Feb2010
నీకెలా నమస్కరించను?
చందమామను జేబులోకి తెచ్చుకున్నవాడా
మబ్బుల గిన్నెలో వెన్నెలని జీవితం చేసుకున్నవాడా
ఉద్యమ సముద్రంలో అలుపు లేకుండా ఈదినవాడా
వీరుడా నీకు జోహార్
ఇది స్వప్నమో జీవితమో
ఇది నిజంగా నిజమో లేక అబద్దమో
అర్థ రాత్రి ఇలా సూర్యుడు పొడుస్తాడా
పగిలిన మృదంగం ఎంత బాగా నాదించింది
వీరుడా ఒక్క చిరునవ్వు నవ్వు
భాగోతం తైతక్కలాడింది
డప్పు గొంతు విప్పింది
అర్థరాత్రి తుపాకి దెబ్బ విని
అరిచే ఖడ్గ మృగం ఉలిక్కి పడింది
వీరుడా నిన్నెలా ప్రశంసించను
ఆకాశం నిండా ఆత్మగౌరవం జండా
రెపరెప లాడిన క్షణం ఇది
వర్షపు చినుకులకు దున్నపోతు
చలించిన క్షణం ఇది
మూడున్నర కోట్ల ఊపిరి దీపాల నిశ్చలతకు
సుడిగాలి తోక ముడిచిన క్షణం ఇది
వీరుడా నీకెలా నమస్కరించను