Feb2010
పడమటి నీడ – సమీక్ష
లోకంలో రెండు రకాల కథకులు ఉంటారు. “నిరుపహతు స్థలము, బంగరు టూగుటుయ్యల, రమణీప్రియ దూతిక, కప్పురపు ఇడెము”లాంటి హంగులు సమకూర్చుకుని, ఊహాలోకాల్లో తేలిపోతూ, పడవల్లాంటికార్లు, ఇంద్ర భవనాలు, అరడజను నౌకర్లు సృష్టించి, పాఠకులను గాల్లో తేల్చేస్తారు కొందరు. ఇక రెండవ రకం కథకులుంటారు. వీరు తమ చుట్టూ ఉన్నఆకలినీ, శోకాన్నీ, చావునీ, దుఃఖాన్నీ, చిన్నచిన్న సంతోషాల్నీ సృష్టిస్తారు. వీరి కథల్లోని పాత్రలు మనకు రోజూ ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంటారు. ఒక్కోసారి, ఈ రకం కథలు చెప్పే సంఘటనలు సామాన్యుడి నిత్య జీవితంలో తుచ తప్పక ఎదురైనా ఆశ్చర్య పోనక్కరలేదు.
రచయిత హనీఫ్ తన కథా సంకలనం, “పడమటి నీడ”లోఈ రెండవ రకం పాత్రల్ని పరిచయం చేస్తాడు.
ఈ కథా సంకలనంలో తొమ్మిది కథలున్నాయి. మొదటి ఏడు కథలూ లోగడ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. దీనిలోని అయిదు కథలు తాను పని చేసిన సింగరేణి నేపథ్యం. మిగతా నాలుగు కథలు బొగ్గు బాయిలతో సంబంధం లేని పల్లెటూరి వాతావరణం చిత్రించబడ్డది. ఒక్క “పడమటి నీడ” లోని ప్రసాద్, నీహారికలు తప్ప మిగతా కథల్లోని పాత్రలందరూ వేలి ముద్రలవారు. అర్థణా ఇస్తామంటే అరడజను వేలి ముద్రలు వేయడానికి సిద్ధ పడతారు. బొగ్గు బాయిల మేనేజర్ల, లేబర్ కాంట్రాక్టర్ల, యూనియన్ లీడర్ల, చిట్ ఫండ్ కంపెనీల మోసాలకు బలి అవుతుంటారు.
హనీఫ్ గారి కథల్లో ఒక రకమైన నిస్పృహ, నిరాశ కనిపిస్తుంది. కొడుకు బొగ్గు బాయిలో పడితిరిగి రాకపోతే, తల్లి అయిలమ్మ పరిస్థితులకు తలొగ్గి అదే బాయిల స్వీపర్ పనికి కుదురుతుంది “విజన్ 2020 షాప్” లో. పక్షవాతం వచ్చాక పనిలోంచి తీసివేయబడి బతుకు తెరువుకు వేరే మార్గం లేక పెరుగు అమ్ముకుంటూ బతుకు వెల్లమారుస్తుంటాడు సూరయ్య. తనపై ఆఫీసర్ కు గుండె నొప్పి వచ్చినా పని లోంచి తీసివెయ్యరు. పైపెచ్చు ప్రమోషన్లు. ఇదేం న్యాయమో అర్థం కాదు “గోస”లో సూరయ్యకు. యాజమాన్యం విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి, కార్మికుల భవితవ్యాన్ని నిర్ణయించే సమ్మెల్ని నిర్వీర్యం చేస్తుంటారు తోటి వర్కర్లు “పెంపుడు కొడుకులు”లో. చదువు అంతగాలేక ఒంటరిగా బ్రతకడం ఎలాగో తెలియని ముస్లిం యువతులు నసీమా, జరీనాలు. ఈ అభాగ్య యువతులు కొంచెం ప్రతిఘటించినా వాళ్ళ మగళ్ళు తలాఖ్ అంటారు. సమాజం మొత్తం “కంచెకు పాతిన కొయ్యల్లా” చూస్తూ నిలబడిపోతారు “నసీమా” కథలో.
పై కథల్లోని పాత్రలు మౌనంగా హింస భరించడం తప్ప నోరెత్తవు. ఎందరో నసీమాలు, జరీనాలు పుట్టుకొస్తారు. “భూమి గుండ్రంగానే తిరుగుతూనే ఉంటుంది”. “గొర్రె కటికోన్ని నమ్మినట్టు వీళ్ళని మనం నమ్మక తప్పద”ని తీర్మానిస్తాడు రచయిత.
తెల్లంగీ తెల్ల పైజమాలో నవాబులా కనిపించే మేకల వ్యాపారి మదార్ సాబ్. బడా పారిశ్రామిక వేత్తలు మేకల వ్యాపారంలో చేరడం వల్ల చితికిపోయిన మదార్ సాబ్ అడుక్కోవలసి వస్తుంది “కూడికలు, తీసివేతలు”లో. బిడ్డల గురించి తపించి చివరకు కృత్తిమ పద్దతుల్లో బిడ్దను కంటారు ప్రసాద్, నీహారిక దంపతులు. కనడమైతే కంటారు గాని బిడ్డ తమది కాదన్న భావం మనస్సుల్లో తొలుస్తూనే ఉంటుంది. చివరకు నీహారిక ఎక్కడకో దూరంగా వెళ్ళిపోతుంది “పడమటినీడ”లో.
పై కథల్లోని పాత్రలన్నీ నిస్సహాయతను ప్రకటింపజేసే పరిస్థితులకు బానిసలైనవారిని స్పురింపజేస్తుంటాయి. వర్ణనలతో, నిస్సహాయతను వెల్లడించడంతో సరిపెట్టుకోకుండా, ఆదర్శ రచయిత కర్తవ్యం బోధించగలగాలి. ఇదే వైతాళికుడైన రచయితకూ చరిత్రకారుడికి ఉన్న బేధం. బ్రతుకును సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో రచయిత చెప్పాలి. ఇట్లాంటి కోవకు చెందినవి “అగాధం, డిపెండెంట్, మా ఊరికి చారెడు నేల కావాలి” కథలు. మగడు ఓపెన్ కాస్ట్ లో చనిపోతే బెంబేలెత్తిన ఐలమ్మ తనకు తాను సంబాళించుకుని, “లీడర్ లెక్క”అయి ఇంటికి సౌకర్యాలు కలిగించుకొని కొడుకులను హైదరాబాదులో చదివించుకొనగలుగుతుంది “డిపెండెంట్” లో. పశు ప్రవృత్తి గల యాదగిరి కలలో తన చావును చూసుకొని జనం తనను ఎంతగా ఈసడించుకుంటున్నారో తెలుసుకొని, మనసు మార్చుకొని మంచి వాడవుతాడు “అగాధం”లో. నన్ను ఊర్లోకి రానీయని ఊరును నేనెందుకు కాపాడాలి అంటూ తన నిరసనను వ్యక్తంచేస్తాడు లచ్చిగాడు, ఇదే కథలో. “ఇక్కడయితే అడ్డు రావుగాని, ఊళ్ళో అయితే అడ్డమొస్తయా మా అంటరాని బతుకులు”, అంటుంది “కోరిక”లో తన పక్కలో చేరిన వెంకటేశంతో లచ్చి.
“జల్సిత్తవా? ఓట్లిత్తవా? అని ఓటర్ల గురించి మన దగ్గరకు వచ్చే నాయకుల్ని మనం అడిగినంతసేపు మనం అనుభవించాలి” అంటాడు “విజన్ 2020 షాప్” లో రచయిత. “పడమటి నీడ”లో కాసేపు కథకుడు చెపుతాడు. కాసేపు స్వగతం. కూరగాయల వ్యాపారంతో కథ మొదలు, జన జీవన స్రవంతి… ఇవన్నీ చెప్పదలచుకున్న విషయానికి అప్రస్తుతం. ఒక్క “పడమటి నీడ” కథలో తప్ప, మిగతా కథల్లో ప్రత్యేకత ఉంది. దృక్పథం ఉంది. మనస్తత్వాలను, అస్థిత్వ వేదనలను, సంఘర్షణలను బాగా చూపగలిగాడు. పరిసరాల నిశిత పరిశీలన, చిత్రీకరణ ఉంది.
అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు