Jan2010
ముక్తవరం పార్థసారథితో ముఖాముఖి
ఇవాళ తెలుగు కథ ఏ స్థాయిలో ఉన్నది
తెలుగు కథ లో వైవిధ్యం బాగా ఉన్నది. వస్తు వైవిధ్యం కూడా ఉన్నది .శిల్ప పరంగా చాలా మార్పులు వచ్చినాయి. అయితే చిన్నకథ (ఇంగ్లీషు లొ short story అంటారు )లో- బుచ్చిబాబు , గొపీ చంద్ లాంటి రచయితలు వ్రాసిన కథల్లో ఉన్న సమాంతరత ఇపుడు రాస్తున్న ఆధునిక కథకు రచనలో కనిపించడం లేదు. ఏదో సంఘటన ప్రధానంగా రాసినప్పటికి కూడా గత తరం రచయితలు సఫలీకృతం అయినంతగా ఈ తరం రచయితలు కావట్లేదనిపిస్తుంది.
తెలుగు కథ వికాస పరిణామ దశల గురించి చెప్తారా?
ఇంచుమించు గురజాడ కథ నుండి తీసుకున్నట్లయితే అనాదిగా కథా ప్రక్రియ ఉన్నది. అన్ని దేశాల సాహిత్య ప్రక్రియల్లొ కథా ప్రక్రియ ఉందనుకున్నట్లయితే short story ప్రక్రియ మాత్రం కచ్చితంగా పశ్చిమ దేశాల నుంచి వచ్చింది. ఉదాహరణకి ‘ఎడ్గర్ ఎలాన్ పో’ అనే అమెరికన్ రచయిత కథా లక్షణాలను నిర్వచించడం ద్వారా ,కథ అంటే ఏమిటి? అని ఒక రకమైన స్పష్టత వచ్చింది. ఈ ప్రక్రియ పశ్చిమ దేశాలనుండి వచ్చిందనుకున్న తరువాత సహజంగా తొలి తరం తెలుగు తచయితలందరూ కూడ పశ్చిమ దేశాల సాహిత్యంతో సంబంధం ఉన్న వాళ్ళే కావడం చేత గురజాడ అప్పారావే కానీయండి, గుడిపాటి వెంకటాచలం , కొడవటిగంటి కుటుంబరావే కానీయండి వీరికి అప్పటికి ఆధునిక కథ ఎలా ఉండాలనేదానికి ఉదాహరణలు లేవు. సహజంగానే వీరు అప్పటికి ప్రసిద్ధులైన ముపాసా, చెహోవ్, ఎడ్గర్ అలెన్ పో, థామస్ హాబిలన్, సామర్ సెట్ లను చదివి తెలుగులొ కథా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.అయితే ఈ నాటి రచయితలకు ఆ అవసరం లేదు. ఎందుకంటే తెలుగు కథలో పశ్చిమ దేశాల సాహిత్యంతో పరిచయం లేకున్నా కూడా కథా ప్రక్రియలో, కథలు రాయడానికి అవసరమైన కథలు తెలుగు సాహిత్యంలో ఇప్పటికే ఉన్నాయి. అందువలన తొలితరం వారికి అవసరమైనంత పశ్చిమ దేశాల సాహిత్యం ఈనాటి వారికి అవసరం లేదు. అయితే కథల మీద ఇష్టం ఉండి చదువుకోవచ్చు కాని, ఇంగ్లీషు కథ చదవకపోతే రాయడం ఎట్లా అనే పరిస్థితి నేడు లేదు. ముఖ్యంగా ప్రయోగాలు చేసిన వారందరు కూడా, చైతన్య స్రవంతి కానీయండి సర్రియలిస్టు కథలు కానీయండి ఇవన్నీ పశ్చిమ దేశాల ప్రభావంతో చేసిన ప్రయోగాలే.
తెలుగు కథ వికాసం ఎట్లా చెందింది?
తప్పకుండా వికాసం చెందింది. పరిణామం చెందింది. కథ నడపడంలొ నేర్పు ఇప్పటి వాళ్ళకు చాలామందికి బాగా తెలిసింది. అయితే శాస్త్ర ప్రగతిలాగా గత కాలం కంటే ఈ కాలం తప్ప కుండా మరింత ముందరికి పోతుందనుకోడానికి వీలు లేదు. కథా ప్రక్రియ వైయక్తిక ప్రక్రియ అనుకున్నప్పుడు ఈ తరంలోని జీనియస్ లు, తీవ్ర ప్రతిస్పందన అనుభవించినవాళ్ళు, దానిని కళారూపంగా మలచగల్గిన వాళ్ళంతా గత తరం వాళ్ళ కంటే బాగా రాస్తున్నారనడానికి వీలుపడదు.ఇపుడు చలంలోని ఉద్విగ్నత, భావతీవ్రత ఆ తరంలోనూ, ఆ తరువాత వచ్చిన తరంలోను ఎవరిలోనూ కనిపించదు.
స్త్రీవాద రచయితలలో కూడ కనిపించదు కదా. స్త్రీ వాదం దృక్పథంతో రచనలు చేస్తున్న వారిలొ కనిపిస్తుందా?
ఆ ఉద్విగ్నత, ఆ తీవ్రత కనిపించదు. వీళ్ళు మరింత హేతుబద్దంగా వాదనలు వినిపిస్తున్నారేమోకానీ, కథ అనబడే కథకు, కథాసృష్టికి అవసరమైన భాధాతీవ్రత మాత్రం ఎవరిలోను కనిపించదు. technicalగా అంతకంటే బాగా ఉండవచ్చు. మలుపులు అంతకంటే బాగా తిప్పి ఉండవచ్చును. సమస్యలను విశ్లేషించి ఉండవచ్చును. ఆ ఉద్విగ్నత మాత్రం కనిపించదు.భావతీవ్రత అనేది వైయక్తిక అంశం. ఉదాహరణకు శ్రీశ్రీ గీతాల్లాగా. అందువలన ఇప్పటి తరం వాళ్ళు గత తరం వాళ్ళ కన్నా భావ తీవ్రతతో ఉన్నారని చెప్పడానికి వీలుపడదు.సాంకేతిక విషయాలు కొన్ని తెలుసుకొని ఉండవచ్చు. అచ్చమైన తెలుగు కథలాగా ఉండే చాసో కథలు, మధ్యతరగతి జీవితాలను ఇంచుమించు శాస్త్రీయంగా విశ్లేషించిన కుటుంబరావు కథలు కానీయండి_ తప్పకుండా తెలుగు సాహిత్యంలొ వచ్చిన హర్షనీయ పరిణామం. గర్వించదగ్గది. తనలోని చీకటి కోణాలను చూపించుకున్నటువంటి త్రిపుర కథలుగాని ఇవన్నీ తెలుగులో వికాసాన్ని సూచించిన కథలు.
శ్రీశ్రీ లాగా ఇప్పటివరకు కాలం అందరినీ నడిపించింది,ఇక కాలాన్ని నేను నడిపిస్తా అన్నట్లుగా కథకుల్లొ సాధికారికంగా ఎవరైనా ఉన్నారా ?
మెప్పించిన వాళ్ళున్నారు. బహుశా కవిత్వాన్ని ఒక ఉద్యమంగా చూపించినందువల్ల శ్రీశ్రీ ఆ మాట అని ఉండవచ్చు. కథల్లొ అలాంటి ఉద్యమం వచ్చిన దాఖలా లేదు. అయితే తెలుగు వాళ్ళందరు గర్వించదగ్గ గొప్ప రచయిత చలం. ఆ తర్వాత కుటుంబరావు, గోపిచంద్ ఉంటారు. కథను మేధోపరంగాను, వినోదంగాను నడిపించిన బుచ్చిబాబు, పీడితుల గురించి ఎక్కువగా రాసిన రాచకొండ ఎన్నదగినవారు. అయితే ఇవన్నీ ఉద్యమాలుగా వచ్చినాయి అనుకోవడానికి మనదగ్గర సరైన ఆధారాలు లేవు. వాళ్ళందరు తమ అభిప్రాయాలని, పీడితుల పట్ల తమకున్న సానుభూతితో మమేకమై రాసిన కథలున్నాయి. కవితాత్మకంగా రాసిన కథలున్నాయి. కాని కథ ఉద్యమంగా వచ్చినట్లుగా నాకు అనిపించడంలేదు. బహుశా వస్తుందో లేదో తెలియదు.
అంతర్జాతీయ ప్రమాణాలతో చూసినపుడు తెలుగు కథ ఇంకా అందుకోవలసిన శిఖరాలున్నాయా?
ఇది మనం వెంటనే సమాధానం చెప్పవలసిన ప్రశ్న కాదు. కొన్ని కథలు ప్రభావితం చేస్తాయి. మనజీవితానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల కథల కంటే మన కథలు బాగా నచ్చుతాయి. మన సంస్కృతికి దూరంగా , వివిధ చారిత్రక సంధర్బాలలొ రాసిన కథలు కూడా మనని ఆకర్షిస్తున్నాయంటే వాటిలో సార్వజనీనత వల్లనే కదా! మన కథలో ఇవన్నీ ఉన్నాయని చెప్పటానికి వీలులేదు.
ఆల్బర్టో మోరాటో (ఇటాలియన్) రోమన్ టేల్ కథలకు వర్క్ చేస్తున్నపుడు, (ఇటాలియన్ కూలి పేటకు సంబంధించిన కథలు వ్రాసాడు.),ఇటాలియన్ కూలి పేటలోని వారికి శుద్ధమైన భాష రాదు.వారు ఎక్కువగా ముఖ కవలికలు, హావ భావాల ద్వారా communicate చేసుకుంటారు. పేపరు మీద వ్రాయాలి కనుక ఇతర పాఠకులకు అర్థం కావాలి కాబట్టి standard భాషలొ వ్రాసాడు . ఇలా మాండలికంలోని flavour చూపిస్తూ, అన్ని భాషల్లోని వారికి అర్థం కావాలి.
క్లాసిక్స్ కథల గురించి చెప్పండి?
అల్లం రాజయ్య కథలు, నామిని కథలు.
పాత కథలన్నీ క్లాసిక్ కాదు. చిరకాలం నిలిచిపోయే కథ అనుకుంటే అయిదేళ్ళు క్రితం వచ్చిన కథ చిరకాలం నిలచిపోతుందనుకోలేం. రామాయణం , మహా భారతం ఇపుడు కూడ చదువుతున్నాం .
దళిత ఉద్యమకథకు సార్వజనీనత ఉన్నదా ?
కథ ఎలా రాస్తాం అనే ప్రశ్న వేసుకున్నపుడు ఉద్యమం ప్రేరణ మాత్రమే . ఉద్యమంతో ప్రేరణపొంది రచయిత కథ రాస్తాడు. ఉద్యమానికి అవసరం అని రచయిత రాస్తాడు.విప్లవం గురించి రాసినంత మాత్రాన విప్లవ కథ అనలేం కదా!గొప్ప రచయితలందదరికీ డ్రాప్ట్ , పదతీవ్రత తెలుసు,కాబట్టి కథగా అద్భుతంగా రాస్తారు.ఉదాహరణ గోర్కీ అమ్మ సార్వజనీనత.
గ్లోబలైజేషన్ గురించి చెప్తారా?
తెలుగులో కృశించిపోతున్న పత్రికల్ని బట్టి పాఠకులు తగ్గుతున్నారు.పాఠకులు తగ్గితే రచయితలు తగ్గుతారు. T.V.చూడడానికి కూడాTime లేని సందర్భంలో కథలు చదువట్లేదు.
సమాజం పరిణామం చెందుతున్నదనుకుంటే ఈ పరిణామాలు సహజం. గ్లోబలైజేషన్ అంతటా ఉన్నది. దోపిడీవ్యవస్థ అధికంగా ఉన్నది. ఇక్కడి వనరులు super power చేతిలొకి వెళుతున్నాయి. వారి ఆర్థిక రాజకీయ పరిపాలన సాగుతున్నది. కొందరు వ్యతిరేకించవచ్చు. వారిని సమర్ధిస్తూ కథలు వ్రాయవచ్చు.
I.T లో పనిచేసే వారి దృక్పథం వేరుగా ఉంటుంది. కాబట్టి వారి కథలు రావచ్చు.
మంచి కథలు ఎక్కడ వస్తున్నా వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. సమాజంలో మార్పులకు అనుగుణంగా కథలు రావాలి.
ఉదాహరణ కు 1926లో చలం తరువాత కథ బాగుంటుందా అనుకున్నారు.మంచికథలు వస్తాయో,రావో సందేహించారు.మనుషులున్నంత వరకు కథలుంటాయి. మనుషులు తమ అనుభవాలు వేరోకరికి చెప్పుకోవడానికి కథలు అవసరం.
మీ దృష్టిలో భారతీయ సాహిత్యంలో పేర్కొన దగిన రచయితలు ?
మహాశ్వేతాదేవి ఇష్టమైన రచయిత్రి. బడుగు వర్గాల గురించి రాయడమే కాదు. ఆమె కథ బాగా చెప్పగలదు.శివరామ్ కారంత్, జయకాంత్ (తమిళ్), ప్రేమ్ చంద్, శరత్ , ఠాగూర్ , జయేంద్ర కుమార్ వీరంతా మా ఎదుగుదలలో బాగమైన రచయితలు.
ప్రపంచ కథకుల్లో మీరు ఇష్టపడ్డ రచయిత?
చాలా మందేఉన్నారు. ఐజక్ బషేవిస్ సింగర్ ఇడ్డీస్ భాషలో రాస్తాడు (దీన్ని అరబిక్ లిపిలో రాస్తారు. యూరప్ లో ఉండే యూదులు మాట్లాడుతారు). ఇతను రాసిన Gimpell the fool అనే కథ బాగా నచ్చింది.1952 లో వెంటనే అనువాదం చేసాను. వెర్రి వెంగలప్ప పేరుతో (విపులో) అచ్చయింది. అందులో ఒక అమాయకుడుంటాడు. మూర్ఖుడు కాకపోయినా అమాయకుడు. అందరు అతన్ని మోసం చేస్తారు. అప్పటికి అనేకమందితో సంబంధం ఉన్నఆమెను కన్య అని చెప్పి పెళ్ళి చేస్తారు. పుట్టిన బిడ్డలు కూడ అతనికి సంబంధించినవారని నమ్మిస్తారు. ఇదంతా తెలిసీ వాళ్ళు నన్ను ఫూల్ చేయాలని చేస్తున్నారు. వాళ్ళకి ఆ సంతోషం మిగిలని అని ఆ అమాయకుడు ముగిస్తాడు. దాంట్లోనే’ ఆధ్యాత్మిక సాఫల్యత’ఉందనే నమ్మకంతో ముగిస్తాడు. నాకు ఆధ్యాత్మికత మీద నమ్మకం లేకపోయినా కథ చెప్పడంలో సింగర్ ఉత్కృష్టుడు అని బోధపడింది.
కథా సాహిత్య విమర్శ ఆశించిన స్థాయిలో ఉన్నదా?
కథా సాహిత్యం ఉన్నది. విమర్శా సాహిత్యం ఉన్నది. ఈ విమర్శ ఎవరికోసం , పాఠకుల కోసమా? రచయిత కోసమా? చారిత్రక దృక్పథంతో చేసిన విమర్శనా ? కథా సాహిత్యం, అంతఃపరిశీలన అనుకుంటే విమర్శ ఎంత దోహదం చేస్తుంది.విమర్శ చదివి కథా రచయితలు తమ రచనలు మార్చుకుంటారా అంతర్ పరిశీలన చేసుకుంటారా?రచయిత
నిజాయితీ ఉండే రచనలు చేస్తున్నాడా?అనేవి ఇక్కడ వేసుకోదగిన ప్రశ్నలు.
కథల్లో మీరాశించే వైవిధ్యాలు?
వైవిధ్యం అనిపించడం లేదు. మధ్య తరగతి జీవితాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వైవిధ్యమైన జీవితాన్ని రచయితలు పట్టుకోలేకపోతున్నారు.. అనుభవించడమే కాకుండా ప్రేరణ పొందాలి. . మూసలో పడితే వైవిధ్యం తగ్గుతుంది.
కోస్తాలో కథ చచ్చిపోయిందా ?
ఆ దృక్పథంతో ఎందుకు చూడాలి. ఉద్యమం గురించి, ఉద్యమంలో లేని వాడు కూడ కథ రాయవచ్చు. ప్రేరణగా రాయవచ్చు.
కథా శిల్పం గురించి చెప్తారా?
శిల్ప పరంగా వస్తు చర్చ జరగాలి. మనదగ్గర develop అయిన శిల్పం ఉండవచ్చు. ప్రపంచ దేశాల శిల్పం చదివి ఉపయోగించవచ్చు. శరీరం, శరీరం వేసుకున్న దుస్తులు_శరీరం మంచి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే మంచి శిల్పం ఉంటే బాగుంటుంది . వస్తువును తీసుకోవడంలో రచయిత ప్రతిభ లేదు. ఉదాహరణకు వంట ఏవిధంగా వండాము అన్నది ముఖ్యం. శిల్ప పరంగా నైపుణ్యం ఉంటేనే బాగుంటుంది. వస్తువు ప్రధానం కానీ, వస్తువును ఎంత బాగా చెప్పామన్నది ముఖ్యం. కథాకథనాన్ని సామర్థ్యంతో మెప్పించాలి.నాటకీయంగా మలిచి, ఆకర్షనీయంగా చెప్పడమే పాఠకునికి గీటురాయి. శిల్పప్రయోగం చేసిన Jame Joyce పుస్తకాలు మన చర్చకు అతీతమైంది.అక్కడ శిల్పం కేవలం భాషా నైపుణ్యం.
వస్తువు నచ్చడం అనేది అర్థరహితం. వస్తువును నాటకీయంగా ఎలా మలచాడు అనేది ముఖ్యం. కొన్ని సార్లు వస్తువు నచ్చక పోవచ్చు. ఉదాహరణకు రాజవంశాలు కీర్తిస్తూ వాడుక భాషలో బాగా చెప్పి ఉండవచ్చు. పీడితుల గురించి వ్రాసినపుడు కథ బాగుండకపోవచ్చు. కథ బాగా నచ్చితే నచ్చని వస్తువును కూడా బాగా రాయగలడు. వ్యాపార రచయితలు (సోమర్సెట్)మనకు నచ్చక పోవచ్చు. కానీ, కథ చదివిస్తుంది. మంచి వస్తువు, నైపుణ్యం రెండూ ఉంటే బాగుంటుంది. దానిని నాలుగు కాలాలు నిలిచే కథ అంటారు. వట్టికోట – ప్రజల మనిషిని సింపుల్ గా రాశారు.
మీరు కథ ఎప్పుడు రాశారు?
59 నుంచి కథ రాస్తున్నాను. 9వ తరగతిలొ వ్రాసాను గోలకొండ పత్రిక 59 మే లో అచ్చయ్యింది. ఇంటికి గోలకొండ పత్రిక వచ్చేది.నే రాసిన మొదటి కథ పేరు – స్వయం కృతాపరాధం . 150 కథలు రాశాను. “మిణుగురులు” బాగా నచ్చిన కథ. 78 లో వచ్చింది.థీమ్ – బ్యాంకులో ట్రేడ్ యూనియన్ బాగా నడిచేది. టీ , కాఫీల కోసం సహకార పద్ధతిలొ క్యాంటీన్ పెట్టుకున్నారు. బ్యాంకులొ మేము ఉద్యోగులం. క్యాంటీన్ ఉద్యోగులు ఉద్యోగుల కోసం పనిచేసే వారు .ఒకసారి క్యాంటీన్ కార్మికుడు వచ్చి అడిగాడు. పదిమందితో కలిసి సంఘం పెట్టుకున్నాం జీతాలు పెంచాలి సార్ అన్నాడు. ఒప్పుకోని పక్షంలొ సమ్మె చేసారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తారు. కాని వీళ్ళు సమ్మె చేస్తే ఒప్పుకొవడం లేదు. వీరికి కావలిసిన కాఫీ, టీలు ఇతర హోటల్ నుండి తెప్పించుకున్నారు. క్యాంటీన్ నడిస్తే అందులో కార్మికులకు పని దొరుకుతుంది తిండి దొరుకుతుంది.ఈ బ్యాంకు ఉద్యోగులు మేమే trade unionistలము మాతో పెట్టుకోవద్దని డిమాండ్ చేసారు . దాని చిత్రించడం కోసమే రచయితగా నేను ఆ కథ రాసాను.
మీరు ఇష్టపడి అమెరికా నుంచి తెచ్చుకున్న నవల గురించి చెప్తారా?
ఇటీవల చదివిన నవల “ఆంట్ వాన్ బ్లాయే” ఫ్రెంచ్ నవల paull nizarm రాశాడు. ఇతను సార్త్రేకు సహధ్యాయి. 1940 నాటి యుద్ధంలోమరణించాడు. దిగువ మధ్యతరగతి వ్యక్తి. కష్టపడి రైల్వేలొ ఉద్యోగం చేసి, బ్యాంకు బాలెన్స్ కూడాబెట్టి మరణిస్తాడు. ఒక లెవెల్లో కథ ఏమి జరుగదు. సెల్ఫ్ మేడ్ మనుషులు , వ్యక్తులు ఈ సమాజంలొ క్షుద్ర , కీటకాల కంటే ఎక్కువేం కాదు అనే అభిప్రాయం కల్గిస్తాడు. అదే రచయిత ప్రత్యేకత . అదే మార్కిస్ట్ దృక్పథానికి గీటురాయి.
ఎవరి ప్రమోషన్లు వారు తీసుకుంటున్నాం మనమందరం సామాజిక జీవులమే అనే అభిప్రాయం కలిగిస్తాడు.
సెర్వాంటెస్ – డాంకియోస్ 1505ల్లో వచ్చింది. స్పెయిన నవల. చాలా ఇష్టమైనది. ప్రబంధ సాహిత్యం వస్తున్న రోజులలొ ఆధునిక నవల పుట్టింది.చెహోవ్ అద్భుత కథలు రాశాడు . కాదేది కథకు అనర్హం అని చాలా కథలు రాసాను. అనువాదం చేసాను. 86లో మానేసి 2003 లో మళ్ళీ మొదలుపెట్టాను. అనువాదం నిరవధికంగా చేస్తున్నాను.
మీరు అనువాదాలు ఎక్కువగా చేయడానికి కారణం?
ఒకసారి చలసాని ఇన్ని పుస్తకాలున్నాయి కదా! మాకు అనువాదాలు చేయచ్చు కదా ! అన్నాడు. విపులతో ప్రారంభమైంది. నేను నా కోసం సరదాగా అనువాదం చేసుకున్నాను.ఆ తర్వాత ఇక పత్రికలకు పంపడం చేసాను. లూషున్, మేధావి-బానిస ప్రజాసాహితిలొ వచ్చింది.
విపుల రావడంతో రెగ్యులర్ గా అనువాదాలు వేసుకుంటున్నాం అనడంతొ అనువాదాలు చేస్తున్నాను. 2002 చివరిలొ వీక్లీలలొ కాలం రాసాను. నేను నాకు నచ్చిన కథలే అనువాదం చేసాను.
నేను అనువాదం చేసిన వాటిలో శిల్పం ప్రాధాన్యమైన కథలు కూడాఉన్నాయి. కొన్నిసార్లు శిల్పం మొహం మొత్తే విధంగా కూడా ఉండచ్చు. ఆ వస్తువుతో సహానుభూతి చెందినపుడే అనువాదం చేస్తాను. ఇగ్నేషియోసైలోన్ అనే రచయిత “ఫాంటమార్” ను 1934లో వ్రాసాడు.ఆయన దీన్ని వస్తు ప్రధానంగా రాసాడు. (Italian రచయిత) గ్రామంలొ రైతులు కాలువను మల్చుకొవడం తో విప్లవానికి దరి తీసిన పరిస్థితిని చక్కగా రాసాడు.
గ్లెఫ్స్ ఆఫ్ రాత్ -రచయిత జాన్ స్టీన్ బెక్ కాలిఫోర్నియాలొ పత్తి రైతుల ఆత్మహత్యల గూర్చి వ్రాసారు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు మనం అంటున్న corporate వ్యవసాయం లాగాcorporate వాళ్ళు పత్తి వేయాలని decide చేస్తారు. ప్రత్తి ఎక్కువగా వేస్తే లాభం వస్తుంది అని నమ్మబలుకుతారు. ఈ పరిస్థితిని అద్భుతంగా చిత్రించారు.
చలం fantasy లాగా రాస్తే, మనం రోజు చూసే జీవితంలో మామూలుగా తెలుసుకోలేని నిజాలను చూపించిన కొకుది గొప్ప శైలి.ఆయన శైలి అంతర్లీనంగా కలసిపోయి ఉంటుంది. ఎటువంటి ముగింపు ఇచ్చినా అది సహజమేమోనని మనకు అనిపిస్తుంది. ఆ కొస్తా జిల్లాల్లొ వ్యక్తులు ఇట్లాగే ఉంటారేమో అనిపిస్తుంది. ఆయన మార్కిస్టు విశ్లేషకుడే అయినప్పటికీ ఆ పద జాలం వాడలేదు. హేతుబద్ధంగా జీవితాన్ని కథలుగా మలచిన గొప్ప రచయిత కొకు. విరివిగా రాసిన వాడూ, ప్రపంచస్థాయిలో అన్ని రకాల ప్రక్రియలలో రాసినవాడూ కూడా ఆయనే. ఆయనలాగా సైన్సు , బాలసాహిత్యం, వివిధ రకాల ప్రక్రియలు విస్తృతంగా రాసిన తెలుగు రచయిత మరొకరు లేరేమో.
January 24th, 2010 at 11:12 am
ఇంతెర్విఎవ్ చాలా బావుంది. ఎన్నొ తెలియని విష యాలు చెప్పారు. ప్రానహితకు ధన్యవాదాలు.
January 27th, 2010 at 4:27 am
ఇంటర్వ్యు చాలా బాగుంది.
08680-275125
నల్లగొండ.
January 27th, 2010 at 4:29 am
వెముగంటి గారు,
నన్ను గుర్తుపట్టారా?