Jun2010
బెడ్ టైం స్టోరీ
సిండరెల్లా సుకుమార పాదం
గాజు చెప్పు లోకి అందంగా ఇమిడిపోతుంది
తెలిమంచు లాంటి స్నోవైట్ గొంతులో చిక్కుకున్న
ఎర్రటి ఏపిల్ ముక్క ఊపిరాడక బయటపడుతుంది
రాజకుమారుడి ప్రేమార్తి మృదుస్పర్శై తనను స్పృశించగానే
స్లీపింగ్ బ్యూటీ ఒక్కసారిగా నిద్ర లోంచి లేచికూర్చుంటుంది.
కధలన్నీ క్షణాలై కరిగిపోతున్నా
ఈ లేత కలువల కన్నులను మాత్రం
నిద్రాదేవి ఇంద్రజాలం తాకను కూడా తాకలేదు .
ఏపుగా పెరిగిన చిక్కుడు తీగపైకి ఎగబాకిన జాక్
మబ్బుల వెనక సంపదలని కొల్లగొడతాడు.
చిన్నారి పిచ్చుక పిల్లకు అమ్మెవరో తెలిసిపోతుంది
ఏడుచేపలూ గడ్డివామి వెనకాల ఎప్పుడో ఎండిపోయాయి.
దాహమేసిన కాకమ్మకు రాళ్ళకుండలోని తియ్యనినీరు దొరికేసింది
అమెరికా రామయ్యకు ఆంధ్రా సీతమ్మతో తొలిచూపు లోనే పెళ్ళి కుదిరింది
కలగా పులగపు కధలు చెప్తూ చెప్తూ ఓ రెండు క్షణాలపాటు
ఏమారిన నేను అలసటతో రెప్ప మూసానో లేదో
తన చిట్టిచేతుల హారాలతో నా మెడను కౌగలించి ఒదిగిన మల్లెచెండై
నా చిన్నారి రాకుమారి చటుక్కున నిద్రలోకి జారుకుంటుంది.
మా ఇద్దరికీ మురిపెంగా వెచ్చని కలల దుప్పటిని కప్పేసి
కధలన్నీ సద్దుచేయకుండా కంచి కెళ్ళిపోతాయి.
June 7th, 2010 at 9:08 am
) బాగుంది దేశీవిదేశీకతలతో, ఏది విదేశమో ఏది స్వదేశమో తెలీని క్షణాలు చక్కగా ఇమిడిపోయేయి కవితలో. అభినందనలు.
మాలతి
June 8th, 2010 at 4:20 pm
వైదేహిగారు,
అమ్మ చెప్పినట్టు కధ ఎవ్వరూ చెప్ప్లలేరని అందరికి తెలుసుగాని. మీలాంటి అమ్మచెబితే కధలు కూడా కవితలవుతాయనిపించారు. చక్కటి కవితాకధన0.. అభినందనలతో …….
రాధ
June 9th, 2010 at 11:24 am
“తన చిట్టిచేతుల హారాలతో నా మెడను కౌగలించి ఒదిగిన మల్లెచెండై
నా చిన్నారి రాకుమారి చటుక్కున నిద్రలోకి జారుకుంటుంది.”
మా రాకుమారుడితో నాకు ఈ అనుభవం :-)
“కధలన్నీ క్షణాలై కరిగిపోతున్నా
ఈ లేత కలువల కన్నులను మాత్రం
నిద్రాదేవి ఇంద్రజాలం తాకను కూడా తాకలేదు .”
ఎంత బాగా చెప్పారు!
ఏదోలే చదివి చూద్దాం అని వచ్చి చూసిన నన్ను కట్టి పడేసి మొత్తం మళ్ళీ మళ్ళీ చదివించినవి ఈ లైన్లు
“సిండరెల్లా సుకుమార పాదం
గాజు చెప్పు లోకి అందంగా ఇమిడిపోతుంది
తెలిమంచు లాంటి స్నోవైట్ గొంతులో చిక్కుకున్న
ఎర్రటి ఏపిల్ ముక్క ఊపిరాడక బయటపడుతుంది
రాజకుమారుడి ప్రేమార్తి మృదుస్పర్శై తనను స్పృశించగానే
స్లీపింగ్ బ్యూటీ ఒక్కసారిగా నిద్ర లోంచి లేచికూర్చుంటుంది.”
ముందు వెనకగా చేసి చెప్పినా, నేను చెప్పాలనుకున్నది మాత్రం, ఏమి చెప్పారో తెలిసేలోగా ఎంత చక్కగా చెప్పారో అనుభవమయ్యింది. ఏం చెప్పారో అర్థమయ్యాక ఆ అనుభవం మరింత ఆత్మీయమయ్యింది.
June 12th, 2010 at 2:36 am
ఇంగ్లీష్ పదాలు లేకుండా….
కవిత్వం రాయలేరా?
June 15th, 2010 at 11:55 pm
“కలగా పులగపు కధలు చెప్తూ చెప్తూ ఓ రెండు క్షణాలపాటు
ఏమారిన నేను అలసటతో రెప్ప మూసానో లేదో
తన చిట్టిచేతుల హారాలతో నా మెడను కౌగలించి ఒదిగిన మల్లెచెండై
నా చిన్నారి రాకుమారి చటుక్కున నిద్రలోకి జారుకుంటుంది.”
నిజంగానే ఈ నిమిషంలో ఊ కొడుతున్న నా కూతురు మరు నిమిషంలో నిద్రపోవటం నాకుతెలుసు కదా. బావుంది వైదేహి గారు. చక్కగా వుంది.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
June 16th, 2010 at 4:07 pm
తన చిట్టి చేతులతో…..నా మెడను కౌగిలించి….ఒదిగిన మల్లెచెండై….
అనే….వాక్య ప్రయోగం….అద్భుతం…అభినందనీయం….
June 22nd, 2010 at 9:55 am
వైదెహి, చక్కని కవిత రాసావు.
August 20th, 2010 at 8:16 am
నా కవితపై అభిప్రాయం తెలిపిన సాహితీమిత్రులందరికీ కృతజ్ఞతలు.
August 22nd, 2010 at 6:00 pm
వైదెహి గారు,
జనం వ్రాసిన కామెంట్స్ చూసిన తర్వాత ఇది ఒక స్త్రీ వ్రాసిన కధ అని తెలిసింది. ఎందుకంటే నాకొక కూతురు పుడితే ఎంత మురిపెం గా చూసుకోవాలనుకుంటున్నానో ఆ అనుభవాన్ని మీ కధ లో నేను ఇప్పుడే పొందాను..
September 4th, 2010 at 3:20 am
వైదేహి, చాలా బాగా రాసేరు.. ఒక్కసారి పిల్లల బాల్యం మిస్ అయినట్లు అనిపించింది మీ కవిత చదువుతుండగానే. చాలా బాగుంది.