భిక్షువర్షీయసి

కాలువ గట్టు మీద కూకుంది లచ్చుమమ్మ. లచ్చుమయ్య పారదీసుకొని కాలువ నీళ్ళను మడిలోకి మళ్ళిస్తుండు.దుడ్డెగాని లాకె గులక రాళ్ళ మీదినుంచి, నీటిలో మొలచిన గరక మీదినుంచి దుంకుతూ జోరుగా పరుగు లిడుతున్నది కాలువ.

ఆ పరుగు వంకర టింకరగా వుంది. చాలా స్వచ్ఛంగా వుంది. ప్రశాంతంగా వుంది.

తేటగా వున్న కాలువ నీళ్ళలో కొన్ని నీరు కట్టె పాములు కాలువతో పోటిపడ్డట్లుగా తోకలను ఆడిస్తూ కాలువలో అటు, ఇటు తిరుగుతుండవి.

మెలికలు దిరుగుతూ నీటిలో పరుగెడుతున్న నీరు కట్టె పాముల ఒయ్యారాలను జూచి లచ్చుమమ్మ తన్మయురాలైపోతున్నది. కాలువ చుట్టున్న ప్రకృతి అందాలకు పరవశురాలైపోతున్నది.

లచ్చుమమ్మకు అసలు పాములంటే భయంలేదు. అందులో అవి నీరు కట్టె పాములాయె. ఎందుకు భయపడుతుంది. మంచి మంచి నల్లని కోడె నాగులు బుసలుకోడుతుంటే వాటి తోకలను ఒడుపుగా పట్టుకోని గిరగిర దిప్పెటోడు లచ్చుమయ్య. అలాంటి సంఘటనలు ఎన్నోసార్లు సూసిన లచ్చుమమ్మకు మరి నీరు కట్టె పాములంటే ఎందుకు భయపడుతుంది. వాటిని ఓ లెక్క లోకి తీసుకునేది కాదు లచ్చుమమ్మ.

లచ్చుమమ్మ మొగుడే లచ్చుమయ్య. ఈళ్ళిద్దరికి పెళ్ళి శానా సిన్న వయస్సులోనే అయ్యింది.

శానా సిన్న వయస్సంటే లచ్చుమయ్య కు యాడాదినర్థం. లచ్చుమమ్మకు యాడాది వయస్సుండాగానే లగ్గమయ్యిందంట. వీళ్ళిద్దరికి పెళ్ళి జరిగినప్పుడు యిద్దరిని తొట్లెల్లో పడేసి బాసింగాలు గట్టి లచ్చుమమ్మ తొట్లెకు పుస్తెగట్టి ఆళ్ళయ్యమ్మలు, బంధు జనాలు పెండ్లిజేసింరంట.

ఈళ్ళిద్దరి లగ్నం జేసినాంక రెండు యాటల్ని గోసికోని, కొప్పెరకల్లు, నాల్గుదుత్తల సారాయి దెచ్చుకోనీ పీకలవరకు దాగి తందనాలాడు కొని యిందుజేసికొన్నరంట.

ఈ సంగతులన్ని లచ్చుమమ్మ, లచ్చుమయలకు వయసిచ్చినాక ఆళ్ళ పెద్దోళ్ళ ఈళ్ళకు జెప్పి ఒక్కటే నవ్వునవ్వెటోళ్ళు.

వాళ్ళ నగుల్లో లచ్చుమమ్మ, లచ్చుమయ్యలు శ్రుతి గలిపి గలగల నవ్వెటోళ్ళు. పిట్టల జంట లాకే కిలకిలమనెటోళ్ళు.

వయస్సులో ఉన్నపుడు వరిసేలో లచ్చుమమ్మ పనిజేస్తుంటే లచ్చుమయ్య దానికొంగు పట్టుకొని యెంట దిరిగేటోడు.

“ఒసే లచ్చీ! నీవు వరిసేలొ కలుపుతీస్తుంటే ; నాలొ వొలుపు రేగుతుండదే, నీది పాలరాతి ఒల్లే! పట్టు కొంటే జారుతుండదే!” అని లచ్చుమయ్య అంటే,

“నీకండ్లలో కారం జల్లుత జూడు” అనేది.

“ఎందుకంటే?”

“నీవట్ల నాకేసి జూస్తూవుంటే. నాకు దిష్టిదగులదా? యేంది” అనేది లచ్చుమమ్మ వయ్యారాలన్ని ఒలకవోస్తూ.

అయినా లచ్చుమయ్య వినేటోడుగాదు. లచ్చుమమ్మ జొన్నసేల పనిజేస్తుంటే,

“ఒసే! పిల్లా నీవు జొన్న సేలో పనిజెస్తుంటే నీ జోరు జూడబుద్ధయితదే. నీది పట్టు వంటి వొల్లే. పట్టుకుంటే మెత్తగుండదేందే?” అంటూ దగ్గరకొచ్చి పరాచెకాలాడుతుంటే, లచ్చుమమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుతో సిరులు వొలుకవోసేది.ఇంక కందిసేలో పనిజేసేటప్పుడు. “లచ్చీ! నీది కందిరీగ నడుమే” అని అంటే “పో! మావా!” అంటూ విసుగును ప్రదర్శించేది.ఇదంతానటనే, ఎందుకంటే, మావ తనను ఇంకా మెచ్చుకుంటే బాగుండేదని లచ్చుమమ్మ మనస్సులో అనుకునేది, మావ పొగడ్తలకు లచ్చుమమ్మ ఒళ్ళు మంచులా కరిగిపోయేది.

లచ్చుమమ్మకు, లచ్చుమయ్యకు అచ్చరం ముక్క రాకపోయినా ఊళ్ళో అర్థనాతిరిదాక ఆడేతోలు బొమ్మలాటలకు, యక్షగానాలకు యిడవకుండా కలిసే యెల్లేవోరు, కలిసి యాష్టపడకుండా తెల్లంజాము దాక సూసేటోళ్ళు, కాబట్టే రామాయాణం కథలు,భారత, భాగవత కథలు ఆల్ల బుర్రల్లోకి బాగ నాటుకపొయినాయి.అపుడప్పుడు లచ్చుమమ్మ లచ్చుమయ్యతో “నువ్వు లచ్చుమన సామివయితే నేను ఊరిమిలమ్మ నయ్యా!” అనేది.

“అయితే మీ వోల్లు నీకు నీకు లచ్చుమమ్మ అనే పేరు గాకుండా ఊరిమిలమ్మ అని పెట్టెదుండెనే,” అంటూ వుడికించటానికి లచ్చుమయ్య ఉపక్రమిస్తే, “నీవు జెప్పినమాట నిజమేనయ్యా! అట్లేపెట్టేదుండే” అంటూ పకపకనవ్వేది. అలా నవ్వుతున్నఒపుడు లచ్చుమమ్మ పండ్లు సిగుళ్ళు దానిమ్మ యిత్తుల్లాకే నిగనిగమెరిసిపోయేవి. బుగ్గలు భుగభుగలాడేవి.

లచ్చుమమ్మ ప్రతిరోజు తనపండ్లను పిడుకబొగ్గుతో దోమితే, లచ్చుమయ్య వేపప్సెట్టెక్కి వేపపుల్లను దెంపుకొని పళ్ళను దోముకొనెటోడు.

అరువై యెళ్ళవయస్సులో గూడ యిరువై యేళ్ళవయస్సున్న పిల్లలకంటే ఆళ్ళ పండ్లు చాలా గట్టిగున్నాయి. అవసరమైతే తమ పళ్ళతో ఆళ్ళు రాళ్ళనుగూడ నములమంటే కరకర నమిలెయ్యగలరు.

ప్రతి రోజూ లచ్చుమయ్య గోరుకొయ్యలు పొడవంగానే లేసి పొలం కాడి కెళ్ళి చూసొచ్చేటోడు.

లచ్చుమమ్మ గూడా మొగునితోబాటే నిద్ర లేసి,వాకిలూడ్సి,సాన్పి జల్లి ఇంటిపని జేసుకొని,లచ్చుమయ్య పొలం కాడినుండి ఇంటికొచ్చేవరకు తైదంబల్ని,జొన్నసంకటిని సేసి పెట్టేది.

లచ్చుమయ్య ఇంటికిరాగానే కిర్రుసెప్పులు ఓ మూలకిడిసి,ముక్కోల కట్టెను అట్లా పడేసి,లచ్చుమమ్మ దెచ్చిచ్చిన దుత్తెడు నీళ్ళలో కాళ్ళు,మొగం గడుక్కొని సంకటి దిననీకె,అంబలి దాగనీకె కూకునేటోడు.

మొగుడు పెల్లాలిద్దరూ గలిసి ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటా జొన్నసంకటిని మామిడికాయసెట్నీతో దిని తైదంబలితోచింతకాయ సెట్నీని సల్లను కలుపుకొని తాగేటోల్లు.

ఏ ఒక్కరోజు గూడా ఒకర్నిడిసి ఇంకొగల్లు దినేటోళ్ళుకాదు.ఊర్లోని సదువుకున్నోల్లు,సదువుకోనోల్లు,అంతా ఆలిద్దరి అన్యోన్యతకు ఆచ్చెర్యం పడేటోళ్ళు.

మద్దేన్నం పూట మాత్రం వరన్నం దినేటోళ్ళు. ఉతికి ఆరేసిన తెల్లని బట్టలో ఇద్దరికి సరిపోయే అన్నం, కూర మూటకట్టుకొని సేలకాడికి దీసుకుపోయెది లచ్చుమమ్మ మొగనెనుక నడుసుకుంట.

సెలక పనంతయినాక ఓ సెట్టుకింద కూకొని వరన్నందిని కడుపునిండ దుత్తెడు నీళ్ళను దాగి సెట్టుకిందగూకొని సల్లని దానినీడన సేద దీరెటోళ్ళు. అట్లా సెట్టుకింద గూకున్నప్పుడు సల్లని గాలి ఈస్తుంటే సెట్టుకొమ్మలు గాలికి ఊగుతుంటే లచ్చుమమ్మ, లచ్చమయ్యల పానాలు హాయిగా వుండేవి.

ఈలిద్ద్దరి అన్యొన్యతకి ప్రకృతి గూడా పరవసించినట్లుగా వుండేదేమో అనిపించేది ఆ సమయంలొ. పచ్చని పంటపొలాలు గాలితాకుళ్ళకు వయ్యారి భామలై ఊగేవి. లచ్చుమయ్య ఎత్తుగా మానంత దృఢంగా వుంటే లచ్చుమమ్మ గూడ లచ్చుమయ్యకు తగ్గంత ఎత్తుగా అందంగా వుంది. లచ్చుమయ్య ఎర్రగావుంటే లచ్చుమమ్మ రంగు అంత కంటే కొద్దిగా తక్కువుండేది.

” ఏందయ్యా! నీవు ఎర్రగా వుంటే నేనేమో నల్లగా వుండాఅనుకదా!” అనేది ఉంటే ఏందే? నల్లనేరడి పండు నానొక్క రుసులుంటే, యెర్రమేడి పండును యిప్పితే పురుగులుండవానే. రంగులో ఏందున్నది. నీమాట పొంగులోనే నా మనస్సు యిరుక్కున్నదే” అంటూ లచ్చుమమ్మను పొంగించెటోడు లచ్చుమయ్య.

“ఎన్నిజనమల కింద జేసుకున్న పున్నమో ఆ దేవుడు నీలాంటి మొగుణ్ణి నాకిచ్చాడు.” అంటూ లచ్చుమమ్మ పొగుడుతుంటే, లచ్చుమయ్య” నీలాంటి మంచి మనసు, గునమున్న పెళ్లాన్ని ఆ దేవుడు నాకిచ్చినందుకు, నిజం చెప్పాల్సివస్తే మన సెలకలోని ఎల్లమ్మ దేవతకు నేను రోజుకో టెంకాయ గొట్టల్నే. అట్లాజేస్తే గూడా ఆ ఎల్లమ్మ దేవర రుణం దీరదే” అనేటోడు.

లచ్చుమయ్య మాటలు లచ్చుమమ్మకు యక్షగానం పాటల్లాకే యినిపించి పులకించి పోయేది. ఇద్దరు సోరగుండంగా, సీతాకాలంనాడు పంటలు సేతికి రాగానె లచ్చుమయ్య, లచ్చుమమ్మను జాతర్లకు, ఉర్సులకు దోలుక పోయేటోడు. జాతర్లో రంగుల రాట్నం యెక్కించెటోడు. అప్పుడు లచ్చుమమ్మ మొగుణ్ణి తనపక్కనే కూకోమనేది. ఎందుకంటే రంగులరాట్నం ఆకాశమంత ఎత్తుకు ఎగిరేటప్పుడు లచ్చుమమ్మకు కళ్లు దిరిగేవి. అందుకోసరమని తనకు భయం గాకుండా వుండనీకే లచ్చుమయ్యను పక్కన కూకోబెట్టుకొని రంగులరాట్నంలొ దిరిగేది.

“లచ్చుమయ్య గూడ తన ఆలి మాటలను జవదాటేటోడు గాదు. లచ్చుమమ్మ మనస్సుకు నచ్చేటట్లు నడుచుకునేటోడు.

జాతర్లో లచ్చుమమ్మకు బెండుబత్తీసులు, బుగ్గాలు, సుట్లు మిరుప కాయలు యిప్పించేటోడు లచ్చుమయ్య. కాని తానొక్కతే తినేదిగాదు. అట్లాంటివి దిననీకె యిష్టం లేకపోయినా లచ్చుమమ్మకోసం దినేటోడు లచ్చుమయ్య.

పెండ్లయి ముప్పయేళ్ళు కావస్తున్న పిల్లలు గలుగలేదు లచ్చుమమ్మకు. పిల్లలు గానీకే జాతర్లో దేవుండ్లకు భక్తితో మెక్కేది. ఉర్సులో, దర్గాలో దగ్గర కూడా తురక దేవుండ్లకు మొక్కేది పిల్లలు గానీకే.

“ఇప్పుడు మనకు పిల్లలెందుకే, మనమే పిల్లలం గదా! అయినా మనం కాపురం జేయబట్టీ పన్నేండేండ్లే అవుతుంది గదనే” అనేటోడు.

“ఊకో మావా. ఇట్ల ముట్టుకుంటేనే అట్లా పిల్లలవుతుండరందరికి, నీవేమో గిట్ల మాట్లాడుతుండవు. అయినా ఆడదానికి పిల్లలబాధ ఎట్లవుంటుందో నీకేంతెలుస్తది”అనేది.

“సెట్టు పెరిగి పెద్దదయినాక దానికి కాయలు గాయకుంటే యిలువ యిస్తారే యేంటి?”

“ఆడది సెట్టులాంటిదయ్యా! దానికడుపులో కాయ గాయకపోతే ఆ బాధ నరకం కంటేగూడా ఎక్కువగా వుంటుంది” అని యిశారం యెలిబుచ్చేది.

“సరేలేవే! ఎన్ని దేవుండ్లకైనా మొక్కుకో. నీ యిష్టం మొచ్చిన జాతర్లకు, ఉర్సులకు నేను దీసుకుపోతాను.” అంటూ ధైర్యం జెప్పెటోడు లచ్చుమయ్య భార్యకు.

*******

లచ్చుమమ్మ మొక్కిన మొక్కులకు దేవుడు మెచ్చినట్లుండడు ఆమె కడుపులో పిందెపడ్డది. కొన్ని రోజులు వోయినాంక లచ్చుమమ్మ సింతకాయలను, మామిడి కాయలను జూస్తుంటే ప్రాణం లేచివస్తుండది. బైకాలొచ్చి లొడలొడకక్కుతుండది.

పెల్లాం అడిగితే సాలు కొండమీది కోతినైనా దెచ్చియిచ్చే లచ్చుమయ్య బుట్టెడు బుట్టెడు సింతకాయలను, తట్టెడు, తట్టెడు మామిడికాయలను దెచ్చి ఇంట్లో పడేసిండు.

లచ్చుమయ్య జూస్తుంటే వాటిని దిననీకే సిగ్గుపడేది లచ్చుమమ్మ “సిగ్గెందుకే లచ్చీ! నీ కడుపులో కాయ గాస్తున్న సంగతి నాకు తెలియదా యేంది? తినేతిను. నీకిష్టమొచ్చినన్ని సింతకాయలను, మామిడి కాయలదిను. తిని పండంటి కొడుకును యియ్యవే” అంటే.

“ఏంది బిడ్డను గనొద్దాయేంది?” అని ఉడికించేది.” ఎందుకు గనొద్దంటానే, కొడుకయిన బిడ్డయినా నాకొక్కటేనే కాకుంటే మాతాత, ముత్తాతలకు ఒక్కొక్కడే కొడుకులు పుట్టింరంట. మా అయ్య నన్నొక్కడినే గనిండు.కావట్టి నాగ్గూడ కొడుకే పుట్టొచ్చని అట్లాన్నా! అట్లాగాకుండా నీలాకెనేవున్న బిడ్డను గన్నావనుకో, నాకంతకంటే కావల్సిందేందే” అన్నాడు ప్రేమగా లచ్చుమయ్య పెండ్లాంతో.

“బిడ్డపుడితే నాలాకెనే వుండాల్నా. నీలాగే వుండ గూడదా?” అంది మొగుడితో గోముగా లచ్చుమమ్మ.

“అబ్బో! నీతో మాట్లాడలేనే లచ్చీ! ఎట్లుంటేంది. నీవు సేమంగా కంటేసరి. మొగోడైతేందీ, ఆడపిల్లయితేందీ.” అన్నాడు లచ్చుమయ్య.

*******

తొమ్మిది నెలలు నిండాక లచ్చుమమ్మ పండంటి మగపిల్లవాడికే కన్మ నిచ్చింది. తమకు కొడుకు పుట్టినందుకు ఆలుమగలు శానా సంతోషింపడిండ్రు.ఊర్లోని గేరోల్లందరి యింటికి యెల్లి తనకు కొడుకు పుట్టిన సంగతిని సాటించి సెప్పినట్లుగా సెప్పిండు లచ్చుమయ్య.గేరోల్లందరికి దావతు గూడా యిస్తానని సెప్పిండు.

ఊర్లోని బాపనయ్య దగ్గరకెల్లి పేరు పెట్టాల్సిన మంచిరోజు సూడమని అడిగిండు.బాపనయ్య పంచాంగంసూస్తూ,సేతి యేళ్ళతో లెక్కలు గట్టుకుంట పిల్లాడికి పేరు పెట్టాల్సిన మంచిరోజేదో చెప్పిండు. లచ్చుమయ్య బాపనయ్యకు దక్షణ బాగానే యిచ్చిండు.

అనుకున్నట్లుగానే కొడుకుకు పేరు పెట్టేరోజు రానేవచ్చింది. లచ్చుమయ్య గేరోళ్ళందరిని పేరుపేరున పిలిసి దావత్ జేసిండు యెవరిని మరిసిపోకుండ.

ఆ దావతుదిన్న గేరి పెద్దలు “ఒరేయ్! లచ్చుమయ్య! నీవు పుట్టినపుడు గూడ మీ నాయన, మీ అమ్మ మాకు పెద్దదావతే జీసిండ్రు రా! ఈయాల్లా నీవు మీ అయ్యకంటే గూడా మాకు పెద్ద దావతే జేసినావురా!” అని మెచ్చుకుంటే లచ్చుమయ్య పొంగిపోయిండు.

లచ్చుమయ్య, లచ్చుమమ్మలు తమ కొడుకుకు ఎంకటయ్య అని పేరు పెట్టుకున్నారు. అయినా వాడిని “ఎంకటి” అని ముద్దు పేరుతొ పిలిసుకునేటోళ్ళు. ఎందుకంటే లచ్చుమమ్మ,లచ్చుమయ్యతో గలిసి తిరుమలాపురం తిరునాలకు యెల్లినపుడు తనకు సంతానం యివ్వమని తిరుమలాపురం ఎంకటేశ్వర సామికి మొక్కుకున్నది. ఆ దేవుని మొక్కుకున్నాంకనే తన కడుపులో కాయపడింది. అందుకే వాడి పేరు ఎంకటయ్య అని పెట్టుకున్నారు.

తిరుమలాపురం తిరునాల్ల యిసేసమేమంటే, దాన్ని గురించి జనాలు ఏమనుకుంటారంటే జీవితంలొ ఒక్కసారైన తిరుపతికి యెల్లి ఎంకటేశ్వరసామి దర్శనం జేసుకోవాలంటారు. అట్లా యెల్లటానికి ఈలుగాని వాళ్ళు కనీసం తిరుమలాపురం తిరునాలకు యెల్లి ఆ ఎంకటేశ్వరస్వామి దర్శనం సేసుకొని వస్తే తిరుపతికి పోయొచ్చినంత పున్నెం కలుగుతుందనుకుంటారు.

కావట్టె తిరుపతికి యెల్లనీకె ఈలుపడని లచ్చుమయ్య, లచ్చుమమ్మలు తిరుమలాపురం తిరునాలకు వోయిండ్రు.తిరుమలాపురం మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలో వుంది.

ఆ సామి పున్నెంతోనే తమకు ఎంకటయ్య పుట్టిండని ఆల్ల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎంకటయ్య పుట్టినంకా తిరుమలాపురం తిరునాళ్లకు వోయి ఎంకటేశ్వరసామికి ముడుపులు సెల్లించి తలనీలాలు గూడ యిచ్చిండ్రు. లచ్చుమమ్మ, లచ్చుమయ్యలు.

*******

లచ్చుమయ్య తండ్రి బాలయ్య సావుకు దగ్గరయినపుడు కొడుకును, కోడలును దగ్గరకు పిలిసిండు.పిలిసి యిట్లా అనిండు.”ఒరేయ్! లచ్చిగా! నన్ను దేవుడు తనదగ్గరకు రమ్మని పిలిస్తుండడు! నాపనైపోయింది.నేనింక శానాకాలం బతుకనురా! ఈ ఆయసం భరింపనీకే యింకనాకు సేతకాదు. ఇక దేవుని కాడికోత. నాకంటే ముందుగాలనే దేవుని కాడికోయిన మీయమ్మ జప్పున నన్ను తనదగ్గరికి రమ్మని పిలిస్తుండది.

మా అయ్యకు నేనొక్కణ్ణి కొడుకుని,మాతాతకు మాఅయ్య ఒక్కడే కొడుకు. నువ్వు నాకు ఒక్కడివే.మా అయ్య సచ్చి పోయేటప్పుడు నాకు మూడెకరాల మెట్ట, పావెకరం తరిపొలం యిచ్చిపోయిండు.”భూతల్లిని నమ్ముకొని బతికెతే సెడిపోవురా!” అని సెప్పిండు. ఎన్ని కష్టాలొచ్చిన నేను సెంటు భూమిని అమ్మకుండా దాని మీదనే మిమ్మల్ని బతికించుకున్నా. నీవుగూడ నాలాకెనే ఎన్ని కష్టాలొచ్చినా సెలకనమ్మకుండా భూతల్లిని నమ్ముకొని బతుకూ” అంటూ కొడుకుతో, కోడలితో సెప్పి సేతిలొ సెయ్యియేయించుకొని గుటుక్కుమని సచ్చిపోయిండు. లచ్చుమయ్య నాయిన సచ్చిపోయి అప్పుడే ముప్పయి యేండ్లయిపోయింది. ఆ నాటి నుండి ఈనాటివరకు భూతల్లి సేవ జేస్తూ దాని సేతానంతో వచ్చిన గింజలతోనే పెళ్లాం పిల్లగాణ్ణి బతికించుకుంటుండు. లచ్చుమయ్య తండ్రి సచ్చిపోయినాంక ఎంకటి పుట్టిండు.

*******

ఇప్పుడు ఎంకటి వయస్సు ఇరువై ఎనిమిదేండ్లు.

లచ్చుమయ్య, లచ్చుమమ్మలు తమకొడుకు ఎంకటి చిన్నగున్నపుడు బాగా సదివించి గొప్పోణ్ణి జేయాలనుకునిండ్రు.ఊర్లో వుండే సాలెకు పంపించిండ్రు. సాలెలో పంతులుగారు ఎంకటయ్య అనే పేరును వెంకటేశ్ గా మార్చి హాజరి రిజిష్టర్లో రాసిండు. లచ్చుమయ్య, లచ్చుమమ్మలు తమ కొడుకును బళ్ళో పంతులుగారితో బాటు పెద్దకులస్థుల పిల్లలు గూడ’ వెంకటేశ్ ‘ అని పిలుస్తున్నట్లు దెలుసుకొని తెగ మురిసిపోయేటోళ్ళు.

కానీ వెంకటేశ్ క్రమంగా పాఠశాలకు పోకుండా డుమ్మాగొట్టడం నేర్చుకొనిండు పెద్దగయ్యే కొద్ది సెడుసావాసాలకు పోవట్టిండు. సెడు దిరుగుళ్ళకు అలవాటు పడిండు. తాగుడకు పేకాటకు బానిసయ్యిండు.

గొప్పోడైపోతాడనుకున్న కొడుకు ఇలా పోకీరోడయిపోయే సరికి లచ్చుమయ్యకు గుండె పగిలినంత పనయ్యింది.సదువుకోకుంటే సదువుకోకపోయ. కనీసం సెలక పనైన నేర్చుకోమంటే అదిలేదు. కొడుకు కోసం సింత సేసి, సేసి యేనుగంత లచ్చుమయ్య పీనుగంతయ్యిండు.

వానికర్మ ఎట్లయితే అట్లయితది. ఆడికోసం నువ్వెందుకు కుమిలి సస్తావయ్య” అంటూ లచ్చుమమ్మ భర్తకు ధైర్యం జెప్పనీకే సూసేది. లచ్చుమయ్య కొడుకు బాగుకోసం కుమిలికుమిలిపోవటం వల్ల మనసురోగం వచ్చింది.

లచ్చుమమ్మ మొగుడి పయిని సూయించనీకే దవాఖానాలన్ని దిప్పింది. మనసురోగంతో కుములుతున్న లచ్చుమయ్య ఓ రోజు పడుకున్నోడు పండుకున్నట్లే కన్నుమూసిండు.

మొగుడు సచ్చిపోయినందుకు లచ్చుమమ్మ గోడుగోడున యేడ్సింది. తండ్రి సచ్చిపోయినాపట్టించుకోని సేతికిరాని కొడుకును జూసి కుమిలికుమిలి యేడ్చింది.

*******

ఓ రోజు “అమ్మా! మనకున్న మూడెకరాల మెట్టపొలాన్ని, పావెకురా తరిపొలాన్ని అమ్ముకుందామే”

అంటూ తల్లి వైపు చూశాడు ఎంకటి. ఆమె ఏం జవాబు చెబుతుందోనని.

లచ్చుమమ్మ ఏం మాట్లాడలేదు. కొడుకు అడిగిందానికి జవాబివ్వకుండా మౌనంగానే వుండిపోయింది.

“ఎకరం పది లక్షలు పలుకుతున్నది.చెప్పవేమే,”

ఖాజా మంచి బేరం దెచ్చిండు. నువ్వు ఊ అంటే రేపే అమ్మేస్తా.”

తల్లి జవాబు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు ఎంకటి. ఈ సారి గూడ తల్లి ఏమి జవాబు చెప్పకపోయెసరికి ఎంకటి చిరాకు గల్గింది.

చెప్తావా? చెప్పవానే? పొలం అమ్మేస్తే ముప్పయేడు లక్షల రూపాయల పైనే వస్తుంది.ఖాజా గూడ మననుండి పైసా కమీషన్ వద్దన్నడు. మనపొలం కొన్నోడినుండే కమీషన్ తీసుకుంటాడంట. మంచి బేరాన్ని దెచ్చాడు. పొలాన్ని అమ్మేస్తే ఆ పైసలతో మనం సచ్చేవరకు తినొచ్చు.

కాసేపాగి “అవునంటావా? కాదంటావా?” రెట్టించి మాట్లాడాడు ఎంకటి. లచ్చుమమ్మకు యిక నోరు తెరవకతప్పలేదు.

“ఒరేయ్! ఎంకటీ! నువు సేసిన శాష్టాలకే మీ అయ్యా గుండెవలిగి సచ్చిపోయె. అయినా నీకు బుద్ధి రాకపాయె.నువ్వు సెప్పినట్టుగానే పొలాన్ని అమ్మకానికెడితే, లచ్చలకు లచ్చలొస్తాయి. సత్తెమే. ఆ వచ్చే పైకంతొ కూకొని ఎన్నాళ్ళని తింటాంరా! తింటూకూకుంటే గుట్టలు గూడ మిగులవు కొడుకా! అయినా ఏం పనిజెయ్యకుండా కూకొని తిన్నోడు పెపంచకంలో ఒక్కడైనా బాగుపడినాడురా! కూకొని దినేది సోమరిపోతులు జేసేపని. అట్లాంటోడు కొన్ని దినాలు వోయినాకా ఆడికి ఆడే బరువైపోతాడు. కూకొని దినేకంటే సచ్చిందిమేలురా!” అన్నది లచ్చుమమ్మ.

“ప్రపంచమంతా మారిపోతున్నదే. కానీ నీవు మాత్రం మారవే. సచ్చినా మారవే. యాడాది పొడవునా మన పొలంలో పనిజేస్తే గూడా కడుపునిండా తినడానికి గింజలు పండవు. తొండలు గుడ్లు పెట్టే ఆ పొలంనుండి మనకు ఫాయిదాలేదే. అందుకె జప్పున ఆమ్మీద్దాం.”

“ఏంగూస్తివిరా! మనపొలం తొండలుగూడ గుడ్లు పెట్టని పొలమా? అట్ల అయితే అదే పొలంమీద ఆధారపడి మీతాత, ముత్తాతలు మీ నాయిన నేను ఏట్లా బతికాంరా? నిన్ను ఎట్లా సాకినాంరా? గడ్డివెట్టి సాకినాంరా? బిచ్చమెత్తుకొని బతికినాంరా? అదే పొలాన్ని నమ్ముకొని కష్టపడి పని జేసి ఇజ్జత్ గా బతికినాంరా!” కాస్త కోపంగానే గట్టిగానే అంది కొడుకుతో.

“ఒరేయ్! ఎంకటి, పైసలకాసపడి మనకున్న భూమిని అమ్మినామనుకో, మనకింకేం మిగులుతుంది రా? బత్తలయి పోమారా? పదిమందిలో పళ్ళు గామారా? పొలం అమ్మేసినాక కులంలో తక్కువైపోమారా? మొగుడు సచ్చినాక కొడుకుతోగలిసి భూమి అమ్ముకున్నదని నన్నుబదనాం జెయ్యరారా?”దీనంగా వుంది ఆమె కంఠద్వని

ముప్పై ఏడు లక్షల రూపాయలొచ్చినాంకకులంలో మన ఖదరు ఇంకా పెరుగుతదేమందందరు మన సుట్టు తిరుగుతారు. మనపొలానికొచ్చిన బేరం ఈ ఊల్లొ ఎవ్వరికిరాలేదే. మన పొలం హైవే రోడ్డు పక్కనున్నందుకే ఈ ధరవచ్చిందే తెలిసిందా?” అన్నాడు గర్వంగా ఎంకటి తల్లితో.

“ఆ! తెలిసింది. సేతిలొ పైసలున్నంత సేపు బెల్లంసుట్టు ఈగల్లాకే, సీమలాకే నువ్వన్నట్టు పదిమంది మన సుట్టు దిరుగుతారు. ఆ పైసలయిపోయి, బత్తలయినాక అప్పుడు దెలుస్తది. ఒక్కడైనా మనయెంట వుండడని. పైస రంకులాడిలాంటిదిరా! ఒకని నమ్ముకునివుండదు మగనాలులాకే. ఇయాల ఒకని దగ్గరుంటే రేపు మరొకని దగ్గరకోతది. భూమి అట్లాగాదురా! కన్నతల్లి లాంటిదిరా! అందుకే ఏ పని జేసినా ఆలోసించి సేయాలిరా!” కొడుకు వైపు సూస్తూ యిక భూమిని అమ్మే ఆలోసన మానుకో అన్నట్లుగా వున్నాయామాటలు. ఎంకటి సిన్నప్పటి నుండి మొండి ముండా కొడుకేనని లచ్చుమమ్మకు దెలుసు. ఎదైనా పట్టుబట్టాడంటే యిక యిడవడు.

వాడు జేసేపనులన్ని కూటికిగూడ గొరగానివనిగూడ లచ్చుమమ్మకు తెలుసు. ఆడి నడవడికకే మొగుడు మనసు రోగంతో బాధపడి సచ్చిపోయిండు. అయినా కొడుకు ఎంకటిని పొలం అమ్మే పనినుండి విరమింపజేయాలని శతవిధాల ప్రయాసపడుతున్నది లచ్చుమమ్మ.

ఎంకటికి ఒకపని చేద్దామని వుండదు. ఊర్లో ఆడితొ. ఈడితో తిరుగుకుంట తాగుకుంట, పేకాటాడుకుంటా తిరిగి తిరిగి తినేయేల్లకు యిటికొచ్చి కూరలు కమ్మగా లేవని అదిజేయ్యలేదు. ఇది జేయ్యలేదు అని తల్లితో జగడం జేస్తడు. ఇల్లు ఎగిరిపోయేంత అరుస్తడు తల్లి లచ్చుమమ్మ మీద.

కన్న పేగు గనుక ఏమనలేక వాడిచేష్టలను భరిస్తూనే వుంది. చివరగా ఎంకటి తల్లిని దారికి దెచ్చె ప్రయత్నంలొ కంఠస్వరాన్ని హెచ్చిస్తూ ఇలా అన్నడు.

“అమ్మా! నీవు గిట్ట భూమిని అమ్మనీయ్యకపోతే ఉరేసుకొని ఛస్తాను.”

ఎంకటి నుంది ‘ఉరేసుకొని చస్తాను’ అన్నమాట రాగానే లచ్చుమమ్మకు కాళ్ళకింద వున్న భూమి పగిలి పొయినట్లనిపించింది. అందులోకి తాను సీతమ్మ తల్లిలాగా కూరుకుపోయినట్టనిపించింది. వాడి మాటలకు గుండె గుభిల్లుమన్నది. వాడు సస్తె యింక తను బతికేదెందుకనుకుంది.

విధిలేని పరిస్థితుల్లొ భూమి అమ్మకానికి ఒప్పుకుంది లచ్చుమమ్మ.

*******

భూమిని అమ్మనీయకపోతే “ఉరేసుకుని చస్తాను” అన్న తన అస్త్రం తల్లి మీద బ్రహ్మస్త్రంగా పనిజేసినందుకు మురిసిపోయిండు ఎంకటి.

మర్నాడు గోదారిలాగ ఉప్పొంగి వస్తున్న సంతోషంతో ఎంకటి, ఖాజా దగ్గరికి బయలుదేరాడు.

ఎంకటి రాకను జూస్తునె ఖాజాకు చాలా ఆనందం కలిగింది.

ఖాజా భూములను అమ్మిపెట్టే బోకర్, కొనే పార్టీ, అమ్మే పార్టీలు యిచ్చే కమీషన్లతో వాడు ఊర్లోని అందరికంటే గూడా చాలా దర్జాగా బతుకుతున్నాడు.

ఎంకటి దగ్గరకు రాగానే” ఏందిభై వెంకటేశ్ బాగున్నావా? ఎందుకో యిన్ని రోజులు జేస్తిని నా దగ్గరకు రానికే…”

” మీ అమ్మ పొలాన్ని అమ్మనీకే యిప్పటికైనా ఒప్పుకొనింద?. ఆత్రుతగా అడిగాడు ఖాజా.

“ఒప్పుకుంది. పొలం అమ్మటానికి ఆమెను ఒప్పించనీకే నా తల పానంతోక కాడికిచ్చిందనుకో. వెంటనే కొనే పార్టీకి కబురు పంపించు. ఆలస్యమైతే మళ్ళీ మా అమ్మ మనసు, మారొచ్చు. భూమిని అమ్మొద్దంటు మళ్ళీ పోరు పెట్టవచ్చు. త్వరగా కానీయీ.

“అదెంత పనిరా భయి. కానీ నువ్వేమో ఆలస్యంజేస్తివి. ఆ కొనే పార్టీ వాళ్ళేమో నువ్వు అమ్ముతావో లేదోనని వేరే అమ్మేపార్టీకాడికొయినరంట. ఎట్లా జెయ్యాలబ్బా!!” అని విచారాన్ని వెలిబుచ్చాడు ఖాజా.

“ఆలస్యమైతే మా అమ్మ మన్సు మారచ్చు. భూమిని అమ్మొద్దంటు మళ్ళీ పోరుపెట్టవచ్చు” అనే చివరిమాటలు ఎంకటి నోటినుండి రావటమే ఖాజాకు వరమైంది. ఆ బలహీనతనే వాడు సొమ్ముజెసేకోవాలనుకున్నడు.ఎందుకంటే మొదట కమీషన్ లేకుండానే అమ్మి పెడతానన్నడు గనుక.

“బాబ్బాబు! అలా అనకురా ఖాజా! నీగ్గూడ అమ్మి పెట్టినందుకు యింత కమీషన్ యిస్తారా?” అన్నాడు.

ఇదేమాట ఎంకటి నొటినుండి రావాలని చూశాడు ఖాజా. కమీషన్ ఇస్తాననే మాట వాడి నోటి నుండి రాగానే వెయ్యేనుగుల బలమొచ్చింది ఖాజాకు.

*******

మర్నాడే ఎంకటి భూమిని కొనేపార్టీ వాళ్లు, ఖాజా వచ్చారు. దస్తావేజులు రాయించుకున్నారు. దస్తావేజులపై ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టింది లచ్చుమమ్మ విచారవదనంతో.

తర్వాత కొనేపార్టీ వారు ఎంకటితో గూడా దస్తావేజులపై సంతకాలు చేయించుకొని ఒప్పందం ప్రకారంగా డబ్బులన్ని ఎంకటి చేతిలొ పోశారు.

ఎన్నడూ అంతడబ్బు ముఖం చూసి యెరుగని ఎంకటి కళ్ళు జిగేలుమంటూ మెరిశాయి.

తల్లికి గానకుండ ఖాజాకు కొంత కమీషన్ ఇచ్చాడు. ఖాజా ముఖం తళుక్కుమంది.

*******

ముప్పైయేడు లక్షలు పైగా వచ్చిన డబ్బు దీసుకుని పట్నం పోతానన్నడు ఎంకటి.

“పట్నం ఎందుకురా? అంది లచ్చుమమ్మ.

“కూకొని దినుకుంట ఇక్కడనే వుంటానంటివిగదరా? మళ్లీ అనింది.

” ఈ గుడిసె కొంపలో ఎవడుంటాడే. పట్నానికోయి ఈ లక్షలతో బిజినెస్ జేసి కోట్లకు పడగలెత్తుతానే.అప్పు

డు జూడు తడాఖ. లచ్చుమమ్మ కొడుకు కోటీశ్వరుడై పోయి పట్నంలో ఉన్నడంటే నీకు గర్వంగా ఉండదానే. సంతోషంగాదానే?” అన్నాడు తల్లితో ఎంకటి.

“నీవు గొప్పోడివై పోతే నేను గాక యింకెవరు సంతోషిస్తారురా! కానీ పైసలు చాలా చెడ్డవిరా! అవి సేతిలో పడగానే బుద్ధిమారుతుంది. అందులో కాయకష్టం చేయకుండా పైసలొస్తే ఆటి విలువ తెలియదురా! సక్కంగుండరా?”

“సక్కంగుండకా ఎమైపోతానే ఏడాది దిరుగే లొగా బిజినెస్ జేసి కొటీ రూపాయలు సంపాదించి దెచ్చి నీ చేతుల్లో పొస్తానే!”

“యాపారం, యాపారం అంటుండావురా? ఏం యాపారం జేస్తవు నీకేమనుభవముందిరా అట్లా యిట్లాసేసి పైసలు పోగొట్టుకోకురా! నాయనా!” అనింది లచ్చుమమ్మ కొడుకుతో

“నీకెప్పుడు నామీద అనుమానమేనే నీ దృష్టిలో నేను చేతగాని వాణ్ణి. సోమరిపోతును. పట్నం యెల్లి సంపాదించుకొచ్చినాక దెలుస్తది నా తెలివి నీకు” అన్నడు ఎంకటి తల్లితో.

*******

ఎంకటి చేతిలొ లక్షల పైకం పట్టుకొని పట్నం వెళ్ళిండన్న సంగతి ఖాజాకు తెలిసింది.

ఖాజా ఎంకటిని వెంబడించి పట్నంలో పట్టుకున్నాడు.

“అరే! భాయ్! వెంకటేశ్! ఇంతడబ్బును చేతిలొ పెట్టుకొని పట్నానికెందుకొచ్చావురా?” అని ప్రశ్నించాడు.

“వ్యాపారం జేసి కోట్లు సంపాదించనీకే”

“ఏం వ్యాపారం జేస్తావురా? నీకేం అనుభవముందిరా వ్యాపారంలో. నా హోటల్ కురా! పోదాం! నాతో వుండు బాగుపడుతావ్” అన్నాడు.

పట్నంలొ నీకు హొటల్ వుందా? ఆశ్చర్యం వెలిబుచ్చుతు అడిగాడు ఎంకటి ఖాజాని.

“మరేమనుకున్నావ్! ఒక్క బొకర్ దందాతోనే ఊళ్ళో యింత పెద్దవాణ్ణయ్యాననుకున్నావా? నా హోటల్ కొచ్చి కళ్ళతో జూడు నీకే తెలుస్తుంది. నా వ్యాపారం సంగతి,” అన్నాడు ఖాజా.

మొదటి ఎంకటికి తనమీద నమ్మకం కల్గించుకోవడానికి ఏంకటి వద్దనున్న డబ్బును వాడిపేరుమీదనే ఓ బ్యాంకులో ఖాతా దెరిపించి అందులో వేయించాడు. తర్వాత తను నడుపుతున్న హోటల్ కి తీసుకెళ్ళాడు.

*******

ఖాజా నడుపుతున్న హోటల్ పైకి మాత్రం హోటల్ గా కనిపిస్తుంది. లోపల మాత్రం డబ్బున్న వాళ్ళు గ్యాంబిలింగ్ ఆడుతుంటారు. నిజానికదో గ్యాంబిలింగ్ డెన్. ఆ ఆట గురించి ఎంకటికి తెలుసు.

ఆ ఆట తెలిసి దాని రుచి మరిగిన వాళ్ళు ప్రపంచంలో ఒక్కడు కూడ బాగుపడిన దాఖాలా కనిపించదు. కాని జూదగృహాన్ని నిర్వహించేవాడు మాత్రం “ఇంతింతై వటుడింతయై…” అన్నట్లుగా కూర్చొని డబ్బు సంపాదించగలడు. ఆట ఆడే వాడికి రావటాలు, పోవాటాలు చివరికి పాడు కావటాలుంటాయి. దాన్ని నడిపేవాడికి మాత్రం” కేటి” పేరునరావటం తప్ప పోవటం అంటూ ఉండదు.

అక్కడ గ్యాంబిలింగ్ ఆడే వారికి కాస్ట్ లీ డ్రింక్స్, మటన్, చికెన్ బిర్యానీలు అడిగిందే తడవుగా సమకూర్చే నౌకర్లుంటారు. అవి తెప్పించుకొనే వాడు తెచ్చేవాడికి కొంత డబ్బుకూడ ముట్ట జెప్పాల్సివుంటుంది.

అక్కడ పేకాట ఆడేవాళ్ళకు ఖాజా, ఎంకటిని వెంకటేశ్ గా పరిచయం చేశాడు. ఎంకటికి పేకాటరుచి మెదట్లోనే తెలుసు గనుక ఇక పేకాట గాళ్ళతో తానుగూడ ఆడటానికి సిద్ధమయ్యాడు.

అక్కడ డబ్బున్న పేకాటగాళ్ళు, కొత్తగా వచ్చి తమలో సభ్యుడైన వెంకటేశ్ కు గౌరవాన్ని ఇస్తున్నారు. ఎంకటి, ఖాజా తన స్టేటస్ ను బాగా పెంచాడని భ్రమపడొపోయాడు. పేకాటతో బాటు డ్రింక్స్ ఇంకా బాగా అలవాటయ్యాయి.ఎంకటి కిప్పుడు ఖాజా నడిపే హోటల్ ఓ స్వర్గంలా కనిపిస్తుంది.

*******

మొదట పేకాటలో డబ్బులువస్తున్నట్టుగానే అనిపించింది. కాని క్రమంగా బ్యాంక్ ఖాతాలొ వున్న డబ్బంత తెచ్చి పేకాటలో పొగొట్టుకున్నాడు ఎంకటి.

పేకాటలో డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, అతడు తమ వెనుక కూర్చొని ఆటను చూస్తుండటం భరించారు. తర్వాత భరించలేక బ్యాక్ హ్యాండ్ ను చీకొట్టడం ప్రారంభించారు.

ఎంకటి దగ్గరవున్న లక్షల డబ్బులు పేకాటలో పొగొట్టుకున్న నాల్లురోజుల తర్వాత అతడిని తన హోటల్ నుండి మెడపట్టి గెంటించేశాడు ఖాజా.

*******

భూమి నమ్మి లక్షల డబ్బుల చేతిలో పెట్టుకొని పట్నం వెళ్ళి వ్యాపారం చేసుకొస్తానని చెప్పిన కొడుకు సంవత్సరం దాటినా వాడి పత్తాలేకపోయేసరికి లచ్చుమమ్మకు గుండెల్లో గుబులుపుట్టింది.

పట్నం నుండి ఈ రోజొస్తాడు రేపొస్తాడునుకుంటూనే కొడుకుకోసం కళ్ళుకాయలు కాచేల ఎదురు చూస్తూ నేవుంది లచ్చుమమ్మ.

ఇలా పదేళ్ళు గడిచాయి. కొడుకు ఆచూకి తెలియలేదు. కొడుకు ఎంకటిపై ఆశ చావలేదు తల్లి లచ్చుమమ్మకు. ఉన్న భూమిపోయింది. ఇక కూలిచేసుకోవడానికి కూడ జవసత్యాలు ఉడిగిపోయాయి. ఉన్న ఊళ్లోనే భిక్షుక వృత్తి చేయసాగింది. పూలమ్మినచోటే కట్టెలమ్మే పరిస్థితి ఏర్పడింది.

ఈ పది సంవత్సరాల కాలంలో లచ్చుమమ్మ తలముగ్గుబుట్టయింది. దేహము ముడుతలు పడింది. కళ్ళు బాయంత లోపలికి పోయినవి.

కొడుకురాకకు ఎదురుచూచి, చూచి జబ్బుపడిపోయింది. ఆ దిక్కులేని దీనురాలు మాత్రం ఎంకటినే పలువరిస్తున్నది.

తన కొడుకు కోట్లు సంపాదించుకరాకపోయినా సరే. తాను సచ్చేవరకైనా వాడు యింటికొస్తే కళ్ళు కనిపించకపోయిన పేమగా వాడి పైని తనివితీరా నిమరాలనుకుంటుంది.

పేకాటలొ లక్షలడబ్బును స్వాహా చేసిన ఎంకటి తల్లి కంటపడడానికి సిగ్గుపడి రైలు కిందపడి ఆత్మ హత్య చేసుకుని సచ్చిపోయిండు.

ఈ సంగతి లచ్చుమమ్మకు తెలియదు. ఓ రోజు ఎంకటి, ఎంకటి అని కలువరిస్తూ ఆ భిక్షువర్షీయసీ పాణాలొదిలింది.

లచ్చుమమ్మ మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి ప్రశ్నించలేదు. కారణం ఆమె చావుకు చెడు నడకగల ఆమెకొడుకు కారణమని ఆగాలికి తెలుసు కనుక.

******

అంకితం: రచనా సాగరుడు కీ. శే. రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారికి భక్తి తో…

2 అభిప్రాయాలు »కథలు

2 అభిప్రాయాలు

  1. lavanya Jul 8, 2010 1

    chala bagundhi ……

  2. నారాయణ Aug 22, 2010 2

    మధ్యలో ఎక్కడో “అరవై ఏళ్ళలో.. ” అని ఒకచోట వచ్చేసరికి, నాయికా నాయకుల వయస్సుల పరంగా కొంత గడబిడ అనిపించింది. ఆ వాక్యాన్ని సరిచేయాలేమో.
    భాషలో గ్రామ్యాన్ని చక్కగా పలికించారుగానీ, పేద ప్రజల్ని గురించి రాసేటప్పుడు ‘వారి భాషనీ వదలకుండా పలికించేయటం’ అందరికీ అలవాటైపోతోందే అని, కొంచెం తప్పుపట్టాలనిపిస్తుంది.
    కధాగమనం పరంగా చూస్తే మొదట్లో ఉన్నంత వర్ణన అంత అవసరం లేనిదేమో‌ అనిపిస్తుంది.. పరిశీలించండి.
    ఖాజా; హోటల్ కాదు .. వంటివి కొంచెం నాటకీయంగానే ఉన్నై.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో