Apr2010
నాకు చెప్పొద్దు
[‘ప్రజల కోసం అవసరమైతే కవిత్వాన్ని కూడా వదులుకుంటాను’ అన్నారొక సారి శ్రీ శ్రీ. ఇది ప్రతి కవి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాలు. ఎవరికి వారు ఈ ప్రశ్నకు ఏదో ఒక జవాబు చెప్పుకుని ఉంటారు. కొందరు ప్రజల్ని వదిలి ‘శుద్ధ’ కవిత్వాన్ని కావిలించుకుంటే, మరి కొందరు ప్రజలు ముఖ్యమని కవిత్వాన్ని వదిలేసి ఉంటారు. అలాగని ఎవరూ రాయడం మానరు. నీ కవిత్వంలో జీవితం ఎక్కడంటే సౌందర్యం గురించి ఊదరగొడతారు. అందులో కవిత్వం ఎక్కడంటే వర్గ దృక్పథం గురించి ఉపన్యసిస్తారు. రెండింటిలో దేన్నీ వదులుకునేది లేదన్నాడు చిలీ మహా కవి పాబ్లో నెరూడా. నిజానికి ఇదొక మిత్ర వైరుధ్యం. ప్రజలు, కవిత్వం... బాధ్యత, సౌంర్యం... రెండూ ముఖ్యమే. ఈ ‘లక్షణా’న్ని అద్భుతంగా ప్రతిపాదిస్తూ దానికి తానే ‘లక్ష్యం’గా నిలిచే కవిత ‘నాకు చెప్పొద్దు’ (‘ధిక్కార గీతం’- 1958-68). స్పానిష్ నుంచి మిగ్వెల్ అల్గారిన్ ఆంగ్లీకరించిన కవితకు తెలుగు: హెచ్చార్కె]
నాకు చెప్పొద్దు
మనషుల రోజువారీ జీవితాలతో, వాళ్ల పేర్లతో,
వాళ్ల ఇంటి పేర్లతో, వాళ్ల ఏడుపులతో నా
పుస్తకం పేజీలు నింపొద్దని కొందరు చెబుతుంటారు
నా పద్యాల్లో వాటికి చోటు అక్కర్లేదంటారు
అంతటితో కవిత్వం చచ్చూరుకుంటుందని
నేనలా చేయకూడదని చెబుతుంటారు
వీరిని మెప్పించాలని నేను అనుకోడం లేదు
వీరు ఎదురైనప్పుడు నా టోపీ కొసలు తాకి పలకరిస్తాను
జున్ను కుండలో ఓలలాడే ఎలకల్లాగ
దివ్య కవితా వనంలో విహరించండని వదిలేస్తాను
నేను మరో రకానికి చెందిన వాడిని
కేవలం రక్తమాంసాలున్న మనిషిని
ఎవడైనా నా సోదరుడిని కొడితే
నా చేతిలో ఏముంటే దానితో సోదరుడికి సాయం వెళ్తాను
నా పద్య చరణాలలో ప్రతి ఒక్కటీ
భయపెట్టే తుపాకి మందు దట్టించి ఉంటుంది
అమానుషం మీద దుర్మార్గం మీద
దురహంకారం మీద పేలడానికి సిద్ధంగా ఉంటుంది
నా ఆగ్రహపూరిత శాంతి కాంక్ష
పేదలను మంచివాళ్లను శిక్షించదు భయపెట్టదు:
పడిపోయిన వాళ్ల కోసం వెదుకుతూ
నేను నా లాంతరు పట్టుకుని తిరుగుతుంటాను
వాళ్ల గాయాలకు మందుపూసి కట్టు కడతాను
విమాన చోదకునికైనా రాళ్లు కొట్టేవాడికైనా
కవికైనా ఇవే విధ్యుక్త కర్తవ్యాలు:
ఈ భూగోళం మీద పుట్టాం, ఏమైనా చేయాలి
మానవ సమాజాన్ని క్రమబద్ధం చేయాలి
పిట్టలమో కుక్కలమో కాము, మనుషులం మనం.
నేను అసహ్యించుకునే దాని మీద నేను దాడి చేస్తుంటే
లేదా నేను ప్రేమించే వారి కోసం నేను పాడుతుంటే
కవిత్వం నా మేనిఫెస్టో లోని ఆశలనే వదులుకోవాలంటోంది
నేను నా నియమాల్ని తూచా తప్పక పాటిస్తాను
నక్షత్రాలు సేకరిస్తాను, ఆయధాలు సేకరిస్తాను
ప్రజల పట్ల నా కర్త్యవ్య నిర్వహణ ముందు
ఇంకొక గులాబీ పువ్వు పెద్ద లెక్కలోనిది కాదు:
సౌందర్యంతో నాకొక ప్రేమ ఒప్పందం వుంది:
నా ప్రజలతో నాకొక నెత్తుటి ఒప్పందం వుంది.
12 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు
April 8th, 2010 at 10:25 am
చాలా మంచి కవితను సరైన సందర్భం లో అందించిన హెచ్చార్కె గారికి కృతజ్ఞతలు. కవిత్వానికి సౌందర్యమూ, సామాజిక బాధ్య్తతా రెండూ ముఖ్యమని తన కవిత్వం ద్వారా చాటిచెప్పిన నెరూడా ను గుర్తు చేసుకోవడం ఇవాళ్ళ ఎంతో అవసరం. జీవితం గురించి, కన్నీళ్ళ గురించి, కష్టాల గురించి, పేద శ్రామిక జనం గురించి, వారి పోరాటాల గురించి రాయడం రాయడం సాహిత్యం పని కాదు అని దుష్ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న ఈ రోజుల్లో నెరూడా కవిత చదువుకోవడం చాలా గొప్పగా ఉంది. అయితే అనువాదం అక్కడక్కడా పలుచబడ్దదా అనిపిస్తున్నది. ఇంగ్లీషు లో కవిత ఎలా ఉందో? దాని పేరేమిటో తెలిపితే బాగుంటుంది.
April 8th, 2010 at 11:00 am
ఇంగ్లిష్ లో కవిత శీర్షిక ‘ Do Not Ask Me ‘ ఇది ‘ Song of Protest ‘ లో ఒక భాగం. మూలం చూశాక అనువాదం మరోసారి చదవండి. ‘పల్చబడింద” నిపించడానికి ఇటీవల మనం అలవాటు పడుతున్న ‘రొమాంటిక్’ శైలి కారణం కావచ్చని నా అనుమానం. పాబ్లో పద్యం చాల సూటిగా, నేరుగా ఉంటుంది.
April 11th, 2010 at 10:10 am
పాబ్లో నెరుడా ఎవరు హెచ్చార్కే గారూ
April 11th, 2010 at 2:47 pm
రాజేష్ గారూ – మీరు మీ ప్రశ్న చిత్తశుద్ది తో అడుగుతున్నారో లేక వెక్కిరింతకు అడుగుతున్నారో తెలియడం లేదు. వ్యాఖ్యల్ని సీరియస్ గా సద్వినియోగం చేస్తే మంచి చర్చ జరుగుతుంది కదా?
April 12th, 2010 at 9:14 am
తిరునగరి గారూ,
నేను శుద్ద చిత్తం తోనే ఆడుగుతున్నాండి. నెరుడా కవిత్వం గురించి తెలుసుకోవాల ని వుంది.
ఒక చక్కటి వ్యాసం ఎవరైనా రాస్తే తెలియని వాళ్ళం తెలుసుకుంటాము.
April 12th, 2010 at 1:20 pm
రాజేష్ గారి ఉద్దేశం ఏమిటో గాని, ఆయన ప్రశ్నించడం వల్ల నా ఇంట్రోలో దొర్లిన ఒక తప్పు తెలిసి వచ్చింది. నెరూడా పేరుకు ముందు స్పానిష్ మహాకవి అని రాశాను. దీని వల్ల, ఆయన స్పెయిన్ దేశీయుడనే అర్థం వస్తోంది. సారీ. ఆ వాక్యాన్ని చిలీ మహాకవి పాబ్లో నెరుడా అని మార్చి, చివరి వాక్యాన్ని ‘స్పానిష్ నుంచి మిగ్వెల్ అల్గారిన్ ఆంగ్లీకరించిన కవితకు తెలుగు అనువాదం’ అని మార్చాలని సంపాదకులకు మనవి.
April 16th, 2010 at 3:31 am
రాజేష్ గారూ
ప్రాణహిత పాతసంచికలలో ది పోస్ట్ మాన్ సీరియల్ చదవండి. నెరూడా గురించి కాస్తన్నా తెలుస్తుంది.
April 16th, 2010 at 9:07 am
తప్పకుండా చూస్తానండీ వెంకట రమణ గారూ. thank you.
April 16th, 2010 at 10:41 am
ఇవి కూడా చూడండి
http://www.pranahita.org/2007/08/pablo_neruda_interview1/
http://www.pranahita.org/2007/09/pablo_neruda_interview2/
April 16th, 2010 at 10:43 am
ప్రాణహిత 2007 ఆగస్టు సెప్టెంబర్ సంచికలల్లో నెరూడా తో ఇంటర్వ్యూ కూడా చూడండి.
May 2nd, 2010 at 10:07 am
మంచి కవిత.
నన్ను చాలా సార్లు తొలిచే సమస్యే ఇది.
సౌందర్యాన్ని వర్ణించటానికి లెక్కలేనన్ని అలంకారాలు, పదచిత్రాలు క్యూకట్టుకొని సిద్దమౌతాయి.
బరువైన వస్తువుని కవితగా రాయనెంచితే, వుత్త వచనంలా తేలిపోతూంటుంది. ఇందులో కవిత్వం లేదేమీ, కవిత బదులు ఓ వ్యాసం రాసుంటే బాగుండేది అని సదరు కవిని ఎకసెక్కాలు ఆడే విమర్శకులే ఎక్కువ.
రెంటి మధ్యా సామరస్యాన్ని సాధించిన కవుల్లో నాకు శ్రీశ్రీ, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్ లు కనిపిస్తారు.
నాకెందుకో నెరుడా సౌందర్యపిపాసి గానే అనిపిస్తాడు. ఎవరో పెద్దాయన గాఠిగా విమర్శించటంతో, భూమార్గం పట్టినట్లు ఎక్కడో చదివాను.
హెచ్చార్కె గారికి మంచి కవితను పరిచయం చేసినందుకు ధన్యవాదములు
రాజేష్ గారికి
ఈ బ్లాగులో పాబ్లో కవితానువాదాలు ఓ పదికి పైగా ఉన్నాయి వీలైతే చూడండి.
http://sahitheeyanam.blogspot.com/
బొల్లోజు బాబా
May 2nd, 2010 at 12:00 pm
మితృలకు కృతజ్ఙతలు.
బాబా గారు, ‘బరువైన వస్తువుని కవితగా రాయనెంచితే, వుత్త వచనంలా తేలిపోతూంటుంది. ఇందులో కవిత్వం లేదేమీ, కవిత బదులు ఓ వ్యాసం రాసుంటే బాగుండేది అని సదరు కవిని ఎకసెక్కాలు ఆడే విమర్శకులే ఎక్కువ.’ అని మీరు వ్యక్తం చేసిన అభ్యంతరంతో ఏకీభవించలేను. వస్తువుకు ఆవిష్కరణ స్వభావం ఉన్న కొన్ని సందర్భాల్లోనే వస్తు ప్రాధాన్యం కవితను కాంతివంతం చేస్తుంది. ఉదా: గురజాడ దేశభక్తి గీతం, శ్రీశ్రీ దేశ చరిత్రలు, ఇక్కడి పాబ్లో కవిత ఎట్సెట్రా.
కొందరు మనాళ్లు వ్యాసం రాయబోయి కవితలా రాసి అచ్చేయడం బాగానే జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో పదునైన విమర్శ తప్పక అవసరమే. మీరు ప్రత్యేకించి మెచ్చుకున్న కవులలో కొందరు ఆ పని బాగానే చేశారు. మీరది చూడలేకపోవడం ఆశ్చర్యకరమే. అలాంటి సందర్భం ఎక్కడ ఎదురైనా, విమర్శకుడు కలం ఝళిపించాల్సిందే. కవిలోకం దాన్ని ఆహ్వానించాలి కూడా. అలాంటి విమర్శకులు చాల కొద్ది మందే ఉన్నారు. మీరన్నట్లు వాళ్లు ఎక్కువగా లేరు. ఉండాలి.