పడమటి నీడ

“కిలో వంకాయలెంత?” బుట్టలోని వంకాయల్ని తదేకంగా చూస్తూ అడిగింది ఒకావిడ.

అప్పుడే తెచ్చిన కూరగాయల్ని సర్దే పనిలో వున్న తను తల పైకెత్తి కస్టమర్ వైపు చూస్తూ , తను కొన్నరేటు, కొంత లాభం నోట్లోనే గుణించుకొని

“కిలో వంకాయలు తొమ్మిది రూపాయలు ” అన్నాడు.

“చానారేటు చెపుతున్నావే?” అంది.

“మార్కెట్లోని అన్ని కూరగాయల కొట్లలోని రేటుకంటే నాకొట్లోనే తక్కువ. నాకొచ్చిన రేటుకు రూపాయి లాభం వేసుకొని రేటు చెప్పానమ్మా, కావలిస్తే రెండు, మూడు కొట్లు తిరిగిరండి పదకొండు, పన్నెండు రూపాయలకు తక్కువ చెప్పరు” అన్నాడు.

“టమాటాలు?”

“మూడురూపాయలు” అన్నాడు.

అప్పటికే కొన్ని కొట్లు తిరిగి వచ్చినావిడ, మారుమాట్లాడకుండ రేట్లు మిగతా కొట్లల్లో కంటే తక్కువ వుండబట్టే రెండు, మూడు రకాల కూరగాయలు ఏరి, ఏరి కొనుక్కెళ్ళింది.

కూరగాయలు అమ్మిన రైతు కొట్టు పక్కనే వుండి ఇదంతా గమనిస్తున్నాడు. పచ్చి కూరగాయలు ఇట్లా అమ్మితే ఇతనికి ఎట్లా గిట్టుబాటవుతుంది. కుళ్ళిపోయినవి పడేయాలి, పుచ్చులు తీసేయాలి, కొట్టు కిరాయి తీయాలి. ఇవన్నీ పోంగ తనకు లాభం మిగలాలి. ఈ కొట్టు మార్కెట్లో చానారోజులు నిలవదని మనసులో అనుకుంటూనే వుండబట్టలేక “అయ్యా ! ఈ వ్యాపారానికి నువ్వు కొత్తా? ” అన్నాడు రైతు.

“అవును , ఈ పాటి అనుభవం చాలదంటావా? కూరగాయల వ్యాపారానికి ” అన్నాడు.

” ఇంత తక్కువ రేట్లకి అమ్మితే లాభాలెట్లా వస్తాయి? నీకెట్లా గడుస్తుంది??”. అని ఎదురు ప్రశ్న వేశాడు.

“లాభానికి మితమెక్కడ తాతా, ఎంత లాభానికి అమ్మితే నాకు సరిపోద్దో చెప్పు ?” అని ఎదురు ప్రశ్న వేశాడు.

“ఇతను పెడమతం మనిషి లాగుండే ” అని మనసులో అనుకొని తలకు చుట్టుకున్న తువ్వాలు తీసి దులిపి తలగోక్కుంటూ -

“సర్లే , నా పైసలీయి పోతా నీకు చెప్పేటంతటోణ్ణైతే బుడ్డగోసి పెట్టుకొని ఎద్దు ముడ్డెందుకు పొడుస్తా ?” అన్నాడు రైతు.

నవ్వుతూ రైతుకు డబ్బిచ్చి పంపేశాడు. రైతులకు గిట్టుబాటు ధరలకోసం, మార్కెట్లోని అధికధరలు తగ్గాలని ఎన్ని పోరాటాలు చేయలేదు. ఇన్ని రోజులు మాటలు చెప్పుకుంటూ తిరిగింది, ఇప్పుడు వ్యాపారస్తుడిగా మారిన తను అప్పుడన్న మాటలని కాస్తలో కూస్తన్నా పాటించకుండా వుంటే ఎట్లా ….? ‘లాభమో నష్టమో చూద్దాం ‘ అని మనసులో అనుకున్నాడు.

అనారోగ్యం పాలై దళంలో వుండలేక ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ‘జనజీవన స్రవంతి’ లోకి వచ్చాడు. రానైతే వచ్చాడు కాని ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సివచ్చింది. అనారోగ్యం, పూటగడవకపోవడం కష్టంగా మారింది. ఏదన్నా ఉద్యోగం చేద్దామంటే తన పేరు చెపితేనే ఎవరూ దరిచేరనీయడం లేదు. చదువుండి ఏమీ లాభం లేకపోయింది. అందుకే యాపారంలోకి దిగాడు, కూరగాయల కొట్టుపెట్టుకున్నాడు. నిత్యం మాయలు, మోసాలు ప్రతిసారి అబద్దాలు చెప్పాల్సిరావడం, లేకుంటే యాపారం నడపడం కష్టంగా మారింది. ఇలా రాజీపడుకుంటూ పోతే తను ఎక్కడికి పొతాడు. నిత్యం వేధించే ప్రశ్నలు చుట్టుముట్టేవి. చివరికి ఎటుకొట్టుకుపోతున్నాడో అర్థమైయేది కాదు. ఈ అర్థం కాని పరిస్థితులల్లో అమ్మ అన్న మాటలు, పాత జీవితం తరచూ గుర్తుకొస్తుండేది. ఙ్ఞాపకాల్లోకి జారిండు.

తన వూరు చెరువు కట్టమీద మైసమ్మ చింతచెట్టుకి తనకూ మహా దొడ్డ పేగు బంధం. అమ్మకడుపులో పడ్డప్పుడూ ఈ చెట్టువే పుల్లటి, తియ్యటి చింతకాయలు తిన్నదట. ఈ వరిమళ్ళలోని నల్లరేగడు మట్టిపెళ్ళలు బియ్యంలోనివి ఏర్కోని తిన్నది. అందుకే ఈ భూమన్నా, ఈ ప్రకృతన్నా పెనవేసుకొని పోయే అభిమానం కల్గినాయిరా బిడ్డా అంటుండేది. తమ్ముడి కొడుకుని ఎత్తుకొనబోయి కిందపడింది. తొంటి విరిగి మంచాన పడింది. అమ్మదీనమైన పరిస్థితి గుర్తుకు వచ్చినప్పుడల్లా దుఃఖం కట్టలు తెగేవి. ఈ కన్నీళ్ళే తనకు లేకుంటే ఈ మార్గం పట్టేవాడేనా ? మానవజాతి పట్ల మమకారంవుండబట్టే గదా, ఈ కష్టతరమైన దారిని ఎన్నుకున్నది. ఇట్లా ఆలోచించి , ఆలోచించి వుద్వేగానికి గురౌతూ చిన్న పిల్లాడిలా ఏడుస్తడు. ఎందరో సహచరులు భుజం తట్టి నిలబెట్టే వారు. తనలాగే అందరిదీ ఒక్కో కోణం. దుఃఖమడి తడీ చరిత్ర. ఈ తడి ఇచ్చిన స్పూర్తే తపంచాలు , కిట్ బ్యాగ్ బరువులతో నిత్యం కొండకోనల, వాగువంకల మధ్య జీవనం. పస్తులు సరే, జబ్బు చేస్తే మందులు లేని దీనస్థితి. జబ్బు చేసినప్పుడల్లా వైద్యం లేక ప్రతిచిన్న రోగం తారాస్థాయికి చేరుకునేది. చివరికి జలుబు , దగ్గు కూడా తమ ప్రతాపం చూపి సత్తాచాటుకునేవి, ఆ మధ్య కడుపునొప్పికి తట్టుకోలేక గిల,గిలా తన్నుకునేవాడు కృష్ణారెడ్డి,. ఆ నొప్పితోటే అడవిలోనే చనిపోయాడు. తెల్లగా, బక్కపల్చగా వుండేవాడు.సిటీలో తల్లికి కబురెప్పటికి అందిందో, ఆ పేగుబంధం ఎంతగ తలడిల్లిందో అనుకున్నప్పుడు తీరని వ్యధ.

ఈ పరిస్థితి ఎదురైనప్పుడల్లా మనసులోనే కారల్ మార్క్స్ కు సెల్యూట్ చేసేవాడు.పీడితుల పట్ల,మానవ సమాజం పట్ల ఎంతో ప్రేముంటేనే గదా జీవితాన్నంతా ఖర్చుచేసి, సమాజానికి పీడన, దౌర్జన్యాలకు తావులేని జీవనానికి మార్గం చూసే సిద్ధాంతాన్ని ప్రజలకు అందించిండు.కొంతలో కొంతనైన ఆ నిజాయితీ, నిబద్ధత వుండబట్టే గదా తను, తనలాంటి వారు మార్క్స్ కన్న కలలు నిజం చేయడానికి ఇటు వచ్చింది.

చదువుకున్న రోజుల్లో చలం రచనలు ప్రతి పుస్తకం చదివాడు. ఆ రాతల్లోని ఆదర్శం వంటపట్టించుకుని, జీవితంలో స్త్రీ జాతికి చీమకుట్టినంత హానైనా తనవల్ల కలగనీయవద్దని ప్రతిన పూని .తనతో కలిసి చదువుకున్న పిల్లనే ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.

సాహిత్యం ఇచ్చిన స్ఫూర్తితో పరస్పరం గౌరవించుకోవడం, ఇది తన పని , ఇది నా పని అనే తారతమ్యాలు లేకుండా ఇద్దరూ ఎవరు ఖాళీగుంటే వాళ్ళు పనులు చేసుకుంటూ పోతున్నారు.

తను ఆమె బట్టలుతికిండు, అంట్లుతోమిండు ఏమీ అవమానంగ భావించలేదు. పెళ్ళినాడే పార్టీలోని పెద్దనాయకుల అడుగుజాడలో నడువాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని, పిల్లలు పుడితే స్వార్థం పెరిగిపోయిద్దని, ఉద్యమంలో వుండి పిల్లల్ని పెంచటం కష్టమని భావించి, స్త్రీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తే అనారోగ్య పరిస్థితులు సంభవిస్తాయని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు తనే ఆపరేషన్ చేయించుకున్నాడు. ప్రదర్శనలకని, ధర్నాలకని చాలాదూరం నడవాల్సి వచ్చేది. అలా నడిచినపుడు చాల అలసిపోయే వాళ్ళం. అదో అంకితభావం, నచ్చిన దార్లో అలసిపోయేంత వరకు నడవడం, శ్రమించడం బాగా నచ్చేది. సంతృప్తి నిచ్చేది.

పి.వి ప్రవేశపెడుతున్న నూతన ఆర్థిక విధానంపై తడబడుతూ మాట్లాడుతున్న కాలం . వాటివల్ల దేశంలో రాబోతున్న జరగబోతున్న పరిణామాలకు కోట్లాది మంది భద్రజీవితాన్ని తుంచి ప్రైవేటీకరణ , కాంట్రాక్టీకరణ చట్రం బిగుస్తున్న కాలం. గ్లోబలైజేషన్ తెస్తున్న అనేక కొత్తకోణాలు , మారుతున్న పరిస్థితుల పట్ల జనం ఆకర్షింపబడుతూ అటు మొగ్గు చూపడంతో ఏర్పడ్డ తీరిక. కాలం చెల్లిపోవడాల డొల్లసిద్ధాంతాల పుట్టుక, మనుషులను ముక్కలు, ముక్కలుగా విభజించి చూసే పోస్టుమాడర్నిజం పుట్టుక, ప్లాస్టిక్ మమకారాలు, టెస్ట్ ట్యూబ్ బేబీల కేరింతలు . సర్రోగేట్ మదర్స్, ఇల్లులా గర్భసంచుల్ని అద్దెలకిచ్చే కాలం. మనుషుల మధ్య కృత్రిమ ప్రేమలు , మనసుల మధ్య బంధాలు తెగుతున్న కాలం, ఏక ధృవ , ఏక పక్ష పాలన, ఆర్థిక వ్యత్యాసాలు, నిరుపేద దేశాల దోసిళ్ళనిండా శవాల సమూహం. నిర్భాగ్యుల అస్తికల శకలాల మధ్య మృత్యురుతువు. ఈ దశలో గ్లోబల్ వార్మింగ్ లాగ తనలోని క్షయ ముదిరిపాకాన పడింది, రహస్య జీవితం సాధ్యం కాదని శరీరం మొరాయించింది. అందుకే ‘జన జీవన స్రవంతి’ ని ఆశ్రయించి వెలుపలికి వచ్చాక చాన దినాలకు ఆరోగ్యం కుదుటపడింది.

జనజీవన స్రవంతి నడుస్తుంది, ఏదో సమ్మోహన శక్తి ఈడ్చుకొని పోతుంది. అయిష్టంగా నైనా డొల్లుకుంటూ గ్లోబల్ ప్రగతిలోకి ఇమడాలని చూస్తుంది. ఈ తీరిక సమయాల్లో మెల్ల, మెల్లగా మా కాపురంలోకి బిడ్డల గురించి చర్చ చొరబడింది.

“బిడ్డలు, బిడ్డలు. బిడ్డలు వద్దనుకున్నాం కదా !”

“మూర్ఖులం, చిదిమితే పాలుకారే బుగ్గలు, వచ్చీరాని నత్తిమాటలు , సుతిమెత్తని అడుగుల సవ్వడికి రాళ్ళుకూడా కరుగుతాయంటారు ” అనేది.

పూర్తిగా కరిగిపోయింది నీహారిక. చర్చ మొదలవుతుంది. ఇద్దరం చాలాసేపు వాదులాడుకొని మరి కొంతసేపు మౌనంగా వుండిపోయే వాళ్ళం.

ఎవరన్నారు అడ్డంకని, ఎవరు కనిపెట్టారు, బిడ్డలంటే స్వార్థమని , పక్షుల్ని చూడండి దేశాల్నే కాదు ఖండ ఖండాలు దాటి చెమటోడ్చి ప్రయాణం కట్టివస్తాయి. ఎంత శ్రమ చేస్తాయి. అన్నపానీయాలు మాని పిల్లల కడుపులు నింపే కష్టమేనా స్వార్థమంటే ” అనేది

ఎన్నోసార్లు రెండుగా విడిపోయాం, మళ్ళీ కలిసే వాళ్లం. కలవడం ఎవరికో భయపడికాదు, ఏదో అనుకుంటారని కాదు. చర్చలు , చర్చలు రాత్రీ పగలు , సాయంత్రపు అస్తమయాలు. వాగుల దగ్గర, వంకల దగ్గర చర్చలు. చర్చలు తేలకుండానే ప్రయత్నాలు మొదలైనాయి. ఎన్నో వైఫల్యాలు గాయాలై పోయాం.

చెట్లకు అంటు కట్టినట్టు మనుషుల్లోనూ వుంటే బాగుండుకదా, అంటూ , అంటు గురించిన ఎన్నో పద్దతులు , మనుషుల్లోనూ అంటుకట్టే పద్ధతి డోనార్ . నూతన ఆర్థిక పరిణామల్తో పాటు నూతనంగ డోనార్స్ పుట్టుకొచ్చారు. సంతానం లేక బాధపడుతున్న వారికి ఇదో సదవకాశం, మనుషుల్లోనూ అంటు కట్టే పద్దతి. “ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ గురించి మాట్లాడుతున్నంత తేలిగ్గ కృత్రిమ గర్భదారణల గురించి కుటుంబాల్లో మాట్లాడుకోవడం కన్పిస్తుంది” అనేది.

“జీవితానికి అర్థం ఏమిటి ? తనకోసం తను బతకడమేనా, పిల్లలు కని తల్లిదండ్రుల, పెళ్ళాం రోగాలు , రొష్టులకు ఇక బతికినంత చాల్లే అని విసిగివేసారిపోయి కడతేరిపోవడమేనా చెప్పు ” అనేవాడు.

“బంధాల్ని తెంచుకుని బ్రహ్మచారిలా బ్రతుకుతూ ప్రజలకోసం పనిచేయడంలో స్వార్థం లేదా? పెత్తనం కోసం, గ్రూపు రాజకీయాలు, హత్యలు ఏ ప్రజలకోసం ఎవర్ని వుద్దరించడానికి . అందరూ అదే దారిన పడితే మరి మనిషి మనుగడ ? మానవజాతి అంతరించి పోవడమేనా? పిల్లలు స్వార్థానికి ప్రతీకలు అని పిల్లలు వద్దనుకున్న వాళ్ళే పిరికివాళ్ళు , భయస్తులు ” అన్నది మళ్ళీ తనే.

“మానవీయ కోణం నుంచి తర్కించి విశ్లేషించాలి. గుడ్డెద్దు చేలోపడి మేసినట్లు గొర్రెదాటుడు పద్ధతి ఏ సమాజానికి మంచిది కాదు” అన్నది.

“వాళ్ళ చిన్ని , చిన్ని పాదాలు గుండెలను మెత్తగా వత్తుతూ, వాళ్ళు కొట్టే కేరింతలు వసంత కాలంలో చెట్లు చిగిర్చే లేత ఎర్రని చివురుని ఎప్పుడైనా తాకి చూస్తే ఆ స్పర్శలోని అమృతత్వం బోధపడితే భూమ్మీద నాజీల పుట్టుకే వుండదు.” అన్నది. నీహారిక ఆ అమృతం మనసు నిండా తాగే తపనలో ఎన్నో గొడవలు పడ్డది చివరికి ఔట్ సోర్సింగ్ తో నైనా పిల్లల్ని కంటానన్న నీహారిక అభిప్రాయాన్ని కాదనలేక పోయాడు తను.

* * * * * * * *

ఆ రోజు తనకి బాగాగుర్తు , డాక్టర్లు చేయాల్సింది పనిపూర్తి చేసి నాలుగు రోజుల తరువాత నీహారికని ఇంటికి పంపించారు.ఇద్దరూ రానైతే కలిసే వచ్చారు, కలిసివుండే వాళ్ళుగా లేరు.భిన్న ధృవాల వ్యక్తులుగా అపరిచితుల్లా మిగిలారు.ఇంటికి వచ్చినంక నీహారికను వంటరిగా వదిలేసి ఏదో పని కల్పించుకుని పనిలో మునిగినట్లు నటిస్తుండు. నీహారిక ఇదేమి పట్టనట్టు మంచంమీద పడుకొని పొట్టపై చేయితో మృదువుగా స్పర్శిస్తూ ఏదో తన్మయత్వంలో కళ్ళుమూసుకొని పొట్ట నిమురుకుంటుంది. తను గదిలోకి వచ్చిన అలికిడి విని “ప్రసాద్ ఇటురా నా దగ్గరికి ” అని పిల్చింది, కళ్ళు తెరవకుండానే.

“ఏమిటి? ” అని యాంత్రికంగ కదిలి మంచంపై నీహారిక పక్కన కూర్చున్నాడు. ” ఎలా ఫీలౌతున్నావు ?” అంది.

“మామూలే , ముందుగా అనుకున్నదేగా “. అన్నాడు ముక్తసరిగ. కళ్ళుమూసుకొని వుంది కాబట్టి బతికిపోయాడు. మనసులోని అయిష్టతను, ఓ విధమైన వెల్తి భావం చేయి స్పర్శలో కనపడకుండా జాగ్రత్తపడ్డాడు. నీహారిక అలా చాలా సేపు మౌనంగా కళ్ళు మూసుకుని పడుకుంది.

రోజులు , వారాలు , నెలలు గడుస్తున్నాయి. తను జీర్ణించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ ఒక్క అయిష్టత నీహారిక కండ్లపడకుండా చూసుకుంటున్నాడు. మనసు నుండి పూర్తిగా తీసేయలేకపోయాడు. నీహారిక పొట్ట పెరుగుతుంది. డాక్టర్ల దగ్గర చెకప్లకి పోయివస్తున్నారు, తను రొటీన్ పన్లలో పడ్డాడు.

కొన్ని రోజుల్లో ఇద్దరి మధ్యకు ఓ చిరుప్రాణి , నీహారిక సంతోషానికి అవధుల్లేవు ఎప్పుడూ పిల్లాడి ధ్యాసే , అచ్చు నీహారిక ముఖంలోంచి వూడిపడ్డట్టు వు న్నాడు. ఇద్దరి మధ్య పిల్లాడి రాకతో మాటలు తగ్గినాయి. నీహారిక చర్యలు , దిన చర్యల్లో మార్పొచ్చింది. ఇద్దరి మధ్య ఎడం పెరిగింది. గతంలో చాలా సూర్యాస్తమయాలు వూరి బయటకు పోయి గడిపేవాళ్ళు. అలాంటి ఆప్త అస్తమయాల గురించి కోరినా తన నుంచి ప్రోత్సాహం లభించేది కాదు. వంట్లో బాగుండలేదనొ, మనసు బాగోలేదనో దాటవేయడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య తెరలు, భావాల మధ్య అంతరాలు. గులాబీ పువ్వుకు రక్షణ ముళ్ళ వలయం…. తల్లిదండ్రులే కదా ? ఏదో అపనమ్మకం . బాహ్య పరిస్థితులనుంచా, అంతర్ముఖం నుండి తలెత్తే సమస్యమ నుంచా? ఏదో మనస్సులో పేరుకొని వుండి వుంటుంది. అందుకే పిల్లాడిని ఎప్పుడూ నిండుగా గుడ్డలు కప్పి దేన్నుంచో దూరంగ వుంచాలని చూస్తుండేది.

సిటీకి వెళ్ళి మూడురోజులయింది. తెల్లవారు ఝామున బస్సుదిగి ఇంటికి వచ్చాడు.తలుపుకు తాళం వేసి కనబడింది. ఎటు వెళ్లిందబ్బా అనుకుంటూనే కిటికీపైన వున్న వెంటిలేటర్ లో చేయి పెట్టి తడిమాడు చేతికి తాళం చేయి తగిలింది. తలుపులు తీస్కోని లోనికి వెళ్ళాడు. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూనే వుంది. ఫ్యాను కూడా ఆఫ్ చేయలేని అర్జెంట్ పనేముంది అని తలగోక్కున్నాడు. పిల్లాడికి ఏమన్న హఠాత్తుగా జబ్బు చేసిందేమో హాస్పిటల్ కు పోయే తొందరలో మర్చిపోయి వుంటుందనుకున్నాడు. ఫ్యాను గాలికి టీపాయి మీదున్న తెల్లటి కాగితం తన వునికిని చాటుకుంటూ కన్పించింది. టక్కున చేతుల్లోకి తీసుకున్నాడు. అక్షరాలు మసకబారుతున్నాయి. తను తప్పుగా చూస్తున్నాడేమోనని కళ్ళు నులుముకొని కనురెప్పలను పెద్దగా తెరుస్తూ చదివాడు. విషయం మారలేదు, మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. ఎన్నోసార్లు చదువుకున్నాడు, చిన్నగా నిశ్చలంగ వున్న చెరువులో రాయి పడ్డట్టయి అలలు మొదలినాయి. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవాడు. శత్రువు అధునాతన ఆయుధాలతో వెంటాడుతుండగా, కుందేలు పిల్లల్లా చటుక్కున తప్పించుకొని శత్రువు కళ్ళుగప్పి , చిటికెలో మాయమైన మెళుకువ తెల్సినవాడు. నిశ్చేష్టుడై రాయిలా మారాడు. పడమటి నీడ దట్టంగ విస్తరిస్తుంది.

నీహారిక రాసిన వుత్తరం చేతిలోనే వుంది, చాలా భారంగా వుంది . మళ్ళీ చదివాడు.

మైడియర్ ప్రసాద్ !

మునుపట్లా నీతో వుండలేక పోతున్నాను. ఇక వుండలేనేమోనని అనిపించింది. ఇంటికి వచ్చిన వాళ్లందరితో ‘పిల్లాడి నాన్న ఎటు వెళ్ళారు ‘ అని ఇరుగు పొరుగు అడుగుతున్నప్పుడల్లా, వాడిని నీ బిడ్డగా చూళ్ళేక, చెప్పలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా , బాబుపట్ల నీలోని కనబడీ కనపడనట్లున్న అయిష్టత ఎంతో కొంత నాలో సెగపెడుతూనే వుంది. గ్లిజరిన్ కన్నీళ్ళు ఎంతకాలం ప్రవహిస్తాయి? నీ ప్రేమా అంతే. మరీ రచ్చకెక్కి, పోట్లాడుకొని విడిపోవడం నాకు ఇష్టముండదు. బాబుని, నన్నూ పోషించుకోలేని దాన్నేం కాదులే. చదువుంది కదా, అది కష్టపడి మమ్మల్ని పోషిస్తున్నట్టు నిష్టూరపడదు. బాబులాగ అదీ నాలో భాగమే. నీ…. సారి.

–నీహారిక

ఎన్నిసార్లు చదువుకున్నాడో అర్థం మారడంలేదు, ఎన్నిసార్లు మర్చిపోవాలని అనుకున్నా మరిచిపోవడం సాధ్యం కావడం లేదు. ధోకేబాజ్ తనం, అతుకుల బతుకులు . ఎవరిది? వెంటాడే ప్రశ్న, వేధించే ప్రశ్న. సమాధానం ముందు వేల ప్రశ్నల ఘర్షణ ఇదీ జీవితం.

జనజీవన స్రవంతిని ఎవరో హైజాక్ చేస్తున్నారు. తినిపెట్టే కళ జీవితాల్లో వేళ్ళూనుకుంటుంది.

గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. చమర్చిన కళ్ళను తుండుతో వత్తుకుంటూ కూరగాయలు సర్దేపనిని మొదలుపెట్టాడు.

2 అభిప్రాయాలు »కథలు

2 Responses to “పడమటి నీడ”

  1. 1
    geetanjali Says:

    జన జీవన స్రవంథి లొకి వచాక కూదా ప్రసాద్ కి దొరకని బధ్ర జీవనపు అసాంతిని..ఇద్దరి వ్యవ్య్క్తిత్వాల్లొని ,తెదాలను అర్ద్రంగ చూపారు హనీఫ.ఉద్యమమ్ నుంచి బయట్కు వచాక ,,రాజ్య హింసతొ సతమతమయ్యె కథా వస్తువుకి భిన్నంగా ఉందీ కథ..ఐతె,,సర్రొగెతె త్ల్లులు..క్రుత్రిమ గర్భధారనకు ,,కరనాలు..ఆర్థిక వ్య్త్యాసాల్ల్ల్లొనె ఉన్నయన్న సంగతి మరిచారు రచయిథ..కథ అసమ్పూర్నంగ ఉంది ..నీహారిక నిర్నయమ్ అమలు,,చివరికి ,,సమాజమ్ వెసిన ప్రస్నలకు సమధనమ్ చెప్పుకొలెక ఆమె ,,ప్రసాద్ ని విదిచి వెల్లదమ్ పరిష్కరంగ చుపదమ్ ,,ఆమె చైతన్యాన్ని ప్రస్నిస్థుంది,, ఒక మంచి ప్రయథ్నమ,,అభినందనలు,,గీతాంజలి

  2. 2
    ప్రాణహిత » ప్రాణహిత జనవరి 2010 సంచిక Says:

    [...] పడమటి నీడ – హనీఫ్ [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో