Feb2010
నేర పరిశోధన
ఆంగ్ల మూలం: సర్ ఆర్థర్ కోనన్ డాయిల్
తెలుగు: కొడవటిగంటి కుటుంబరావు
పూర్వ భాగం
1. మిస్టర్ షెర్లాక్ హోమ్స్
1878లో లండన్ విశ్వవిద్యాలయంలో డాక్టరాఫ్ మెడిసన్ పట్టం సంపాదించి, సైనిక వైద్యాధికారి కావటానికిగాను ప్రత్యేక శిక్షణ పొందటానికై నెట్లీ వెళ్ళాను. అక్కడ శిక్షణ పూర్తికాగానే నన్ను ఫిప్త్ నార్తంబర్లాండ్ ఫ్యుసిలియర్స్ దళంలొ అసిస్టెంట్ సర్జన్ గా నియమించారు. ఆ సమయంలో ఈ దళం ఇండియాలో ఉన్నది. నేను దానిని చేరుకునే లోపుగా రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఆరంభమయింది. నేను బొంబాయిలో దిగేసరికి మా దళం వాయవ్య కనుమలు దాటి శత్రుదేశంలోకి చాలా దూరం చొరబడినట్టు తెలిసింది. నా స్థితిలొ ఉన్న మరి కొందరు ఉద్యోగులతో కలిసి నేను సురక్షితంగా కంధహారు చేరి నా దళాన్ని కలుసుకుని పనిలో చేరాను.
ఈ యుద్ధంలొ అనేక మందికి ఖ్యాతీ, ప్రమోషనూ లభించాయి. నాకు మాత్రం దురదృష్టమూ, దుష్కర్మా తప్ప ఏమీ దక్కలేదు. నన్ను నా దళం నుంచి బెర్క్ షైర్స్ దళానికి మార్చారు. మేవాండ్ దగ్గర జరిగిన ఘోర యుద్ధంలో నేను కూడా పాల్గొన్నాను. ఆ యుద్ధంలోనే నా జబ్బలో తూటా తగిలి ఎముక విరిగిపోయింది. నా ఆర్డర్లీ, ముర్రే, నన్ను సాహసంతో గుర్రం మీద పడవేసి బ్రిటిష్ శ్రేణి వద్దకు చేర్చకపోయినట్లయితే నేను ఘాజీలకు చిక్కి ఉండవలసిందే.
బాధతో కుంగిపొయి, అంతులేని కష్టాలకు శుష్కించి, మిగిలిన క్షతగాత్రులతో బాటు నేను కూడా పెషావర్ లోని బేస్ హాస్పిటల్ కు చేర్చబడ్డాను. ఇక్కడ నేను కొంత కోలుకుని వరండాలోకి వచ్చి ఎండలో చలికాచుకునే స్థితికి వచ్చిన సమయంలో నన్ను మలేరియా పట్టుకుంది. కొన్ని మాసాలపాటు నా ఆశ వదులుకున్నారు. తిరిగి నేను మనుష్య ప్రపంచంలో పడినాక నా దుర్బలస్థితి చూసి మెడికల్ బోర్డు వారు, నేను తక్షణమే ఇంగ్లండుకు బయలుదేరాలని నిర్ణయించారు.ఆ ప్రకారమే నన్ను “ఒరోంతిస్ ” అనే సైనిక నౌకలొ ఎక్కించగా మరొక నెలకు పోర్ట్స్ మత్ రేవులొ అడుగుపెట్టాను. నా ఆరోగ్యమేమో శాశ్వతంగా దెబ్బతిన్నది గాని దానిని బాగుచేసుకునేటందుకు ప్రభుత్వంవారు నాకు తొమ్మిది మాసాలు గడువిచ్చారు.
ఇంగ్లండులో నాకు నా అన్నవాడు లేడు. అందుచేత రోజుకు పదకొండున్నర షిల్లింగుల భత్యం మీద ఎంత స్వేచ్ఛగా గడపవచ్చునో నాకంత స్వేచ్ఛ! ఈ పరిస్థితిలో నేను సహజంగా లండన్ చేరుకున్నాను. అక్కడ స్ట్రాండ్ లోని ఒక హోటల్లో బస పెట్టి నాకున్న కొద్ది డబ్బును ఖర్చు పెట్టదగినదానికంటె జోరుగా కొంత కాలం ఖర్చు చేశాను. నాకు సుఖం లేకపోయింది. నా జీవితానికి అర్థమూ లేకపోయింది. చివరకు నా ఆర్థిక స్థితి ఎట్లావచ్చిందంటే, నేను నగరం వదిలి ఏ పల్లెపట్టునో బూజుపట్టడమో, లేక నా జీవిత విధానం పూర్తిగా మార్చుకోవటమో తప్ప గత్యంతరం లేకపోయింది. హోటలు వదిలి పెట్టి నగరంలోనే కొంచెం మారుమూలగా చవుకగా భాగం ఒకటి అద్దెకు తీసుకోవటానికి నిశ్చయించుకున్నాను.
ఈ నిశ్చయానికి వచ్చిననాడే నేను క్త్రెటిరియన్ బార్ లొ నిలబడివుండగా ఎవరో నా భుజం మీద తట్టారు. వెనక్కు తిరిగి చూసి నా కింద వెనక డ్రెస్సర్ గా పనిచేసిన స్టాంఫర్డ్ ను గుర్తించాను. నా బోటి ఒంటరిగాడికి ఈ లండన్ మహారణ్యంలో ఎరిగిన మొహం కనబడటం ఆనందమే మరి. వెనక ఇతనితో నేను చనువుగా మసిలి యెరగను కాని ఇప్పుడతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించాను. అతను కూడా నన్ను చూసి సంతోషించినట్టే కనబడ్డాడు. ఆ పారవశ్యంలొ నేనతన్ని హాల్బార్న్ కు నావెంట భోజనానికి రమ్మన్నాను. ఇద్దరమూ బగ్గీ యెక్కి బయలుదేరాం.
“నీకేమిటొచ్చింది, వాట్సన్? పూచికపుడకలా అయిపోయి అట్లా నల్లబడిపోయావ్?” అన్నాడతను.
నేను నా సొద సంగ్రహంగా అతనికి చెప్పుకునేసరికి మేం గమ్యస్థానం చేరాం.
“పాపం!” అన్నాడతను నా విషాదగాధ యావత్తూ జాలిగా విని, “ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు?”
“ఎక్కడన్నా భాగం అద్దెకు దొరుకుతుందా అని చూస్తున్నాను. ఆటే అద్దె పెట్టకుండా సౌకర్యమైన గదులు దొరుకుతాయా అని!” అన్నాను.
“చిత్రంగా వుందే,” అన్నాడు నా మిత్రుడు, “ఇవాళ ఈ మాట నాతో అన్నది నువ్వు రెండోవాడివి.”
“మొదటి వాడెవడు?” అని అడిగాడు.
“ఆస్పత్రిలో కెమికల్ లెబరెటరీలో పనిచేసుకుంటూ ఉంటాడు.ఎక్కడో చక్కని గదులున్నాయనీ, తాను అద్దె యావత్తూ ఇచ్చుకోలేననీ, తనతో భాగం కలిసే వాడు లేకుండా ఉన్నాడనీ ఈ ఉదయమే నా దగ్గిర మొత్తుకున్నాడు.”
“అరె, అతనితో భాగం కలవాలంటే నేను కలుస్తానే! నేను ఒంటరిగా ఉండటంకంటె మరొకరి తోడుండటమే నయం,” అన్నాను.
స్టామ్ ఫర్డ్ నాకేసి విచిత్రంగా చూసి, “నువ్వింకా షెర్లాక్ హోమ్స్ నెరగవు. అస్తమానం అతనితో కలిసి వుండవలిసొస్తే నీకిష్టం ఉండదేమో,” అన్నాడు.
“ఏమిటి అతనిలో లోపం?”
“అతనిలో లోపం ఉందని కాదు. అదొరకం మనిషి – కొన్ని శాస్త్ర విషయాలలొ అతనికి వల్లమాలిన ఆసక్తి. నాకు తెలిసినంతమటుకు అతను యోగ్యుడే.”
“వైద్యం చదువుతున్నాడు కాబోలు?” అన్నాను,
“లేదు – అతనేం చెయ్యదలుచుకున్నాడో నాకేమీ తెలీదు. అతనికి ఎనాటమీ బాగా తెలుసు. రసాయన శాస్త్రంలో ఉద్దండుడు. కాని వైద్యం చదవటానికి అతను యత్నం చేసినట్టు కనబడదు. అతనేదో మారుమూల విషయాలను గురించి శ్రద్ధగా చదువుతుంటాడు. కొన్ని విషయాల్లో మటుకు అతను ప్రొఫెసర్లనుకూడా పరిగెత్తించగలడు.”
“ఏం చదువుతున్నావని నువ్వెప్పుడూ అతన్ని అడగలేదా?”
“లేదు.అడిగితే చెప్పే ఘటమా? బుద్ధి దొర్లితే తనంతట తానే చెబుతాడుగాని!”
“ఒకసారతన్ని చూస్తాను. ఇంకొకరితో కలిసి భాగం తీసుకుంటున్నప్పుడు రెండో మనిషి చదువు మీద ఆసక్తిగలవాడూ, శాంతంగా ఉండేవాడూ అయితేనే మంచిది. హడావిడి మనిషికి నా నరాలు తట్టుకోలేవు. నాజన్మకు సరిపడే హడావిడి నాకు ఆఫ్ఘనిస్తాన్ లోనే లభించించి. అయితే నీ స్నేహితుణ్ణి నేను కలుసుకోవటమెట్లా!”
“అతను శతవిధాల లేబరెటరీలొ దొరుకుతాడు. ఒక్కోసారి వారాల తరబడి అటుకేసి రాడు ; లేదా రాత్రింబగళ్ళు అక్కడే పడివుంటాడు. భోజనమయాక అటుకేసి పోదామా?”
“అలాగే,” అన్నాను. తరువాత ఇతర విషయాలేవో ముచ్చటించుకున్నాం.
బార్బరస్ వదిలి ఆసుపత్రికి పోయే సమయంలొ నాకు సహనివాసి కానున్న మనిషిని గురించి స్టామ్ ఫర్డ్ మరికొన్ని వివరాలు తెలిపాడు.
“మీ ఇద్దరికి కుదరకపోతే నన్ననొద్దు, లెబరెటరీలొ తరచు తగులుతూవుంటామన్నమాటే తప్ప నేనతన్ని ఎరగను కూడానూ, నీ పూచీ మీదనే అతనితో భాగం చేరు
“అంతగా మాకు కలవకపోతే సులభంగా విడిపోవచ్చుగద, కాని స్టామ్ ఫర్డ్. నువ్వీ విధంగా చేతులు దులుపుకోవటానికేదో కారణం వుండి వుండాలి. ఇతను కోపిష్టి వాడుగాని కాడుగద, నీళ్ళు నమలక చెప్పెయ్యి.”
“చెప్పటానికి వీలులేనిదాన్ని గురించి ఎట్లా చెప్పటం?” అన్నాడతను నవ్వుతూ. “అంత మరీ శాస్త్ర పిచ్చి గలవాళ్ళు నాకు నచ్చరు – అతనికెక్కడా ఉద్రేకమన్నదే వున్నట్టు కనబడదు.ఏదన్నా కొత్తరకం విషందొరికితే దాని ఫలితాలు పరిశీలించటానికి స్నేహితుడిమీదనే ప్రయోగించే రకం. ఏమాటకా మాటే చెప్పాలి, అటువంటి పనిని అతను ద్వేషం కారణంగా చెయ్యడు ; అదీగాక తనే ఆ విషాన్ని అంత ఉత్సాహంతో తీసుకోగలడుకూడా. ప్రతి విషయమూ స్పష్టంగా తెలుసుకోవటం అతనికొక వ్యసనంలా కనబడుతుంది.”
“అందులో తప్పులేదే.”
“లేదు, కానీ ఎందులోనైనా పరిమితి ఉండొద్దూ.డిసెక్షన్ రూమ్ లొ శవాలను కర్రతో బాదటందాకా పోతే ఎట్లా?”
“శవాలను కొట్టటమా?
“అవును. చచ్చిన మనిషి మీద గాయాలేవిధంగా పడతాయో చూడటానికి ; అతనా పని చేస్తుండగా నాకళ్ళారా చూశాను.”
“అయినా అతను మెడికల్ విద్యార్థికాడంటావే?”
“కాడు. అతనెందుకు చదువుతున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. ఇదుగో, రానే వచ్చేశాం. అతన్ని గురించి నువ్వే తెలుసుకొవచ్చు.”
అతనీ మాట అంటుండగానే మేమొక చిన్న సందుగుండా నడిచి పక్కవాకిలి గుండా ఆస్పత్రి ఆవరణలొ ప్రవేశించాం. నాకిదంతా తెలిసిన చోటే. మేం మెట్లెక్కి కెమికల్ లేబరెటరీకి వెళ్ళాం. అదొక విశాలమైన హాలు, అందులో అంతులేని సీసాలున్నాయి. నేలమీద ఆటే ఎత్తు లేకపోయినా విశాలంగా వుండే బల్లలున్నాయి. పీటమీద రిటార్టులూ, టెస్ట్ ట్యూబులూ, కాంతివిహీనంగా వెలిగే బున్సెన్ లాంపులూ చిందరవందరగా వున్నాయి. అక్కడ ఒక్క విద్యార్థే దూరంగా ఒక బల్లవద్ద పనిచేసుకుంటూ తనపనిలో నిమగ్నుడై వున్నాడు. మా అలికిడి విని అతను తిరిగిచూసి చివాలున లేచి నిలబడి,చేతిలో ఒక టెస్ట్ ట్యూబ్ పట్టుకుని నా స్నేహితుడికేసి పరిగెత్తుకొస్తూ, “కనిపెట్టాను ! కనిపెట్టాను ! ” అని అరిచాడు, “హిమోగ్లోబిన్ తో తప్ప మరి దేనితోనూ ప్రిసిపిటేట్ కాని రీ ఏజెంట్ కనిపెట్టాను.”
(సశేషం)
12 అభిప్రాయాలు »అనువాదాలు, ధారావాహికలు, నేర పరిశోధన
హెచ్చార్కె Feb 15, 2010 1
కథ ఆసక్తి కరంగా ప్రారంభమయ్యింది. ఇది కొ.కు. రచయితగా తన మొదటి రోజులలో చేసిన అనువాదమా? చాల చోట్ల తెలుగు అదోలా ఉంది. గ్రాంథికమా అనిపించేలా ఉంది. ఇలాంటి సమయాలలో, తిరిగి ముద్రించే ముందు… ఉంటే రచయిత, ఆయన లేకపోతే, తెలుగు రాయడం బాగా వచ్చిన ఆయన సన్నిహితులు లాంగ్వేజ్ ఎడిటింగ్ చేయడం తప్పు కాదేమో.
Rohiniprasad Feb 15, 2010 2
ఇందులో నాకెక్కడా గ్రాంథికం కనబడలేదు.
ఇదొక 19వ శతాబ్దపు నవల. వాట్సన్ ఆర్మీలో Northumberland Fusiliers తో పనిచేసివచ్చిన డాక్టర్. హోంస్ డిటెక్టివ్ కథలు 56, నవలలు 4. దాదాపు అన్నీ వాట్సన్ ఉత్తమపురుషలో చెప్పినవే. ఇది వారి సాహచర్యాన్ని పరిచయం చేసే నవల. నేనీ కథలన్నీ ఇంగ్లీషులో 20 సార్లయినా చదివి ఉంటాను!
చాకిరేవు ఉపేంద్ర Feb 19, 2010 3
దీనిని ఎడిట్ చేయవలసిన అవసరం నాకేమీ కనపడటం లేదు. గ్రాంధికంలా అదోలా అనిపించటం అనువాదంలో వచ్చినది కాదు. ఇంగ్లీషు ఒరిజినల్ లోనే వున్నది. కానన్ దాయిల్ స్టయిల్ ని కుటుంబరావు గారు తెలుగులో బాగా పట్టుకున్నారు. కుటుంబరావుగారికి అనువాద ప్రక్రియ మీద వున్న పట్టు, అవగాహన ఉత్సాహం మనం అర్ధం చేసుకోవటానికి , ఈ అనువాదం ఇలాగే బాగుంటుంది. హోమ్స్ నవల తెలుగులో ఈ తరం పాఠకులకు మళ్ళీ అందించాలంటే, కొత్తగా అనువాదం చేసుకోవచ్చును.
కుటుంబరావు గారికి డిటెక్టివ్ సాహిత్యం మీద కేవలం ఆసక్తి మాత్రమే కాక, ఆ సాహిత్యంలో ప్లాటు ఎట్లా సృజనాత్మకంగా ఎట్లా మలచవచ్చును, ఫార్ములా పద్ధతిలో రాసే డిటెక్టివ్ నవల రూపాన్ని ఆధారంగా తీసుకుని కొత్త సత్యాలని యదాలాపంగా ఎట్లా బయట పడేయ్యొచ్చును — అన్న ఆలోచన , ప్రయోగాత్మకంగా రాయాలనే వుత్సాహం చాలా వుండేదనుకుంటాను. ఆయన సృష్టించిన పాత్రల్లో నన్ను చాలా ఆకట్టుకున్న వాటిలో డిటెక్టివ్ కే యాస్ ఒకటి. :)
Rohiniprasad Feb 19, 2010 4
కేయాస్ కథలన్నీ ఆనాటి డిటెక్టివ్ సాహిత్యం మీద రాసిన సెటైర్లు.
హెచ్చార్కె Feb 19, 2010 5
‘నేను దానిని చేరుకునే లోపుగా’ (దానిని), ‘ఎక్కడన్నా భాగం అద్దెకు దొరుకుతుందా అని చూస్తున్నాను’ (భాగం అద్దెకు) వంటి కొన్ని ఎక్స్ ప్రెషన్స్ చూసి ఆ మాట అన్నాను. అవి అలా వుండడమే సరైనదంటారా, సరే!
Rohiniprasad Feb 19, 2010 6
‘దానిని’ అన్న తరవాత దళాన్ని అనికూడా ఉంది కదా. అచ్చులో దానిని అని ఉన్నమాట నిజమేకాని అది టైపో అయి ఉండవచ్చునేమో తెలియదు. భాగం అంటే పోర్షన్ అనే అర్థంలో వాడారు. వాటా అనేది ఎక్స్పెక్ట్ చేశారేమో. వాటా అనేమాట మానాన్న నిత్యజీవితంలో కూడా ఎన్నడూ ఉపయోగించలేదు.
హెచ్చార్కె Feb 19, 2010 7
కొకు తెలుగు… నేను చూసిన మేరకు ఆయన అనువాదాల్లో తెలుగు కూడా… చాల బాగుంటుంది. మొదలెడితే చివరి వరకు అలా తీసుకెళ్లి పోతుంది. ఈ కథనం చదువుతున్నప్పుడు మొదటి సారిగా కాస్త ఇబ్బంది పడ్డాను.
పోర్షన్ అనే మాట చిరకాలంగా (నాకు తెలిసి నలభయ్యేళ్లుగా) తెలుగు వాళ్ల వ్యావహారికంలో ఉంది. టెస్ట్ ట్యూబులను, కెమికల్ లాబొరెటరీలను (పరీక్ష నాళికలు, రసాయనిక ప్రయోగ శాలలు అని) తెలుగు చేయకుండా వాడిన ఈ కథనంలో పోర్షన్ వంటి రూఢి పదాల్ని భాగం లేదా వాటా అని తెనిగించక్కర్లేదనే అనుకుంటాను.
నిజానికి, భాగం అనే చోట కాసేపు ఆగిపోయాను. మాట అర్థం కాక కాదు. ఆ మాట నా చుట్టూరా జీవితంలో లేదు. తరువాత సాగిన కథనాన్ని బట్టి… అది మరొకరితో కలిసి వుండి అద్దె ఖర్చు పంచుకోడం… అని ప్రత్యేకార్థంలో రాశారేమో అనుకున్నాను.
ఏది ఏమైనా, కొకు వంటి పెద్దల రచనలు అచ్చు వేస్తున్నప్పుడు, చేయి చేసుకోకపోవడం మంచిదనే మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను. చేయి చేసుకునేట్లయితే, ఆయనైతే ఈ పదం ఇలా మార్చే వారా అని చూసి జాగర్తగా చేయాల్సి ఉంటుంది.
చాకిరేవు ఉపేంద్ర Feb 19, 2010 8
ఆ నాటి డిటెక్టివ్ సాహిత్యం పై సెటైర్లు అన్న మాట తో పాటుగా కేయాస్ కథల గురించి చెపుకోదగ్గ విషయం మరొక్కటున్నది. ఆ రోజుల్లో ఆయన రాసిన ఇతర కధల్లాగే ఈ కధలు కూడా వుమ్మడి మద్రాసు రాష్ట్రంలో గుంటూరు, మద్రాసు పట్టణాల మధ్యన ,తిరుగుతాయి.
బ్రిటిష్ సామ్రాజ్యంపై సూర్యుడు ఇవాళో రేపో అస్తమించటం ఖాయం అని అందరికీ తెలుస్తున్న తరుణం అది. రెండవ ప్రపంచ యుద్ధానికి కొంచెం అటూ ఇటూగా. వ్యవసాయ రంగంనించి వస్తున్న లాభాలను తిరిగి పెట్టుబడిగా మార్చటానికి అవకాశాలు లేని ఒకానొక ప్రాంతం, నగరజీవితాన్ని అందుకోవటానికి అర్రులు చాస్తుంటే రోజువారీ జీవితాల్లో వస్తున్న సాంస్కృతిక మార్పులకు కుటుంబరావు గారు అద్దం పట్టారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం వలన వచ్చిన సంకుచితత్వం, అంతర్ముఖత్వం వలన అటు కుటుంబ రావు గారి కి భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే రావలసిన గుర్తింపు రాలేదు. ఇటు ఇతర భాషల్లో ఆయన కధలకు సమాంతరంగా వచ్చిన సాహిత్యం గురించి మనకు తెలియకుండానూ పోయింది.
నా దృష్టిలో కేయాస్ కధలు – ఐశ్వర్యం, చదువు , మారుపేర్లు లాంటి నవలలలో ఆయన చూపించిన జీవితాన్ని ఇంకొంచెం లోతుగా అర్ధం చేసుకోవటానికి పనికొచ్చే టార్చి లైట్లు.
Rohiniprasad Feb 20, 2010 9
ఉపేంద్రగారు చెప్పిన విషయాలు చాలామంది భారతీయ రచయితలకి వర్తిస్తాయి. అంతర్జాతీయం సంగతి ఎలా ఉన్నా తక్కిన భారతీయులకి కూడా మన దేశపు మంచి రచనలు అందవు. ఇందుకు ఒక పద్ధతి తెలుగు రచనలని ఇంగ్లీషులోకి అనువదించటం. వెల్చేరు నారాయణరావుగారు సూచించిన ఈ సలహాని నేను పాటించదలుచుకున్నాను. అనువాదం చెయ్యగలిగినవారు కాపీరైట్ ఇబ్బందులు లేని తెలుగు రచనలను ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే బావుంటుంది. మా నాన్న కథల బాధ్యత నేనే తీసుకుంటాను.
చాకిరేవు ఉపేంద్ర Feb 20, 2010 10
1996 లోనో 1997 లోనో అనుకుంటాను. MT ఎం టి వాసుదేవన్ నాయిర్ , ఒక భారతీయ భాషలోంచి నేరుగా మరొక భారతీయ భాషలోకి తర్జుమా చేయగలిగే అనువాదకులను తయారు చేయటం కోసం ఒక ప్రయత్నం చేశారు. దానికి కావలసిన నిధులు సరిగా సమకూరక పోవటం వలనో, లేక ఆసక్తి వున్న వారు ఎవరూ దొరకక పోవటంతోనో ఆ పని మూల పడింది. అలాగే, అంతకు కొద్ది సంవత్సరాల ముందు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో కుటుంబ రావు గారి రచనలను కొన్నిటిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే ప్రయత్నం కొంత జరిగింది. దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ సహాయ పడిందని జ్ఞాపకం. అందులో కొన్ని అనువాదాలు నేను మాన్యుస్క్రిప్ట్ రూపంలో చూసి బాగున్నాయని అనుకోవటం కూడా జ్ఞాపకం వుంది. అట్లాగే దాశరథి రంగాచార్య నవలలు- మోదుగు పూలు, చిల్లర దేవుళ్లు కూడా అనువాదం చేయటానికి కూడా ఎవరో ప్రయత్నం చేశారు. ఇట్లాంటి ప్రయత్నాలన్నీ ,యూనివర్సిటీల మీదనో సాహిత్య అకాడెమీల మీదనో ఆధార పదినందు వలన, అంతిమంగా ఆయా సంస్థలలోని రాజకీయాలకు, సంక్షోభాలకూ, ప్రచురణకర్తల కాల్క్యులేషన్ లకు లొంగి పోయి ఎటు పోయాయో తెలియకుండా అయిపోయింది.
ఇంటర్నెట్ మాధ్యమంలో ప్రచురణకర్తలకు, సంస్థాగత రాజకీయాలకు అతీతంగా పని చేసే అవకాశం వుంటుంది కాబట్టి , మళ్ళీ కొత్త ప్రయత్నాలు చేయవచ్చుననుకుంటాను.
Rohiniprasad Feb 21, 2010 11
1960లలో మద్రాసులో పనిచేసిన Southern Languages Book Trust 4 దక్షిణాది భాషల్లో సైన్సు పుస్తకాల అనువాదాలు చేయించింది. సాహిత్య అకాడమీలుకూడా కొంత చేశాయి. ఇప్పుడు భాషాభిమానం కలిగినవారుకూడా ప్రయత్నించాలేమో. తెలుగువారు నడుపుతున్న http://www.bharatwaves.com వంటి సైట్లు సంతోషంగా స్వీకరిస్తాయి.
ప్రాణహిత » ప్రాణహిత ఫిబ్రవరి 2010 సంచికకు స్వాగతం Apr 1, 2010 12
[...] [...]