Feb2010
నవలను చదివించే విమర్శ ‘అతడు – ఆమె : మనం’
మంచి సాహిత్య విమర్శ మంచి సాహిత్యాన్ని చదివేట్టు పాఠకుల్ని ప్రోత్సహిస్తుంది. సాహిత్య పఠనను ప్రోత్సహించడం మాత్రమే గాక, పాఠకులలో సాహిత్యంపట్ల, సమాజంపట్ల ఆలోచనల్ని రేకెత్తించి వాళ్ళ సంస్కారంలో మార్పు తీసుకొని వస్తుంది. రచయితలు సమాజం ఎలా ఉంది, అలా ఎందుకుందో చెబితే; విమర్శకులు సాహిత్యం ఎలా ఉందో, అలా ఎందుకుందో చెబుతారు. ఇద్దరి ప్రయత్నమూ పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి కర్తవ్యోన్ముఖులను చేయడమే.
గాంధీజీ నాయకత్వంలోనే నడిచిన భారత జాతీయోద్యమాన్ని విమర్శనాత్మక దృక్పథంలో విశ్లేషిస్తూ లక్ష్మణరావు దినచర్య కథనంలో రాసిన బృహన్నవల, ‘అతడు – ఆమె’. ఈ నవల 1950 ప్రాంతాల్లో వచ్చినా 1980 దాకా ఆ నవల మీద గట్టి అధ్యయనం జరగలేదు. విప్లవసాహిత్యం ఉధృతంగా వస్తున్న సమయంలో, ఉద్యమాలు మన సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తున్న సమయంలో, స్వాతంత్ర్యోద్యమం మీద, దాని ఫలితాల మీద పెద్ద విమర్శ వస్తున్న నేపధ్యంలో ఓల్గా గారు ఆ చైతన్యంలోంచి “అతడు – ఆమె :మనం” అనే విమర్శగ్రంథం రాశారు. అప్పటి దాకా ఈ నవల మీద మంచి విమర్శలు అంతగా రాలేదు. “తెలుగు నవల- సామాజిక చైతన్యం” అనే అంశం మీద పరిశోధన చేసిన పి. సంజీవమ్మగారి గ్రంథం అప్పటికి అచ్చుకాలేదు. తెలుగు నవలా చరిత్రలు రాసిన వాళ్ళు కూడా ఈ నవలను గురించి ఏమి రాయలేదు. ఒక గొప్ప నవలను గురించి ఎవరూ సమీక్షించకపోవడం తెలుగు సాహిత్య విమర్శలోని లోపమని భావించి ఆ లోపాన్ని సరిదిద్దడానికి ఓల్గా గారు ఈ భిన్నగ్రంథం రాశారు.
ఉప్పల లక్ష్మణరావు మార్క్సిస్టు రచయిత. ఆయన నవల, “అతడు – ఆమె”. లక్ష్మణరావును అభ్యుదయ రచయితగా, ఆ నవలను అభ్యుదయ నవలగా సైద్ధాంతికంగా నిర్వచించుకొని తర్వాత నవలా విమర్శ చేసారు ఓల్గా గారు. రచయిత సాహిత్యాన్ని, రచయిత జీవితాన్ని విడదీసి చూడలేని రచయితలు ఎప్పుడూ పరిమితంగానే ఉంటారు. అంటే సిద్ధాంతానికీ ఆచరణకీ మధ్య వైరుధ్యంలేని రచయితలు తక్కువ సంఖ్యలో ఉంటారని అర్థం. ఆ తక్కువ మంది రచయితలలో ఉప్పల లక్ష్మణరావుగారు ఒకరని గుర్తించారు ఓల్గాగారు.
జీవితాన్ని అర్థంచేసుకోడానికి జీవితానుభవంతో పాటు, జీవితాన్ని నడిపించే సూత్రాలు తెలిస్తే సాహిత్యం వాస్తవికతకు నిజమైన ప్రతిఫలనం కాగలదు. చాలామంది రచయితలకు ఎంతో కొంత జీవితానుభవం ఉంటుందిగాని, జీవితాన్ని నడిపే సూత్రాలు తెలియవు. ఈ రెండూ తెలిసిన కొద్ది మంది రచయితలలో లక్ష్మణరావుగారు ఒకరని ఓల్గాగారు పేర్కొన్నారు.
జీవితానుభవం, దాని వెనక ఉండే వాస్తవం, జీవితాన్ని నడిపిస్తున్న సూత్రాలు, రచనాసామర్థ్యం, ఈ నాలుగూ కలిసి లక్ష్మణరావుగార్ని గొప్పరచయితని చేశాయని ఓల్గాగారు సూత్రీకరించారు. ఒక రచయితను ఫలానా అని నిర్వచించడం వెనక ఎంత చింతన అవసరమో ఓల్గాగారు పరోక్షంగా చెప్పారు.
‘అతడు -ఆమె’ నవలలో రెండు అంశాలను ఓల్గా గారు క్షుణ్ణంగా చర్చించారు. 1. జాతీయోద్యమం 2. స్త్రీ పురుష సంబంధాలు. ఈ రెండంశాలను వివేచిస్తూనే, ఈ నవల పాఠకుల మీద ఎలాంటి ప్రభావాన్నిచూపిస్తుందో కూడా చర్చించారు. ఈ నవల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారాలను గురించి ఆలోచించే సంస్కారానిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉద్యమరచనలు రెండు రకాలుగా ఉంటాయి. 1. ఉద్యమాన్ని ప్రత్యక్షంగా వివరంగా వర్ణించే, చిత్రించే రచనలు. ఈ రకం రచనలు చేసే రచయితలు సాధారణంగా ఆ ఉద్యమనాయకత్వంతో మమేకమౌతారు. 2. ఉద్యమం సమాజంలోని భిన్న వర్గాలను ఎలా ప్రభావితం చేసిందో ప్రదర్శించే రచనలు. ఈ రకం రచనలు చేసే రచయితలు సాధారణంగా ఆ ఉద్యమాన్ని విమర్శనాత్మక దృష్టితో పరిశీలిస్తూ ఉంటారు. ఓల్గాగారు ‘అతడు -ఆమె’ నవలను రెండో రకం నవలగా గుర్తించారు.
సాహిత్యవిమర్శ రెండు రకాలుగా ఉంటుంది 1. ఒక రచనను తీసుకొని అది ఒక నిర్దిష్ట కాలపు సామాజిక జీవితాన్ని ఎలా ప్రతిబింబించిందో చెప్పి, దానిలోని మంచి చెడ్డలను వివరించేది. 2. ఒక రచనని ఒక నిర్దిష్ట కాలపు సామాజిక జీవితానికి ప్రతిఫలంగా వివేచించి వదిలేయకుండా, ఆ రచనకు, విమర్శ రాస్తున్న కాలానికి గల సంబంధాన్ని కూడా చర్చించడం. ఈ రెండో రకం విమర్శకు చాలా చారిత్రక ఙ్ఞానం కావాలి. ఒక నాటి రచనను వర్తమాన కాలానికి ముడిపెట్టి వివరింపగల నేర్పుకావాలి. ఓల్గాగారు ఈ ఙ్ఞానమూ, నేర్పుగల విమర్శకులు గనక ‘అతడు – ఆమె’ నవలను ఒక చారిత్రక సందర్భానికి పరిమితమైన నవలగా మాత్రమే వ్యాఖ్యానించకుండా 1950 లలో ఆ నవలలో రచయిత తన పాత్రలతో చేయించిన వ్యాఖ్యలు ఈనాడు ఏమయ్యాయో చర్చించారు! అతడు ఆమె నవలలో పచ్చి అవకాశవాది, స్వార్థపరుడు ఆయిన న్యాయవాది శాస్త్రి గాంధీజీ ఉద్యమాన్ని గురించి, ఆయన ఆశయాలను గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు. “నీతికీ రాచరికానికీ మేళం కుదురుతుందా! రెండింటికీ సమన్వయం చేయ్యాలని గాంధీ అన్నంత మాత్రాన కుదురుతుందా? అంతేకాదు. అస్పృశ్యతా నివారణ, హిందూ మహమ్మదీయ ఐక్యత అని ఎంత అరుస్తున్నాడో, అంతగా హిందూ మహమ్మదీయ ద్వేషం, బ్రాహ్మణ శూద్ర ద్వేషం, పంచమ ద్వేషం స్థిరం ఐపోతుంది. ఇంక స్వరాజ్యమా ఇంగ్లీషు వాళ్ళకీ మనకీ పుస్తె ముడి మరింత బిగిస్తుంది” ఇదీ శాస్త్రి వ్యాఖ్య, దీనిని ఉదాహరించిన ఓల్గాగారు “అతను ఏదో ధోరణి లో ఆలోచించాడనేది పక్కన బెడితే శాస్త్రి ఆలోచనలు చాలావరకు ఈనాడు నిజమై కూర్చున్నాయి.” అని వర్తమాన దృష్టితో వ్యాఖ్యానించారు. వర్గపోరాటం అనివార్యమవుతున్న దశలో వర్గ సామరస్యాన్ని బోధిస్తే ఏం జరుగుతుందో పాఠకులలో ఆలోచనలు రేకెత్తించడానికే లక్ష్మణరావుగారు ఆ మాటలు శాస్త్రి తో పలికించారంటారు. “మనకోసం ఆలోచించి పెట్టే రచయితలకంటే మనలో ఆలోచనలు రేకెత్తించగలిగిన రచయిత సమర్ధుడు” అన్న సూత్రీకరణ అద్భుతమైనది. సాహిత్య విమర్శ రచనను వ్యాఖ్యానించడం వరకే పరిమితం అయితే, దానివల్ల కలిగే మేలు పరిమితం. దానితోపాటు కొన్ని సూత్రీకరణలు చేస్తే విమర్శ వల్ల కలిగే ప్రయోజనం అపరిమితం. ఓల్గాగారి విమర్శ ఈ రెండో రకం విమర్శ.
జాతీయోద్యమకాలంలో జరిగిన రెండో ప్రపంచయుద్ధం సమయంలో భారతదేశ కమ్యూనిస్టుల పాత్రమీద కమ్యూనిస్టు పాత్ర అయిన లక్ష్మితో ఆమె చెల్లెలు శుభ “ఈ ఉద్యమంవల్ల మీరు అవలంబించవలసిన వైఖరి సరిగా, నిశ్చయంగా తెలీక పోవటం చేత మీ పార్టీ గొప్పయిరకాటంలో పడిందన్నమాట. ఈ వైఖరి ప్రభావం చాలా కాలం వరకూ మీ పార్టీని వెన్నాడుతుంది.” అంటుంది. ఈ వాక్యాన్ని ఉదాహరించిన ఓల్గాగారు “ఆ మాట నిజమయిందని మనకు చరిత్ర చెబుతూనే ఉంది” అన్నారు. ఈ మాట ఊరికే అనడం కాదు. అనడానికి ముందు ఆమె 1942 నాటి భారత కమ్యూనిస్టు వ్యవహారసరళి మీద చాలా చర్చ చేశారు. ఆ చర్చంతా చదివితే ఒక చారిత్రకనవలలోగాని, ఒక రాజకీయ నవలలో గాని, ఒక్క వ్యాసం మీద లేదా ఒక్క అభిప్రాయం మీద సాహిత్య విమర్శకులు వ్యాఖ్యానించాలంటే ఎంత విఙ్ఞానం అవసరమో తెలుస్తుంది. చరిత్ర తెలియని సాహిత్య విమర్శ వాచక పరిచయం గానే మిగిలిపోతుంది. చరిత్రతో రచనను సమన్వయం చేసి, చేసే విమర్శ, చరిత్రాత్మకం అవుతుంది. ఓల్గా గారిది ఈ రెండోరకం విమర్శ.
‘అతడు – ఆమె’ నవల జాతీయోద్యమం ఎవరిమీద, ఎలాంటి ప్రభావం వేసిందో చర్చించిన ఓల్గాగారు, జాతీయోద్యమంలో ఏ వర్గపు పాత్ర ఎలాంటిదో కూడా ఆ నవల ఆవిష్కరించిందని పేర్కొన్నారు. ధనిక వర్గం జాతీయోద్యమాన్ని తమ స్వప్రయోజనాలకు ఎలా వినియోగించుకుందో నవలలో రచయిత చెప్పారని శాంతం పాత్ర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారు. “గాంధీ మొదలు పెట్టిన ప్రతి ఉద్యమాన్ని ఆ రోజుల్లోనే సంపన్న వర్గాలు క్యాష్ చేసుకున్నాయి”. ఈ వాస్తవాన్ని నవల వాస్తవికంగా ప్రదర్శించిందన్నారు.
1929 – 30 ల మధ్య రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీ ప్రవర్తనను, ఉద్యమనాయకత్వాన్ని శాంతం జాగ్రత్తగా గమనిస్తుంది. ఆమె మంచి గాంధీయన్, కాంగ్రెస్ వాది. గాంధీ ఉధృతమౌతున్న ఉద్యమాలను ఆపెయ్యడం; కాన్ఫరెన్స్ లో చెయ్యవలసిన పని ఒకటైతే, మరో పని చెయ్యడం వంటి విషయాలను గమనించిన శాంతం “నాయకత్వంలో ఉందా లోపం. అసలు తత్వంలోనే ఉందా!” అని ఆలోచించింది. విమర్శకులుగా ఓల్గాగారు, శాంతం అలా ఒక ఆలోచన చెయ్యడానికి దారి తీసిన పరిస్థితులనన్నిటినీ చరిత్రలోంచి తవ్వి తీసి శాంతం ఆలోచనకు సమన్వయించింది. విమర్శకులు రచయితలకన్నా రెండాకులెక్కువ చదువుకోవాలి అన్న కొ. కు అభిప్రాయం ఇక్కడ సార్థకమైంది.
అతడు ఆమె నవలలోని జాతీయోద్యమాన్ని గురించి చేసిన చర్చకన్నా మూడురెట్ల ఎక్కువగా ఆ నవలలో చిత్రింపబడిన స్త్రీ పురుష సంబంధాలను గురించి ఓల్గాగారు చర్చించారు. “సమాజంలో స్త్రీ పురుష సంబంధాలెలా ఉన్నయో, అలా ఉండడానికి కారణాలేమిటో లక్ష్మణరావుగారు చాలా వివరంగా చర్చించారు” అంటూ వాటిని లోతుగా అధ్యయనం చేశారు. ఈ భాగమంతా చదివామంటే సాహిత్యంలో మానవ సంబంధాలను, అందులో ముఖ్యభాగమైన స్త్రీ పురుష సంబంధాలను ఎలా పరిశీలించాలో తెలుస్తుంది.
ఈ నవలలోనేగాక, ఆధునిక సమాజంలో కూడా స్త్రీ పురుష సంబంధాలెలా ఉన్నాయో తెలుసుకోడానికి ఓల్గాగారు ఒకచిన్న సంఘటనను ఎత్తిచూపారు. శాస్త్రి ఇంటికి ‘హిందూ’ దిన పత్రిక వస్తుంది. అది రాగానే శాస్త్రి వార్తలున్న పేజీలన్నీ తాను తీసుకుని ప్రకటనలున్న పేజీలు శాంతకిస్తాడు. ఓల్గాగారు పురుషాహంకారమంటే ఇదేనని మన సమాజంలోని స్త్రీ పురుష సంబంధాలను తెలుసుకోడానికి ఇది చాలని చెబుతారు. “సోషలిస్టు వ్యవస్థ మాత్రమే స్త్రీని అనేక సమస్యలనుండి బైట పడవేయగలుగుతుందని సోవియట్, చైనా దేశాల అనుభవం వల్ల మనం తెలుసుకోవచ్చు”, అన్న అవగాహన గల ఓల్గాగారు ‘అతడు – ఆమె’ నవల స్త్రీ పురుష సంబంధాల చిత్రణ ద్వారా సామాజిక చరిత్రకు సాహిత్యం గొప్ప ఆధారమైనదని రుజువు చేశారు.
సీత అనే పన్నెండేళ్ళ అమ్మాయి గర్భం వచ్చి నొప్పితో శాంతం ఇంటికి వచ్చి, ఆమెను ఆశ్రయిస్తుంది. ఆమె కూతుర్లు లక్ష్మి, శుభలు సీతను, గౌరి అనే డాక్టరు ద్వారా ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోతారు. అప్పటికి గర్భవిచ్ఛిత్తి నేరంగా పరిగణింపబడుతున్న విషయాన్ని ప్రస్తావించిన సీనియర్ డాక్టర్ ఒక లాయరును సంప్రదించి ప్రాణాపాయ స్థితితో ఆపరేషన్ చెయ్యవచ్చని తెలుసుకుని ఆపరేషన్ చేస్తారు. ఇది జరిగిన తర్వాత ఇదొక అరుదైన కేసనీ, దీనిని గైనకాలజిస్టు కాన్ఫరెన్స్ లో నివేదించి పేరు పొందుతానని డాక్టర్ సంబరపడగా, లాయర్ తన ఫీజు సంగతి చూసుకుంటాడని ప్రస్తావించి ఓల్గాగారు “సమాజంలో జరిగిన ఒక ఘోరమైన అన్యాయం వల్ల తాము లాభం పొందారు ఈ యిద్దరు మేధావులు”, అని వ్యాఖ్యానించారు. శుభ మాత్రం ఈ సంఘటనకు చలించిపోయిందని గుర్తు చేశారు. పేద స్త్రీ పట్ల నాగరిక సమాజం ఎలా స్పందింస్తుందో ఈ సంఘటనను వ్యాఖ్యానించడం ద్వారా ఓల్గాగారు మనల్ని ఆలోచనల్లో పడవేస్తారు.
స్త్రీ పురుష సంబంధాలను ఆరోగ్యకరంగా నిలిపే ప్రేమ భావనను ‘అతడు – ఆమె’ నవల ఎంత అద్భుతంగా చిత్రించిందో, ఓల్గాగారు సుదీర్ఘంగా చర్చించారు. శాస్త్రి, శాంతం, శుభ, జనార్ధనం జంటలను తీసుకొని ‘అతడు – ఆమె’ నవలలో చిత్రించిన ప్రేమ భావనలోని వైవిధ్యాన్ని విశ్లేషించారు. పెళ్ళి – మాతృత్వవాంఛ వీటి మధ్య గల తారతమ్యాలను ఈ నవల ఆధారంగా చర్చించారు.
పెట్టుబడిదారీ సమాజం స్త్రీ సౌందర్యాన్ని కూడా సరుకుగా మార్చిన వైనాన్ని ఈ నవల ఆధారంగానే చర్చించారు. వీటన్నింటినీ చర్చించి “స్త్రీ తన రక్షణ తాను చేసుకోగలదనీ ఆమె మనసుకీ, శరీరానికీ ఆమే అధిపతి అనీ, ఏ రకంగానూ తానామెపై పెత్తనం చెయ్యటం, గార్డియన్ గా వ్యవరించటం చేయకూడదని పురుషులనుకున్న రోజున, స్త్రీ పురుష సంబంధాలు మెరుగుపడతాయి” అని తీర్మానించారు. శుభ పాత్ర ఆధారంగా స్త్రీలలో ఉండే పెట్టీ బూర్జువా మనస్తత్వాన్ని నిరూపించారు. చిట్టచివరిన “ఇద్దరికీ వ్యక్తిత్వం ఉన్నపుడే స్నేహం వృద్ధిపొందుతుంది. ఏ ఒక్కరు యింకొకరిపై ఆధారపడినా స్నేహభావం పోయి బానిస బంధమే మిగులుతుంది” అని ప్రకటించారు.
స్త్రీల పాత్రలను చిత్రించడంలో లక్ష్మణరావుగారు గొప్ప సంస్కార హృదయంతో వ్యవహరించారంటూ; శాంతం, శుభ, లక్ష్మి, సూరమ్మ పాత్రలను ఆయన ఎలా చిత్రించారో ఓల్గా గారు ఎంతో ఆసక్తికరంగా పరిశీలించారు. ఒక నవలలో పాత్ర చిత్రణను నిర్దిష్టమైన కోణం నుంచి ఎలా పరిశీలించాలో ఈ పరిశీలన నేర్పుతుంది. స్త్రీల వ్యక్తిత్వం పట్ల ఎంతో నిబద్ధతగల ఓల్గాగారు “నవలచదువుతుంటే స్త్రీల పట్ల ఆయన చూపిన కరుణకు మనస్సు కృతఙ్ఞతతో నిండిపోతుంది. . . . . ఒక్కో సన్నివేశం చదువుతుంటే ఈ భావాలన్నీ కలగలిపి కన్నీళ్ళతో రచయిత పాదాలకు నమస్కరించాలనిపిస్తుంది,” అన్నారు. భౌతికవాది అయిన విమర్శకులు ఇలా అన్నారంటే లక్ష్మణరావుగారు వ్యక్తిత్వం ఎంత ఉన్నత మైందో మనం అర్థం చేసుకోవచ్చు.
లక్ష్మణరావుగారు పాత్రల మనస్తత్వాన్ని చిత్రించే సమయంలో సాంఘిక పరిణామాన్ని ఎప్పుడూ మరచిపోరని ఓల్గాగారంటారు. సాధారణంగా మన సాహిత్యంలో పాత్రలు అయితే మంచివి, కాకపోతే చెడ్డవిగా ఉంటాయని; బలమూ, బలహీనత కలగలిసిన పాత్రలు అరుదుగా కనిపిస్తాయని అన్నారు. శాంతం పాత్ర అలాంటిదని నిర్దారించారు. తెలుగు సాహిత్యంలోనే అరుదుగా లక్ష్మణరావుగారు శాంతం పాత్రను ప్రజాతంత్ర మహిళగా రూపొందించారని ప్రతిపాదించారు. శాంతం కన్నా మిక్కిలి నిర్మొహమాటంగా మాట్లాడే గుణం లక్ష్మికి కమ్యూనిస్టు భావాల వల్ల కలిగిందన్నారు. సుమ పాత్ర కొంత గందరగోళంగా ఉంటుందన్నారు. ఈ నవలలో సూరమ్మ పాత్ర ప్రత్యేకమైనది. ఓల్గాగారు సూరమ్మను “జీవితంలోని కఠిన సత్యాలలో నుండి సూటిగా నడిచొచ్చిన పాత్ర” అని గోర్కీ అమ్మను లీలగా తలపించే పాత్ర” అని నిర్వచించారు. బహుశా “స్వేచ్ఛ” నవలలో కమలమ్మ పాత్రకు ఈమె మూలమేమో అనిపిస్తుంది. అలాగే అచ్చమ్మ పాత్రను గూడా ఓల్గాగారు ప్రగతిశీల దృష్టితో చూశారు. “అభివృద్ధికరమైన ఆలోచనలు పుట్టేది కేవలం మేధావులు, ఉన్నతవర్గాల వారి బుర్రల నుంచే కాదనీ, కష్ట జీవులు జీవితానుభవాల ద్వారా జీవిత వాస్తవాలను తెలుసుకోగలరనీ తెలిసిన వారికి సూరమ్మ పిన్ని పాత్ర అతి సహజంగా అనిపిస్తుంది ” అని అభిప్రాయపడ్డారు. “స్త్రీ పాత్రలను, అందమైన గాజుబొమ్మలుగా సెంటిమెంట్ల పుట్టలుగా కాక చైతన్యవంతులుగా చిత్రించటం ఈ నవల లోని ప్రత్యేకత ” అని ఈ చర్యను ముగించారు.
ఈ పుస్తకం చివర్లో ‘అతడు – ఆమె’ నవల మీద కమ్యునిస్టు సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళు ఒకరకంగా, అవి తెలియని వాళ్ళు ఒక రకంగా- వ్యతిరేక ఆలోచనలు చేస్తూ ఉండటాన్ని ప్రస్తావిస్తూ ఓల్గాగారు రాసిన రెండు పేరాలు చదివితే, ఇవాళ గురజాడ, శ్రీశ్రీల మీద సంప్రదాయవాదులు, కొందరు ప్రగతిశీలవాదులు పెడుతున్న విమర్శలకు సమాధానం చెబుతున్నట్టుగా ఉంది.
ఒక మంచి నవలను ఆరోగ్యకరంగా విశ్లేషించడమెలాగో, విశ్లేషణను పాఠకులకు అర్థమయ్యే భాషలో చెప్పడమెలాగో, రచయితల లాగే విమర్శకులు కూడా పాఠకులకు ఆలోచనలు రేకెత్తించడం ఎలాగో ఓల్గాగారు ఈ పుస్తకంలో చాటిచెప్పారు.
ఈ పుస్తకమంటే నాకు చాల యిష్టం. ఎందుకంటే ఈ పుస్తకం ద్వారానే నేను నవలా పాఠకుడనయ్యాను గనక. నేనూ రోజూ అనంతపురం విశాలాంధ్ర బుక్ హౌస్ లో ‘అతడు – ఆమె’ నవల రెండు భాగాలను చూస్తూ ఉండే వాడిని. నిండు చందమామ, ఒకజంట దానిని చూస్తూ నిలబడుకొని ఉండటం చూచి, అదేదో వ్యాపార నవలై ఉంటుందనుకొని వెళ్ళిపోయేవాడిని. ఒకనాడు ఓల్గాగారి “అతడు ఆమె :మనం” అనే పుస్తకం కనిపించింది. ఓల్గాగారిని గురించి తెలిసున్నందువల్ల ఆ పుస్తకం కొని చదివితే, నేనిన్నాళ్ళూ చూస్తూ విస్మరిస్తూవచ్చిన పుస్తకం ఇంత గొప్పదా అని ఆశ్చర్యపడి వెంటనే ఆ నవలను కొని చదివాను. అప్పుడే కన్యాశుల్కం నాటకాన్ని పాఠంగా చెబుతున్న నాకు ఆ నవలలో, ఆ నాటకం మీద చాలా వ్యాఖ్యానాలు దొరికాయి. అప్పుడే నాకు కన్యాశుల్కం నాటకం లోంచి ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అంటూ నిష్క్రమించిన గిరీశం, ‘కొండు భట్టీయం’ లో డిగ్రీ చదివి, తర్వాత ఏమయ్యుంటాడు అని ప్రశ్నించుకుంటే, ‘లా’ చేసి ‘అతడు, ఆమె’ లో పతంజలి శాస్త్రి గా అవతరించి ఉంటాడనిపించి నా విద్యార్థితో “గిరీశం, పతంజలి శాస్త్రి – తులనాత్మక పరిశీలన” అనే అంశం మీద పరిశోధన చెయ్యించాను. ఉత్తమ సాహిత్య విమర్శ, ఉత్తమ సాహిత్యం చదవడానికి పాఠకుల్ని ప్రోత్సహించడమంటే ఇదే.
ramnarsimha Feb 8, 2010 1
చాలా బాగుంది.
9866314321