Feb2010
కళాకృతులూ, డైనొసార్లూ
వివిధ నాగరికతలు మొదలైన కొన్నివేల ఏళ్ళ క్రితం వాటిని ప్రతిబింబించే తాత్వికచింతనలూ, కళల చిహ్నాలూకూడా రూపొంది, ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వీటిలో కొన్ని సరిగా అర్థంకావు. ఉదాహరణకు మనదేశంలో వీణ తదితర సంగీతవాద్యాలలోనూ, కొన్ని దేవాలయశిల్పాలలోనూ ‘యాళి’ ముఖాలు కనిపిస్తాయి. సింహం ముఖంతోనూ, పక్షి శరీరంతోనూ కనబడే ఈ వింత ఆకారం మన ప్రాచీనుల ఊహాశక్తికి ఉదాహరణలా అనిపిస్తుంది. అలాగే ప్రాచీన గ్రీక్ కళారూపాల్లో పక్షి ముఖాలూ, సింహంవంటి జంతువు శరీరమూ కలిగిన చిత్రాలు కనిపిస్తాయి. వీటన్నిటికీ సహేతుకమైన వివరణలు లభ్యంకాని ప్రస్తుతకాలంలో వీటికి ఏవో సూచనప్రాయమైన సింబాలిక్ అర్థాలుంటాయనికూడా అనుకుంటారు. ఇది సరైన వివరణ కాకపోవచ్చు. అప్పటికాలంలో కొందరికైనా ఇటువంటి ఆకారాలను నిర్మించటానికి కొన్ని భౌతిక కారణాలున్నట్టుగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు. ఒకసారి ఇవి సాంస్కృతిక అంశాలుగా ఆమోదం పొందాక వీటి చిత్రీకరణ కళాత్మకమైనదిగా కొనసాగిఉంటుందని వారు ప్రతిపాదిస్తారు.
ఈ వింత జంతువుల చిత్రీకరణకు ఆధారం కేవలం కళాత్మకమైన ఊహాశక్తే కాదనీ, ఏనాడో అంతరించిపోయిన డైనొసార్ల శిలాజాలేననీ కొందరు పరిశీలకులు అంటున్నారు. ఆధునికయుగంలో జీవపరిణామశాస్త్రంద్వారా అవగతమవుతున్న ఈ రాక్షసిబల్లుల అవశేషాలు ప్రాచీనకాలంలోనే మనుషుల కంటపడ్డాయనీ, వాటిని అప్పటివారు తమకర్థమైన పద్ధతిలో అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారనీ తెలుస్తోంది.
డైనొసార్ల గురించిన నిశితపరిశీలనలు ఆధునికపద్ధతుల్లో మొదలైనది పంతొమ్మిదో శతాబ్దంలో. అయితే వీటి గురించి అంతకుపూర్వం ఎవరికీ తెలియదని కాదు. మధ్యయుగాల్లోనే కాక క్రీస్తుకు 2 వేల ఏళ్ళ క్రితంనుంచీ ఈ అవశేషాలు మనుషులకు అక్కడక్కడా కనబడుతూనే ఉండేవి. ఎన్నో మృగాల కళేబరాలూ, అస్థిపంజరాలూ అప్పటికే మనుషులకు తెలుసు. వాటినిబట్టి బతికున్నప్పుడు అవి ఎలా ఉండేవో వారు చెప్పగలిగేవారు. డైనొసార్ల ఎముకల రూపంలో వాటి శిలాజాలు కనబడినప్పుడు అదే జరిగింది. ప్రాచీన కళాకృతులు దాని పర్యవసానమే కావచ్చు.
చైనాకు ఉత్తరాన ఆల్తాయ్ పర్వతప్రాంతంలో బంగారం కోసమని ప్రాచీనకాలంలోనే తవ్వకాలు జరుగుతూ ఉండేవనీ, అక్కడ ఇసకదిబ్బల కింద డైనొసార్ల ఫాసిల్ శిలాజాలు బైటపడుతూ ఉండేవనీ తెలుస్తోంది. అక్కడి గోబీ ఎడారి ప్రాంతంలో ప్రోటోసెరాటాప్స్‌వంటి డైనొసార్ల శిలాజాలూ, వాటి గుడ్ల శిలాజాలూ పుష్కలంగా దొరుకుతాయని పరిశీలకులకు తెలిసినదే. మనుషుల, జంతువుల ఎముకలనుబట్టి శరీరనిర్మాణాన్ని అంచనావెయ్యగలిగిన అప్పటి పరిశీలకులు కొందరు వీటిని నిశితంగా పరిశీలించారు. ప్సిట్టకోసారస్ అనే డైనొసార్ చిలకముక్కువంటిది కలిగిఉండేది కనక పక్షిముఖాలు కలిగిన ప్రాణుల బొమ్మలు గీశారు. ఈ ఆకారాలకు బలమైన పక్షిముక్కూ, వాడిగోళ్ళు కలిగిన పంజాలూ, నాలుగుకాళ్ళ జంతువు శరీరాలూ కనిపిస్తాయి. అవన్నీ ఆసియా ఖండపు గతించిపోయిన గండభేరుండాలుగానో, పక్షి తలా, నాలుగుకాళ్ళ సింహపు దేహాలూ కలిగిన వింతప్రాణులుగా వాటికి రూపకల్పన చేశారు. ఆ ఆకారాలను చిత్రీకరించారుకూడా. తమ మతవిశ్వాసాలు ఎటువంటివైనా ఈ వింతజంతువులకు దైవికశక్తులతో సంబంధాలున్నట్టుగా ఎక్కడా ప్రస్తావన కనబడదు. అయితే వీటికేదో వాస్తవికత ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్రీ.పూ. 2000 నాటికే ఇది మొదలయింది. సుమేరియన్ నాగరికతలో ఆరాధించిన రెండు సర్పాలను ఇటువంటి జంతువులు కాపాడుతున్నట్టుగా బొమ్మలు గీశారు (పటం).
ఈనాటి దక్షిణరష్యా ప్రాంతపు నల్లసముద్రానికి ఉత్తరాన ఉన్న ప్రదేశాలకు క్రీ.పూ.675లో వెళ్ళిన గ్రీక్ యాత్రికులకు అక్కడ దిమ్మరులుగా తిరిగే తెగల మనుషులు కనిపించారని తమ యాత్రావిశేషాల్లో తెలియజేశారు.
ఆధునిక రష్యన్ పరిశోధకులు ఆ తెగల్లో రెండున్నవేల ఏళ్ళ క్రితపు శవాల మమ్మీలు కనిపెట్టి, వాటి శరీరాలమీద వింతజంతువుల ఆకారాలు పచ్చబొట్టు పొడిచిఉండడం చూశారు. క్రీ.శ. మొదటి శతాబ్దపు రోమన్ శాస్త్రవేత్త అయిన ప్లినీ ఈ జంతువుల రెక్కలు ఎగరడానికి పనికిరావని రాశాడు. దీన్నిబట్టి డైనొసార్ల శిలాజాలు ప్రాచీనులకు తెలిసినవేనని అర్థంచేసుకోవచ్చు. మనదేశంలోని ‘యాళి’ ముఖాలు (పటం) ఇతరదేశాల సాంస్కృతిక సంపర్కంవల్ల మన కళల్లోకి ప్రవేశించాయో, మన ప్రాచీనులకుకూడా డైనొసార్ల అవశేషాల గురించి తెలుసో చెప్పలేము. మొత్తంమీద ప్రకృతిలో ఆధునికకాలంలో ఎక్కడా కనబడని వింతజంతువులు ఈ కళాకృతుల్లో కనబడతాయనేది మటుకు నిజం.
చైనావారి సంప్రదాయంలో డ్రాగన్ అనే మొసలివంటి భయంకర మహాసర్పానిది ప్రత్యేకస్థానం. క్రీ.శ.1590లో ఆస్ట్రియాలోకూడా అటువంటి శిల్పాన్ని చెక్కారు. దీనికి ఆధారం ఇండోనేషియాలో నేటికీ కనబడే కొమోడో రాక్షసితొండ కారణం కావచ్చని కొందరంటే ఏనాడో అంతరించిన పెద్ద జడల ఖడ్గమృగమేనని మరికొందరు భావిస్తున్నారు. ప్రాచీన చిత్రకారులు వీటి శిలాజాల ఆధారంగానే వాటి శరీరాకృతులను ఊహించి చిత్రీకరించి ఉంటారని ఆ పరిశీలకుల ఉద్దేశం.
ప్రాచీన గ్రీక్ సంప్రదాయంలో గతకాలపు వీరుల ప్రస్తావన తరుచుగా కనిపిస్తుంది. వీరంతా కేవలం బలాఢ్యులేకారు; మహాకాయులుకూడా. మన పురాణాల్లోని యోధుల అసాధారణశక్తుల గురించి ఈ రోజుల్లో కొందరు తప్పుడు వివరణలిస్తున్నట్టే గ్రీకులుకూడా ఆ మహాకాయులను తమకన్నా మూడింతలు పెద్ద శరీరాలు కలిగిఉండేవారని నమ్మారు. ఎటొచ్చీ ఈ నమ్మకాలన్నీ కేవలం కవుల అతిశయోక్తులమీద ఆధారపడినవి కావని తెలుస్తోంది. ప్రాచీన గ్రీస్ ప్రాంతాల్లో మేమత్‌వంటి పెద్ద జడలఏనుగుల ఎముకలూ, శిలాజాలూ దొరుకుతూ ఉండేవని గుర్తించారు. ఆ ఎముకలను తప్పుగా పేర్చడంతో అదేదో అతిపెద్ద శరీరం కలిగిన మనిషి అవశేషాలని పొరబడే ప్రమాదం ఉంటుంది (పటం). తక్కిన చిన్నఎముకలకన్నా తొడఎముకవంటివి ఎక్కువగా దొరుకుతాయి. అది ఏనుగుదైనప్పటికీ నిపుణులు కానివారు దాన్ని మనిషిదేనని అనుకోవడం స్వాభావికమే. మొత్తం అస్థిపంజరాన్నే అవకతవకగా పేర్చినప్పుడుకూడా ఒక పర్వతాకారపు మానవశరీరంగా పొరబడవచ్చు. క్రీ.శ. రెండో శతాబ్దపు గ్రీక్ పరిశీలకులకు టర్కీలోని ట్రోయ్ ప్రాంతంలో పెద్ద ఎముకలు దొరికినప్పుడు వారు అవన్నీ క్రీ.పూ. 1200 ప్రాంతాల జరిగిన ట్రోయ్ యుద్ధంలో పాల్గొన్న మహాయోధుడు ఏజాక్స్(గ్రీక్ ఉచ్చారణలో అయియస్)కు చెందినవని భావించారట. పురాణాల్లో వర్ణించిన గొప్పయోధుల శక్తులను అక్షరాలా నిజమేనని నమ్మే ధోరణి ప్రతివారికీ ఉంటుందనీ, కనబడుతున్న సాక్ష్యాలను ఎలాగో అలా వాటికి అన్వయించుకుంటారనీ దీన్నిబట్టి తెలుసుకోవచ్చు.
చరిత్రలో అనేక సందర్భాల్లో జరిగినవేమిటో మనకిప్పుడు తెలిసే అవకాశం ఉండదు. కనబడుతున్న సాక్ష్యాలకు ఎటువంటి భౌతిక ఆధారాలూ, ప్రేరణలూ పనిచేశాయో ఆధునికపద్ధతుల్లో పరిశీలన జరపడంద్వారా శాస్త్రవేత్తలు కొంతవరకూ తెలుసుకోగలుగుతున్నారు. ప్రతివిషయాన్నీ మతాలతో ముడిపెట్టడం సరికాదనేదికూడా మనం గుర్తుంచుకోవాలి.
4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్





February 10th, 2010 at 2:13 am
వ్యాసం చాల బాగుంది. పురాణాల గురించి కొత్తగా ఆలోచించుకోడానికి ప్రేరణ ఇస్తుంది.
రోహిణి ప్రసాద్, రాజశేఖర రాజు రాస్తున్న వ్యాసాల వంటివి ‘ప్రాణహిత’కు వన్నె తెస్తాయి. ఇలాంటి అధ్యయనాత్మక వ్యాసాలు పాఠకులలో సాహిత్యం/కళల పట్ల సీరియస్ ఆసక్తి పెరగడానికి దోహదం చేస్తాయి.
February 11th, 2010 at 12:23 pm
గతాన్ని గురించిన సమాచారం ఏ యుగంలోనైనా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తుందని మనమ్ గుర్తించాలి. ఎటొచ్చీ ఆనాటి సంస్కృతిని బట్టి ప్రజల అభిప్రాయాలు రూపొందుతాయి. అవే సమకాలీన కళలలో ప్రతిబింబిస్తాయి.
February 12th, 2010 at 7:02 am
ఔను. గతాన్ని గురించిన ‘సమాచారం’ ఏ యుగంలోనైనా ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. నిజానికి ‘సంస్కృతి’ కూడా ఆ ‘సమాచారం’ ఆధారంగానే రూపొందుతుంది. సంస్కృతి పుట్టుకతో రాదు. పుట్టాక పరిసరాలతో చర్య-ప్రతిచర్యలకు గురయ్యే క్రమంలో మనం చాల సమాచారాన్ని జీర్ణించుకుంటాం (సొంతం చేసుకుంటాం). ఆ సమాచారం మీద ఆధార పడి సంస్కృతి రూపొందుతుంది. వ్యక్తి-స్థాయిలో చూసినా, గుంపు-స్థాయిలో చూసినా.. అలాగే జరుగుతుందని అనుకుంటాను.
We are not born with the ‘information’ but receive the ‘info’ in several ways after birth. And it is the ‘info’ that trains us. ‘Culture’ is nothing but this ‘training’ via ‘info’, I believe.
గతాన్ని గురించిన ‘సమాచారం’ ఆ ‘info’ లో భాగమే. ‘రాక్షస బల్లుల’ అవశేషాలు మన పూర్వీకుల ఊహల మీద ఛూపిన ప్రభావం ఈ ప్రక్రియకు అద్దం పడుతుంది. మన పూర్వీకులు వారి పూర్వీకుల గురించి చేసిన ఊహల వెనుక అప్పటికే వారు చూసి/తెలుసుకుని ఉన్న డైనోసార్ల అవశేషాలు ఎలా ప్రభావం చూపించాయో మీ వ్యాసం చాల చక్కగా ఇల్లస్ట్రేట్ చేసింది. ఇది పాఠకులు తమకు తాము ఆలోచించుకోడానికి సాయపడే మంచి వ్యాసాలలో ఒకటి..
info→training→culture విషయంలో నా అవగాహన తప్పైతే, సరిదిద్దాలని మనవి.
February 13th, 2010 at 12:53 am
డైనొసార్ల సంగతి దేవుడెరుగు.
సింహాలు అంతరించి పొతున్నాయోమొ కాపాడుకోండి ముందు.