నేనెరిగిన శ్రీశ్రీ

మద్రాసులో పుట్టిపెరగడంవల్లనూ, మా ఇంట్లోని తెలుగు సాహిత్యవాతావరణంవల్లనూ శ్రీశ్రీగారిని నేను చాలాసార్లు, చాలా సందర్భాల్లో చూశాను. మా కుటుంబానికి అనేక తెలుగు స్థానికరచయితల, కళాకారుల కుటుంబాలతో పరిచయాలుండేవి. వీరిలో శ్రీశ్రీ ధోరణి కాస్త వేరుగా ఉండేది. ఆయనకు మా అమ్మకూడా చాలా ఏళ్ళుగా తెలిసినప్పటికీ ఆయన సంభాషణా, సంపర్కమూ మానాన్నవరకే పరిమితంగా ఉండేది. తన కుటుంబాన్ని పరిచయం చెయ్యడంగాని, మా కుటుంబసభ్యులతో మామూలుగానైనా మాట్లాడడంగాని ఆయన చేసేవారుకాదు. ఈ కారణంవల్లనే 2009లో తానా సభలో కలుసుకునేదాకా నేను సరోజగారిని ఎన్నడూ చూసికూడా ఉండలేదు. మొదట్లో శ్రీశ్రీగారికి పిల్లలు లేరనీ, ఒక కూతురిని పెంచుకున్నారనీ మాత్రమే మాకు తెలుసు. ఆ తరవాత ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకున్నారని విన్నాం తప్ప ఇతర విశేషాలేవీ మాకు తెలియవు. “శ్రీశ్రీకి నలుగురు పిల్లలున్నారట” అని మా నాన్నకూడా ఒక సందర్భంలో ఆశ్చర్యపడుతూ మాతో అన్నారంటే ఇలాంటి విషయాల్లో శ్రీశ్రీగారి వైఖరి ఎలా ఉండేదో అర్థమవుతుంది.
శ్రీశ్రీగారిని గురించి మానాన్న చెప్పే విషయాలను వింతగా వినేవాళ్ళం. ఒకసారి ఆయన మా నాన్నతో ‘ఫలానా చోటికి వెళ్ళాలి. ట్రాము టికెట్టుకు మూడణాలు ఉన్నాయా?’ అని అడిగాడట. మా నాన్న నిర్ఘాంతపోయి, ‘అదేమిటి? ట్రాము దిగిన తరవాత ఏం చేస్తారు? ఈ అయిదు రూపాయలూ తీసుకోండి’ అంటే ‘అబ్బే అవసరంలేదు. అప్పుడు చూస్తాను. ప్రస్తుతానికి మూడణాలు చాలు’ అన్నాడట. ఆ తరవాత చాలా ఏళ్ళకు, 1965 ప్రాంతాల్లో నేను మద్రాసులో సితారు క్లాసులకని బస్సులో వెళుతున్నప్పుడు ఆయన తేనాంపేట ఎల్డామ్స్ రోడ్డుమీద హవాయీ చెప్పులేసుకుని నడుస్తూ కనబడేవాడు. మా నాన్న చెప్పిన ఉదంతం జ్ఞాపకం వచ్చి, బస్సెక్కడానికి ఈయనగారి దగ్గర డబ్బులున్నాయో లేదోనని నాకు అనుమానం వచ్చి బాధ కలిగేది. అంత గొప్ప సాహితీవేత్తను గుర్తుపట్టేవారే లేరుకదా అనిపించేది. చలంగారన్నట్టు ప్రపంచం బాధే శ్రీశ్రీ బాధ. ఆయన బాధలను పట్టించుకునేవారు అరుదే.
1950లలో ఒకసారి మాత్రం ఆయనకు సినిమాల్లో బాగా డబ్బొచ్చి కారుకూడా కొనుక్కున్నాడనీ, అయితే త్వరలోనే అదంతా కోల్పోయి పాత పరిస్థితికే వచ్చాడనీ మావాళ్ళు చెప్పారు. తరవాతి కాలంలో శ్రీశ్రీ నిత్యదారిద్ర్యం గురించి ఎంత ప్రచారం జరిగిందంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన ‘నా పరిస్థితి మరీ మీరనుకున్నంత అన్యాయంగా లేదులెండి’ అని చెప్పుకోవలసివచ్చింది. డబ్బులు ‘వెనకేసుకునే’ లక్షణం ఆయనకు ఏనాడూ ఉండేదికాదనేది అక్షరసత్యం.
ఆయనకు ఎటువంటి social life ఉండేదో నాకు తెలియదు. సామాన్యంగా ఆయన మా నాన్నను చందమామ ఆఫీసులో కలుసుకుని వెనక్కి వెళుతూ మా ఇంటికొచ్చేవారు. ముందుగదిలో కూర్చోగానే నాతో ‘ఇవాళ్టి హిందూ పత్రిక ఉందా?’ అని అడిగి, దాన్ని తీసుకుని చివరి పేజీలోని నుడికట్టు నింపుతూ కూర్చునేవారు. మా నాన్న ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చేదాకా మాటామంతీ లేకుండా ఇదే తీరున కూర్చునేవారు. మొహమాటానికైనా ‘ఏమోయ్, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు?’ వగైరా కుశలప్రశ్నలు వేసేవారుకాదు. ఆయన విశిష్టత గురించి చిన్నప్పటి నుంచీ మాకందరికీ తెలుసు కనక మేము ఇలాంటి విషయాలను పట్టించుకోలేదు.
ఈయనకన్నా మేము ఆరుద్రగారి కుటుంబాన్ని తరుచుగా కలుసుకునేవాళ్ళం. ఆరుద్ర శ్రీశ్రీకి బంధువని మాకు చిన్నప్పుడే తెలుసు. రామలక్ష్మి మా పిన్ని ఉషారాణి (భాటియా)కి బి.ఏ.లో క్లాస్‌మేట్ కనక ఆవిడకూడా మాతో కలివిడిగా ఉండేది. వీళ్ళిద్దరి కవిత్వమూ మా ఇంటో ఉన్న పుస్తకాలవల్ల నాకు బాగా పరిచితమే. ప్రతిభావంతులైన సాహితీపరులు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో, వారిపట్ల పిల్లలుగా మేమెలా ప్రవర్తించాలో చిన్నప్పుడే మాకు నేర్పారు.
మా అమ్మా, మా మేనమామ కొమ్మూరి సాంబశివరావూ చిన్నప్పుడే కేరమ్స్ చాంపియన్స్. వాళ్ళే శ్రీశ్రీగారు గొప్ప కేరమ్స్ ఆటగాడని చెప్పేవారు. ఆ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఆట మొదలుపెట్టినవారిదే గేమ్. అవతలి వ్యక్తికి ఆడే అవకాశమే రాదు. శ్రీశ్రీ ఆడుతున్నప్పుడు ఆయన చెయ్యి ఎంతగా వణికేదంటే అసలు ఒక్క పాయింటయినా గెలుస్తాడా అని చూసేవారికి అనుమానం కలిగేదట. అయినా ఒక్కొక్క షాట్‌కూ మూడేసి, నాలుగేసి బిళ్ళలు పాకెట్లలోకి వెళ్ళేవట. ఇది ఆయనలోని ఒక సాహిత్యేతర విశేషం.
నేను ఆంధ్రా యూనివర్సిటిలో ఎం.ఎస్‌సీ. చదివే రోజుల్లోనే విశాఖలో శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలు జరిగాయి. దానికి మా కుటుంబమంతా రావడం నాకింకా సంతోషాన్ని కలిగించింది. ఒక పండగ వాతావరణంలో కురువృద్ధుడివంటి తాపీ ధర్మారావుగారు రావడం, వచ్చి కూర్చుంటూనే ఏదో మాటొచ్చి ‘సింగంబాకటితో…’ అనే తిక్కన పద్యం గుర్తుచేసుకోవడం చాలా సరదాగా అనిపించింది. ఇక స్థానిక దిగ్గజం రావిశాస్త్రిగారి వైఖరి సరేసరి. శ్రీశ్రీని చూసినప్పుడల్లా ఆయన కళ్ళలో చెప్పలేనంత ఆరాధన కనిపించేది.
మెడికల్ కాలేజిలో ఉదయం మొదలైన సాహిత్యసభలో జ్వాలాముఖి చేసిన ఉద్వేగభరితమైన ఉపన్యాసం, ఆవంత్స సోమసుందర్ ఉండగానే ఆయనమీద జ్వాలాముఖి చేసిన కామెంట్లూ, సోమసుందర్ కోపంగా జవాబివ్వడం, దిగంబరకవుల రచనలకు మా నాన్న స్టేజిమీద తెలిపిన ఏకీభావం, కె.వి.ఆర్.గారి జాగ్రత్త ధోరణి, అన్నీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అప్పట్లో మాదగ్గర ఫ్లాష్ గన్‌కూడా ఉండేదికాదు. అయినా అలాగే అక్కడ నేను తీసిన కొన్ని మసకఫోటోలు మాత్రమే ఆ సభకు సాక్ష్యాలుగా మిగిలాయి. మొత్తంమీద ఆ సభలో విప్లవసాహిత్య ధోరణులే సమకాలీన సమాజానికి పనికొస్తాయనే అభిప్రాయం బలంగా వినిపించింది.
ఆ తరవాత యూనివర్సిటీ కిర్లంపూడి హాస్టల్ మెస్‌లో భోజనాలు ఏర్పాటయాయి. భోజనం తరవాత శ్రీశ్రీగారి చుట్టూ అందరూ కబుర్లు వినడానికి కూర్చున్నాం. ఇతర రచయితలుకూడా అక్కడే ఉన్నారు. ఎవరో ఏదో అడిగితే శ్రీశ్రీ తన సహజధోరణిలో తాను రాయదలుచుకున్న ‘బెండయ్యగారి గది’ అనే సర్రియలిస్ట్ నాటకం వివరాలు చెప్పసాగాడు. మధ్యలో ఎవరో ఒకతను కాస్త కరుకుగా అడ్డుతగిలి ‘అయితే ఇదంతా విప్లవసాహిత్యానికి ఏ విధంగా తోడ్పడుతుందంటారు?’ అని అడగడంతో శ్రీశ్రీగారు కాస్త తమాయించుకున్నాడు. ఏది ఏమైనా అందరికీ ఆయన మీదున్న ప్రగాఢ అభిమానం బలంగా కనిపించింది. సాయంత్రం జరిగిన బహిరంగసభకు అయిదువేలమంది రావడం, శ్రీశ్రీ అడ్డచారల టీషర్టుతో వచ్చి ప్రసంగించడం, ఆరుద్ర చేసిన హంగామా అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి. ‘విశాఖలో నాకు కాంస్యవిగ్రహం ఏర్పాటు చెయ్యాలన్నారు. గురజాడకి లేని విగ్రహం నాకేమిటని నేను వద్దన్నాను’ అన్నారు శ్రీశ్రీ తన ప్రసంగంలో.
తరవాత తూమాటి దొణప్పగారు తెలుగు డిపార్ట్‌మెంట్‌కు ఆయనను అహ్వానించారు. అక్కడ వెల్చేరు నారాయణరావుగారి దగ్గర తెలుగు నేర్చుకుంటున్న పాశ్చాత్యులను శ్రీశ్రీగారికి పరిచయం చేశారు. ‘మీరేం చదువుతున్నా’రని ఆయన వాళ్ళనడిగితే వాళ్ళు మనుచరిత్ర, వసుచరిత్ర వగైరా పేర్లు చెప్పారు. దానికి శ్రీశ్రీ ‘Yes, yes. You must study them well, because that is NOT the way we write today’ అన్నారు. అది విన్న అందరం గొల్లున నవ్వాం.
1970 మేలో మా అమ్మమ్మ కొమ్మూరి పద్మావతిగారు మద్రాసులో మరణించింది. ఆవిడ కోమాలో ఉండడంతో మా అమ్మా, నాన్నా రాత్రంతా వాళ్ళింటోనే గడిపారు. మా అక్క శాంతసుందరి కడుపుతో ఉండడంతో నేను తోడుగా మా ఇంట్లోనే ఉండిపోయాను. పొద్దున్న మా నాన్న తిరిగివచ్చి ఆవిడ పోయిన సంగతి చెప్పగానే నేనాగలేక బస్సెక్కి చూడడానికి వెళ్ళాను. మా ఇళ్ళమధ్య దూరం నాలుగైదు బస్ స్టాపులే. నేను దిగే ముందుస్టాప్‌లో శ్రీశ్రీగారు అదే బస్సెక్కాడు. విశాఖలో చూసిన నా ముఖం ఆయనకు గుర్తే. ఆయన ‘ఏమోయ్’ అనగానే నేను మా అమ్మమ్మ మరణవార్తను ఆయనకు చెప్పి, ఆయన ‘ఎవరూ? పద్మావతిగారా?’ అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగానే బస్సు దిగి వెళిపోయాను.
1973 ప్రాంతాల అనుకుంటాను, నేనూ, మా అమ్మా, నాన్నా ఒకసారి డా. గాలి బాలసుందర రావుగారింటికి వెళుతున్నప్పుడు శ్రీశ్రీ కనిపించి, తానొక కొత్త కవిత రాశానని అన్నారు. మా నాన్న ‘ఏదీ వినిపించండి’ అని అడగగానే తనవద్దనున్న manuscript తీసి ‘ఊగరా, ఊగరా’ కవితను వినిపించారు. వింటున్న మాకు ఒళ్ళు గగుర్పొడుస్తోంది. వీళ్ళంతా ఎవరో, ఏం చేస్తున్నారో ఏమీ పట్టించుకోకుండా దారినపోయే స్థానిక తమిళులను నేను కాస్త ఆశ్చర్యంతోనే చూశాను.
1940లలో శ్రీశ్రీనీ, మా నాన్ననూ నిరుద్యోగం చాలా బాధించింది. రాత్రి భోజనానికని ఇడ్లీలు తినేసి మద్రాసు బీచిలో పడుకుని నిద్రపోయిన సందర్భాలుకూడా ఉండేవట. తరవాత మా అమ్మను పెళ్ళిచేసుకోవడం, చందమామలో ఉద్యోగం రావటంతో మా నాన్న పరిస్థితి పూర్తిగా కుదుటపడింది. శ్రీశ్రీ విషయంలో ఇలాంటివి జరగటానికి చాలాకాలం పట్టింది. పేరుప్రఖ్యాతులూ, సభలూ, సమావేశాలూ ఎన్ని జరిగినా ఆయనకు కుదురైన ఉద్యోగం మటుకు దొరకలేదు. ఈ తేడాలు మరణానంతరం బాగా బైటపడ్డాయి. మా నాన్న 1980 ఆగస్ట్ 17 సాయంత్రం అకస్మాత్తుగా మరణించినప్పుడు మా అమ్మ తప్ప దగ్గర్లో ఎవరూ లేరు. బొంబాయిలో ఉన్న నాకు ఆ రాత్రే సమాచారం అందడంతో నేను ప్లేనెక్కి ఆ మర్నాడు ఉదయమే మద్రాసు చేరుకోగలిగాను. పూనాలో ఉంటున్న మా అన్నయ్య రామచంద్రరావు రావటానికి మటుకు మరొకరోజు పట్టింది. ఈ రెండుమూడు రోజులూ శవాన్ని మా ఇంట్లోనే ice blocks మీద ఉంచారు. ఆ ఏర్పాట్లన్నీ నాగిరెడ్డిగారి సిబ్బంది సవ్యంగా నిర్వర్తించింది. ముందుగదిలో ఉంచిన మా నాన్న శవాన్ని శ్రీశ్రీకూడా వచ్చి, కాసేపు నిలుచుని చూసి వెళ్ళాడని ఎవరో చెపితేగాని మా అమ్మకు తెలియలేదు. ఆయన లోపలికొచ్చి పలకరించలేదు కాబోలని అనుకున్నాం. (ఇటువంటి చిన్న విషయాలకు శ్రీశ్రీని తప్పుపట్టడం మేమెన్నడూ చెయ్యలేదు. ఆరుద్ర మాత్రం మాతోనే ఉండి దహనానికి కూడా వచ్చారు). 1983లో శ్రీశ్రీ చనిపోయినప్పుడు ఆయనచేత ఆ రోజుల్లో పాటలు రాయించుకుంటున్న సినిమా ప్రొడ్యూసర్లూ, దాసరి నారాయణరావు తదితరులూ ఆర్థికంగా ఆదుకున్నారని విన్నాను. తరవాతి కాలంలో శ్రీశ్రీగారి కుమార్తెలు చదువులో బాగా రాణించారనీ, పిల్లలందరూ పైకి వస్తున్నారనీ తెలిసినప్పుడు మా కుటుంబంలో అందరమూ చాలా సంతోషించాము.
శ్రీశ్రీగారి గురించి ఇతర భాషీయులకు చెప్పినప్పుడు మలయాళీలు మాత్రం ఆయన గురించి తెలుసనీ, అనువాదాలుకూడా చదివామనీ చెప్పేవారు. మలయాళ సాహిత్యంలో మార్క్సిజం ప్రభావం ఎక్కువ కావడం అందుకు కారణమేమో.
చూసేవారికి శ్రీశ్రీగారి చూపూ, వాలకమూ అయోమయంగా ఉండేవికాని రచయితగా ఆయనను ఎరిగినవాళ్ళకి మాత్రం ఆయన మేధస్సు అద్భుతంగా అనిపించేది. ఎంతో నిరాడంబరంగా, modestగా జీవితం గడిపిన అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టడానికి ఎన్ని దశాబ్దాలు వేచి ఉండాలో, శతాబ్దాలే గడుస్తాయో చెప్పడం కష్టమే.

38 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

38 Responses to “నేనెరిగిన శ్రీశ్రీ”

  1. 1
    Sitaramaprasad Says:

    రోహిణి ప్రసాద్ గారూ,
    చాలా విలువైన విషయాలు తెలియ చేశారు. ధన్యవాదాలు. గొప్ప కవుల కవిత్వం తో బాటు వారి జీవితాన్ని కూడా తెలుసుకోవటం మంచిది అనిపిస్తోంది.
    సీతా రామ ప్రసాద్.

  2. 2
    తమ్మినేని యదుకుల భూషణ్. Says:

    సంగీతమైనా, సైన్సు సంగతులైనా ,ప్రముఖుల జీవిత విశేషాలైనా రోహిణీప్రసాద్ గారు
    చక్కని వచనంలో మనసుకు హత్తుకొనేలా చెప్పగలరు. శ్రీ శ్రీ వ్యక్తిత్వంలో మరో కోణాన్ని
    ఆవిష్కరించారు. తెలుగులో ప్రతి అడ్డమైన దానికి (వార్తలకు స్పందించడం ,నిరసన వ్యక్తం
    చేయడం, ఉద్యమాలు తీయడం ) కవిత్వం ఆసరా కావాలి:.ఇలాప్రక్రియా భేదమన్నది తెలియక
    పిడుక్కీ బియ్యానికిఒకటే మంత్రమే.వ్యాసాలు రాయడం ఎంతో నాగరకమైన విషయమని
    మనవారికి తట్టదు.వ్యాసానికి కొండొకచో కథకు సరిపోయే సరుకును వచన కవిత్వంలోకి
    దిగుమతి చేయాలని ప్రయత్నించి భంగపడి పాఠక లోకాన్ని భయపెడతారు. సంపాదకులు
    కొన్నేళ్ళ పాటు ఈ తరహా కవులతో వ్యాసాలు రాయించి ప్రకటిస్తే ఉభయతారకంగా ఉంటుందని
    నా నమ్మకం.

    ఈ సంచికలో కవితలే చూడండి ( ఇంకా మొద్దుగానే ఉన్నా- హెచ్చార్కె,లోహితుడు కవితలను
    మినహాయిస్తే ) మిగిలిన రచనలన్నీ కవిత్వం అన్న శీర్షికన ప్రచురిస్తే కవిత్వానికి వచనానికి
    సమానంగా ద్రోహం చేసినట్టే.వీరందరూ ఈ వ్యాస రచయిత స్ఫూర్తితో కొంత కాలం కవిత్వం
    కసరత్తు మాని సాఫీ వచనంలోకి దిగితే పాఠకులకు ఎంతో హాయిని చేకూర్చిన వారవుతారు.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  3. 3
    రవికిరణ్ తిమ్మిరెడ్డి Says:

    రోహిణీ ప్రసాదు గారు,

    మీ మౌనం, భూషణ్ గారి అభిప్రాయంతో అంగీకారవా?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  4. 4
    Rohiniprasad Says:

    మౌనానికి ప్రత్యేక కారణమేమీ లేదు. భూషణ్ గారి కామెంటుకు thanks.

    నిజం చెప్పాలంటే (ఇటీవల ఒక మిత్రుడితో ముచ్చటించినట్టుగా) ప్రస్తుతకాలంలో కవితలకన్నా information (particularly basic scientific facts) అందజేసే వ్యాసాలే తెలుగువారికి అవసరమని నా నమ్మకం. అవి తెలిసినవారు అలాంటి వ్యాసాలను ఉపేక్షించవచ్చుగాని కొందరికైనా అవి ఉపయోగపడే అవకాశం ఉంది. ఒకప్పుడు కుటుంబంలోని పెద్దలవల్లనో, లైబ్రరీ పుస్తకాలవంటి ద్వారానో సులువుగా విషయపరిజ్ఞానం పొందే అవకాశాలుండేవి. ఈ రోజుల్లో అవి తగ్గినట్టుగా అనిపిస్తోంది.

    ఉదాహరణకు కుక్కలు కుళ్ళిన తిండిని కూడా తమ జీర్ణాశయంలోని అధిక ఆమ్ల గుణం కారణంగా హరాయించుకోగలవని నేనొక వ్యాసంలో రాస్తే స్కూల్లో జువాలజీ నేర్పే ఒకమ్మాయి తనకా సంగతి తెలియదని నాతో చెప్పింది.

    ఇదేదో గొప్ప విషయం కాదుగాని ఎవరో ఒక కవి ఏదో సంఘటన గురించి ఎలా స్పందించాడో తెలుసుకోవడం కన్నా మనకు తెలియని కొత్త విషయాలు కొన్నయినా తెలుసుకోవడం ముఖ్యమని నేననుకుంటాను. ఇదే విషయాన్ని భూషణ్ గారు ప్రస్తావించడం నాకు సంతోషాన్ని కలిగించిన మాట వాస్తవం.

    ఇటీవల ఒక సందర్భంలో వెల్చేరు నారాయణరావుగారు ఇదే విషయం ప్రస్తావిస్తూ “మనకు ప్రస్తుతం కావలసినది మంచి వచనరచనలే. కవితలు వెయ్యడం మానెయ్యమని ఫలానా పత్రికవారితో అన్నాను” అని చెప్పారు.

  5. 5
    హెచ్చార్కె Says:

    చాల బాగుంది. వ్యాసం శ్రీశ్రీ అనే కవి గురించి. ‘మనకు తెలియని కొత్త విషయాలు కొన్నయినా తెలుసుకోడానికి’ శ్రీశ్రీ కవిత్వం ఉపయోగపడుతుందా? పడదు! దేర్‍ఫోర్, శ్రీశ్రీ వల్ల ‘ఉపయోగం’ లేదు. మరి ఈ వ్యాసం ఎందుకు రాసినట్లు? ఆయన ఒక్కడికీ మిహాయింపు ఇస్తారా? ఇస్తే, ఎందుకు ఇస్తారు? ఆయన మీ పక్కింటి వాడనా?
    శ్రీశ్రీ గురించి రాసిన వ్యాసమిది. ఇందులో, స్వయంగా వ్యాస రచయిత ‘కవిత్వం ఎందుకు, కూటికా కూరకా’ అన్న స్థాయిలో మాట్లాడతాడు. అద్భుతం! కవిత్వానికి మారక విలువ (ఎక్స్ఛేంజి వాల్యూ) ఎప్పుడూ లేదు. కవులు తమకు తెలిసిన ‘విద్య’తో పొట్టకూటి కోసం సినిమాలకు, పత్రికలకు పనిచేయడం వేరు. అదీ అరకొర ఆదాయ మార్గమే. కొకు నుంచి శ్రీశ్రీ మూడణాలు అడిగి తీసుకున్న ఉదంతమే సాక్షి. శ్రీశ్రీ, కొ.కు. రాత్రికి నాలుగు ఇడ్డెన్లు తిని నిద్రపోవడమే సాక్షి. మారక విలువే కాదు, కవిత్వానికి ఉపయోగవిలువ కూడా లేదని ఇప్పుడు కొత్త దేవుళ్ల ఉవాచ. ఈ అద్భుత సత్యాన్ని చాల ‘సైంటిఫిక్’ గా ఆలోచించి తెలుసుకుని ఉంటారు!
    కవిత్వాన్ని దగ్గరికి రానీయని పత్రికలు ఇప్పటికే ఉన్నాయి. ‘మారక విలువ’ల్ని బాగా వంట పట్టించుకున్న పత్రికలు కవిత్వం జోలికి రావు. ‘ ఈనాడు’ లేదూ? నారాయణ రావు గారు మరి కొన్ని పత్రికలకు కూడా అలాంటి సలహా ఇచ్చారా? ఇచ్చే ఉంటారు. ఆయన సిద్ధాంత గ్రంథం ‘కవితా విప్లవాల’ గురించి కదూ! ‘విప్లవాలు’ విఫలమయినట్లున్నాయి. ఎంత సమయం వృథా చేశారు పిచ్చి జనం ఆయన పుస్తకం చదవడానికి, దాన్ని చర్చించడానికి? అది వచనం ఎలా రాయాలో, వచనం మాత్రమే ఎందుకు రాయాలో చెప్పే పుస్తకమైతే కాదనుకుంటా?

  6. 6
    Rohiniprasad Says:

    నేను కవితలు ఎవరూ చదవకూడదని అనలేదే? వ్యాసాల ఉపయోగం గురించి చెప్పాను. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఆయన గురించి వ్యాసం రాయమంటే రాశాను. అది పనికిరాకపోతే సంపాదకులు నిరభ్యంతరంగా ఉపేక్షించవచ్చు. అలాగే కవిత ఏదైనా బావుందని సంపాదకులు భావిస్తేనే దాన్ని వేసుకుంటారు. నన్ను సలహా అడగరు.

    ఆవేశపడడం కూడా కవులకున్న అర్హతేమో నాకు తెలియదు. రవికిరణ్ అడిగేంతవరకూ నేను నా అభిప్రాయం కూడా రాయలేదు. వ్యాసరచయితలు అణిగిమణిగి పడుండాలి. కవి నిరంకుశుడంటారు. ఇందుకేనేమో :)

  7. 7
    హెచ్చార్కె Says:

    రోహిణి ప్రసాదు గారు,
    మీ వ్యాసం పనికి రానిదని నేను అనలేదు. మీ వ్యాసం చాల బాగుంది. గతంలో మీ వ్యాసాల పట్ల నా ఇష్టాన్ని కూడా దాచుకోలేదు. నేను ప్రాణహిత సంపాదకులలో ఒకడిని కాదు. అయివుంటే, ఈ వ్యాసాన్ని కళ్లకద్దుకుని ప్రచురించాలని అబిప్రాయపడే వాడిని. మీరు వ్యాసాల ఉపయోగం గురించి చెప్పారు. దానితో నాకు ఏకీభావమే. నేను కూడా వ్యాసాలు రాస్తుంటాను. కేవలం కవితా ప్రక్రియకు ‘నిబద్ధుడను’ కాను. మీరు బిజీగా ఉండి చూసి ఉండరు. చూసినా మీకు నచ్చకపోయి వుండొచ్చు. ఇటేవలి ప్రాణహితలో శ్రీశ్రీ కవిత్వం మీద వ్యాసం రాశాను.
    మీరు వ్యాసాల ఆవశ్యకతను ఉగ్గడించడంతో ఆగలేదు. “ప్రస్తుతకాలంలో కవితలకన్నా information (particularly basic scientific facts) అందజేసే వ్యాసాలే తెలుగువారికి అవసరమని నా నమ్మకం.”, “ఒక కవి ఏదో సంఘటన గురించి ఎలా స్పందించాడో తెలుసుకోవడం కన్నా మనకు తెలియని కొత్త విషయాలు కొన్నయినా తెలుసుకోవడం ముఖ్యమని నేననుకుంటాను.” అన్నారు. ఈ అనవసర తులనాత్మక పరిశీలనతో ఆగలేదు మీరు. “మనకు ప్రస్తుతం కావలసినది మంచి వచనరచనలే. కవితలు వెయ్యడం మానెయ్యమని ఫలానా పత్రికవారితో అన్నాను” అని నారాయణ రావు గారు అన్నారని మీ వ్యాఖ్యను ముగించారు. ఆయన అలా అని ఉండరని ఆశ. అని ఉంటే, తప్పే. ఆ మాట వారి “కవితా విప్లవాల స్వరూపా’నికి నమస్కార బాణం పడేసి మరీ చెప్పాను. నమస్కారమైనా, బాణం కదా, కొంచెం పదునుగా ఉందంతే.
    అసలు మీ వ్యాసమే ఒక కవి గురించి. నాకు ప్రాతఃస్మరణీయుడైన కవి గురించి. ఆయన నాకు పూజ్యడైంది వ్యక్తిగా కాదు. అవసరమై, మూడణాలు అడిగినందుకు కాదు. ఆకలేసి ఇడ్డెన్లు తిని నిద్దరోయినందుకు కాదు. అవన్నీ తెలుసుకోవలసిన విషయాలే. అవి చెప్పినందుకు మీకు కృతజ్ఙతలు. ఆయన నాకు పూజ్యుడయ్యింది మాత్రం ఆయన రాసిన కవిత్వం వల్లనే. వచనం కూడా చాల గొప్పగా రాశారు గాని, ప్రధానంగా ఆయన కవి. అలాంటి కవి గురించి రాసిన వ్యాసం మీద చర్చలో, అసందర్భంగా, వచనం ఆవశ్యకతను ముందుకు తెచ్చి, కవిత్వం కంటె వచనం ‘ముఖ్యమ’నడం, ఒకసారి అనడం కాదు, పదే పదే అనడం ఏ అర్థాన్నిస్తుందో విజ్ఙులు ఆలోచించాలి.
    ప్రాణహిత సంచికలో కవితలు చూడమంటూ రాసిన ఒక వాక్యం మినహా, కవిత్వం గురించి భూషణ్ చేసిన వ్యాఖ్యానంతోనూ నాకు పూర్తి ఏకీభావమే. రాస్తున్నది… కవిత, కథ, వ్యాసం ఏ ప్రక్రియలో నప్పుతుందో చూసుకోవాలన్న సలహా చాల మంచిది. సందర్భం వచ్చింది గనుక, నేను ఇటీవల చాల ఇష్టంగా చదివిన భూషణ్ పుస్తకాన్నే ప్రస్తావిస్తాను. ఆయన ‘చెల్లెలి గీతాలు’. వాటిని అవే వాక్యాలతో, వచనంగానే రాయొచ్చు. ‘మెమాయిర్స్’ గా రాయొచ్చు. పాదాలు విడదీసి రాయడం వల్ల అదనంగా వచ్చిందేమీ లేదు. వచనంగా రాయాల్సిన దాన్ని కవిత్వంలా రాయాల్సిన అవసరం లేదు. పాదాలు విడదీస్తే కవిత్వం అయ్యేట్లయితే, ఆయన పరిగెట్టే వాక్యాల ‘సముద్రం’ కథల్లో చాల పేరాలను అలా చేసి అచ్చేయవచ్చు. ఈ మాట ఆయనకే కాదు, కొన్ని నా కవితలకు, కొండొకచో నా వచనానికి వర్తించవచ్చు.
    చివరగా, ‘వ్యాసరచయితలు అణిగిమణిగి పడుండాలి’ అనేది నా ఉద్దేశమైనట్లు రాశారు మీరు. చాల పెద్ద మాట సార్. దాదాపుగా దూషణ. ఎవర్ని ఎవరు కోప్పడుతున్నారు? ఎవరు ఆత్మ రక్షణలో భాగంగా మాట్లాడుతున్నారు? నేను కూడా వ్యాసాలు రాస్తుంటాను సార్. ‘వ్యాసరచయితల’ను అలా అనడమంటే నన్ను నేను అనుకోడం కూడా అవుతుంది.
    “కవి నిరంకుశుడంటారు. ఇందుకేనేమో” అని మీరు ఆశ్చర్యపోయారు. అలా ఎందుకంటారో నాకు తెలియదు గాని, ఇందుకు మాత్రం కాదు. వ్యాసం లాగే, కథ లాగే కవిత్వం కూడా ముఖ్యమేనని అన్నందుకు కాదు. పత్రికలు కవిత్వాన్ని అచ్చేయగూడదని అంటే, అది విని బాధ పడినందుకు కూడా కాదు కవిని నిరంకుశుడన్నది. ఆ మాటకు కారణాలు… బహుశా, అది పూర్తిగా వేరే విషయం. నమస్కారం.

  8. 8
    Rohiniprasad Says:

    నేను సర్వజ్ఞుణ్ణి కాను. జీవితమంతా ప్రవాసాంధ్రుడుగానే గడిపినవాణ్ణి. మద్రాసులో పుట్టిపెరిగినప్పటికీ చందమామవంటి పత్రికలూ, పుస్తకాలూ చదివి తెలుగు నేర్చుకున్నవాణ్ణి. నాకు తెలిసిన భాషలో, నాకు తెలిసినంతమేరకు నాకు విపరీతంగా ఆసక్తి కలిగించిన విషయాల గురించి సీదాసాదా వ్యాసాలు రాస్తున్నవాణ్ణి. అవి బావున్నాయని ఎవరికైనా అనిపిస్తే నాకు సంతోషమే.

    ఒక వయసు దాటాక కాల్పనిక సాహిత్యం మీద మోజు తగ్గడం సామాన్యమేనని విన్నాను. నాదీ అదే పరిస్థితేమో. ఇటీవలే అరుంధతీ రాయ్ రాసిన Walking with the Comrades అనే వ్యాసం అందింది. ఎవరెన్ని చెప్పినప్పటికీ ఇలాంటి సమస్యల గురించిన ఇలాంటి వ్యాసాలు చదవడమే నాకిష్టం. వీటి గురించి వందల కొద్దీ కవితలున్నా నాకవి అంతగా రుచించవు.

    నేను నా అభిప్రాయమే రాయగలను కాని పీఠాధిపతిలాగా, మౌల్వీలాగా ఫత్వాలు జారీ చెయ్యలేను కదా. మీలాంటివారు అన్ని రకాల ప్రక్రియల్లోనూ కృషి చెయ్యడం గొప్ప విషయమే. వాటిలో ఎవరికి కావలసినది వారు ఎన్నుకుంటారు.

    వెల్చేరువారిని నేనేమీ misquote చెయ్యలేదు. కావాలంటే ఆయన్నే అడిగి తెలుసుకోవచ్చు. మీ వ్యాఖ్యలవల్ల నాకు కోపమేమీ రాలేదు. ఎవరి ధోరణి వారిది.

  9. 9
    తమ్మినేని యదుకుల భూషణ్ Says:

    ఇటీవల హెచ్చార్కె గారు అనేక విషయాలు కలగాపులగం చేసి గందరగోళం
    సృష్టిస్తున్నారు అనిపిస్తుంది.పశ్చాత్ ,అధిక వివరణలోకి దిగుతున్నారు.
    ఒక విషయాన్నిసమగ్రంగా తెలుసుకోవాలి.తర్వాత ,అభిప్రాయ ప్రకటన,
    విచార విమర్శ ;హెచ్చార్కె గారు ఈ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి.
    లేదంటే మొదలు ‘గందరగోళం’ తర్వాత ‘అధిక వివరణ’ అలవాటుగా మారే
    ప్రమాదం ఉంది. రోహిణీ ప్రసాద్ గారు ,నేను ప్రస్తుత కవితల మీద వ్యక్తం చేసిన
    అభిప్రాయం ఇప్పటికీ హెచ్చార్కె గారికి అర్థం కాలేదు ( అయన సమాధానం
    బట్టి చూస్తే). గతంలో రోహిణీ ప్రసాద్ గారు ప్రాణహిత చర్చావేదికలోఒక
    విలువైన అభిప్రాయం వ్యక్తం చేసి ఉన్నారు. విషయాన్ని తేట పరచడానికి
    అది ఇక్కడ అక్కరకొస్తుంది అని పూర్తి పాఠం ఉటంకిస్తున్నాను.

    ” తెలుగు పత్రికలూ, వెబ్ పత్రికలూ అన్నిటిలోనూ అనేక కవితలు ప్రచురిస్తూ
    ఉంటాయి. దేన్ని చూసినా, ఏ సంఘటన జరిగినా ఏదో రకంగా స్పందించడం , దాన్ని
    గురించి రాసెయ్యడం కవుల లక్షణం అనుకుంటాను. దాన్ని చదివిన నలుగురూ ఎవరికి
    అర్థమైనట్టు వారు వివరణలివ్వడం, చర్చించడం పరిపాటి. వ్యాస, కథారచయితలకు
    స్పష్టత గురించీ, తమ అభిప్రాయాలను సరిగా వ్యక్తం చెయ్యడం గురించీ ఉన్నంత
    బాధ్యత కవులకు ఉండదనిపిస్తుంది. నిజంగా గొప్పదైన కవితకు దివిటీ పట్టనవసరం
    ఉండదు. తక్కినవాటి విషయంలోనే చిక్కులన్నీ. అసలు ఇన్ని కవితలు అవసరమా?
    వాటి సాహిత్యప్రయోజనం ఎటువంటిది? వీటిలో చాలామటుకు ఒకసారి చదివి
    మరిచిపొయేవేనా, నాలుగు కాలాలపాటు నిలిచేవి ఏవైన ఉంటాయా? నాకన్నా బాగా
    తెలిసినవారు చర్చించవలసిన విషయం ఇది. ”

    ఇక చెల్లెలి గీతాలు ,సముద్రం పుస్తకాల విషయాని కొస్తే :

    హెచ్చార్కె గారికి కథ కు ,కథన కవితకు (narrative poem) సరిగ్గా తేడా తెలియక
    పోవడం వల్ల వచ్చిన గందరగోళం పశ్చాత్- అధిక వివరణ అని నా అభిప్రాయం !!

    కవులు స్పందన కన్నా ఆలోచనకు ఎక్కువ విలువిస్తే ( కనీసం వచనం రాసేటప్పుడు)
    ఇంత గొడవ ఉండదనిపిస్తుంది.

    తమ్మినేని యదుకుల భూషణ్

  10. 10
    హెచ్చార్కె Says:

    సారీ, భూషణ్‍, చర్చలో అవతలి వారికి ఫలానాది ‘తెలియదు’ అని నిరంకుశంగా ప్రకటించడం అప్రజాస్వామికం. కవిత్వంలో కథన, వర్ణణాత్మక, సంభాషణాత్మక శైలీ విశేషాల్ని వాడుకోవచ్చని నాకు తెలుసు.
    రోహిణి ప్రసాదు గారు స్వయంగానూ, మీ పునరుటంకింపు ద్వారానూ పలు విధాలుగా వివరణ ఇచ్చినా, రకరకాలుగా కోప్పడినా; కవిత్వం కన్న వ్యాసం ఎక్కువ అవసరం/ముఖ్యం అనే (తులనాత్మక) ప్రకటనతో ఏకీభవించను. చెత్త వ్యాసాలు, చెత్త కథలు బాగానే వస్తున్నాయి, వాటిని చూపించి వాటి కన్న కవిత్వం మేలని ఎవరూ అనరు. అలాగే: చెత్త కవిత్వం బాగానే వస్తోంది, దాన్ని చూపించి వ్యాసం మేలనడం హేతు విరుద్ధం.
    మీరు చెప్పింది వేరు. కవిత్వం పేరిట చెత్త రాస్తున్నారు, వీరి నుంచి కవిత్వాన్ని కాపాడాలి.. అని మీ మాటలను అర్థం చేసుకున్నాను. అందుకే మీ మాటలతో ఏకీభవించాను. అది ఉండాల్సిన కోపమే, మన మీద మనక్కూడా.

  11. 11
    చాకి రేవు ఉపేంద్ర Says:

    హెచ్చర్కే గారూ !

    భూషణ్ గారూ , రోహిణీ ప్రసాద్ గారూ చాలా పెద్ద మాటలే అనేశారు. మీరు వాటిని వదిలి పెట్టి చిన్న మాటలకే బాధ పడుతున్నారు. ఇద్దరూ ఒక మాట నిర్మొహమాటంగా చెప్తున్నారు. ఈనాటి తెలుగు సాహితీ పరుల్లో చాలా మందికి స్పష్టంగా ఆలోచింకడం రాదు – అట్లా ఆలోచించడం రాక పోతే కవిత్వమూ వచనమూ రెండూ వ్రాయటం సాధ్యం కాదు. కాకపోతే స్పష్టత లేమి వచనంలో తేలికగా బయట పడిపోతుంది. ఈ బలహీనతనకి కవిత్వం అని పేరు పెట్టి స్పందన అనో అనుభూతి అనో సామాజిక స్పృహ అనో దిబ్బా దిరుగిండం భావావేశం అనో ముసుగేసి దాచి పెడితే మామూలు చదువరులు ఏమీ అనలేక భరిస్తారు.

    అందు వలన సంపాదకులు చొరవ తీసుకుని స్పష్టంగా ఆలోచింకటం ఎట్లాగో రచయితలకి నేర్పాలి. నేర్పడం చేత గాక పోతేనో, వీలవక పోతేనో , కనీసం కవిత్వంతో నింపడానికి పేజీలూ అచ్చువేయడానికి ఇంకూ పుష్కలంగా ఉన్నాయి. వ్రాసి పారేయ్యండి అని తలుపులు తెరిచి కూ కందా ఉంటే వచనంలో వ్రాయక తప్పక పోయినప్పుడు – భావావేశం ముసుగులో దాక్కునే అవకాశం లేక పోయినప్పుడు తప్పని సరైన పరిస్థితుల్లో కొంచెం స్పష్టంగా ఆలోచించడం నేర్చుకుంటారేమో చూడవచ్చును. ఇదీ స్థూలంగా వాళ్ళు చెప్తున్నది.

    తెలుగులో ఒక ఆరు దిన పత్రికలు ఒక్కొక్కటీ వారానికి రెండు చొప్పున కవితలు అచ్చు వేసినా ఏడాదికి అయిదు వందల పైచిలుకు అవుతాయి. చిన్నా చితకా పత్రికలూ, స్వంత ప్రచురణలూ, సంకలనాలూ, వెబ్బు పత్రికలూ అన్నీ కలిపి ఇంకో అయిదు వందలు వేసుకుంటే ఏడాదికి వెయ్యి కవితలు. దాదాపుగా అదే సంఖ్యలో కధలూ, అచ్చవుతున్నాయి. సాహితీ పరులు దాని గురించీ దీని గురించీ వ్రాసే వ్యాసాలు మరొక వెయ్యి అనుకోండి. 10 కోట్ల జనాభాకి ఇది చాలా తక్కువే ననిపించొచ్చు కానీ, ఈ వ్రాసే వాళ్ళ బంధు మిత్రాదుల అభిమానాలని పక్కన బెడితే , ఇందులో తలోక పదైనా గట్టిగా నిలబడగలిగె సరుకుంటుందా ?

    సంపాదకులు సాహిత్యం పట్ల ఏ రకంగానూ బాధ్యత లేకుండా వున్నప్పుడు – ఇందులో ఒక నాలుగైదు వందల కవితలూ, కధలూ, వ్యాసాలూ ప్రచురించక పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు అని ఎవరైనా అంటే అందులో పొరపాటేమిటీ ? ఎంత ఎక్కువ అచ్చాయితే అందులోంచి అన్నీ ఎక్కువ మంచి కవితలు వచ్చే అవకాశం ఉంటుందని మీరు నమ్ముతున్నారా ?

    తెలుగు రచయితలు సాహితీ పరులకి స్పష్టంగా ఆలోచించడం రావడం లేదు. ఆ నిజాన్ని కప్పి పుచ్చుకోవడానికి కవిత్వాలు వ్రాస్తున్నారు. సంపాదకులు బాధ్యతా రహితంగా ఉంటున్నారు. ఎవరో ఒకరు చక్కగా స్పష్టంగా ఆలోచించడం , నేర్పాల్సిన అవసరం ఉంది. పులి పంజా విసిరింది అక్కడ. మీరేమో ప్రస్తుత పరిస్థితుల్లొ కవిత్వం కన్నా వచనం మేలు అన్న దగ్గర దాని తోకని చూసి ఉద్రెక పదుతున్నారు.

  12. 12
    Rohiniprasad Says:

    కవులెవరికీ ఆలోచనల్లో స్పష్టత లేదనడం కటువైన మాట. నేనన్నది ఈనాటి పాఠకులకి విషయపరిజ్ఞానమ్ ఎక్కువ అవసరం అనే సంగతి. జీవితంలోని సమస్యలను అర్థంచేసుకోవడానికి వ్యాసాలు ఎక్కువగా పనికొస్తాయని నా అనుమానం.
    స్పష్టత లేకపోవడమే గొప్ప కవిత యొక్క లక్షణమనీ, ఒక్కొక్క పంక్తికీ ఎవరికి తోచిన అర్థం వారు వెతుక్కోవచ్చనీ కొందరు చాలా స్పష్టంగా చెప్పారు కూడా. స్పష్టత లేని వ్యాసమైనా పనికొచ్చేదని అనలేము.
    నేను ఉపయోగం అనగానే అదంతా కమర్షియల్ ధోరణి అని తేల్చేశారు. నేను పాఠకుల పక్షాన చెప్పిన విషయమది. అది సరికాదనుకుంటే ఈ చర్చ ముగించడం మంచిది.

  13. 13
    హెచ్చార్కె Says:

    అయ్యా, ఉపేంద్ర గారూ, వారి అభిప్రాయాల్ని నేను బాగానే గ్రహించాను. చెత్త కవిత్వం మీద చాకిరేవు పెడితే నాకేమీ అభ్యంతరం లేదు, అది ఆహ్వానించదగినది అని కూడా చెప్పాను. అందువల్ల మీ సుదీర్ఘ తోక-వాద వివరణ పూర్తిగా అనవసరం. నాకు వర్తించదు.
    చెత్త కవిత్వం మీద చర్చేదో దానికి తగిన సందర్భంలో పెడితేనే స్వారస్యం. అసందర్భంగా మాట్లాడితే, ఆ మాటలు మొత్తంగా కవిత్వా‍నికి వర్తిస్తాయి. శ్రీశ్రీ మీద వ్యాసం చర్చలో అది అసందర్భం, అనుచితం.
    లక్ష చెత్త కవితలు వచ్చినా ఫరవా లేదు. ఒక మంచి కవిత రాకుండా పోయే ప్రమాదం ఉండకూడదు. ఏది చెత్త కవిత్వమో ఏది మంచి కవిత్వమో నిర్ణయించడం కష్టం కాబట్టి నేను అలా అభిప్రాయపడుతున్నాను. మహా ప్రస్థానం తరువాత శ్రీశ్రీ కవిత్వం దసరా పద్యాలని ఇస్మాయిల్ గారు అన్నారట. అది సత్యం కాదు గదా? ఆ మాట అన్నది ఇస్మాయిల్ వంటి మంచి కవి/విమర్శకుడాయె? మీరూ, మరొకరూ కవిత్వం నాణ్యతపై ఇచ్చే తీర్పుల వల్ల మంచి కవిత్వం మీద దసరా పద్యాల ముద్ర పడకుండా కాపాడేది ఎవరు? ఎలా?
    మొత్తం మీద, ఏది నిజం కవిత్వమో ఏది కాదో నిర్ణయించడానికి మీ దగ్గర నిఖార్సైన గీటురాళ్లు ఉన్నట్టున్నాయి. వాటిని నిర్దాక్షిణ్యంగా‍ ఉపయోగించండి. మీరు కవిత్వం రాస్తున్నట్లయితే, అదే గీటు రాళ్లను, మరి కొన్నిటిని ఇతర్లు కూడా నిర్దాక్షిణ్యంగా ఉపయోగిస్తారు. చివరికిది కొళాయి కాడ కొట్లాటగా మారకుండా చూసుకుంటే చాలు. చర్చకు స్థలం/సందర్భం వుండాలనడం అందుకే.
    సర్, రోహిణి ప్రసాదు గారూ, నేను అనని, ఉద్దేశించని అభిప్రాయాలు నాకు ఆపాదిస్తున్నారు మీరు. మీ మాటల్లో ఇప్పటికి చివరిది “నేను ఉపయోగం అనగానే అదంతా కమర్షియల్ ధోరణి అని తేల్చేశారు” అనే వాక్యం. నేనలా అనలేదు. మితృలు ‘పశ్చాత్ అధిక వివరణ’ అంటారేమోనని వివరించడం లేదు.

  14. 14
    చాకి రేవు ఉపేంద్ర Says:

    హెచ్చార్కే గారూ, మీరు అట్లా అన్వయించుకోవటానికి కారణమేమిటో నాకు తెలియదు కానీ , రోహిణీ ప్రసాద్ గారన్న మాటలు కానీ భూషణ్ గారన్న మాటలు కానీ మొత్తం కవిత్వాన్నీ , కవులనీ – కనీసం కొంత మంది కవులనీ ఉద్దేశించినట్లు నాకయితే అర్ధం కాలేదు. తెలుగు సమాజంలో అయోమయం అజ్ఞానం ఒక ధోరణిగా ప్రబలి ఉన్నదా లేదా అన్నది ప్రశ్న. ఉంటే ఆ అయోమయానికీ ఆజ్ఞానానికీ సాహిత్య రంగంలో వచ్చిన వస్తున్న మార్పులకి సంబంధం ఏమన్నా ఉందా అన్నది ప్రశ్న. ఉంటే దానికి విరిగుడుగా ఏమీ చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఎట్లా చేయాలి అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నలు వదిలిపెట్టి – లక్ష చెత్త కవితలు వచ్చినా పరవా లేదు, ఒక మంచి కవిత మీద చెత్త అన్న ముద్ర వేసెయ్యకుండా కాపాడడం మీ కర్తవ్యం అనుకుంటున్నారు.

    సరే అదే చూద్దాము.
    మహా ప్రస్థానం తరువాత శ్రీ శ్రీ కవిత్వం దసరా పద్యాలు అని ఇస్మాయిల్ ఒక మాట అనేసి ఊరుకోలేదు. దానికి ఒక వివరణ ఇచ్చాడు. ఆధునిక కవి అన్న వాడు, అంతరంగానికీ బాహ్య ప్రపంచానికి మధ్యన సరిహద్దు ఘర్షణలోనించి కవిత్వాన్ని పుట్టింఛాలి – మహా ప్రస్థానం తరువాత శ్రీ శ్రీ కవిత్వంలో టెక్నిక్ మీద దృష్టి పెట్టారు, అంతరంగాన్ని విస్మరించి తనకు కావలసిన సరుకు ని పూర్తిగా బాహ్య ప్రపంచం లోనించే తెచ్చుకున్నారు. మనకి అంతగా ఉపయోగ పడని కాంటినెంటల్ కవులనించి అధివాస్తవిక తని అక్కడక్కడా నేరుగా దిగుమతి చేశారు, అదికూడా ఒక పద్ధతిగా స్వంతం చేసుకోలేదు. కానీ అదే సమయంలో ప్రపంచంలో వస్తున్న ఇతర కవితా ధోరణులనించి ఆయన ఏమీ నేర్చుకున్నట్లు కనపడదు. ఇందు వలన కవిగా వ్యక్తిగా శ్రీ శ్రీ, నష్ట పోవటమే కాక సమాజానికి కవిగా ఆయన చేయగలిగినంత మేలు కూడా చేయలేక పోయాడు . ఇది ఇస్మాయిల్ మాటల సారాంశం.

    మీరు దసరా పద్యాలు అన్న ఒక్క ముక్కనీ పట్టుకుని అది నిజం కాదు అంటే ఎట్లా కుదురుతుంది ? శ్రీ శ్రీ అంతరంగాన్ని విస్మరించారు అన్నది నిజం కాదు అని చూపించండి లేదా ఆదునిక కవి అంతరంగానికీ బాహ్య ప్రపంచానికీ మధ్యన సరిహద్దు దగ్గర పని చేయాలి అన్న ప్రతిపాదన పనికి మాలినది అని చూపించండి. లేదా ప్రపంచంలోని ఏ కవితా ధోరణులతో ఆయన ఎట్లా సంభాషించారూ, ఆ సంభాషణలు తెలుగు సమాజానికి ఎట్లా ఉపయోగ పడ్డాయీ చూపించండి.

    శ్రీ శ్రీ మీద మీ వ్యాసం చూసాను. అందులో మీరు ఇస్మాయిల్ పెట్టిన విమర్శకి జవాబు చెప్పినట్టు కనపడలేదు. వీలు వెంబడి మళ్ళీ చదివి చూస్తాను.

  15. 15
    హెచ్చార్కె Says:

    “తెలుగు సమాజంలో అయోమయం అజ్ఞానం ఒక ధోరణిగా ప్రబలి ఉన్నదా లేదా” అని మీప్రశ్న. ‘ఒక ధోరణిగా ప్రబలి లేదు’ అని నా జవాబు. స్పష్టత-అయోమయం, జ్ఙానం-అజ్ఙానం ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు మౌలికమైన తేడా ఏమీ లేదు. అంతే కాదు, ఇప్పుడు ‘మీ’కు నాకు మధ్య జరుగుతున్న తరహా చర్చ ఏదో ఒక రూపంలో ప్రతి యుగంలో జరుగుతూనే ఉంది. ఏ భాషలో సాహిత్య చరిత్రను వస్తుగత దృష్టితో చూసినా ఈ వాస్తవం తేటతెల్లమవుతుందని భావిస్తాను.
    “మహా ప్రస్థానం తరువాత శ్రీ శ్రీ కవిత్వంలో టెక్నిక్ మీద దృష్టి పెట్టారు, అంతరంగాన్ని విస్మరించి తనకు కావలసిన సరుకు ని పూర్తిగా బాహ్య ప్రపంచం లోనించే తెచ్చుకున్నారు.” అన్నారు మీరు. ఇది ఆలోచన లేని, తగిన పరిశీలన లేని ప్రకటన.
    శ్రీశ్రీ లోపాలు లేవని వాదించడం లేదు. మిగిలిన వాళ్లలోనూ, ఇక ముందు వచ్చే వాళ్లలోనూ ఉండే, ఉంటానికి వీలుండే లోపాలే ఉన్నాయి. నథింగ్ ఎక్సెప్షనల్‍. అందువల్ల ఎంత ‘సారాం’శంలోనైనా దసరా పద్యాలు అనడం తప్పే. జనరల్‍గా కవుల మధ్య ఉండే రాగద్వేషాల ప్రతఫలనంగానే ఇస్మాయిల్‍ గారి మాటల్ని నేను తీసుకుంటాను. ఇది స్థలం కాదు కాబట్టి వివరాల్లోకి పోవడం లేదు.
    మీరు పేర్కొన్న అంశం కోసమైతే నా వ్యాసం మరోసారి చూసే శ్రమ అవసరం లేదు. అందులో ఇలాంటివి లేవు.
    చివరగా ఒక మాట: అయోమయాలు, అజ్ఙానాల నుంచి మిమ్మల్ని మీరు (లేదా నన్ను నేను) వేరు చేసేసుకోడం వాస్తవికం కాదు. ప్రయోజనకరమూ కాదు. ‘నాకు తెలుసు, నాకు తెలీదు; మీకు తెలుసు, మీకు తెలీదు’ అన్న వైఖరి ఉన్నప్పుడే చర్చ ఉంటుంది. ఇది ఎటువైపు బెసికినా… పాఠం చెప్పడం, పాఠం వినడం, బానిసత్వ, నిరంకుశత్వం… ఏదో ఒకటి అవుతాయని నా అభిప్రాయం.
    నా మేరకు ఈ చర్చ ఇంతటితో ముగిసింది.

  16. 16
    తమ్మినేని యదుకుల భూషణ్ Says:

    హెచ్చార్కే గారి అభిప్రాయాలు ఎన్నిసార్లు చదివినా వాటిలో ఆవేశం పాలు
    ఎక్కువగా కనిపిస్తోంది. నిలకడగా ఒక ఆలోచన కనిపించడం లేదు. మనల్ని
    మనం దాటే ప్రయత్నం చేయక పోతే ఆలోచన లేదా కవిత్వం పుట్టదు.దానికి
    సాధన కావలసిందే. అంతేగాక ,దానికి స్వభావ పరంగా కొంత నిర్లిప్తత అవసరం.
    ఇవి కొరవడితే నేను అన్న భావన ( లేదా అసలు అర్థంలో అహంకారం ) బలపడి
    ఇతరులు చెప్పేది అర్థం కాదు. ఇది మరింత బలపడితే ఒక మావో ,స్టాలిన్ లా
    మారిపోయి చిటికెలో మారణహోమం సృష్టిస్తాడు మానవుడు.
    ఉపేంద్ర లాంటి జిజ్ఞాసువులు -లేవనెత్తిన అంశానికి గల విస్తృతిని అర్థం చేసుకొని
    విషయాన్ని తేటబరచడం ఎంతో ఆనందం కలిగించే సంగతి . ఇప్పటి కయినా
    అర్థం కావలసినది : చర్చ మన కవిత్వం గురించి మన తోటి కవుల కవిత్వం
    గురించి వాటి బాగోగుల గురించి కాదు. అది సహజంగా “త్వం శుంఠ– త్వం
    శుంఠ” — త్వమేవాహంతో అంతమవుతుంది .కస్త్వం ? కోऽహం ? లాంటి ప్రశ్నలకు
    అక్కడ స్థానం లేదు. ఇక,శ్రీ శ్రీ ప్రధానంగా ముప్ఫైల కవి ;తర్వాత అర్ధ శతాబ్దం బ్రతికినా మనం అతన్ని గుర్తుంచుకోనేది ఆ ముప్పైల్లో ముప్పిరిగొన్న కవిత్వాన్నే. మరిన్ని వివరాలకు : http://pustakam.net/?p=3222

    తమ్మినేని యదుకుల భూషణ్

  17. 17
    తమ్మినేని యదుకుల భూషణ్ Says:

    స వ ర ణ
    “తర్వాత అర్ధ శతాబ్దం బ్రతికినా మనం అతన్ని గుర్తుంచుకోనేది ఆ ముప్పైల్లో ముప్పిరిగొన్న కవిత్వాన్నే. ” అన్న వాక్యాన్ని ఇలా చదువుకొనగలరు.

    “తర్వాత అర్ధ శతాబ్దం బ్రతికినా మనం గుర్తుంచుకోనేది ఆ ముప్పైల్లో ముప్పిరిగొన్న
    అతని కవిత్వాన్నే”

  18. 18
    హెచ్చార్కె Says:

    ఆ చర్చ ముగిసింది. ఇది సొంత గొడవ.
    ‘శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్‍ మాస్టరు గారికి ప్రణామములు. నా వ్యక్తిత్వం మీద మీ పరిశీలన నన్ను గొప్ప విద్యావంతుడిని చేసింది. ఎస్సెస్సెల్సి రిజస్టరు, కాండక్టు సర్టిఫికెట్లో మా రమణ మూర్తి సారు రాసిన దాని కన్న మీ కితాబు గొప్పగా ఉంది. మీ ఆలోచనను నా ఆలోచనగా చేసుకుంటే తప్ప మీకు నా ఆలోచనలో నిలకడ కనిపించే అవకాశం లేదు. నాలో ‘నేను అనే బావన’ అంటే, ‘అహంకారం’ నశించదు. నేను మీరైపోవడానికి ప్రయత్నిస్తాను. దానికి చాల సాధన కావాలన్నారు. నా యోపిన కొలది ప్రయత్నిస్తాను. మావో, స్టాలిన్ లు చిటికెలో సృష్టించిన మారణ హోమాల గురించి నాకు ఇంత వరకు తెలియదు. చరిత్ర చదువుకుని తెలుసుకోడానికి ప్రయత్నిస్తాను. మీ మాటలను తేట తెల్ల చేయడం ద్వారా మీకు అమందానందం కలిగించిన ఉపేంద్ర గారి వంటి జిజ్ఙాసువుల అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తాను. నేను కోహం దగ్గరే కొట్టుకుంటున్నాను. కస్త్వం దాకా ఎందుకు లెండి. మీ ఆలోచను నాదిగా చేసుకుంటే, ఆ తరువాత, త్వమేవాహం అవసరమే ఉండదు. అలాగే, చర్చ మన/తోటి కవుల గురించి కాదనడానికీ నా కో హం కవితను అన్యాపదేశంగా ప్రస్తావించడానికి మధ్య వైరుధ్యం ఏమీ లేదని కూడా గ్రహిస్తాను. చివరాఖరుగా, ముప్పైల తరువాత ముప్పిరి గొన్న శ్రీశ్రీ కవిత్వాన్ని కూడా అదే రీతిలో గుర్తుంచుకోడం అనే మహా పాపం నుంచి విముక్తుడిని కావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఉంటాన్సార్.’

  19. 19
    రవికిరణ్ తిమ్మిరెడ్డి Says:

    రోహిణీ ప్రసాదు గారు,

    మీరు కర్రిరగకుండా, పావు చావకుండా, గోపీలా జవాబివ్వటం అసలేవీబాగా లేదు.
    హెచార్కేగారు, ఎందుకీ ఖంఠ శోష, మీకు ఎడమేదో, కుడేదో ఇంకా తెలీలేదా!

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  20. 20
    sagar Says:

    భూషణ్ గారూ

    మారణహోమం వియత్నాంలోనా, ఇరాక్ లోనా, లేక క్యూబా, లాటిన్ అమెరికా దేశాలలోనా.. దయచేసి చెప్పండి. అలాగే మంచి సాహిత్యంమంటే కమ్యూనిస్టు వ్యతిరేకత మాత్రమేనా.. అది కూడా సెలవీయండి. కొద్దిసంవత్సరాలుగా మీరు కర్రపుచ్చుకున్న మాస్టారిలా సాహిత్యపాఠాలు చెప్పబోతున్నారు. (ఈ ప్రజస్వామ్యదేశంలో లాఠీ పట్టుకున్న డి.యస్పీలాగన్నమాట ) మీరు అందరికీ అపాదిస్తున్న సూత్రాలు మీకు కూడా వర్తిస్తాయన్నది మరచిపోకండి.

  21. 21
    చాకి రేవు ఉపేంద్ర Says:

    ఇందులో మీ స్వంత గొడవ ఇంత ఉన్నదని ముందే తెలుసుకుని ఉంటే నేను కలుగ జేసుకుని ఉండే వాడిని కాదు. saareeసారీ !!

    ఇక పోతే నాకూ మీకూ మధ్యన జరుగున్న చర్చ ప్రతి యుగంలోనూ జరుగుతూనే ఉంటుంది అని మీరు వస్తుగత దృష్టిలో వ్రాసింది చదువుతూంటే నాకు నేపథ్యంలో ఘంటసాల గారి గొంతులో సంభవామి యుగే యుగే అని వినిపించింది. వస్తుగత దృష్టిని , గీతా సారాన్ని పాలూ చక్కెర లాగా కలిపి వేసారు.

    నా అడుగు జాడలు అనుసరిస్తానని మీరు భూషణ్ గారికి ఇచ్చిన మాట ఉత్తీదే అని ఆశిస్తాను. నేను మడి కట్టుకున్న వామ పక్షీయులు మెసలే చోట అగ్రహారాల పరిసరాల్లో పంచముల తీరుగా అడుగు జాడలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఒక వేళ వాటిని మీరు వెతికి పట్టుకున్నా అవి మీకు దుఖ దాయకాలే అవుతాయి.
    సెలవు !!

  22. 22
    చాకి రేవు ఉపేంద్ర Says:

    జస్ట్ ఫర్ ద రెకార్డ్ ,

    ఇస్మాయిల్ వివరణ ఇదీ, అని నేను స్పష్టంగా వ్రాస్తే, , దాన్ని నా అభిప్ర్రాయ ప్రకటనగా మార్చుకుని హెచ్చార్కే గారు జవాబిచ్చారు. నా అభిప్రాయం, ఇస్మాయిల్ వివరణని నేరుగా ఎదుర్కో వటం మంచిది అని. (అట్లా ఎదుర్కుని కొత్త సత్యాలని ఆవిష్కరించిన రచయితలు తెలుగు లో లేక పోలేదు). అంతకు మించి ఏమైనా చెప్పదల్చుకుంటే నేనే చెప్పే వాడిని. హెచ్చార్కే గారి అజాగ్రత్త వలన ఆయనే కాదు ఆ పైన చదివే వాళ్ళందరూ కూడా డొంక దారిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వ్రాయ వలసి వచ్చింది.

  23. 23
    హెచ్చార్కె Says:

    ఉపేంద్ర గారూ, ఇందులో నా సొంత గొడవ ఉందని, అప్పటి వరకు, నాక్కూడా తెలియదు. భూషణ్‍, విషయాన్ని వదిలేసి, నా వ్యక్తిత్వ విశ్లేషణకు దిగిన తరువాతే తెలిసింది. ఆయన అలా రాయడం మీకు బాగానే ఉందని ఇప్పటి మాటలతో అర్థమయింది. ఇక మీ ఇతర వ్యాఖ్యలు… వాటిపై నా మేరకు చర్చ ముగిసిందని, ఇంతకు ముందే, చెప్పేశాను. గుడ్ బై.

  24. 24
    Rohiniprasad Says:

    రవికిరణ్ గారూ,
    నా కర్థం కానివి ఏవో చెప్పారు. కర్ర, పాము, గోపీ.
    ఇవన్నీ ఈ వ్యాసానికి సంబంధించనివి కనక చర్చావేదికలోనో మరొకచోటో ప్రస్తావిస్తే మంచిదేమో.

  25. 25
    చింతలపాటి ఫల్గుణ కుమార్ Says:

    కుడి ఎడమల సంగతి దేవుడెరుగు ,తిమ్మిని బమ్మి చేస్తున్నారు రవికిరణ్ గారు.
    ఈయన భాష : అంగీకారవా = అంగీకారమా ;పావు=పాము ;అసలేవీ=అసలేమీ
    చదరంగంలోని పావుకి,కరవబోయే పాముకి తేడా లేదా మీ భాషలో.

    మకారాన్ని consistent గా వకారంగా రాసి పారేస్తున్నారు. ఇలా రాయడానికి వెనుక
    ఏదైనా బలమైన కారణం/సిద్ధాంతం ఉంటే తప్పక వివరించగలరు;ఈ లోగా మీకు బాలవ్యాకరణంలో
    ఒక పరిచ్చేదం సిద్ధం చేస్తాం.
    ఇక కుడి ఏమిటి ? ఎడమ ఏమిటి ?? ఇది ఈ చర్చకు ఏ రకంగా అవసరం ??
    మీకు సమాధానం తెలిసి చెప్పకపోతే పాము పావు అయినట్టే సుమా..

    చింతలపాటి ఫల్గుణ కుమార్

    ఇక గోపీ అంటే తెలుగు విశ్వ విద్యాలయం మాజీ వీసీ గోపీయేనా ??
    ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు(. ఆయన హెచ్చార్కే
    గారికి స్నేహితులా ?? )

  26. 26
    చింతలపాటి ఫల్గుణ కుమార్ Says:

    గచ్ఛత్ వ్యాఖ్య:

    అయ్యా తిమ్మిరి రెడ్డి గారు!!

    మీరు పొరపాటున కుడా మా కోన సీమ కు రాకండి. అసలే మా పక్క తాటి “మట్ట”లు కొబ్బరి “మట్ట”లు ఎక్కువ మీ నోట ఏమి వినిపిస్తుందోనని ఠారెత్తుతోంది.

    చింతలపాటి ఫల్గుణ కుమార్

  27. 27
    చాకి రేవు ఉపేంద్ర Says:

    అసలు విషయానికి తిరిగి రావాలంటే —

    పై వ్యాసాన్ని ఈ మాట జనవరి సంచికలో వచ్చిన వెల్చేరు నారాయణరావు గారి రెండు శ్రీ ల కవి అన్న వ్యాసంతో కలిపి చదువుకుంటే బాగుంటుంది. ఆ వ్యాసానికి క్రింద రోహిణీ ప్రసాదు గారు వ్రాసిన స్పందన కూడా చదివితే , దాన్ని దీనికి కలిపే దారాలు కనపడతాయి. రెండింటి లోనూ శ్రీశ్రీ వ్యక్తిత్వం. ఆయన షష్టి పూర్తి కి సంబంధించిన వివరాలు కొంచెం విస్తారంగా ఉన్నాయి. కవి సమయాన్నీ కవితా సందర్భాన్నీ అర్ధం చేసుకుని ఎవరికి ఎట్లా ఉపయోగ పడితే అట్లా స్వంతం చేసుకోసుకోవచ్చును.

    ముగిసిన రభసకి మరొక స్వస్తి వాచకం పలకాలంటే –
    శ్రీ శ్రీ కి దాశరథి కి మధ్యన కుక్క జెట్టీ జరుగుతుండగా దాశరథి కోపంలో శ్రీ శ్రీని నువ్వొక త్రాగుబోతు వి అని శాపనార్థాలు పెడుతుంటే కాళోజీ కలుగ జేసుకుని

    “వాడు వ్రాసిన కవితలు గుబాళిస్తుంటే , వాడు త్రాగి పారేసిన సీసాల కంపు మనకెందులకు ” అని అన్నాడట.

    కాళోజీ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఇది శ్రీ శ్రీ కవిత గొప్ప దనానికి కాళోజీ అర్పించిన నివాళి అని అనుకుంటారు. నాకు తెలిసినంతలో కాళోజీ ఈ మాటలు శ్రీ శ్రీ కవిత్వం గురించే కాదు, హనుమకొండలో రోడ్ పక్కన చాయి పోసే వాడి గురించి కూడా అన గలిగి ఉండే వాడు. ఆ మాటల్లో కాళోజీ దాశరథి కే కాదు మనకందరికీ అన్నీ వేళల పనికొచ్చే పాఠం ఒకటి చెప్పాడు. ఎదుటి మనిషి ఔదాత్త్యం నుంచి మనం బలం పుంజుకోవచ్చు. వాడి లేకి తనం, దుర్గుణాలూ, బలహీనతలూ ఇవేవీ మనకు పనికి రావు . కాబట్టి పనికొచ్చే దాని మీద దృష్టి పెట్టరా మూర్ఖుడా అన్నది పాఠం. శ్రీ శ్రీ సంగతి ఎట్లా ఉన్నా తోటి మనిషి మీద అపారమైన ప్రేమ , ఆశ , విశ్వాసమూ ఉన్న వాడు కాబట్టి కాళోజీ ఆ మాట అన గలిగాడు.

    ఎందుకు చెప్తున్నానంటే , ఇస్మాయిల్ అయినా యదుకుల భూషణ్ అయినా రోహిణీ ప్రసాద్ అయినా వాళ్ళు చెప్పిన దానిలో మనం ఎదగడానికి పనికొచ్చేది ఏముంది అన్నది ముందు చూసుకోవాలి. దాన్నించి పుంజుకున్న బలంతోటి జవాబు చెప్తే అందరికీ పనికొస్తుంది. లేకపోతే స్వంత గొడవల్లోకే దిగజారుతుంది.

    రోహిణీ ప్రసాద్ గారు అన్న మాటల్లోనూ, భూషణ్ అన్న మాటల్లోనూ ఇస్మాయిల్ అన్న మాటల్లోనూ తెలుగు సాహితీ కారులు పట్టించుకోవలసిన విషయాలు ఏవో, పట్టించుకొనవసరం లేని విష యాలు ఏవో నేను పదే పదే చెప్పాను. అవేవీ రుచించక పనిగట్టుకుని అందులో కటుత్వమూ, రాగద్వేషాలూ, చిన్న తనా లూ ఇలాంటివి వెతుక్కుంటే పర్యవసానాలకి ఎవరు బాధ్యులైనట్టు ?

    ఇక పోతే, ఈ చర్చలో నేను నేనుగా కలుగ జేసుకున్నాను. ఎవరికో ఒకరికి వత్తాసు పలకడానికి కాదు. హెచార్కే గారు వస్తుగత దృష్టి పేరుతో చెప్పినదానికీ కనీసం పాత కాలపు మార్క్సిస్టులు వస్తుగత దృష్టి అని అనుకునే దానికీ కూడా ఏమీ సంబంధం లేదు. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు బాలగోపాల్ చేసిన కోసాంబి అనువాదమో లేకపోతే మూలంలో కోసాంబి వ్రాసిన పుస్తకాలో చదవితే విషయం అర్ధమవుతుంది. ఏ యుగం లోనైనా ఏ తరంలోనైనా అజ్ఞానం అయోమయం ఏదో ఒక రూపంలో ఉంటాయి అన్నది కోయ దొరలు , సోదెమ్మలూ, హరికథా భాగవతార్లూ , విత్థలాచార్య అసిస్టెంటు డైరెక్టర్లూ , కూడా చెప్పే మాటే. మనకి కావలసినది ఈ యుగంలో ఇక్కడ ఇప్పుడు అయోమయానికి వస్తు గత మూలాలు ఏమిటి, వాటికి మందేమిటి అన్నది. !!

  28. 28
    హెచ్చార్కె Says:

    Upendra or some other friend,
    I am unable to open eemata. Would be thankful if you can send pdf of Narayana Rao’s article on Sri Sri to my ID

  29. 29
    చాకి రేవు ఉపేంద్ర Says:

    హెచ్చార్కే గారూ,
    వెల్చేరు వ్రాసిన వ్యాసం పీడీయేఫ్ కావాలంటే ఈ లింకు మీద క్లిక్ చేయండి
    http://tinyurl.com/yyqwast
    మీకు ఈమాట ఎందుకు ఓపెన్ కావటం లేదో చెప్ప లేదు.

  30. 30
    srikanth k Says:

    Dear Rohini Prasad garu,
    Today as I am reading articles about Sri Sri on his 100th Anniversary time, I could able to spot one interview on TeluguCinema.com from his wife. There Interviewer mentioned about his son’s personal website.

    There you can find some unique content. Please check this out.

    http://www.mahakavisrisri.com/

    FYI
    Interview of SriSri’s wife
    http://www.telugucinema.com/c/publish/stars/interview_sarojasreesree.php

  31. 31
    bollojubaba Says:

    అందరూ నా నలభై నిముషాల సమయాన్ని మింగేశారు ఏమీ తేల్చకుండా…….
    ఇంతకీ వ్యాసం గొప్పదా కవిత్వం గొప్పదా?

  32. 32
    subbulu Says:

    నన్నడిగితే కత్తే గొప్పదంటాను.!!
    లేకపోతే , మరీ పరీక్ష తప్పబోతున్న అయిదో తరగతి కుర్రాడిలా ఏమిటా ప్రశ్న బాబా గారూ !! రెండు మార్కుల బిట్టుకీ ఇంత ఆలోచించాలా ? ఏదో ఒకటి గిలికి బయట పడండి. వ్యాసమైనా , పద్యమైనా రెండూ కూడు పెట్టనివే. అంతగా పీకల మీదికి వస్తే, అప్పుడు ఏది అవసరమైతే అదే రాద్దాము. అయినా వాళ్ళు కొట్టుకున్నది కవిత్వం గురించో వ్యాసం గురించో అయితే మనం పట్టించుకోవాలి గానీ, నువ్వు గోప్పా నేను గోప్పా అన్న కుమ్ములాటలోకి దూరితే మనల్ని కూడా ఒక కుమ్ము కుమ్ముతారు.

  33. 33
    హెచ్చార్కె Says:

    భలే బాగా చెప్పావు సుబ్బులూ! చర్చలో నా ప్రమేయం మేరకు, మీ పరిశీలనకు నూటికి నూరు మార్కులు. సరిగ్గా ఇప్పుడే Serdar Ozkan ‘The Missing Rose’ చదువుతున్నానేమో, మీ మాట తాకాల్సిన చోట తాకింది. Pride is the worst of all vices అని ఎక్కడో, గలివర్స్ ట్రావెల్స్ చివర్లో అనుకుంటా, చదువుకున్న ఒక మాట మనసులో గిరికీలు కొట్టింది. లోలో మొలకెత్తిన ఒక మంచి నారుకు మీ మాటలు నీరు పోశాయి. థాంక్యూ.

  34. 34
    naresh Nunna Says:

    Dear Rohini Prasad garu,

    Ur personal account of Sri Sri certainly opens up new vistas and throws light on Sri Sri to understand him and his poetry more precisely. I request you and the blog readers of Pranahita to go through the following link of The Sunday Indian (Telugu) (to which I am the resident Editor). I tried to share my opinion on the relation between ‘writer – his writings’, in the context of Sri Sri’s Birth Centenary.
    http://www.thesundayindian.com/telugu/20100516/telugu.html (Pg 44-46)
    regards,
    naresh Nunna

  35. 35
    Rohiniprasad Says:

    నరేశ్ గారూ,

    మీరిచ్చిన లింక్ ద్వారా మీ వ్యాసం కనబడలేదు.

  36. 36
    naresh Nunna Says:

    Dear Rohini Prasad Garu,

    Unfortunately, our The Sunday Indian site does not allow non-linear reading of any article. It is not technically upgraded. So, the browser must browse through the pages, as if a reader flickers through a magazine. U will find the article in page numbers 44-46.
    I request u and others to take pain in browsing through the same link, with the above toil…
    http://www.thesundayindian.com/telugu/20100516/telugu.html
    (Pg 44-46)
    regards,
    naresh nunna

  37. 37
    bhasker.koorapati Says:

    ఈ చర్చొపచర్చలు చదివి నెను కొంత సెపు అలాగె విచలితున్ని అయి కల్లు మూసుకుని పదుకున్నను. నాకైతె రొహినీప్రసాద్ గారి వ్యాసము చాలా బాగా నచ్హింది అని మాత్రము చెప్పగలుగుతున్నాను.

  38. 38
    Rohiniprasad Says:

    భాస్కర్ గారూ,

    ప్రాణహితకన్నా ఈమాటలో చర్చలు మరీ ఎక్కువ. చర్చలని అంతగా పట్టించుకోనక్కర్లేదు. అందుకు రచయిత పూనుకున్నా సరే. వ్యాసం నచ్చడం, నచ్చకపోవడమే ముఖ్యం.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో