Feb2010
రాయలసీమ జానపద సాహిత్య సౌరభం
రాయలసీమ రతనాలసీమ. రతనాలకంటే విలువైన జానపద సాహిత్యానికి కూడా ఈ సీమే ప్రసిద్ధి. జానపద సాహిత్యం అక్షర ఙ్ఞానం లేని పల్లీయుల సాహిత్యం. మనదేశంలో నూటికి 75 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్తూ పల్లెల్లోనే జీవిస్తున్నారు. శిష్ట సాహిత్యాన్ని మనమెంత చదువుకున్నా మన తెలుగు సాహిత్యంలోని సౌరభాల్ని, స్వచ్ఛతను, తియ్యదనాలను రుచి చూడాలంటే జానపద సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు. జానపద సాహిత్యం రోజురోజుకు అంతరించిపోతోంది. దీనిని కనీసం భద్రపరచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఆంధ్ర దేశం లో జానపద సాహిత్యానికి గని వంటిది రాయలసీమ. జానపద సాహిత్యం తెలుగుతల్లికి మణిమకుటం లాంటిది. రాయలసీమ జానపద సాహిత్యం. సాహిత్యాభివ్యక్తి విధానాలే కాకుండా జాతి జీవన విధానాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను చరిత్రను ప్రతిబింబిస్తుంది.
జానపదుల వ్యవహారంలో ఉన్న ఈ సాహిత్యం శిష్టసాహిత్యానికి పునాదిగా చెప్పుకోవచ్చు. ఒక్క తెలుగులోనే కాదు ప్రపంచంలోని ప్రతి శిష్ట సాహిత్యానికి జానపద సాహిత్యమే మాతృక. ఒకప్పుడు పరిశోధకులు జానపద సాహిత్యాన్ని, జానపదుల భాషను ఒకే శాఖ క్రింద చేర్చారు. ఉదా:- రిచర్డ్. ఎం. డార్సన్ అనే పండితుడు ‘folklore and folklife’ అనే గ్రంథంలోమౌఖిక సారస్వతం క్రింద జానపద సాహిత్యాన్ని, జానపదుల భాషను కలిపి వివరించారు. అందులో పాట, మాట, పలుకు, గేయాలు కథా గేయాలు, గద్యాఖ్యానాలు, సామెతలు, పొడుపుకథలు, మారుమూల పదాలు, మాండలికాలు, యాసలు, తిట్లు, దిట్లు వంటి విభాగాలను చూపారు.
అయితే నేడు పరిశోధకులు కొత్త పుంతలు తొక్కడం వల్ల మౌఖిక సారస్వతాన్ని రెండుగా చేసింది జానపద సాహిత్యం.
జానపదుల భాషలో జానపద శబ్ద వుత్పత్తి, మాండలిక భాషలు, వ్యక్తి నామాలు, దీవెనలు, శాపాలు ప్రమాణాలు వంటి వాటిని చేర్చడం జరిగింది.
జానపద సాహిత్యాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది అవి. 1. జానపద కవిత్వం 2. గద్యాఖ్యానాలు 3. సామెతలు 4. పొడుపు కథలు.
జానపద కవిత్వం
జానపద కవిత్వం 2 రకాలు 1. గేయాలు 2. కథాగేయాలు.
గేయాలు:
జానపద గేయాలను కూడా ఎన్నో రకాలుగా విభజించవచ్చు. వీటిని పనిపాటలు, పారమార్థిక గేయాలు, బాంధవ్య గేయాలు, పిల్లల పాటలు, వేడుక పాటలు వలపు పాటలు హాస్య గీతాలు, కన్నీటి పాటలు అని కొందరు పండితులు వర్గీకరించారు.
- పనిపాటలు: ఈ పనిపాటల్లో వేటపాటలు, పొలంపాటలు, కార్మిక గేయాలు, ఇంటిపనులపాటలు, వివిధ వృత్తి సంబంధ పాటలు వంటివి చోటు చేసుకొని ఉంటాయి.
- పారమార్థిక గేయాలు: పరమాత్ముని చేరుకోవడానికి మోక్ష ప్రాప్తికోసం జానపదులు భక్తి పాటలు పాడుతుంటారు. వీటిలో పౌరాణిక గీతాలు కూడా వుంటాయి. అంటే రామాయణ, భారత, భాగవతాలకు చెందిన ఎన్నో గేయాలు మనకు కనిపిస్తాయి. ఉదా:- రామునికి సంబంధించిన గేయాన్ని చూడండి —
పుట్ట కింద నేయిబోసి
పుత్రూనీ నేను గంటే
నీళ్ళూ బోసిన గానీ నిద్దూరూపిన గాని
నిదురా బోడమ్మా శ్రీరాములు
బెదిరినాడెమో
రాతికింద నేయిబోసి
రాములనే నేను గంటి
పాలు దాపిన గాని పండబెట్టినగాని
నిదురా బోడమ్మా శ్రీరాములు
బెదిరి నాడేమో
బంగారీ ఉయ్యాలా
ఎండీవీ గొలుసూలు
ఉయ్యాల్లో పండేసి లాలి పాడినగాని
నిదురా బోడమ్మా శ్రీరాములు
బెదిరినాడేమో - బాంధవ్య గీతాలు: కుటుంబం సమాజ వ్యవస్థకు పునాది. కుటుంబంలో తల్లిదండ్రులు, అక్కా చెల్లెల్లు, అన్నదమ్ములు కలిసి జీవిస్తారు. వివిధ వ్యక్తుల మధ్య కుటుంబ సభ్యులందరూ ఒక ఇంట్లోనే నివసిస్తూ ఒకే తిండిని తింటూ మంచి చెడ్డలను, సుఖ దుఃఖాలను కలసి అనుభవిస్తూ ఉంటారు. జానపదుల కుటుంబ జీవితంలో వివిధ వ్యక్తుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల్ని తెలిపే గేయాల్ని బాంధవ్య గీతాలని అంటారు.
- పిల్లల పాటలు: జానపద సాహిత్యంలో పెద్దలు పాడుకొనే పాటలే కాకుండా పిల్లలు పాడుకునే పాటలు కూడా ఉన్నాయి. అలాగే పెద్దలు పిల్లల కోసం పాడే పాటలు కూడా ఉన్నాయి. వీటినే పిల్లల పాటలని అంటారు. బిడ్డకు ఉగ్గుపొసిన తర్వాత తల్లి తిన్నవన్నీ జీర్ణం అవ్వాలని ఎలా పాడుతుందో చూడండి.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
ఏనుగు తిన్న ఎలక్కాయి జీర్ణం
భీముడు తిన్న పిండి వంటలు జీర్ణం
మా పాప తాగిన పాలన్నీ జీర్ణం “ - వేడుక పాటలు: వేడుకలన్నవి మానవుడూ వినోదం కోసం ఏర్పరచుకున్నవి. కర్మ ప్రధానాలైన వివాహకార్యాలు. పండుగలు, వ్రతాలు, నోములు వంటివి. రాను రాను ఇవి వేడుకలై పోయాయి. కాబట్టి ఈ సందర్భంలో పాడే పాటలను వేడుక పాటలని అంటారు.
- వలపు పాటలు: వీటినే శృంగార గేయాలని కూడా అంటారు. రాయలసీమ జానపద గేయాల్లో అత్యధిక శాతం శృంగార గేయాలే చోటు చేసుకొని ఉన్నాయి. ఉదా :- ఒక శృంగార గేయాన్ని వినండి.
ఆదివారం వస్తావని బావా-ఆశలో నేనుంటినీ
ఆదివారం రాకపోయే బావా – ఆశలన్నీ మానుకుంటీ
సోమవారం వస్తావని బావా – సోకుతో నేనుంటినీ
సోమవారం రాకపోయే బావా – సోకులన్నీ మానుకుంటి
మంగళవారం వస్తావని బావా- మనసుతో నేనుంటినీ
మంగళవారం రాకపోయే బావా – మనసులన్నీ మానుకుంటి
బుధవారం వస్తావని బావా – బుద్ధిలో నేనుంటినీ
బుధవారం రాకపోయే బావా- బుద్దులన్నీ మార్చుకుంటి
బేస్తవారం వస్తావని బావా -బ్రమసతో నేనుంటినీ
బేస్తవారం రాకపోయే బావా- బ్రమసలన్నీ మానుకుంటి
శుక్కురారం వస్తావని బావా – శుద్దితో నేనుంటినీ
శుక్కురారం రాకపోయే బావా- శుద్దులన్నీ మానిపోయే
శనివారం వస్తావని బావా -సొగసుతో నేనుంటినీ
శనివారం రాకపోయే బావా – సొగసులన్నీ మానీపోయే
నమ్మినాను నమ్మినాను బావా – నిన్ను నేను నమ్మినాను
నిన్నునేను నమ్మినాను బావా -నన్ను నీవు నమ్మలేదు.
అలాగే హాస్యగేయాలు, కన్నీటి పాటలు కూడా రాయలసీమ జానపదగేయాల్లో తమ ప్రత్యేకతల్ని చోటు చేసుకున్నాయి.
కథాగేయాలు
కథతో కూడిన గేయాల్ని కథాగేయాలని అంటారు. ఈ గేయాల్లో ఏదో ఒక కథ చెప్పబడి ఉంటుంది. జానపద కథాగేయాలను కూడా ఎన్నో రకాలుగా విభజించవచ్చు. వీటిని పౌరాణిక కథాగేయాలు, చారిత్రక కథాగేయాలు, మత సంబంధం కథా గేయాలు, అద్భుతరస కథా గేయాలు, కరుణ రస కథాగేయాలుగా వర్గీకరించవచ్చు. చారిత్రక కథాగేయాలే వీరగాథలుగా వ్యవహరింపబడుతోంది. అయితే వీరగాథలను ప్రత్యేకంగా పరిశీలించడం ఎంతైనా అవసరం. వీరగాధలన్నీ కథాగేయాల్లో అంతర్భాగం, శ్రీ కృష్ణుని జననం కథాగేయాల్ని కొంత వినండి.
కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా
శ్రీరంగరంగా నినుబాసి యెట్లు నే మరచుందురా
కంసుడ్ని సంహరింపా సద్గురుడు అవతారమెత్తనప్పుడు
దేవకీ గర్భమూనను కృష్ణావతారమై జన్మించెను
ఏడు రాత్రులు చెరచీ ఒక రాత్రి యెక రాత్రిగచేసెను.
ఆదివారము పూటను అష్టమదినమందు జన్మించెను
తలతోటీ జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు
యెదురు కాళ్ళను బుట్టెను యేడుగురు దాదులను జంపెనపుడు. ”
ఇకపోతే కథాగేయాల్లో అంతర్భాగమైన వీరగాధలు వీరసంఘటన ఏదైన జరిగినపుడు జానపదుల్లో ఆవిర్భవిస్తాయి.
రాయలసీమలొ ‘ఉయ్యాల నరసింహారెడ్డి ‘ని గూర్చి తెలియని వారుండరు. అతని గూర్చిపాడుకొనే వీరగాధ ఒకదానిని చూడండి. -
అడుగో వచ్చె ఇదిగో వచ్చే నారసింహరెడ్డి
పళ పళపళ పళ కేకలేసెరా నారసింహరెడ్డి
చంద్రాయాదమును చేతపట్టినే నారసింహరెడ్డి
కోబలీ రణబలీ యన్నాడే నారసింహరెడ్డి
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికి నాడూ
రెడ్డి ఎక్కినా గుర్రములమీదే ఏవిధమెచ్చినదీ
కుప్పిటి గంతులమీద వచ్చెరా బారా హజ్జారీ
వచ్చిన వక్క సైన్యము అంతా ముందుకు దుముకినాదీ
అరవై ఒక్కా తుపాకులండీ పెళ పెళ వాగినవి
విరగనరుకుతా పోతాడయ్యా నరసింహారెడ్డి
కరువు వచ్చినా కాటకమొచ్చినా ఆదరించె రెడ్డీ
అట్టివొక్క మనరెడ్డి మాటను చిన్న చెయ్యరాదు. ”
ఇలా జానపద కథాగేయాలు వీరగాథలు రాయలసీమ జానపద కవిత్వంలో చోటుచేసుకొని ఉన్నాయి.
గద్యాఖ్యానాలు
జానపద సాహిత్యంలో వచన రూపంలో ఉండే ప్రక్రియ గద్యాఖ్యానాలు లేదా గద్యకథనాలు. అంటే ఇవి వచనరూపంలో కథన రూపంలో ఉంటాయి. జానపద గద్యాఖ్యానాలు 3 రకాలు. అవి 1. పురాగాధలు 2. ఐతిహ్యాలు 3. కథలు.
- పురాగాధలు: ప్రాచీన మానవుడు సృష్టిలో జరిగే పరిణామాలన్నింటికి అతీతమైన శక్తి మూలకారణం అని భావించాడు. ఆ శక్తికే ప్రాచీన మానవులు తన స్వరూప స్వభావాలను, అతి మానుష శక్తులను ఆపాదించారు. తనకు అపకారం కలిగే వాటిలో రాక్షస అంశ, ఉపకారం కలిగే వాటిలో ‘దైవాంశ’ వుందని భావించారు. అగ్నికి శరణం జొచ్చారు. జీవనాధారమైన వాయువును, వర్షాలను ఫల వృక్షాలను ఆరాధించడం ప్రారంభించారు. ఇలా ప్రాచీన మానవులు తమ జీవితానుభవాల్ని ఆధారంగా చేసుకొని అసహజమైన అద్భుతాంశాలతో కథల్ని సృష్టించారు.Standard Dictrionary of folklore Mythology and Legend అనే గ్రంధంలో పురాగాధల గురించి ఏ విధంగా ప్రస్తావించబడిందీ చూడండి.
“ప్రాచీన కాలానికి చెంది, జగత్సృష్టిని, దేవతలను, వీరులను, సాంస్కృతిక లక్షణాలను ఆచారమత సంబంధిత విషయాలను, నమ్మకాలని వివరించే గాధ పురాగాధ. వివిధ ప్రాణుల సృష్టిని గూర్చి జంతువుల ప్రత్యేక గుణాలను, లక్షణాలను కలిగి ఉండడానికి కారణం గురించి, కర్మకాండలు, ఉత్సవాలు. ఎందుకు, ఏవిధంగా ఏర్పడ్డాయి అనే అంశాలను గురించి పురాగాధ వివరిస్తుంది. ”
ఉదా : విశ్వ సృష్టికి సంబంధించిన పురాగాధను పరిశీలించండి.
సృష్టికి పూర్వం ప్రపంచం అంతా జలమయంగా ఉండేది. అనంతమైన ఈ జలరాశిపైన ముక్కు, ముఖంలేని ఒక పక్షి పెట్టిన మూడు గుడ్లు పగుల్తాయి. మొదటి గుడ్డు పై భాగం ఆకాశంగాను, క్రిందిభాగం భూమిగాను రూపొందుతాయి. రెండవ గుడ్డు నుండి విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు, ముప్పై మూడు కోట్ల దేవతలు, అరవై కోట్ల మునులు ఉద్భవిస్తారు. మూడవ గుడ్డు నుండి రాక్షసులు, మానవులు, జంతువులు, వృక్షాలు ఆవిర్భవిస్తాయి. ఇలా గుడ్డు నుండి విశ్వం అవతరించిందని పురాగాధ చెప్పుతుంది. ఇలా పురాగాధలు సృష్టిగాధల్ని, దేవతా సంబంధగాధల్ని, ఆచార సంబంధ గాధల్ని తెలియజేస్తాయి.
- ఐతిహ్యాలు: గధ్యాఖ్యానాలలో ఐతిహ్యాలు ఒక భాగం, వచన రూపంలొ ఉండే ఈ ఐతిహ్యాలు ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విషయాలను చెప్తాయి. వ్యక్తిని గూర్చి గాని, స్థలాన్ని గూర్చిగాని, ఏదైనా సంఘటనను గాని సాంప్రదాయకంగా మౌఖికంగా వివరించేవే ఐతిహ్యాలు. జానపదుని విచిత్ర కల్పనాశక్తి ఆధారంగా ఐతిహ్యాలు ఉత్పత్తి అయ్యాయని చెప్పొచ్చు. కొంతమంది వ్యక్తుల మీద, స్థలాల మీద ప్రజలకు ప్రత్యేక భక్తి గౌరవాలుంటాయి. అలాంటి వ్యక్తులకు, స్థలాలకు ఐతిహ్యాల్లొ ప్రధాన పాత్ర లభిస్తుంది.
ఐతిహ్యాలను అనేక మంది అనేకరకాలుగా వర్గీకరించినా ప్రముఖమైన వర్గీకరణ రెండు రకాలు 1. స్థానిక ఐతిహ్యాలు 2. సంచారీ ఐతిహ్యాలు.
ఉదా: శ్రీ కృష్ణదేవరాయల కొడుకు మరణానికి మహామంత్రి తిమ్మరుసే కారణమని చుట్టుప్రక్కల వాళ్ళు రాయలకు తిమ్మరుసుపై ద్వేషాన్ని కల్గిస్తారు. అందుకు రాయలు కోపించి మంత్రి పదవి నుండి తొలగించి తిమ్మరుసును దూరం చేసుకుంటాడు. అలా తిమ్మరుసు రాజాశ్రయం కోల్పోయి అవసాన దశలో తిరుమల కొండపైన వంతు ప్రసాదాలను (మిరాశి ప్రసాదాలను) యాత్రికులకు అమ్ముకొని జీవించాడని అంటారు. అలాగే కడప ఊరు పేరు రావడానికి ఒక ఐతిహ్యం చెప్తారు. అదేమిటంటే వేంకటేశ్వర స్వామి కొండకు వచ్చే యాత్రకులకు గడపలాగా ఆ ఊరు ఉండటం వల్ల దేవుని గడపే ‘కడప’ అయిందని అంటారు.
ఇలా ఐతిహ్యాలు జానపద సాహిత్యాంలోని గద్యాఖ్యానాల్లొ చోటుచేసుకొని ఉన్నాయి
- జానపద కథలు: జానపద సాహిత్యంలో జానపద కథలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇప్పటికీ జానపద కథలే ప్రపంచమంతా రాజ్యమేలుతున్నాయి. జానపద కథలు మనస్సును రంజింపచేయడానికి, ఉల్లాసానికి ఉద్భవించాయి. వీటిలొ అద్భుత విషయాలు, రోమాంచక వృత్తాంతాలు, కాల్పనిక సంఘటనలెన్నొ ఉన్నాయి. దీనివల్ల పురాగాధ, ఐతిహ్యాలకంటే, కథలు ఎక్కువగా జనప్రియమైనవి, ప్రపంచంలోని కథలన్నింటికి భారతీయ కథలే మూలమని విద్వాంసుల అభిప్రాయం. జానపద కథలకు అనేకమంది అనేక రకాలుగా వర్గీకరించారు. వీటిని ప్రధానంగా A) అద్భుత కథలు B) వినోద కథలు C)ప్రాణి కథలు D) నీతి కథలు E) సమస్యాత్మక కథలు అని విభజించవచ్చు. జానపద కథల్లో ఒక సమస్యాత్మక కథను గమనించండి.
కథ: ఒక బ్రాహ్మణుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె 12 సంవత్సరాలకు యుక్త వయస్కురాలైంది. ఆ ఊర్లోనే ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమెపై మనసు పడ్డారు. ఆమెను పెళ్ళి చేసుకుంటామంటూ విడివిడిగా ఆ బ్ర్రాహ్మణుడ్ని అడిగారు. అతను సరేనంటాడు. కానీ ఒక రోజు ఆమె చనిపోతుంది. ముగ్గురూ ఎంతో బాధ పడ్తారు. వారిలొ ఒకడు ఆమె అస్థికల్ని గంగలొ కలుపడానికి తీసుకెళ్తాడు. ఇంకొకడు ఎలాగైనా మంత్రం నేర్చుకొని ఆమెను బ్రతికించాలని మంత్రం కోసం బయలుదేరి వెళ్తాడు. ఒకడు మాత్రం ఆ బూడిదంతా పోగుచేసి దాని ముందు కూర్చొని నిద్రాహారాలు లేకుండా ఏడుస్తుంటాడు. కాశీకి వెళ్ళిన మొదటి బ్రాహ్మణుడు 15 రోజుల్లో అస్థికల్ని గంగలో కలిపేస్తాడు. రెండవ బ్రాహ్మణుడు అలా వెతుకుతూ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె తన బిడ్డ ఏడుస్తూ వుంటే విసుగుతో పొయ్యిలోకి విసిరేస్తుంది. మళ్ళీ ఏదో మంత్రం చదివి బూడిదతో బిడ్డని తిరిగి బతికిస్తుంది. వెంటనే అతను ఆమెను బ్రతిమాలి 15 రోజులామెకి సేవలు చేసి మంత్రం నేర్చుకుని తిరిగి వస్తాడు. శ్మశానంలో మూడవ బ్రాహ్మణుడు 15 రోజులుగా అలా ఏడుస్తూనే బూడిదకు కాపలా ఉంటాడు. మంత్రం నేర్చుకొని వచ్చిన యువకుడు ఆ బూడిదని కలిపి మంత్రం చదివి ఆమెను బ్రతికిస్తాడు. అలా ముగ్గురూ ఆమె నాభార్యంటే నాభార్య అని మళ్ళీ గొడవకు దిగారు ముగ్గురూ కలిసి తీర్పు కోసం రాజు దగ్గరకు వెళ్తారు. అప్పుడు రాజు “ఏం లేదురా నాయనా అస్థులెత్తుకొని పోయినాడు జూసినావా వాడు తండ్రితో సమానం. మంత్రం నేర్చుకోనొచ్చి బతికించిన వాడు తల్లితో సమానం. నిద్రాహారం లేకుండా ఏడ్చుకుంటా ఉన్నాడే ఈ పదిహేను రోజులు, వీడికే భార్య నాయనా ” అని తీర్పు నిచ్చాడు.
ఇలా రాయలసీమ జానపద సాహిత్యంలోని గద్యాఖ్యానాల్లో ఎన్నో కథలు చోటుచేసుకుని ఆ బాలగోపాలాన్నీ అలరిస్తున్నాయి.
సామెతలు
రాయలసీమ జానపద సాహిత్యంలో సామెతలకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సామెతలు జానపద సాహిత్యంలో ఒక ప్రధాన విభాగంగా గుర్తింపబడింది. సామెత పదం సామ్యత నుండి ఆవిర్భవించింది. మన మాట్లాడేటప్పుడు సందర్బానుసారం అనేక సామెతలను పోలికకోసం చెప్పుతుంటాం. కాబట్టి ఒక విషయం చెప్పేటప్పుడు పొలికకోసం చెప్పే వాక్యమే సామెత అని చెప్పవచ్చు. సామెతలను అనెక మంది అనేక రకాలుగా నిర్వచించారు. తరతరాల అనుభవం సృష్టించిన సంక్షిప్తవాక్యాలు సామెతలు అని చెప్పబడి ఉంది. సామెతలు అనేక లక్షణాలను కల్గి ఉన్నాయి. అలాగే సామెతల పుట్టుకకు ఎన్నో ఆధారాలున్నాయి. కొన్ని సామెతలను ఆధారం చేసుకొని అవి ఏ కాలానికి చెందినవో కూడా చెప్పవచ్చు. ఇకపొతే సామెతలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సార్వదేశికాలు, ప్రాదేశికాలు.
ఆంధ్రదేశంలొ అంతటా కనిపించే సామెతలు సార్వదేశికాలైతే ఏదైనా ఒక ప్రదేశానికి సంబంధించి చెప్పిన సామెతలు ‘ప్రాదేశికాలు’ అని చెప్పవచ్చు. తెలుగు సామెతలు వేల సంఖ్యలొ వివరింపబడుతున్నాయి.
ఉదా:- కొన్ని సామెతలు.
- అమ్మ కడుపు చూస్తుంది. పెళ్ళాం జేబు చూస్తుంది
- అప్పులేని వాడు అధిక సంపన్నుడు
- ఎవడు చేసిన కర్మం వానికే కొట్టు కుంటుంది
- రామేశ్వరం పోయినా శనేశ్వరుడు పోడు.
- కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.
- క్షణం తీరుబాటులేదు దమ్మిడీ ఆదాయం లేదు.
- గుర్రం గుగ్గిళ్ళు తిటుంటే గాడిద కడుపూది చచ్చిదంట
- పడిశం ముక్కోనికి పారిజాతాలేల.
ఇలా ఎన్నొ వేల సామెతలు రాయలసీమ జనవ్యవహారంలొ నేటికీ నిలిచే ఉన్నాయి.
పొడుపు కథలు
రాయలసీమ జానపద సాహిత్యంలొ పొడుపు కథలు ఓ ప్రధానవిభాగం. జానపద సాహిత్యంలో పొడుపు కథలు చిట్టచివరి ప్రక్రియ. అంటే గేయాలు, కథాగేయాలు, గధ్యాఖ్యానాలు, సామెతలు తర్వాత పొడుపు కథలు ఆవిర్భవించాయని పండితుల అభిప్రాయం. పొడుపుకథలకు అనేక పర్యాయపదాలున్నాయి. అవి విడిపు, తట్టు, మరుతట్టు, మారుకథ, శాస్త్రాలు, సమస్యలు, సమిచ్చలు చిటుకులు, చిట్కాలు, చిక్కుముళ్ళు, యక్షప్రశ్నలు వేసే కథలు యిప్పేకథలు, అడ్డు కథ, ఒడ్డు కథ వంటివి. పొడుపు కథలు అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. పొడుపు కథలను పొడుపు కథ మార్గ, పొడుపు కథ దేశ, పొడుపు కథ జానపద సంసృష్టి అని మూడు రకాలుగా విభజిం చారు.
జానపదులు తమ వినోదం కోసమే కాకుండా విఙ్ఞానం కోసం కూడా పొడుపు కథలను చెప్పుతుంటారు. తెలుగులొ ఎన్నొ పొడుపుకథలు వ్యవహారంలొ ఉన్నాయి.
ఉదా: కొన్ని పొడుపు కథలు.
- గవాసీలకు గడ్డపార (ముక్కుపుల్ల)
- నూరుగురు అన్నదమ్ములకు ఒకటే మొలతాడు (చీపురకట్ట)
- కొనేటపుడు నల్లగా
తినేటపుడు ఎర్రగా
పారేసే టప్పుడు తెల్లగా (అల్లనేరేడు పండు) - అడ్డగోడ మీద బుడ్డచెయి (ఎద్దు మూపురం)
- ముప్పది రెండు మంది దంచగా ఒక్కటే తీస్తాది (పళ్ళు, నాలుక)
- వంకకాని వంగ (గోరువంక)
- ఆకాశాన్ని ఆ చివరి నుండి
ఈ చివరి వరకు కప్పెవేసే
ఆయుధం ఏది (ఇంద్ర ధనస్సు)
ఇలా పొడుపు కథలు జానపద సాహిత్యంలొ చోటు చేసుకొని ఉన్నాయి. కాబట్టి రాయలసీమ జానపద సాహిత్యం ఎంతో వైశిష్ట్యాన్ని కలిగి తెలుగు సాహిత్యన్ని సుసంపన్నం చేస్తోంది.
3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
February 14th, 2010 at 9:17 am
సర్,
మీ లోతైన విశ్లేషణ చాలా బాగుంది. రాయలసీమలో జానపద సాహితీ సంపద ఉందని తెలిసాక ఆశ్చర్య పోతున్నాను. ఇలాంటి కథనాలు మీనుంచి మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
March 10th, 2010 at 2:01 am
రాయలసీమ జానపద సాహిత్యం పై శ్రీ పేట శ్రీనివాసుల రెడ్డి గారి వ్యాసం చాలా విపులంగా ఉంది.
అపారమైన భౌతిక, సాంస్కృతిక సంపద రాయలసీమ కే సొంతం. పాలకుల వివక్ష, ఇతర ప్రాంతీయుల చిన్నచూపు రాయలసీమకు శాపంగా పరిణమించాయే తప్ప రాయలసీమ ఎందులోనూ తీసిపోని విలక్ష.ణ ప్రాంతం.
శ్రీ స్రీనివాసుల రెడ్డి గారికి నా అభినందనలు.
తవ్వా ఓబుల్ రెడ్డి
March 11th, 2010 at 10:24 am
ఓబుల్ రెడ్డి గారికీ, ఇతర మితృలకూ విన్నపం. రాయలసీమకు చాల సమస్యలున్నాయని అనేసి ఊరుకోడం చాలదు. అవి ఏమిటి, వాటి స్వరూప స్వభావాలు ఏమిటి అని ముఖ్య వివరాలతో చర్చించాలి. విశ్వవిద్యాలయాలలో, అటువంటి సంస్థలలో వున్నవారు ఈ ప్రయత్నం చేయాలి. అరకొరగా కాదు. లోడొల్ల వాదాలతో కాదు. గట్టి అధ్యయనంతో జరగాల్సిన పని ఇది. ఈ విషయమై చర్చను కేవలం రాజకీయులకు వదిలేయకుండా, బుద్ధిజీవులుగా పెద్ద ఎత్తున జోక్యం చేసుకోవాలని, ఆ విధంగా రాసీమ మట్టి రుణం తీర్చుకోవాలని ఒక రాసీమ మనిషిగా మనవి. తెలంగాణ మితృల నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయమిది.