క్రాంతి దర్శి , మహారచయిత ఆళ్వారు స్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి [1915-1961]  తన కార్యకలాపాలు సాంస్కృతిక రంగంలో ప్రారంభించి జాతీయోద్యమ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య రాజకీయాలలోకి విస్తరించుకున్నాడు. క్రమక్రమంగా ఆయనలోని చైతన్యం ఒక నూతన జీవిత దృక్పథానికి దారితీసింది.’ ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు అందుకు ఉదాహరణలు. ఏ కొలతలతో చూసినా ఆ రెండు మహోన్నతమైన ఆత్మ చరిత్రాత్మక నవలలుగా నిలబడతాయి. ఆళ్వారు స్వామి తన జీవితంలో అక్షరంతో సంబంధమున్న అన్ని పనులు చేశాడు. ఆంధ్ర మహాసభ నిర్వహణలో ఆయన కృషి ఎనలేనిది. సామాజిక కార్యకర్తగా, రిక్షా సంఘం, గుమాస్తాల సంఘం ,రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి పలు కార్మికోద్యమాలకు నాయకత్వం వహించడం, తొలిసారి పౌరహక్కుల పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం, స్త్రీ సమానత్వం కోసం తపించడం వంటివి ఎన్నో సాధించాడు.
 ఇవన్నీ పరిశీలిస్తే తెలుగు సాహిత్య చరిత్రలో ఆళ్వారుస్వామికి తగినంత ప్రాధాన్యత లభించలేదని, ఆయనకు దొరకాల్సినంత గౌరవం దొరకలేదని, ఆనాటి తెలంగాణ కవులు, రచయితలు ముఖ్యంగా అభ్యుదయ రచయితల సంఘం వారు ఆయనను అశ్రద్ధ చేశారేమోనని అనిపిస్తుంది.ఇక తెలంగాణా వారిలో ఒక బలహీనత మొదటి నుంచి ఉండనే ఉంది. తమ గొప్పతనం తాము చెప్పుకోలేరు. సహచరుడి గొప్పతనాన్ని గుర్తించి గౌరవించుకోనూ కూడా లేరు. ఎవరో గుర్తించి  ఓ మంచి మాట చెబితే గాని, ఇక్కడివారికి బల్బు వెలగదు. లేదా విధిలేక నలుగురితో నారాయణలాగా చివరికి గొంతు కలుపుతారు తప్ప, చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన సమయంలో చెయ్యరు. పైగా ఎవరో తమను అశ్రద్ధ చేశారని బాధపడడం దీనికి పరాకాష్ట !జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆళ్వారుస్వామిని ఒక క్రాంతి దర్శిగా, ఒక మహారచయితగా రాగల తరాలవారికి పరిచయం చేయాల్సిన బాధ్యత ఈ తరం రచయితల మీద ఉంది.
 1938 లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడడానికి ముందు తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటం చిత్రించిన వట్టికోట ఆళ్వారు స్వామి తన నవల’ ప్రజల మనిషి ‘ని 1955 లో వెలువరించారు. ఇందులో కంఠీరవం , కొమురయ్య కుటుంబాల కథ ప్రధానాంశంగా సాగుతుంది. ఏదో ఒక సమయంలో ఒక గ్రామంలో జరిగిన సంఘటనల సమాహారం కాదు ఈ నవల.వాటి మధ్య గల కార్యకారణ సంబంధాల్ని విశ్లేషించి, ఒక విశ్వజనీనతను సాధించిన రచన . కంఠీరవం నవల ప్రారంభంలో భయస్తుడయిన గృహస్థుడు. కాని, సమయం గడుస్తున్న కొద్దీ, పరిస్థితులు అర్థం చేసుకుంటున్న కొద్దీ, చైతన్యంతో పరిణతి సాధిస్తున్న కొద్దీ అతను సింహంగా మారతాడు. కంఠీరవం అంటే గర్జించే సింహం అని అర్థం ! నవల ఒక సమస్యతో మొదలై ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడంతో ముగుస్తుంది.
 కోటయ్య ‘ఆవు’ను రామాభూపాలరావు అన్యాయంగా స్వంతం చేసుకుంటాడు . అండాలమ్మ రామ భూపాలరావుకు ఉచితంగా విస్తరాకులు కుట్టిస్తుంది. శ్రమ దోపిడితో మొదలైన నవల, రాజకీయ చైతన్యంతో పరిష్కారాన్ని కనుగొని, నిరంకుశ  పాలనకు చరమగీతం పాడే దిశలో సాగుతుంది. “మంచి ప్రభుత్వం ఇతరుల ఆస్తులు ఆక్రమించదు.అందరూ ఆప్తులుగా బతుకుతారు.” అని కంఠీరవం ప్రకటిచడంతో నవల ముగుస్తుంది. నవలలో కంఠీరవందే ముఖ్యపాత్ర అయినా, మిగతా పాత్రలు అశ్రద్ధకు గురికాలేదు. అవి కూడా స్వతంత్రంగా ప్రవర్తించాయి. ఇతి వృత్తాన్ని సామూహికంగా ముందుకు తీసుకుపొయ్యాయి. ప్రజల మనిషి నవలలోని ముఖ్యపాత్ర కంఠీరవం అంటే మరెవరో కాదు నవలా రచయిత వట్టికోట ఆళ్వారి స్వామే ! సమధర్మం కోసం, మత సామరస్యం కోసం, మానవత్వం కోసం, విశ్వజనీన సంస్కృతి కోసం, హేతువాదం కోసం, సమిష్టి జీవితం కోసం, చివరికి మంచి ప్రభుత్వం కోసం ఆయన చేసిన తపస్సు – ఈ నవల . అందుకే ఆళ్వారు స్వామి అరుదైన, అపురూపమైన రచయిత. తన నవలకు’ ప్రజలమనిషి’ అని నామకరణం చేయడం లోనే ఆయన ప్రజాదృక్పథం అర్థమౌతోంది.
 ’ప్రజల మనిషి’ పూర్తిగా ఆళ్వారుస్వామి ఆత్మ కథాత్మక నవల. ఆయన వైష్ణవ  వంశంలో పుట్టినవాడు. తను సృష్టించిన కంఠీరవం పాత్రను కూడా ఆయన ఆ వంశంవాడిగానే రూపకల్పన చేశాడు. ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయోద్యమంలో కొనసాగాడు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ముప్పయికి పైగా పుస్తకాలు ప్రచురించాడు. చైతన్య కారుడిగా, ఆర్య సమాజం.,ఆంధ్ర మహాసభల్లో రాజకీయ కార్యకర్తగా పని చేశాడు. దాశరధి పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు.
 ఆయన ‘ ప్రజల మనిషి ‘నవలలో సృష్టించిన కంఠీరవం పాత్ర కూడా ఈ పనులన్నీ చేస్తుంది. తన అన్నగారితో అభిప్రాయ భేదాలేర్పడి దిమ్మగూడెం నుండి నిజామాబాద్ పట్టణానికి రావడం, అక్కడ గ్రంధాలయ వార్షికోత్సవం జరపడం,రామ భూపాలరావు కోరిక మేరకు ఆర్య సమాజ్ కు చెందిన విజయదేవ్   దిమ్మ గూడెం రావడం వంటి వన్నీ – ఆళ్వారు స్వామి నిజజీవితంలోని అనుభవసారాలే! తను సృష్టించిన కంఠీరవం పాత్రలాగానే ఆళ్వారు స్వామి మేధావి, దేశభక్తుడు, హేతువాది సమన్వయకర్త. అందువల్ల నవల చదువుతున్నప్పుడు ఇటు రచయిత మీద, అటు కంఠీరవం మీద పాఠకులకు ఒక గౌరవభావం పెరుగుతుంది.
 ఆ రోజుల్లో తెలంగాణలో హరిజనుల్ని మహ్మదీయులుగా మార్చే ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందుకే నవలలో కంఠీరవం అంటాడు -”అసలు ప్రభుత్వం ఆలోచనలే వేరుగా ఉన్నాయి. మహ్మదీయులను తమ చంకలో ఇరికించుకుని హిందువులను అణచివేయడమే పనిగా పెట్టుకుంది” అని. “ఇస్లాం అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని ; శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “. -అంటూ విమర్శించి దెబ్బలు కూడా తిన్నాడు కంఠీరవం. ఇవన్నీ ఆళ్వారు స్వామికి స్వతహాగా ఉన్న బలమైన అభిప్రాయాలే! వీటిని గమనిస్తే అవి ఇప్పటికి, ఈ కాలానికి కూడా వర్తిస్తాయి. నేటి ఉగ్రవాదం, పాకిస్తాన్ అనుసరిస్తున్న ధోరణి ఇలాంటిదేకదా ? యాభయి అయిదేళ్ళకు పూర్వమే – అప్పటి సందర్భం వేరయినా కూడా దార్శనికుడైన ఆళ్వారు స్వామి నేటి ఉగ్రవాదం గురించి వ్యాఖ్యానించినట్లయింది.
 ’ప్రజల మనిషి ‘నవలలో రామభూపాలరావు ఎలాంటి దుష్ట శక్తో నవల పూర్తిగా చదివిన వారికి తెలుస్తుంది. అతడు తన స్వార్థం కోసం మనుషుల్ని భయపెడతాడు. కొడతాడు.కొనేస్తాడు . పోలీసుల్ని వశపరుచుకుంటాడు. లంచాలు తింటాడు. దొంగసాక్ష్యాలిప్పిస్తాడు. నేటి సగటు రాజకీయ నాయకులు చేసే పనులు యాభై అయిదేళ్ళ క్రితమే ఆళ్వారుస్వామి రామభూపాలరావు పాత్ర ద్వారా చేయించాడు. అయితే వాటన్నిటిని కంఠీరవం పాత్ర ద్వారా బట్టబయలు చేయించి, అతనిపై విజయం సాధింపజేయడమే ఆళ్వారుస్వామిలోని ప్రజల మనిషి సాధించిన ఘన విజయం!
 నవల చివర భాగంలో కంఠీరవం పాత్రను ఆళ్వారుస్వామి మహోన్నతంగా తీర్చిదిద్దాడు. ఆ సందర్భంలో అతడేమి చెప్పినా అది అమూల్యసంపదలా భాసించింది. అమోఘంగా,తర్కసహజంగా కనిపించింది. గ్రంథాలయం కంఠీరవం ప్రవచనాలకు వేదిక అయ్యింది. ప్రజలు అతని చుట్టూ చేరి వింటూ వుంటారు.
 ”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది. సమిష్టి బాధ్యత సమిష్టి ఆలోచన, సమిష్టి జీవితం లేకుండా పోయింది. ఎవరికి వారు బాధ్యతారహితులైపోతున్నారు”- అంటాడు కంఠీరవం. “ఎవరికి వారు తాము చేసే ప్రతి పని, అంతరార్థం, పరిణామం తెలుసుకుని చేయడం మంచిది. అంతేగాని, వ్యక్తిగతమైనట్టి , లేక అధికార పూర్వకమైనట్టి ఒత్తిడికి లొంగి అణిగి ఉండటం మాత్రం ఆత్మహత్య చేసుకున్నట్టే “- అంటాడు కంఠీరవం. తనను తాను కంఠీరవం పాత్రగా సృష్టించుకున్న ఆళ్వారు స్వామి అర్థశతాబ్దికి ముందు చెప్పిన విషయాలు ఇప్పుడు సమకాలీన సమాజానికి కూడా వర్తిస్తూ ఉండడం గమనించాలి.
 నాటి తెలంగాణ జీవితాన్ని యధాతధంగా చిత్రించి, చారిత్రక సత్యాల్ని తరువాతి తరాల వారికి తెలియజేసిందీ………..స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తూ………. సాహిత్య రాజకీయ సభలేవైనా భార్యతో కలిసి హాజరైందీ ఆళ్వారుస్వామే! చెప్పటం కాదు, చేసి చూపటం ఆయన వ్యక్తిత్వం !! జీవన భృతి కోసం హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై , ప్రచురణ కర్తయి, సామాజిక కార్యకర్తయి, జైలు జీవితం గడిపి అభ్యుదయానికి సారధ్యం వహించాడు.
 ఆళ్వారు స్వామి నల్లగొండ జిల్లా -చెరువు మాదారం అనే కుగ్రామం లో జన్మించాడు. అది ఆ కాలంలో కమ్యునిస్టు ఉద్యమానికి కేంద్రం. ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’ నవలకు నిజామాబాద్ జిల్లా దిమ్మగూడెం కేంద్ర భూమి. కాని ఆయన తను పుట్టి పెరిగిన నల్లగొండ జిల్లా ప్రజల భాషనే తన పాత్రల ద్వారా పలికించాడు. 1952 లో రాసిన నవలని 1955 లో తన దేశోద్ధారక గ్రంధమాల ప్రచురణగా వెలువరించాడు. ఆ రకంగా ప్రజల భాషని సాహిత్యంలో అంత విస్తృతంగా వాడుకోవడం అంతకు ముందు లేదు. ఉన్నా చాలా తక్కువ.!
 స్వయంగా పోరాటంలో పాల్గొని జైలు కెళ్ళిన మహాకవి దాశరధి కృష్ణమాచార్యవలె, జీవించిన నలభై ఏడేళ్ళ కాలంలో తొలుత వంట వాడిగా – సేవక – యాచక వృత్తిలో గడిపి , ఆ బీదతనంలోనే మగ్గిపోకుండా ఆందులోంచి బయటపడి బెజవాడ్లో హోటల్ సర్వర్ గా గడిపి, మళ్ళీ అందులోంచి బయటపడి హైద్రాబాద్ లో గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా మారాడు . తనను తాను నిలదొక్కుకున్నాడు. ఆయన స్వయంగా డిగ్రీలు తీసుకోకపోయినా, ఎంతో మంది పి.హెచ్.డీలు చేసి సంపాదించుకోగల ఙ్ఞాన ఖనిజాన్ని సమకూర్చి పెట్టాడు. తను చైతన్యవంతుడై , గ్రంథాలయోద్యమంతో ఇతరుల్లో చైతన్యం తెచ్చినవాడు. ఇతరుల గ్రంథాలెన్నో ప్రచురించి , తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో చారిత్రక వివరాల్ని తెలంగాణం సంపుటాల ద్వారా వెలుగులోకి తెచ్చిన సాధకుడు, మహనీయుడు , వైతాళికుడు ఆళ్వారుస్వామి! ఇలాంటి రచయిత మన తెలుగు సాహిత్య రంగంలో మరొకరు లేరు. ఆయన పేర గ్రంథాలయం లేకపోవడం , ఆయన స్మృతి చిహ్నంగా ఓ విగ్రహం లేకపోవడం , ఆయన స్ఫూర్తిని నిలిపే పాఠ్యాంశాలు పాఠశాలల్లో లేకపోవడం ఒక పెద్దలోపం. ప్రభుత్వాల వైఫల్యాలకు ఇవి గట్టి నిదర్శనాలు. తెలంగాణ ప్రాంతపు నాయకులకు సైతం ఇలాంటి స్పృహ లేకపోవడం బాధాకరం.

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

One Response to “క్రాంతి దర్శి , మహారచయిత ఆళ్వారు స్వామి”

  1. 1
    ramnarsimhareddy Says:

    ధన్యవాదాలు.

    హాలియా, నల్గొండ.

    నన్ను గుర్తుపటారా?

    08680-275125

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో