Feb2010
కొన్ని మరణాల్లోంచి
మరణాల్ని కీర్తించడం కొత్తేమీ కాదు
మణికర్ణికా ఘాట్ లో
రగిలే ఆరని చితిమంటల్లో
నిత్యం నన్ను నేను దహించుకొంటున్నవాడ్నే
చరిత్రలో స్వర్ణ యుగాలంటూ ఉండవు
రాజు దైవాంశ సంభూతుడూ కాదు
పాలించే వాడెవడైనా
పదఘట్టనల కింద నలిగిన ఆత్మలు
మౌనంగా రోదిస్తూనే ఉంటాయి
చార్మినార్ ల సాక్షిగా
ఆకాశంలో నిలబడి జరుగుతున్న తంతును
వీక్షిస్తూనే వుంటాయి
నన్ను నేను మొలకెత్తించుకుంటున్న
చారెడు నేలపై మోపిన
రాక్షస పాదపు జాడలు
మనసులోంచి తొలగిపోలేదు
పురుగుల మందు సేవిస్తూనో
దూలానికి వేలాడుతూనో
నన్ను ఆక్రమించిన పాదాలను మోస్తున్న
బోయిలను గమనిస్తూనే ఉన్నాను
పెదాల చిరునవ్వులపై విరిసిన
కత్తుల్ని ఆస్వాదించిన వాడ్ని
నువ్వు నడిచెళ్ళిన దారుల్లొ
తెగిపడిన శిరస్సుల్ని
పోగుచేసుకొంటున్న వాడ్ని
తారీఖులు దస్తావేజులతో పనిలేని
యుద్ధాలలో చెల్లాచెదరైన వాడ్ని
నువ్వు విసిరిన ఎంగిలిమెతుకులే
పరమాన్నంగా భావించి
నీముందు మోకరిల్లిన వాడ్ని
ఇప్పుడు
మళ్ళీ
నా మరణంలోంచి
కొత్తగా మాట్లాడుతున్నాను
అడవులో వాగులో వంకలో
ఏవైతేనేం
నేను తిరిగి పచ్చగా చిగురించి
జనంలొకి ప్రవహించడానికి
ప్రవాహం గమనాన్ని మార్చుకొన్నా
ఎప్పటికైనా దాని లక్ష్యం జనాన్ని చేరడమే
నేను ఎన్ని సార్లు మరణించినా
తిరిగి తిరిగి మొలుస్తూనే ఉంటాను
శ్మశాన వైరాగ్యాన్ని ఆలపించను
మట్టి కోసం
మనిషి కోసం నిరంతరం పరిగెడుతూనే
ఉంటాను.
February 7th, 2010 at 4:38 am
there was no death for people’s word.
it was the declaration of sun. the destrayer of darkness.
poeple people we see poeple every where and around us,
moving and living as words with strength of tomorrow’s sunlight.
final lines of your poem is fine
February 7th, 2010 at 11:24 am
నమస్తే. ఫర్వాలేదు.
February 8th, 2010 at 8:17 am
కవిత ముగిసినా.. పచ్చగా చిగురిoచిoది…మనసు మూలల్లొ!
February 10th, 2010 at 7:28 am
బ్యూటిఫుల్ పొయెమ్. ఓటమి గురించి స్పృహ, ఓడిపోయినా, పోరాడతాననే స్పృఃహ అభినందనీయం.’ ‘కత్తుల్ని ఆస్వాదించిన వాడ్ని’… ఇక్క డ ఆస్వాదించడం అనే మాట సరైనది కాదనుకుంటా, చాల మంది అలా రాస్తున్నారెందుకో? (కొందరు కవులు ‘స్పృశించడం’ అనడానికి ‘స్పర్శిండం’ అని రాయడం కూడా ఇలాంగే తరచు జరుగుతున్న తప్పు)
February 21st, 2010 at 1:31 am
హెచ్చార్కె గారూ నమస్తే. కత్తుల్ని ఆస్వాదించడం అనేది ఒక కొత్త ప్రయోగం గా రాసాను. మీరు చెప్పిన తరువాత ఆలోచిస్తే నాకు కూడా అదే అనిపించింది. కృతజ్ఞతలు.
April 1st, 2010 at 1:14 am
[...] కొన్ని మరణాల్లోంచి : బండ్ల మాధవ రావు [...]