నిప్పు రాజుకుంది…

రచయిత: యస్. గణేశ లింగం

“అమ్మా …! అని కొడుకు సుగంతన్ పిలిచినట్లై తంగమ్మ మూతపడుతున్న కళ్ళను ఉలిక్కిపడి తెరిచింది. కొడుకొచ్చాడన్న ఆరాటంతో బైటికొచ్చిన తంగమ్మకి ఎవరూ కనిపించలేదు. ‘ఏదో కల గని వుంటనులే’ అనుకుంటూ తిరిగొచ్చి పడుకుంది.. ఇంత రాత్రయినా సుగంతన్ జాడలేదు. అతని పక్క దుప్పట్లు నిన్న చుట్ట చుట్టిపెట్టినవి అలాగే వున్నాయి. రాత్రి పూట వూళ్ళో కర్ఫ్యూ అమల్లో వుంది. జాఫ్నాలొ తమిళ ప్రాంతాలన్నిటా ఇదే పరిస్థితి. పది దాటిన తర్వాత ఎవరూ బైట తిరక్కూడదు. సుగంతన్ ఇంక ఇప్పుడు రాలేడు . బహుశా స్నేహితులింట్లో ఎక్కడో నిద్రపోయిండచ్చేమో! అయినా ఆ తల్లి మనసాగలేదు అప్పుడప్పుడూ లేచి చూస్తూనే వుంది. ఒకవేళ వచ్చాడేమోనని. అటూ ఇటూ దొర్లిందే గానీ నిద్రపట్టలేదు. భర్త చనిపోయాక తనకు మిగిలిన ఒకే ఒక దిక్కు సుగంతన్. ప్రాణాలన్నీ వాడిమీదే పెట్టుకుని బతుకుతోంది.

బైట ఆకాశం తెల్లబడింది . తంగమ్మ లేచి పొయ్యి రాజేసింది. సుగంతన్ ఇంక వచ్చేస్తాడు. రాగానే ‘అమ్మా …టీ’ అంటాడు . వాడు వచ్చాక కాస్త గట్టిగా మందలించాలి. రాత్రిళ్ళు కర్ఫ్యూ వుందని తెల్సినప్పటికీ అంతరాత్రయ్యే వరకూ స్నేహితులతో ఏం మాటలు వాడికి ? పోనీలే ఒక చోట కుదురుగా వుంటే మంచిది ‘అయ్యో … రాత్రి ఏం తిన్నాడో ఏమో బిడ్డ..’ రాత్రి పదిగంటల వరకు చూసి అన్నంలో నీళ్ళు పోసి పడుకుంది.

పిల్లాడీ మధ్య మాటే వినడం లేదు … చూసీ చూసీ తెల్లారగట్ట నిద్ర పట్టింది. కళ్ళు మూస్తే ఒకటే పీడకలలు , కళ్ళు తెరిస్తే పాడు ఆలోచనలు , అనుకుంటూ పొయ్యి మీద టీ పెట్టి, కళ్ళాపి చల్లి ముగ్గేసింది.ఒకటికి నాలుగు సార్లు దారివైపే చూస్తూ అన్యమనస్కంగా పనిచేస్తొందామె.

బొగ్గుపొడితో పళ్లు తోముకుని బావిదగ్గర ముఖం కాళ్ళూ కడుక్కుని వచ్చి, ఇంట్లో కుమారస్వామి (మురుగన్ ) పటం విబూది తీసి నుదుట అద్దుకుని రెండు చేతులూ పైకెత్తి జోడించి ‘ మురుగా’ అని మొక్కింది.

పొయ్యి దగ్గర కొచ్చేసరికి టీ మరుగుతోంది. కొడుక్కి టీ ఒక గ్లాసులొ పోసి మిగిలింది తనకి గ్లాసులో పోసి అరుగు మీద కూర్చుని దారి చివరికంటా చూస్తూ టీ తాగుతూ కూర్చుంది.

చూస్తూ చూస్తూ పొద్దెక్కింది. ఇంక ఎదురు చూస్తే లాభం లేదు . తోటకెళ్ళాలి అక్కడ ఆవులు తన కోసం ఎదురు చూస్తుంటాయి. మేత పెట్టే సమయమైంది అనుకుని తలుపేసి బయల్దేరింది . వెళ్తూవెళ్తూ పక్కింట్లోకి తొంగి చూసింది. కానీ ఎవరూ కన్పించలేదు… ఎప్పుడూ సుగంతన్ చుట్టూ తిరిగే పిల్ల అణ్ణమ్ కన్పించలేదు. భుజం మీద వేసుకుని పెంచిన కొడుకు ఈ రోజు ఎంత ఎదిగిపోయాడు? ఆ మాటే ఒకసారి వాడితో అంటే తనని ఆటపట్టిస్తూ .’ అమ్మా సాధ్యమైతే ఇప్పుడు ఎత్తుకుని చూడు’ అని ఎదురుగా నిల్చున్నాడు …’ నా వల్ల కాదులేరా అంటే .. చూడు ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటాను’ అంటూ పైకెత్తి గిరగిరా తిప్పి దించాడు…పక్కింటి పిల్ల అణ్ణమ్ అక్కడే వుండేసరికి ఎంత సిగ్గేసిందో తనకి. ఆ విషయం గుర్తుకొచ్చి తనలో తనే నవ్వుకుంది తంగమ్మ.

కొడుకు గురించిన కబురు తెలిస్తే బాగుణ్ణు… అనుకుంటూ కాలిబాట వెంట నడుస్తూ తోట చేరుకుంది. దూరం నుంచే తంగమ్మని చూసిన పశువులు మోరలెత్తి, మ్మా…మ్మా అంటూ అరవసాగాయి. వాట్ని చూసి మరో రెండు కూడా అందుకున్నాయి. పాపం ఆకలేస్తుందేమో అనుకుంటూ గడ్డి వాటి ముందు వేసి. తొట్టిలో నీళ్ళు తోడి పోసింది. నిన్న వాటికి గడ్డి వేస్తూ సుగంతన్, ‘వచ్చే సీజన్ కల్లా ఈ ఎర్రావు ఈనుతుందమ్మా ఈ గడ్డిచాలదు…’ అంటూ అరిటాకులు కోసి దానికి వేయడం గుర్తొచ్చింది… తను కూడా దానికి రెండు అరిటాకులు కోసి, అదనంగా అరటి చెట్ల మధ్య గడ్డి బాగా పెరగడంతో అదంతా చెత్తో పీకుతూ కూర్చుంది … నిన్న సుగంతన్ అరటి చెట్లకి నీళ్ళొదిలి వుండడం వల్ల గడ్డి పీకడం కష్టంగా లేదు… నిన్న అరిటాకులు కోసేటప్పుడు ‘అమ్మా ఆ పచ్చరటిగెల పక్వానికొచ్చింది … రేపు కోసి మన కొబ్బరికాయల బాబాయ్ కొట్లో ఇచ్చేయాలి ‘అన్న విషయం గుర్తుకొచ్చి వెళ్ళి చూస్తే పక్వాని కొచ్చి ఆ కాయలు నిగనిగలాడుతూ కన్పించాయి.ఏ విషయాన్నయినా నిముషాల్లో పసిగడతాడు… అన్ని పన్లూ ఒంటి చేత్తో చేసేస్తాడు… చదువులోనూ అంతే . పన్లలోనూ అంతే . బహుశా ఇంటి కొచ్చేసి వుంటాడు. టీ తాగి వస్తాడేమో ! ‘ ఇలాంటి ప్రయోజక పుత్రుడు ఒకడుంటే చాలు … తంగమ్మా నీ అంత అదృష్టం ఎవరి కుంటుంది చెప్పు …’ అని వూళ్ళోఅందరూ సుగంతన్ ని పొగుడుతుంటే తంగమ్మ మనసు తృప్తితో నిండిపోతుంది… చదువులో నూ ఎప్పుడూ మొదటి నాలుగు ర్యాంకుల్లో వచ్చేవాడు… యూనివర్సిటీ ఎంట్రన్స్ రాయడానికి ఎంత కష్టపడ్డాడు… ట్యూషన్ కి వెళ్ళి కూడా చదివాడు … అయినా ఎలిజిబుల్ కాదని పక్కకి తోసేసారు . తంగమ్మా బాధ పడుతుంటే ‘ అమ్మా … ఇది నా ఒక్కడి సమస్య కాదు… ఇక్కడ వేలాది తమిళ విద్యార్ధులందరిదీ ఇదే సమస్య… కారణం జాతి … తమిళ వాళ్ళకి అవకాశాలివ్వకుండా శ్రీలంక విద్యార్థులకి పట్టం కట్టడానికి కారణం తమిళుల్ని అణగదొక్కాలనే’ అని సుగంతన్ చెపుతుంటే కొంత అర్థమయ్యి, కొంత అర్థం కాకా అయోమయంగా వుండిపోయింది తంగమ్మ. తల్లి బాధపడుతుంటే … ‘అమ్మా మనకి తోటుంది… పశువులున్నాయి …ఈ పనులన్నీ నువ్వొక్కదానివే చేయలేవు … ఇద్దరం కల్సి చేద్దాం… నువ్వేం బాధపడకు’ అన్నాడు.

కొడుకు పెద్ద చదువులు చదవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న తంగమ్మకి బాధ కలిగినా, చదివి దూరప్రాంతాలకి వెళ్ళకుండా తనతోపాటే వుంటాడనే ఆలోచన పై పూత పూసినట్లైంది.

ఆలోచనల్లొ మునిగి వున్నా కొడుకు రాక కోసం ఓ కంట చూస్తూనే వుంది . ఎండ చురుకు మంటోంది … ఇంక ఇంటికి పోయి వంట చేయాలి…వాడికి వంజరం చేపలంటే ఎంతిష్టమో ! కర్ఫ్యూ విధించినప్పటినుంచి చేపలవేట బందయ్యింది. అందుకే చేపలమ్మే వాళ్ళు వీధిలోకి రావడం లేదు… నిన్న ఉప్పు చేపల పులుసు పెట్టింది… ఈ రోజు సాంబారు పెట్టి వంకాయ వేపుడు చేద్దామని, తోటలో లేత వంకాయల్ని తెంపి చెంగులొ చుట్టుకుంది…వెళ్తూ వెళ్తూ ఇంకొంచెం గడ్డి ఆవుల దగ్గర పడేసి , బయల్దేరింది … దార్లో ఎదురుగా ఎవరో వస్తున్నట్లు కన్పిస్తే చెయ్యి కళ్ళ దగ్గర పెట్టుకుని చూసింది… సుగంతన్ స్నేహితులు… ఆమెని చూడగానే పక్కనే వున్న సందులోకి తప్పుకున్నారు .. ‘అయ్యో .. పిలిచినా బాగుండు .. సుగంతన్ రాక గురించి తెలుసుకునే దాన్ని ‘ అనుకుంటూ ఇంటిదారి పట్టిందా తల్లి.

ఇంటికెళ్ళి చూస్తే కొడుకు వచ్చిన జాడలేదు… గ్లాసులో టీ పోసింది పోసినట్లే వుంది.. ఏంటీ పిల్లాడు .. ఇంకా రాడేమి? అనుకుంటూ కాళ్ళు ముఖం కడుక్కుని ఆకలిగా అన్పించి రాత్రి నీళ్ళు పొసిన అన్నం నిన్నటి వుప్పుచేపల పులుసు నంజుకుని తిన్నాక … కాస్త ప్రాణం నెమ్మదించినట్లైందామెకి … ఆకలితీరినా గుండెలో ఏదో అలజడి.. అశాంతి అలాగే వుంది.. కొడుకు రాత్రనగా ఏం తిన్నాడో అనుకుంటూ వంటకుపక్రమించింది.

రోజుకి నాలుగైదు సార్లన్నా ఇంటి చుట్టూ సుగంతన్ కోసం చక్కర్లు కొట్టే పిల్ల అణ్ణమ్ ఈ రోజు ఇటు వైపు తొంగి కూడా తొంగికూడా చూళ్ళేదేమి…వాడు ఇంటికి రాడని ముందే తెలుసా ఏమి?…అయినా వాడి స్నేహితులు కూడా రోజూ వాడి కోసం వస్తూనే ఉండేవాళ్ళు…చిత్రంగా వాళ్ళూ కనిపించడంలేదు… ఏమైంది ఊరంతా నిశ్శబ్దంగా వుంది… వంటచేసి నిన్న స్నానాలతొట్టిలో సుగంతన్ తోడివుంచిన నీళ్ళు పోసుకుని స్నానం ముగిచింది . ఇంట్లో కొచ్చి పెట్టె తెరిచి పోయినేడాది తన పుట్టిన రోజునాడు సుగంతన్ కొనిచ్చిన నీలం పువ్వుల తెల్ల చీర కట్టుకుని, దేవుడి పటం ముందు విబూది నుదుట పెట్తుకుని ‘మురుగా’ అంటూ చేతులు జోడించి మొక్కింది…

వాడికి తల్లంటే ఎంత శ్రద్ధ ? ఇంట్లో వుంటే తనని ఒక్క పని కూడా చెయ్యనివ్వడు… వంట పని, ఇంటి పని అన్నీ క్షణాల్లొ చేసేస్తాడు… ‘ నేనున్నంత వరకూ నువ్వేం చేయకూడదు…’ అంటాడు.

చిన్నప్పుడు వాడికి ఒళ్ళు రుద్ది తొట్టిలొ వదిలేసి పని ముగించుకునేది… వాడేమో నీళ్ళని తప తప కొడుతూ ఎంత సేపైనా ఆడుకునేవాడు … ఇప్పుడు ఆరడుగులవాడయ్యాడు… ఎంతమంది స్నేహితులున్నా వాళ్ల మధ్య కేంద్ర బిందువుగా సుగంతనే వుంటాడు… అప్పుడప్పుడూ వాళ్లంతా ఇంటికొచ్చేవాళ్ళు… అప్పుడూ తనని ఒక పని చేయనిచ్చేవాడే కాదు… వాళ్ళందరికీ స్వయంగానే టీ ఏర్పాట్లూ అవీ చేసేవాడు… ఈ మధ్యేమో వాడికి స్నేహితులతో మంతనాలు ఎక్కువయ్యాయి… కాస్త వివాదస్పద విషయాలూ చర్చించుకుంటున్నారు… ఆలోచిస్తూనే ఆ పూటా గడిచిపోయింది.. ఆకలేస్తుంది… ఇంకా ఎదురు చూడనా భోంచేసేయనా అనుకుంటుండగా, ఈ రోజు శనివారమన్న విషయం గుర్తుకొచ్చి ఒక ముద్ద అన్నంలొ కూర కొద్దిగ కలిపి గోడపైన వుంచి ‘కా… కా…’అంటూ పిలిచిందో లేదో ఒక గుంపు కాకులు గోల చేస్తూ వాలాయి…

అరిటాకు ఒకటి కోసి అన్నం పీటమీద పెట్టుకుని వడ్డించుకుని ఒక ముద్ద తిన్నదో లేదో పొరబొయింది… తనే తలపై కొట్టుకుని నీళ్ళు తాగింది… కొడుకు గుర్తొచ్చాడు… ఇప్పుడు గనుక వాడుండుంటే ఎంత హంగామా చేసేవాడు? తలపై చిన్నగా కొట్టి నీళ్ళు తాగింది.

‘నువ్వుండమ్మా నే తినిపిస్తా’ నని తన చెయ్యి మరో గిన్నెలొ కడిగేసి తినిపించేవాడు. అది తల్చుకోగానె ఆ తల్లి కళ్లల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి… ఒక్కరోజుకే ఇలా ఐపోయానేమిటా అని ఆమెకే ఆశ్చర్యం.

గుమ్మంలో ఏదో చప్పుడైంది ..అణ్ణమ్మ …నక్కి నక్కి వస్తోంది. వెనకాలే దాని తమ్ముడు వస్తుంటే ‘పోరా’ అంటూ చిన్నగా అదిలించింది… ఈ పిల్లేంటి ఇంత రహస్యంగా ఎందుకొస్తున్నట్టు…?

‘ఏమేయ్ …అణ్ణమ్… ఇలారావే .. ఈ పిల్లాడి సంగతేమైనా తెలిసిందా…రాత్రనగా ఇంటికి రాలేదు’ గబాగబా అడిగింది తంగమ్మ.

చప్పుడు చేయకుండా తంగమ్మేంచేస్తుందో చాటుగా చూసెళ్దామని వచ్చిన ఆ పిల్ల తంగమ్మని చూసేసరికి గుడ్లనిండా నీరుతో చెంగు నోట్లో కుక్కుకుని గిర్రున వనకి తిరిగి పరుగెత్తింది… తంగమ్మ విస్తుపోయి…

వెనకాలే వచ్చిన చంటోడ్ని

రేయ్… కన్నప్పా.. ఇలా రారా’ అని పిలిచింది. వాడు చొక్కా కాలరు నోట్లో పెట్టుకుని నములుతూ నించున్నాడు.

ఏమైందిరా దానికి ? ఇంట్లో ఎవరైనా కొట్టారా ఏమి ? కన్నప్పని దగ్గరికి తీసుకుని ప్రేమగా వీపు నిమురుతూ అడిగింది.

‘ అదీ…అదీ… జరిగింది నీతో రాత్రి గడిచే దాకా చెప్పకూడదని ఇంట్లో అంతా మాట్లాడుకున్నారు.. అటు పక్క చింత తోపు లేదూ … అక్కడ సుగన్న రక్తంలో పడిపోయున్నాడంట అందుకే అక్కేడుస్తుంది.

తలొంచుకుని చెప్పాడు కన్నప్ప.

ఆ వాక్యాలు పూర్తయ్యాయో లేదో జరిగిందేమిటో అర్థమైంది తంగమ్మకి.

‘అయ్యో!!! నా కొడుకా … అయ్యయ్యో !!! అని నరాలు తెగేంతగా అరుస్తూ , ఏడుస్తూ పరుగెత్తింది…

తంగమ్మ ఆర్తనాదం వినగానే ఇళ్ళలో అంతా తంగమ్మకి విషయం తెల్సిపోయింటుందని అర్థమై గబగబా ఆమెకి అడ్డం వచ్చారు…

‘ఆగమ్మ…’ అంటూ ఎంత ఆపినా ఆగకుండా చేతికీ అందకుందా వేగంగా పరుగెత్తింది.

సుగంతన్ స్నేహితులంతా ఆమె చుట్టూ వలయంగా ఏర్పడి,

‘ అమ్మా…ఇప్పుడక్కడికి వెళ్తే నిన్నూ జీపులొ వేసుకెళ్తారు…’ అంటూ ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.

‘తీసుకెళ్తే తీసుకెళ్లనీయండిరా.. నా కొడకుని చూడాలి.. తప్పుకోండిరా…అంటూ రోదిస్తూనే వాళ్ళని తోసుకుని ముందుకెళ్తోంది.

‘నిన్ను కాల్చి చంపేస్తారమ్మా’

చంపితే చంపనీయండి అంటూ తన శక్తినంతా కూడగట్టుకుని వాళ్ళని తోసేసి వేగంగా పరుగెత్తిందా తల్లి…

వెనకాలే వచ్చిన ఊరి జనమంతా పొలిమేర దగ్గరే ఆగిపొయారు తంగమ్మ చింతతోపు దరిదాపుల్లొ కెళ్ళేసరికి అక్కడ రెండు జీపులు కనిపించాయి.. సాయుధులైన శ్రీలంక సైనికులు ఆమె వైపుకి తుపాకులు తిప్పారు. ఒక జీపు దగ్గర్లో సుగంతన్ పడివున్నాడు …అతని ఛాతి భాగమంతా రక్తంతొ నిండిపొయింది. ఒక్క అంగలొ కొడుకుని చేరుకుంది…’అయ్యో కొడుకా …!!! నేనేం చేసిది … అయ్యయ్యో !!! అంటూ సుగంతన్ మీద పడి ఆకాశం, భూమీ ఏకమయ్యెలా రోదించింది. గుండెలు బాదుకుంది… చిన్నప్పట్నించి సుగంతన్ చేష్టల్ని తల్చుకుని పొగిలి పొగిలి ఏడ్చింది… భర్తని తల్చుకుని ఏడ్చింది …అలా ఎంతొ సేపు గడిచాక హటాత్తుగా ఏడుపాపి లేచి నిలబడిందామె… ఆమె కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయ్… ఆమె రౌద్రాకారానికి ఎవరికైనా గుండెల్లొ వణుకు పుట్టాల్సిందే… రెండు జీపుల వైపూ మార్చి మార్చి చూసిందామె … జుట్టు ముడేసి రొమ్ము విరుచుకుని వాళ్ళ వైపు నడిచింది.

‘రేయ్ ,… కుక్కల్లారా … కాల్చండిరా,’ అని తన గుండెచూపించింది.

తమిళం అర్థం కాని ఆ సింహళ సైనికులకి ఆమేం అంటుందొ అర్థ కాక ముఖం చూసుకున్నారు…

ధైర్యముంటే కాల్చండిరా.. సింహళ’ కుక్కల్లారా’ … అని మళ్ళీ గర్జించింది… ఈ సారి ఆమె ఆగ్రహ రూపాన్ని చూసి పడపడమంటూ ఆమెపై గుండ్ల వర్షం కురిపించారా ముష్కరులు.

అప్పటి వరకూ దూరంగా నక్కి వున్న వూరి జనం తుపాకి శబ్ధం విన్పించగానే ఆగ్రహంతో ఆడామగా అంతా గుంపుగా పరిగెత్తుకుంటూ రాసాగారు..

దూరం నుంచి జనాన్ని చూడగానే లంకసైనికుల కాళ్ళు వణికాయి… వున్న పళాన జీపుల్ని స్టార్ట్ చేసి పారిపొయారు. విషయం తెల్సిన చుట్టుపక్కల వూళ్ల జనం కూడా వస్తూనే వున్నారు.. రక్తపు మడుగులో తల్లీ కొడుకుల్ని చూసి వారి కళ్లు వర్షించలేదు … ఇప్పుడు వాళ్ల గుండెల్లో నిప్పు రాజుకుంటోంది…

(నోట్: ఈ కథ 90 లలో శ్రీలంక తమిళుల పరిస్థితుల గురించి మనకు చెప్తుంది. అంతటి నిర్భంధంలో లంక సైన్యాన్ని తృణీకరించడమే ఆకాలానికి పెద్ద తిరుగుబాటు.)

3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు

3 అభిప్రాయాలు

  1. suma Feb 7, 2010 1

    nijanga a saniveyshani kalaku katinatu rasaru really its great ……………….

  2. హెచ్చార్కె Feb 10, 2010 2

    కథ చదివి రెండు రోజులయ్యింది. ఏ పని చేస్తున్నా సుగంతన్, వాళ్ల అమ్మ గుర్తుకొస్తున్నారు. కథ, కథనం రెండూ చాల గొప్పగా వున్నాయి. కథ గోర్కీ అమ్మను గుర్తుకు తెచ్చింది. తంగమ్మ సైనికిలను ధిక్కరించిన వాక్యం తరువాత రచయిత తప్పుకుని, కథను పాఠకులకు వదిలేసి వుంటే మరింత బాగుండేదేమో. నీలిమ గారూ అనువాదానికి ఒక మంచి కథను ఎంచుకున్నందుకు, చక్కని తెలుగులో అందించినందుకు అభినందనలు.

  3. rameshnishani Feb 27, 2010 3

    నీలిమ గారు ఒక కథ ని అనువదించదము is a moral responsibility for that story and to the readers అని ఒక పుస్తకము లొ చూసాను ఈ కథ ని చదివిన తర్వాదెఅది నిజమె అని తెలుసుకున్నాను మీకు అభినందనలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో