Jan2010
తాకట్టు
ఒక్క నిమిషం గేటు ముందు ఆగా…………….
ఆ చిన్న తుప్పు పట్టిన ఇనుప గేటును తోద్దామా…….వద్దా అని ఒక నిముషం ఆలోచించాను. రాత్రంతా నిద్ర లేని భారానికి తోడు ఏదో ఉద్వేగం శరీరాన్ని ఆవహించి వణికిస్తున్నట్టుగా ఉంది. సమయం ఉదయం ఆరు గంటలు కావస్తోంది. చిన్నగా వాన తుంపరలు పడ్తున్నాయి. చివరికి గేటుపైన ఉన్న గడియ తీస్తూ… కొంచెం ముందుకు తోసా.. కిర్రుమంటూ చిన్న శబ్దంతో అది తెరుచుకుంది.
“సంపత్ గారూ ………” గట్టిగా పిలిచానా, అరిచినా. నాకే డౌటొచ్చింది. మళ్ళీ ఇంకోసారి పిలిచే లోపలే … ఆదరా బాదరాగా లోపల్నించి బనియన్ తోనే బయటకొచ్చారు సంపత్ గారు.
శర్మగారా….. రండి పొడిగా పిలిచాడు. పిలుస్తూనే ఇంట్లోకి దారి తీసాడు. ఆయన వెనకే నేను వెళ్ళా. ఇంట్లో హాల్లో సోఫా మీద ఇద్దరం ఎదురుఎదురుగా కూర్చున్నాం.
కొంచెం సేపు ఇద్దరం మౌనంగానే వున్నాం. ఆ తర్వాత సంపత్ గారు “పేపరు చూచారా..అడిగాడు” ..”లేదే ..” అంటూ ఆయనిచ్చిన పేపరు చేతిలోకి తీసుకున్నాను. పేపరు మెయిన్ ఎడిషన్ లోనే తాటికాయంత అక్షరాల్లో “గోవిందా… గోవిందా” అనే క్యాప్షన్ పెట్టారు. క్యాప్షన్ కింద రాసిన అక్షరాల వెంట నా కళ్ళు పరుగులు దీశాయి. “తాకట్టు కొట్టులో శ్రీవారి నగలు… కోదండరామాలయ అర్చకుడి నిర్వాకం….. రూ.9 లక్షలకు ఒక కిలో నగలు తాకట్టు. పదేళ్ళుగా ఇదే తంతూ…………..పూజారి దీక్షితుల్ని అరెస్టు చేసిన పోలీసులు. శ్రీవారి ఆభరణాల భద్రతపై నీలినీడలు”.
పేపరు చదివిన తర్వాత చిన్నగా నిట్టూర్చాను. సంపత్ గారూ పోలీసు స్టేషన్ కెళ్ళి ఒకసారి దీక్షితులు గారిని పలకరిద్దామనుకుంటున్నాను. మీరేమైనా రాగలరా. ఈ పరిస్థితుల్లోనా.. ఆశ్చర్యంగా అన్నారు . “ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పోదాం చెప్పండి”.
సంపత్ గారు పైకి లేచి జంధ్యం సవరించుకుంటూ గోడమీద మేకుకి తగిల్చిన తెల్ల చొక్కా వేసుకుంటూ పదండి అన్నాడు.
“అక్కడెవరన్నా తెలుసా….”
” ఆ… ఒక పోలీసాయన తెలుసు.” తలుపులు దగ్గరకేస్తూ…………….”ఏమేవ్ లక్ష్మీ …………తలుపేసుకో” గట్టిగా అరుస్తూ బయటున్నస్కూటరును స్టార్ట్ చేసాడు. ఇద్దరం స్కూటరెక్కాం. తర్వాత సంపత్ మాట్లాడసాగాడు. “రాత్రంతా నిద్ర పోలేదు శర్మగారూ, అర్థరాత్రి పోలీసులు దీక్షితులు గారింటికి వచ్చి హంగామా చేశారు. అంతా అర్థమయ్యేలోపలే ఆయన్ను, ఆయన భార్యను కూడా జీపులో ఎక్కించుకుపోయారు. ఆ జీపు ఎక్కెటప్పుడు దీక్షితులు గారి భార్య వెక్కి వెక్కి ఏడ్వడం చూసి చాలా బాధనిపించింది . మాటలు చెప్పెటప్పుడు సంపత్ గారి గొంతు బొంగురు పోతూంది. సంపత్ గారు బాగా కదిలిపోయినట్టున్నారు.
పాలవాళ్ళు, పేపరువాళ్ళు అప్పుడే వీధిలోకి వస్తున్నారు. దీక్షితులు గారి ఇంటి మీదుగానే మేము పోతున్నాం.
పాతబడిన చిన్న యిల్లు……………….గోడలకు రంగుల్లేక వెలసిపోయింది. గోడల మీద అక్కడక్కడ సిమెంటు పెచ్చులూడి పాతకాలం ఇటుకలు బయటికే కన్పిస్తున్నాయి. ఇంటికి తాళం వేసుంది. ఇంటిపైన ఒక చిన్న రాగి చెట్టు మొలిచుంది. దాని మీద ఆయన ఇంట్లో ఎపుడూవుండే రెండు పావురాలు ఇంటి మీద నిలబడి కిందకి చూస్తున్నాయి. ఆయన ఇంట్లో తన భోజనం చేసే ముందర పిడికెడు బియ్యం గింజలు తన మిద్దె మీద చల్లేవాడు అవి తినేదానికి పావురాలన్నీ తెగఎగబడేవి. దాంతో పాటే ఒక ముద్ద అన్నం కాకికి కూడా పెట్టేవాడు. ఒక్కసారిగా నేను గతంలోకి జారిపొయాను. నేను ఇంటరు చదివే రోజుల్లో మా నాన్నరోజు ఉదయంపూట దీక్షితులగారి దగ్గర ఆ మంత్రాల ఉచ్ఛారణను నాకు చెప్పించాలనుకున్నాడు.
ఒక రోజు ఉదయాన్నే నేను స్నానం చేసింతర్వాత ధోవతి కట్టుకుని ఒంటి మీద ఒక తుండుగుడ్డ కప్పుకుని, పంచపాత్రలు తీసుకుని, మా నాన్నతో పాటు రాములవారి గుడికి బయలుదేరా.
దీక్షితులు గారు రాములవారి గుళ్ళో పూజారిగా వుండేవారు. ఆ పూజారి వృత్తిని దీక్షితుల వారు ఎనిమిది తరాలుగా చేస్తున్నారు. మేమూ, దీక్షితులు గారూ రాముల వారి దక్షిణమాడ వీధిలో వుండేవాళ్ళం. మాకు దీక్షితులగారింటికి ఒక పదిళ్ళ తేడా వుండేది.
మా నాన్న కూడా పౌరోహిత్యం చేసేవాడు. సాయంత్రాలు పూట కొన్ని అంగళ్ళలో పద్దులు రాసేవాడు. నేనే మా ఇంటి పెద్ద కొడుకుని. రాములవారి నాలుగు మాడ వీధుల్లో దీక్షితులు గారంటే ఒకరకమైన భక్తి, గౌరవం వుండేది. మా నాన్నగారు కూడా ఏవైనా సందేహాలు వస్తే దీక్షితులగారి దగ్గరే నివృతి చేసుకొనేవాడు.
అంతే కాకుండా ఆయనతో రాములవారు స్వయానా మాట్లాడే వారని ప్రతీతి. దీనికి కొన్ని దృష్టాంతాలు కూడా మానాన్నగారు చెప్పేవారు. మా నాన్నకు నన్ను పౌరహిత్యంలో చేర్చాలనే సంకల్పం ఉండేది. నాకు సరిగా చదువు అబ్బలేదు. అందుకనే దీక్షితులగారి దగ్గర చిన్నంగా శిష్యరికం చేయిస్తే, కొన్ని పూజా కార్యక్రమాలు, కొన్ని మంత్రాలు స్పష్టంగా నేర్చుకుంటాననే ఆశే నన్ను దీక్షితులగారి దగ్గరికి తీసుకురావడానికి దారితీసింది.
తిరపతిలో రాములవారి గుడి బహుశా తెలియని వారుండరు. సుమారు ఐదెకరాల స్థలంలో చుట్టూరా పాతతరం కాశిరాళ్ళు, ఒకదానిపై ఒకటి పెట్టి దాదాపుగా ముప్పై అడుగుల ప్రహరిగోడ.ఇరవై అడుగుల పొడవు. పదడుగుల వెడల్పుతో పడమర పెద్ద చెక్క తలుపు. దీనిని తీసుకుని నేనూ, నాన్నగారూ లోపలికెళ్ళాం. లోపల విశాలమైన ప్రదేశం కుడివైపు పెద్ద రాగిచెట్టు, దీని కింద నవగ్రహాలు, అప్పటికే కొంతమంది భక్తులు నవగ్రహాలకు దీపాలు పెట్టి చుట్టూ చేతులు జోడించి తిరుగుతున్నారు.
విశాలమైన ప్రదేశం మధ్యలో గుడి, గుడిచుట్టూరా రాతి బండలతో నేలంతా పరిచారు గర్భగుడి వెనుకవైపున అనేకరకాల పూల చెట్లు. ఒక ఐదారు కొబ్బరిచెట్లు వున్నాయి.
మేము గర్భగుడిలోకెళ్ళేసరికే దీక్షితులు గారు రాములవారికి హారతిస్తూ, ఒకచేత్తో గంటాకొడ్తున్నాడు. భక్తులంతా క్యూలో నిలబడున్నారు. నేనూ నాన్నగారు ఒక ప్రక్కగా నిల్చున్నాం. పన్నెండు అడుగుల ఎత్తులో రాములవారి రాతి విగ్రహం. ఆ విగ్రహం చేతిలో విల్లు వుంది. ఒంటరిగా చూస్తే దడుచుకుని చస్తామేమో. కాగడాల వెలుతురులో విగ్రహాలు మసక మసకగా కనిపిస్తున్నాయి. కొంచెం సేపటికి దీక్షితులు గారు హారతిచ్చి, గర్భగుడి ముందరే వున్న హాలులోకి వచ్చారు. మా నాన్న గారూ నేను ఆయనకి రెండుచేతులతో నమస్కారం చేశాం.
మా నాన్నగారు ఆ భక్తునితో మీరు ఇటువైపు కొత్తవారా అని అడిగారు. అవునన్నట్టు ఆ భక్తుడు తలూపాడు. దీక్షితులు గారు డబ్బులు తీసుకోరు. అంతా ఉచితంగానే చెప్తారు. మీరు ఏదైనా వుంటే ఆ హుండీలో వేయండి. అని చేత్తో హుండి చూపిచ్చాడు. ఆ వచ్చినాయన దీక్షితుల గారికి పాద నమస్కారం చేసి వెళ్ళిపోయారు. మానాన్నగారు నన్ను పరిచయం చేశాడు. నాకు అంతకుముందు దీక్షితులు గారు తెలిసినప్పటికీ పెద్ద పరిచయం లేదు.
ఐదున్నర అడుగులెత్తుంటాడు. ముఖం గంభీరంగా వుంది. మనిషి కొంచెం నలిగినట్టనిపించాడు. పాత ధోవతి ఒకటి కట్టుకుని, ఒక తుండుగుడ్డ భుజాన వేసుకున్నాడు. పై నుదుటి మీద నామం పెద్దదిగా కన్పిస్తుంది. అతను నవ్వుతున్నాడో, గంభీరంగా వున్నాడో అర్థం కావడంలేదు.
ఆ మరుసటి రోజు నుంచి, నేను దీక్షితుల గారితో పాటు ఉదయాన్నే రాములవారి గుడికేళ్ళేవా. గుడితాళాలు, గర్భగుడి తాళాలు దీక్షితుల గారి దగ్గరే వుండేవి. ఆయన గర్భగుడి తాళాలు తెరవగానే, రాత్రి పోసిన నూనెతోనే దీపం వెలుగుతూ వుండేది. ఆయన నూనె డబ్బాతో దీపాన్ని పూర్తిగా నింపేవాడు. వెలుగు కొంచెం పెద్దదై గర్భగుడంతా పరుచుకునేది.
నేను గుడిలోనే ఓ మూల వున్న బావిలో బక్కెట్ తో నీళ్ళు తోడి, గర్భగుడిలోకి తీసుకువచ్చే వాడిని. ఆ నీళ్ళతో, ఆయన కొత్త పంచెను ముంచి, రాములవారి విగ్రహం మీదున్న వస్త్రాలు తీసి వేసి, విగ్రహాన్ని పూర్తిగా, నిదానంగా తుడిచేవాడు. ఆ పని చేస్తున్నప్పుడు ఆయన్ని చూస్తే తల్లి తన చంటిపిల్లకి స్నానం చేయించినట్టే వుండేది. సుతారంగా, నిదానంగా , ప్రేమగా తుడిచేవాడు.
తర్వాత ఇంటినుండి వుతికి తెచ్చిన వస్త్రాలను రాములవారికి , సీతమ్మ వారికి ,లక్ష్మణుడి కి కట్టేవారు. ఈ తంతును దీక్షీతులుగారు ప్రతినిత్యం చేసేవాడు.
ఆయనతో పాటు నేనూ రాములవారికి పూజచేసిన కొంచెం సేపటికి మిగిలిన అర్చకులు వచ్చేవారు. ఆ తర్వాత నాకు గుళ్ళోనే ఒక మూల సంధ్యావందనం నేర్పించేవారు. ఉదయం 7.30 గంటలకే స్వామివారికి నైవేద్యం పెట్టేవాళ్ళు. అప్పుడు అక్కడున్న పెద్దగంట కొడ్తారు. ఆ గంటతో వీధిలో వాళ్ళందరికి ప్రసాదం పెడ్తారని తెలుసు. ఆ ప్రసాదం రోజుకో రకం పులిహార, దద్దోజనం, పొంగలి, నెయ్యి పొంగలి ఏదో ఒకటి పెట్టేవారు. ఈ ప్రసాదాలను పరిచారిక ఈ గుళ్ళోనే వండేవారు. దీనికి కావలిసిన సరుకులు ” దిట్టం ” అంటారు. ఆ దిట్టాన్ని దీక్షితులుగారే గుళ్ళోని వంటరూము నుండి తాళాలు తీసి ఇచ్చేవారు.
ప్రసాదం తిన్నాక వెంటనే నేను ఇంటికి వెళ్ళి 9.00 గంటలకల్లా కాలేజీకి బయలు దేరే వాడిని. మళ్ళీ ఉదయానికే నేను దీక్షితులు గారిని కలిసేవాడ్ని. సంపత్ గారు నాకు అక్కడే పరిచయం అయ్యారు. ఆయన్నెందుకోగాని జనం వెర్రి మాలోకం పంతులుగా పిలిచే వాళ్ళు. అప్పట్లో అలా ఎందుకు పిలిచేవాళ్ళో నాకు సరిగా అర్థమయ్యేదికాదు. ఆకతాయిగా నేనూ ఆయన్ని చాటుగా అలాగే సంబోదించేవాణ్ణి . ఈ సంగతి చూచాయగా ఆయనకు తెలిసినా ఆయన ఏమీ అనేవాడు కాడు. ఆయన దీక్షితులు గారి వద్దకు సంస్కృతం నేర్చుకునేందుకు వచ్చేవారు. సంపత్ గారు నాకంటే పది పన్నేండేండ్లు పెద్దవారు. యూనివర్సిటీ లైబ్రరీలో చిన్న ఉద్యోగం. రోజూ ఉదయం మేము గుడి తెరిచే సరికి దీక్షితులగారి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చి జనం వేచివుండేవారు మొదట్లో నేను రాముల వారి దర్శనం కోసం వచ్చేవారనుకునేవాడిని కానీ ఒక్కోరూ ఒక్కో రకం సమస్యలను దీక్షితుల వారికి విన్నవించుకునేవారు. ఒకామే తన పిల్లవాడు రాత్రుళ్ళు దడుసుకుంటున్నాడని చెపితే దానికి దీక్షితుల వారు పిల్లవాడికి వినపడేట్టు ఆంజనేయదండకం చదవమనేవారు.
కొంతమంది తమ పిల్లల జాతకాల కోసం వచ్చేవారు. మంచి ముహుర్తాల కోసం, తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం, పిల్లల పెండ్లిండ్లు కోసం, ఉద్యోగాల కోసం, ఉద్యోగాల ప్రమోషన్ల కోసం, అంతెందుకు చుట్టూ ప్రక్కల ఎం.ఎల్.ఏలు కూడా స్వయానా ఆయన దగ్గరికొచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళేవారు. అయితే వీరందరికి దీక్షితులుగారు ఏ విభూది, కుంకుమో ఇచ్చేవాడు కాదు. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన మంత్రం చెప్పి దానిని ఒక 40 రోజులు చెయ్యమనేవాడు. అయితే ఎవ్వరి దగ్గర నయాపైసా తీసుకునే వాడు కాదు. ఏదైనా వుంటే రాముల వారి హుండిలో వెయ్యమనేవాడు.
దేవుడికి రోజూ కొన్ని వెండినగలు, ఇంకొన్ని బంగారు నగలు అలంకరిస్తారు. వాటిని మాత్రం గుళ్ళోని దేవుని విగ్రహానికే వుంచి తాళం వేసేవారు. అప్పుడు మిరాశీ వ్యవస్థ నడుస్తుండేది. మిరాశీ అయిన వ్యక్తి గుడికి అసలువచ్చేవాడు కాదు. ప్రధాన అర్చకుడైన దీక్షితులవారే మిరాశీలో పనిచేసేవాడు. నెలకు రెండువేలు జీతంగా ఇచ్చేవారు.
కొన్ని ప్రత్యేక ఉత్సవాలలోనే దీక్షితులుగారు తన ఇంట్లో వుండే దేవుడి నగలను రాములవారికి అలంకరింపచేసి, ఉత్సవం అయిన వెంటనే దీక్షితులగారింటికి తీసుకెళ్ళేవారు.
ఒకరోజు సాయంత్రం దీక్షితులు గారు పిలిస్తే ఆయనింటికెళ్ళాను. అది చాలా చిన్న యిల్లు. మొత్తం మూడు చిన్న గదులు హాలు అనుకునే దాంట్లో ఒక నులక మంచం, ఒక స్టూలు వుంది. మూడు గదులు వరుసగా వుండేవి. మూడో గది తర్వాత కొంచెం దూరంగా బాత్ రూమ్ వుండేది. నేను పోయేటప్పటికే ఇంటిల్లిపాది అక్కడ ఏదో తోముతున్నట్టనిపించింది.
నేను దగ్గరకెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. “కొంచెం సాయంపట్టు శర్మ,” అన్న దీక్షితులు గారి మాటతో ఈ లోకంలోకి వచ్చాను. అక్కడ ఆ గదినిండా రాములవారికి అలంకరించే బంగారు నగలున్నాయి. దీక్షితులు గారు, ఆమె భార్య, ఇద్దరు కూతుర్లు చింతపండుతోనూ, టెంకాయ పీచులతోనూ వాటిని శుభ్రపరుస్తున్నారు. శుభ్రపరిచిన వాటిని మెత్తని తుండుగుడ్డతో తుడిచి ఒక పెద్ద పెట్టెలో సర్దుతున్నారు.
“స్వామీ, ఇవంతా మనింట్లో ఎందుకున్నాయి,” అని ఆశ్చర్యాన్ని దాచుకొలేక అడిగాను. దాన్ని అర్థం చేసుకున్నట్టే దీక్షితులు గారు చెప్పనారంభించారు. గత ఎనిమిది తరాలుగా ఈ నగలు ఇంట్లోనే వుంటున్నట్టు తమ పూర్వీకుల నుండి వీటిని తను తీసుకున్నట్టు వీటన్నింటిని “తిరువాభరణం” అనే పెట్టేలో భద్రపరిచి, దానికి తాళం వేసి, దానిని తమ పూజ గదిలో భద్రపర్చేవారు.
రోజూ ఇంట్లో దేవునికి పూజచేసేటప్పుడు, వాటికి కూడా చేస్తారని రాములవారి ఉత్సవ సందర్భాలను బట్టి, ఆయా రోజులలో దానికి సంబంధించిన నగలను పెట్టెలో నుండి తీసుకు వెళ్ళి రాముల వారికి అలంకరించి ఉత్సవం అయ్యాక మళ్ళీ ఇంటికి తెచ్చి దాచేసేవాళ్ళు. తడిగుడ్డతో ఆ బంగారు నగలను తుడుచేస్తుంటే వాటి మెరుపులను తన్మయంతో చూస్తూ మరి వీటికి లెక్కలూ అవి ఎవరూ చెపుతారని అడిగాను. దానికి దీక్షితులు గారు తిరువాభరణం పుస్తకంలో ఈ నగలకు సంబంధించిన వివరాలుంటాయి. ఆ పుస్తకం గుళ్ళో దేవస్థానం అధికారుల దగ్గరుంటుంది. అయితే తొందరలో ఈ మిరాశీ వ్యవస్థ రద్దవుతుందని ఈ నగలు కూడా తొందర్లొ రాముల వారి గుళ్ళోనే పెట్టి దానికి సెంట్రీలను కూడా ఏర్పాటు చేస్తారని వివరంగా చెప్పారు. నాకింకా అయోమయంగానే వుంది. కొన్ని వందల సంవత్సరాలుగా దీక్షీతులవారింట్లో నగలుండటమేంది. ఇంత విలువైన నగలను ఇంట్లో వుంచుకుంటే దొంగలెత్తుకుపోతే పరిస్థితేంది.
ఆ ఆలోచనకే నాకు ఒళ్ళు చమటలు పట్టాయి. ఇంకో నగను, చేత్తో తీసుకుని, గుడ్డతో తుడుస్తున్నప్పుడు “స్వామి ఈ నగను మొన్న ఎం.ఎల్.ఏ గారు ఇచ్చినట్టున్నారు గదా………………… మీకేదో పెద్ద మొత్తంలో దక్షిణ యివ్వచూపితే తమరు స్వామికి సమర్పించమన్నట్టున్నారు. దానికి, దీక్షితులు గారి పెద్ద కుమార్తె కౌసల్య, నా వయస్సుదే, ” ఆ……..ఆయన ఇంటికి కూడా వచ్చాడు. ఈ ఇల్లు చూసి ఇంటిని మరమ్మత్తు తన స్వంత డబ్బుతో చేయిస్తానన్నా నాన్న ఒప్పుకోలేదు……………..దీనికి ఆయన నాలుగైదు సార్లు అడిగి ఇక చేసేదేం లేక ఈ భుజకీర్తులను రాములవారికి చేయించారు నిజానికి ఈ భుజకీర్తులు నాన్నగారివే” అంది.
“తప్పమ్మా కౌసల్యా……………..అట్లా అనకూడదు. మనము ఈ మాత్రం బతుకుతున్నామంటే ఆ కోదండరాముని దయాబిక్ష వల్లే. ఆయనే లేకుంటే మన కుటుంబం ఇంత హాయిగా బతికేదా” దీక్షితులు గారు తన్మయత్వం లో చెప్పుకుంటూ పోతున్నాడు.
ఇంతలో ఆయన చిన్న కూతురు సీత కలగజేసుకుంటూ, “మీరైన్నైనా చెప్పండి నాన్నగారు. రాముల వారిని మీరు భక్తితో కొలవడం మంచిదే కాని మీకు వచ్చిన దక్షిణలను కూడా తీసుకోకుండా చివరికి విగ్రహం ముందు హారతిస్తున్నప్పుడు ఆ పళ్ళెంలో వేసిన చిల్లరను కూడా మీరు హుండిలోవేయడం మంచిదిగాదేమో……… మన వీధిలో వారిని చూడండి. వారంతా భక్తులిచ్చే దక్షిణలను తీసుకుంటూ ఎంతహాయిగావున్నారో…………. ” తన భుజం మీద చిరిగిన జాకెట్టును శరీరం కనపడకుండా లాక్కుంటూ బింకంగా అంది. దీనికి వాళ్ళమ్మ కూడా వంత పాడుతూ, “మీ నాన్నగారిని అని ఏం ప్రయోజనం. మీ తాత కూడా అంతే అసలు దేవునికి ఇన్ని నగలు ఎవరు చేయించారంటావు. వీళ్ళ దగ్గర కావలిసినవి చెప్పించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళు, వీళ్ళకు దక్షిణ రూపంలో తమ కృతఙ్ఞతను తెలుపుకుందామంటే వీళ్ళు తీసుకోపాయో. అట్లా వాళ్ళు ఆ దక్షిణలతో రాముల వారికి నగల చేయించేవాళ్ళు. అసలు ఈ నగలంతా మన సొమ్మే,” అని గట్టిగా అంది. నాకు ఆమె వాదన కూడా న్యాయమనిపించింది.
నేను నావంతు వాదనను ప్రారంభించా. “అసలు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయించేదే అర్చకులు. ఎక్కడో వున్న శిల్పాన్ని మంచి ముహుర్తంలో తీసుకొనివచ్చి దానిని గుళ్ళో పెట్టి అనేక వేదమంత్రాలు నిష్ఠతో చదవడం వల్ల విగ్రహాలకు ఆ శక్తి వస్తుంది. ఇప్పుడు రాములవారికి ఇంతమంది భక్తులు వస్తున్నారంటే దానిని పరోక్షంగా దీక్షితులు వారి శక్తి సామర్థ్యాలు కూడా కారణం.” నేను ఆవేశంతో చెప్పుకుపోతుంటే దీక్షితులుగారు గట్టిగా, “ఇక ఆపండి మీ శుష్కవేదాంతాలు,” అంటూ అరుస్తూ భుజాన వున్న కండువాను నా ముఖాన విసిరేస్తూ విసవిస బయటికి నడిచి వెళ్ళారు. ఇంతకోపంతో వున్న ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. అందరం నిశ్శబ్దంగా అన్ని నగలను తిరువాభరణం పెట్టెలో పెట్టి తాళం వేశాం. దీక్షితులు కూతుళ్ళిద్దరూ ముందు గదిలోకి వెళ్ళిపోయారు. నేను దీక్షితులు గారి భార్య మిగిలాం. “చూడు శర్మ …………….ఈయన మారరు. మనమేదన్నా చెపితే వినరు. రేపు వీరికి పెళ్ళి ఎట్లా చేసేది. అస్సలు ఇప్పుడూ ఎట్లా చదివించేది. వారి తోటి వాళ్ళు మంచి ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదువుతున్నారు. వీళ్ళెమో మునిసిపాలిటి స్కూళ్లల్లో చదువుతున్నారు. పండగపూట కట్టుకోవడానికి మంచి బట్టల్లేవు. మేము బయటి బంధువుల కార్యాలకు వెళ్ళడమే మానేశాము. ఆయనంటే మగాడు ఒక పంచె, ఒక కండువా చాలు. దీనినే ఉతుక్కుని రోజు వేసుకుంటాడు. ఇంట్లో విషయాలు పట్టవు. ఎప్పుడు ఆ గుళ్లోనే. అస్సలు నన్ను అనవసరంగా కట్టుకున్నాడు. ఆ రాములవార్నే కట్టుకున్నా సరిపోయేది…………, ” అంటూ చెంగుని నోటిలో కుక్కుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది……….నాకేం చెయ్యాలో తోచలా………….
ఏమీ చెప్పలేక వస్తానండి అంటూ బయటికి నడిచా. దీక్షితులు గారు ఇప్పుడు గుళ్లో వుంటారని తెల్సు ఆయనికి మరీ బాధవచ్చినా, ఆవేశం వచ్చినా గర్భగుడిలో రాములవారి విగ్రహం ముందుకుర్చోని తదేకంగా ఆ విగ్రహాన్ని చూస్తూ ఏదో గొణుక్కుంటుంటాడు. అప్పుడు ఆయన మొహం ఒకరకమైన తేజస్సుతో వున్నట్టనిపిస్తుంది. దీనికి తోడు ఆ కాగడాల వెలుతురు ఆయన ముఖంమీద పడీ, ఒక వింతకాంతితో మెరుస్తుంటుంది. ఆ సమయంలో ఆయన్ని చూసిన భక్తులు రాములవారికి, దీక్షితుల గారికి కూడా దణ్ణాలు పెట్టి పోతుంటారు.
కొంత మంది భక్తులు రాములవారితో మాట్లాడుతున్నాడీయననుకుంటారు. నాకు మాత్రం ఆయన తనలో వుండే బాధను రాముల వారికి చెప్తున్నాడేమో అనిపిస్తూంటుంది. ప్రతిదానికి రాముడే చూసుకుంటాడు. రాముడుని నమ్మినవారికి జీవితాంతం కష్టాలుంటాయని జీవితం చివరిలోనే ఆనందం ఒక్కసారిగా వస్తుందని ఇప్పుడంతా రాముడి పరీక్షాసమయం అని తరుచూ అంటుండేవాడు. ఇంకా దానికి ఇతిహాసాలలోని కొన్ని ఉదాహరణలు కూడ చెప్తుంటాడు.
నాకెందుకో, దీక్షితులగారి పట్ల కొంచెం వ్యతిరేకత ఏర్పడింది. మరీ రాముని పిచ్చిలో వుంటున్నారనిపించింది. తనను నమ్ముకున్న భార్యనూ, పిల్లలనూ, సుఖపెట్టలేకుండా, ఈ విధంగా ఒక ఉన్మాదంగా రాముని సేవలో వుండటం కరెక్టు కాదనిపించింది. ఇక్కడ్నించే నాకు, దీక్షితులగారికి కొంచెం ఎడం ప్రారంభమైంది, తర్వాతర్వాత నేను డిగ్రీ చదివి ఏదో ఆడిటరు దగ్గర ఒక మోస్తరు ఉద్యోగంలో స్థిరపడటంతో నా జీవితం ఏదో నేను గడుపుతున్నాను. ఈ ముప్ఫై సంవత్సరాలలో దీక్షితులుగారు మారకపోయినా తన కూతుళ్ళను బాగా చదివించి, మంచి సంబంధాలు చూసి బాగానే పెళ్ళి చేశాడు. కాని దీక్షితులుగారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. ఈ మధ్యే గుండెనొప్పి వచ్చి మద్రాసు అపోలోలో ఒక నెలవుండొచ్చాడు. ఇదంతా ఆయన నగలు తాకట్టు పెట్టే చేసుంటాడని స్పష్టంగా అర్థమౌతూనే వుంది.స్కూటరు కుదుపులో ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చా ఎదురుగా పోలీసు స్టేషన్ అని బోర్డు వుంది.
సంపత్ గారు స్కూటరు పార్క్ చేసింతర్వాత ఇద్దరం స్టేషన్ లోపలికెళ్ళాం.
పోలీస్ స్టేషన్ లో మామాదిరే చాలామంది దీక్షితులు గారికి సాయం చేయడానికి వీలైతే ఆయన తాకట్టు పెట్టిన దేవుని నగలను తమ సొంతడబ్బుతో విడిపించడానికి సిద్ధంగా వున్నారు. అసలు దీక్షితులవారిని చూసే అవకాశం మాకివ్వలేదు. వీటన్నింటికన్నా కూడా ఇంకేదోచేయాలనిపించింది.
దీక్షీతులు గారు రాముడి నగలు తాకట్టు పెట్టడానికి ప్రధాన కారణం ఆయన చితికిపోయిన ఆర్థిక పరిస్థితి. ముప్ఫైఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నా ఆయన్నిఅర్చకుడుగా పర్మినెంటు చేయకపోవటం ఆయనకింకా నెలకి ఎనిమిది వేలేనన్న అసలు కారణం. దున్నేవాడిది భూమి అయినపుడు, ముప్ఫై సంవత్సరాలుగా రాముని కొలుపు చేస్తూ, రాముని నగలను కాపాడుతూ తన శక్తి సామర్థ్యాల ద్వారా అనేక నగలను రాముని వారికే చేయించి కూడా ఆ నగలపై తనకే మాత్రం హక్కులేకపోవడం కొంచెం చిత్రం అనిపించింది.
నేను దీక్షితుల వారిని చూసే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరం పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి బయలుదేరాం. స్కూటర్ దీక్షితుల గారి ఇంటి మీదుగా పోతుంది. నా తలమీద అలికిడి అయినట్లు అనిపించి తలెత్తి ఆకాశం వైపు చూశా. స్టేషన్ పోయేటప్పుడు దీక్షితులు ఇంటిమీదున్న రెండు పావురాలు కాస్తా చాలా పావురాలయ్యాయి. నేను చూస్తుండగానే అవి ఆ ఇంటి మీద నుండి బయలు దేరి రాముల వారి గుడి గోపురం వైపు నిశ్శబ్దంగా వెళ్తున్నాయి. వాటిని చూడగానే నేను ఏం చేయాలో స్ఫురించింది. కొంచెం మనసు తేలికయినట్టు అనిపించింది.
February 5th, 2010 at 4:40 pm
[...] తాకట్టు – కాంతి కుమార్ [...]