Apr2010
అమీరీ బరాక: ఈ కాలపు విప్లవాగ్ని !
అమీరి బరాకా అంటే దట్టించిన ఫిరంగి. అతని కవిత్వంలోని ప్రతీ పంక్తీ వొక రాజకీయ ప్రకటన, వొక ధిక్కార కవితాగ్రహం. ఈ కాలంలో కవిత్వాన్ని అంత బలంగా అంత ఆవేశంగా అంత పొగరుగా రాసిన వాళ్ళు అరుదు. ఇప్పుడు మీరు చదవబోతున్న కవిత అమీరి బరాక అంటే ఏమిటో బలంగా చెబుతుంది. వొక కవి గట్టిగా నిలబడి స్పష్టంగా గొంతు విప్పితే అది ఎంత రాజుకొని నలుదిక్కులూ అంటు కుంటాయో అనుభవంలోకి తెచ్చిన కవిత ఇది. ఈ కవిత అచ్చయాక అమెరికా కంటి మీద కొన్నాళ్ళు కునుకు కరువయింది. ఇవి ఆ దీర్ఘ కవితలోని కొన్ని పంక్తులు మాత్రమె. 1934 లో అమెరికాలోని న్యూ జర్సీ నూవార్క్ లో పుట్టిన బరాక తన కవిత్వం నిండా విప్లవ గాలులని పోత్తంగా వూదిన వాడు. ఎక్కడ విప్లవాగ్నులు రగిలితే అక్కడికి అతని కవిత్వ వాక్యాలు ప్రయాణించాయి.
SOMEBODY BLEW UP AMERICA
ఎవరు ఎవరు ఎవరు?
వాళ్ళంటారు వొక టెర్రరిస్ట్ అని.
??? ఎవరో వొక అనాగరికుడని.
మొత్తానికి ఎవరయితేనేం
ఆ పని చేసింది అమెరికన్ టెర్రరిస్టు కాదు,
కాస్టూమ్ లో కళకళలాడే గనేరియా కాదు
నల్ల జనం గొంతు నులిమిన
ఆ తెల్ల తెల్లని మహమ్మారి కాదు
కసి దీరా మానవత్వాన్ని
ఉగ్రవాదం చేసిన మరేదో మాయల మారి కాదు.
ఎవరు ఎవరు అని అడుగుతారు గుచ్చి గుచ్చి వాళ్ళే!
* *
ఎవరు ఎవరు ఎవరు?
వాల్ స్ట్రీట్ మీద తిష్ట వేసిన వాళ్ళు
ప్లాంటేషన్ ల కింద
నీలోని జీవాన్ని తెగనరికిన వాళ్ళు
నీ తల్లి మానాన్ని దోచిన వాళ్ళు
నీ తండ్రిని నరికి పోగులు పెట్టిన వాళ్ళు
ఎవర్రా వాళ్ళు? ఎవర్రా?
* *
కలల్ని తొక్కిపెట్టిన వాళ్ళు
కళలకి గిరి గీసిన వాళ్ళు
శాస్త్రాలని శాసించిన వాళ్ళు
బాంబులు చేసిన వాళ్ళు
తుపాకుల్ని కన్న వాళ్ళు
బానిసల్ని అమ్మిన వాళ్ళూ, కొన్న వాళ్ళూ
వాళ్ళకి నానా రకాల పేర్లు పెట్టి హింసించిన వాళ్ళు
ఎవర్రా? ఎవర్రా?
* *
రాజ ప్రాసాదాల వంటి ఇండ్లల్లో వుండే వాళ్ళు
నేరాలకు నెలవయిన వాళ్ళు
తలచుకున్నదే తడవుగా
విహార యాత్రలకి పరిగెత్తే వాళ్ళు
నిగ్గర్లని చంపిన వాళ్ళు
యూదుల్ని హననం చేసిన వాళ్ళు
ఇటాలియన్ల కుత్తుకల్ని కత్తిరించిన వాళ్ళు
ఐరిష్ల ఉసురు పోసుకున్న వాళ్ళు
ఆఫ్రికన్లని అంతం చేసిన వాళ్ళు
లాటినోలనీ, జపనీయులనీ వెంటాడిన వాళ్ళు
ఎవర్రా, ఎవర్రా?
—
సముద్రాల్ని మింగేసిన వాళ్ళు
కడు విశాల మాల్స్ లో జల్సాలు చేసే వాళ్ళు
టెలివిజన్లని తోడు పెట్టుకున్న వాళ్ళు
* *
ఎవరు చూసారులే, దేవుణ్ణి!
కాని, దెయ్యం మాత్రం
ఇప్పుడు అందరికీ కనపడింది.
నీ బతుకులోకి నీలోకి
నీ ఆత్మలోకి నీ మెదడులోకి
పేల్తూ వస్తున్న గుడ్ల గూబలాగా
నరకలోకపు అగ్ని కురిపిస్తున్న
యాసిడ్ లాగా
ఎవరూ? ఎవరూ?
ఎవ…ర్రా?!
*
12 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు, దర్వాజ
April 4th, 2010 at 8:47 am
కలల్ని తొక్కిపెట్టిన వాళ్ళు
కళల కి గిరిగీసిన వాళ్ళు
శాస్త్రాలను శాసించిన వాళ్ళు
బాంబులు చేసిన వాళ్ళు
తుపాకుల్ని కన్న వాళ్ళు
బానిసల్ని అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు
వాళ్ళ కి నానా రకాల పేర్లు పెట్టి హింసించిన వాళ్ళు
ఎవర్రా ఎవర్రా……
అణిచివేత తాలూకు సమస్త స్వరూపాన్ని ఈ వాక్యా లు బలంగా చెప్పాయి. మంచి కవితని అనువదించారు . ధన్యవాదాలు.
