ఆడేపు లక్ష్మీపతి కథల్లో స్త్రీ పాత్రలు

సాంఘిక జీవితంలోను  ఆ జీవితాన్ని ప్రతిబింబింపచేసే కళారంగంలోనూ ఎన్నోమౌలికమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరులో ఒక కొత్త దృష్టి వచ్చింది. పునాదుల్ని కదిలించే చర్చయివ్వాళ సాహిత్యంలో ప్రవేశించింది. స్త్రీలను గురించిన ఆలోచన ఆవేదన సమాజం లో స్పష్టంగా కన్పిస్తోంది. అలాంటి సాహిత్యంలో ఒక భాగంగా మనం కథాసాహిత్యాన్ని విశ్లేషించుకొంటున్నాం.
గత చరిత్రను మనం క్షణం ఆలోచిస్తే స్త్రీల స్థితిగతుల్లో మార్పు కన్పిస్తుంది. ఒకప్పుడు స్త్రీలు దిగువ మధ్య ఉన్నత ఆటవిక దశలలో చాలా గౌరవనీయమైన స్థానాల్లో ఉన్నారు. అది మాతృస్వామ్య వ్యవస్థలో జరిగింది. అక్కడ స్త్రీ ప్రముఖ స్థానాన్ని నిర్వహించింది. అయితే పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీకి  ఆ గౌరవం పోయింది. స్త్రీలపై అణచివేత ప్రారంభమైంది . కేవలం పిల్లల్ని కనే యంత్రంగా స్త్రీ మిగిలిపోయింది ఒక బానిసగా, భోగ్యవస్తువుగా తయారైంది. స్త్రీ శ్రమశక్తి సామాజిక గుర్తింపులేదు. విస్తరించిన పరిశ్రమలు స్త్రీ ని కుటుంబంలోనుంచి బయటికి లాగి శ్రమ మార్కెట్ లోకి తీసుకొనివచ్చాయి. క్రమంగా ఎన్నో సమస్యలు ? ఆ సమస్య వలయంలో యివ్వాళ స్త్రీలు ఊపిరాడక సతమతమవుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా యింకా మహిళాభ్యుదయం, మహిళాభివృద్ధి అంటూ ప్రభుత్వపథకాలు స్త్రీల ను వెక్కిరిస్తున్నాయి. సమాజాభివృద్ధికి స్త్రీలు కీలక పాత్ర వహిస్తున్నా నేటికీ అసమానతలు , దోపిడీవారిని వెన్నాడుతూనే ఉన్నాయి. బహుముఖ దోపిడీ వారిపై ఎక్కువవుతూనే ఉంది.ఎక్కువ శాతం స్త్రీలు వ్యవసాయకూలీలుగా పడరాని పాట్లు పడుతున్నారు. తక్కువ కూలీ ఎక్కువ శ్రమకి మహిళలు ఈడ్వబడుతున్నారు. పైగా అదనంగా కుటుంబ బాధ్యతలు స్త్రీలవే. లైంగిక హింస, అత్యాచారాలు కులవివక్ష, లింగవివక్ష లాంటి వెన్నో సభ్యసమాజం తలదించుకునేలా జరుగుతూనే ఉన్నాయి.
సామాజిక అవసరాలకు ప్రతి స్పందనగానే ఆధునిక సాహిత్యం ఆరంభమైంది. ఆధునికీకరణ జరిగాక, ప్రజాస్వామ్య ఆలోచన నుండి సాహిత్యం సామాన్యుని దరికి చేరింది. ఆ  సామాన్యుని గురించి రాయాలనే తపన నుంచి నవల, కథ మొII  ఆధునిక సాహిత్య ప్రక్రియలు పుట్టాయి.తెలుగు కథకి వందేళ్ళు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ ఏడాది ఈ సదస్సు జరగడం సముచితమే. ఈ సుదీర్ఘ నూరు సంవత్సరాల్లో నాలుగైదువేల మంది కథలు రాసి ఉంటారు.తెలుగు ప్రాంతం వారి తోపాటు యితర భాషా ప్రాంతాల్లో ఉంటూ రాసిన వారూ ఉన్నారు. సుమారు అయిదారు తరాల కథా  రచయితలున్నారు.
మనిషికి మాట వచ్చినప్పటి నుంచీ కథలున్నాయి. కథకు అందరికీ ఉంటాయి. కానీ అందరూ కథలు చెప్పలేరు. తెలుగు కథ తొలినుంచీ జీవితాన్ని అంటిపెట్టుకొనే ఉంది.
వేశ్యాలోలుడైన భర్తను సంస్కరించుకొన్న యిల్లాలు కథ గురజాడ “దిద్దుబాటు” దిక్సూచి లాంటి ఆ కథను తెలుగులో తొలికథగా పేర్కోంటారు. ‘మెటాల్డా’ సంస్కర్త హృదయం’ కథలకు కూడా స్త్రీ సమస్యే కేంద్ర బిందువు. గురజాడ  తరువాత వారికి మార్గదర్శికుడిగా నిలిచారు. గురజాడ స్త్రీని ఒక మహత్తర శక్తిగా గుర్తించారు.”భారత దేశ చరిత్ర ను ఆధునిక మహిళ తిరగరాస్తుందని ” ఆశపడ్డారు. అయితే గురజాడకు ముందు భండారు అచ్చమాంబ 1901 లోనే ‘గుణవతి యగు స్త్రీ’ అనే కథను ప్రచురించారన్న వాదన ఉంది.
గురజాడ తర్వాత తెలుగు జాతి మీద, తెలుగు భాష మీద ఉన్న మమకారం లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వాస్తవికతాదృష్టి తో’ కీలెరిగినవాత’ ,’ కొత్తచూపు’  మోII కథల్లో స్త్రీ సమస్యల్ని చిత్రించారు. అలాగే చలం స్త్రీ పురుష అసమ సంబంధాల గురించి స్త్రీ స్వేచ్ఛ గురించి ఒక సమగ్ర స్త్రీని కలగంటూ కథలు నూటికి పైగా రాశారు. “ఆర్గ్యుమెంటు”, ” ఓ పువ్వు పూసింది” ” జలసీ ” మొII వీరి తరువాత కరుణ కుమార, కొడవటిగంటి, గోపీచంద్  లాంటి కథా రచయితలు స్త్రీల గురించిన సమస్యల్ని కథల్లో చూపారు. చివరి దశాబ్దంలో 1997 లో  “నాలుగు దృశ్యాలు “పేర ఆడెపు లక్ష్మీపతి కథా సంపుటిని వెలువరించారు.  ఆ సంపుటిలో 17కథలున్నాయి. ఇందులో ముఖ్యంగా నాలుగు కథలు స్త్రీవాద కథలుగా పేర్కోనదగినవి.
ఒకసారి మనం స్త్రీవాద సాహిత్యం ఆరంభవికాసాదులు పరిశీలిద్దాం. 1792 లో విండికేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ విమెన్  ” మేరీ వొలస్పన్ క్రాప్ట్ ” స్త్రీ వాద ఆలోచనాధోరణికి నాంది పలికారు. ఈ పునాది మీద 1949లో “ది సెకండ్ సెక్స్  ” , “సైమన్ డి బావురే ” ఆధునిక స్త్రీవాదానికి ఒక స్పష్టమైన రూపాన్నించింది. ” Sexual politics ” 1970 లో కేట్ మిల్లెట్ స్త్రీ అణచివేతలు పితృస్వామ్యం కారణమన్నారు. 1960 నాటికి స్త్రీవాద  ఉద్యమం ఈ దేశంలో అనివార్యమైంది. స్త్రీలను అదుపు చేస్తున్న శక్తులను ప్రశ్నిస్తూ స్త్రీ స్వేచ్ఛను ఆదర్శంగా తీసుకోవలనుకున్నారు . జాతీయ అంతర్జాతీయ భూమిక స్త్రీవాదానికి పటిష్టంగా వుంది.
ఓల్గా , వాడ్రేవు వీరలక్ష్మి , కుప్పిలి పద్మ , సుజాత కథలు , కె.వరలక్ష్మి , నిర్మల మొII వారెందరో స్త్రీవాద రచయిత్రులు స్త్రీవాద కథల్ని వెలికితెచ్చారు.గత శతాబ్దిగా స్త్రీల జీవితాల్లో మార్పు రాలేదనడం భావ్యం కాదు కాని రావలసినంత మార్పు మాత్రం రాలేదనడం నిజం. విధానపరంగా స్త్రీల     జీవితాలు మారినా సంపూర్ణ స్వేచ్ఛకు నిర్ణయాత్మకశక్తికి యింకా దూరం గానే వున్నారనిపిస్తుంది. ఆకాశంలో , ఙ్ఞానం తో , జనాభా లో సగమైన అవసరము ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని, సంఘటితం కావాల్సిన అవసరముందని, పరిణతి చెందిన నిర్ణయాత్మక శక్తిగా స్త్రీలు  ఎదగాల్సిన తరుణం ఆసన్నమైందని తెలియచేసే కథలు ఆడెపు లక్ష్మి పతి సంపుటిలో కన్పిస్తాయి. సమస్యలు చాలా పాతవే. కాలం మారినా మారని సమస్యలు స్త్రీలతో , స్త్రీల జీవితాల్తో ఎలా ఆడుకుంటున్నాయో లక్ష్మిపతి చూపారు. అయితే సమస్యల్ని చూపడం తో పాటు వాటి పరిష్కార మార్గాల్ని చూపడం కథల్లో ప్రత్యేకత. స్త్రీలు పరిణతి చెందిన తీరు రాబోయే తరానికి సంకేతంగా మార్పుకు శ్రీకారం చుట్టినట్లు పాఠకులకనిపిస్తుంది. ఆలోచన రేపే కథలవి నాలుగు స్త్రీవాద కథలున్నాయి. అవి స్త్రీవాద కథలే అయినా స్త్రీవాదాన్ని కావాలని చొప్పించక కథలు మాత్రం కావు. అతివాద స్త్రీవాద కథలు కావు అంటే కథల్లో అంతర్భాగంగా స్త్రీవాదం కలిసిపోయింది . తక్కిన రెండు మూడు కథల్లోను స్త్రీ ల గురించిన ప్రస్తావన ఉంది. స్త్రీలలో వారి ప్రవర్తనలో మార్పు రావాలనే కథలివి. ఇలా వర్తమాన సమాజంలో స్త్రీలు కీలక పాత్ర పోషిస్తున్నారు గనుక చైతన్యం రావాలన్నది రచయిత అభిప్రాయం .మొరుగైన సమాజం కోసం యిలాంటి కథలు అవసరం . కొన్ని పారిభాషిక పదాలు , సైన్సు సమీకరణలు విరివిగా కథల్లో వాడారు. ప్రతినిత్యం మధ్య తరగతి ప్రజల్లో జరిగే మానసిక సంఘర్షణ పాఠకులకు ముందుంచారు. ద్వంద్వ ప్రమాణలు , డొల్లతనం, కుహనా విలువల పరంపత్ర సందర్భం వచ్చినపుడల్లా విమర్శకు పెడతారు.
“తిర్యగ్రేఖ ” మొదటీ కథ. స్త్రీ సమస్య చాలా కాలం నుండి వస్తున్నదే . మరీ ముఖ్యంగా యిపుడు వెయ్యివెర్రి తలలు వేస్తు న్నదే. చైతన్య స్రవంతి ధోరణికి చెందిన శక్తి వంతమైన కథ వర్తమాన సమాజంలో ప్రస్తుతం అమ్మాయులు ఇలాంటి విపరీతధోరణి తో కూడిన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.ఆడేపు లక్ష్మి పతి ఈ కథను వాస్తవికంగా , విన్నూత్న రీతిలో నడిపారు. కథలో రేఖ కాలేజి అమ్మాయి. మాన భంగానికి గురికావడం యితివృత్తం. రచయిత ఈ కథను రెండు ప్లాష్ బ్యాక్ లో సరికొత్త విధానం తో చైతన్యస్రవంతి ధోరణిని అనుసరించారు.ఒకమనిషి మనసును శోధించి వెలికితీయడం అంత సులువైన పనికాదు. అన్ని ఆలోచనలూ ఒక్కరీతిలో సాగవు. తాను సృష్టించిన పాత్రల మనసుల్ని వాస్తవికతా దృక్పధంతో పాఠకులముందు నిలబెట్టారు. రేఖ మనసుతో పాటు యింట్లో వాళ్లందరు స్పందించిన తీరు చాల సహజంగా ఉంది. తండ్రి సహజంగా షాక్ కు గురి అవుతారు. ఇంట్లో పనులన్నీ ఎక్కడి వక్కడ ఆగిపోతాయి. మనుషులు చాలా వ్యధకు  గురి అవుతారు. ఇక బయట ప్రపంచం ఈ సంఘటనను భూతద్దంలో చూపెడుతూ అదేదో పెద భూకంపం వచ్చిన విధంగా పిల్ల మనస్సును, యింట్లో పెద్దల్ని బాగ గాయ పరుస్తారు. కళాశాల వాతావరణం , పిల్లల గోల మామూలే . ప్రిన్స్ పాల్ గరిమాదేవి చాల కీలక పాత్ర పోషించండం విశేషం. ఎందుకంటే దెబ్బతిన్న ఆడపిల్ల మనసును అర్థం చేసుకోవడం పై అధికారులు, పాలకులు అంతగా వూనుకోరు.యాంత్రికంగా ఆ , ఊ అంటూ పట్టీపట్టనట్లు వదిలేస్తారు. అదొక మొక్కుబడి అనుకొంటారు. ఇక్కడ గరిమాదేవి రేఖకు ధైర్యం చెప్పి, అండగా నిలుస్తారు. చూడ్డానికి చిన్న సాయమే అనిపించినా ఆ అమ్మాయి భవిష్యత్తు మాత్రం డోలయమాన పరిస్థితి నుండి కాపాడే పని చేశారామె. జరిగిన ప్రమాదానికి ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించారు. ఒక చైతన్య ప్రదాయినిగా ఆడపిల్లల పాలిట వరంగా ప్రవర్తిస్తారు. సమాజంలోయిప్పటిదాకా  మానభంగం పట్ల పాదుకుపోయిన అభిప్రాయలను , విశ్వాసాలను, పురుషాధిక్య భావజాలాన్ని క్రమంగా ఖండిస్తారు. ” మానభంగమనే దాన్ని పిచ్చికుక్కకాటుగో, చిన్నమామూలు ప్రమాదంగానో తీసుకుని తగిన వైద్యం చేయించుకుని ఆడపిల్లను కరిచిన కుక్క(రేపిస్టు)ను కఠినంగా శిక్షించమంటారు” రావాల్సిన మార్పు యిదే . నాటి యువతరానికి ప్రతీక రేఖ పాత్ర. ఇలాంటివి జరిగినపుడు బాగా కుంగిపోవడం, ఆత్మహత్యలు చేసుకోడం , పిచ్చిపట్టి నిర్జీవంగా బతకడం లాంటివి సాధారణంగా మనం చూస్తుంటాం. దీనికి భిన్నంగా లక్ష్మీపతి చూపిన మార్గం ఆడపిల్లలకు మనోధైర్యం యిస్తుంది. కొత్త జీవితాన్నీ యిస్తుంది. రెండో ప్లాష్ బాక్ లో గరిమాదేవి రేఖకు జరిగిన మాన భంగాన్ని గురించిన విశ్లేషణ సమాజమార్పుకు దోహదం చేస్తుంది. ” మానభంగం వల్ల జీవితం కళంకమై పోతుందనే భావనే కళంకం మాన భంగాన్నికన్యత్వానికి , పవిత్రతకూ ముడిపెట్టడం అవివేకం. జరిగింగి పీడకలలాగా మరిచిపో , నీకేమీ భయం లేదు . సంఘం రాను సృష్టించుకొన్న భయాలూ, భేషజాల నడుమ కృత్రిమ దర్పం ఒలకపోస్తూ బతుకుతున్నది .దీన్ని మార్చడం ఈ యువతరానికే సాధ్యమవుతుంది. నువ్వు  నడు ….. నీ వెనుక నారీ జగత్తు నిలబడుతుంది.. నీవు ఓంటరి దానివి కావు. ఉద్యమశక్తివి.” ఇలాంటి సూచనలు యిదివరకటి కథల్లోనూ కనబడి నా మార్పు యింకారాలేదు. అంటే పాదుకుపోయిన ఈ ధోరణి అంత సులువుగా మారదు. ,మహిళలు సంఘటితం కావాలన్న రచయిత సూచన చాల ప్రధానమైంది. ధైర్యం , సాహసంలో మహిళ ముందుకు నడవాలన్నదీ గొప్ప సందేశం . ఇలాంటి కథలు మరిన్ని రావాలి.
రేఖా గణితంలో రెండు సమాంతరరేఖల్ని అడ్డంగా ఖండిస్తూ పొయే రేఖ “తిర్యగ్రేఖ ” అంటారు..ఎంతో అర్థం యిందులో వుంది. కొన్ని సైన్సు సమీకరణలు సహజంగా అన్పిస్తాయి. “అబ్ సాల్యూట్ జీరో వద్ద సమయం ఆగిపోయింది. ఉష్ణోగ్రత  సున్నా. ఘనపరిమాణం సున్న. పీడనం సున్న . అనుభూతి అంతా సున్న …నానమ్మ భాషలో జీవితమే సున్న” పైమాటలు రేఖ అత్యాచారానికి గురైన క్షణంలో అన్నవి. అన్నతో కలిసి స్టేషనుకు వెళ్ళి రేఖ రిపోర్టు యివ్వడం, వైద్య పరీక్ష రిపోర్ట్ జత చేయడం, మహిళా సంఘాల్ని సంఘటితం చేయడం చకచకా జరిగిపోతాయి. ఇలాంటి ఆలోచనలు సమాజం పట్ల స్త్రీల పట్ల రచయితకున్న నిబద్ధతను ఆరాటం తెలియచేస్తాయి. ఒక సందర్భంలో రేఖ  మాటలు రానున్న మార్పును సూచిస్తాయి. ” మీరు కాలం వెంట పరిగెత్తే మనుషులు. నేను కాలాన్ని నా వెంట పరిగెత్తేలా చేస్తాను ” రేఖలో వచ్చిన ఈ మార్పు, ఆత్మస్థైర్యం ప్రతి మహిళకూ రావాలి. “తిర్యగ్రేఖ” యితివృత్తం పాతదే అయినా సరికొత్త రీతిలో రచయిత పాఠకుల్ని చైతన్య పరిచే రీతిలో నడిపారు. ఈ సంపుటిలో రెండో కథ ‘వ్యభిచారం’ . సమాజంలో ఆచారం పేరిట జరుగుతున్న పెళ్ళి చూపుల తంతు ఇతివృత్తం.పెళ్ళీడువచ్చిన అమ్మాయిలు అనేక మంది పెళ్లికొడుకుల ముందు పెళ్లి చూపుల ప్రహసనం ఎలా అవమానించబడుతున్నారో కథలో రకరకాలుగా చూపారు. ఆడపిల్ల మనసులో ఆవేదన, బాధ ఉత్కంఠ ” అతనికి నేను నచ్చుతానో లేదో ?” అతనే నాకు కాబోయే భర్త అని ఏవేవో ఊహలపల్లకిలో ఊరేగే ఆడపిల్లల అమాయకత్వం. ఈ రెండూ కథ సాంతం ఆసక్తి కరంగా సాగుతాయి. ఆడపిల్లలు ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగాలు చేస్తున్నా పెళ్ళి చూపుల తంతులో పావులే. తల్లి దండ్రుల మనసులో పెద్ద గజిబిజి , బాధ  పిల్ల మనసులో రకరకాల ఆశలు. ఈ తంతు రూపం మారలేదు . జరిగే విధానం అంతా అదే. కట్నం డబ్బుల చూట్టూ తిరిగే ఈ క్రీడలో బాధితులు ఒక వైపు తల్లిదండ్రులు, మరోవైపు ఆడపిల్లలు. తనను గురించి ఏవేవో కలలు కనడం మాత్రమే గాదు అమ్మాయి అతనితో లైంగిక సంపర్కాన్ని ఊహించుకుంటుంది. అందుకే దీనిని మానసిక వ్యభిచారం అన్నారు.
పెళ్లి చూపులకని ప్రతిసరి అలంకరించుకోడం, యింట్లో హడావిడి కథలో అమ్మాయి స్నేహితురాండ్రు కొన్ని సంఘటనలు చెప్పడం ఆ అమ్మాయి ఆలోచనలో పడేస్తుంది. పెళ్ళే జీవితం కాదని, పెళ్ళి జీవితంలో ఒక భాగం మాత్ర్రమేనని తనకు బాగా నమ్మకం కుదురుతుంది. చైతన్యవంతురాల్వుతుంది. వాడుకలో ఆర్థాంగిగా వ్యవహరింపబడుతున్నటికీ స్త్రీ మగవాడి సరసన అధమ స్థాయిలో ఉంది . “నస్త్రీ స్వాతంత్ర్యమర్హతే ” అలాగే “స్త్రీలు మీ సేద్యపు భూములు యదేచ్ఛగా దున్నుకోండి. అనవసమనుకొన్నప్పుడు ఒక్క మాటలో పరిత్యజించండి” ఇది పురుషాధిక్య భావజాలానికి దైవిక న్యాయ ప్రతిపత్తి యిచ్చే కుటిలపన్నాగం” అంటారు. అంతేకాదు పురుషులకో నీతి, స్త్రీలకో నీతి ఉంటుంది. శీలం స్త్రీలకే గాని పురుషులకు అవసరం లేదంటారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాల ప్రాతిపదికన నైతిక విలువలను రచయిత  తూర్పార బట్టారు. కథ మధ్యలో కాల్ గరల్ ప్రస్తావన తెచ్చి, స్త్రీలు ఎందుకలా నెట్టబడతారో చూపారు. మహిళలు అలాంటి వృత్తిలో చాలా కాలం మనలేక’ సహోదరి’ అనే స్వచ్చంద సంస్థలో చేరి వారి జీవితాలను సుఖమయం చేసుకుంటారు. పెళ్ళికొడుకువాళ్ళు రావడం లేదని తెలిసి తండ్రి కొయ్యబారిపోతాడు . అమ్మాయి మాత్రం పీడ విరగడైందని , పెద్ద భారం దించుకొన్న భావనతో యిలా అంటుంది ” ఇక ఈ మానసిక వ్యభిచారం చాలమ్మ పెళ్ళి మాట వస్తే నా శవాన్ని కళ్ళ చూస్తారు” ఆడపిల్ల అంతర్గతంగా ఎంత బలవంతురాలో పై మాటలు చెబుతాయి.  అందుకే స్త్రీలు తమ లో దాగిన శక్తి సామర్థ్యాలను తామే గుర్తించాలని నిర్ణయాత్మక శక్తి ని సంపాదించుకోవాలని రచయిత సూచన.
మూడో కథ  “స్టాండర్డ్” తన భార్య తనకే సొంత మనుకొనే సాదాసీదా భర్త కథ. భార్య అంటే సకల సేవలు, యింటి , వంట పనులు చేస్తూ యింటికె పరిమితం కావాలనుకునే సంకుచిత భర్త. పైగా బయట ప్రపంచంలో ఏంజరిగినా పట్టించుకోరాదని భార్యకు షరతు. ఇలాంటి ఒక భర్తను తన పట్టుదలతో, తాను చేస్తున్నపనిలో ఎంతో అర్థం ఉందని తెలిసి నిర్ణయంగా భర్తకు అయిష్టమైనా చేసి అతణ్ణి తన వైపుకు తిప్పుకోగలిగిన శక్తి మంతురాలు కథ. ఉష కథలో గొప్ప చైతన్యవంతురాలు. భర్త ఎన్ని ఆంక్షలు విధించినా ,ఆడపిల్లల్ని గురించి, వాళ్ళ కష్టసుఖాలను గురించి భర్త ఎదుటే ఉపన్యాసం యిస్తుంది. మరో సందర్భంలో  పక్క వీధిలో ఒళ్ళు కాలి ఒక యిల్లాలు మరణిస్తే ఉష  అక్కడికి వెళ్ళి ఇరుగు పొరుగు నడిగి విషయం తెలుసుకుంటుంది. ఒక లెక్చరర్ భర్త దుర్మార్గానికి బలియైయిన భార్య పక్షాన నిలబడి పొలీసులకు ఫిర్యాదు చేయిస్తుంది.ఉష భర్తకిదంతా నచ్చదు. ( ఇప్పటికీ పరిస్థితి  యిదే కదా) సమాజంలో నేను , నాది అనుకునే మనుషుల శాతమే ఎక్కువ. కలిసి అందరం మరొకరి బాధను తమదిగా భావించుకొనె తత్వాలు యింకా రాలేదు. చనిపోయిన శారద తమ్ముని మనసులో తుఫాను ,బాధ ఆ దుర్మార్గుణ్ని కఠినంగా శిక్షించాలనే ఆవేశం, ఆవేదన ఒక వైపు, యిద్దరు చెల్లెల్లున్న ఉష భర్త  ఈ సంఘటన చూసి కూడా చలనం లేకుండా ,ప్రేరణ పొందకుండా స్థాణువుగా ఉండడం మరోవైపు. దీనికి కారణం ఉదాసీనత కావచ్చు పిరికితనం కావచ్చు లేదా స్వర్థం కావచ్చు. ఒక వాస్తవిక సమాజాన్ని రచయిత మన కళ్ళముందుంచారు. తోటీ మహిళ కోసం తన భార్య స్పందించిన తీరు  భర్తకు చివర్లో కనువిప్పు కలిగిస్తుంది. స్వార్థం, పురుషాహంకారం పునాదుల్తో కూలిపోతాయి. ఉష చదువుకోవాలన్న తన నిర్ణయాన్ని భర్త కు చెబుతుంది ఙ్ఞానం జీవితానికి పునాది. ఉష లోని చైతన్య దాహానికి చలించిపోతాడు. తన భార్య ముందుతానొక మరుగుజ్జు అనుకొంటాడు. తన స్టాండర్డ్  లేనని బాధ పడ్తాడు. ఇల్లాలు తెచ్చిన ఈ మార్పు తనలోదాగిన శక్తిని తనకే తన భర్తకు తెలియచేసిన విధానం గొప్పగా చిత్రికమైంది.
నాలుగో కథ “మలుపు” ఒక విచిత్రమైన కథ. భర్త చనిపోయిన భార్య , భార్యచనిపోయిన భర్త యిద్దరూ రెండో పెళ్ళి చేసుకోవాలనుకొంటారు. ఆ పెళ్ళికొడుకు ఒక షరతు పెట్తాడు.భర్త చనిపోయిన సునీతకు ఒక కూతురుంది. భార్య చనిపొయిన శ్రీకాంత్ కు యిద్దరు పిల్లలున్నారు. సునీత  తన కూతుర్ని తన వెంటతీసుకురాకుడదన్న షరతు శ్రీకాంత్ పెడ్తాడు. సునీత యింట్లో వాళ్ళు సునీత కోసం ఆమె కూతుర్ని తామే  పెంచుకొంటామని సునీతను పెళ్ళికి ఒప్పుంచి పెళ్లి జరిపిస్తారు. శ్రీకాంత్ తన పిల్లలిద్దరికి తల్లిలేని లోటు తీర్చాలని సునీతతో అంటాడు. శ్రీకాంత్ మంచివాడే కాని తనబిడ్డల గురించే ఆలోచిస్తాడు గాని సునీతకు కూడ ఆ కూతురిపై మామకారం ఉంటుందని అనుకోడు. సునీత మాత్రం యిష్టం లేకపోయినా శ్రీకాంత పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటుంది. కొన్నాళ్లు గడిచాక సునీత పిల్లకు బాగలేదని కబురువస్తుంది. శ్రీకాంత్ సునీత ఇద్దరూ చూడ్డానికి వెళ్తారు. సునీత బిడ్డ పడే బాధ చూసాక శ్రీకాంత్ మనసు మారుతుంది. తల్లీ కూతుళ్ళ బంధం చూసి చలించిపోతాడు. సునీత బిడ్డను తన బిడ్డగా అంగీకరిస్తాడు. తనకిక ముగ్గురు బిడ్డలని సంబరపడ్తాడు. దాంపత్యమంటే యిదే.ఒకరినొకరు అర్థం   చేసుకుని , గౌరవించుకొని బతకడం . సునీత పాత్రలో పరిణతి , నిగ్రహశక్తి , మంచితనం , తల్లి పాత్ర పోషించిన తీరు గొప్పగా చిత్రించాడు రచయిత. పై రెండు కథల్లో’ స్టాండర్డ్’ , ‘మలుపు’ స్త్రీవాదం అనడం కంటే స్త్రీ జనాభ్యుదయం కోసం అంతర్భాగం గా కథలో స్త్రీవాదం కనబడూతుంది. రెండు కథల ముగింపు మాత్రం స్త్రీవాద కథ లకంటే భిన్నంగా ఉందేమొ ? ‘స్టాండార్డ్’ లో ఉష ,’ మలుపు’ లో సునీత యిద్దరినీ రచయిత విజయపథంలో నడిపిన తీరు విన్నూత్నంగా ఉందనిపిస్తుంది. ఏ వాదానికీ లోబడని మానవతావాదం కథల్లో కన్పడుతుంది.
ఈ సంపుటిలోని అన్ని కథలు యిలా పాఠకుల్ని ఆలోచింపచేస్తాయి. సమాజాన్ని సమగ్రంగా దర్శింపచేస్తాయి. మేరుగైన సమాజం కోసం రచయిత దృష్టికోణం విన్నూత్నముందనిపిస్తుంది. తక్కిన అన్ని కథల్లోనూ సామాజిక , ఆర్థిక సాంస్కృతిక పరిస్థితుల పరంపర చక్కగా విశ్లేషించారు.
తెలంగాణ ప్రాంత రచయిత లక్ష్మిపతి కష్టమంటే తెలిసిన వ్యక్తిగా అన్ని కథల్లో వాస్తవిక సమాజాన్నే మనముందుకు తెచ్చారు. వర్తమాన సామాన్యుడు తన్నుతను తెలుసుకునేందుకై కథల వైపు  మళ్ళుతున్నాడు. సత్యాన్ని తెలుసుకున్నాకథకులు లక్ష్మీ పతి .” ఏకాకి తనం బద్ధలయ్యే నిశ్శబ్ద క్షణాల కోసం మనిషి ఆశగా ఎదురుచూస్తున్నందుకే కథ అవసరం”  అంటారాయన. ఆయన అన్ని కథలు మానవజీవితపు తునకలే .

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 Responses to “ఆడేపు లక్ష్మీపతి కథల్లో స్త్రీ పాత్రలు”

  1. 1
    bsramulu Says:

    చ్చ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్బ్బబ్బ్గుంద

  2. 2
    ramnarsimha Says:

    బిఎస్.. గారు

    మీ అభిప్రాయాలు.. విచిత్రంగా ఉన్నాయి..

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో