Jun2010
చైతన్యం గురించి
‘దేవుడెక్కడున్నాడో చూపించ’మని అడిగే అవివేకపు భౌతికవాదులకు సమాధానం చెప్పే భక్తులందరూ తమ మనసుల్లోకి తొంగిచూసుకోమని చెపుతారు. అంటే అది మన చైతన్యంమీదనే ఆధారపడుతుందన్నమాట. చైతన్యమంటే ఏమిటి? దేవుడి సంగతి ఎలా ఉన్నా అది మన పరిసరాల గురించిన అవగాహన కల్పిస్తుంది. అయితే మరికొన్ని విషయాలుకూడా ఉన్నాయి.విశ్వాంతరాళంలో ఆధునిక పరికరాలద్వారా ఈ రోజుల్లో పోగవుతున్న సమాచారాన్నిబట్టి మనకు ఎంతెంతో దూరాన, ఎన్నెన్నో సంఘటనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయని తెలుస్తోంది. అంతకుముందు ఇలాంటివి జరుగుతున్నాయనేదికూడా ఎవరికీ తెలియదు. పెద్దపెద్ద నక్షత్రాలు పేలిపోవడమూ, ప్రచండమైన శక్తి విడుదల కావడమూ, విస్ఫోటనాల్లో శక్తివంతమైన గామా వికిరణం ప్రసరించడమూ, అదంతా కొన్ని కోట్ల సంవత్సరాల తరవాత భూమికి చేరడమూ చూస్తాం. ఇదంతా ‘ఎవరి కోసమో’ తెలియదు. వీటిని గమనించేవారూ, పరికించేవారూ ఉన్నా, లేకపోయినా ఒకటే. తగిన సాంకేతిక పరిజ్ఞానం లేని పరిస్థితుల్లో ఇలాంటివి జరిగాయనికూడా మనకు తెలియదు. మనకు (లేదా మరెవరికైనా) తెలియడం ముఖ్యమా? అవుననడానికి సాక్ష్యాలేవీలేవు. ఎవరికి తెలిసినా, తెలియకపోయినా ఖగోళప్రక్రియలన్నీ భౌతికసూత్రాల ప్రకారం అనాదిగా జరిగిపోతూనే ఉన్నాయి. ఇటువంటి విషయాల్లో గోచరతకూ, ప్రత్యక్షజ్ఞానానికీ ఎటువంటి అవసరమూ, సందర్భమూ కనిపించవు.
1400 కోట్ల ఏళ్ళ వయసుగల విశ్వంలో భూమి పుట్టి 500 కోట్ల ఏళ్ళుకూడా కాలేదు. జరుగుతున్నవి చూసి, అర్థంచేసుకోగలిగిన మానవజాతి మొదలై 2 లక్షల ఏళ్ళుకూడా గడవలేదు. స్పృహా, చైతన్యమూ కలిగిన బుద్ధిజీవులు ఉంటేనేం, లేకపోతేనేం? మానవజాతి ఇంకా ఎన్నాళ్ళుంటుందో తెలియదు. ఇవన్నీ చూసినప్పుడు వీటిని అర్థంచేసుకోగలిగిన బుద్ధిజీవులతో ఈ విశ్వానికి ‘పని’లేదనిపిస్తుంది. స్పృహా, చైతన్యమూ, ఉనికిని గురించిన అవగాహనా అన్నీ ఎవరి కోసం? అవన్నీ కేవలం మనుషులకూ, ఇతర ప్రాణులకూ మాత్రమే పరిమితం. అదంతా వాటి మనుగడ కొనసాగడానికి ప్రాణుల్లో జరిగిన జీవపరిణామ ఫలితమే. ఈ అవగాహనతో ప్రకృతికేమీ సంబంధంలేదు. ప్రాణులకేమో పరిసరాల గురించిన చైతన్యం చావుబతుకుల సమస్య కావచ్చు. ఇదెందుకు చెప్పాలంటే మతాలన్నీ మనసులోని భావాలమీదనే ఆధారపడతాయి.
ఇంతకీ చైతన్యమనేది మనకు కనబడేవాటితోనూ, కనబడనివాటితోనూ కూడుకున్న విశ్వం గురించి మనకు తెలియజెప్పడానికి ఏర్పాటయినదేనా, లేక ఏకకణజీవులనుంచి పరిణామం చెందిన ఒకరకపు జీవాలుగా మన పరిసరాలను అవసరమైనంత మేరకు ‘తడుముకోవడానికి’ పనికొచ్చే సాధనమా? ఈ సమాధానాల్లో రెండోదే మనకు వర్తిస్తుంది. మన శరీరం పనిచేసే తీరుకూడా అనేకరకాల పరిమితులను చూపుతుంది. మనకు కనబడే కాంతి తరంగాలు కొన్నే. అల్ట్రావయొలెట్, ఇన్ఫ్రారెడ్ తదితర వికిరణం మనకు కనబడదు. మన కళ్ళకు నీటిలో పుట్టిపెరిగిన ప్రాణి దృష్టికి ఉండే హద్దులే ఉంటాయి. చూపైనా, వినికిడి అయినా మన ఇంద్రియాలకు ఉన్న శక్తులన్నీ మన జీవపరిణామం నిర్దేశించినవే.
‘విశ్వాన్నంతా సృష్టించిన పరమాత్మ’ సంగతి అలా ఉంచి మనకు జీవాత్మ గురించి కూడా సరిగా తెలియదు. ఒక్క భూమిమీద తప్ప మనకు తెలిసినంతవరకూ మరెక్కడా జీవరాశి గురించిన సమాచారం లభించలేదు. అయితే రోదసిలో అన్నిచోట్లా ఒకేరకమైన భౌతికపరిణామాలు జరగడం కనిపిస్తోంది కనక ఇతర గ్రహాలమీదకూడా జీవరాశి రమారమి మన పద్ధతిలోనే పరిణామం చెందుతుందని ఊహించవచ్చు. అయితే ఈ జీవాలకు లభ్యమయే పరిమితచైతన్యం వాటి భౌతిక జీవితాలకు పనికొచ్చేదేగాని వాటన్నిటికీ అతీతమైన ‘దైవికశక్తి’ని అర్థంచేసుకోవడానికి పనికొస్తుందని అనుకోవడంలో అర్థంలేదు. ఇంతకీ భగవంతుడి గురించిన ఊహపోహలకు ఆధారమేమిటి? అవన్నీ బలవత్తరమైన నాడీప్రక్రియలు. మనుషులవంటి ప్రాణుల మెదళ్ళలో రేగే విద్యుత్ సంకేతాల అయోమయం తప్ప ఇతరత్రా ఎటువంటి సాక్ష్యమూ లేనటువంటి అతీతశక్తుల గురించిన భావనలన్నీ రెండుకాళ్ళ జంతువుగా పరిణామం చెందిన మనిషి భ్రమల కారణంగా తలెత్తినవేనని అనుకోవడమే సమంజసం.
పంతొమ్మిదో శతాబ్దంలో యూరప్‌లో క్రైస్తవమతభావనల మూఢవిశ్వాసాలు కొంత బలహీనపడడంతో భౌతికవాదం స్పష్టంగా రూపొందసాగింది. జ్ఞానమైనా, విజ్ఞానమైనా పరిశీలనలూ, నిరూపించగలిగిన పరిశోధనలమీదనే ఆధారపడాలి కాని నిరాధారమైన నమ్మకాలమీద కాదనే ధోరణి పెరిగింది. ఈనాటి విజ్ఞానం ప్రతి ఆలోచననూ, మనోభావాన్నీ విశ్లేషించి, వాటికి దారితీసే జీవరసాయనికప్రక్రియలను వివరించగలిగిన పరిస్థితికి చేరుతోంది. ఈ రకమైన చైతన్యమూ, అవగాహనా నాడీమండలం, సంక్లిష్టమైన మెదడూ ఉన్న మనుషులవంటి కొన్ని ప్రాణులకే పరిమితం అని తెలుస్తోంది. అవసరాలనిబట్టి జీవపరిణామంలోని కొన్నిదశల్లో బుద్ధివికాసం అనేది కొన్ని ప్రాణులకు “తలవని తలంపుగా” జరిగింది. ఈ పరిణామాలకు గురిఅయిన జీవాలకు మనుగడ ఎంత ముఖ్యమో అవగాహనా అంతే ముఖ్యం.
మనం గుర్తుంచుకోవలసినదేమిటంటే నిన్నమొన్నటిదాకా అంటురోగాలూ, తుఫానులూ, భూకంపాలూ కలిగినప్పుడల్లా ఏ తోకచుక్కనో చూసి బెదిరిన మానవజాతి మనది. వీటన్నిటికీ పాత నమ్మకాలను ప్రచారం చేస్తే జనం తాటాకులు కట్టేస్తారు గనక ఆధునికస్వాములు జాగ్రత్తపడి ప్రస్తుతం సందిగ్ధంగా అనిపించే విషయాల గురించే బోధలు చేస్తూఉంటారు. బీదవారినీ, దారిద్య్రాన్నీ చూసి చలించిన కొందరు సంపన్నులకు కలిగే భయాందోళనలకూ, వారిని బాధించే అంతరాత్మల క్షోభకూ ఉపశమనం కలగడానికి ‘గురువులు’ వారి కోసం సమావేశాలు నిర్వహిస్తూఉంటారు. సామాజిక అసమానతలవల్లా, నగ్నంగా తాండవం చేస్తున్న దుర్మార్గపువ్యవస్థ కారణంగానూ తలెత్తే సమస్యలన్నిటికీ ఈ బోధకులు ఆధ్యాత్మికపరిష్కారాలు సూచిస్తూ ఉంటారు. కేవలం ఆర్థికశక్తులవల్ల కలిగే కుటుంబసంక్షోభాన్నీ, వ్యక్తిగతవైరుధ్యాలనూ గుర్తించలేనివారంతా ఈ రకమైన షార్ట్‌కట్ పద్ధతులను అన్వేషిస్తూ ఉంటారు. మన సనాతనులు ఆత్మలూ వగైరాల గురించి చెప్పినవాటిలో వీరికి కొంత నిజం కనిపిస్తూ ఉంటుంది.
ప్రకృతిని గురించిన మన ఊహలన్నిటిలోనూ మనుషులుగా మనం పరిణామం చెందామనేది ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అంతరిక్షంలో ఎక్కడినుంచో ఎక్స్రేలు ప్రసారం అవుతాయని తెలియగానే ‘అది ఎవరి పని అయి ఉంటుంది?’ అనే ప్రశ్న మన మెదడులో తలెత్తుతుంది. ఎవరో బుద్ధిపూర్వకంగా చెయ్యకపోతే ఏదీ జరగదనే భావన మన జీవపరిణామ చరిత్రను సూచిస్తుంది. ‘గ్రహాలను ఎవరు తిప్పుతున్నారు? విశ్వాన్ని ఎవరు తయారుచేశారు? ఏ ఉద్దేశంతో చేశారు?’ ఇలాంటి ప్రశ్నలు మతభావనలన్నిటికీ ప్రేరణలుగా పనిచేశాయి. ఇప్పటికీ ఈ ధోరణిలో ఆలోచించేవారందరూ ఇంకా ఆటవికదశలోనే ఉన్నారనుకోవాలి.
2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు
June 20th, 2010 at 4:01 pm
Sir,
please go through once’ Yoga Vashishtam’ all your queries will be answered.Answers of Ramana Maharshi (Arunachalam) to the queries
of Foreigners will definitely satisfy you.
Please think of Chalam,Daughter of Chalam souris etc.,
please refer Autobiography of a Yogi( paramahamsa yogananda),
1. Swami Rama of Himalayas scientiffic experiments.
June 23rd, 2010 at 7:25 am
శ్రీనివాసరావుగారూ, రమణమహర్షి, చలం తదితరులకు వారి కాలంలో స్పష్టంగా తెలియని చాలా విషయాలు మనమీనాడు తెలుసుకోవచ్చు. చైతన్యం, భావాలూ మొదలైనవి ఎందుకు, ఎలా కలుగుతాయో, వాటి భౌతికమూలాలు ఎటువంటివో తెలుసుకోవాలేగాని ఆధ్యాత్మిక ప్రవచనాల జోలికి పోకూడదు. కొన్ని విషయాలను నా కొత్త పుస్తకంలో చర్చించాను.
http://rohiniprasadkscience.blogspot.com/2010/06/1.html