April 5th, 2010 at 10:57 am
ఈ కాలమ్ అమెరికా విప్లవాగ్ని బరాక
ఈ కాల దిక్కార స్వరం…అతను …
అమెరికా నగ్నత్వాన్ని బజారు కీడ్చిన వాడు
అమిరికా విప్లవ కవిత్వాన్ని రాటు దేలించిన లాంగ్ స్టున్..
వారసత్వ కొనసాగింపు …బరాకా
బరాకా ను పరిచయం చేసిన అఫ్సర్ కు కృతఙ్ఞతలు …
April 6th, 2010 at 1:01 am
గ్రెనేడ్లూ, తపంచాలూ ఇలాటి వస్తువులకి కవితా సామగ్రిగా తెలుగు భాషలో వున్న గిరాకీ ని దృష్టిలో పెట్టుకుని దట్టించిన ఫిరంగులని పరిచయం చేసేటప్పుడు మరి కొంత వివరణ జోడిస్తే బాగుంటుంది.
2001 సెప్టెంబరు 11 న world న్యూయార్క్ trade centre పై జరిగిన దాడి ఎవరు చేశారు అన్నది అప్పట్లో ఒక పెద్ద చర్చగా వుండేది. దూసుకు వచ్చిన విమానాల్లో హైజాకర్లు ఎవరన్న విషయం పక్కన పెడితే, దాడి జరగ బోతోంది అని ఇజ్రాయెల్ కు ముందే తెలుసని — దాడులు జరిపించటంలో తెల్ల వారి పాత్ర వుండే వుంటుందని అక్కడా అక్కడా వినపడుతుండేది. బరాకా వ్రాసిన ఈ కవితకి నేపథ్యం అటువంటి అనుమానాలు. ఈ అనుమానాలెవీ నిజాలుగా ఇంతవరకు నిర్ధారించబడలేదు.
కవిత వ్రాసేసి వూరి మీదికి తోలే ముందో ఆ తరవాత కొంత కాలానికో కొంచెం జాగ్రత్త గా వుండాలని తట్టినట్టుంది – కవితకి ముందు బరాకా కొన్ని పదాలు జోడించాడు — “బుద్ధి గలవారెవరయినా అన్ని రకాల టెర్రరిజాలనీ నిరసించాల్సిందే కానీ, లోపలి టెర్రరిజాన్ని (అంటే అమెరికాలో తెల్ల వాళ్ళు నల్ల వాళ్ళ మీదా స్థానిక మూల జాతుల మీదా చేసిన దాడులు) కప్పి పుచ్చుకోవటానికి బయటి టెర్రరిజాన్ని (అంటే అమెరికా మీద ఇతర దేశాల టెర్రరిస్టులు చేసిన దాడులు) వేలెత్తి చూపించటం సరి కాదు” అని. కవి హృదయం ఇక్కడ సామ్రాజ్యవాద అమెరికన్ ఆధిపత్యం చెర నించి పూర్తిగా బయట పడటానికి సంకోచిస్తోంది అని ఎవరయినా అంటే అది పూర్తిగా కొట్టి వేయ వలసిన విషయం కాదు. పూర్తి కవితని ఇక్కడ చూడవచ్చును.
http://www.amiribaraka.com/blew.html
ఇలాంటి అనిశ్చితత్వమూ, దాని నుంచి వచ్చే గందరగోళమూ బరాకా జీవితాన్ని మొదటినించీ ఇప్పటివరకూ వెన్నాడుతూనే వస్తున్నట్టు కనపడుతుంది.
నల్లజాతి వునికి ఆధారంగా జాతుల మధ్య వుండే ద్వేషాల గురించి వ్రాయటంతో మొదలయిన బరాకా ప్రస్థానం, క్యూబా సందర్శనం ద్వారా మార్క్సిజాన్ని సంతరించుకుని, ఆ తరవాత 1968 లో ఇస్లాం మతాన్ని కూడా కలుపుకుంటుంది (లీ రాయ్ జోన్స్ Lee Roi Jones అమీరీ బరాకాగా పేరు మార్చుకున్నది అప్పుడే) . 1974 తరవాత బరాకా తనని తాను మార్క్సిస్ట్ లెనినిస్టు గా అభివర్ణించుకుంటూ వచ్చాడు.
మొత్తమ్మీద బరాకా కవిత్వమూ, రాజకీయమూ రెండు గుర్రాలూ ఒకే సమయంలో స్వారీ చేసే ప్రయత్నం చేసినందుకు ఎంత మెచ్చుకోవచ్చునో , ఆ ప్రయత్నంలో ఆయన గుర్రాల మీద కన్నా నేల మీదే ఎక్కువ సమయం గడిపాడు అన్న నిజానికి అంతే చింతించవచ్చును.
April 6th, 2010 at 1:55 pm
ఈ కవిత మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అమరీ బరాకాని అరెస్టు చేయాలన్న డిమాండు వరకూ వెళ్ళింది. వివాదాల్లో చిక్కుకోడం బరాకాకి కొత్త కాదు. అసలు అతని పేరు మార్పిడే పెద్ద వివాదం. మొదట్లో మంచి కవిత్వం రాసాడు. కొన్ని కొత్త పోకడలూ రుచి చూపించాడు. బరాకా పరిచయ వ్యాసం గతంలో ప్రాణహితలో నేను రాసాను.
http://www.pranahita.org/2009/09/bhava-vyakaranam-amiri-baraka/
April 6th, 2010 at 10:11 pm
ఉపేంద్ర గారికి సమకాలీన తెలుగు కవిత్వం మీద బొత్తిగ సదభిప్రాయం లేనట్టుంది. ఇవ్వాళ్ళ కవిత్వం లో తపంచాలు, గ్రెనేడ్లూ మాత్రమే కాదు సారూ ఇంకా చాలా ఉన్నాయి. ఉపేంద్ర అభిప్రాయం చూసాక ఒకసారి ప్రాణహిత గత రెండు సంవత్సరాల సంచికలని, వాటిల్లో వచ్చిన కవిత్వాన్ని మళ్ళీ చూసాను. ఎన్ని సార్లు తపంచాలు, గెనేడ్లూ వచ్చాయో లెక్క పెట్టాను. ఒకసారి మీరూ చూడండి ఉపేంద్ర గారూ! ఊరికే అట్లా అపోహ పడి నోరు పారేసుకోకండి. ప్రాణహితలో చక్కని అభిప్రాయాలని, కొత్త అభిప్రాయాలని రాస్తున్న వాళ్ళలో మీరొకరు. మీమీద గౌరవం ఉంది. మరీ ముఖ్యంగా మీ పేరు అట్లా ఎందుకు పెట్టుకున్నారో తెల్సినాక!
ఇంతకీ మీకు అమిరీ బరాకా రాజకీయాలు నచ్చలేదా, కవిత్వం నచ్చలేదా, రెండూ నచ్చలేదా, లేక తన రాజకీయాలని కవిత్వంగా చెప్పడం నచ్చలేదా? ఆయన ముస్లిం కావడం నచ్చలేదా? మీరెందుకు చింతిస్తున్నారో చెపితే మాకుపయోగకరంగా ఉంటుంది.
రెండవది : 9/11 అమెరికా మీద దాడి. కుట్ర, ఇరాక్ యుద్ధం, బుష్, షేనీ కుతంత్రం, ఇవాళ్ళ ‘టెర్రరిజం’ కు మూల కారణమైన రావణ కాష్టం లా మండుతున్న ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్య, జరుగుతున్న దౌష్ట్యాలు చూసాక, బరాకా ఆగ్రహ ప్రకటన న్యాయమైందనిపించడం లేదూ? ఎట్లా అమెరికా లో కరుడు గట్టిన ‘రైట్ వింగ్ కంజర్వేటిజం’ విషం కక్కుతుందో స్పష్టంగా కనబడ్డం లేదూ?
April 7th, 2010 at 2:27 am
తిరునగరి గారూ
తెలుగు కవిత్వంలో గ్రెనేద్లూ తపంచాలూ కాక ఇతరమైన వస్తువులు చాలానే వున్నాయన్నది నిజం. కళారూపం మీద అద్భుతమైన పట్టు సాధించి, తర తరాల చరిత్రల అడుగున దాగి వున్న జానపద సాంప్రదాయాలని తవ్వి తీసి కొత్త విన్యాసాలు చేయగలిగిన వ్యక్తులు ఇవాళ వున్నారన్నదీ నిజం. ఈ పోకడలను సమర్ధించుకుంటూ వుండటం మన బాధ్యతే. వాటికి కావలసిన దారులు వేయటం, ఆ దార్లలో తెలిసీ తెలియకా మనం పడేసే చెత్తని, గాలికి కొట్టుకొచ్చే కంపనీ ప్రతిరోజూ వూడ్చి శుభ్రం చేసుకోవలసినది కూడా మన బాధ్యతే నంటే కాదంటారా ?
మీరు చాలా ప్రశ్నలు ఒక్కసారే వేశారు. ప్రాణహితలో ఎన్ని గ్రెనేద్లూ, తపంచాలూ వచ్చాయన్నది లెక్క పెడుతూ కూచుంటే ముందుకి కదలటం కష్టమవుతుంది. ప్రాణహితలో నూ, ఇతర ప్రచురణల్లోనూ గత సంవత్సరంలో చావు గురించి కవులు ఎంతగా స్పందించారు ఈ స్పందన వలన మన చైతన్యంలో వచ్చిన కొత్త దనం ఏమిటీ అని ఆలోచించండి. అది వీరోచితమైన చావుగురించో, నిరాశా నిస్పృహా జనితమైన చావు గురించో, చావు ఏ మార్గం ద్వారా – అంటే తుపాకీ ద్వారానా, వూరి త్రాడు ద్వారానా నూతిలో పడటం ద్వారానా పురుగు మందు ద్వారానా , అదీ ఇదీ కాక సునాయాస మరణం ద్వారానా అన్నది ప్రస్తుతానికి వదిలేద్దాము .
చాలా మంది ఇవన్నీ వాస్తవ ప్రపంచంలో వున్నాయి, వాటికి అద్దం పట్టటం కవి బాధ్యత అని అనుకుంటారు. వాస్తవానికి అద్దం పట్టటం వరకే బాధ్యత అనడం కవి శక్తులని కట్టి వేయడమే అనీ; ఈ రకమైన మార్బిడిటీ నించి బయట పడటానికి భాష కూడా వొక సాధనమే అని నా నమ్మకం. తెలుగు కవుల నించి అలాంటి అద్భుతాలు ఆశించడం సమంజసం కాదంటారా ? ఇది సున్నితమైన పని, గ్రెనేద్లూ తపంచాలూ, దట్టించిన ఫిరంగులూ లాంటి యుద్ధ ప్రతీకలు ఈ పనికి పెద్దగా పనికి రావని నా అభిప్రాయం. అది పొరపాటు అని మీరు చూపిస్తే నాకు సంతోషమే.
1) విషం కక్కుతున్న అమెరికన్ నియో కాన్సర్వేటివిజమ్ కనపడటం లేదా ? 2) దా ని పట్ల బరకా ఆగ్రహ ప్రకటన న్యాయమైనది కాదా ? 3) బరాకా లో నీకు నచ్చనిదేమిటి – రాజకీయమా, కవిత్వమా, రెండూనా — ఆయన ముస్లిం కావటమా -అని అడిగారు.
మొదటి రెందు ప్రశ్నలకి సమాధానం తెలికే.
కనపడుతోంది. దాని పట్ల ఎవరైకైనా ఆగ్రహం కలగక పోతే ముందు ఆశ్చర్యం వేస్తుంది, ఆ తరువాత ఇందులో మతలబ్ ఏంటా అన్న ఆలోచన మనలాంటి వాళ్ళకి తేలికగానే వస్తుంది.
అయితే ఆగ్రహ ప్రకటన ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఆ ప్రకటనకి ముందు వెనకలేమిటి, పర్యవసానాలు ఎవరి మీద ఎలా పడతాయి – ఇలాంటి ప్రశ్నలు వేయటం కొంచెం కష్టమైనా వోపిగ్గా వేయ వలసిన బాధ్యత మన మీద వుంది. అన్ని రకాల ఆగ్రహ ప్రకటనలూ, అందరి ఆగ్రహ ప్రకటనలూ, అన్ని చోట్లా, అన్ని వేళలా ప్రయోజనకరం అవుతాయని నమ్మటం – నమ్మ బలకటం – అమాయకత్వమైనా అవాలి, లేక పోతే దుర్మార్గమైనా అవాలి. కాదంటారా ?
బరాకా ఆగ్రహ ప్రకటనని తెలుగు చదువర్లకి పరిచయం చేసేటప్పుడు దాని కున్న ముందు వెనకలు తెలియ చెప్పటం అవసరం. ఆపైన అనువాదకుడి అభిప్రాయాలు ఎలా వున్నా కుతూహలం వున్నవాళ్లు వెతుక్కోవటానికి కావలసిన లింకులు ఇస్తే ప్రయోజన కరంగా వుంటుంది. స్థూలంగా – నా వ్యాఖ్య వుద్దేశ్యం ఇది.
ఇక మూడవ ప్రశ్న –బరాకా లో నాకు నచ్చనిదేమిటి – రాజకీయమా, కవిత్వమా, రెండూనా — ఆయన ముస్లిం కావటమా ?
సమాధానం మూడు అంచెల్లో చెప్తాను.
1)నా దృష్టిలో – కవిత్వం, దర్శనం, రాజకీయం, పాఠాలు చెప్పుకోవటం, వుద్యమాలు నిర్మించటం ఇవన్నీ వేరు వేరు పన్లు. అన్నీ వొక్కరే చేయ లేరని కాదు; అన్నిటి గురించీ తెలియకుండా ఏదో ఒక పనే చేసుకుంటూ పోవచ్చనీ కాదు. కానీ, ఏ పనికి కావలసిన నిబద్ధత , క్రమశిక్షణ దానికి వుంటాయి. అవి కొంత స్వాభావికంగా వస్తే కొంత అనుభవమ్మీద సాధించుకుంటాము. ప్రధానంగా కవి కి కావలసిన క్రమశిక్షణ స్వాభావికంగానో, సాధనమీదనో సంతరించుకుని, రాజకీయాల్లో పాల్గొని రాణించిన వాళ్ళు మీకు ఎవరైనా తెలుసునో లేదో నాకు తెలియదు. నాకు తెలిసినంత లో — అటువంటి మనుషులు కాలు నిలదొక్కుకునే లోపల తమకు తాము చాలా నష్టపోవడమూ . దుఖాల పాలవటమే కాక ఇతరులకు కూడా చాలా కష్టాలూ నష్టాలూ తెచ్చి పెట్టడం నేను చూసాను.
అట్లాగే రాజకీయాలకో ఉద్యమ నిర్మాణానికో కావలసిన పర్సనాలిటీని సాధించుకున్న వాళ్ళు – కవిత్వాలు రాయకూడదన్న నియమమేమీ లేదు కానీ , రాజేకీయాలు చేసాము కదా , కవిత్వం రాయలేమా – అని ఎవరైనా అనుకుంటే , మిగిలిన వాళ్ళం కొంచెం జాగ్రత్త పడక తప్పదు.
2) సెప్టెంబర్ 11 న న్యూయార్క్ పైన దాడి జరిగితే అక్టోబర్ నెల్లో బరాకా ఈ కవిత రాశాడు. కవితలో రెండు గొంతుకలున్నాయి. తరతరాలుగా దౌష్ట్యం చేస్తూ వచ్చిన ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ రైట్ వింగ్ – దాని సహచర గణాలూ – ప్రపంచవ్యాప్తం గా చేసిన పాపాల చిట్టా చదివేదీ – ఇన్ని పాపాలు చేసి, దాన్ని కప్పి పుచ్చుకుంటూ , మనమేమి అన్యాయం చేశామని మన మీద ఇంత ద్వేషం పెంచుకున్నారూ అని గగ్గోలు పెడుతున్నారు – అని కుండ బద్దలు కొట్టి చెప్పటం ఒకటి. ఈ రకమైన వ్యాఖ్యలు సమంజసమైనవే కాదు. అవసరం కూడానూ. బరాకా ఈ గొంతుకలో చెప్పిన మాటలు చాలా మంది చాలా రకాలుగా అప్పట్లో చెప్పారు. ఆ అందరి గొంతుకల్లోనూ బరాకా గొంతు కూడా వొకటి. అల్లరీ వివాదమూ జరిగినది అందుకు కాదు. కవితలో వున్న రెండవ గొంతుక వలన అల్లరి జరిగింది.
చిట్టా ని జాగ్రత్త గా చూస్తే తెలుస్తుంది — ఇది మనకందరికీ తెలిసిన ఆంగ్లో సాక్సన్ క్రిస్టియన్ రైట్ వింగ్ చేసిన నేరాల జాబితా మాత్రమే కాదు –ఇందులో సెప్టెంబర్ 11 నాడు న్యూయార్కు మీద దాడి కూడా వాళ్ళే జరిపించి వుంటారు అన్న ఆరోపణ వుంది. కవిత రాసే నాటికి బరాకా న్యూ జెర్సీ ఆస్థాన కవి గా వున్నాడు. రాసిన వెంటనే ఆ పదవి నించి రాజీనామా చెయ్యమనీ, క్షమర్పణ చెప్పుకోమనీ వత్తిడి వచ్చింది. ఒప్పుకోని కారణంగా ఆ పదవినే రద్దు చేసెసింది – న్యూ జెర్సీ ప్రభుత్వం.
బరాకా ఆరోపణ నిజం కావాచ్చును. ఇప్పటికీ ఇంకా ఈ కోణం నించి పరిశోధిస్తున్న వాళ్ళు చాలా మండే వున్నారు. ముందే చెప్పినట్టుగా మొదటి గొంతు మంచిదే, అవసరమే, కానీ అందులో మనం నేర్చుకోదగ్గ ప్రత్యేకమైన విలువలూ కొత్తదనాలూ ఏమీ లేవు. పోతే , ఈ రెండో గొంతుక బరాకా కవితకి ఎందుకు అవసరం అయింది – అన్న దానికి నాకు సంతృప్తికరమైన సమాధానం ఇంత వరకూ దొరకలేదు.
న్యూయార్క్ నగరం పై దాడిలో – ఇస్రాయెల్ ప్రభుత్వానికో , అమెరికా ప్రభుత్వానికో ప్రత్యక్షంగా ఏమయినా పాత్ర వున్నదని నమ్మిన వాళ్లనో రుజువు చేయగలిగిన వాళ్ళనో ఆ ప్రభుత్వాలు ప్రాణాలతో వదులుతాయా ? ఆ ఆరోపణలని ఎట్లా పరిశోధించాలి, ఎట్లా రుజువు చేయాలి, దాన్ని రాజకీయ పరంగానో, నిర్మాణాత్మకంగానో ఎట్లా వుపయోగించు కోవాలి, దాని గురించి ఎల్టా మాట్లాడాలి — అన్నవి ఒక కవి హృదయం నిర్ణయించ గల విషయమేనా ? ఏ బాధ్యత మీద, ఎవరి పట్ల– లేక పోతే దేని పట్ల నిబద్ధత తో కవితలో ఈ గొంతుక పని చేసినట్టు ? పోనీ అంతరాత్మ ప్రబోధం అనుకుందామంటే – మళ్ళీ ఆ ముందు చేర్చిన మాటలెందుకు చేర్చినట్టు ? ఇవీ నన్ను కలవరపరిచే ప్రశ్నలు .
3) అమెరికన్ నల్ల జాతి చరిత్రలో ఇస్లాం అన్నది ఒక రాజకీయ సాధనంగా ఒక క్లిష్టమైన పాత్ర పోషించింది. ‘మాల్కం ఎక్స్ ‘ కాల్చివేత తరువాత బరాకా ఆయన స్థానంలోకి ఎదగాలని ప్రయత్నిస్తూ ఆ క్రమంలోనే తన పేరు మార్చుకున్నాడు. తనకంటూ ఒక వునికిని సాధించుకోవటానికి నల్ల జాతీయుడు ఎన్ని దార్ల గుండా ప్రయాణించాల్సి వస్తుందో – ఎన్ని రకాలుగా దార్లు మూసుకు పోతాయో – నాకు వూహ ద్వారా తప్ప అనుభవ పూర్వకంగా తెలిసే అవకాశం లేదు. దాని మీద నేను ప్రత్యేకించి వ్యాఖ్య చేయ గలననీ, చేయ వలసిన అవసరం వుందనీ అనుకొను.
కానీ ఒక కవిగానో, ఒక దార్శనికుడిగానో , వుద్యమ నిర్మాత గానో, ఈ అనుభవాల ఆధారంగా ఆ వ్యక్తి ఏమీ చేశాడు అన్న ప్రశ్న మాత్రం వేయగలుగుతాను. నాకు తెలిసినంతలో — సమాధానం కూడా చెప్పగలను. ఇతర నల్ల జాతీయులైన దార్శనికులూ కవులతో పోల్చితే – ఇంత అనుభవమ్మీద బరాకా కవిగా సాధించిన దానికన్నా సాధించ గలిగినదే ఎక్కువ .
ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్తే , ప్రాణహిత సంపాదకులు — ఇంత పొడుగు వ్యాఖ్యలా అనే ప్రమాదం వుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా. …..
April 7th, 2010 at 11:05 pm
ఉపంద్ర గారూ
చాలా మంచి అభిప్రాయాలు చాల వివరంగా చెప్పారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఐతే కొన్నింటికి నా అభిప్రాయాలు చెప్తాను.
“… చెత్తని, గాలికి కొట్టుకొచ్చే కంపనీ ప్రతిరోజూ వూడ్చి శుభ్రం చేసుకోవలసినది కూడా మన బాధ్యతే నంటే కాదం”టారా ?
అవును నిజమే! మన బాధ్యతే! అయితే ఏది చెత్తో ఏది మంచో నిర్ణయించే ప్రమాణాలు మనకేమయినా ఉన్నాయా? మనం మన చైతన్యం లోంచి, మనం ఇంతకు మందే ఏర్పరుచుకున్న స్థిరాభిప్రాయాల్లోంచి చూసి ఫలానాది చెత్త, ఫలానాది మంచి అని నిర్ధారిస్తే అది నిష్పాక్షికం అవుతుందా? ఏదైయినా కొత్తది సాహిత్యంలో ముందుకొస్తే మనం దాని మంచి చెడులని ఎట్లా నిర్ధారిస్తాం?
“….. ప్రాణహితలో ఎన్ని గ్రెనేద్లూ, తపంచాలూ వచ్చాయన్నది లెక్క పెడుతూ కూచుంటే ముందుకి కదలటం కష్టమవుతుంది.”
నేను ఒక ఉదాహరణగా చెప్పాను. అదే ప్రమాణం కావాల్సిన అవసరమూ లేదు. అక్కడే ఆగిపోవాల్సిన ఆగత్యం అంతకన్నా లేదు. సాదారణంగా మరణం ఒక ఉద్వేగపూరితమైన అంశం. అది దగ్గరి వారి మరణమైతే మరీనూ. ముఖ్యంగా ఒక లక్ష్యం కోసం జీవితాన్ని అంకితం చేసి పోరాడుతూ మరణించిన వాళ్ళనూ, లేదా ఒక కారణం కోసం జీవితాన్ని తృణప్రాయంగా ఎంచి ప్రాణాలర్పించిన వాళ్ళనూ మనం తలుచుకోకుండా ఉండలేము. అది ఉద్వేగపూరితమైన అంశం కాబట్టి కవిత్వం లో తలుచుకుంటాం. ఎలిజీలు రాసే సాంప్రదాయం అన్ని భాషల్లోనూ ఉన్నది. ప్రపంచం లో గొప్ప కవులెందరో గొప్ప ఎలిజీలు రాసారు. అయితే మీరన్నట్లు, మరణించిన వారి గురించైనా, వారు మరణించిన లక్ష్యం గురించైనా, వారి జీవిత పోరాటం గురించైనా కొత్త చైతన్యాన్ని కలుగజేసినవి, కొత్త దృష్టిని పాఠకులకు ఇచ్చినవి, పరిచయమున్నట్టనిపించే మృత్యువును అపరిచితం చేసి జీవితపు కొత్త కోణాలని పరిచయం చేసిన సాహిత్యమే నిలిచింది, నిలుస్తుంది. మరణాల గురించి రాయడమే పొరపాటనీ, మార్బిడిటీ అనడం ఎంత సరైంది కాదో, మరణం గురించి రాసేది ప్రతీదీ గొప్పదే అనుకోవడమూ అంతే సరైంది కాదు. నిజమే మరణాల్ని గురించి రాయడానికి యుద్ధ ప్రతీకలే అవసరం లేదు. యుద్ధంలో మరణించిన వాళ్లని పూలతోనూ, పక్షుల పాటలతోనూ, వెన్నెలతోనూ కూడా తలచుకోవచ్చు. అట్లా తలచుకోవడమే తప్పు అనడం మాత్రం సరైంది కాదు. వాస్తవ ప్రపంచాన్ని యధాతథంగా అద్దం పడితే అది గొప్ప సాహిత్యం కాబోదు. మనం రోజూ చూస్తున్న పరిచయమైన ప్రపంచాన్ని మనకు అపరిచితం చేస్తూ కొత్త కోణాలని ఆవిష్కరించేది గొప్ప సాహిత్యం అని నేననుకుంటాను.
“…..అన్ని రకాల ఆగ్రహ ప్రకటనలూ, అందరి ఆగ్రహ ప్రకటనలూ, అన్ని చోట్లా, అన్ని వేళలా ప్రయోజనకరం అవుతాయని నమ్మటం – నమ్మ బలకటం – అమాయకత్వమైనా అవాలి, లేక పోతే దుర్మార్గమైనా అవాలి. కాదంటారా ?” అన్ని ఆగ్రహప్రకటనలూ అన్ని వేళలా సమంజసమనీ, ప్రయోజనకరమనీ నేను అనుకోవడం లేదు. అయితే ఆగ్రహ ప్రకటనలని మనం విన నిరాకరిస్తే వాటి వెనుక ఉన్న న్యాయాన్యాయాలు, ప్రయోజకప్రయోజకత్వాలూ మనకు అర్థమయ్యే అవకాశం లేదు. నాకు తెలుసు – 9/11 దాడుల తర్వాత అనేక ‘కుట్ర’ సిద్దాంతాలు ముందుకొచ్చినయి. వాటిని నిజమనో, అబద్ధమనో నిరూపించే పని ఇతమిద్దంగా జరుగలేదు. అయితే 9/11 తర్వాత ఇరాక్ మీద యుద్ధం మాత్రం ఒకానొక కుట్రను స్పష్టంగానే బయటపెట్టింది. దాని పర్యవసానం ఎంత దుర్మార్గంగా ఉందో మీకు వేరే చెప్పక్కరలేదు. అట్లే ఇజ్రాయిల్ – పాలస్తీనా సమస్య పరిష్కారం కానిదే మధ్య ప్రాచ్యం లో శాంతి ఎంతమాత్రమూ సాధ్యం కాదనేది మీకూ సుస్పష్టమే అనుకుంటా!
“….వెతుక్కోవటానికి కావలసిన లింకులు ఇస్తే ప్రయోజన కరంగా వుంటుంది. స్థూలంగా – నా వ్యాఖ్య వుద్దేశ్యం ఇది. “
మీ ఉద్దేశ్యం చాలా మంచిది. లింకులు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞులం.
“…. ప్రధానంగా కవి కి కావలసిన క్రమశిక్షణ స్వాభావికంగానో, సాధనమీదనో సంతరించుకుని, రాజకీయాల్లో పాల్గొని రాణించిన వాళ్ళు మీకు ఎవరైనా తెలుసునో లేదో నాకు తెలియదు”
నా సమస్య ఒక కవి రాజకీయవేత్తగానో, దార్శనికుడి గానో, ఉద్యమకారుడిగానో ఒకే సారి రాణించగలగడం గురించి కాదు. అట్లా ఉండాల్సిన అవసరమూ లేదు. అట్లా రాణించిన వారిగురించి అడిగారు మీరు. తెలుగులో శివసాగర్ (సత్యమూర్తిగా అతను రాణించాడా లేదా అనే చర్చ చాలా సుదీర్ఘం – దానిలోకి నేను వెళ్లను), చైనా లో మావో, వియత్నాం లో హోచిమిన్ , ఫిలిప్పీన్స్ లో జోస్ మారియో సిజాన్ – మనకు కనబడే కొందరు అట్లాంటి వ్యక్తులు. అయితే నా సమస్య అల్లా, కవి ఒక దార్శనికత, రాజకీయ దృక్పథమూ, ప్రాపంచిక దృక్పథమూ (తాత్విక చింతన) ఉండాలా వద్దా అని! అవి ఆ కవి రాసే కవిత్వాన్ని ప్రభావితం చేస్తే, కవిత్వం (లేదా సాహిత్యం లో) ప్రతిఫలిస్తే తప్పా! అందువల్ల ఆ కవీ, సాహిత్యకారుడూ సృష్టించే కవిత్వమూ, సాహిత్యమూ కలుషితమైపోతుందా! పనికి రాకుండా పోతుందా? నేననేది పిడివాదంగానో, పడికట్టు పదాలుగానో, ప్రవచనాలుగానో, shallow ప్రబోధాలు గానో కాదు. సాహిత్యం లో అంతర్లీనమై, అంతః ప్రవాహంగా ఉంటే తప్పేమిటీ అని. అది గొప్ప సాహిత్యం కాకుండా పోతుందా? కవి, సాహిత్యకారుడూ సృష్టించే సాహిత్యం ఒక నిర్దిష్ట సామాజిక ప్రయోజనాన్ని ఆశించేట్టుగా ఉంటే నేరమా? అంత మాత్రాన అది సాహిత్యం కాకుండా పోతుందా?
“.. ఇతర నల్ల జాతీయులైన దార్శనికులూ కవులతో పోల్చితే – ఇంత అనుభవమ్మీద బరాకా కవిగా సాధించిన దానికన్నా సాధించ గలిగినదే ఎక్కువ . “
ఇతరులతో పోల్చి గానీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందని గానీ అమిరి బరాకా కృషిని తక్కువ చెయ్యడం నాకు సరైంది కాదేమో అనిపిస్తుంది. ఎంత లేదన్నా జీవితాంతం ఒక ఆధిపత్యాన్ని (hegemony) consistent గా వ్యతిరేకిస్తూ, ఏదో రకంగా (సాహిత్య, సాహిత్యేతర పద్దతుల ద్వారా) పోరాడుతున్న ఆయన కృషి చెప్పుకోదగ్గదే అని నా అభిప్రాయం.
April 8th, 2010 at 4:48 am
దార్శనికత, రాజకీయ దృక్పథమూ, ప్రాపంచిక దృక్పథమూ – అంటే జ్ఞాపకం వచ్చింది.
మైథిలి, హింది రెండు భాషల్లోనూ అరవై సంవత్సరాలకు పైగా కవిత్వం పండించిన బాబా నాగార్జున మనకు తెలిసిన కాళోజీ లాగే, కత్తులు దూయకుండానే , నిప్పులు కురవకుండానే , ఎంతటి అధికారాన్నయినా ఏ రోజు కా రోజే తలవంపుల పాలు చేశాడు.
వివరంగా ఎప్పుడైనా పరిచయం చేస్తాను — అప్పటి వరకూ ఈ కింది లింకులు చూడండి.
http://www.youtube.com/watch?v=7CNW0pDPkKY
http://www.youtube.com/watch?v=o5lkSPX5JVY
http://kavyanchal.com/navlekhan/?p=603
http://kavyanchal.com/navlekhan/?p=594
మొదటి రెండూ యూట్యూబ్ లో వీడియోలు. ఆ తరువాతి రెండూ, అవే కవితాలకి అక్షర రూపాలు.
మొదటి వీడియో 70, 80 దశకాలలో భారత దేశంలో రూపు దిద్దుకుంటున్న ఆధిపత్య సంస్కృతిని అతి తేలికగా నవ్వుల పాలు చేస్తుంది. స్ట్రింగ్స్ అనే సినిమాలో ని క్లిప్ ఈ వీడియో. నేపథ్యంలో వినవచ్చేది నాగార్జున ‘మంత్ర కవిత ‘ అనే శీర్షికతో వచన కవిత. టీవీ లో హిందీ న్యూస్ విని అర్ధం చేసుకునే పాటి హిందీ తెలిస్తే ఈ కవిత లోని బలం తెలుస్తుందనుకుంటాను. మంత్ర పాఠాల్లో వినపడే సంస్కృత శబ్దాలు కూడా తెలిస్తే మొత్తం కవితే తేలికగా అర్ధం అవుతుంది. వీలు వెంబడి ఎప్పుడయినా కొంచెం క్లిష్టమైన మాటలకి అర్ధాలు వ్రాస్తాను. ఈ లోపల ఎవరైనా చేయ గలిగినా మంచిదే.
రెండవ కవిత ఒక బస్సు డ్రైవర్ కీ ఒక ప్రయాణీకుదుకీ పధ్య — గులాబీ రంగు గాజుల సాక్షిగా ఆడుకునే వయసులో వున్న ఆడ పిల్లల తండ్రులుగా స్నేహ సంబంధం కలిపి మన కంట తడి పెట్టిస్తుంది.
నాగార్జున గురించిన వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.
http://wapedia.mobi/en/Nagarjun#1.
April 10th, 2010 at 9:44 am
చాకిరేవూ అంత ప్రయాస ఏల. బరాక దే మరో కవిత ని అనువాదం చెయ్యవచ్చు కదా మీరు.
April 11th, 2010 at 2:45 am
రాజేష్
“అంత ప్రయాస ఏల ? ”
అందరం పల్లకీ లెక్కితే మోసే వాళ్లెవరైనా వుండాలి కదా! అందులకు.
“బరాకా దే మరో కవిత మీరు అనువాదం చేయొచ్చు కదా …”
దాని వలన ఏ ప్రయోజనం నెరవేరుతుందో నాకు అర్ధం కాలేదు… బరాకా నాకు అంత ప్రీతి పాత్రుడు కూడా కాదు.
మీ మాట పోనీవ్వకుండా ఇదుగో బరాకా కవితల్లో సరళంగా వుండి నాకు నచ్చిన ఒక కవిత -
పేరు ‘కాబా ‘ ముస్లింలు అందరూ ప్రపంచంలో ఏ దేశంలో వున్నా – జీవితంలో ఒక సారి మక్కా లో కాబా మందిరాన్ని దర్శించాలని కోరుకుంటారు. (హజ్జ్ యాత్రికులు వెళ్ళేది ఇక్కడికే). ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా నమాజ్ చేసేటప్పుడు కాబా వైపు తిరిగి కూర్చుంటారు . అంత లోతుగా – ధార్మిక జీవితానికి ముడి పడి వున్న కాబాని విమోచనకి ఒక ప్రతీకగా వాడటం ఇవాళ కొంత వింతగా అనిపిస్తే అది అలుముకున్న మౌఢ్యానికి తార్కాణం తప్ప మరేమీ కాదు. ఉర్దూ- హిందూస్తానీ అభ్యుదయ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా హమ్ దేఖేంగే హమ్ దేఖేంగే అనే కవితలో ఇదే పని జంకూ గొంకూ లేకుండా వాడేస్తాడు. బెనజీర్ భుట్టో ని మొదటి సారి గెలిపించుకున్నప్పుడు – ఇక్బాల్ బానో ఈ పాటనే పాడగా వేలాది జనం గొంతు కలిపి పాడిన సంఘటనని చాలా మంది రికార్డు చేశారు. ఒక నియంతని (జియా వుల్ హక్) ధిక్కరించి ప్రజలు గొంతు విప్పితే వింటూంటే మనకీ కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. ]
కాబా
మూసేసిన ఒక కిటికీ పైనించి తొంగి చూస్తుంటుంది
ఆ క్రిందే ఒక మురికి ప్రాంగణం , నల్ల వాళ్ళు
కేకలు పెడుతుంటారు, అరుస్తుంటారు దాటుకుంటూ నడుస్తుంటారు
చైతన్య స్రవంతిలో గురుత్వాకర్షణని ధిక్కరిస్తూ
మాప్రపంచం శబ్దాలతో నిండి వుంటుంది
మా ప్రపంచం అన్నీ ప్రపంచాలలోకీ అందంగా వుంటుంది
మేము కష్టాలు పడ్డా, ఒకరినొకరం చంపుకున్నా
ఒక్కో సారి గాలితో పాటు నడవలేక పోయినా
మేము అందమైన మనుషులం
ఆఫ్రికన్ వూహలతో
మాస్కులతో, నాట్యాలతో , ఉప్పొంగే ఉచ్చాటనలతో
ఆఫ్రికన్ కళ్ళతో, ముక్కులతో, చేతులతో
మేము వుక్కు సంకె ళ్లలో సాగిల పడి వున్నా
దూర సందు లేని చలికాలాల మధ్య
సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నా
బంధీకృతులం
చటుక్కున పారిపోవటం కోసమే మా శ్రమంతా
ఆ పురాతన స్మృతి -మనో దృశ్యం లోకి; ఒక కొత్త
సంబంధంలోకిమాతోటే, మా నల్ల కుటుంబంతోటే. మాకోక మాజిక్ కావాలి
మంత్రం కావాలి, పైకెగబాకడానికి
తిరిగి చేరుకోవటానికి, నాశనం చెయ్యటానికి, పునసృష్టి చేయటానికి. ఏమిటా
పవిత్ర శబ్దం ?
April 11th, 2010 at 9:56 am
dear chaakiraevu,
కాబా అంతె నాకు అర్ధము తెలీయలేదు. kaakapaote అనువాదము బాగాచేసారు. ఇన్కో కవి కవితని మాకు పరిచయం చేయండి. అదీ మీకు వీలుంతె మాత్రమే సుమీ.
May 4th, 2010 at 7:56 am
రాజేష్,
కాబా అనేది, మక్కా లో ఉన్న ఒక పురాతనమైన కట్టడం. అందులో ఎటువంటి ప్రతిమలూ ఉండవు. ఇస్లాం లో ఈ కట్టడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
బాబా నాగార్జున అనే ఒక హిందీ కవి గురించి పరిచయమూ, ఆయన రాసిన నాలుగు కవితలకు అనువాదాలూ, ‘ఈ మాట’ మే నెల సంచిక లో వ్యాసరూపం లో ఉన్నాయి. వ్యాసానికి చివర వీడియో లింకులు కూడా ఉన్నాయి.