మాయమ్మ

మునిమబ్బులలేసే
తొలి కోడి లెక్క,
అడివిల తిరుగాడే
మినుగురు లెక్క,
మసక చీకట్లనే ఆకిట్లమీ
అడుగుపెట్టిన మాయమ్మను
సలిసల్లటి దుప్పటిని కప్పి
అక్కున చేర్చుకున్న యాల;
గజ గజ వనుకుతనే
మూలన ముడ్చుకున్న
చీపురును వట్టి
ఇంటి ముంగటున్న
సీదరనంతే ఉకేసి
పసువుల కొట్టంల
పెండకడ్లను తీసి
పొక్కిలి దుక్కిట్ల
సాన్పి సల్లుడు సల్లి
పచ్చనైన ఆకిలి ముంగిట్ల
అలుకు పూతలు పూసి
అరిచేతుల ముగ్గును వట్టి
పంచలకు అదునుగా జారవిడిసి
సక్క గీతలు గీసే మాయమ్మ;
అమ్మ లేసినంకనే
తొలి పొద్దు పొడు పైతది.

కమురు వాసనల
వంటి కోటిల్ల,
కారుమబ్బుల సూరు కింద,
పొయిముకురుల మీన,
ఎర్రెర్రని అలుకుపిడసతీసి
పసుపు కుంకులు పెట్టి
వొత్తు నీళ్లను సరిచేసి
పిడకలను యిరిసి
పొయ్యిల మంటను రాజేసి
సత్తు బొగోన్ల
డికాషను కాసి
పొద్దుగాళ్లప్పుడే
నాయిన నోటి కాడి
చాయి నీళ్లయితది;
ఆడికెళ్ళి ఒక పారి
ఒక కన్నేసి సూస్తనే
సిమట తోటి
యింగలాలను సరిజేస్త
ఉదన గొట్టంతో
ఊపిరినంతా బిగవట్టి
ఉప్ …. ప్ ఉప్…. ప్
మంట ఊదుతే -

కుండల ఉడికే గటుకోలే
అటీకలే మరిగే దుప్పడ మోలే
ఎప్పుడూ కుతకుత మంటనే వుంటది.
మాయమ్మ పోయి కుండల కాడి
మసి బొంత లెక్కయి
మంటలను మహా యిష్టంగా
అలుముకుంటనే వుంటది.

కమ్మటి నిద్రలోని
తియ్యటి కలలను
పెయ్యి నిండా నిండిన
బరువైన  మత్తును
చెదరగొట్టి చెరిపేస్తా
చేయిపట్టి లేపిన యాల
కండ్లు నలుపుకుంట
నిద్రమబ్బులనే
ఉడిసోలుగుతున్నప్పుడు
యిడిపోయిన కనురెప్పల నడుమ
తూర్పు దిక్కులెక్క
ఎదురై నిలుస్తది.
అద్మాయించి బుద్మాయించి
అక్కున సేర్చుకుంటనే
అరుగుకాడికి తోల్కొచ్చి
ముంగురులు సవరించి
కోరకాసును సేతిల వెడ్తనే
పక్కలన్ని దులిపి
పక్కకు సర్దేసి
జాడు కట్టై యిల్లంతే
కలే తిరుగుతది.

కసపస నమిలి
కాకరించి వుంచేంతలనే
జాలట్లకు తోల్కపోయి
చేతికి చెంబుయిచ్చి
పసరు కక్కించి
చీముడును తీసి
సల్లని నీళ్లయి
పెయ్యంతే తడుముతది.

నాయమ్మ కంచు
తలేల కాడి కలికుండోలే
సిబ్బి కుండల ఉడికే
నూకల బువలిగే
రోకటిపోటున మెదిగిన
చింత తొక్కలే
ఆవురావురనే మా ఆకలికి
చల్లని అంచిలి అయితది.
బువ్వ పిడసైతది,
పచ్చి పులుసు సారైతది.

బోటి తునకేల కాడ
బొమ్మిడి సాపల కాడ
నాసు నీసు కాడ
కూరను పంచే గంటైతది
నాయిన పనికి పోయిన యాల
మేము సదువుకు పోయినము
యింటిని కాసే తాళం బుర్రయితది
పొలం పొత్తుల కాడ
హక్కును అడిగే అధికారి అయితది.

తూకం పీకుడు కాడ తామర లెక్క,
నాట్లు ఏసుడు కాడ నాగమల్లే లెక్క,
కలుపులు తీసుడు కాడ కలువ లెక్క,
కల్లంల మాయమ్మ మల్లెతీగైతది;
బంతిమీద తిరిగే ల్యాగదూడైతది.
గడ్డి దులిపే యాలల్ల
సిట్ట సిట్ట ఆడే అమ్మ చేతులు
జల జల రాలే పంట రాసులైతయి.
వంచిన నడుమెత్తని అమ్మ
పండ్లు కాసిన చెట్టు వోలే
వంగి తిరుగుతూనే వుంటది.
సల్లని నీడనిస్తనే వుంటది
పొద్దు పొడుపుల కాడ,
ఎలుగు దిక్కోలిగే
సందెపొద్దుల కాడ,
ఎన్నెలమ్మలే
నా తల్లి దుక్కిదుకై
వంగి వగరుస్తనే వుంటుంది.
నడుము కట్టు యింకింత
బిగిస్తనే వుంటుంది.
అలసి సోలసిన యాల
ఆకలి యాదికి వచ్చి
కంచంల బువ్వ సేరేంతలకే
రెండు మూడైతది.

అప్పుడు గూడ కంచం చుట్టు సేరి
కోళ్లలెక్క అటక్క ముద్ద
యిటొక్క ముద్ద
అందుకుంటుంటే
గంజి నీళ్లతోనే ఆమె
సగం ఆకలి తీరుతది
కారు చీకట్లు కమ్ముతు
ఎన్నెల ఎలుగులు ప్రసరిస్తున్న
పెంక మీది జొన్న రొట్టై
రొట్టెమీది వొట్టి కారమై
మీ ఆకలి తీర్చి
అయ్య కొరకు ఎదురుసూస్తా
పులిసిలిన నా తల్లి
పొక్కిలి ఆకిట్ల
తన రక్కల దుప్పట్లలో
నన్ను పొదువుకుని
తన చల్లని వడిలనన్నుంచుకుని
ఎన్నెలమ్మ ఎలుగుట్ల
సుక్కల దిక్కులు సూస్తా
కతల ఆకాసంల
సుక్కల సాలైతది
పాటల పల్లికీల
ఉయల ఉప్పైతది
కోలాటాల ఆడలాడ్త
దచ్చున్న దారిలో అంట
కోయిలమ్మ పాటలు పాడ్తది
ఆపదలల్ల సాపదలల్ల
అమ్మోరి లెక్క అండగుంటనే
సివసత్తి లెక్క గుండెకు సేర్చుకుంటది
కన్నీటి సాల్లల్ల
కట్టమీని మైసమ్ములే
నడీంత నాగమ్మొలే
దీవునింట బాలమ్ములే
ఓదార్పయి సేదదీర్చుతది
ఊరిముంగిట కాపాలుండే
పోచ మ్మోలె
ఎయికండ్లతో ఎలిగిపోయె
ఎల్లికమ్ములో
మా యమ్మ…..
మమ్మల్నెప్పుడు కంటికి రెప్పోలె
కాపాడ్తనే వుంటది.

5 అభిప్రాయాలు »కవితలు

5 Responses to “మాయమ్మ”

  1. 1
    తిరునగరి సత్యనారాయణ Says:

    కవిత బాగుంది. తెలంగాణ జనజీవితం లోంచి అమ్మను గురించి పాడడం బాగుంది. ముఖ్యంగా తెలంగాణ అమ్మ (పల్లెల్లో శ్రామిక ప్రజల్లో భాగమైన, అణచివేయబడ్డ కులాలకు చెందిన) రోజూవారీ జీవితాన్ని అతి సూక్ష్మ విషయాలతో సహా చిత్రించిన పద్దతి బాగుంది. అయితే కొంత కవిత కుదించగలిగితే ఇంకా శక్తివంతంగా ఉండేదేమో అనిపించింది. కవితకు గొప్ప అందాన్నిచ్చింది భాష! తెలంగాణ సజీవ భాషని కవిత పట్టుకోగలిగింది.

  2. 2
    vishvasi Says:

    జజుల గౌరి కవిత చల బగుంది. తెలెంగన భషలొ మరీ బాగుంది.

  3. 3
    abhimAni Says:

    ఒళ్ళు గగుర్పొడిచింది గౌరి! మా అమ్మ గుర్తొచ్చింది జాజుల గౌరీ!!

  4. 4
    shivarathri sudhakar Says:

    అమ్మ ను చిత్రించిన తీరు అద్బుతంగా ఉంది..

  5. 5
    shivarathri sudhakar Says:

    అమ్మ ను చిత్రించిన తీరు అద్బుతంగా ఉంది…..

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో