పొటెంకిన్‌లో ఆ రోజు ఏం జరిగింది?

పొటెంకిన్‌ తిరుగుబాటులో చివరి వ్యక్తితో భేటీ!

1905లో రష్యాలో జారిస్టు యుద్దనౌక పొటెంకిన్‌లో జరిగిన తిరుగుబాటు కేవలం యాదృచ్ఛిక ఘటన కాదు.రష్యా మొత్తంలో చెలరేగిన తిరుగుబాట్లకు అదొక తిరుగులేని  సంకేతం. దేశవ్యాప్తంగా జరిగిన ఈ తిరుగుబాట్లలో 1905లోనే దాదాపు 3వేలమంది ప్రజలు చంపబడ్డారు. అది రష్యా పాలకుడు జార్ నికోలస్ పాలన కుప్పగూలడానికి సిద్ధంగా ఉన్న కాలం. తర్వాత బయటపడినట్లుగా తిరుగుబాటుదారులు అల్లిన ఓ ఉమ్మడి ప్రణాళిక ప్రకారం, నావికాబలగాల్లో విస్తరించిన తిరుగుబాటుదారులు నల్లసముద్రం పొడవునా ఉన్న ఓడరేవులను దిగ్భంధించాలి. ఈలోగా రష్యా భూభాగంలోని విప్లవకారులు తిరుగుబాటు జ్వాలలను ప్రేరేపించాలి. కాని ఈ పథకం పనిచేయలేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే పొటెంకిన్‌లో పితూరీకి దారితీశాయి.

రష్యాలో 1905లో ప్రజ్వరిల్లిన పితూరీని 20 ఏళ్ల అనంతరం తెరమీద చూపిన ‘బ్యాటిల్‌షిప్ పొటెంకిన్’ ఆధునిక సినీ చరిత్రలో, ప్రత్యేకించి మూకీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక వాస్తవ ఘటనకు కాసింత కల్పనను జోడించిన ఈ చిత్రం సోషలిస్టు వాస్తవికత పేరిట కొన్ని దశాబ్దాలపాటు సోవియట్ చిత్ర పరిశ్రమ సృష్టించిన సినీ కళారూపాల్లో తలమానికంగా నిలిచింది. కానీ ఆరోజు పొటెంకిన్ ఓడలో జరిగిన ఘటన పూర్వాపరాలను ప్రత్యక్ష సాక్షి కథనం ద్వారా చరిత్ర వినగలిగితే..

వినవచ్చు. ఓ మహత్తర ఘటనను దాంట్లో పాల్గొన్న వ్యక్తి ద్వారానే మనం వినవచ్చు.ఈ అరుదైన చరిత్రను 1987లో ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ వెలికితీసింది. ఆనాటికి పొటెంకిన్ యుద్ధనౌకలో పితూరీలో పాల్గొని సజీవంగా ఉన్న ఏకైక వ్యక్తి ఇవాన్ బెషోప్‌ను, అంతర్జాతీయ జర్నలిస్టు ఎంజో ఫేరినెల్లా కలిసి ఇంటర్య్యూ చేసి వాస్తవాన్ని వెలికి తీశాడు. ఈ ఇంటర్వ్యూ పలు ఇటలీ దినపత్రికల్లో 1987లో ప్రచురించబడింది. ”నేనూ మరియు సైనిక ఓడ” పేరుతో ప్రచురించబడిన ఆ ఇంటర్వ్యూ అప్పట్లో ఓ సంచలనం.

ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అత్యుత్తమ చిత్రంగా పేరొందిన ‘బ్యాటిల్‌షిప్ పొటెంకిన్’ చిత్రంలో తీసిన ఒడెస్సా మెట్లవద్ద మారణ కాండ దృశ్యం వాస్తవంగా ఎన్నడూ జరగలేదట. ఈ విషయాన్ని తొలిసారిగా ఇవాన్ బెషోఫ్ బయటపెట్టారు. 1987నాటికి అతడి వయస్సు 104 ఏళ్లు. అతడు ఆ సమయంలో ఐర్లండ్ రాజధాని డబ్లిన్‌లో నివసిస్తున్నారు. ఇటలీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు పొటెంకిన్ పితూరీని, తద్వారా సమకాలీన రష్యా చరిత్రను నెమరు వేసుకున్నారు. జరిగిన ఘటనను, దాని పూర్వాపరాలను స్వయంగా అతడి ద్వారానే విందాం.

“1905 సంక్షుభిత కాలంలో మేము ఒడెస్సా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పొటెంకిన్ యుద్ధనౌకలో ఉన్నాం. అప్పటికి రెండేళ్ల క్రితమే ఈ ఓడను రష్యా నావికాదళంలో భాగం చేశారు. ఇంపీరియల్ జారిస్టు యుద్ధనౌకల్లోనే దీన్ని తలమానికంగా భావించేవారు. నౌకలో మేం 155 మందిమి విధుల్లో ఉండేవాళ్లం. మావద్ద 32 భారీ ఆయుధాలు ఉండేవి. వీటిలోను ఆరు అతి భారీ ఆయుధాలు. ఒడెస్సాలో రెండు షాట్లు మాత్రమే కాల్చారు. అది కూడా ఒడెస్సా నగరంలో కాదు. రేవుకు వెలుపల మేం మూడురోజులు ఉన్నాం. మాకు సరఫరాలు, నీళ్లు, బొగ్గు అవసరం ఉండింది. నగర ప్రజలు వాటిని మాకు అందించారు. మేం ఎవరిమీద అయితే పోరాటం చేస్తున్నామో ఆ కులీనులు నగరం నుంచి పారిపోయారు. మా కార్మిక సోదరులపై బాంబుదాడులు చేసి, చంపడానికి అక్కడ అవకాశమే లేదు.”

డబ్లిన్ ఉత్తరభాగంలోని ఆర్టేన్ ప్రాంతంలో ఉన్న తన ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న శతాధిక వృద్దుడు ఇవాన్ బెషోఫ్ తన కథనం ఆపి, ఇంటర్వ్యూకోసం వచ్చిన విలేఖరి యోగక్షేమాలు విచారించారు. గదిలో బాగా చలిగా ఉందా అని అడిగారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు పరామర్సించడం తన నైజం మరి. వణికించే ఆ ఐరిష్ సాయంకాలం సిట్టింగ్ రూంలో కూర్చుని చలి కాచుకుంటూ అతడు తన జాకెట్ చుట్టూ బెల్టు బిగించుకుని  పొటెంకిన్ కథ ప్రారంభించారు.

కులీనులు ఎక్కడ చూసినా ఉండేవారు, వారిని ఇతరులు స్పృశించడం కూడా కష్టం. సంపద మొత్తంపై వారి యాజమాన్యమే ఉండేది. ప్రతి కులీనుడూ ఉక్రెయిన్ లోని భూభాగంలో తలొక 2 వేల హెక్టార్ల భూమిపై యాజమాన్యం కలిగి ఉండేవాడు. కూలీలు కారుచౌకగా దొరికేవారు. సంపాదించే కాసింత డబ్బులు వారి తిండికి మాత్రమే సరిపోయేవి. వారు రోజూ 12 గంటలపాటు పనిచేయవలసి వచ్చేది. అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య వారు బతికేవారు. కాళ్లకు చెప్పులు, బూట్లు ఉండేవి కావు. పరుండటానికి కనీసం పరుపులు కూడా ఉండేవి కావు. వారికి మరుగుదొడ్లు ఉండేవి కావు. నదివద్దకు పోయి మాత్రమే వారు శుభ్రం చేసుకునేవారు. వాళ్లు బానిసల్లాగే ఉండేవారు. పనివేగంగా చేయలేని వారిని, పనిలో బలహీనంగా కనిపించేవారిని కులీనులు కొరడాలతో కొట్టేవారు.

ఘోరమైన ఈ పరిస్థితులను కూల్చివేయడానికే సైనికులు ఒడెస్సా వద్ద సామాన్య ప్రజలతో కలిసి పోరాటం ప్రారంభించారు. ఆ కల్లోల క్షణాల్లో కూడా పొటెంకిన్ ఓడ రేవుకు రెండు  లేదా మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయింది. ఈ కోణంలోంచి చూస్తే బ్యాటిల్‌షిప్ పొటెంకిన్ చిత్రం పాక్షికంగా సత్యం, పాక్షికంగా సత్యం కాదు.

ఆ సమయంలో రష్యా మొత్తం తిరుగుబాట్లు ప్రజ్వరిల్లాయి. 1905 సంక్షుభిత సంవత్సరంలో రష్యా మొత్తంమీద మూడు వేల మంది ప్రజలను కాల్చి చంపారు. అది జార్ నికోలస్ పాలన కుప్పగూలడానికి సిద్ధంగా ఉన్న కాలం. తిరుగుబాటుదారులు అల్లిన ఓ ఉమ్మడి ప్రణాళిక ప్రకారం, నావికాబలగాల్లో విస్తరించిన తిరుగుబాటుదారులు నల్లసముద్రం పొడవునా ఉన్న ఓడరేవులను దిగ్భంధించాలి. ఈలోగా రష్యా భూభాగంలోని విప్లవకారులు తిరుగుబాటు జ్వాలలను ప్రేరేపించాలి. కాని ఈ పథకం పనిచేయలేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే పొటెంకిన్‌లో పితూరీకి దారితీశాయి.

మేం నల్లసముద్రం గుండా ఒడెస్సాకు వచ్చాం. మా తిరుగు ప్రయాణంలో పొటెంకిన్ నౌకలో చెలరేగిన పితూరీ నాటి జారిస్ట్ రష్యాలో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబించింది. నాకు గుర్తున్నంతవరకు  తిరుగుబాటు భోజన సమయంలో 12 గంటల వేళ మొదలయింది. మా ఆహారంలో పురుగులు కనిపించాయి. మాకోసం కేటాయించిన మాంసం కుళ్లిపోయింది. బ్రెడ్ రాయిలాగా గట్టిగా ఉంది. అయినా సరే నౌకలోని అధికారి మాకు దాన్నే వండిపెట్టమని వంటవారిని ఆదేశించారు. ఆ సమయంలో ఎవరూ కూడా అధికార్ల ఆదేశాన్ని దిక్కరించడం కాని, ఎదురుగా మాట్లాడటం కాని చేయలేని పరిస్థితి. అలా చేస్తే వారిని వెంటనే నిర్బంధించి నౌక అడుగు భాగంలో ఉంచేవారు. తర్వాత కనీసం 30 రోజుల పాటు శిక్షను విధించేవారు. అయితే నా నావికా మిత్రుడు వరుకించుక్ ఈ దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా గళం ఎత్తడానికి సాహసించాడు. ఓడ పైభాగంలో ఉన్న ఓ అధికారికి తన నిరసన తెలియపర్చాడు.

ఆ అధికారి మూర్తీభవించిన నియంత, పోలిష్ జాతీయుడు. ఉన్నట్లుండి అతడు తన పిస్తోలు తీసుకుని వరుకించుక్‌ను కాల్చి పడేశాడు. ఇదే తిరుగుబాటుకు నాంది. నౌకలోని సిబ్బంది తిరగబడ్డారు. తిరుగుబాటుదారులకు మషిషెంకో నాయకత్వం వహించాడు. ఓడ పైభాగంలో ఉన్న ఆయుధాగారాన్ని తక్షణం తెరచి ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకోవలసిందిగా అతడు ఆదేశించాడు. కొంతమంది అధికార్లు దీన్ని ప్రతిఘటించారు. దాంతో కాల్పులమోతతో ఓడ దద్దరిల్లింది. నావికుల కాల్పుల బారికి తాళలేని కొందరు అధికారులు సజీవంగా లేదా నిర్జీవంగా సముద్రంలోకి గెంతేశారు.

కేవలం ఒకే ఒక్క రోజులో తిరగుబాటు పూర్తయింది. అది సాధారణంగా చూస్తే తిండికోసం, మంచి పరిస్థితుల కోసం నిరసన. ఓడలోని సిబ్బంది నెలకు ఒక షిల్లింగ్ మాత్రమే ఆర్జించేవారు. వారు బుద్దిగా వ్యవహరిస్తే నెలలో తొలి ఆదివారం మాత్రమే ఓడలోంచి తీరంలోకి వెళ్లడానికి అనుమతించబడేవారు.

ఈ తిరుగుబాటు, పొటెంకిన్‌ నౌకలో ప్రజాకమిటీ ఎన్నిక అనేవి 12 సంవత్సరాల తర్వాత భీకర రక్తపాతంతో ముగిసిన విప్లవానికి నాంది పలికాయి. 1905లో సోషల్ డెమాక్రాటిక్ -నాటి రష్యా కమ్యూనిస్టు పార్టీ- కి చెందిన వివిధ విభాగాలు జారిస్టు నావిగాబలగానికి చెందిన పలు నౌకలలో అప్పటికే ఏర్పడ్డాయి. అయితే సిబ్బందిలో అసంఖ్యాకంగా జారిస్టు గూఢచారులు జొరబడటంతో, నల్లసముద్ర రేవులలో నౌకలు ఆగిన ప్రతిసారీ డజన్ల కొద్దీ నావికులు అరెస్టుల పాలై విచారించబడేవారు.

పొటెంకిన్‌లో జరిగిన ఆ పితూరీకి దన్నుగా నిలిచిన వారిలో ఇవాన్ బెషోఫ్ కూడా ఒకరు. ప్రస్తుతం పొటెంకిన్ పితూరీకి సాక్షిగా ప్రపంచంలో మిగిలిన ఏకైక వ్యక్తి ఇవాన్.

పొటెంకిన్ నౌకలో జీవితం చాలా కష్టభూయిష్టమైనది కావడంతో అత్యుత్తమ ప్రతిభ, శారీరక బలం కలిగిన వారే నౌకలో పనిచేయడానికి అర్హత సాధించేవారు. నౌకలో జీవితం మాత్రం క్రమశిక్షణతోనే నడిచేది.

నేను అప్పటివరకూ చిన్న ఓడలో పనిచేసేవాడిని. తర్వాత 1902లో పొటెంకిన యుద్దనౌకలో పనికి కుదిరాను. అప్పటికి నావయస్సు 20 ఏళ్లు. మూడు నెలల శిక్షణ తర్వాత నన్ను నల్లసముద్ర ప్రాంతంలో తిరుగుతున్న యుద్దనౌకలలో నియమించారు. సాధారణంగా శిక్షణ పొందిన నావికులను యుద్దనౌకలోకే పంపేవారు. కాని నా తొలి గమ్యం ఒక టోర్పెడో బోట్‌లో స్థిరపడింది. దానిలో కేవలం 50మంది మాత్రమే ఉండేవారు. సముద్రంలో దీర్ఘకాలం గడిపాక, రెండు లేదా మూడువారాలు తీరం చేరడానికి అవకాశం ఉండేది.

బోర్డులో నా ర్యాంక్ సార్జెంట్ మేజర్. టార్పెడో బోట్‌లో పనిచేస్తున్నప్పుడు నేను కోర్ట్ మార్షల్‌కు గురయ్యాను. తీరంలో ఉన్నప్పుడు కుట్ర పన్నానని నా మీద ఆరోపణలు గుప్పించారు. తీరంలో ఉండగా నేను కలిసిన, సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లు చెప్పాలని అధికారులు నన్ను బలవంతపెట్టారు. నేనేమీ చెప్పలేదు. పైగా వారు కూడా ఏదీ నిరూపించలేకపోయారు. కాని, ఏదో ఒక సాకుతో నన్ను నౌకలో  ఓ చీకటి గుయ్యారంలో 30 రోజులు  నిర్బంధించారు. రోజుకు రెండుసార్లు నాకు బ్రెడ్, నీళ్లు ఇచ్చేవారు. ప్రతి మూడు రోజూ నాకు పాత్రలో సూప్, కప్పు పాలు ఇచ్చేవారు. ఆ 30 రోజుల్లో నేను సూర్యకాంతిని చూడలేకపోయాను. విడుదలయిన తర్వాత నన్ను పొటెంకిన్ నౌకలో పనికి కేటాయించారు. దాంట్లో నేను మెకానిక్ రూమ్‌లో మెకానిక్‌గా మారాను. అది 1905వ సంవత్సరం.

ఒడెస్సా ఘటన తర్వాత ఇవాన్ బెషోఫ్ నిరవధికంగా ప్రయాణించాడు. రొమేనియా వైపు ప్రయాణిస్తున్న పొటెంకిన్‌పై దాడి చేయడానికి ఎవరూ సాహసించలేదు. అలా 11 రోజుల పాటు మేం నౌకలో ఆహారపదార్ధాలు, సరకులు ఏవీ లేకుండానే ప్రయాణం సాగించాము. చివరకు రొమేనియా రేవుతీరం చేరాం. అక్కడే మూడు వారాలపాటు గడిపాము. ఓడ తలుపులు తెరిచి దాన్నుంచి బయటపడేందుకు మాకు అనుమతి లభించేంతవరకు అక్కడే గడిపాము. రొమేనియా ప్రభుత్వం మాపట్ల  పెద్దగా ఆసక్తి చూపలేదు. మేం కోరుకున్న చోటికి వెళ్లడానికి అక్కడి ప్రభుత్వం మాకు అనుమతించింది. కొద్ది రోజుల తర్వాత మా సహచర సిబ్బందిలో కొందరు హంగరీ, చెకోస్లోవేకియా, జర్మనీ దేశాలకు వెళ్లగా, 40మంది వరకు ఇంగ్లండ్‌కు వెళ్లారు. అక్కడనుంచి వారు దక్షిణ అమెరికా చేరుకున్నారు. చాలా కాలం తర్వాత 1924లో నేను రొసారియోలో నా పాత సహచరుల్లో 40మందిని కలుసుకున్నాను.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, పొటెంకిన్ సిబ్బందిలో పలువురు జీవితంలో స్థిరపడిపోయారు. వారిలో చాలామంది తృణధాన్యాల తయారీ రంగంలో పనిచేసారు. తాము రష్యాకు తిరిగి వచ్చేందుకు అనుమతించవలసిందిగా వారిలో కొందరు అప్పటి రష్యా నేత స్టాలిన్‌ను కోరారు. అయితే వారికి ఎన్నడూ సమాధానం రాలేదు.

నా విషయానికి వస్తే, రొమేనియా నుంచి టర్కీకి వెళ్లాను. అక్కడ ఓ జర్మన్ నౌకలోని కోల్ బంకర్‌లో దాక్కున్నాను. అక్కడ నేను ఉన్నట్లు ఒకే ఒక నావికుడికి మాత్రమే తెలుసు. టర్కీనుంచి స్వేచ్ఛా పౌరుడిగా నేను ఆంట్వెర్ప్ చేరుకున్నాను. అక్కడ ఇంజనీర్‌గా పనిలో చేరాను. అక్కడినుంచి రోటర్‌డామ్ చేరుకున్నాను.

1906లో రోటర్‌డామ్ నుంచి లండన్ ప్రయాణిస్తున్నప్పుడు లెనిన్ గురించి, లండన్‌లో ఉనికిలో ఉన్న ఒక రష్యన్ పార్టీ గురించి విన్నాను. లెనిన్‌ను నేను కలుసుకోవాలని కోరిక వెలిబుచ్చాను. మేమిద్దరం కలిసి 27, కమర్షియల్ రోడ్‌లో కలిసి భోంచేశాము. ఆ సంఘటనను నేనెన్నడూ మర్చిపోలేను. నిజం చెప్పాలంటే అతడెవరో అప్పటికి నాకు తెలీదు. అప్పట్లో నేను అభద్రతా స్థితిలో ఉండేవాడిని. నా దగ్గర  చిల్లి గవ్వ లేదు. పనీ పాటా లేదు. నేనొక కుక్కలాగా ఉండేవాడిని, దానికి పైగా నాకు బొత్తిగా ఇంగ్లీష్ రాదు.

లండన్‌లో ఓ రెస్టారెంట్, రష్యన్ సర్కస్ ఉండేవి. జారిస్ట్ రష్యానుంచి తప్పించుకుని వచ్చిన వారు ఉండేవారు. ఓడలోకి తిరిగి వచ్చే ముందు అక్కడ ఓ రోజు గడిపాను. అయితే 1911లో ఇంగ్లండ్ రాజధానిలో నేను మరోసారి లెనిన్‌ను కలిశాను. ఐర్లండ్ ట్రేడ్ యూనియన్ వ్యవస్థాపకుడు జిమ్ లర్కిన్‌కు నేను పరిచయమైన సందర్భంలో నేను లెనిన్‌ను కలిసాను.

ఆ తర్వాత ఒక ఓడలో ఇంజనీర్‌గా పనిచే్స్తూ ప్రపంచమంతా ప్రయాణించాను. కానీ రష్యాకు చాలా దూరంగానే ఉన్నాను. 1914-18 యుద్ధకాలంలో నేను రష్యా తిరిగి రావడానికి కుదరలేదు. పైగా స్టాలిన్ అంటే నాకిష్టముండేది కాదు. 1927, 1937, 1962 సంవత్సరాలలో రష్యాలో స్వల్పకాలం గడిపాను. నా కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే చాలామంది చంపబడ్డారు. మానాన్న, అమ్మ కూడా చనిపోయారు. రష్యాలో విప్లవానికి ముందే ఆమె చనిపోయింది. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో నా పెద్ద తమ్ముడు చంపబడ్డాడు. రష్యాలో నా ఇద్దరు చెల్లెళ్లను మాత్రమే నేను చూడగలిగాను. చివరిసారి వారిని 1927లో చూశాను. వారికి వివాహమైంది. ఇద్దరూ చెరి ఇద్దరు కూతుళ్లను కన్నారు.

వారి భర్తలు కూడా రెండో ప్రపంచ యుద్ధంలో మరణించారు. జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వారి కూతుళ్లు అనూహ్యంగా అదృశ్యమయ్యారు. వారు జర్మనీకి తిరిగి వెళ్లి ఉంటారని లేదా చంపబడి ఉంటారని పుకార్లు వినిపించాయి. స్టాలిన్ నీకు క్షమాభిక్ష పెడతాడని, రష్యాకు తిరిగి రావలసిందిగా చాలామంది నన్ను ప్రాధేయపడ్డారు. అనేక ప్రశంసలు, గౌరవాలు కూడా కల్పిస్తామని, ఆర్థిక భద్రత కల్పిస్తామని నాకు ఆశలు పెట్టారు. అయితే స్వేచ్చపట్ల మమకారంతో నేను మరో దేశాన్ని ఎన్నుకున్నాను.

1911లో నేను పనిచేస్తున్న ఓడలో నేను ఇటలీ వెళ్లాను. చాక్లెట్లను తీసుకుని రోసారియోకు ప్రయాణం సాగించాము. ఇటలీలో ఒక చిన్న రేవులో దిగాము. దానిపేరు నాకు గుర్తు లేదు. ఇటలీలో వైన్ బ్యారెళ్లను ఓడలోకి ఎక్కించాము. 1913 నాటికి ఐర్లండ్ చేరాను. సంవత్సరాల తరబడి సముద్ర ప్రయాణం చేయడం, ఇతరులకోసం పని చేయడంతో విసుగెత్తిపోయి ఉన్నాను. నా స్వంతం కోసం కొత్త జీవితం గడపాలని అనుకున్నాను. డబ్లిన్‌లో పనికోసం వెతికి విఫలమయ్యాను. 20 శతాబ్ది ప్రారంభంలో కేథలిక్ మతస్తులైన ఐరిష్ ప్రజలు రష్యన్ బోల్షెవిక్కుల పట్ల సందేహంతో నేరుగానే అసమ్మతి వ్యక్తం చేసేవారు.

ఒక సందర్భంలో డబ్లిన్‌లోని ఒక ఓడలో పని చేయడానికి వారికి ఓ ఇంజనీర్‌తో అవసరం పడింది. అయితే నా పేరు రష్యన్ పేరు అని, నేను రష్యా నుంచి వచ్చానని తెలియగానే వారు ఆ పనిని నాకు ఇవ్వడం నిలిపివేసారు.

ఏదేమైనప్పటికీ యువ ఇవాన్ ఐర్లండ్‌లో చాలా కష్టపడి పనిచేసాడు. ఓ చిల్లర చమురు పంపిణీ దారుగా మొదట పనిచేసిన ఇవాన్ ఈ పనిలో తనదైన ముద్ర చూపాడు. అక్కడే నోరా డన్ అనే యువతిని పెళ్లాడాడు. డబ్లిన్ బే సమీపంలో సన్యాసినులు నడిపే స్కూలులో ఆమె వంట పాఠాలు నేర్పేది. ఆమె 1975లో చనిపోయింది. మొదట ఆమె క్రైస్తవ సన్యాసినిగా కావాలనుకుంది కాని నన్ను చూడగానే మనసు మార్చుకుందని  ఇవాన్ 104 ఏళ్ల వయసులో జోక్ చేసాడు. ఐర్లండ్‌లో అతడికి అనేక మంది స్నేహితులు ఏర్పడ్డారు. కానీ 1922లో అంతర్యుద్ధం తర్వాత ఇతడిని గూఢచారిగా భావించి పలుసార్లు నిర్బంధించడంలో ఇతడి స్నేహితుల హస్తం కూడా ఉందట. 1932లో కూడా ఓసారి లిమెరిక్ జైలులో తనను బంధించారు.

తర్వాత కొన్నాళ్లు రష్యానుంచి వచ్చే చమురు ఉత్పత్తులను అమ్మేవాడు. రెండో ప్రపంచ యుద్ధ ఆరంభంలో ఆ చమురు సంస్థ ఐర్లండ్‌లో పని ఆపివేయడంతో గత్యంతరం లేక తొలిసారిగా స్వంతంగా చేపలు, చిప్స్ షాపును తెరిచాడట. దురదృష్టవశాత్తూ ఇది జర్మన్ల దాడిలో కూలిపోయింది. తర్వాత ప్రస్తుతం -1987లో-  అతడు నివసిస్తున్న ప్రాంతానికి వచ్చి కొడుకు ఆంథోనీతో పాటు అక్కడే స్థిరపడ్డాడు.

ఒడెస్సా తీరానికి 5 కిలోమీటర్ల దూరంలో  ఇవాన్ బెషోప్ 104 ఏళ్ల క్రితం 1982లో పుట్టాడు. వందేళ్లపైగా  జీవించడం కుటుంబ వారసత్వబలమేనని అతడి నమ్మిక. టర్క్‌లపై పోరాడిన తన తండ్రి 106 ఏళ్ల ప్రాయంలో చనిపోయాడు. ఇవాన్ అమ్మమ్మ 113 ఏళ్లు బతికింది. నోరాను పెళ్లాడాక అయిదు మందికి జన్మనిచ్చాడు.

వందేళ్లకు పై బడిన ప్రాయంలో అతడికి చెవుడు వచ్చింది. కానీ మనస్సు మాత్రం ఇప్పటికీ తాజాగానే ఉంది. రష్యాతో అంత పెద్ద వయసులో కూడా సంబంధాలు కొనసాగించాడు. స్నేహితులతో కబుర్లు, రష్యా సంచికలను అందుకోవడం చేసేవాడు. అతడు ఒడెస్సా, ఉక్రెయిన్ అంటే ఇప్పటికీ అతడికి ప్రాణంతో సమానం. ఉక్రెయిన్ అంత ఉత్తమ ప్రాంతం ప్రపంచంలోనే లేదని ఇవాన్  చెబుతాడు.

డబ్లిన్‌లో అతడు సాదా సీదా వ్యక్తి కాదు. తన మనవడు చేపలు, చిప్స్ షాపు తెరిస్తే వందేళ్ల ప్రాయంలో కూడా ఆ విందు సమావేసంలో ఇవాన్ అటూ ఇటూ తిరుగుతూ మిత్రులను, అతిథులను పలకరించాడు. నగర మేయర్, ప్రధాన న్యాయమూర్తి  వంటి ప్రముఖులు కూడా ఈ ప్రారంభోత్సవానికి వచ్చారు. కర్రసాయంతో చివరి వరకు కులాసాగానే బతికిన ఇవాన్ రష్యాను. రష్యన్ భాషను మర్చిపోలేదు. 1987 మొదట్లో ఇటలీలోని టీవీచానెళ్లు అతడి గురించి విస్తృతంగా కవరేజ్ ఇచ్చాయి.

1987 అక్టోబర్ 25న ఇవాన్ పోయాడు.

పొటెంకిన్ యుద్ధనౌక చివరి జ్ఞాపకం అలా కనుమరుగైంది.

కాని పొటెంకిన్ నౌక జ్ఞాపకాలు కనుమరుగు కాలేదు. నూట అయిదేళ్ల క్రితం ఆ ఓడ, దాని సిబ్బంది మానవ చరిత్రకు బోధించిన పాఠాలు ఇంకా కనుమరుగు కాలేదు. నియంతృత్వం, అణిచివేత ఉన్న ప్రతి వ్యవస్థను పొటెంకిన్ జ్ఞాపకం ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ‘తిరగబడితే పోయేదేమీ లేదు..’ పొటెంకిన్ తెలిపిన ఈ సత్యం ఇప్పటికీ ప్రపంచానికి తాజాగానే కనిపిస్తోంది. ఆ విధంగా పొటెంకిన్ యుద్ధనౌక చిరంజీవి. దాని జ్ఞాపకాలూ చిరంజీవులే.

6 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, వీడియో / ఆడియో

6 Responses to “పొటెంకిన్‌లో ఆ రోజు ఏం జరిగింది?”

  1. 1
    హెచ్చార్కె Says:

    చాల కాలం క్రితం. చందమామలో ఉత్తర రామాయణం కథ సీరియల్‍గా వస్తున్నప్పటి సంగతి. అందులో శంబుక వధ సంఘటన కథ ఉంటుందా లేక దాన్ని ఎగ్గొట్టేస్తారా అని… జాగ్రత్తగా చదివాను. ఉండింది. ఆ నిజాయితీ కారణంగా, చందమామ మీద నాకు గౌరవం పెరిగింది. ఆ కథ మీద చందమామలో వ్యాఖ్యానం ఏమీ లేదు. ఉండాల్సిన చోట ఆ కథ ఉండింది. వ్యాఖ్యానం నా ఇష్టం.
    బ్యాటిల్‍షిప్ పొటెమ్కిన్ సినిమా ఫుర్వాపరాల కథనంలో స్టాలిన్ హయాంలో రష్యాలో ఆ సినిమా నిషేధానికి గురైన సంగతి మీ కథనంలో చదివి అంతటి సంతోషాన్ని అనుభవించాను. ఇందులో మీ వ్యాఖ్యానం ఏమీ లేదు. ఆ విషయం ఎక్కడ ఉండాలో అక్కడ, ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో, ఉంది. వ్యాఖ్యానం చదువరుల ఇష్టం.
    రాజ శేఖర రాజు గారూ, మిమ్మల్ని మనస్సు నిండుగా అభినందిస్తున్నాను. ఇటువంటి నిజాయితీ మనల్ని, ప్రజల్ని కాపాడుతుంది.

  2. 2
    Rohiniprasad Says:

    “చందమామలో ఉత్తర రామాయణం కథ సీరియల్‍గా వస్తున్నప్పటి సంగతి. అందులో శంబుక వధ సంఘటన కథ ఉంటుందా లేక దాన్ని ఎగ్గొట్టేస్తారా అని… జాగ్రత్తగా చదివాను. ఉండింది.”

    చందమామలోని తక్కిన ఎన్నో రచనలలాగే దీన్ని కూడా మా నాన్న కుటుంబరావే రాశారు. అవన్నీ ఎక్కువగా వాల్మీకి రామాయణంనుంచి తీసుకున్న కథలే. మార్పులూ, చేర్పులూ చెయ్యలేదు. ఆ రోజుల్లో కొందరు పాఠకులు రావణుడు సీతను తాకలేదట కదా అన్న తరహాలో సందేహాలు పంపితే వాటికి సమాధానంగా ఒరిజినల్ సంస్కృత శ్లోకాలను కూడా ఉదహరించారు. అటువంటి సందర్భాల్లో వ్యాఖ్యానం ఏమీ ఉండదు.

    రామాయణం ఎంత చెత్త కథో ఇతర సందర్భాల్లో తన వ్యాసాల్లో ఆయన ప్రస్తావించారు. నాకుకూడా చిన్నప్పటినుంచీ భారతమే ఇష్టం. రామాయణంలో నాకు నచ్చిన అంశం ఒక్కటికూడా లేదు. పూజించడం అటుంచి అదంటే అసహ్యం వేస్తుంది.

  3. 3
    కెక్యూబ్ వర్మ Says:

    పొటెంకిన్ ఓడలోని తిరుగుబాటు గురించి అతి తక్కువ చెప్పి, ఇవాన్ జీవిత కథను ఎక్కువగా చెప్పడంలో ఉద్దేశ్యమేమిటో బోధపడలేదు. సోవియట్ రష్యా ఏర్పడ్డ తర్వాత దాని నిమాణంలో భాగస్వామ్యం కాని వ్యక్తి గురించి యింత అవసరమా? తాను కోరుకున్న స్వేచ్చ పశ్చిమ గాలులదయినదిగా అనిపిస్తోంది. లెనిన్ తో పరిచయాన్ని చెప్పుకున్న వాడు మరి రష్యాకు పోవడంలో అనాశక్తత ఎందుకు చూపాడు? స్టాలిన్ తనకు భూతమయ్యాడా? మరి యీయన బోల్షివిక్ స్పిరిట్ ఎక్కడిది? రష్యన్ అయినందువలన అనుమానింపబడ్డాడే తప్ప మరో చిక్కు ఏమీలేదు.

  4. 4
    హెచ్చార్కె Says:

    వర్మ గారూ, ఇది వ్యాసంలో రెండవ భాగం. మొదటి భాగమంతా (ఫిబ్రవరి సంచిక) అసలు సినిమా గురించే ఉంది. చాల విపులంగా ఉంది. రెండో భాగంలోనే ఇవాన్ మాటలకు ప్రాధాన్యం ఇచ్చారు. పోటెమ్కిన్ కథ వాస్తవ పాత్రలలో (అప్పటికి) మిగిలి వున్న ఒకే ఒక్క మనిషి ఇవాన్. ఆయన ఏం చెబుతారనేది ఎవరికైనా ఆసక్తి కరం.
    స్టాలిన్ హయాంలో స్వేచ్ఛకు విపరీత పరిమితులు ఏర్పడ్డాయి. పలు భిన్న యోచనలను ‘అన్య వర్గ ధోరణులు’గా ముద్ర వేసి, పక్కన పెట్టారు. (దానికి యాంటీ ధీసిస్ వంటివి మావో ముందుకు తెచ్చిన ‘రెండు పంథాల మధ్య పోరాటం’, ‘వేయి పూలు వికసించనీ’ వంటి నినాదాలు). స్టాలిన్ కాలపు పరిమితులు లెనిన్ హయాంలో ఉండినవి కావు. స్టాలిన్ హయాంలో ఏర్పడినవి. దానికి ఒక సాక్ష్యం ‘బ్యాటిల్ షిప్ పొటెమ్కిన్’ మీద (రష్యాలో) నిషేధం. (దీన్ని కూడా ‘యుద్ధం’ పేరిట సమర్థిస్తారా?). స్టాలినిస్టులు ఏది సుపరిపాలన అనుకున్నారో దానికి ఏ కొంచెం వ్యత్యాసంగా ఎవరు ఆలోచించినా సహించలేని పరిస్థితులు ఆనాడు ఉండినాయని అర్థం. దాన్ని ‘బోల్షివిక్ స్పిరిట్‍’ అని ఎలా అనగలుగుతాం? అటువంటి స్వేచ్ఛా రాహిత్యం ఇష్టం లేక, ఇవాన్ రష్యా వెళ్లడం పట్ల ఆసక్తి కనబర్చక పోతే అది మహా నేరం ఎందుకవుతుంది? ఆయన రష్యాకు, సోషలిస్టు వ్యవస్థకు వ్యతిరేకి కాదు. మనం గుండెలకు హత్తుకునే ‘పోటెమ్కిన్ నావ తిరుగుబాటు’దారులలో ఒకడు. ఆనాటి పోరుకు రిగ్రెట్ కాకపోగా గర్వపడే వాడు. అట్టాంటోడి మాటలు వినాలని చాల మంది కోరుకుంటారు.

  5. 5
    కెక్యూబ్ వర్మ Says:

    హెచ్చార్కె గారికి ధన్యవాదాలు. మీరు వివరించినట్లుగానే నాటి ఫాసిస్టుల దాడితో అల్లకల్లోలంగా వున్న ప్రపంచ పరిస్థితులలో ఆనాటికి పసిప్రాయంగా వున్న సోవియట్ రష్యాను కాపాడుకునేందుకు స్టాలిన్ కాస్తా కఠోరంగా వ్యవహరించిన మాట వాస్తవం. అది కూడా చేయకపోతే ఆ కొద్ది కాలం కూడా మనలేకపోయేదన్నది సత్యదూరం కాదనుకుంటా!

    మొదటి భాగం ఫాలో కాకపోవడం తప్పిదమే. ఇక్కడ రెండో భాగంగా సూచిక లేనందువలన మిస్ అయ్యాను.

  6. 6
    రాజశేఖర రాజు Says:

    హెచ్చార్కెగారూ, వర్మ గారూ, రోహిణీ ప్రసాద్ గారూ,
    మీ అందరి వ్యాఖ్యలు ఆలస్యంగా చూస్తున్నాను. పొటెంకిన్ సినిమాను స్టాలిన్ హయాంలో నిషేధించడం అనే ఘటన ఆనాటి చారిత్రక సందర్భాలకు అనుగుణమైనదే కావచ్చు. స్టాలిన్‌ పంధాను వ్యతిరేకించిన అన్యవర్గ ధోరణుల వారు పొటెంకిన్ తిరుగుబాటును ప్రేరణగా తీసుకుని రష్యాలో అంతర్గత తిరుగుబాటును రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్న భీతి కూడా ఈ సినిమాను అప్పట్లో నిషేధించడానికి దారి తీసి ఉండవచ్చు.
    ఇంకా షాక్ కలిగించే విషయం నేను ఈ వ్యాసంలో ప్రస్తావించలేదు. సాక్షాత్తూ ఈ సినిమా దర్శకుడు ఐజెన్ స్టెయిన్ చనిపోయే ముందు వరకు అనేక సార్లు నాటి సోవియట్ రష్యా సాంస్కృతిక మార్గదర్శకుల అబిశంసనకు గురయ్యారనే విషయం మనకు షాక్ గానే ఉంటుంది. స్టాలిన్‌ను వ్యక్తిగతంగా కలిసిన సందర్భాల్లో మాత్రమే ఈ విఖ్యాత దర్శకుడు సమస్యనుంచి బయటపడ్డాడని, మిగతా సందర్భాల్లో అతడి సినీ జీవితం కూడా చాలా ఇక్కట్లకు గురైందని తెలుస్తోంది. చివరకు అతడు 1940ల మొదట్లో అమెరికా వెళ్లి అక్కడి సుప్రసిద్ద సినీ దర్శకులతో సంభాషణలు జరిపితే కూడా తనపై తీవ్ర అనుమానం, నిఘా పెరగినట్లు ఆ దర్శకుడి వ్యక్తిగత జీవిత వివరాలు చూస్తే తెలుస్తుంది. ఇవి పొటెంకిన్ సినిమాతో ప్రత్యక్ష సంబంధంలోని విషయాలు కావు కాబట్టి ఆ వ్యాసం రెండు భాగాల్లో నేను పొందుపర్చలేదు.
    ఇంకో విషయం. చార్లీ చాప్లిన్ నాజీ నియంత హిట్లర్‌పై తీసిన కళాఖండం ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాను కూడా స్టాలిన పంధా అవలంబీకులు నాటి సోవియట్ యూనియన్‌లో తీవ్రంగా అభిశంసించారు. యూదు ద్వేషంతో లక్షలాది మందిని ఊచకోత కోస్తున్న, ప్రపంచయుద్ధంలో మారణహోమం సృష్టిస్తున్న హిట్లర్ నరహంతక స్వభావాన్ని కప్పిపుచ్చి అతడిని ఓ జోకర్‌గా, బపూన్‌గా చేసి సినిమా చేయటం ఏమిటి అని సాక్షాత్తూ స్టాలినే ఈ సినిమా చూశాక తీవ్ర అసహనానికి గురయ్యాడట. మొత్తం మీద రెండో ప్రపంచ యుద్ధం ముగిసి తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనేంతవరకు చాప్లిన్ తీసిన ఈ సినిమాకు సోవియట్ రష్యాలో తగిన గౌరవం లభించలేదు. తర్వాత 1950లలో అదే సోవియట్ యూనియన్ చాప్లిన్ సినిమాకు బ్రహ్మరథం పట్టింది.
    సోవియట్ రష్యా రెండో ప్రపంచ యుద్ద కాలంలో దాదాపు రెండు కోట్ల మంది సైనికులు, ప్రజలను కోల్పోయింది. హిట్లర్ దాడికి ఇంతగా జాతి నిర్మూలన అయిన దేశం మరొకటి లేదు. ఇంత మారణ కాండకు కారణమైన హిట్లర్‌ను మామూలు జోకర్‌గా చూపించిన ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమా అప్పట్లో స్టాలిన్ పంధా అవలంబీకులను, సోవియట్ రష్యాను కూడా అప్పట్లో మండించి ఉండవచ్చు. యుద్దం తప్ప, యుద్ధంలో మిగలటం తప్ప ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణకు తావులేని స్టాలిన్ హయాం పొడవునా ఇలాంటి నిర్ణయాలు, అవాంఛనీయ ఘటనలు చాలానే జరిగాయి.
    అంతమాత్రాన చాప్లిన్ సినిమా గొప్పది కాకుండా పోతుందా? ‘సైనికులారా ప్రేమించండి. బానిసత్వాన్ని కాదు.. మానవత్వాన్ని’ అంటూ చిత్రం చివరలో దాదాపు 10 నిమిషాలకు పైగా హిట్లర్ పాత్రలోని దర్శకుడు చాప్లిన్ ఇచ్చిన మానవీయ సందేశం చారిత్రక విశిష్టత మసక బారిపోతుందా?
    అందుకే శాంతి లేని సమాజంలో, నిత్య ఘర్షణలు చెలరేగుతున్న సమాజంలో జరిగే ఘటనలు తాత్కాలికంగా సామాజిక ఆమోదానికి గురైనా, తదనంతర కాలంలో చరిత్ర ఆమోదాన్ని పొందలేవు. ఇది కేపిటలజానికైనా, సోషలిజానికైనా సమానంగా వర్తించే విషయం. మొత్తం మీద చూస్తే విజయాలే ఎక్కువ కాబట్టి ఆ నిర్దిష్ట కాలంలో జరిగిన మంచే ఎక్కువ అని సాధారణీకరించడం సమంజసం కాదని నా వ్యక్తిగతాభిప్రాయం. ఇందుకు సంబంధించి, సోవియట్ శైశవ రాజ్య నిర్మాణంపై రోజా లగ్జెంబర్గ్ ప్రచురించిన ఆ అయిదు చారిత్రక కరపత్రాలు చరిత్రకు ఈనాటికీ విలువైనవే.
    స్టాలిన్ కాలంలో పలుమార్లు సోవియట్ సాంస్కృతిక మార్గదర్శకుల అభిశంసనకు గురైన ఆ పొటెంకిన్ దర్శకుడే, ఆ చార్లీ చాప్లినే తదనంతరం అంటే, 50ల నుంచి సోవియట్ రష్యాలో అపార గౌరవం పొందారన్నది కొసమెరుపు.
    మీ స్పందనలకు, అభినందనలకు కృతజ్ఞతలు..

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో