పోరు తప్పదా !

రోషన్ మామగార్ని ఆదివారం రాత్రి పదిగంటలకు ఇంటికి పిలిపించమని తండ్రికి చెప్పాడు. అప్పుడు అమెరికాలో అతనికి ఆదివారం పొద్దున తొమ్మిది గంటలు అప్పటికి నిద్ర నుంచి లేవాలి! శనివారం తొందరగానే పడుకున్నాడు. తండ్రి మామగార్ని గురించి చెప్పిన దగ్గర్నుంచి అతనికి ఒళ్ళు మండిపోతున్నది సంధ్య మీద కోపంగా వున్నాడు. ఆమెతో మాట్లాడలేదు శనివారమంతా.
“ఏమో ! సీరియస్ గా వున్నాడు. ఆఫీసులో పని ఎక్కువై అలసిపోయాడేమో ! ” అనుకొని ఏం అడుగలేదు సంధ్య. ఆమే అలసిపోయివుంది. మాట్లాడే ఓపిక లేదు.
వాళ్ళ పెండ్లయి ఆరునెల్లు కూడా కాలేదు. పెండ్లికని ఇండియా పోయి ఇద్దరు మూడు వారాలు కూడాలేరు. ఇద్దరికీ సెలవులేకపోవటంతో ఎక్కువ రోజులుండలేక పోయారు.
సంధ్యకు స్కాలర్ షిప్ తో కొలరాడో విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎస్. చేయటానికి అడ్మిషన్ వచ్చినప్పట్నుంచి తల్లి ఆమె పెండ్లి చేసుకుంటేనే గాని ఆమెరికా పోవటానికి వీల్లేదని మొదలు పెట్టింది. ఇంతలో వీసా కూడా వచ్చింది. అయినా తల్లి పెండ్లి, పెండ్లి అని కలవరించటం వదలలేదు.పెండ్లి సంబంధాలు చూస్తుంటే పెళ్ళి కావలసిన మగపిల్లలంతా అమెరికాలోనె వున్నట్లనిపించింది ! అమెరికాలో కొడుకులున్న తల్లిదండ్రులను కలిసి మాట్లాడాడు తండ్రి.
“మా అమ్మాయి పెండ్లి చేసుకునే అమెరికా పోవాలని మాకు ఇష్టమండి “అన్నాడు సురేశ్. ఏదైనా దారి చూపమన్నట్లు అతని గొంతు  వేడుకుంటున్నట్లుగా వుంది. ” ఇప్పుడే రమ్మనటం ఎట్లా వీలవుతుంది. మీ అమ్మాయి ఫోటో ఇచ్చిపొండి. అబ్బాయికి పంపిస్తాం.  నచ్చితే చూద్దాం” అందరిమాట అదే !
సంధ్య స్టూడియోకి తీసుకుపోయి పెండ్లి చూపులకని ఫోటోలు తీయించింది తల్లి రమ. సంధ్య ‘ రోజూ ఎట్లా వుంటానో అట్లానే ఫోటో దిగుతానంటే ‘ రమ ఒప్పుకోలేదు. పట్టుచీర కట్టించింది. కొంచెం మేకప్పు వేయించింది. ఫోటోలు రెండు – ఒకటి క్లోజప్ లో మరోటి నిలబడ్డ ఫోజులో తీయించింది. సురేశ్ తీసుకుపోయి రెండు రెండు ఫోటోలు ఇచ్చి వచ్చాడు. మ్యారేజ్ బ్యూరోల్లో రిజిస్ట్రేషన్ చేయించి అక్కడా ఫోటోలు ఇచ్చాడు. ” వారం రోజుల్లో పెండ్లి సెటిల్ అయిపోతుందండి !” అని భరోసా ఇచ్చారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు . ఓ  వారం రోజులు చూసి మగపిల్లల తల్లిదండ్రులను కలిసాడు. ఇప్పుడే పెండ్లి గురించి ఆలోచించటం లేదంటున్నాడండి అన్నారు. మ్యారేజ్ బ్యూరోవాళ్ళు “ఇంత తొందర పడితే ఎట్లా ?” అన్నారు విసుగ్గా. . ఆ మాట రిజిస్ట్రేషన్ డబ్బు తీసుకుంటున్నప్పుడు అనలేదు. ఇంతలో ఎవరో వార్త అందించారు ‘అమెరికాలో వున్న కొడుకు కోసం పిల్లను చూస్తున్నారు తల్లిదండ్రులని ‘. సురేశ్ ఆలస్యం చేయకుండా పోయి వాళ్ళను కలిసాడు.
” మీ కెవరు చెప్పారండి మా గురించి ?” అనుమానంగా ముఖం పెట్టి అడిగాడు తండ్రి. సురేశ్ చెప్పాడు.
“హా ! వాళ్ళు చెప్పారా !…….సరే ! మీరేం చేస్తుంటారు ?” అడిగాడు సురేశ్ ను పరిశీలనగా కిందికి మీదికి చూస్తూ.
సురేశ్ చెప్పాడు.
“హా ! మీరు ఆఫీసరేమో అనుకున్నాను. మీది సొంత ఇల్లేనా ?” మళ్ళాఅడిగాడు. ఈ సారి అంతగా మంచి జవాబు వస్తుందని అతడు అనుకోవటం లేదని అతని ముఖమే చెప్తున్నది. అతని ముఖం చూస్తేనే సురేశ్ కు అక్కడ్నుంచి పారిపోవాలనిపించింది. కాని పోలేక పోయాడు . సురేశ్ చెప్పాడు.
“వందగజాల్లో ఇల్లు కట్టుకున్నారా ! అందులో ఒక పోర్షన్ కిరాయిక్కూడా ఇచ్చారా ! బాగుంది. ఫోటో ఇచ్చి వెళ్ళండి. అబ్బాయిని కనుక్కుంటాం ” అన్నాడు. సురేశ్ ఫోటోలు ఇచ్చి కదిలాడు. మళ్ళీపోయి కనుక్కొనే ధైర్యం లేకపోయింది.
“ఎందుకు కనుక్కోవటం లేదండి ?” రమ నిలదీసి అడిగింది అతన్ని . సురేశ్ ముక్కుముడిచాడు.
“ముక్కులు మూతులు విరిస్తే సంబంధం కుదరదండి. ఆడపిల్ల వాళ్ళం . నాలుగు సార్లు తిరగాలె. అది అవమానమనుకుంటే ఎట్లా ? పెండ్లి చూపులని ఎంతమంది వచ్చి నన్ను చూడలేదు ! మా అమ్మ వచ్చిన వాళ్ళకు ఫలహారాలు చేసి చేసి విసిగిపోయింది. ఎందరో చూసిన తర్వాత మీరు వచ్చి సరేనన్నారు. మరి ఆడపిల్ల  అన్న తర్వాత నాలుగు గడపలెక్కాలె దిగాలె !” అంది రమ తన ఆరాటాన్నంతా భర్త మీద చూపిస్తూ, సంధ్య అక్కడే వుంది . తల్లి మాటలు వింది.
ఏందమ్మా ! ఆడపిల్లని కని అంత లోకువ కావాలా ? నాన్నా ! నేను చదువుకున్నాను. అమెరికాకు పోతున్నాను. మగవాళ్ళతో సమానంగా అక్కడ ఉద్యోగం చేస్తాను. అయినా మీరు నా పెండ్లి విషయంలో ఇంతగా చింత పెట్టుకోవటం , సంబంధాలు చూస్తూ తిరగటం నాకేం నచ్చలేదు ” తీవ్రంగా  వుంది సంధ్య గొంతు.
“సంధ్య ! నీకేం తెలియదు ఊరుకో . నువ్విట్లా మాట్లాడితే నీకు పెండ్లి అయినట్లే !” అంటూ రమ సంధ్య నోరు మూయించింది. సంధ్య కండ్లల్లోనీళ్ళు నిండాయి.
నాకూతురు అనేది నిజమేనే . అది ఇంజనీరింగు చదివింది. సొంత ప్రతిభతో స్కాలర్ షిప్ తెచ్చుకొని అమెరికా పోతున్నది. రేపు ఉద్యోగం చేస్తుందక్కడ. ముక్కు మొఖం రంగు దేనిలో తీసిపోకుంట వుంది. దానికేం తక్కువని అవమానాలన్నీ భరించాలె !” కోపంగానే సురేశ్ గొంతు లేచింది.
” మీకు ఒక కొడుకున్నాడు కదా అమెరికాలో. వాడి పెండ్లప్పుడు మీ దర్జాదర్పం చూపిద్దురుగాని ! ఇప్పుడు కాదు ” రమ కోపంగా లేచి అక్కడ్నుంచి వెళ్ళొపోయింది.
సురేశ్ కోపంగా వున్న , తెల్లారి భార్య వచ్చి” పెండ్లి మేళా జరుగుతుందంట. కులసంఘం వాళ్ళు పెట్టారట . అక్కడేమైన సంబంధం కుదిరితే సంధ్య పొయ్యేలోపల పెండ్లి చేద్దాం” అంది .సురేశ్ ఆశగా భార్య వెంట బయల్దేరాడు సురేశ్. కొడుకుతో సమానంగా కూతుర్ని చరివించినా కొడుకు అమెరికా పోయినప్పుడు లేని అభద్రతాభావన అతనికి కూతురు పోతుందంటే కలుగుతూ వుంది.ప్చ్! ….. ఆదర్శాలన్నీ అచరణలోకి వచ్చేసరికి ఎక్కడికో ఎగిరిపోతాయి,.సమాజం ముందు తలవంచటవల్సి వస్తుంది. ఈ ఘర్షణ నుంచి బయట పడాలంటే పెద్ద ‘కలేజా ! నే కావాలె !…. నిట్టూర్చాడు సురేశ్.
పెండ్లి మేళా జరిగే హాలుకు వాళ్ళు పదకొండున్నరకు చేరుకున్నారు. అంతతొందరగా ఎవరైన్నా వుంటారో లేదో అని జంకుతూనే లోపలికి ప్రవేశించారు. హాలు ఆడమగ పిల్లల పెద్దల్తో కిక్కిరిసి వుంది. అక్కడక్కడ టేబుళ్ళు , కుర్చీలు వేసారు. మీరు చాలా లేటు అన్నట్లుగా ఏ టేబుల్ దగ్గరా జాగా కన్పించలేదు. జనం కిటకిటలాడుతున్నారు. మెల్లగా ఒక టేబుల్ దగ్గరికి పోయి ఆగారు. అక్కడెవరూ వాళ్ళవైపు చూపులు కూడా తిప్పలేదు. మాట్లాడుకొవటాంలో మునిగి వున్నారు. టేబుల్ చూట్టూ కుర్చీలో ఆడమగ జంటలు జంటలుగా కూర్చిని వున్నారు. ఎక్కువమంది ఆడపిల్లలతో .. అంటే పెండ్లికూతుళ్ళతో వచ్చిన వాళ్ళే కన్పించారు. అదేమిటి ! ఆడపిల్లల జనాభా తగ్గిపోతుందని పేపర్లు రాస్తున్నాయి. ఇక్కడేమో అంతా పెండ్లి కావల్సిన వాళ్ళు, ఆడపిల్లలే కస్పిస్తున్నారు ! సురేశ్ కు అదంతా చూసి మనసులో చిరాకేసింది.
” పద ! ముందుకు పోదాం . ఇక్కడ ఖాళీ జాగానే లేదు ” అన్నాడు విసుగ్గా.
“ఇదిగో ! మీరిట్ల చిర్రుబుర్రులాడుతుంటే మరీ గుమాస్తాగానో చెప్రాసీలాగానో కన్పిస్తారు . చిరునవ్వుతో గంభీరంగా నడవండి !” రమ హెచ్చరిస్తూ ముందుకు కదిలింది సంధ్యతో.
ఇట్ల సంబంధాల వేటలో పడవలసి వస్తుందని ఎప్పుడూ సురేశ్ ఊహించలేదు . తనొక్కతే కూతురు ! ఇంజనీరింగు చదివింది. అందం తెలివి అన్నె వునయి దానికి. మగపిల్ల వాండ్లే దాన్ని చేసుకుంటామని వెంటబడ్తారనుకున్నాడు. ” నా కూతురుకు పెండ్లి సంబంధాలు వెతికే అవసరమే వుండదు!” అని చిరంజీవి స్టైల్లో కాలర్ వెనక్కు విసిరేసి ఛాతివిరిచిన సురేశ్ ఇప్పుడు కూతురు పెండ్లి ఈ రెండు మూడు వారాల్లో కావాలని ఆదుర్దాలో పడ్డాడు.
ప్రతి టేబుల్ దగ్గర అడ్డబొట్టో, నిలువుబొట్టో పెట్టుకున్న అయ్యవార్లు కాగితాల కట్టలను మల్లేస్తున్నారు తీరిక లేకుండా! సురేశ్ మెల్లగా ఓ టేబుల్ దగ్గరికి పోయి నిలబడ్డాడు. అయ్య గారు ఇద్దరి జాతకాలు చూస్తున్నాడు. జాతకాలు సరిపోవటంలేదని అంటున్నాడు. పెండ్లి కొడుకు తల్లిదండ్రులు విసురుగా అక్కడ్నుంచే లేచారు. మరో ఇద్దరు వచ్చి కూర్చున్నారు. లేచిపోతున్నవాళ్ళ వెంట పొదామా ? అనుకున్నాడు సురేశ్. ” కాని తను సంధ్య జాతకం తేలేదే ! అయినా దాని జాతకమే రాయించలేదు! జాతకాల్లో నమ్మకం లేక. జాతకం లేకపోతే పెండ్లి సంబంధం కుదరదా? ఏం ?” సురేశ్ విచారాంలో తేలిపోతున్నాడు,. వెనుకనే నిల్చొని వున్న సంధ్య  “నాన్న” ! అని పిల్చింది.” నాన్నా ! జాతకాల్లో నమ్మకం లేదుకద మనకు. ఏమాలోచిస్తున్నారు “అంది సంధ్య. రమ “పదండి ముందుకు! “  అని తొందర పెట్టింది. సురేశ్ సంధ్య వైపు చూసి ” ఆ బట్టల్లో సంధ్య ఎంత ముద్దుగా వుంది! ముఖంలో కళకొట్టొచ్చినట్లు కన్పిస్తున్నది !” రమ బలవంతంమీదనే సంధ్య  ఆ మాత్రం తయారంది.”అయినా ఆ మాత్రం కళగా లేకపోతే ఎట్లా! ” మురిపెంగా అనుకున్నాడు సురేశ్. మరో టేబుల్ దగ్గర ఆగారు. అక్కడ కులం, ఉపకులం గురించి చర్చలు సాగుతున్నాయి. సురేశ్ రమ సంధ్యలనుతోస్తూ ముందుకు నడిపాడు.
“పిల్ల లక్షణంగా  వుండాలండి. కట్నం మాకేం ఒద్దు …” అన్న మాటలు వినిపించి సురేశ్ ఆశగా ఓ టేబుల్ దగ్గర ఆగాడు.
పెండ్లి మాత్రం ఘనంగా చేయాలండి. తండ్రి మంచి ఆఫీసర్ జాబ్ లో వుండి మంచి కుటుంబం సంప్రదాయం ఉన్న వాళ్ళు కావాలండి ! అంది అదే గొంతు.
ఆ మాటలు విని సురేశ్ నిట్టూర్చాడు. అక్కడంతా మగ పెండ్లి వాండ్ల డిమాండూలే విస్పిస్తున్నాయి. ఆడపిల్లలవాళ్ళు ఏ డిమాండ్లు పెట్టినట్లు లేదు. పైగా ” మా పిల్ల ఇంజనీరింగు … ఎమ్.సి.ఏ…. ఎమ్.బి.ఏ…..” అని తమ వస్తువునమ్ముకునే వాళ్ళు .వస్తు నాణ్యతను చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు.ఇంకా విచిత్రమేమంటే తమ వస్తు నాణ్యతను చెప్పుకునే ఆ తల్లిదండ్రులు తమ వస్తువునమ్ముకోవటం లేదు. ఎదుటి వస్తువును డబ్బు పోసి కొనుక్కుంటున్నాడు. ఇక్కడ అమ్మకం చేసేవాళ్ళు కొనుగోలుదార్లను ఆశిస్తున్నారు. డాక్టర్లయితే కోట్లు. ఇంజనీర్లయితే లక్షలు… అమెరికాలో వుంటే లక్ష కోట్లు ఇట్లా నడుస్తూ ఉంది మార్కెట్ రేటు.
లక్ష కోట్లు వ్యవహారం చూసి సురేశ్ గుండె దడదడలాడింది.
మాకు ఎమ్.బి.ఏ . అమ్మాయి వద్దండి. ఎమ్.సి.ఏ నో కంప్యూటర్ ఇంజనీరింగో అమ్మాయి కావాలె. అణుకువగా వుండి సంసారపక్షంగా ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది. అమెరికా పోయింతర్వాత విడాకులు అనే అమ్మాయిలు ఎక్కువైపొయారు. అందుకే మాకు లక్షణమైన ఆచార సాంప్రదాయ కుటుంబం అమ్మాయి నెమ్మదిగా ఉండి మన మాట వినే అమ్మాయి కావలి… అంటుందో గొంతు టేబుల్ దగ్గర. ఆమె ముందల అమ్మాయిల ఫోటోలు కుప్పలుగా పడి వున్నాయి.
మేళా అంతా తిరిగినా సురేశ్ కు ఎక్కడా కూర్చోవాలని అనిపించలేదు.
“పోదామె !” అన్నాడు బరువుగా భార్యతో.
“అదేంది !” ఇంతదూరం వచ్చి ఎవర్నీ ఏమీ అడుగకుండానే పోదామంటారేంది “? రమ విసుక్కుంది.
” అవునమ్మా ! నాక్కూడా ఏం నచ్చలేదిక్కడ పోదాం ” సంధ్య బయటికి నడిచింది.
ఇంటికి వచ్చింతర్వాత రుసరుసలాడింది రమ. సంధ్య అమెరికా పోయేది రెండు వారాలే వుంది. టికెట్ కూడా కొనేసింది. “పెండ్లి సంబంధం ఇంకా కుదరలేదు. పెండ్లి ఎట్లా అవుతుంది ?” ఇదే చింత రమకు.
“అమ్మా ! నువ్వు ఇట్లా తొందరపడితే ఎట్లా ? నీ బి.పి. ఎక్కువైతది ” అని సంధ్య తల్లికి నచ్చజెప్పింది. అన్నట్లే రమ బి.పి. పెరిగింది. డాక్టరుకు చూపిస్తే పూర్తిగా విశ్రాంతి వుండాలని చెప్పాడు. తల్లి పక్కమీద వుండగానే సంధ్య అమెరికా వెళ్ళిపోయింది.
అమ్మాయి అమెరికాలో వుంది అంటే సంబంధాలు వస్తాయనుకుంటే ఒక్క సంబంధం రాలేదు. చూస్తుండగ్గానే సంధ్య యమ్.యస్ అయిపోయి ఉద్యోగంలో చేరింది. గ్రీన్ కార్డుకు అప్లై చేయక ముందు ఒకసారి వచ్చి తల్లిదండ్రులను చూసిపోయింది. తండ్రి సంధ్య వచ్చినప్పుడు సంబంధాలు చూసాడు.ఆరాటంగా తిరిగాడు. అయినా లాభం లేకుండాపోయిండి. చదువు కుదిరితే వయసు కలవలేది. వయస్సు కుదిరితే చదువు సరిపోలేదు అట్లా అన్నీ కుదిరితే అబ్బాయి అమెరికాలో వున్నాడు. ఇప్పుడే రాడు అని మాటలు !
సంధ్య అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా సురేశ్ సంబంధాల అన్వేషణ ఆపలేదు. ఆఖరికి రోషన్ గురించి ఎవరో బంధువు చెప్పాడు. వెంటనే సురేశ్ పోయి అతని తల్లిదండ్రులను కలిసాడు. అమ్మాయి గురించి చెప్పాడు . అంతా విని రోషన్ తండ్రి రంగా రావు అమ్మాయి ఫోటో ఇవ్వండి చూద్దాం అన్నాడు . మళ్ళీ అదే పాట ? బరువుగా సురేశ్ జేబులోంచి సంధ్య రెండు ఫోటొలు తీసి ఇచ్చాడు. నాలుగు రోజులకు పోయి కలిసాడు.
ఇట్లా తొందరపడితే ఎట్లాగండి ! ఇంకా వారం రోజులకు రండి ” అన్నాడు.ఇంటర్నెట్ , ఈ-మెయిల్ కాలంలో కూడా ఫోటోలు పంపటానికి ఇంత ఆలస్యమా ?
మగపిల్ల వాళ్ళకెప్పుడూ తొందర ఉండదు. ఎప్పుడూ ఆడపిల్ల వాళ్ళకే తొందరెందుకు ?
సురేశ్ మనస్సులో నొచ్చుకున్నాడు. రోజులు లెక్కపెడ్తూ ఉన్నాడు.
ఇంకోవైపు రమ ” ఇంకా పోవడం లేదేంది. మీకేమి చింతలేదు ” అని పొడుస్తూనే ఉంది. అయినా వారం రోజులు లెక్కపెట్టుకొని పోయి రావును కలిసాడు సురేశ్.
“అమ్మాయి అమెరికాలో ఉందన్నారు. ఒక్కతే ఉంటుందా ?” రావు గొంతులో ఏదో అనుమానం ద్వనించింది.
“లేదండి . ఫ్రెండ్స్ తో కలిసి వుంటుంది .వంట అదీ వాళ్ళే చేసుకుంటారు.”
“మీరు అమ్మాయి ఫోన్ నెంబర్ ఇయ్యండి . మా అబ్బాయి మాట్లాడ్తాడట, అమ్మాయి అమెరికాలోనే వున్నదంటే వీసా గొడవలుండవని అంటున్నాడు.
సురేశ్ సంధ్య ఫోన్ నెంబరు రాసిచ్చాడు. ” ఓ పదిహేను రోజులకు వచ్చి కలవండి” అన్నాడు రావు.
మళ్ళా లెక్కపెట్టుకుని సరిగ్గా సురేశ్ పదిహేను రూజులకు పోయి రావును కలిశాడు. ఇంతలో సంధ్య ఫోన్ చేసి చెప్పింది రోషన్ ఫోన్ చేసాడని. ఉద్యోగం ఏమిటో ఎంతిస్తారని, గ్రీన్ కార్డు ఎప్పుడు వస్తుందని అడిగాడట. ” మాటలను బట్టి బాగానే అనిపించాడు ” అంది సంధ్య .దాంతో సురేశ్ కు ధైర్యం వచ్చింది. ఆశగానే పోయి రావు ముందు కూర్చున్నాడు. రావు సురేశ్ ను చూసి చిరునవ్వు నవ్వాడు. సురేశ్ సొంతఊరు బంధువులు ఉద్యోగం గురించి అడిగాడు. సురేశ్ చెప్పింది వింటే రావుకు అంతగ సంతృప్తి కలిగినట్లుగా లేదు . మూతి బిగించాడు. కాస్సేపాగి ” మావాడికి బాగానే కట్నం ఇస్తామని సంబంధాలు వస్తున్నయండి! కాని మీ అమ్మాయి అమెరికాలో ఉంది గ్రీన్ కార్డు రాబోతుందని సరే అంటున్నాడు”.
సురేస్ ఊపిరి బిగపట్టాడు ఇంకా రావు ఏమంటాడో అని,
“సరే ! మీరు నలుగురు బంధువులతో రాండి కట్నం గురించి మాట్లాడకుందాం ” అన్నాడు.
సురేశ్ తన మేనమామ, బావమరిది, తమ్మున్ని వెంట తీసుకుని రావును కలిసాడు.
“ఊ ………. చెప్పండి … ఎంతలో తూగుతారు మీరు !”
సూటిగానే రావు విషయంలోకి దిగాడు. ముక్కుసూటిగానే అడుగుతున్నాడు బాగానే వుంది అనుకున్నాడు సురేశ్.
“మేం ఐదు లక్షల క్యాష్ ఇస్తాం. బట్టలు బంగారం అమ్మయికి మీరే పెట్టుకోవాలె ” అన్నాడు సురేశ్.
రావు ముఖం ఎర్రబడింది.
“మేం అంత తక్కువగా కన్పిస్తున్నామా? మీకు ” రావు కోపంగానే అన్నాడు.
సురేశ్ వాళ్ళను గురించి కనుక్కునాడు. అమెరికా పోయింతర్వాతనే కొడుకు బంజారాహిల్స్ లో ఫ్లాట్ కొనుక్కొన్నాడని. ఇప్పుడు రావు వుండే ఫ్లాట్ అదేనంట. ! రావు రిటైర్ మెంట్ బెనిఫిట్ డబ్బు వస్తే దాంతో కొడుకు అమెరికా పోకముందే కూతురు పెండ్లి చేశాడట. కూతురు అల్లుడు ఇప్పుడు అమెరికాలోనె ఉన్నారు. తన పరిస్థితికన్నా వాళ్ళేం మెరుగ్గా లేరు. అంతస్తులో తనంతటివాళ్ళే ! ఇప్పుడు కొడుకు పంపే డబ్బుతో కారు డ్రైవర్ ను మెయింటెయిన్ చేస్తున్నారు .అదే వాళ్ళ అదనపు క్వాలిఫికేషన్. రావు అవమానాన్ని దిగమింగుకున్నాడూ. “పది లక్షలు క్యాష్ ఇయ్యండి. అమ్మాయి నగలు బట్టలు మీ బాధ్యత. పెండ్లి ఖర్చు మీరు పెట్టూకోవాలె. మీకు తెలుసుగద! పెండ్లి బాగా చేయాలె ! స్పష్టంగా చెప్పే శాడు. అట్లా అయితేనె ఈ సంబంధం కుదురుతుందని అన్నట్లుగా.
సురేశ్ రావు మాటలు విని షాకయ్యాడు. లేవబోయాడు. బావమరిది అతన్ని ఆపాడు.
“రావుగారు ! అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది.అమ్మాయి మీది కాబోతున్నది. మరీ పట్టింపులకు దిగకండి” అన్నాడు సురేస్ బావమరిది నెమ్మదిగా.
రావు కొడుకును పెంచినట్లుగానే తను కూతుర్ని పెంచాడు, చదివించాడు. ఇప్పుడు సంపాదిస్తున్నది. అయినా ఆడపిల్ల తండ్రినయినందుకు ఈ కష్టాలు ! అందుకేనేమో ఇంకా సమాజాంలో ఆడపిల్లల్ని కనటం భారంగానే భావిస్తున్నారు.
” అమ్మాయి ఉద్యోగం చేస్తున్నదంటే మనకేమిటండి. వాళ్ళు వాళ్ల భవిష్యత్తు బాగుంటుంది. సుఖపడ్తారు. కట్నం అంత ఇచ్చుకోగలుగుతేనే ముందుకు పోదాం. ముహుర్తాలు పెట్టుకుందాం” అన్నాడు  రావు ఇంకా ఏమీ ఈ విషయంలో బేరసారాలు లేవన్నట్లుగా.
బావమరిది సురేశ్ వైపు చూసి ఏమి సైగ చేసాడో తెలియదు అతడు నిశ్శబ్దంగా నిట్టూర్పు విడిచి “సరే” అన్నాడు.
సంబంధం కుదిరిందని రమ సంతోషానికి అవధుల్లేవు.
“అబ్బ ! అమ్మాయి ఒక్కతే అమెరికాలో వుందని నా పరేషాన్ !  ఆడవాళ్ళ బాధలు మీకేం తెలుస్తాయి ” అంది రమ.
“అమెరికాలో మన అమ్మయిలాగా ఎందరో వున్నారు. ఏం భయం లేదు. ఇండియాలో కన్న సురక్షితంగా వున్నానని అమ్మాయి చెప్పలేదా ! అయినా నీ పరేషాన్ నీదే. నువ్వు పరేషాన్ అవుతవు ఎదుటి వాళ్ళని పరేషాన్ చేస్తావు. ఇప్పుడు కట్నమని ఖర్చులకని ఇరవై లక్షలన్నా కావాలె. ఎక్కడ్నుంచి తెస్తాం”. కోపంగా ఉన్నాడు సురేశ్..
“సరే ! అబ్బాయి అమెరికాలో వున్నాడు. కూతురు అమెరికాలో వుంది. అంతమాత్రం ఖర్చు చేయకపోతే ఎట్లండి! అమెరికా నుంచి తెల్లవాళ్ళే వచ్చి ఇక్కడ పెండ్లి చేసుకుంటున్నారు సంప్రదాయంగా ఉంటుందని. ఇక మనమూ ఆ మాత్రం గొప్పగా సంప్రదాయంగా పెండ్లి చేయకపోతే ఎట్లా !” అంది రమ.
సురేశ్ బాధను ఆమె పట్టించుకునే స్థితిలో లేదు. సురేశ్ మౌనంగా నిలబడిపోయాడు.
” సరే  కాని రోషన్ – అదే అబ్బాయి బాగున్నాడాండి. అందంగా స్మార్ట్ గా ఉన్నాడు” ఆంది రమ చేతిలో ఉన్న ఫోటో ను భర్తకు చూపిస్తూ.
“అమ్మాయికి తగిన సంబంధం ! గొప్ప సంబంధం చేశామని నలుగురు అనుకుంటారు చూడండి “! రమ గొంతులో గర్వం ఒలికింది.
“అమ్మాయి జాతకం అడిగారు వాళ్ళు . పుట్టిన రోజు సమయం చెప్పి అయ్యగారితో ఓ జాతకం రాయించు. వాళ్ళకిస్తాను. ముహుర్తాలు పెట్టుకోవడానికి జాతకాలు కావాలిట !” అన్నాడు సురేశ్ .
“జాతకాలు చూసి ఏమంటారో ?” సురేశ్ కు భయంగానే ఉంది. కాని జాతకాల దగ్గర ఏం పట్టింపులు రాలేదు. పెండ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. పెండ్లి వారం రోజులుందనంగా పెండ్లికూతురు , పెండ్లి కొడుకు అమెరికా నుంచి వచ్చారు. అంతవరకు ఇంటర్ నెట్ లో ఫోటోలు చూసుకోవటం మాట్లాడుకోవటమే జరిగింది.ఇప్పుడు ప్రత్యక్షంగా చూసుకొని మాట్లాడుకున్నారు.సురేశ్ మేన మామ వాళ్ళిద్దర్ని ఒక్క దగ్గర చూసి ఆశ్చర్యపోయాడు. పెండ్లి కాబోయే వాళ్ళ ముఖాలమీద కన్పించే సిగ్గులేదు. సిగ్గులతో ఒలికే సింగారం లేదు. కండ్లల్లో తళుకు బెళుకుల్లేవు. ఒకర్నొకరు చూడాలి తాకాలి అనే తహతహల్లేవు. సీదాసాదా ఆఫీసుల్లో కలిసి పనిచేసే ఉద్యోగుల్లా మాట్లాడుకోవడం అతనికి విచిత్రం కన్పించింది.
“ఏమో !   అమెరికాలో ఇట్లానే వుంటుందేమో ! అయినా వీళ్ళిద్దరూ ఇక్కడ పెరిగి చదువుకొని అక్కడికి పోయిన వాళ్ళే కదా !  అక్కడికి పోయి అక్కడికి పోకడలు అలవాటు అయ్యాయేమో !” ఆలోచనల్లో మునిగిపోయాడు.
“కొత్త పెండ్లి కూతురు పెండ్లి కొడుకులను చూసిన సంబరమే లేదు ” అతనికి నిరాశ అనిపించింది.
తండ్రి లాగే రోషన్ నిక్కచ్చిగా మాట్లాడతాడు . నాన్చటం లేనే లేదు.”  ప్రేమ ఆర్ద్రతకు ఆప్యాయతలు అసలే లేవు . ఏది మాట్లాడినా ప్రయోజనం చూసి జోకి జోకి ఆచితూచి మాట్లాడ్తాడు. పొల్లు మాటనేది వుండదు. పెండ్లి ఘనంగా జరిగింది. పెండ్లి హాలు, లైటింగ్ బ్యాండులకే లక్ష అయింది. పెండ్లి పందిరిని దిగుమతి చేశుకున్న ఆర్కిడ్ పూలతో అలంకరించారు. దానికో లక్ష పెండ్లికాంగానే వాళ్ళంతా అక్కడ ఉండగానే అందమైన ఖరీదైన ఆ పెండ్లి పందిరిని ఊడ పీకి వెంటనే జరిగే మరో పెండ్లికి మరో పందిరి వేయటం చూసి సురేశ్ గుండె పిండినట్లయింది. లక్ష రూపాయలు నీళ్ళల్లో పోసినట్లనిపించింది. భోజనం క్యాటరింగు ఇచ్చారు. మూడువేల మందికి ప్లేటుకు వంద చొప్పున మూడు లక్షలయ్యింది. అమ్మాయి నగలు బట్టలు ఎక్కువ కొనుక్కోను అంది కాబట్టి రెండు లక్షల్లోనే అయిపోయింది. అంతా పెండ్లి ఖర్చు కట్నంతో ఇరవై లక్షల్లోకి చేరుకుంది. రిటైర్ మెంటుతో వచ్చిన డబ్బు , పి.ఎఫ్, వగైరాలు తన దగ్గరున్న పదిలక్షలు పోగా పది లక్షలు అప్పు అయ్యాయి. ఇల్లు తాకట్టు పెట్టి స్నేహితులనడిగి వడ్డీకి తెచ్చి ఎట్లాగో అట్లాగ ఆ పదిలక్షలు సర్దాడు. ఇంత జరిగినా రావుగారు భార్య సంతోషంగా కన్పించలేదు. మూతులు ముడుచుకొని అది లేదు ఇది లేదు అని వంకలు పెడ్తూనే ఉన్నారు.
ఇదంతా  చూసిన సురేశ్ కొడుకు సందీప్ నేనయితే కట్నం లేకుండానే పెండ్లి చేసుకుంటాను .” ఏమిటి నాన్న ! ఆడపిల్లవాళ్ళను పీడించి పిండి పిప్పి చేసి ఏమిటీ పెండ్లి . ఈ పెండ్లి లో ఆనందమే లేదు. టెన్షన్ తప్ప . నేనయితే ఈ పద్ధతిలో చేసుకోనే చేసుకోను పెండ్లి అని ప్రకటించాడు.
“వాడి పెండ్లయితే వచ్చే కట్నంతో కొంత అప్పయినా తీరురుందని ఆశపడ్తుంటే  వీడేమో ఇట్లా మాట్లాడుతున్నాడు. అయినా తన ఆదర్శమూ అదే ! మరి ఈ సంప్రదాయం కట్నం అనే సంబంధంలో ఎట్లా చిక్కుకుపోయాడో తెలియదు! అయినా మాట్లాడిన ఆదర్శాలకు తగ్గట్టుగా ఎవరు ఆచరణలో అచ్చంగా నిలుస్తారు” సురేశ్ ఆలోచనల్లో పడిపోయాడు. పెండ్లి లో రోషన్ ఆనందంగా కన్పించలేదు. అతడేమన్నాడోయేమో సంధ్య టెన్షన్ తోనే కన్పించింది. “ఇద్దరి ముఖాల్లో పెండ్లి కళ లేదు ” అనుకున్నాడు సురేశ్.
“ఇంత ఘనంగా చేసిన పెండ్లి ఖర్చంతా దండుగే కద ! గంట పెండ్లికి ఏందీ ఖర్చు! ” సందీప్ గంభీరంగా అన్నాడు.
“పెండ్లి ఖర్చు దండుగేందిరా ! ” అంది రమ కొడుకును మందలిస్తూ .
“జీవితంలో ఒక్కసారి జరిగే పెండ్లి ! ఇంతగా జరగకపోతే ఎట్లా ? అయినా దండుగేముంది.ఎంతమందికి పెండ్లితో వ్యాపారమవుతుందో చూశావు గదా ! కొంతమందికైనా జీవనోపాధి దొరుకుతున్నది” రమ  మాటలు విని సుష్కంగా నవ్వాడు సురేశ్.
“అమ్మా! నీ అర్థశాస్త్రం లెక్కలు బాగున్నాయమ్మా !” చిరునవ్వు నవ్వాడు సందీప్.
పెండ్లయింతర్వాత రోషన్ సంధ్యలు ఓ వారం రోజులుండి సెలవు లేదంటూ అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేముందు సంధ్య తండ్రి దగ్గరికి వచ్చింది నాన్నా ! నీ రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అంతా కలిపి ఓ పది లక్షలుంటాయని నువ్వు చెప్పినట్లు గుర్తు. ఇంత డబ్బు కట్నం ఇచ్చి నా పెండ్లి చేయవలసిన అవసరమేముంది నాన్న !  సరే ! మస్తు అప్పు అయింది. నేను నెలకు ఐదొందల డాలర్లు పంపుతాసు. అన్నయ్య ఐదొందలు పంపుతానన్నాడు నాతో . నెలానెలా పంపే ఆ డబ్బులతో అప్పు తీర్చండి నాన్నా ! అంది తండ్రిచేతిని తన చేతిలోకి తీసుకొని సంధ్య.
దాని చల్లని స్పర్శ తన తల్లి స్పర్శలాగా భద్రతనిచ్చినట్లనిపించిదతనికి.
“తల్లీ ! సంధ్య ! ” బొంగురు గొంతుతో ముఖం పక్కకి తిప్పుకున్నాడు . వర్షించే కండ్లను కూతురు చూడకూడదనుకున్నాడు.
“రోషన్ సంతోషంగానే ఉన్నాడా అమ్మా ! ” అడిగాడు సురేశ కన్నీళ్ళ నాపుకొని కూతురు వైపు చూసి.
“రోషన్ సంతోషంగా ఉండక ఏమైంది నాన్నా! బాగానే వున్నాడు ” పొడిపొడిగా ఆంది సంధ్య.
“నాన్నా ! అమ్మా! అప్పు తీర్చండి.అప్పు తొందరగా తీర్చి సంతోషంగా హాయిగా ఉండండి. ఏ టెన్షన్లు పెట్టుకోవద్దు ” అంది సంధ్య తల్లిదండ్రులవైపు చూస్తూ.
అమెరికా పోంగానే సంధ్య తండ్రి అకౌంటులో ఐదొందల డాలర్లు జమ చేసింది. ప్రతినెలా ఆ విధంగానే ఆ అకౌంటులో ఐదొందల డాలర్లు ట్రాన్సఫర్ చేయమని తన బ్యాంకు వాళ్ళకి చెప్పింది. సంధ్య తండ్రికి డబ్బు పంపిస్తున్న సంగతి రోషన్ కు తెలిసింది. అదీ తండ్రి ఇండియానుంచి ఫోన్ చేసి చెప్తే తెలిసింది. అది తెలియగానే రోషన్ ముఖం నల్లబడింది. కండ్లు ఎరుపెక్కాయి. విసురుగా పోయి సంధ్య ముందు నిలబడ్డాడు.
“అందుకే అన్నాన్నేను మనిద్దరికి జాయింట్ అకౌంటు వుండాలని. ఇటువంటి దానధర్మాలు నేను సహించను “! కోపంగా ఉందతని గొంతు.
“దానధర్మాలేంది ? నా తలిదండ్రులకు డబ్బు పంపటం దానధర్మమా ? నన్ను పెంచి చదివించిన తలిదండ్రులకు నా సంపాదనలోచి అంత మాత్రం ఇచ్చె హక్కు నాకు లేదా ? అయినా నా పెండ్లికి నాన్న పది లక్షలు అప్పు చేసాడు.అది ఎవరు తీరుస్తారు ?” గట్టిగానే ప్రశ్నించింది సంధ్య.
“అప్పెవరు చేయమన్నారు. నీ చదువుకయితే అప్పుకాలేదు కద ! ఆడపిల్ల సంపాదనకు ఆశపడడానికి సిగ్గులేదా”….  అంతస్తుకు మించిన సంబంధం ఎవరు చేయమన్నారు.
అంతస్తుకు మించిన సంబంధమా ! నీ అంతస్తు మా అంతస్తు కన్నా గొప్పదేమికాదు ! అయినా “నువ్వు మీ నాన్నకు పంపించే డబ్బు గురించి నేను నిన్ను ప్రశ్నించానా ? చెప్పు !” కోపంగా గొంతు దించే అంది సంధ్య.
నన్ను ప్రశ్నిస్తావా ? ఎంత ధైర్యం నీకు ? అప్పుచేసిన నీ వాళ్ళు ఈ పెండ్లి చేస్తున్నారంటే నేను  ఈ సంబంధానికి ‘ నో’  అనేవాడిని” కోపంగా అరిచాడు రోషన్.
“కూతురుకు మంచి సంబంధం చేయాలని తల్లిదండ్రులందరికీ ఉంటుంది .అయినా నీతో సమానంగా ఇక్కడ యూ.ఎస్.లో వుండి సంపాదిస్తున్నాను అంత కట్నం మీరేందుకడగాలి ?”
“ఎంత కట్నం ? బోడి కట్నం తెచ్చావని ఎదురు మాట్లాడుతున్నావు ? అది మీకు ఎక్కువేమో  ! నాకు అంతకు వేయ్యిరెట్లు ఎక్కువ కట్నమిస్తామని వచ్చారు. అయినా నేను నిన్ను ఎంచుకున్నాను. అది నా కర్మ”! రోషన్ కోపం పట్టలేక డైనింగ్ టేబుల్ మీదున్న గ్లాసు తీసి గట్టిగా నేలమీదికి  విసిరేశాడు. అది ధన్ మని చప్పుడు చేస్తూ ముక్కలైంది.
సంధ్య విస్తుపోయింది. తేరుకొని – “నీకర్మ కాదు . నా కర్మ కూడా . భార్య సంపాదనాశించే వాడివని ఎర్కలేక ఒప్పుకున్నాను ” కోపంగా అరిచింది సంధ్య.
“ఏమన్నావ్ ? ” రోషన్ కోపంతో వేగంగా పొయి డైనింగ్ టేబిల్ మీదున్న పండ్లుకోసే చాకును అందుకుని సంధ్య మీది కురికాడు.
సంధ్య భయపడిపోయింది. వెంటనే బలంగా అతని చేతి మణికట్టును గట్టిగా పట్టుకొని వెనక్కి తోసింది. అంతబలం ఎక్కడ్నుంచి వచ్చిందో ఆమెకే తెలియలేదు. రోషన్ వెనక్కు ఒరిగి కిందపడ్డాడు. చాకు చేతిలోంచి దూరంగా పడిపోయింది. అతని నుదురు సోఫా అంచును గుద్దుకుంది. “అబ్బా!” అంటూ తలను పట్టుకున్నాడు. రక్తం కారుతుంది. సంధ్య వెంటనే గ్లాసు పెంకులను జాగ్రత్తగా తప్పించుకుంటూ పడగ్గదిలోకి పరిగెత్తింది. రోషన్ లేచాడు తండ్రికి ఫోన్ చేశాడు. “నాన్నా ! సురేశ్ గార్ని రమ్మనండి కాన్ఫరెన్స్ పెడ్దాం “అన్నాడు.
“ఏమైందిరా !” రోషన్ గొంతు విని కంగారు పడ్డాడు రావు.
“ఏం కాలేదు . సంధ్య జాయింట్ అకౌంటు తీస్తుందా ? లేదా ? తండ్రితోనే తేల్చుకుందాం ” రోషన్ గొంతు కసిగా ధ్వనించింది.
ఆ రాత్రి సంధ్య పడగ్గదిలోనే ఉండిపోయింది.  రోషన్ కుర్చిలో కూలబడి పోయాడు ఆ రాత్రి అదనంగా ఉన్న పడగ్గదిలోనే పడుకున్నాడు.నొప్పికి మందు గోలి వేసుకుని తొందరగానే నిద్రపోయాడు.
రావు చెప్పినట్లుగానే సురేశ్ ఆదివారం రాత్రి వచ్చాడు.
“రావుగారూ ! విషయమేంది ? ఈ ఫోను మీద కాన్ఫరెన్స్ ఏమిటి ?” అడిగాడు ఆత్రంగా .
” ఫోను వస్తుంది కద విషయం తెలుస్తుంది. మీ అమ్మాయిని పెంచే విధం ఇదేనా ? మాటకు మాట జవాబు చెప్తుంది . అమ్మాయి సంపాదనకు ఆశపడే మిమ్మల్ని ఏమానాలో అర్థం కావడం లేదు ” రావు అంటూనే వున్నాడు ఫోన్ మ్రోగింది . రోషన్ ఫోన్ !
“రోషన్ బాగున్నావా ? “అడిగాడు రావు.
“సురేశ్ గారు వచ్చారా ” అన్నాడు. అక్కడ కూర్చున్న సురేశ్ కు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ గొడవంతా ఎందుకో సురేస్ కు చూచాయగా అర్థమైంది.
“రోషన్ మా అమ్మాయి నెలకు ఐదొందల డాలర్లు పంపుతానంది నేను వద్దనే అన్నాను. కాని అప్పు అయ్యింది కదా పిల్లలుగా మా బాధ్యత పంపనీయండని బలవంతం చేసింది. ఇదిగో ఈ నెల పంపింది అంతే ! వచ్చే నెలనుంచి వద్దని నేను చెప్తాను రోషన్ !” అన్నాడు సురేశ్ ప్రార్థిస్తున్నట్లుగా.
“మీరు వద్దన్నంక ఎందుకు పంపుతుందండి ! పెండ్లికి ముందే మీరు చెప్పాల్సింది మా అమ్మాయి సంపాదన మాది  అని.అందుకే జాయింట్ అకౌంటు తీయమంటే  తీస్తలేదు. వెంటనే జాయింట్ అకౌంట్ తీస్తే సరే ! లేకపోతే ……” రోషన్ ముగించకముందే  సురేశ్ అందుకున్నాడు “లేదు లేదు రోషన్ ! నేను అమ్మాయికి చెప్తాను నువ్వేమీ బాధపడకు ” సురేశ్ ముగించనేలేదు రావు అందుకున్నాడు.
“అయినా పెళ్ళయింతర్వాత అమ్మాయి మా ఇంటిదవుతుంది. అన్ని విధాలా ఆమె మీద మాకే హక్కు వుంటుంది. ఇష్టం వచ్చినట్లుగా డబ్బును మందికి పంచటం ఎక్కడి సంప్రదాయమండి! కోట్లకొద్ది కట్నమిస్తామని మాకు సంబంధాలు వచ్చినా మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటానన్నాడు. ఫొను మీద  మీ అమ్మాయి మా వాడి మీద ఏం మత్తు మందు చల్లిందో ! మేము వద్దన్న వాడు వినలేదు. ఇప్పుడు మీరు ఎటువంటి వాళ్ళో వాడికి తెలుస్తుంది. అనుభవిస్తున్నాడు.”
“ఇదేంది  మేం ‘మంది’మి అయిపోయామా మా కూతురుకే ! చదువు చెప్పించాం. వాళ్ళ కొడుక్కు వాళ్ళు చదువు చెప్పించినట్లుగ మేము చదువు చెప్పించాం. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది. అక్కడికీ నేను వద్దనే అన్నాను .ఆడపిల్ల సంపాదనకాశపడ్డానని ఈ విధంగా బద్నాం కావటం ఇష్టం లేకనే వద్దన్నాను” సురేశ్ ఆలోచనల్తో కండ్లలో నీళ్ళు నిండాయి. ఇంతలో ఫోనులో రోషన్ గొంతు కర్కశంగా విన్పించింది.
“నాన్నా !  ఆ పెద్ద మనిషి ఏం మాట్లడడేమిటి ? కూతురికు నచ్చజెప్తాడా లేదా ఇంతకు ! అయినా ఇటువంటి అడుక్కుతినే సంబంధం చేసుకోవడం నాదే తప్పు. మీ మాటలు వినక కోట్ల కట్నాన్ని పోగొట్టుకుని…..” ఈ మాటలన్ని పడగ్గదిలో వున్న సంధ్య వింటూనే వుంది. చేతిలో సూటుకేసుతో బయటికి వచ్చింది. ”నేను పోతున్నాను. నా సంపాదనంతా నీ చేతుల్లో పొసి బానిస బతికు బతకటం నా కిష్టం లేదు.అయినా అమెరికాలో వుండి సంపాదిస్తున్నా నీకు కట్నం మీద ఆశలు పొలేదు. సంతృప్తి లేని నీ వంటి వాడితో నేనుండదల్చుకోలేదు. పోతున్నాను మగవాళ్ళతో సమానంగ చదివి ఉద్యోగాలు  చేస్తున్న ఆడపిల్లలకు కట్నం బాధలు తప్పటంలేదు . ఎక్కడున్నా ఇండియన్ మగవాళ్ళు మారరు. కట్నం వేధింపులతో కాల్చి చంపుతారు. ఉరి బిగిస్తారు. మగవాళ్ళ డబ్బు దాహం కట్నం మీద ఆశలు చావనంతవరకు ఆడపిల్లలు పెండ్లి చేసుకోమని ఏకమై నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని వాదాలు వచ్చినా దీన్ని నిర్మూలించే శక్తి ఎవరికీ లేకుండా పోతున్నది ఎక్కడో అక్కడ ఈ కీలుకు వాత పెట్టాలి. ఆడపిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు వుంటే తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు తీసుకోవాలికాని పెండ్లినాడు కట్నం అంటూ వేదించడం దేనికి ? ఇదిగో పోతున్నాను. ముందుగా పోలీసు కంప్లైంట్ ఇస్తాను. తర్వాత కోర్టులో విడాకులు … ! కొందరైనా ఈ విధంగా చేయందే మగవాళ్ళ దురాశలు అంతం కావు !”
సంధ్య గట్టగా దృఢంగా అనే మాటలు ఫోనులో అందరికి వినిపించాయి . సురేశ్  దిగులుతో దిక్కులు చూశాడు. రావు కోపంతో మండిపడ్డాడు. రోషన్ దిగ్భ్రాంతిడైపోయాడు. సంధ్య సూట్ కేసుతో గబగబా నడిచింది. ముందు తలుపులు తీసుకుని గట్టిగా తోస్తూ బయటికి నడిచింది. కొంచెం సేపటికి కింద కారు వేగంగా దూసుకుపోయిన చప్పుడూ వినిపించింది. రోషన్ ముఖం కోపంతో ఎర్రబడింది.
“ఏమైందిరా ! రోషన్ ! ఏమైంది ? నాయనా ! ఏమైందిరా !” అరిచాడు రావు.
“ఏమైందండి !” మెల్లగా అడిగాడు సురేశ్.
ఇంతలో ఫోన్ ఆఫ్ అయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది.

ఒక అభిప్రాయం »కథలు

One Response to “పోరు తప్పదా !”

  1. 1
    ప్రాణహిత » జనవరి 2010 సూచిక Says:

    [...] పోరు తప్పదా – ముదిగంటి సుజాతా రెడ్డి [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో