బోల్షెవిక్ విప్లవ పొలికేక "బ్యాటిల్‌షిప్ పొటెంకిన్"

దాదాపు పాతికేళ్ల క్రితం ఎస్వీ యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజుల్లో దూరదర్శన్‌లో ఒక మూకీ చిత్రం చూపించారు. నాటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచేవ్ భారత్‌ను సందర్శించిన సందర్భంగా చిత్రమేళా రూపొందించి రష్యన్ సినిమాలను వరుసగా చూపించారు. ఓ రాత్రి పది గంటల తర్వాత దూరదర్శన్‌లో చూసిన ఆ సినిమా వీక్షణ అనుభూతులు ఇప్పటికీ నాలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. అప్పటికే యుద్దనౌక పొటెంకిన్‌లోతిరుగుబాటు గురించి పుస్తకాల్లో, పేపర్లలో చదివి తెలుసుకోవడం వల్ల కూడా ఈ సినిమా అంటే పెద్ద కుతూహలం.

సినిమా చూశాక అన్నిటికంటే చివర్లో పొటెంకిన్ ఓడ పొగలు చిమ్ముకుంటూ వస్తున్నప్పుడు వినిపించిన, ఒళ్లు జలదరింపజేసే ఆ భయంకర సంగీతం నన్ను తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. ఆ ఓడ ఏమవుతుంది, దానిలోని మనుషులకు ఏమవుతుంది అనే భయం వెంటాడింది. సినిమా చూశాక పుస్తకాల్లో చదివినదాని కంటే మించిన ఉద్వేగం. ఎందుకంటే అది అప్పటికి 60 ఏళ్ల క్రితం రష్యాలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తీసిన చిత్రం. ఓ మహాదేశంలో విప్లవానికి నాంది పలికిన ఘటనకు సాక్షీభూతంగా నిలిచిన చిత్రం.

పాతికేళ్ల క్రితం నేను చూసిన ఆ అలనాటి అద్బుత చిత్రాన్ని గురించి పరిచయం చేయడమే ఓ ఉద్వేగాన్ని కలిగిస్తోంది. ప్రపంచ అత్యుత్తమ చిత్రాలను ఇప్పటి ఆన్‌లైన్ పాఠకులకు పరిచయం చేద్దామనే ఆలోచన ప్రాణహిత.ఆర్గ్ ద్వారా వాస్తవ రూపం దాలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

నిశ్శబ్ద చిత్రాల -మూకీ- చరిత్రలో తలమానికంగా నిలిచే చిత్రాలలో ‘ది బ్యాటిల్‌షిప్ పొటెంకిన్‌’కు అగ్రస్థానం ఉంది. సోవియట్ రష్యా చిత్రదర్శకుడు ఐజెన్‌స్టైన్ ప్రామాణిక కృషిగా ప్రపంచ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయిన బ్యాటిల్‌షిప్ పొటెంకిన్‌, సినిమా కళకు సంబంధించినంతవరకు సోవియట్ చలనచిత్ర సూత్రాలను ప్రపంచానికి అత్యంత శక్తివంతంగా చాటిచెప్పింది. చిత్రనిర్మాణంలో విడివిడి ఫోటోలను జతపర్చడానికి ఇచ్చిన ప్రాధాన్యత, కథా సంవిధానంలో బౌద్దిక సంపర్కానికి ఇచ్చిన ప్రాముఖ్యత, కథానాయక పాత్రలో వ్యక్తులకు బదులు ప్రజారాశులకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ చిత్రంలో సాటిలేని విధంగా కలగలిసిపోయాయి.

బోల్షెవిక్ మహా విప్లవానికి ముందు 1905లో రష్యా యుద్దనౌక ప్రిన్స్ పొటెంకిన్‌లో జరిగిన నావికుల పితూరీ కథే ఈ చిత్రకథ. చలనచిత్ర చరిత్రలో ‘బ్యాటిల్‌షిప్ పొటెంకిన్’ ఓ మూలమలుపు. ఆధునిక సినిమాకు నిర్వచనంగా నిలిచిన చిత్రమిది. ఈ చిత్రానికి ముందువరకు కెమెరాను నటీనటుల ముందు పెట్టి ఆ తర్వాత నాటకం లాగా సినిమాను ఫిల్మీకరించేవారు. ఐజెన్‌స్టైన్ ఈ సినిమాలో కెమెరాను నటనలో మూడోపార్టీగా ఉంచి చిత్రీకరించాడు. ఆ మహత్తర క్షణంలోనే ఆధునిక సినిమా ఆవిర్భవించింది.

దాదాపు 85 ఏళ్ల తర్వాత, ఈనాడు మనం స్పెషల్ ఎఫెక్టులను అందించే విషయంలో అద్బుతమైన సాంకేతిక పురోగతిని స్వంతం చేసుకున్నాం. అయితే అప్పట్లో ఈ చిత్రమే ఆధునిక సినిమాకు నాంది పలికింది. ఆధునిక వినోద సాధనమైన సినిమాపై మరే దర్శకుడు కూడా ఇంతటి ప్రభావం చూపలేకపోయాడంటే అతిశయోక్తి కాదు. మాటలు లేని సినిమా చరిత్రలో అత్యంత ప్రభావశీలురైన నలుగురు దిగ్గజాల్లో సెర్గీ ఐజెన్‌స్టైన్ ఒకరు. మిగతా ముగ్గురూ గ్రిఫిత్, ముర్నావ్ -Murnau-, చార్లీ చాప్లిన్. మూకీ చిత్రాల నిర్మాణంపై వీరు వేసిన ప్రభావం అంతా ఇంతా కాదు.

చిత్రనిర్మాణాన్ని సరిగా నిర్వహించినట్లయితే సినిమా ఎంత గొప్ప కళాఖండంగా తయారవుతుందో చూపడానికి ఈ చిత్రం ఓ గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది. సమకాలీన సినిమాలలో దేన్నీ ఈ చిత్రంతో సరిపోల్చలేము. ఇక్కడే ఈ సినిమా ఘనత కనబడుతుంది. సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా కాస్త డల్‌గా అనిపించడానికి, సినిమా చరిత్రను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఆసక్తి కలిగించడానికి కూడా ఈ సినిమా టెక్నిక్కే కారణం.

ఈ సినిమా మాస్కో నగరంలో తొలిసారిగా1925లో విడుదలయింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా డగ్లస్ ఫెయిర్‌బాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం రాబిన్ హుడ్ -1922-తో పోటీ పడింది. విప్లవానంతరం రష్యన్ కళా పునరుజ్జీవన సంకేతంగా నిలిచిన పొటెంకిన్ అమెరికా చిత్రం కంటే ఎక్కువ ఆర్జిస్తుందని సోవియట్ ప్రభుత్వం ఆశించింది. కాని హోరా హోరీగా సాగిన పోటీలో స్వల్ప ఆధిక్యతతో రాబిన్ హుడ్ అధికంగా ఆర్జించడం గమనార్హం. అంతమాత్రాన ఈ చిత్రం ప్రాధాన్యత తగ్గలేదు.

పిల్మ్ ఇనిస్టిట్యూట్‌లలో చిత్రనిర్మాణాంశాలను నేర్చుకునే విద్యార్థులలో ఓ పెద్ద జోక్ ఉండేది. నీకు ఇష్టమైనా లేకపోయినా మీ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ పదికి తొమ్మిదిసార్లు బ్యాటిల్‌షిప్ పొటెంకిన్ చిత్రంలోని ఒడెస్సా స్టెయిర్స్ దృశ్యాన్ని చూపించి తీరుతాడన్నదే ఆ జోక్. రష్యా విప్లవానికి సంబంధించిన పలు ఘటనలను దృశ్యాదృశ్యంగా చూపించిన ఒడెస్సా స్టెయిర్స్ మొత్తం సినిమాకే తలమానికమైన భాగంగా రూపొందింది. ఆ తర్వాత చలన చిత్ర చరిత్రలో పలు సినిమాలు ఈ దృశ్యాన్ని చూపిస్తూ వచ్చాయనడానికి నిదర్శనాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ‘అన్‌టచ్‌బుల్స్’ సినిమా క్లైమాక్స్ గుర్తుతెచ్చుకోండి.

ఐజెన్‌స్టైన్ తన కెరీర్ ప్రారంభంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఏదయినా ఉందంటే అది చిత్రం ఎడిటింగ్. దీన్ని ఆరోజుల్లో మోంటేజ్ అని పిలిచేవారు. తెలుగులో దీనికి ప్రకీర్ణకం అని నైఘంటికార్థం. ఒక ఫిల్మ్ తీసేటప్పుడు, తీసిన వేరువేరు ఫోటోలను ఎన్నిక చేసి సరైన రీతిలో కత్తిరించి ఒకచోట జతపర్చడం. మొత్తం చిత్రం భవిష్యత్తును నిగ్గుతేల్చేది కూర్పు. ఇదే ఎడిటింగ్. మన కాలపు సినిమాలలో ఎడిటింగ్ అనేది కథతో సంబంధం లేకుండా ఎంత దుర్వినియోగానికి గురవుతోందో అందరికీ తెలిసిందే.

ఇరవయ్యో శతాబ్ది తొలి దశాబ్దంలో రష్యా ప్రజల జీవితంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులను, నూతన ఆకాంక్షలను, ఆ ఆకాంక్షల ఫలితంగా అనివార్యంగా ఎదురయ్యే విషాదాలను ఐజెన్‌స్టైన్ అత్యంత ప్రత్యక్ష మార్గంలో సమర్పించి వాటిని ప్రపంచంతో పంచుకోవాలని ప్రయత్నించాడు. బ్యాటిల్‌షిప్ పొటెంకిన్ చిత్రాన్ని ఈ కోణంలో చూసినట్లయితేనే అది మనకు బాగా అర్థం అవుతుంది. తదనంతరం విజయవంతమైన బొల్షెవిక్ విప్లవానికి ఇది పొలికేకలాంటింది. అది పొటెంకిన్ యుద్ధనౌక నావికులు పెట్టిన పొలికేక. విప్లవవిజయంతోనే అది ఒకవలయం పూర్తి చేసుకుంది.

ఓడరేవుకేసి వస్తున్న నౌక, మెట్లమీద ప్రజలు, వారివైపే తుపాకులు పట్టుకుని వస్తున్న జార్ సైనికులు.. 1920ల లోనే ఇవన్నీ జరిగాయంటే నమ్మశక్యం కాదు. కాని అదే జరిగింది. దాన్నే ఐజెన్‌స్టైన్ సినిమాగా మలిచి చూపాడు. సమకాలీన అంశాన్ని కాలంతో పనిలేకుండా సర్వకాలాలవారినీ ఆకర్షింపజేయడంలో ‘బ్యాటిల్‌షిప్ పొటెంకిన్’ చిత్రంతో ‘జోన్ ఆఫ్ ఆర్క్’ సినిమా మాత్రమే పోటీ పడగలదని విమర్శకుల అంచనా.

తదనంతర కాలంలో ఐజెన్‌స్టైన్ స్వయంగా ఈ సినిమాపై పుస్తకం రాసి ఉండవచ్చు. కానీ బ్యాటిల్‌షిఫ్ పొటెంకిన్ చిత్రంపై ఇంతవరకూ వందలాది పుస్తకాలు వచ్చాయంటే, నమ్మశక్యం కాదు. ఒక సినిమాపై 80 ఏళ్లకాలంలో ఇన్ని వందల సమీక్షలు వచ్చిన ఘటన కూడా చరిత్రలో లేదు. ఇక సినిమా విషయానికి వస్తే ఇది ఓ సినిమాకు సంబంధించిన ప్రత్యేక కథ కంటే నాటకీయత పులమబడిన న్యూస్‌రీల్‌లా ఉంటుంది.

సినిమా ప్రారంభమే పితూరీతో మొదలవుతుంది. కుళ్లిపోయిన ఆహారాన్ని తమకు అంటగడుతున్న నౌక కెప్టెన్, తదితర అధికారులపై నావికులు తిరగబడటం కనబడుతుంది. ప్రారంభమే మహా పథకంతో మొదలవుతుంది. ప్రత్యక్షంగా రష్యా చరిత్రలో జరిగిన సంఘటనను ఆధారంగా తీసుకున్నప్పటికీ కథలో ఏ మసాలాలు జోడించకుండా ఉన్నది ఉన్నట్లుగా చూపడానికి ఐజెన్‌స్టైన్ ప్రయత్నించాడు.

మూకీ చిత్ర నిర్మాణంలో పెనుమార్పుకు, అంతిమంగా చిత్ర ప్రాశస్త్యానికి ఇదే కారణమైంది. ఏదైనా తిరుగుబాటు జరిగిన క్రమంలో నెలకొనే ఘోర ఘటనలు, నటులకు ఎలాంటి ప్రాధాన్యతా లేని కథ, బోల్షెవిక్ కథా సంవిధానం, శైలి వంటివి చూడదలుచుకున్న ప్రతిఒక్కరూ ఈ సినిమాను జీవితంలో ఒక్కసారయినా చూడాలని విమర్శకులు చెబుతారు.

తెలుగువారికి మాయాబజార్ లాగా ‘బ్యాటిల్ షిప్ పొటెంకిన్‌’ను ఎవరూ తాజాగా చూడలేరని ప్రతీతి. ఎందుకంటే సినిమా ప్రియులు ఎప్పుడో ఒకసారి, ఏదో ఓ సందర్బంలో ఈ సినిమా విశేషాలను ముందే తెలుసుకుని ఉండటమే దీనికి కారణం. సినిమాలో ఒడెస్సా మెట్ల వద్ద జార్ ప్రభుత్వ సైనికులు జరిపిన దారుణ హింసాకాండను తర్వాత ‘ది అన్‌టచ్‌బుల్స్’ తో సహా పలు చిత్రాలు అనేకసార్లు ప్రస్తావించాయి. అందుకే ఒరిజనల్ సినిమా చూడకముందే చాలా మంది ప్రేక్షకులు ఒడెస్సా మెట్లు ఉదంతాన్ని చూసే ఉంటారు.

వినోద మాధ్యమంగా ఈ చిత్రం ఎంత శక్తివంతమైందంటే పలు దేశాల్లో దీన్ని నిషేధించారు. చివరకు సోవియట్ యూనియన్‌లో కూడా దీన్ని నిషేధించారని వింటే మహాశ్చర్యం కలుగుతుంది. సినిమా చూస్తున్న వీక్షకులలో ఇది ఉన్నఫళాన తిరుగుబాటు భావాలను రెచ్చగొడుతుందని అప్పట్లో ప్రభుత్వాలు భావించాయంటే ఆశ్చర్యపడవలసింది లేదు. ఈనాటికీ ఈ సినిమా సాంకేతికంగా ప్రతిభావంతంగా ఉన్నప్పటికీ మన కాలంలో కార్టూన్ లాంటి సాధారణ చిత్రంగా ప్రపంచానికి అనిపించవచ్చు.

కానీ ఈ సినిమాను పూర్తిగా షాట్ తర్వాత షాట్‌గా చూస్తూ, 85 ఏళ్ల క్రితం ఐజెన్‌స్టైన్ ఈ మూకీ చిత్రం తయారీలో అనుసరించిన సాంకేతిక ప్రతిభకు అబ్బురపడే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక నేపధ్యం ఇంకా ఆసక్తి గొలుపుతుంది. పొటెంకిన్ యుద్ధనౌకలో తిరుగుబాటు జరిగి 20 ఏళ్లయిన సందర్భంగా బోల్షెవిక్ విప్లవానికి నాందిగా గుర్తింపుపొందిన ఆ ప్రసిద్ధ ఘటనల క్రమాన్ని చిత్రీకరించవలసిందిగా నాటి సోవియట్ విప్లవ నాయకత్వం ఆదేశించింది. సోవియట్ నాయకత్వం ఆదేశానుసారం తీసిన ఈ సినిమా అలా చరిత్రలో నిలిచిపోయింది.

పొటెంకిన్ తిరుగుబాటు ఘటనపై రష్యన్ కమ్యూనిస్టు పార్టీ నేత లెనిన్ వ్యాఖ్యానిస్తూ పాతవ్యవస్థను కూలదోయడంలో సైనికులు కార్మికవర్గంతో కలిసిపోయే పరిణామాలకు ఈ పితూరీ తొలిసాక్ష్యంగా నిలుస్తుందని చెప్పాడు.

ఇంతకూ ఈ సినిమా కథ ఏమిటి?

ఐజెన్‌స్టైన్ తీసిన ప్రకారం రష్యా యుద్దనౌక పొటెంకిన్ సిబ్బంది జపాన్‌తో యుద్ధం తర్వాత 1905లో నల్ల సముద్ర మార్గాన స్వదేశానికి తిరిగి వస్తూంటారు. నౌకలో కింది స్థాయి నావికా సిబ్బందికి నాసిరకం ఆహారపదార్దాలను అందించటంతో సిబ్బంది తీవ్రంగా నిరసన తెలుపుతారు. ఉదయం అల్పాహారం కింది ఇచ్చిన మాంసంలో పురుగులు ఉండటంతో నావికులు క్రుద్దులై గొడవకు దిగుతారు. నౌకలోని అధికారులు తిరగబడిన నావికులపైకి తార్పాలిన్ విసిరి వారిని కాల్చివేయవలసిందిగా ఆదేశిస్తారు. తుపాకులు గురిపెట్టిన సైనికులను ఉద్దేశించి తిరుగుబాటు నేత వకులించుక్ గట్టిగా అరచి ఇలా అంటాడు. “సోదరులారా మీరు ఎవరిని కాల్చబోతున్నారు?” వెంటనే కాల్పుల దళం తుపాకులను కిందికి దించుతుంది. ఒక అధికారి తిరిగి కాల్పులు మొదలెట్టమంటూ సైనికులను బలవంతపెట్టిన క్షణాన నౌకలో తిరుగుబాటు మొదలవుతుంది.

ఈలోగా పొటెంకిన్ యుద్దనౌకలో తిరుగుబాటు గురించి వార్తలు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. జారిస్టు ప్రభుత్వ పీడనకింద చాలాకాలంగా నలుగుతున్న పౌరులు నౌకలోని సిబ్బందికి అన్నపానీయాలను పంపిస్తారు. ఇక్కడే పొటెంకిన్ సినిమాలోకెల్లా అత్యద్భుత సన్నివేశం మనకు కనిపిస్తుంది. తిరుగుబాటు చేసిన సిబ్బందిపై దాడికి బయలుదేరిన జారిస్టు సైనికదళాలు పొడవాటి ఒడెస్సా మెట్లు దిగుతూ తమను చూసి భయంతో పారిపోతున్న అసంఖ్యాక పౌరులను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపుతారు. ఈ కాల్పుల్లో ఎంతోమంది అమాయకులు చనిపోతారు. ఓ బండిలో బిడ్డను ఉంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మహిళ సైనికుల కాల్పులకు గురై చనిపోవడంతో బిడ్డను ఉంచిన బండి గతితప్పి ఒడెస్సా మెట్ల మీదుగా జారిపోతుంది.

ఒడెస్సా మెట్ల వద్ద జరిగినట్లు తీసిన కాల్పుల ఘటన వాస్తవానికి అక్కడ జరగలేదు. 1905లోఒడెస్సా పట్టణంలో అడుగుపెట్టిన పైనికులు అమాయక పౌరులపై విచ్చలవిడిగా కాల్పులు జరుపుతారు. అయితే దర్శకుడిగా స్వేచ్ఛ తీసుకున్న ఐజెన్‌స్టైన్ పట్టణంలో జరిగిన అన్ని కాల్పుల ఘటనలకు మేళవింపులాగా ఒడెస్సీ మెట్ల వద్ద కాల్పుల ఘటనను రూపొందించి మూకీ చిత్రాల్లోనే చరిత్ర ప్రసిద్ధ సన్నివేశానికి నాంది పలికాడు.

ఒడెస్సీ మెట్ల వద్ద కాల్పుల సన్నివేశాన్ని అతడు ఎంత గొప్పగా తీశాడంటే ఈ నాటికీ ఆ సంఘటన నిజంగా జరిగిందనే చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒక అవాస్తవ ఘటనకు వాస్తవ రూపమిచ్చి అది నిజమే అని ప్రజలు నమ్మేలా చేసిన సన్నివేశం చలన చిత్ర చరిత్రలోనే అరుదైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోతుంది.

తర్వాతి కథ ఏమిటి? పొటెంకిన్ నౌకలో తిరుగుబాటు గురించి రష్యా యుద్ధవాహకనౌకకు తెలుస్తుంది. ఈ తిరుగుబాటును అణచివేసేందుకు అది ఒడెస్సా వైపు వేగంగా వస్తూంటుంది. పొటెంకిన్ మరియు విప్లవకారుల ఆధిపత్యంలోకి వెళ్లిన మరో డిస్ట్రాయర్ కూడా రష్యా యుధ్దవాహక నౌకవైపుగా బయలుదేరతాయి. కొన్ని నిమిషాల పాటు ఐజెన్‌స్టైన్ ఈ యుద్దవాహకనౌక, పొటెంకిన్‌లవైపు, ఓడల్లో సన్నాహక కార్యక్రమాలవైపు కెమెరా మళ్లించి ఏం జరగబోతుందో అనే తీవ్రమైన ఉత్కంఠను కలిగిస్తాడు. చివరి క్షణంలో పొటెంకిన్ నావికులు యుద్దవాహకనౌకలోని తమ సోదర సిబ్బందికి తమతో చేతులు కలపవలసిందిగా సంకేతాలు పంపుతారు. ఒక కాల్పు కూడా లేకుండా పొటెంకిన్ ఆ యుద్ధ వాహక నౌక కేసి పొగలు చిమ్ముతూ బయలుదేరుతుంది.

వర్గచైతన్యంతో కూడిన విప్లవాత్మక ప్రచారానికి మారుపేరుగా ది బ్యాటిల్‌షిప్ పొటెంకిన్ సినిమా 20వ శతాబ్ది సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా మొత్తంలో ఎక్కడా కూడా త్రీడైమెన్షనల్ కొలతలలో ఇమిడిపోయే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఐజెన్‌స్టైన్ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాడు. కాల్పుల్లో చనిపోయిన వకులించుక్ పాత్ర సైతం వ్యక్తిగా కాకుండా ఓ ప్రతీకగా మాత్రమే ఈ చిత్రంలో కనబడతాడు.

పొటెంకిన్ ఓడలో, ఒడెస్సా పట్టణంలో అన్నిచోట్ల మనకు వ్యక్తులు కాకుండా ప్రజారాశుల సామూహిక కార్యాచరణే కనబడుతుంది. సినిమా మొత్తంలో కనిపించే రాజకీయ డ్రామాను సమతుల్యం చేయడానికి దర్శకుడు వ్యక్తిగత డ్రామాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రష్యా చరిత్రలోని ఈ అద్బుత ఘటన ఆద్యంతమూ రాజకీయ పరిణామాలకు సంబంధించింది కావడంతో ఐజెన్‌స్టైన్ ఆ పరిధిలో తప్ప ఎలాంటి మెలోడ్రామాకు సినిమాలో అవకాశం ఇవ్వలేదు.

ఐజెన్‌స్టైన్ (1898-1948) సినిమా కూర్పు -మోంటేజ్-కు సంబంధించి సోవియట్ సూత్రాలను అనుసరించే విద్యార్థిగా, సలహాదారుగా చలనచిత్ర చరిత్రలో మిగిలిపోయాడు. చిత్తరువులను ఒకదాని వెంట ఒకటిగా కట్ చేసుకుంటూ పోవడం కాకుండా వాటిని దగ్గరకి చేర్చి సామీప్యత -juxtapositon- ను కలిగించాలని సోవియట్ చలన చిత్ర ఎడిటింగ్ సూత్రాలు ప్రబోధించేవి.

పొటెంకిన్ నౌక కెప్టెన్ తిరుగుబాటుదారులను ఉరితీయిస్తానని బెదిరించడం, నియంతలు నశించాలి అంటూ ప్రజలు నినాదాలు చేయడం, పిల్లవాడి చేతిని మిలటరీ బూటు నలిపివేయడం, ఓ పౌరుడి కళ్లద్దాల్లోంచి బుల్లెట్ దూసుకుపోవడం, విప్లవాన్ని స్వాగతించే పౌరుడికి కాళ్లు లేకపోవడం వంటి ఈ చిత్రంలోని దృశ్యాలన్నీ పై సూత్రాలకు అనుగుణంగా చిత్రీకరించినవే. వీటిలో ఎక్కడా మనకు వ్యక్తులు కనబడరు. వేగంగా జరిగిపోతున్న ఘటనలకు సంబంధించిన ప్రతీకలు మాత్రమే మనక్కనిపిస్తాయి.

అసాధారణమైన సెట్టింగుతోపాటు, చిత్ర సంగీతం కూడా పొటెంకిన్ చిత్రాన్ని పలుదేశాలు ప్రమాదకరంగా భావించేలా చేశాయి. అమెరికాలో, ఫ్రాన్సులో దీన్ని పలుసార్లు నిషేధించారు. బ్రిటిష్ చరిత్రలో ఏ చిత్రం కూడా పొటెంకిన్ చిత్రం మాదిరిగా సుదీర్ఘ నిషేధానికి గురైన ఘటన కనపడదు. ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తూ సోవియట్ యూనియన్ లోనే ఇది నిషేధానికి గురైంది. పొటెంకిన్ నౌకలో తిరుగుబాటు ఉదంతం పార్టీ లైన్‌కు భిన్నంగా ఉందనే కారణంతో ఈ చిత్రాన్ని స్టాలిన్ హయాంలో నిషేధించారంటే నమ్మశక్యం కాదు మనకు.

శాంతికాలంలో ఆసక్తి గొలిపించటానికి మాత్రమే పరిమితమైన చిత్రాలు అలజడి, ఆందోళనల కాలంలో సమాజం మొత్తంలో కదలిక తెస్తుంటాయి. పొటెంకిన్ కూడా ఈ కోవకు చెందింది కాబట్టే పలు సందర్భాల్లో, పలుదేశాల్లో చివరకు మాతృదేశంలో కూడా నిషేధానికి గురవుతూ వచ్చింది. ఇది చిత్రించిన సామాజిక పరిస్థితి తిరిగి పునరావృతం అవుతుందనే భయం వల్లే దేశదేశాల పాలకులు దీన్నొక ప్రమాదకర చిత్రంగా భావించి చర్యలు చేపట్టారు. ఒక చిన్న ఉదాహరణ. 1989లో చైనాలోని తియాన్మెన్ స్క్వేర్‌లో గనుక ఈ సినిమాను ప్రదర్శించి ఉంటే అది నాటి చైనా విద్యార్థుల్లో తిరుగుబాటు జ్వాలలను మరింతగా రేపి ఉండేదని పరిశీలకుల అభిప్రాయం.

గత శతాబ్ది తొలిపాదంలో రూపొందిన ఈ చిత్రం దశాబ్దాల అనంతరం కూడా దేశదేశాల సామాజిక జీవితాన్ని ప్రభావితం చేయగలిగేంత శక్తివంతంగా సంకేతాలు పంపింది కాబట్టే వివిధ దేశాల పాలనా వ్యవస్థలు దీన్ని భీతితోనే నిషేధించాయి. యుద్దనౌక సిబ్బంది అధికారులపై తిరగబడటం, ఆ తిరుగుబాటుకు పౌరులు మద్దతు పలకడం, చివరకు సైనికులు కూడా తిరుగుబాటులో కలిసిపోవడంతో తయారైన చిత్రం పాలకులను కాక ఇంకెవరిని భయపెడుతుంది మరి!

ఒక శతాబ్ది సామాజిక జీవితంపై ఇంతటి మహత్తర ప్రభావం వేసింది కాబట్టే, బెల్జియం రాజధాని బ్రస్సెల్‌లో 1958లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దీన్ని సర్వకాలాల్లో అత్యుత్తమ చిత్రంగా -గ్రేటెస్ట్ పిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్- ఎన్నుకున్నారు. ఆ సంవత్సరంలోనే మళ్లీ విడుదలైన ‘సిటిజెన్ కేన్’ చిత్రం ఆ తర్వాత 40 సంవత్సరాలపాటు ఉత్తమ చిత్రంగా నిలబడడం విశేషం.

అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్చన్నయుద్దం 1958లో పతాకస్థాయికి చేరుకోవడంతో పలు యూరోపియన్ వామపక్షవాదులు సమాజానికి మార్క్సిస్ట్ చికిత్స అవసరమని నమ్ముతూ వచ్చారు. వీరి దృష్టిలో పొటెంకిన్ అంటే ‘అధికారం’, ‘రాజ్యాధికారం’.

ప్రచ్చన్న యుద్దం ముగిసింది, సోవియట్ యూనియన్ కుప్పగూలింది. మార్కిస్ట్ రాజకీయ ఆచరణ విధానాలపట్ల గత శతాబ్దిలో ప్రపంచం మొత్తంలో ఉన్న సార్వత్రిక విశ్వాసం ప్రస్తుతం కాస్త సడలింది. చివరకు అమెరికాలోని ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థ పట్ల కూడా ప్రపంచ ప్రజల భ్రమలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో బ్యాటిల్‌షిప్ పొటెంకిన్‌కు ప్రపంచ అత్యుత్తమ చిత్రంగా ఇప్పుడు గుర్తింపు ఉండకపోవచ్చు కూడా. అయితే చలనచిత్ర చరిత్ర అధ్యయనంపై ఆసక్తి, అభిరుచి కలిగిన ఎవరైనా విస్మరించలేని మహత్తరచిత్రంగా దీని స్థానం చెక్కుచెదరదు.

చలనచిత్ర చరిత్ర నిర్మాణంలో కొత్త ఒరవడికి దారి తీసిన బ్యాటిల్‌షిప్ పొటెంకిన్ చిత్రం ఆన్‌లైన్‌లో విస్తృతంగా అందుబాటులో ఉంది. అధిక బ్యాండ్ విడ్త్ కలిగిన నెట్ కనెక్షన్‌నుంచి దీన్ని ఎవరయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 400 ఎంబీ పరిమాణంలో ఉండే ఈ చిత్రం ఇప్పటికే ఉత్తమ క్వాలిటీతో ఎవరివద్దయినా ఉంటే ఆసక్తి కలిగిన వారికి దయచేసి అందించగలరు. ఎవరివద్ద అయినా ఒరిజనల్ క్వాలిటీతో ఈ నిశ్శబ్ద చిత్రం ఉంటే నాకూ ఓ కాపీ ప్రసాదిస్తే సంతోషిస్తాను. బెంగుళూరులో ఒకరిద్దరు – విజయవర్దన్, శివరాంప్రసాద్ గార్లు- తెలుగుబ్లాగర్ల వద్ద ఈ చిత్రం కాపీ ఉన్నట్లు గుర్తు.

ఇది 20వ శతాబ్ది మానవాళికి అందించిన మేటి చిత్రం. ఏ వ్యవస్థ అయినా, అధికారం అయినా హద్దుమీరితే తిరుగుబాటు తప్పదన్న సంకేతానికి ప్రతిరూపంగా నిలిచిన చిత్రం. ఒక రకంగా ఇది మనకాలపు చిత్రం కూడా.. తప్పక చూడండి. ఎవరి వద్ద అయినా ఉంటే పంచుకోండి.
గమనిక: పొటెంకిన్ యుద్ధనౌకలో జరిగిన ఘటనలకు సాక్షీభూతులుగా నిలిచిన వారు ఇప్పుడు ఎవరూ లేరు. వీరిలో చివరి వ్యక్తి 1995లో దక్షిణాప్రికాలో నివసిస్తూ పోయారు. తిరుగుబాటులో పాల్గొన్న ప్రత్యక్షసాక్షిగా తను చెప్పిన విశేషాలు మరోసారి తెలుసుకుందాం.

అత్యుత్తమ చిత్రాలను పరిచయం చేయాలని ఎప్పటినుంచో ఉంటూవస్తున్న ఆలోచనను అక్షరరూపంలోకి తేవడానికి ప్రేరణ ఇచ్చిన వారు ప్రాణహిత అరుణ. ఎక్కడ రాస్తాంలే.. టైమ్ ఉండాలి కదా అనే నా బద్దకాన్ని వదిలించి వెంటబడి మరీ రాయిస్తున్న ఘనత తనదే. అందుకు కృతజ్ఞతలు. ప్రాణహిత జనవరి సంచికలో స్పార్టకస్ చిత్రంపై పరిచయం వచ్చిన విషయం తెలిసిందే.

కె.రాజశేఖర రాజు
చందమామ
blaagu.com/chandamamalu
krajasekhara@gmail.com
9884612596 (చెన్నయ్)

4 అభిప్రాయాలు »వీడియో / ఆడియో

4 అభిప్రాయాలు

  1. హెచ్చార్కె Feb 7, 2010 1

    వావ్, శాన్నాళ్లయ్యింది బ్యాటిల్ షిప్ పొటెమ్కిన్ సినిమా చూసి. మళ్లీ చూడ్డం కుదరలేదు. చాల సార్లు సినిమా గుర్తొచ్చేది. కథ/సినిమా భాగాలు పూర్తిగా గుర్తు రాక, కొంచెం బాధేసీది. రాజశేఖర్ గారు, కళ్లకు కట్టినట్టు కథ చెప్పడమే గాక, సినిమా గొప్పదనాన్ని.. ఆ సాంకేతిక విషయాలు అంతగా తెలియని నా వంటి వాళ్లకు కూడా అర్థమయి, మనసుకు హత్తుకునేలా చెప్పారు. సినిమా మళ్లీ చూసే వరకు మంచి దారి భత్యం. రాసి నందుకు రాజు గారికి, ఇంత మంచి వ్యాసం రాయించినందుకు ప్రాణహిత/అరుణ గారికీ అభినందనలు.

  2. రాజశేఖరరాజు Mar 18, 2010 2

    హెచ్చార్కె గారూ, మనఃపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్ర పరిచయంతో మీ పాతజ్ఞాపకాలను మళ్లీ తిరగతోడినందుకు సంతోషంగా ఉంది. తక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్న మా సిస్టం నుంచి ఈ సినిమాను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎక్కడో ఓ చోట లింక్ దెబ్బతిని సినిమా రన్ కావడం లేదు. అయినా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్నాము. తప్పక పూర్తి సినిమాను లాగగలమని నమ్మకం ఉంది. ఏప్రిల్లో రాబోయే ఈ కథ రెండో భాగం కోసం నేనూ ఆసక్తిగా చూస్తున్నాను. ప్రత్యామ్నాయ పత్రికలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా దీర్ఘకాలం బతకగలగడం చాలా అవసరం. మీ కష్టాలు నాకు తెలీవు. కానీ ఇబ్బందులనుంచి గట్టెక్కుతారని ఆశిస్తున్నాను.
    రాజు.

  3. ప్రాణహిత » ప్రాణహిత ఫిబ్రవరి 2010 సంచికకు స్వాగతం Apr 1, 2010 3

    [...] బోల్షెవిక్ విప్లవ పొలికేక “బ్యాటి… : కె రాజశేఖర రాజు [...]

  4. Rakesh Apr 16, 2010 4

    QUOTE
    “ఏ వ్యవస్థ అయినా, అధికారం అయినా హద్దుమీరితే తిరుగుబాటు తప్పదన్న సంకేతానికి ప్రతిరూపంగా నిలిచిన చిత్రం. ఒక రకంగా ఇది మనకాలపు చిత్రం కూడా..”
    UNQUOTE

    ఎంతటి కఠోర వాస్తవమిది?
    ఇదొక తిరుగులేని నిజం!!
    Thanks to Pranahita & specially to the writer of this article.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో