నేర పరిశోధన

ఆంగ్ల మూలం: సర్ ఆర్థర్ కోనన్ డాయిల్
తెలుగు: కొడవటిగంటి కుటుంబరావు

(గత సంచిక తరువాయి)

ఒక బంగారు గని కనిపెట్టినా అతను అంతకన్న ఆనందించి వుండడు.
“డాక్టర్ వాట్సన్- మిస్టర్ షెర్లాక్ హోమ్స్ , ” అని స్టామ్ ఫర్డ్ మమ్మల్ని పరిచయం చేశాడు.
“ఎట్లా వున్నారు?” అంటూ అతను నా చేతిని బలంగా పట్టుకున్నాడు. అతని వొంట్లో అంత సత్తువ వుంటుందని ఎవరూ వూహించలేదు. “ఆఫ్ఘనిస్తాన్ లో వుండి వచ్చారా ?”
“ఆ సంగతి మీకెలా తెలిసింది?” అన్నాను ఆశ్చర్యపోతూ.
“పోనివ్వండి ,” అన్నాడతను తనతో తాను నవ్వుకుంటూ , “అసలు విషయం యీ హిమోగ్లోబిన్, నేను చేసిన యీ పరిశోధనయొక్క ప్రాముఖ్యం మీకు తెలిసిందికాదూ ?”
“రసాయన శాస్త్ర్త దృష్ట్యా వింతే కావచ్చు . కాని దాని ప్రయోజనం మాటకొస్తే -”     అన్నాను.
“అదేమిటి ?  ఇన్ని సంవత్సరాలుగా ఇంత ప్రయోజనకరమైన పరిశోధన ఎక్కడ జరిగింది ? రక్తపు మరకలను గుర్తించటానికి వజ్రాయుధం కదా. ఇట్లా రండి చూపిస్తాను!”
అతను తన ఆదుర్దాలొ నన్ను చెయ్యి పట్టుకుని తాను పనిచేస్తున్న బల్లవద్దకు లాక్కుపోయాడు. “ఏదీ కొత్త రక్తం ?” అంటూ సూది ఒకటి తీసి తన వేలు పొడుచుకున్నాడు .”ఈ కొద్ది రక్తాన్ని ఒక లీటర్ నీటిని కలిపేద్దాం. అందువల్ల నీటిలో ఏ మార్పూ కనబడదు. చూసుకోండి. నీటిలో రక్తం పదిలక్షల్లో ఒక వంతు మించి ఉండదుగద. అయినా రియాక్షన్ వస్తుంది చూడండి !” ఈ మాట అంటూ అతను నీటిలోకి కొన్ని తెల్లని పలుకులనూ, రంగులోని ద్రావకం బొట్లనూ వేశాడు. వెంటనే నీరంతా చక్క రంగుగా మారిపొయింది. కాఫీరంగు నలుసులు  నీటి అడుగున చేరసాగాయి.
“హా! హా! ” అని అతను, కొత్త బొమ్మను చూసి మురిసే కుర్రాడిలాగా చప్పట్లు చరిచాడు.”ఇప్పుడేమంటారు?”
“చాలా సున్నితమైన టెస్ట్ లాగే వుంది”.
“భేష్ , భేష్! అదివరకున్న టెస్టు అనుమానాస్పదమైనది. మైక్రోస్కోప్ తో పరిశీలన కూడా అంతమాత్రమే . రక్తం మరకలు కొంచెం పాతబడితే ఆ టెస్ట్ పనికి వచ్చేదికాదు. ఈ టెస్టుకు రక్తం పాతదైనా , కొత్తదైనా ఒకటే. ఇదే ఇంతకుముందు కనిపెట్టబడివుంటే ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్న వాళ్ళు అనేక మంది ఉరి స్థంభాలెక్కి ఉండేవాళ్ళు.”
“నిజమా?” అన్నాను.
“ఎన్నో క్రిమినల్ కేసులు ఈ పాయింటు లోనే తేలకుండా ఉంటాయి. హత్య జరిగిన తరవాత, ఒక్కొక్కప్పుడు కొన్ని నెలలు గడిచాక హంతకున్ని శంకిస్తారు. అతని బట్టలు పరీక్షిస్తారు. వాటిమీద బ్రౌన్ రంగు మరకలు కనిపిస్తాయి. కాని అవి రక్తపు మరకలా , బురద మరకలా, తుప్పు మరకలా , పళ్ళ మరకలా, ఏమిటని? ఈ ప్రశ్నకు ఎంతోమంది నిపుణులు సమాధానం ఇవ్వలేక తన్నుకున్నారు. ఎందుకు? నమ్మకమైన టెస్ట్ లేని కారణం చేత . ఇప్పుడు మనకు షెర్లాక్ హోమ్స్ టెస్టున్నది . ఇక యేమీ ఇబ్బంది ఉండదు.”
అతని కళ్ళు మెరిశాయి. ఎవరో హర్షధ్వానాలు చేస్తుంటే వాటిని స్వీకరించే వాడిలాగా అతను రొమ్ము మీద చెయ్యి పెట్టుకుని తలవంచాడు.
“మిమ్మల్ని నిజంగా అభినందించాలి .” అన్నాను. అతని ఉత్సాహానికి ఆశ్చర్యపోతూ.
కిందటేడు ఫ్రాంక్ ఫర్ట్ లో ఫాన్ బ్రిస్ఖోఫ్ కేసు జరిగింది. ఈ టెస్టే ఉంటే అతనికి ఉరిశిక్ష తప్పక పడివుండును. తరువాత బ్రాడ్ ఫర్ట్ లో మేజన్ , దేవాంతకుడు ముల్లర్, మోంట్ పెల్లియర్ లొ లఫవర్, న్యూ ఆర్లియన్స్ లో శామ్సన్ ఇంకా ఇరవై కేసులు చెప్పగలను – అన్నిటిలోనూ ఈ టెస్ట్ అనుమాననివృత్తి చేసి ఉండేది .”
“ఎక్కడెక్కడి నేరాలూ కంఠస్థం చేసినట్టుందే ? ఈ ధోరణిలొ ఒక పత్రిక పెట్టి ‘పురాతన పోలీసు వార్తలు’ అని పేరు పెడితే సరి! అన్నాడు స్టాంఫర్డ్ నవ్వుతూ.
“చదవటానికి చాలా బాగుంటుందికూడానూ,” అన్నాడు షెర్లాక్ హోమ్స్ వేలి గంటు మీద ప్లాస్టర్ అంటిస్తూ. “ఎప్పుడూ విషాలు తాకుతాను గనక జాగ్రతగా ఉండాలి “. అన్నాడతను నాకేసి తిరిగి, తన చేతిని ప్రదర్శిస్తూ , ఇటువంటి ప్లాస్టర్లు అతని చేతి నిండా కనిపించాయి.
“మేం పనిమీద వచ్చాం,” అన్నాడు స్టాంఫర్ట్ తానొక మూడు కాళ్ళ స్టూలు మీద కూర్చుని, నావైపు మరొకటి తోస్తూ. ” నా స్నేహితుడికి కూడా గదులు కావాలట.”
నాతో కలిసి ఉండటం తనకు సంతోషమైనట్టే కనబడ్డాడు షెర్లాక్ హోమ్స్ . “బేకర్ స్ట్రీట్ లొ మంచి గదుల మీద కన్నేసి ఉంచాను. మనకన్ని విధాలా అమరుతాయి . మీకు ఘాటుపుగాకు వాసన పడుతుందికద ?”
” నేను ఘాటుపుగాకే కాలుస్తాను ,” అన్నాను.
“అయితే బాధ లేదు. మరి నా చుట్టూతా ఎప్పుడూ రసాయనాలుంటాయి. నేనెప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అందువల్ల మీకేమీ బాధ ఉండదుగద?”
“ఎంత మాత్రం ఉండదు”.
“మరొచ్చి – నాకున్న ఇతర దుర్గుణాలేమిటీ? నేనొక్కక్కపుడూ రోజుల తరబడి మాట్లాడకుండా నివురగప్పినట్టు పడి వుంటాను .నేనోదో బిగుసుక్కూచున్నాననుకోకూడదు. నా మానాన నన్నుండనిస్తే నా అంతట నేనే మామూలు మనిషి నైపోతాను. మీ దుర్గాణాలు కూడా చెప్పేయ్యండి . ఇద్దరు కలిసి ఒకేచోట ఉండదలచినపుడు ఒకరి దురలవాట్లు మరొకరికి తెలియటం మంచిది.”
ఈ క్రాసు పరీక్షకు నాకు నవ్వొచ్చింది. “నాకొక కుక్కపిల్ల ఉంది. నాకు చప్పుడు సరిపడదు. ఎందుకంటే నా నరాలు దెబ్బతిన్నాయి. నేనేవేళకు లేస్తానో నాకే తెలీదు . ఆరోగ్యంగా ఉన్న  సమయంలో ఇతర దుర్లక్షణాలు కొన్ని ఉంటాయి గాని ఇప్పటిమటుకివే ,” అన్నాను.
“మీకు సరిపడని చప్పుళ్ళలొ ఫిడేల్ వాయింపు కూడా చేరుతుందా?” అని అడిగాతడను ఆదుర్దాగా.
“వాయించేవాణ్ణి బట్టి ఉంటుంది. బాగా వాయించేవాడు రాళ్ళు కూడా కరిగిస్తాడు. చాత కాని వాడు…..-”
“అయితే పరవాలేదు,” అన్నాడతను సంతోషంగా నవ్వుతూ, “అయితే మనం ఖాయం చేసుకోవచ్చు – అంటే, గదులు మీకు నచ్చితే ”
” వాటిని ఎప్పుడు చూద్దాం ?”
“రేపు మధ్యాహ్నం నన్నిక్కడే కలవండి . ఇద్దరమూ కలిసి వెళ్ళి ఖరారు చేసుకుందాం,”
“సరే -సరిగా మధ్యాహ్నానికి ;” అంటూ అతని వద్ద సెలవు తీసుకున్నాను. అందరం హోటలు కేసి నడవసాగాం .
” నేను అకస్మాత్తుగా ఆగి, స్టామ్ ఫర్డ్ కేసి తిరిగి, “అన్నట్టు , నేను ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి వచ్చానని అతని కెట్లా తెలిసింది ?” అన్నాను. ఆ స్నేహితుడు చిత్రంగా నవ్వి, “అదే అతనిలో విశేషం. ఇలాంటివిషయాలు అతనెట్లా కనిపెడతాడో తెలుసుకుందామని చాలామంది యత్నించారు ;” అన్నాడు.
“ఓహో, మిస్టరీయా? చాలా బాగుంది ; మమ్మల్నిద్దరినీ కలపటం నువు మంచి పని చేశావు. మనిషిని మనిషే తెలుసుకోవాలని కాదూ అంటారూ ?” అన్నాను చేతులు రుద్దుకుంటూ .
“అయితే అతన్ని గురించి తెలుసుకో. అతనంత సులభంగా కొరుకుడుపడే ఘటం కాడుసుమా ; పందెం వేస్తాను. నువ్వతన్ని గురించి తెలుసుకునే దానికన్న అతనే నిన్ను గురించి ఎక్కువ తెలుసుకుంటాడు. నేను పోయిరానా?”
“మంచిది, నేనుంటాను” అని స్టామ్ ఫర్డ్ కు వీడ్కోలు చెప్పి, కొత్త పరిచయస్తుణ్ణి గురించి ఆలోచిస్తూ హోటలు దారి పట్టాను.
2. పరిశోధనా శాస్త్రం
అనుకున్న ప్రకారం మేం మర్నాడు కలుసుకుని బేకర్ స్ట్రీట్ లోని 221 బి గృహంలొ గదులు చూశాం. రెండు సదుపాయమైన బెడ్ రూములూ, ఒక విశాలమైన సిట్టింగ్ రూమూ, దానికి రెండు వెడల్పయిన కిటికీలూ, అందులో  చక్కని ఫర్నీచరూ ఉన్నాయి. సర్వవిధాలా ఆ భాగం యోగ్యంగా కనిపించటంవల్లా, బాడుగ మా ఇద్దరి మధ్యా    పంచితే ఏమంత ఎక్కువ కాకపోవటం వల్లా, అప్పటికప్పుడే మాట్లాడుకుని గదులు స్వాధీనంచేసుకున్నాం.ఆ సాయంకాలమే నా సామాను హోటలు నుంచి మార్చేశాను. మర్నాడు ఉదయం షెర్లాక్ హోమ్స్ అనేక పెట్టెలూ అవీ తీసుకుని దిగాడు. సామాను వీలుగా సర్దుకోవటంలో ఒకటి రెండు రోజులు గడిచాయి . అతరువాత ఈ కొత్త ఇంటికి అలవాటు పడసాగాం.
హోమ్స్ తో కాలక్షేపం చెయ్యటం కష్టం కాదు. అతను ఆటే సందడి చేసే మనిషి కాడు. అన్ని పనులలోనూ కాలనియమం పాటిస్తాడు. సామాన్యంగా రాత్రి పది దాటి మేలుకునే వాడు కాడు. తెల్లారి నేను లేవకపూర్వమే తిండి తినేసి బయటికి వెళ్ళిపోయేవాడు. అతనికి పగలల్లా కెమికల్ లెబరెటరీలోనో , డిసెక్టింగ్ రూమ్స్ లోనో గడిచేది. ఒక్కోరోజు నగరంలొ మారుమూలలకు నడిచివస్తూండే వాడు. పనిచేసే ధోరణిలో ఉన్నప్పుడతని శక్తి చెప్పతరం గాదు. ఉన్నట్టుండి మగతలో పడినట్టయిపోయి. రోజులతరబడి సిట్టింగ్ రూమ్ లోని సోఫామీద పడుకుని ఉదయం నుంచి సాయంకాలందాకా ఇంచుమించు కదిలేవాడుకాడు, పెదవి మెదిపేవాడు కాడు. ఇటువంటి సమయాలొ అతని కళ్ళ మత్తూ, ముఖకవళికా చూస్తే అతనేదైనా మాదక వస్తువులకు అలవాటు పడ్డాడా అనిపించేదిగాని, అతని శుచిత్వమూ . అలవాట్లూ తెలుసు గనక అటువంటి ఆలోచన అసంభవమనిపించేది.
వారాలు గడుస్తున్న కొద్దీ నాకు అతనిలో ఆసక్తీ, అతని జీవితాశయమేమిటా అన్న జిఙ్ఞాస జాస్తి కాసాగాయి. అతని అకారస్వరూపాలే ఎవరినన్నా చప్పున ఆకర్షిస్తాయి. అసలే ఆరడుగులు దాటిన మనిషి. మరీ సన్నగా ఉండేవాడేమో, ఇంకా ఎత్తుగా ఉన్నట్టు కనిపించేవాడు. మగతగా పడివున్నప్పుడు తప్పిస్తే అతని కళ్ళు చురుకుగా , ములుకుల్లా ఉండేవి. గద్దముక్కు మూలంగా అతను దేనికైనా తయారుగా ఉన్నవాడల్లే కనిపించేవాడు. దృఢ నిశ్చయాలు గలవాడని అతని పొడుచుకువచ్చే గడ్డం సూచించేది. అతని చేతులమీద ఎల్లప్పుడూ సిరామరకలూ రసాయనాల మరకలు ఉండేవి. అయినా అతని వేళ్ళు పనిచేసేటప్పుడు చాలా సున్నితంగా కనిపించేవి.
అతని గురించి తెలుసుకోవాలన్న ఉబలాటం నాలో ఎంతగా ఉండేదో చెప్పినట్లయితే ఎవరైనా నాకు పనీపాటా లేదని అనుకోగలరు. అతను మరి తనను గురించి ఎప్పుడూ మాట్లాడుకునే వాడుకాడు. అతని మౌనాన్ని చేధించి విషయాలు తెలుసుకుందామని నేనెన్ని ప్రయత్నాలో చేశాను. అయితే    నాకు పనీపాటూ లేనిమాట కూడా నిజమే ; నన్ను ఆకర్షించే మరోటేదీకూడా లేకపోయె. చక్కగా ఎండ కాస్తున్నపుడు తప్ప బయటికి అడుగుపెట్టటానికి తగిన ఆరోగ్యంగా కూడా నాకు లేదు. నా కోసం వచ్చి పలకరించే స్నేహితులన్నా లేరు. ఈ పరిస్థితుల్లో నేను నా స్నేహితుడి రహస్యం తెలుసుకునేటందుకు నా కాలాన్ని ధారపోశాను.
అతను వైద్యం చదవటం లేదు. స్టాంఫర్డ్ చెప్పినమాట నిజమే. ఈ విషయం నేను ప్రశ్నించగా అతనే  ఒప్పుకున్నాడు. అతను ఇంకే శాస్త్ర పరీక్షకుగాని,  మామూలు ఉద్యోగాలకు పనికివచ్చే ఇంకో పరీక్షకుగాని చదవటంలేదు. అయితే  అతను అంత దీక్షగా ఏమిటీ చదువుతున్నట్టూ? కొన్ని కొన్ని విషయాలలో అతనికి  గల ఙ్ఞానం  అత్యంత పరిపూర్ణంగానూ,సూక్ష్మంగానూ ఉండేది. ఏదో ఆశయం లేని           సూక్ష్మఙ్ఞానం సంపాదించడు. తోచక చదివేవారికి ఙ్ఞానం యెప్పుడూ సమగ్రంగా వుండదు. వొట్టి పుణ్యానికెవరూ అతి సూక్ష్మఙ్ఞానం సంపాదించరు.
ఙ్ఞానం లాగే అఙ్ఞానం కూడా అత్యాశ్చర్యకరంగా వుండేది.రాజకీయాలను గురించిగాని అతనికి కొంచెం కూడా తెలియదు. థామస్ కార్లయిర్ వాక్యాలు కొన్ని నేను ఉదహరించగా, అతని గురించి ఆయన ఎవరనీ, ఏం చేశాడనీ అతను అమాయకంగా ప్రశ్నించాడు. ఇంతకన్నా నాకు అమిత ఆశ్చర్యం కలిగిందెప్పుడంటే అతనికి కోపెర్నకన్ సిద్ధాంతం గురించి  ఏమీ తెలీదని ప్రమాదవశాత్తూ  బయటపడ్డప్పుడు ఈ పంతొమ్మిదో శతాబ్దంలో ఎవరికిగాని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందన్న సంగతి తెలీదంటే నేను నమ్మలేకపోయాను.
నా ఆశ్చర్యం చూసి నవ్వుతూ ,” మీకాశ్చర్యంగా వున్నట్టుంది , నాకిప్పుడు తెలిసిన యీ విషయాన్ని మరిచిపోవటానికి యత్నిస్తాను,” అన్నడతను.
“మరిచిపోవటానికా!”
“చూడండి, మనిషి మెదడు వస్తుతహా చిన్న ఖాళీ అటకలాటిది. అందులో మనకు కావలిసిన వస్తువులే పెట్టుకోవాలి. మూర్ఖులైనవాళ్ళు అందులొ అడ్డమైన సామానూ పెట్టేసి అవసర వస్తువులకు చోటులేకుండా చేసుకుంటారు. ఒకవేళ చోటున్నా అవసర వస్తువులకు పనికిమాలిన వస్తువులు అడ్డొచ్చేట్టు చేసుకుంటారు. నిపుణత కలవాడు తన బుర్రలో దాచుకునే విషయాలను చాలా శ్రద్ధగా యెన్ను కుంటాడు. తన పనికి అవసరమైన పరికరాలకే అందులొ చోటిస్తాడు. మనిషి బుర్రకు పరిమితి లేదనీ అందులో యెన్ని విషయాలకైనా స్థానం వుందనీ అనుకోవటం పొరబాటు. ఒక పరిమితి దాటాక మనం బుర్రలొ ఒక కొత్త విషయం ప్రవేశపెట్టినప్పుడల్లా ఒక పాత విషయం అందులోనుంచి జారిపోతూ వుంటుంది. అందుచేత పనికిమాలిన ఙ్ఞానం పనికివచ్చే ఙ్ఞానాన్ని తోసిపారెయ్యకుండా చూసుకోవటం యెంతైనా అవసరం.”
“కాని , సూర్యకుటుంబం!”
“సూర్యకుటుంబమేమైతే నాకేమిటి?” అనాడతను విసుగ్గా. ” మనం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం, అని మీరంటున్నారు. మనం చంద్రుడి చుట్టూ తిరిగినా నాకుగాని నా పనికిగాని ఠోలీ వ్యత్యాసం కలగదు.
ఆ పని ఏమిటని అడుగుదామని నోటిదాకా వచ్చిందిగాని, అతని వైఖరిచూస్తే ఆ ప్రశ్న అతని కిష్టం వుండదనిపించింది. మా మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణనుంచి యేమి గ్రహించవచ్చునా అని దీర్ఘంగా ఆలొచించాను. తనకు అవసరంగాని ఙ్ఞానం సంపాదించనన్నాడు గనుక అతనికిగల ఙ్ఞానాన్ని బట్టి అతని ఆశయం గ్రహించటానికి యత్నించాను. ఒక పెన్సిలు ముక్క తీసుకుని అతనికి తెలిసిన  విషయాలూ, తెలియని విషయాలూ జాబితా కూడా వేశాను. ఆ జాబితా యీ విధంగా తయారయింది.
1.సాహిత్యం -సున్నా
2.తత్వశాస్త్రం – సున్నా
3.జ్యోతిశ్శాస్త్రం – సున్నా
4.రాజకీయాలు- బహుస్వల్పం
5.వృక్షశాస్త్రం -పరిమితం, అనుభవకం. బెల్లడోనా, నల్లమందు ఇతర విషాలనుగురించి బాగా తెలుసు. తోట పనిగురించి యేమీ తెలీదు.
6.భూశాస్త్రం: పరిమితం, అనుభవకం. రకరకాల మట్టిని చూడగానే గుర్తించగలడు. తేడాలు చెప్పగలడు, కాలినడకను తిరిగి వచ్చి లాగుమీది మరకలలో యేది యేప్రాంతంలో పడిందో నాకు చూపించాడు.
7.రసాయన శాస్త్రం – చాలా బాగాతెలుసు.
8..శరీర శాస్త్రం-  నిర్దుష్టం , అయితే సమగ్రం కాదు.
9. బీభత్స సాహిత్యం – అపారంగా తెలుసు.ఈ శతాబ్దంలో జరిగిన ప్రతి హత్య గురించీ ప్రతి వివరమూ తెలిసినట్టు కనబడతాడు.
10.ఫిడేలు బాగా వాయిస్తాడు.
11.కత్తి తిప్పటంలో, కర్ర తిప్పటంలో, బాక్సింగ్ లో ఘనుడు.
12. బ్రిటీష్ న్యాయ  చట్టం బాగా తెలుసు.
జాబితా ఇంత వరకు వచ్చాక విసుగెత్తి కాగితం నిప్పులోకి విసిరేశాను. ఇటువంటి ఙ్ఞానంతో అతను యేం వృత్తి చేయబోతాడో వూహించటం నాకు సాధ్యంగా కనబడలేదు.

(సశేషం)

2 అభిప్రాయాలు »అనువాదాలు, ధారావాహికలు, నేర పరిశోధన

2 Responses to “నేర పరిశోధన”

  1. 1
    Rohiniprasad Says:

    మా నాన్న అనువదించిన నవలల్లో Soviet Literature మాసపత్రికలో అచ్చయిన A Girl from Hiroshima అనే నవల కూడా ఉంది. హిరొషిమా అనే పేరుతో దీన్ని విశాలాంధ్ర పుస్తకరూపంలో చాలా ఏళ్ళ క్రితం ప్రచురించింది.

  2. 2
    Rohiniprasad Says:

    మా నాన్నకు ఉర్దూ చదవడం వచ్చు. మా చిన్నప్పుడు ఏదో సందర్భంలో ఈ సంగతి బైటపడింది. ఆయన పైకి చదువుతున్నది హిందీలాగే అనిపించడంతో మేము అదేదో దేవనాగరి లిపిలో ఉన్న పాఠం అనుకున్నాం. చూడబోతే అది ఉర్దూ అని తెలిసింది. ఆయన బెనారెస్ లో ఉన్నప్పుడు ఉర్దూ అక్షరాలు నేర్చుకున్నట్టున్నారు. తెలంగాణాలో పుట్టిపెరిగినవారిలాగా స్కూల్లో నేర్చుకోలేదు. తన ఆసక్తికొద్దీ నేర్చుకున్నారు. వేగంగానే చదివేవారు. ఈ సంగతి ఎక్కడా ప్రస్తావనకు రాలేదు కనక చెపుదామనిపించింది. తరవాతి కాలంలో ఆయన రష్యన్, ఎస్పరాంటో భాషలు నేర్చుకునే ప్రయత్నాలు సీరియస్ గా చేశారు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో