Feb2010
పొక్కిలి
అగ్గిపెట్టె గుగ్గిపెట్టె
లవ్వో లాటో
చెంచో బైటో
ఠాంగు ఠీంగు
తమ్మళ్ళ పెద్దవ్వ
తసుక్కు… తుసుక్కు
వాడకట్టు పిల్లలు ముగ్గురు నల్గురు కలిసి ఇంటి ముంగటి గచ్చుమీద అర్సేతులు బోర్లేసి ఆడుకుంటుండ్రు. ఒక చెయ్యి అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… అనుకుంట బోర్లేసిన వేళ్ళను తాకుకుంట పోతంది.. దానితోనే మిగిలినోళ్ళ కండ్లూ పోతున్నాయి… తుసుక్కుమన్న దగ్గర వేలు లోపలికి ముడుసుక పోతంది. ముడుసుకపోయిన వేలు పానం పోయినంత తల్లడిల్లుతంది. అగ్గిపెట్టె గుగ్గిపెట్టె… మళ్ళా మొదలైతంది… మళ్ళా వేలు ముడుసుకుపోతంది…
పొద్దు గూట్లెవడ్డది. దేవయ్య సైకిల్ మీద మందు బస్తాలు తీసుకుని వచ్చి వాకిట్లేసి, బిడ్డను పిల్సిండు. “రజితా! అవ్వ ఇంక పొలం కాన్నుంచి రాలే?”
సోపతోళ్ళతోని ఆడుకుంటున్న రజిత,దేవయ్య పిలిపిని “అగో మా బాపచ్చిండు ” అని ఉరికొచ్చి “ఇంకా రాలేదే! నే నే ఇల్లునూకి, బాసాన్లు తోమి, పొయ్యి మీద బియ్యం పెట్టిన ” అన్నది పెద్దీర్కంతోని పిల్లలంతా ఎక్కడోళ్ళక్కడ మాయమైండ్రు.
దేవయ్య ఒక్కడే మందు బస్తాలు లోపలికి గుంజుకపొయ్యి మొగురానికి ఆనిచ్చిండు. రజిత సైకిల్ లోపల పెట్టి దేవయ్యకు చెంబుల నీళ్ళు తీసుకచ్చి ఇచ్చింది.
దేవయ్య భుజం మీది తువ్వాలతోని నొసలు మీది చెమట తుడ్సుకుంట నులక మంచంల కూసొని నీళ్ళు తాగిండు. పానం లేసచ్చినట్టైంది.పొద్దుట్నుంచి అన్నం కూడ లేక మందు బస్తాల కోసం లైన్ల నిలవడి కాళ్ళు ఈడ్సుకపోయినై.
‘నీఎగుసం అవ్వను…’ లోపల్లోపల్నే తిట్టుకున్నడు. ‘అరె! యిత్తనాలకు లైనే, మందు బస్తాలకు లైనే , ఎవ్వి ఒక పట్టాన దొరుకత లెవ్వు. ఎగుసమేమో గని పానం కొలికిలకత్తుంది… ‘ యాష్టపడ్డడు. బనీను కీసలకేలి అగ్గిపెట్టె, బీడికట్ట తీసి బీడి ముట్టిచ్చిండు.ఆలోచనలు పొగలెక్క ముసురుకుంటున్నయి… ‘పెద్దబిడ్డకు బిడ్డ పుట్టింది. పురుడెల్లదీయాలె. అల్లుడు మళ్ళేమన్న బంగారం పెట్టుమంటడో ఏమో! కొడుక్కు కాలేజీ ఫీజు కట్టాలే. తిరుపతి రెడ్డి దగ్గర అప్పు పెరిగేది పెరుగుతంది. ఏంజేసుడు? ఎట్ల జేసుడు? ఎటు మెసులకుంట ముంగట నుయ్యి ఎనుక గొయ్యి శాత్రం గావట్టె. ఈ ఎగుసం మీద ఏమీ ఎల్లకుంట గావట్టె. తిడిగింజలెల్లుడే కష్టం గావట్టె. చేత్తె ఆరు దండుగ, చెయ్యకపోతే మూడు దండుగన్నట్లయితంది. పోనీ ఎగుసం బందువెడ్దామంటె బందువెట్టి ఏం జేసుడు? పోతే ఉపాది హామీ కైకిలికి పోవుడే. రోజు వందిత్తే ఏమిటికైతయి. ఏది ముట్టుకున్నా అగ్గేనాయే ఏదో బతుకెల్లదీద్దామంటే పురుళ్ళు, పుట్టెంటికలని ఒకదానెనుక ఒకటి పెద్దపెద్ద కర్సులు మీద పడనేవట్టె. ఇగ ఎట్లెల్లదీసుడు? పోర్లగాండ్లకు సదువెట్ల జెప్పిచ్చుడు? వైనంగా తిన్నది లేదు. పెయ్యి నిండ బట్టగట్టిందీ లేదు. ఎంత సర్దుకున్నా ఇంకింత ఇర్కుటమెర్కుటమే గావట్టె… ఏందో మనసంతా ఆగమాగమైతంది కలికలి అయితంది…’
“ఎమాయెనయ్యా! మందు బస్తాలు దొరికినయా?” వచ్చుడుతోనే నెత్తి మీద గంప కిందికి దించుకుంట అడిగింది కనుకవ్వ. “అఁ… మా దొరికినయి మనిషికి రొండు. రేపటెల్లుండి మల్లత్తయట.” చెంబు మంచం కింద పెట్టుకుంటన్నడు. దేవయ్య ఆలోచనలు ఎక్కడియక్కడ చెదిరిపోయినయి.
“పోరిని గిన్ని బియ్యం పొయ్యి మీద పెట్టుమన్న పెట్టిందా?”అనుకుంట వంటింట్లకు పోయి చూసి వచ్చి “లెవ్వవేమయ్య! ఎప్పుడు తిన్నవో ఏందో బుక్కెడు తిందువు ” అన్నది.
దేవయ్య కాల్జేతులు కడుక్కొని వచ్చి వంటింట్ల తలె ముందట కూసున్నడు. ఎడతెగకుండా ఆలోచనలు కందిరీగల్లెక్క ముసురుకుంటనే వున్నయి… ఎటో సూసుకుంట ముద్ద మింగుతండు.
****
వంగి వరి కలుపు తీత్తుండ్రు కనుకవ్వ, రాజవ్వ, మల్లవ్వ, నర్సవ్వ. దేవయ్య ఒడ్డుపొన్న పొలమంతా తిరుక్కుంట చీడపురుగేమన్న పట్టిందా అని అక్కడక్కడ వంగి వంగి సూసుకుంట కలుపుదీసేకాడికి వచ్చిండి.
“ఏమాయెనయ్యా! పొలం సగమన్నా పారలే బాయిల నీళ్ళు దంగిపోయినై “. కనుకవ్వ.
“సైడ్ బోరు ఏపిద్దామంటె చేతుల పైసల్లెవాయె ఏం జెయ్యాలె? ఎల్లిన కాడికాయె.రేపు ఇంకో దిక్కుపారియ్యచ్చు”. దేవయ్య.
” మా సాలు తియ్య. ఏం పారిత్తవు? ఎన్నడు పారిత్తవు? గట్ల కాదుగని మన పక్క పొన్న తిరుపతి రెడ్డి పటేలు బాయిల నీళ్ళు మత్తుగున్నయి.ఇస్తడేమో అడుగు. ఆన్నుంచి యీడికి పైపు ఏసుకుందాం పైసలైతే పంట మీద ఇస్తమను.”
” నీకంటే ముందుగాల మొన్ననే అడిగిన. అంత అవసరముంటే పైసలిచ్చి పైపేసుకొమ్మన్నడు. ఉద్దెర బ్యారం లేదట. మీదికేల్లి పాత బాకీ పైసలు కూడా ఇప్పుడే కట్టుమన్నడు.”
“వీనింట్ల పీనుగెల్ల పేదోళ్ళను చూస్తే అందరికి ఎచ్చీర్కె. దెంక పోతున్నమటనా పైసలకు?” గునిగింది కనుకవ్వ.
****
గంపకింద కోడి “కొక్కోరకో…” అనంగనే కనుకవ్వకు తెలివైంది. కొంగుతోని కండ్లు నులుముకొని సూసింది. చీకటి మెల్లమెల్లగా పలుసవడుతుంది. దనదనా ఇంటెన్క పెరట్లకు పోయి గంపనిండ బెండకాయలు తెంపి పెనిమిటిని పిల్సింది.
“ఇగో ఉన్నావా? పెరట్ల గిన్ని బెండకాయలెల్లినాయి. నేను సిరిసిల్లకు పోయి అమ్ముకాత్త. నువ్వు లేసి పొలం కాడికిపోయి నీళ్ళు పెట్టు. ఊళ్ళెనే అమ్ముదామంటే పైసలెవ్వరియ్యరు.అంతా ఉద్దెరనే పోతయి. సిరిసిల్ల మార్కట్టుకు పోతే నగదు రొక్కమత్తది. సిన్నపోరికి బడి డ్రెస్ కావన్నట రాంగ బట్ట తీసుకత్త “గంప నెత్తికెత్తుకొని గలుమల నిలబడి అన్నది కనుకవ్వ.
” మా పొతగని జెల్దచ్చి బాయికడికి సద్దివట్టుకరా!”
“సరే! సరే! నువ్వయితే పో, మల్లపండకు ” అనుకుంట బయిలెల్లి సిరిసిల్లకు పోయింది కనుకవ్వ.
గంప దించేది దించంగనే చిట్టి రాసి మొకం మీదేసిండు మార్కట్టు అర్రాసు పాడుకున్నోడు.
“అయ్యో! ఇప్పుడే రావడితి రాంగరాంగనే చిట్టి మొకం మీదిసిరెయ్యవడ్తివి.” అన్నది కనుకవ్వ.
” ఏ… గవన్ని ముచ్చట్లు చెప్పద్దు. మార్కెట్ల గంప పెట్టినవంటె పదిరూపాలు కట్టాలె గంతె.” అన్నడు వాడు.
” మా ఇత్తగని, రాంగ రా పో ఎవ్వనికి తప్పినా నీకు తప్పది ” కనుకవ్వ.
“ఎట్లనవ్వా బెండకాయలు? ” సెల్లు చెవ్వుల పెట్టుకొని అడిగిండు ఒకాయినె.
“పదిరూపాలకు అద్దకిల”
“ఎనిమిది రూపాలకు అద్దకిలియ్యావా?”
“తొమ్మిదియ్యి సారు పొద్దుగాల పొద్దుగాల బోనీ నీదే”
“లేదమ్మా ఎనిమిదే ఇస్త నీ ఇష్టం ” కాళ్ళు ముందటికి పోయినయి.
“తీస్కోసారు! బోనీ పూటచ్చి గట్ల మర్రి పోవద్దు. పెట్టేకాడ నూర్లు పెడుతరు గీ కూరగాయలు కాన్నే కొసుతరు” గునుక్కుంట తరాజు లావట్టింది.
” అయ్యో! మా అవుసుల రాములు నయ్యం బంగారమన్న కొద్దిగ మొగ్గు జోకుతడు ” సెల్లు మనిషి.
కనుకవ్వకు చిర్రెత్తుకచ్చింది. తరాజు కింద పారేసి బెండకాయలు కుమ్మరిచ్చింది. “అయితే బంగారమే తినుపో సారు గీ బెండకాయలు తింటే ఏమత్తది ” అన్నది కోపంగా. సెల్లు మనిషి మొకం నల్లవడ్డది.
****
దేవయ్య పొలంకాడికి పోయ్యే సరికి బంగారు రంగులోకి మారిన వరి గొలుకులు గాలికి అటు ఇటు ఊగుతున్నయి. లోలోపల సంబుర పడ్డడు. ‘ఈ పంటతోని సగం అప్పులన్న తెంపాలె. మనుమరాలు పురుడు ఘనంగా చెయ్యాలె…’ అనుకుంట నీళ్ళేపాటూన్నయో సూద్దామని బాయిలకు తొంగి సూసిండి. నీళ్ళు అడుగంటినయు. ‘ ఊట బందైందా ఏంది? ఇప్పుడెట్లా? ఉన్న నీళ్ళు ఒక్కమడికి కూడా కావు. ‘ అనుకుంట మూడు నాలుగు రోజుల క్రితం నీళ్ళు పారిచ్చిన మడ్ల దిక్కు సూసిండు. పొలమంతా ఎండిపోయి నెర్రెలిచ్చింది. వరి కర్రలు నీళ్ళ కోసం కొనూపిరితోని సూసినట్టనిపించింది. మనసంతా గావరగావరైంది. ఉండవట్టలేక కుండ తీసుకొని దూరంగా ఉన్న రాజేశ్వర్ రావు బాయికాడికి పొయ్యి రాజేశ్వర్ రావు దొరను బతిమిలాడి కుండతోని నీళ్లెత్తుకచ్చి పోసిండు. ముప్ఫై నలుపై కుండలు పొయ్యంగనే యాష్టకచ్చింది. ‘ ఎన్ని పొత్తే ఎటు సాలుతాయి. వానదేవుడు సల్లంగ సూడాలె గని ‘. పొలం ఎక్కిరిచ్చినట్టు కన్పించింది. ‘ నోటికాడి బుక్క గద్దెత్తుక పోయినట్టు. పొట్టకచ్చిన పొలం చేతికి రాకుంటయె.’ కుండ కింద పెట్టి ఆన్నె కూలవడ్డడు. తిరుపతిరెడ్డి అప్పులు, పసిద్దయిన బిడ్డ, మనుమరాలు, కొడుకు అందరు గిర్రున తిరిగిండ్రు.
****
పొద్దటి ఎండ నడింట్ల పడుతంది…పొయ్యి ముంగట కూసున్న కనుకవ్వ అన్నం గిన్నె గంజి వారవెడ్తంది. ” దేవన్నా ఉన్నవా?” అనుకుంట తిరుపతిరెడ్డి పటేలు నడింట్లకచ్చి నిల్సున్నడు. పొయ్యి కాన్నుంచే సూసిన కనుకవ్వ పానం దస్సుమన్నది.’ పటేలోడు అడుగుపెట్టిన ఇల్లు పందిరి లెక్క కూలుతదంటరు. ఏం కొంపలు మునిగే ముచ్చట తీసుకొచ్చిండో…’ అని లో లోపల అనుకుంటనే ” పటేల కూసొండ్రి. యీనే మొకం కడుక్కుంటండు “అన్నది.
ఇంతల సెల్లతొని మొకం తుడ్సుకుంటచ్చిన దేవయ్య “అయ్యో! పటేల పొద్దుగాల్నె వచ్చిండ్రు?” అన్నడు.
” గదే దేవన్నా? మొన్న పొలం కాడ చెవులేసిన ముచ్చట ఏం విచారం జేసినవో తెల్సుకపొదామని వచ్చిన ” అన్నడు రజిత అందిచ్చిన చాయి తీసుకుంట.
కనుకవ్వ ఏం ముచ్చట, అని మెడ ముంగటికి సాపి చెవులప్పగించి వింటది. ఎటు సమజ్ గాలె.
“గదే పటేల ఏటు తోస్తలేదు. అమ్ముదునా? వద్దా? అని. ఉన్న భూమి అమ్మినంక ఏంజేసుడు? చేతులు ముంగట పెట్టుకొని కూసునుడే గదా! అని విచారం జేత్తున్నా ”
“ఇంకా ఎన్ని రోజులు విచారం జేస్తవు దేవన్నా?” అని దేవయ్య మొకంలకు సూసి మల్ల తనే” నేనొక్క మాట జెప్త ఇంటవా? మన సుట్టు పక్కల ఊళ్ళు గాదు. మన పది జిల్లలల్ల ఎవడన్న ఎగుసం జేసినోడు బాగుపడంగ సూసినవా? మంట్లే మానెడు పోత్తే ఇంటికి పుట్టెడు వచ్చే రోజులా యివ్వి.మంట్లె పోసినయి మంట్లెనే కలువవట్టె చేతికచ్చుడెక్కడిది. నామాటిను ఇయ్యాల భూమి అమ్ముకున్నోనికె విలువన్నది. ఇయ్యాలున్న ధర రేపుండదు. నీ నాల్గకరాల భూమికి ఎంతలేదన్నా మూడు లక్షలు వస్తయి. లక్ష యాభై వేల దాకా నాకే అప్పుంటివి. అవ్వి పొంగ ఇంక లక్ష యాభై వేలు నీ చేతికి వస్తయి. అరవై డెబ్భై వేలు పెట్టి కొడుకుని బి.ఇడి. చేపియ్యి. మిగిలినయి బ్యాంకులెయ్యి. యాడాది తిరిగేసరికి కొడుక్కు ఉద్యోగమత్తది, పైసలకు మిత్తికి మిత్తీ వత్తది”అనుకుంట అరచేతుల వైకుంఠం సూపిచ్చిండు తిరుపతిరెడ్ది. కనుకవ్వకు ఏం మాట్లాడన్నో అర్థం గాలె నోరు తెర్సి అట్లే ఎన్కకు మొగురానికి ఒరిగింది.అప్పటిదాకా మంచంల పండుకుని ఈ ముచ్చటంత వింటున్న కొడుకు రాజు దిగ్గున లేచి ” నిజమేనే బాపు ఎగుసం జేసుకుంట ఎప్పుడూ అప్పులే అనవడ్తివి. ఎప్పుడన్నా కుశామతుతోని నాలుగేళ్ళు నోట్లేకుపొయినయా? సప్పుడు జేక అమ్మెయ్. అప్పులు ఎక్కడియక్కడ పోతే ఇంత మనసన్న శాంతంగుంటది. మిగిలినయి నా సదువుకు అక్కరకత్తయి ” అన్నడు.
దేవయ్యకు ఎటూ పాలుపోలే అయిష్టంగానే “సరే పటేలా! నువ్వొక్కతీర్గ అనవడ్తివి. కాలం అటే పొవట్టె. నాక్కూడా అప్పు భారం పెరిగివట్టె రేపు పొద్దుగాల బయానా పట్టుకొని రా ” అన్నడు.
కనుకవ్వకు బొందిలకేలి పానం ఎళ్ళిపోయినట్టయింది. నోటమాట రాలె. పీనుగు లెక్క నడుసుకుంట పోయింది అక్కన్నుంచి.
****
“ఉన్నది వూడగొట్టి ఎన్ని రోజులు కూకొని తింటవు? ఈడికి యాడాదాయె. దమ్మిడి పనిజేత్తలేవు. కూకొని తింటే గుట్టలయినా కరుగతయట. నేనొక్కదాన్ని కైకిలిచేసి ఎందర్ని సాదాలే? గట్ల గా సిరిసిల్ల అడ్డమీదకి పోతే ఏదన్న పని దొరకదా? అట్ల పోతేంది. గుమ్మి లెక్క ఒక్కకాన్నే కూసోకపొతే?” కోపంగా సద్దిగిన్నె బట్టపేలికల కట్టుకుంటన్నది కనుకవ్వ.
“…”
దేవయ్య సప్పుడు జెయ్యలె. ఎటో సూసుకుంట కదలకుంట అట్లే కూసున్నడు.
కనుకవ్వకు ఇంకింత కోపమిచ్చింది ” నీ కూసునుడుకు అగ్గితగుల ఇంకెన్నొద్దులు కూసుంటవో నాకైతే మతికెక్కుతలేదు. సప్పుడు జేక ఇంత ఇసమిచ్చి సంపు అందర్ని ఒక్క సిత్తమైతది ” అనుకుంట సద్దిగిన్నె గంపల పెట్టుకుని బయటకి నడిచింది.
దేవయ్య ఇజ్జతనిపిచ్చింది. ‘ నువ్వద్దే అది సెప్పినట్టు ఎన్ని రోజులు కూకొని తినాలే. ఎక్కడియక్కడ పోంగ ఇంక ముప్ఫై వేయిలే మిగిలినయి. అవి కూడా ఈ యాడాది నుంచి తాపకిన్ని కరిగిపోతునయి. ఆయిన్ని కర్సయినంక ఎప్పటి చిప్ప ఎనుగులకచ్చినట్టయింది…’ అనుకుంట ‘ అడ్డ మీదికయితే పొయ్యత్త ‘ అని బనీను ఏసుకుని ఆటోలు ఆగే కాడికచ్చి నిలవడ్డడు.దూరంగా తాను అమ్మిన పొలం కనిపిత్తంది. ఎవలో పది పన్నెండు మంది అటూ ఇటూ తిరుక్కుంత కనిపిత్తండ్రు. ఏంజెత్తండ్రో సూసొద్దామని పొలం దిక్కి నడిసిండు…
పొయ్యెసరికి తిరుపతిరెడ్డి, ఆయినె కొడుకు ఇంకొందరు కలిసి ఏవో గొలుసులు పట్టి అడ్డం పొడుగు కొలుత్తుండ్రు.
“పటేల ఎగుసం బందుపెట్టి కోళ్ళ ఫారం గిట్ల పెడుతుండ్రా. ఏమొ అడ్డం పొడుగు కొలుత్తుండ్రు అయ్యాకొడుకు? అన్నడు దేవయ్య. సుట్టు సూసుకుంట.
“దేవన్నా! కోళ్ళ ఫారం నేనెందుకు పెడుతనే? మన పొలం ముంగట గవుర్మెంటు దవాఖానా, పెద్దబడి , ఇంకేదో ఆఫీసు పడుతయట. గందుకే ఎగుసం జేత్తె ఏమత్తదని ప్లాట్లు అమ్ముతున్న.ఇరువై ప్లాట్లెల్లినయి. లక్ష కోటి పోతంది. ఒక రెండీటికి మన రాజిరెడ్ది పటేలు నిన్ననే బయానిచ్చుండు. నువ్వోటి కొనుక్కోరాదే ఎదిగిన కొడుకున్నడు. రేపటికాల్ల ఏ దుకానమో, ఇంత ఎస్టీడి బూతొ పెట్టుకొని బతుకొచ్చు.” అన్నడు తిరుపతిరెడ్ది నవ్వుకుంట. కనీలు పాతుకుంట.
దేవయ్యకు పానమంత నీళ్లయింది. తన పొలాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్ముడు జూసి మనసంతా వక్కలువక్కలుగా కోసినట్టయింది. ఇంతల్నే ఎంత మాయ జేసిండు. అంత యాడాదికింద మూడు లక్షలకు కొని ఇరవై లక్షలకు అమ్ముతుండు. ఎంత మోసం.’ నెత్తురంతా మొకంలకచ్చింది.’ అయినా లేకిడోని ఇంట్లనే శనేశ్వరుడు కూసుంటడన్నట్టు చెర్ల నీళ్ళు పొయి చెరువెనుక వడ్డంక ఇప్పుడనుకుంటె ఏం లాభం? అనుకుంట బాధగా అడుగులడుగేసుకుంట అక్కన్నుంచి బయటవడ్డడు.
****
సిరిసిల్ల లేబర్ అడ్డా. అంగట్ల వయసుడిగినంక కోతకు అమ్ముడు పోయే గోవుల్లెక్క లొట్టపోయిన కండ్లతోని బక్కపల్సని పానాలన్ని ఒక చేతిల సద్ది గిన్నె ఇంకో చేతిల తట్ట, పార , గడ్డపార, సుత్తె , తాపి పట్టుకోని నిలవడ్డయి. అందరి కండ్లల్ల ఒకటే ఎదిరి సూపు. ఈ పూటకు పనిదొరుకుతదా? లేదా?. అని. అందరు ఎవలకు వాళ్ళు అడ్డమీదికచ్చిన యెజమానులతోని ఏదో ఒక పని దొరింపు సేసుకిని పొతుండ్రు. మెల్లమెల్లగా అడ్డా అంతా ఖాళీ అయిపోతంది. దేవయ్య ఒక్కడే మిగిలిండు. “కొత్త గదా వీనికి పని రాదనుకున్నరో…? లేక పోతే పని చాతగాదనుకున్నరో…? ఎవ్వలు పిల్వలేదు. భుజం మీది తువ్వాల దులిపి మల్ల భుజం మీదేసుకుని ఇంటి మొకాన నడుద్దామని రెండడుగులేసిండు.
“ఏ ఆగవయ్యా! పనికి వస్తవా?” అని ఎవలో పిల్సేసరికి ఎనక్కు సూసిండు. ఎవలొ ఆరడుగుల మనిషి తెల్ల బట్టలేసుకుని వడి తిరిగిన మీసాలతోని కనిపిచ్చిండు. మనిషి బలంగున్నడు. “ఏం పని దొరా?” అన్నడు దేవయ్య.
“రెండకరాల పొలం దున్నాలె. ఎడ్లకు నాగలికట్టి దున్నుదామంటే పోయినేడాది కాలంగాలేదని ఎడ్లను అమ్మేసిన.ట్రాక్టర్ వెట్టి దున్నిద్దామంటే సినుకు పడే సరికి ఒక్కా ట్రాక్టర్ దొరుకతలేదు. మా పాలేరు బాలిగాడు నువ్వు చెరొక దిక్కు కాడి భుజం మీద పెట్టుకొని నాగలి గుంజక పోవాలె. నాలుగైదు రోజుల పనివడ్తది. రోజుకు రెండు వందలిస్త” అన్నడు. తెల్ల బట్టల మనిషి.
ఎడ్లు లేకున్న ఎగుసం జెయ్యాల్ననే అయినే ఆరాటం జూసి దేవయ్యకు ఎక్కడలేని సంతోషం అనిపించింది. ఎంటనే ” సరే దొర కని ఆకటాళ్ళకు పొట్టకింత అన్నం పెట్టియ్యాలె ” అన్నడు జాలిగా మొకం పెట్టి.
మా పెట్టిత్తగని నువ్వయితే రా మొదలు ” అనుకుంట తీస్కపోయిండు.
పోతపోతానే బనీనిడిసి, దోతి మీదికి మడిసి పొలంల దిగిండు. అబ్బ… ఎన్నాళ్ళయిందో బురద పొలంల దిగక.. బురద పాదాలకంటంగనే బంగారాన్ని తాకినట్టనిపించింది. ఓ దిక్కు దొర పాలేరు బాలిగాడు ఇంకో దిక్కు దేవయ్య కాడి భుజం మీద పెట్టుకుని నాగలి గుంజుతుండ్రు. దొరనాగలి పట్టుకున్నడు. బురదల నాగలి అస్సలు జరుగతలేదు. అడుగుదీసి అడుగేసుడు. బహు కష్టమనిపిత్తంది. ‘ఎడ్లు ఎట్ల గుంజుతయో! అనుకున్నడు దేవయ్య. పది సుట్లుమర్లే సరికి దేవయ్యకు నడుం టింగుమన్నది. కాళ్ళు గుంజుకపోతున్నాయి. అయినా సత్తువంతా కూడ దీసుకుని అడుగేత్తుండు… పొట్ట తిప్పల్కు జెర్రి పోతులాట. పనిదొరికింది ఈడికింతే నయం ‘ అనుకుంట.
****
పోల్కన్న గుట్టకు పోవాల్నంటే చిన్నప్పుడు గజ్జుమనేది. అసోంటి పోల్కన్న గుట్ట ఇప్పుడు ఆనవాలు లేకుంట పోతంది. కంకర మిషిని గుట్టను అమాంతం ‘కరకర కరకర’ నమిలి పారేత్తుంది… దేవయ్య రోజు కరుణాకర్ రెడ్డి ట్రాక్టరు మీద పనికి పోతుండు. కంకర అవసరమున్నోళ్ళకు కంకర , ఉశికె అవసరమున్నోళ్ళకు వాగుల ఉశికె జారగొట్టాలె. ట్రిప్పుకు యాభై దొరుకుతయి. చేతగాకున్నా రోజూ పోవాలె. ఒక్కరోజు పోకపోతే పటేలు ఇంకొగలను పనిల పెట్టుకుంటడు. మల్ల పని దొరుకది. దినాం పనికి పోవుట్ల దేవయ్య పానం గుంజుకచ్చింది. మనిషి ముందగట్లెక్క లేడు. పక్కబొక్కలు బయటపడుతున్నయి. అప్పుడప్పుడు మొసత్తంది. దానితోని ఎడతెగకుంట దగ్గు అందుకుంటంది…
ఒక దినం అద్దుమరాత్రి దేవయ్యకు దమ్ము ఎత్తేసుకత్తంది…దాని తోని దగ్గు నంజు ఇరాం లేకుంటత్తనే ఉంది…తాపకోసారి గుడ్లు తేలేత్తండు… ధాతు సల్లవడ్తంది…పెనిమిటి కిందమీద పడుడు సూసి ‘అయ్యో! పురాతెట్లో సేత్తుండు’ అనుకుంట కనుకవ్వ బొచ్చె అంత గుద్దుకుంట లబోదిబో మొత్తుకుంటంది… ఈ లొల్లికి సుట్టు పక్కల ఇండ్లోల్లంతా జమైండ్రు. ఇంతల ఎవలో కాలేజీ పోరడు 108 కి ఫోన్ చేసిండు. అంబులెన్సచ్చి సిరిసిల్ల సర్కారు దవాఖానాకు ఏసుకపోయింది. పోతె పోతేనే ముక్కుకు ఆక్సిజన్ పెట్టిండ్రు. తెల్లారితే గానీ ఏం చెప్పలేమన్నరు. కనుకవ్వకు కాల్జేతులు సల్ల వడ్డయి. గుల్కోసు ఎక్కుతంది…
తెల్లారేసరికి దేవయ్య కొడుకు రాజు డాక్టర్ తోని మాట్లాడిండి. “ఊపిరితిత్తిలల్ల బాగా దుమ్ము పేరుకపోయింది. అదే స్టోన్ క్రషర్ డస్టు, గందుకే ఊపిరి తియ్యత్తలేదు. దగ్గు వస్తంది. ఆపరేషన్ చెయ్యాలె. ఎంత లేదన్నా నాలుగైదు లక్షలయితయి. ఇక్కడ గాదు పట్నం తీస్కపోండ్రి…” అని డిస్చార్జి చేసిండ్రు. అంతా విని కనుకవ్వ సోకం పెట్టింది. ” ఉన్న పొలం అమ్మి నాశనం చేత్తివయ్యో… నన్నూ పోరగాండ్లను ఎక్కడగాకుంట చెయ్యవడ్తివయ్యో… ఇప్పుడెటువోతు ఏం జేత్తునయ్యో…” ఏడ్సుకుంటనే ఆటోల ఇంటికి తీస్కపోయిండ్రు.
కనువవ్వకు ఎటూ సమజైతలేదు. ‘చేతిల చిల్లిగవ్వలేదాయే. పట్నం దాక ఎట్ల తీస్కపోవాలె? దవాఖానాకు ఏం పెట్టి సూపియ్యాలె?’ అని ఇంట్లకు బయటకు తిరుక్కుంట చిత్తు బొత్తు అయితంది. తెల్లార్తంది…పొద్దూకుతంది. ఒక్క పైస పుడుతలేదు. మూలకు మూలుగుకుంటున్న దేవయ్య రోజుకింత దగ్గరపడుతండు దగ్గు, దమ్ము ఎక్కువయితంది. మొసందక అప్పుడప్పుడు ఎగిరెగిరిపడుతండు…
ఈ లోకంల ఎగుసం చేసెటోనికి , కూలోనికి,నాలొనికి , పేదోనికి జాగలేదు. అగ్గి పెట్టి గుగ్గిపెట్టె. ఆటల తుసుక్కుమన్న దగ్గర వేలు లొపలికి ముడుసుకపోయినట్టు మనిషి గతీ గంతే…గంతే…
ramnarsimha Feb 8, 2010 1
చాలా బాగుంది.
9866314321