రెక్కల హరివిల్లులు

దసరా పండక్కి నాలుగు రోజులు శెలవిస్తారని విన్న క్షణం నుంచీ నా మనసుకి రెక్కలు మొలిచాయి. ఎపుడెపుడు యింటికెళ్ళిపోతానా అన్న ఆరాటం. అమ్మా నాన్నల్తోపాటు అస్తమానం గుర్తొచ్చే మా తోటలోని పూలని పలకరించి ఎన్నాళ్ళయిందో . . . పూలరెక్కల సీతాకోక చిలుకల్ని పరామర్శించాలన్న తహతహ . . . జైల్లాంటి మా హాస్టల్ చుట్టూతా ఉన్న ఎత్తైన ప్రహరీగోడ మీంచి ఎగిరెళ్ళి మా తోటలో వాలిపోవాలన్న కోరిక . . .
సీతాకోక చిలుక . . . ఎంతందమైన పేరు ! దాని సోయగమంతా రంగురంగుల రెక్కల్లో దాచుకుని పూలవనాలమీద ఎగుర్తుంటే చూట్టం ఎంత తీయటి అనుభవమో . . . .
నా చిన్నప్పుడు మా పెరట్లో సన్నజాజి పందిరి ఉండేది. చాలా రాత్రుళ్ళు అమ్మ ఆ పందిరి కిందనే మంచం వేసి నేను పడుకునే వరకు కబుర్లు చెప్పేది . . . కమ్మటి కథలు విన్పించేది.
అప్పుడే మొదటి సారి సీతాకోక చిలుకని చూట్టం . . . . ‘దాని రెక్కలు చూశావా ఎంత బావున్నయో . . . దాన్ని సీతకొక చిలుక అంటారు. బటర్ ఫ్లై . . . .ఎన్ని రంగులో చూడు ! ఎరుపు . . . పసుపు . . . .నలుపు . . . నీలం అంది అమ్మ.
‘ఎందుకొచ్చింది ?’
మన సన్నజాజి తీగకు బోల్డన్ని పూలు పోశాయి కదా . . . .వాటి కోసం వచ్చింది. పూలెక్కడ ఉంటే సీతాకోక చిలుకలు అక్కడ వాల్తాయి’

దాని సౌందర్యం నా మనోఫలకం మీద రంగురంగుల ఙ్ఞాపకాల పాదముద్రల్ని వదిలేసి వెళ్లింది. ఓ రోజు సాయంత్రం వేళ మిగతా పిల్లల్తో కలిసి ఆడుకుంటున్న సమయంలో నా భుజం మీద వాలి మెల్లగా రెక్కల్ని కదిలిస్తోంది. నాకు కొద్దిగా భయంతో పాటు ఆనందం కలిగింది. వేగంగా నడిస్తే ఎగిరిపొతుందేమోనని, మెల్లగా అడుగులో అడుగేస్తూ యిల్లు చేరి, అమ్మకు చూపించాను.
పూలమీద వాల్తుందన్నావుగా . . . .మరి నామీద వాలిందెందుకు ?’ అని అడిగా . . . .దాని రెక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. వాటినిండా ఎర్రటి నల్లటి చుక్కలు . . . నక్షత్రాలు పొదిగిన ఆకాశంలా . . .
నువ్వు కూడా పువ్వులా ఉంటావుకదా . . . అందుకే మురిసిపోయి నీ మీద వాలింది’ అంది అమ్మ నా బుగ్గలు పుణుకుతూ . . . .
అమ్మ అలా అంటే ఎంత సంతోషం అన్పించిందో . . . . కిలకిలా నవ్వితే ‘ చూశావా . . . సన్న జాజులు రాలినట్లు ఎంతందంగా ఉందో నీ నవ్వు . . . .మరిన్ని సీతాకోక చిలుకలు వచ్చి వాల్తాయోమో చూడు’ అంది అమ్మ . నేను నవ్వినప్పుడు కదిలినందువల్లనేమో అది ఎగిరి వెళ్లిపోయింది.
చిన్ననాటి ఙ్ఞాపకాలు బలంగా నాటుకుపొవటం వల్లనుకుంటాను ఆరో తరగతి నుంచే మా పెరట్లో రకరకాల పూలమొక్కలు పెంచటం యిష్టమైన వ్యాపకంగా మారింది. అమ్మకూ మొక్కలంటే యిష్టమే. మా పెరట్లో సన్నజాజి, చామంతి , బంతి , కనకాంబరం, గులాబి, మల్లె, . . . ఒకటనేమిటి రకరకాల రంగురంగుల మొక్కలు . . . .
వసంత రుతువులో చూడాలి ఆ శోభని . . . .రెండు కళ్ళూ చాలేవి కావు. రంగురంగుల పూలు . . . .రంగురంగుల రెక్కల్తో ఎగిరే సీతాకోక చిలుకలు . . . కదుల్తోన్న పువ్వుల్లా . . . .అన్ని రంగులూ ఒలికిపోయిన కాన్వాస్ లా తోట . . .
చదివి చదివి అలసిపోయినపుడు తోటలోకెళ్ళి పదినిముషాలు గడిపితే చాలు ఉత్సాహం ఉరకలు వేసేది. సౌందర్యంలో అనంతమైన శక్తి నిబిడీకృతమై ఉంటుందని నాకర్థమైంది అప్పుడే.
పదో తరగతి పాసైనాక, అమ్మ వద్దంటున్న వినకుండా విజయవాడలోని కార్పోరేట్ కాలేజీలో చేర్పించాడు నాన్న. బై.పి.సి గ్రూప్ . . . . హాస్టల్ బతుకు దుర్భరంగా అన్పిస్తోంది. ఎటు చూసినా పచ్చదనమే కన్పించదు. విశాలమైన ప్రాంగణం. కుర్చీలు , బల్లలు ,క్లాస్ రూమ్ లు, పుస్తకాలు, చదువు చెప్పే మాష్టర్లు . . . పరీక్షలు, మార్కులు , ర్యాంకులు . . . . యిరవై నాలుగు గంటలూ కళ్ళ ముందు యివే దృశ్యాలు మారి మారి కదుల్తాంటాయి.
హాస్టల్ కొచ్చి మూడు నెలలు కావస్తోంది. మావూరు బాగా ఙ్ఞాపకం వస్తోంది . మా తోట . . . .అందులోని పూల మొక్కలు . . . సీతాకోక చిలుకలు . . . నా నేస్తాలు సునీల్, కుమార్ . . . .
సునీల్ వాళ్ళ నాన్న బేల్దారీ పని చేస్తాడు. ఆర్థిక మాంద్యం వల్ల యిల్లు కట్టుకునేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయి అతనికి పని లేకుండా పోయింది. చదివించే స్తోమత లేక సునీల్ని చదువు మాన్పించేసి, పొలం పనులకు పంపిస్తున్నాడు. కుమార్ మా వూళ్ళోనే ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో కామర్స్ లో జాయినయ్యాడు.
రేపట్నించే శెలవులు . . . .
యింటికి వెళ్ళగానే మొదట చేసిన పని మా తోటలో కెళ్ళి పూలని పరామర్శించటం . . . అవి మెల్లగా తలలూపుతూ ‘బావున్నావా ‘ అంటూ పరామర్శించిన అనుభూతి. వాటి మృదు స్పర్శ అమ్మ స్పర్శలాఎంత హాయిగా ఉందో పూరేకుల్ని వేళ్ళతో తడిమితే, కౌగిట్లో యిమిడిపోయె పసి పాపల్లా నావేలి కొసల్ని హత్తుకుంటున్న అనుభూతి . . . .
తోటంతా వెతికినా ఒక్క సీతాకోక చిలుక కూడా కన్పించలేదు. ఎంత నిరాశ పడ్డానో . . .
” అమ్మా . . . .సీతాకోక చిలుకలు ఎప్పట్లానే వస్తున్నాయిగా అని అడిగా.
” ఈ మధ్య కాలంలో కన్పించలేదురా . నీ మీద బెంగెట్టుకుని, నువ్వు లేని తోటలోకి రావటం యిష్టం లేక మానేసాయేమొ ” అంది అమ్మ మురిపంగా నవ్వుతూ . . . .
సీతాకోక చిలుకలు రావటం లేదని పూలన్నీ బెంగెట్టుకుంటాయోమోనన్న దిగులు . . . .రాత్రంతా కలత నిద్ర . . . .సీతాకోక చిలుకలు ఎందుకు రావటం లేదో . . . .ఏమై పోయాయో . . . కొన్ని పక్షులు వలస పోయినట్లు యివి కూడా ఎటుకైనా ఎగిరి వెళ్ళి ఉంటాయా . . . అవి జట్టుగా ఎగరవుగా . . . మరి ఏమైనట్లు . . . మా తోటలోకే రావటం లేదా . . . అమ్మ చెప్పినట్లు అలుకా . . . ఆ ఆలోచనకు నవ్వొచ్చింది. నిజం కాకున్నా ఎంతందమైన వూహ . . . .వాటి అందమైన రంగురంగుల రెక్కల్లా . . . .
మరునాడు ఉదయం కుమార్ యింటికెళ్ళాను. పిచ్చాపాటి మాట్లాడుకున్నాక ” పదరా . . . సునీల్ని కలిసొద్దాం” అన్నాను.
“సునీల్ని పట్టుకోవటం కష్టంరా . . . ఎక్కడని వెతుకుదాం” అన్నాడు.
“అదేంటి? ఉంటే యింట్లో ఉంటాడు లేదంటే ఎవరి పొలంలోనో పన్చేస్తుంటాడు. వాడ్ని వెతకటం ఎంతసేపు?”
“సునీల్ యిప్పుడు పొలం పన్లకు పోవటం లేదు. సీతాకోక చిలుకల్ని పట్టుకునే పనిలో బిజీ. బాగా సంపాదిస్తున్నాడు తెలుసా . . . ఒక్కో సీతాకోక చిలుక్కి పాతిక రూపాయలు”
వాడు చెప్తున్నదేమిటో అర్థంకాక అయోమయంగా చూశాను. “సీతాకోక చిలుక్కి పాతిక రూపాయలేమిట్రా ? వాటినెవరు కొంటారు? ఏం చేస్కుంటారు ?”
” ఓ . . . నీకు తెలీదు కదా . . . ముణ్ణెల్లుగా నీవు మనూర్లో లేవుగా. ఆయుర్వేద గుళికలమ్మే పాపారావ్ తెల్సుగా ?”
” మార్కెట్లో దొరికే చ్యవన్ ప్రాశ్ లేహ్యంలో ఏవేవో కలిపి, వూరపిచ్చుక లేహ్యాలంటూ జనాల్ని మోసం చేసే పాపారావేనా?”
“అతనే . . . . సీతాకోక చిలుకల రెక్కల్ని పొడిగా చేసి వాటి ధూపాన్ని పీలిస్తే ఙ్ఞాపకశక్తి అమోఘంగా పెరుగుతుందని, అదృష్టం కలిసొచ్చి లాటరీ తగుల్తుందని, లక్ష్మీ దేవి వాళ్ళింట్లో తిష్ట వేస్తుందనీ ప్రచారం చేశాడు. రోజూ అతనింటి ముందు చాంతాండంత క్యూ ఉంటోంది తెలుసా? ప్రజలు వేలం వెర్రిగా కొంటున్నారు. పొడిగా చేసిన ఓ రెక్కని యాభై రూపాయలకమ్ముతున్నాడు. మనూళ్ళో బేకారుగా తిరిగే కుర్రోళ్ళందరికీ యిపుడు వ్యాపకం సీతాకోక చిలుకల్ని పట్టుకుని పాపారావుకి అమ్మటమే”
“ఎంత మూర్ఖత్వం ! మనూళ్ళో యింత మంది చదువుకున్నోళ్ళు ఉండి కూడా యింతటి దారుణం జరుగుతుంటే ఎలా వూర్కుంటున్నారు? రెక్కలు కాలిస్తే మిగిలేది బూడిదే కదరా . . . . దాని వల్ల ఙ్ఞాపకశక్తి పెరగటమేమిటి ?”
కుమార్ కొద్ది సేపు మౌనంగా వుండి , లొగొంతుకతో అన్నాడు. ” నువ్వు కోప్పడనంటే నేనో మాట చెప్తారా. మొన్న ఓ పరీక్ష ముందు నేను కూడా ఆ పొగని పీల్చాను. పరీక్ష బాగా రాశాను తెలుసా . . . . నిజంగానే అందులో ఏదో మహత్తు ఉంది ” అన్నాడు.
వాడి మాటలు విన్నాక చాలా బాధ వేసింది. యింత మంది బాబాలు, స్వామీజీలు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, మాయగాళ్ళు మనగలుగుతున్నారంటే కారణమేమిటో అవగతమైంది. ఒకడు కాలితో తన్ని రోగాలునయం చేస్తానంటాడు. మరొకడు గాలి వూదితే చాలు రోగం మటుమాయం అంటాడు. ఒకడు తనే శాయి స్వరూపమంటాడు. మరొకడు తన అరచేతిలొ సాయిబాబా కన్పిస్తాడని ప్రజల్ని నమ్మిస్తాడు . ప్రజలు వెర్రిగా వాళ్లని నమ్మి డబ్బుతో పాటు ఆరోగ్యాన్నీ పోగొట్టుకుంటున్నారు.
నాకో అనుమానమొచ్చింది. సీతాకోక చిలుకల రెక్కల్ని ఎండబెట్టి ధూపంగా పీలిస్తే అద్భుతాలు జరుగుతాయని నమ్మినా పాపారావు దగ్గరే ఎందుకు కొంటున్నారు ? సునీల్ లాంటి వాళ్ళు నేరుగానే అమ్మొచ్చుగా . . . అదే విషయం అడిగాను.
“వాటిని పొడిగా చేసాక అందులో ఏదో మూలిక కలిపితేనే వాటికా శక్తి వస్తుందట. ఆ మూలిక ఏమిటో ఒక్క పాపారావుకే తెలుసట.”
అదీ పాపారావు పాపపు ఆలోచన . . . అతని వ్యాపార రహస్యం.
రంగురంగుల రెక్కల సీతాకోక చిలుకలు గుర్తొచ్చి దుఃఖం వచ్చింది. ఎంతటి కిరాతకం . . . డబ్బు సంపాదన కోసం వాటి రెక్కల్ని కత్తిరించి, వాటిని పొడిగా మార్చి . . . . ఆ ఆలోచనకె వళ్ళు జలదరిస్తోంటే అలా చేయడానికి వాళ్ళకు చేతులెలా వస్తున్నయో
యిప్పుడు మా తోటలోకి సీతాకోక చిలుకలు రావటంలేదు. కొన్ని రోజులు పోతే మా వూళ్ళోనే అవి కన్పించవు. కొన్నాళ్ళు పోతే అసలు సీతాకోక చిలుకల జాతే అంతరించిపొయే ప్రమాదముంది.
మనుషుల్లోని బలహీనతల్ని, అఙ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు సంపాదన కోసం కొంత మంది స్వార్థ పరులు ఆడుతున్న ఈ రాక్షస క్రీడలో అంతమైపోతున్న జీవ జాతులెన్నో . . . .ఖడ్గ మృగం కొమ్ములో మగవాళ్ళ పుంసత్వాన్ని పెంచే శక్తి ఉందన్న అపోహతో వాటిని వేటాడం వల్ల ఆ జాతి సమూలంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. యిపుడు పాపారావు రాజేసిన నిప్పు కార్చిచ్చులా వ్యాపిస్తే అందమైన రెక్కల్తో ఎగిరే ఈ సీతాకోక చిలుకలు ముందు తరాలకు పుస్తకాల్లోనో, మ్యూజియంలలోనో తప్ప సజీవంగా కన్పించవు.
ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. మరలా మా తోటలోకి రకరకాల రంగురంగుల సీతాకోక చిలుకలు వచ్చే వరకు పాపారావు లాంటి దుష్టుల మీద దుర్మార్గుల మీద అవిశ్రాంతమైన పోరు జరపాలని.
కుమార్తో నా ప్లాన్ చెప్పాను.
మరునాడు నేనూ కుమార్ కలిసి పాపారావు దగ్గరకెళ్ళాం. యాభై రూపాయలిచ్చాక ఆ ధూపాన్ని అక్కడే పీల్చాడు కుమార్.
మొదట కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి కూర్చున్నవాడు మరునిమిషంలో గిలగిలా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ పడిపోయాడు. పాపారావు కంగారు పడిపొయి తనకు తెల్సిన ఉపచారాలేవో చేశాడు. ఐనా ఫలితం లేకపోయేటప్పటికి “పెద్దాసుపత్రికి పిల్చుకెళ్ళటం మంచిది “అన్నారు గుమి కూడిన జనంలోంచి కొంత మంది.
వాణ్ణి ఆటోలో వేసుకుని హాస్పిటల్కి పిల్చుకెళ్ళాను. కుమార్ వాళ్ళింటికి ఫోన్ చేసి కంగారు పడాల్సిన విషయమేమీ లేదని చెప్పాను.
సాయంత్రం హాస్పిటల్నించి కుమార్ని పిల్చుకు రావటమే ఆలస్యం జనాలందరూ మూగి “ఏమైంది ? ఎందుకలా పడిపోయాడు? డాక్టరేమన్నాడు ? పర్లేదన్నాడా ?ప్రమాదమేమీ లేదన్నాడా ?” లాంటి సవాలక్ష ప్రశ్నలడిగాడు.
“సీతాకోక చిలుకల రెక్కల్లో ఏదో విషపదార్థం ఉంటుందంట. వాటిని కాల్చి పొగ పీల్చటం వల్ల , కిడ్నీలు , లివర్ శాశ్వతంగా దెబ్బతింటాయట. మోతాదు మించితే మతి స్థిమితం కలిగే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పాడు. పాపారావు పైన పోలీస్ కంప్లయింట్ యిస్తానన్నాడు. మనూరి వాడు కదాని మేమే వద్దని బతిమాలుకున్నాం ” అన్నాను.
“మరి మేం కూడా ఆ పొగని పీల్చాంగా . . . మాకేమీ కాలేదే” అన్నారు కొందరు.
ఈ ప్రశ్న ఊహిస్తున్నదే కాబట్టి తయారుగా ఉంచుకున్న సమాధానం చెప్పాను.”యిదే ప్రశ్న డాక్టర్ని నేనూ అడిగాను. మనలో ఉన్న రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుందంట. కుమార్ కి ఆ శక్తి తక్కువ ఉండటం వల్ల వెంటనే విష ప్రభావం పన్చేసింది. మీలో రోగనిరోధక శక్తి కొద్దిగా ఎక్కువ ఉండబట్టి మీరు బతికి పోయారు. మీరైనా మరోసారి పీలిస్తే నష్టపోవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని డాక్టర్ చెప్పాడు.”
ఈ వార్త దావానంలా వూరంతా పాకిపోయింది. పాపారావు యింటి ముందు యింత క్రితం క్యూ కట్టిన వాళ్లే అతన్ని నాలుగు తగిలించారు
నేనతన్ని పొలీసు కేస్ లేకుండా రక్షించినందుకు పాపారావు మా యింటికొచ్చి నాకు కృతఙ్ఞతలు తెలియచేశాడు.
నేను తృప్తిగా మరలా కాలేజీ హాస్టల్ కెళ్ళిపోయాను.
మళ్ళా సంక్రాంతి శెలవలకని యింటికొచ్చినపుడు మాతోట నిండా రంగురంగుల పూలు. వాటి అందాలకు ఏమాత్రం తీసిపోని రంగురంగుల రెక్కల్తో ఆ తోటలో విహరిస్తోన్న సీతాకోక చిలుకలు . . . వంద హరివిల్లులు ఒక్కసారిగా విరిసినట్లు . . . .సౌందర్య నృత్య హేల.

* * * * *

[దక్షిణాఫ్రికా లో రాబందుల మెదళ్ళని ఎండబెట్టి, పొడిచేసి, ఆ పొగ పీలిస్తే అదృష్టం కలిసొస్తుందన్న నమ్మకం వల్ల అక్కడ రాబందుల జాతి అంతరించి పోయే ప్రమాదముందన్న వార్త చదివాక ]

2 అభిప్రాయాలు »కథలు

2 అభిప్రాయాలు

  1. Chaganti Tulasi Mar 3, 2010 1

    salim
    nice tulasi

  2. ప్రాణహిత » ప్రాణహిత ఫిబ్రవరి 2010 సంచికకు స్వాగతం Apr 1, 2010 2

    [...] రెక్కల హరివిల్లులు : సలీం [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో