలి. ఆ సూత్రానికి నిండు ఆకృతి మూడో కథ ! అద్భుతమైన చిత్రకారిణి, పెళ్ళయ్యే సరికీ భర్తకూడా చిత్రకారుడే అయినాసరే -స్త్రీ అనేసరికే వివక్ష -ఆమెని అమెగా వుండనీయని ఆధిపత్యం. కానీ ఆమెని చూస్తుంటే – ‘మనసులో వెచ్చని గాలులు, చేతుల్లో మెలి పెట్టే ఆకలి . ఆమె కావాలి భర్తకి’ !’ ఏం రాశాడు సార్’ అని చెప్పుకుంటామే మరీ బాగున్నరాతనీ – అలా అనిపింపజేసే కథ ఒమ్మి రమెష్ బాబుది!
సమాజంలో ఒక వాంఛనీయమైన మార్పుని ఆశిస్తూ. ఆ సందేశాన్ని కథాత్మకంగా, శిల్పభరితంగా చేసేది మంచికథ అనుకుంటే – ఇవిగో- ఈ సంకలనంలో అక్కిరాజు భట్టిప్రోలు ‘నాక్కొంచెం నమ్మకమివ్వు’. దగ్గుమాటీ పద్మాకర్ ‘ఇనుపతెర’ ఉన్నాయి. అతి సన్నిహితంగా తిరుగుతున్న నమ్మకమైన మిత్రుడు వేరే మతంవాడు – ఎక్కడో ఏదో 9/11 జరిగితే – హఠాత్తుగా పరాయి వాడయిపోతాడా ? అతనేం నమ్మకద్రోహం చేశాడు? ఆ అనుమానపు దృష్టీ , చర్యా, ప్రవర్తనా ఎందుకు ? ఆలోచించండి. ఇదీ మొదటి కథ. పిల్లల్లోని సృజనాత్మకతనీ, స్వచ్ఛమానసాల్నీ మొగ్గలోనే తుంచిపారేయకండి – ‘ఇనుపతెర’.
మానవ సంబంధాల్ని నిలుపుకోవటానికి మనిషి చేయవలసిన కృషినీ, ఆ ప్రయత్నంలో గీతకి కాస్త అటూ ఇటూ జరిగే తత్వం పెంపొందించుకోవలసిన ఆవశ్యకతనీ – బోధించేది మంచికథ అయితే – ‘తాతకథ’ (ఎలికట్టే శంకరరావు) ‘దేవరెద్దు ‘(గోపినీ కరుణాకర్) , ‘ఆనందకుటీరం ‘ (జి. ఉమామహేశ్వర్ ) ఉన్నాయి. మంచికంటి ‘అంతరాంతరాలు’ వుంది. చదవండి. సంభాషణ కాకుండా, భావ ప్రసరణం వుంటే, మాటలు మానవ సంబంధాల్ని ఎలా నిలపగలవో ‘తాతకథ’ చెప్తుంది. సంపాదన స్థాయిని బట్టి సంబంధం స్థాయి అంటుంది. దేవరెద్దు ., వృద్ధుల సామూహిక అనుబంధాల హరివిల్లు ఆనందకుటీరం , యింత ఎదిగావు ఎందుకు ? ఏమీ తెలీదు. నువ్వు ఎప్పటికీ మామామయ్యవే’ అని ఆరిందలాగా ఓ చిరుస్పర్శతో అమాయకంగా గలగలమాట ఎంతహాయినిస్తుంది! మంచికంటి కథని అనుభవించాలి. పంచెవన్నెల రంగులకలల పిల్లల్ని చూపుతుంది’ వెన్నెల పడవ’ (కూర్మనాథ్) . కాల్ సెంటర్ సంపాదన వర్సె స్ బతుకు విలువని డా.సుభాషిణి గారి ‘దీపంపురుగులు’ చర్చింది.
సంక్లిష్టమైపోతున్న సమాజజీవనంలో ఎన్నెన్నో సమస్యలు. వాటన్నిటి కేంద్రకం -దగా, ,దోపిడి, స్వార్థం, స్వప్రయోజనం. ఈ సంకీర్ణతలో బతకటానికి నాలుగు రకాల ఈతలు -బోర్లీత, ఎల్కలీత, పక్కీత,మునుగుడీత- కావాలనే సందేశం -’ఈత’ కథ(పి.చిన్నయ్య) నీరు, నేల డబ్బు- తామెలా బందీలై పోయారో అశోక్ కుమార్ చెప్పారు. ప్రయోగాత్మకంగా వాటీ దోపిడిని వర్ణించారు. పలమనేరు బాలాజీ బోర్ల బాధ రైతు వ్యధ ‘తపన’ లో చిత్రిస్తే దేవేంద్రాచారి – కడుపు మండిన రైతు ఆక్రోశం , ఎన్నెన్ని విధాల బుగ్గపుడుతుందో చెప్పారు. రాజ్యం కల్పించే’ ఉక్క ‘ ఎంత దుస్సహామో ప్రశాంత్ అదే పేరున్న కథలో చిత్రించారు. దళితులు వర్స్ స్ అగ్రకులంవాడు. కక్షసాధింపుకు తెగబడితే – ఎంత దూరం పోగలం? నిర్మోహతతో, చిక్కని శిల్పంతో చర్చించారీ సమస్యని మల్లీశ్వరి – ‘పెత్తనం’ కథ . లక్ష్యసాధనకి ఎంత వేదన , ఎన్ని కష్టాల్లోమునకలు ? ఈ వైనాల్ని వివరిస్తుంది – షరీఫ్ ‘అయ్యవారి చదువు’ .’పువ్వున్నచోట పత్రి యాటనుకున్న చోట కోడి…. ఖుదాకోరుకొనేది సచ్చేదిల్ కాజియారత్ మాత్రమే ‘ ఒక గంభీరమైన జీవన తాత్వికదర్శనం -బారహమతుల్లా కథ ‘అప్జల్ బిచారా ‘!హాస్యం , వ్యంగం – యస్ వి ప్రసాద్ – ‘పేపరోఫీలియా- ఒక జన్యు వ్యాధి ‘ కథ!
ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు పునరావాసచర్యలు నిల్ -ఇది ఒక బర్నింగ్ టాపిక్, దీనికి తోడు ఆ ప్రాంతం వలస పక్షుల ప్రత్యేక ఇక్కపట్టు అయితే – సమస్య మరింత సంకీర్ణ అవుతుంది. సామూహిక నిరసన, తిరుగుబాటు, చర్య ఆవశ్యకతని చెప్పుకొచ్చింది’ హద్దు’ కథ .
కాగా’ అంతర్వలయాలు ‘అని పాణి ఒక మంచి పెద్ద కథరాశారు. సంపద ,సిరి వచ్చి పడితే మనిషిచిత్త వృత్తిలో కలిగే పరిణామాలు వింగడింపు, మూలాలు కోల్పోని మనుషుల నైజం – ప్రధానాంశాలు. ఈకథలో వస్తువు సంగతి అలా ఉంచితే , మనిషి వాక్ కాయకర్మల ద్వారా ‘మ్యానిఫెస్ట్’ చేసిన అత్యంత గుణ వైశిష్ట్యం గల కథనం ఉంది. శిల్పపరంగా కొ.కు ని ఈ రచయిత ‘చంపిపుట్టాడా?’ అనేంత అద్భుతంగా రాశారు. ఆ శైలిలో, సంవిధానంలో నిరాడంబరత, నిసర్గ గాంభీర్యం, ఎక్కడ కావాలో అక్కడవో మృదుస్పర్శ- ఇవన్నీ అలవోకగా కథా గతం అయిపోయాయి. అదీ విశేషం. ఇలాంటి కథలకి మన్నన లేదుగాక లేదు- ఈ నాటి కథాలోకంలో నవతరం కథకుల్లోకి వచ్చాడు కనుక పాణి కథ- ఈ సంకలనంచదివే పాఠకులకి వరంలా లభిస్తోంది. ‘ ఏ గ్రేట్ స్టోరి రిటెన్ విత్ ఎ గ్రేట్ హ్యూమేన్ టచ్ ‘ ! అని ఇంగ్లీషులో అంటేనే నా ఆనందపు సంస్పందనకి అక్షరీకరణం జరుగుతుందని అలా అంటున్నాను.
చివరగా ఒక్కమాట వస్తుపరంగా – ‘ఆదిలక్ష్మి కేరాఫ్ ఆరెస్ రోడ్’- అనే వెంకటకృష్ణ కథ – మరీ మరీ లేటెస్ట్ సామాజిక పరిణామమైన జెండర్ మార్పుని ఆధారం చేసుకుని రాసిన మంచికథ. మంచికథ ఎందువలన అంటే – అటూ ఇటూ కాని మనిషికీ మనస్సనేది ఉంటుందని సత్య ప్రకటనని కేంద్రం చేయటం వలన.
’నవతరం తెలుగు కథ’ ఒక ప్రయోగాత్మక సంకలనం. ఒక ప్రయోజనాత్మక ప్రయత్నం. కథాభిమానులంతా తప్పక ఆదరించవలసిన ప్రయత్నం. ప్రతి రచయితా – ప్రత్యేకించి- పుస్తకాన్ని కొని చదవాలని నామనవి. నా వరకూ నేను కొన్న పుస్తకాన్నే ఈ సమీక్షకి ఉపయోగించుకున్నాను.
3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు
January 27th, 2010 at 5:27 am
vihari garu,
meeru sahitya prapamcham lo veera_viharam enduku chesthunnaru?
dina pathrikallo mee articles regular ga chusthuntanu.
Yours patience & creativity shd be congratulated.
January 27th, 2010 at 5:28 am
08680-275125
nallagonda.
February 6th, 2010 at 2:13 pm
[...] కథా కథనం – రెండూ ‘మనిషి’ సంఘర్షణలే! వా… [...]